Site icon Sanchika

ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 18 – హల్‌చల్

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

కే ఆసిఫ్ నిర్మించిన దిలీప్ కుమార్, నర్గిస్, బలరాజ్ సహాని, సితారా దేవిల సినిమా హల్‌చల్

[dropcap]కే [/dropcap]ఆసిఫ్ అంటే మనకు గుర్తుకు వచ్చేది ముఘల్ – ఎ – ఆజమ్. దిలీప్ కుమార్‌తో, 1951లో వచ్చిన “హల్‌చల్” సినిమాను కే. ఆసిఫ్ అంతకు ముందే నిర్మించారు. ఇది నిర్మాతగా వారికి మొదటి సినిమా. ఈ సినిమాలో దిలీప్ కుమర్‌తో పాటు నర్గిస్, బల్రాజ్ సాహనీలు నటించారు. ముఘల్ – ఎ- ఆజమ్‌లో మధుబాల, దిలీప్ కుమర్‌ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశం సినిమా ప్రేమికులందరికీ గుర్తే. ఆ సీన్లో ఒక పక్షి ఈకతో మృదువుగా అనార్కలిని స్పృశిస్తున్న సలీమ్ గుర్తున్నాడు కదా. రాలిన పూల మధ్య ఈ ప్రణయ సన్నివేశం అప్పట్లో చాలా చర్చనీయాంశమయింది. దానికి కొన్నేళ్ళకు ముందే ఇంచుమించు ఇదే సన్నివేశం, కే. ఆసిప్ నిర్మించిన హల్‌చల్ సినిమాలో నర్గిస్, దిలీప్ కుమార్ల మధ్య ఒక పాటలో కనిపిస్తుంది.. తరువాత ముఘల్ – ఎ – ఆజంలో ఇదే సీన్‌ని ఇంకొంచెం కళాత్మకంగా తీసారు. హల్‌చల్ సినిమాకు సంగీత దర్శకత్వం వహించింది సజ్జద్ హుసేన్, మహమ్మద్ షపీలు. కే. ఆసిఫ్‌కి సజ్జద్ సంగీత దర్శకత్వంపై చాలా నమ్మకం.   ఈ సినిమా నిర్మాణ సమయంలో నిర్మాత ఆసిఫ్ కూ, సంగీత దర్శకుడు సజ్జాద్ హుస్సేన్ కూ నడుమ మనస్పర్ధలొచ్చాయి. సంగీతం విషయంలో ఆసిఫ్ తలదూర్చటం సజ్జాద్ కు నచ్చలేదు. డబ్బులు సరిగ్గా ఇవ్వలేదన్న నెపంతో సినిమాను మధ్యలో వదిలేశాడు సజ్జాద్. దాంతో షఫి సినిమాను పూర్తి చేయాల్సివచ్చింది. ముఘల్-ఎ-ఆజం సంగీతంలోనూ ఆసిఫ్ అభిప్రాయం చెప్పబోతే, నౌషాద్ అతనికి దర్శకత్వం నేర్పించాలని ప్రయత్నించి గుణ పాఠం నేర్పాడు. ముఘల్-ఎ-ఆజం సినిమాకు ముందు సజ్జాద్‌నే సంగీత దర్శకుడిగా అనుకున్నారు., కాని సజ్జద్ ఎవరితో సామరస్యంగా ఉండకపోవడం వలన అది కుదరలేదు.

“హల్‌చల్” సినిమా ఎమిలీ బ్రోంటే నవల వుథరింగ్ హైట్స్ ఆధారంగా తీసారు. సినిమాకు దర్శకత్వం వహించింది ఎస్.కే ఓఝా. సినిమాకు స్క్రీన్ ప్లే రాసింది ప్రముఖ గేయ రచయిత హస్రత్ జయపురి. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి అందించింది మన తెలుగువారు వీ.ఎన్.రెడ్డి. కడప జిల్లా వాస్తవ్యులయిన వీరు ముప్పై సంవత్సరాల పాటు ఎన్నో భాషలలో ప్రముఖ చిత్రాలకి సినిమాటోగ్రఫర్‌గా పని చెశారు. ఆగ్, బైజు బావ్రా ఉప్కార్, చోరి చోరి ఇలా ఎన్నో గొప్ప హిందీ సినిమాలకు సినిమాటోగ్రఫర్ ఈయన. కొన్ని తెలుగు సినిమాలను నిర్మించారు కూడా. ఈ సినిమాలో సహ నటిగా సితారా దేవి గారు నటించారు. భారత దేశపు గొప్ప కథక్ నృత్య కళాకారిణి ఆమె. రవీంధ్రనాధ్ ఠాగోర్ ఆశీర్వాదంతో నాట్యానికి తన జీవితం అంకితం చేసిన కళాకారిణి సితారా దేవి. నాలుగు సార్లు వివాహం చేసుకున్న సితారా దేవికి, కే. ఆసిఫ్ మూడవ భర్త. రెండవ భర్త మొదటి భార్య తమ్ముడు ఆయన. అప్పటికే కే. ఆసిఫ్ దిలీప్ కుమార్ సోదరి అక్థర్‌ని వివాహం చేసుకుని ఉన్నారు. ఇలా చాలా వివాదాస్పదంగా జీవించిన సితారా దేవి నాట్యకళాకారిణిగా మాత్రం కథక్ రీతికి ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టారు. కథక్‌తో పాటు అన్ని సంప్రదాయాలలో వీరికి ప్రవేశం ఉంది. రష్యన్ బాలెట్‌ను పట్టు బట్టి నేర్చుకున్నారు. “హల్‌చల్” సినిమాలో ఈ బాలెట్ ఆధారంగా ఒక అద్బుతమైన నృత్యం ఉంది. ఒక భారతీయ కళాకారిణి చేసిన బ్యాలెట్ నృత్యం అంటే నమ్మలేని స్థాయిలో ఆ నృత్యాన్ని రక్తి కట్టించారు ఆవిడ. భారతీయ నాట్యకారులు దూరంగా ఉండే బాలెట్ నృత్యాన్ని ప్రదర్శించిన మొదటి కళాకారిణి కూడా ఆమె. ఏ ఆర్ రహెమాన్ అరేంజర్ రంజిత్ బారోత్, సితారా దేవి కొడుకు. హిందీ సినిమాల్లో ప్రఖ్యాత డాన్సెర్ గోపీ క్రిష్ణ ఆమె సోదరి తనయుడు. సాదత్ హసన్ మాంటో సితారా దేవి గురించి ‘వుమెన్ ఆఫ్ ప్రె’  అనే పుస్తకంలో రాశాడు. ఆమెను ‘మాన్ ఈటెర్’ అంటే, పురుషులను పులిలా చంపుకుతినే మహిళ గా అభివర్ణించాడు. అంటే, లైంగికంగా అత్యంత ఉత్సాహవంతురాలన్నమాట. పురుషులు దొరికితే వదలదని అర్ధం. అయితే, ఆమె సినిమాలకూ, తన నృత్యాభిలాషకూ నడుమ సమతౌల్యం సాధించింది. ఆమె చివరి సినిమా మదర్ ఇండియా.  రబీంద్రనాధ్ ఠాగోర్‌తో నృత్య సామ్రాజ్ఞి అనిపించుకున్న సితారా దేవి దిలీప్ కుమార్‌తో నటించిన సినిమా “హల్‌చల్”.

హల్చల్ సినిమా ఆరంభం జైలులో అవుతుంది.ఇదే దృశ్యాన్ని జోషిల(1973) అనే సినిమాలో వాడుకున్నారు. ఈ సినిమాలో కిస్కా రస్తా దేఖే అనే అద్భుతమయిన కిషోర్ కుమార్ పాట వుంటుంది.  ఇక కథకు వస్తే కిషోర్ తల్లి తండ్రులు చిన్నతనంలోనే చనిపోతారు. తండ్రి స్నేహితుడు అతన్ని తనతో ఇంటికి తీసుకువెళ్తాడు. అతనికి ఇద్దరు పిల్లలు. పెద్దవాడు చందన్, చిన్న పిల్ల ఆషా. ఆషా కిషోర్ స్నేహితులు అయిపోతారు. కాని వీరిద్దరి కంటే పెద్దవాడయిన చందన్ కిషోర్‌ని ఇష్టపడడు. తండ్రి లేనప్పుడు అతన్ని ఎన్నో రకాలుగా అవమానిస్తూ ఉంటాడు. కాని తండ్రి మాత్రం ముగ్గురిని ఒకే దృష్టితో చూస్తాడు. అనారోగ్యంతో అతను మరణించిన తరువాత చందన్ ఇంటి పెత్తనం తీసుకుంటాడు. కిషోర్‌ను పనివాడుగా చూస్తాడు. అన్ని కష్టాలు భరిస్తూ కూడా కిషోర్ ఆశా కోశం అక్కడ ఉంటాడు. పెరిగి పెద్దయిన తరువాత ఆశ కిషోర్‌లు ప్రేమించుకుంటారు. ఆశ కిశోర్ తన జీవిత భాగస్వామి అని నిర్ణయించుకుంటుంది. కాని అన్న అంటే ఆమెకు భయం.

ఒక రోజు చందన్ పని మీద బైటకి వెళ్ళి ఇంటికి ఆలస్యంగా వస్తాడు. కిషోర్ ఆశాలిద్దరూ కూడా ఆరు బయట చెట్ల మధ్య ఆదమరచి నిద్రపోయి ఉండడం చూస్తాడు చందన్. అప్పటి దాకా వీరిద్దరి మధ్య ప్రేమ సంగతి అతనికి తెలియదు. వారిని దగ్గరగా చూసి అతను మండిపోతాడు. కిషోర్‌ను విపరీతంగా కొడతాడు. అడ్డు రాబోయిన ఆశాను గదిలో బంధిస్తాడు. ఆమెను ఆ పరిస్థితులలోకూడా బెదరక, కలవడానికి ఇంటికి వచ్చిన కిశోర్‌ని చూసి ఆశ ధైర్యం తెచ్చుకుంటుంది. తాను కిశోర్‌తో వెళ్ళిపోతానని అతన్నే వివాహం చేసుకుంటానని అన్నకు ఎదురు తిరుగుతుంది. ఒక అన్నగా ఆమెకు తమ అంతస్తు గురించి చెబుతూ, ఆ ఇంటి ఆడపిల్ల ఆలా బైటికి వెళ్ళడం మర్యాద కాదని గౌరవంగా పెళ్ళి చేసుకుని పల్లకి ఎక్కి వెళ్ళాలని, పోని ఆశా కోరుకుంది అని అయినా సర్దుకుపోయినా, ఏం చూసి ఒక అన్నగా తన చెల్లెలిని కిశోర్ కిచ్చి పెళ్ళి జరిపించాలో చెప్పమని చందన్ అంటాడు. కిషోర్‌కి చందన్ బాధలో న్యాయం కనిపిస్తుంది. తాను ఏదో విధంగా కొంత డబ్బు సంపాదించి గౌరవంగా వచ్చి ఆమెను వివాహం చేసుకుంటానని అందుకోసం కొంత గడువు ఇమ్మని అడుగుతాడు కిశోర్. చందన్ దానికి ఒప్పుకుంటాడు. అతను తిరిగి వచ్చేదాకా తన చెల్లెలి వివాహ ప్రసక్తి తేనని ప్రమాణం చేస్తాడు. ఆశా కూడా ఎన్ని రోజులయినా సరే కిషోర్ కోసం వేచి ఉంటానని చెబుతుంది.

కిశోర్ నగరానికి వెళతాడు. అకలితో పని కోసం తిరుగుతున్నప్పుడు మేడం నీలం కారు క్రింద పడతాడు. నీలం ఒక సర్కస్ కంపెని యజమానురాలు, నృత్య కళాకారిణి. ఆమె ప్రేమతో పెంచుకున్న జంతువులు మరణించినా, లేదా ఆమె మాట వినకపోయినా వాటిని చంపి లేదా అవి మరణించిన తరువాత వాటి చర్మంతో మళ్ళీ వాటిని బొమ్మగా కుట్టించి, ఇంట్లో అలంకరించుకుంటుంది. తానిష్టపడింది ప్రాణం పోయినా కాని తన వద్దే ఉండాలి అన్న పట్టుదల ఆమెది. ఆమె మొదటి చూపులోనే కిశోర్‌ని ఇష్టపడుతుంది. ఇది గమనించిన ఆమె స్నేహితుడు పాల్, కిశోర్‌ని పంపేయ్యమని ఆమెపై ఒత్తిడి తెస్తాడు. ఆమె వినదు. పాల్ చాలా ప్రమాదకరమైన సర్కస్ ఫీట్ చేస్తాడు. ఒక ఎత్తైన బురుజు ఎక్కి అక్కడ నుండి నిప్పులో దూకడంలో అతను నిష్ణాతుడు. కిశోర్‌ని పంపకపోతే తానా ఫీట్ చేయనని అతను నీలంతో అంటాడు. మరుసటి రోజు అతను నిజంగానే సర్కస్ వదిలి వెళ్ళిపోతాడు. అప్పుడు జనం గోల చేస్తుంటే డబ్బు సంపాదించే ఆఖరి ప్రయత్నం అదే అని అనుకుని కిశోర్ తాను ఆ ఫీట్ చేస్తాడు. జనం అది మెచ్చినప్పుడు అతను అక్కడే ఉండిపోయి, అలా డబ్బు సంపాదించడం మొదలు పెడతాడు. అయితే నీలం కిశోర్‌ను కోరుకుంటుంది. కాని తాను ఆశాను తప్ప మరొక స్త్రీని ప్రేమించలేనని కిశోర్ అన్నప్పుడు ఆమె కోపంతో అతన్నిచంపమని పాల్‌ని అడుగుతుంది. కాని పాల్ కిశోర్‌ల మధ్య జరిగే తోపులాటలో తానే వచ్చి పాల్ తుపాకి బులెట్ తగిలి మరణిస్తుంది. ఆఖరి నిముషంలో పాల్‌ని ఆపాలనే ఆమె ప్రయత్నం ఇలా బెడిసి కొడుతుంది. నీలంని హత్య చేసాడని పోలీసులు కిశోర్‌ను అరెస్ట్ చేస్తారు. అతనికి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తుంది ప్రభుత్వం.

జైలులో తోటి ఖైదీలందరు ఒక రోజు పారిపోవాలనుకుంటారు. అదే రోజు జైలర్ పెళ్ళి అవుతుంది. ఖైదీలు తప్పించుకున్నారని తెలిసి అతను భార్యను వదిలి పెళ్ళి బట్టలతో జైలులోకి అడుగు పెడతాడు. అయితే అతన్ని కాల్చబోతున్న మరో ఖైదీని వారితో పాటు పారిపోయే ప్రయత్నం చేస్తున్న కిశోర్‌ ఆపుతాడు. అందర్నీ మళ్ళీ అరెస్టు చేసిన జైలర్ కిశోర్‌తో తన భార్య పెళ్ళి రోజే వితంతువు అవకుండా కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. అయితే జైలర్ పెళ్ళి చేసుకుంది కిశోర్‌  ప్రేమించిన ఆశనే. ఈ సంగతి తెలియక తన జీవిత కథ జైలరుకి చెబుతాడు కిశోర్‌. ఆ విషాదం జైలర్‌ను కిశోర్‌ని దగ్గర చేస్తుంది. కిశోర్‌ని తన ఇంటికి ఆహ్వానిస్తాడు జైలర్. అతన్ని అక్కడ చూసి ఆశా ఆశ్చర్యపోతుంది. కాని అతనికి కనిపించదు. కిశోర్‌  ప్రేమించిన ప్రియురాలిది తన ఊరే అని ఆమె వివాహం మరొకరితో అయిపోయిందని ఆశ చెప్పినప్పుడు జైలర్ ఆమెను పిలిపించి ఒక్కసారి కిశోర్‌తో మాట్లాడించమని ఆశాను అడుగుతాడు. అది న్యాయం అని తానే కిశోర్‌  ప్రేయసి పెళ్ళి చేసుకున్న వ్యక్తి అయినా సరే అదే మాట అంటానని, కిశోర్‌ని ఆమె ఒక్కసారి కలిస్తే అతను జైలు శిక్ష మొత్తం ప్రశాంతంగా అనుభవిస్తాడని చెబుతాడు జైలర్. కాని చివర్లో ఆశ చేసుకుంది జైలర్‌నే అని తెలుసుకుని అది తట్టుకోలేక మెట్ల మీద నుండి పడి మరణిస్తాడు కిశోర్‌. జైలర్‌కి తన భార్య కిశోర్‌  ప్రేమికురాలు అని తెలిసే అవసరం రాకుండానే శంకర విషాద మరణంతో కథ ముగుస్తుంది.

సినిమాలో కిశోర్‌ మరణం అనవసరం అనిపిస్తుంది. దిలీప్ కుమార్ పాత్ర పట్ల సానుభూతి సంపాదించడం కోసం ఇలా అతని మరణంతో కథ ముగించారా దర్శకులు అనిపిస్తుంది. ఇంగ్లీష్ నవలను సగం దాకా తీసుకుని తర్వాత చాలా మార్చారు దర్శకులు. ముగింపు ఇలా కాకుండా ఉంటే బావుండు అనిపిస్తుంది.  1966లో మళ్ళీ వుదరింగ్ హైట్స్ ఆధారంగా దిల్ దియా దర్ద్ లియా అనే సినిమా దిలెప్ కుమార్ తో తీశారు. ఈ సినిమా చివరివరకూ వుదరింగ్ హైట్స్ నవలను అనుసరిస్తుంది. కానీ, ముగింపు మార్చారు.  సినిమాలో పాటలు ఖుమార్ బారాబన్క్వి రాసారు. మొత్తం తొమ్మిది పాటలు లత, రఫీలు పాడారు “ఓ బిచడె హుయె సాథీ”, “లగీ హై ఆగ్ దిల్ మె” “ఆజ్ మెరె నసీబ్ నె ముజ్కో రులా రులా దియా” వింటే మరిచిపోలేని కంపోజిషన్స్.

బల్రాజ్ సాహనికి మొదటి నుండి కమ్యునిస్ట్ పార్టీతో సంబంధం ఉంది. హల్‌చల్ సినిమాకు ఒప్పుకున్నాక, ఒక కమ్యునిస్ట్ నిషిధ్ధ ర్యాలీలో ఆయన పాల్గొన్నారని ఆయన్ను అరెస్టు చేసింది ప్రభుత్వం. కాని అతనిపై కేసు తేలే లోపల నిర్మాతకు నష్టం వచ్చేలా ఉందని పొలీస్ ఎస్కార్ట్‌తో అతనికి షూటింగ్‌లో పాల్గొనే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. జైలర్‌గా తాను నటిస్తున్నానని ఆయన జైలుకి వెళ్ళి మొదటిసారి జైలర్‌ను కలిసారట. తరువాత అక్కడికే అతను అరెస్టు అయి వెళ్ళి అ జైలర్ ఇచ్చిన ఎక్సార్ట్లతో కలిసి ప్రతి రోజు షూటింగ్‌కి చేతికి సంకెళ్ళతో వచ్చి, మేకప్ వేసుకుని పోలీసుల పర్యవేక్షణలో షూటింగ్ పూర్తి చేసుకుని జైలర్‌గా తన పాత్రకు న్యాయం చేసీ మళ్ళీ రాత్రికి జైలుకి వెళ్ళేవారట. ఖైదీగా ఉండి ఓ నటుడు ఇలా నటించడం భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి. దీని గురించి వివరంగా ఆయన ఆత్మకథలో చెప్పుకున్నారు. అతని కుమారుడు పరీక్షిత్ సాహని రాసిన మరో ఆత్మకథలో కూడా ఈ ప్రసక్తి వస్తుంది.

సినిమా మొదటి భాగం మాత్రమే వుథరింగ్ హైట్స్‌ని పోలి ఉంటుంది. ఇక తరువాత హస్రత్ జైపురి తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కిశోర్‌గా దిలీప్ కుమార్, ఆశాగా నర్గిస్, చందన్‌గా కె.ఎన్. సింగ్, జైలర్‌గా బలరాజ్ సాహనీ, నీలమ్‌గా సితారా దేవి నటించిన ఈ సినిమా చాలా మంది మర్చిపోయిన ఒక క్లాసిక్. సితారా దేవి నాట్యం మాత్రం ఈ చిత్రానికి హైలైట్.

Exit mobile version