Site icon Sanchika

ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 19 – కోహినూర్

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్‌కు ఐదవ ఫిలింఫేర్ అవార్డు తెచ్చి పెట్టిన కోహినూర్

[dropcap]ది[/dropcap]లీప్ కుమార్ కామెడీ రోల్స్ చేయాలని నిర్ణయించుకుని తన వరుస ట్రాజెడీ సినిమాల మధ్యన ఒక లైట్ కామెడీ ఉండేలా చూసుకున్నారు. అలా చేసిన “ఆజాద్”తో రెండో ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నాక, ఆజాద్ సినిమా హీరోయిన్ మీనాకుమారి తోనే ఆయన చేసిన మరో కామెడీ రొమాంటీక్ సినిమా “కోహినూర్”. 1960లో వచ్చిన ఈ సినిమాతో దిలీప్ కుమార్‌కి ఐదవ ఫిలింఫేర్ అవార్డు లభించింది. ఇది జానపద సినిమా, మీనాకుమారి చాలా అందంగా కనిపించే మరో సినిమా. ఈ సినిమా చూస్తుంటే ఎందుకో అనిపించింది ఇప్పటి తరంలో ఇలా స్త్రీత్వం మూర్తీభవించిన అమ్మాయిలు ఎందుకు కనపడరు అని. ఇప్పటి హీరోయిన్లు అందరూ షోకేస్‌లో బొమ్మల్లా ఉంటారు తప్ప ప్రాణం ఉన్న భారతీయ స్త్రీ అనిపించేలా కనపడరు. నా ఉద్దేశం వేష భాషలలో కాదు, ఆకృతిలో కూడా ఎంతో కృతిమత్వం వచ్చేసింది. మీనా కుమారి, మధు బాల, నూతన్, మాలా సిన్హా, సురయ్యా, వైజయంతి మాల, హేమామాలిని,.. ఇలాంటి హీరోయిన్లు ఇక కనిపించరేమో మరి.

దిలీప్ కుమార్ నటించింది కేవలం 64 సినిమాలు మాత్రమే. వాటిలో ఎనిమిది సినిమాలకు ఫిలింఫేర్ అవార్డులు, పదకొండు సినిమాలకు ఫిలింఫేర్ నామినేషన్లు లభించాయంటే, అదీ అప్పటీ మహామహులతో పోటీ పడి అతను సంపాదించాడంటే కారణం ఒక్కో సినిమాకు దిలీప్ కుమార్ చేసిన హోమ్ వర్క్. అతను పెద్ద అందగాడు కూడా కాదు. కాని పది భాషలలో దిట్ట. రెండు మాండలికాలలో ప్రవీణుడు. ఏ పాత్ర చేసినా ఆ పాత్ర నేపథ్యాన్ని స్టడీ చేసి అందులోకి దిగిపోయి నటించేవాడు. అతని సినిమాలన్నీ ఈ విషయాన్ని నిరూపిస్తాయి. కోహినూర్ కేవలం ఒక రొమాంటిక్ కామెడీ. ఇందులో హీరో సితార్ వాయిస్తాడు. దాని కోసం పట్టుబట్టి దిలీప్ కుమార్ ఆరు నెలలు ఉస్తాద్ హలీమ్ జఫర్ ఖాన్ సాహిబ్ వద్ద సితార్ నేర్చుకుని “మధుబన్ మె రాధికా నాచేరే” అన్న పాటలో అభినయిస్తారు. అందులో అతని చేతి మూమెంట్లు చూడండి, సినిమా కోసం, ఆ పాత్రకు సహజత్వాన్ని తీసుకురావడానికి ఒక రెండు నిముషాల పాటు ఉండే ఆ సితార్ షాట్ కోసం ఆరు నెలలు శ్రమించిన వ్యక్తి దిలీప్ కుమార్. ఇప్పటి హీరోలు సంఖ్యా పరంగా ఎన్ని సినిమాలు చేసినా ఈ “మధుబన్ మే రాధికా”తో పోటీకి రాగలరా……? నౌషాద్ కూర్చిన సంగీతం ఇందులో ఉపయోగించిన సంగీత పరికరాలు, మధ్యలో వినిపింఛే జల తరంగ్ అద్భుతమైన కాంపోజిషన్ అది. ఈ పాటకు దిలీప్ కుమార్ ఇచ్చిన లిప్ మూమెంట్ చూస్తే ఆయన ఎంత కష్టపడి ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేసారో అర్థం అవుతుంది.

అదొక స్వర్ణ యుగం. ఒకరితో ఒకరు పోటీ పడి తమ నటనను మెరుగు పర్చుకున్న నటులు వారు. హీరోయిన్ మీనా కుమారిని పక్కన పెట్టి కారెక్టర్ నటి కుమ్ కుమ్ దగ్గరకు వద్దాం. “మధుబన్ మే రాధికా” పాటకు ఆమె చేసిన నృత్యం చూస్తే ఇప్పటి సినిమాలలో నృత్యం ఎంత దిగజారిందో అర్థమవుతుంది. అత్యద్బుతమైన పర్ఫఫార్మెన్స్ ఇచ్చారు ఆవిడ ఈ పాటలో. జైబున్నీస్సాగా జన్మించిన కుమ్ కుమ్ కథక్ నృత్య కళాకారిణీ. ఆవిడ నృత్యాన్నిఈ సినిమా కోసం చాలా బాగా వాడుకున్నారు దర్శకులు ఎస్ యు సన్నీ. గురుదత్ కుమ్ కుమ్‌ని తన ఆర్ పార్ సినిమాలో “కభీ ఆర్ కబీ పార్” అన్నపాట కోసం తీసుకొచ్చారు. తరువాత ఆయన సినిమాలలో ఆమెకో పాత్ర తప్పకుండా ఉండేది. “యె హై బంబై మెరి జాన్” అన్న పాట కుమ్ కుమ్ జానీ వాకర్‌పై చిత్రించినదే. కాని ఆమె సాంప్రదాయ నృత్య రీతిలోని ప్రతిభను పూర్తిగా చూపించిన సినిమా కోహినూర్. ఇందులో ఆమె నృత్యాలన్నీ చాలా గొప్పగా ఉంటాయి. ఆ స్థాయిలో నృత్యాన్ని ఆస్వాదించి ఇప్పటి సినిమాలను చూడాలంటే హిమాలయాలను దర్శించి వచ్చి, మట్టి దిబ్బలపై అడపా తడపా పూసే పూలను చూడడంలా ఉంటుంది. మధుబన్ మే రాధికా పాటల్లో దిలీప్ అభినయం, నౌషాద్ సంగీతం, రఫీ గానంతో పాటు కుమ్ కుమ్ నృత్యం లేకపోతే ఆ పాట అంత సొగసుగా వచ్చేది కాదు.

ఇక సినిమా కథకు వస్తే కైలాస్ నగర్ రాజ్యానికి రాజు చంద్రభాన్. అతను మరణించిన తరువాత అతని దివాన్ వీర్ సింఘ్ రాజకుమారుడైన ధివేంద్ర ప్రతాప్‌కు సంరక్షకుడిగా ఉంటాడు. అతని భార్య ధివేంద్రను తన సొంత కొడుకులా పెంచుతుంది. అంతగా ప్రేమిస్తుంది. ఆమె కుమారుడు కూడా ధివేంద్రను సోదరుడిగా ప్రేమిస్తాడు. కాని ధివేంద్రకు రాజ్యాన్ని అప్పగించవలసిన సమయంలో దివాన్ అతనిపై హత్యా ప్రయత్నం చేస్తాడు. అంతకు ముందు అతనికి వివాహం చేయదలచి దివాన్ భార్య రాజ్గర్హ్ రాకుమార్తె చంద్రముఖిని రాజ్యానికి పిలిపిస్తుంది. చంద్రముఖి చిత్రపటం చూసి ఆమె అందానికి ముగ్ధుడవుతాడు ధివేంద్ర. చంద్రముఖి తండ్రి కూడా ఆమెకు ధివేంద్ర చిత్ర పటం చూపించి ఆమెను రాజమాత ఆతిథ్యాన్ని స్వీకరించి, అతిథిగా కైలాస్ నగర్ పంపుతాడు. అప్పుడే దివాన్ చేసిన హత్యా ప్రయత్నం తప్పించుకుని ధివేంద్ర రాజ్యం నుండి పారిపోతాడు. అతనికి అడవిలో విశ్రమిస్తున్న చంద్రముఖి పరివారం కనపడుతుంది. అతడు రాజకుమారిని కలుస్తాడు. ఆమె కూడా అతన్ని చూసి ప్రేమిస్తుంది.

రాజ్గర్హ్ సేనాపతి చంద్రముఖిని అపహరిస్తాడు. అతనికి మొదటి నుండి ఆమెను సొంతం చేసుకోవాలని ఆశ. రాజకుమారుడు ధివేంద్ర  ఆమెను రక్షిస్తాడు. కాని సేనాపతి అతన్ని బంధించి రాజకుమారిని ఖైదు చేస్తాడు. ఆ క్రమంలో ధివేంద్ర  గాయపడతాడు. అతడిని రాజనర్తకి రక్షిస్తుంది, సపర్యలు చేస్తుంది. కాని చంద్రముఖిని ప్రేమించిన ధివేంద్ర ఆమెను వెతుక్కుంటూ వెళతాడు. ఆమెను సేనాపతి బంధించిన చోటు తెలుసుకుని అక్కడికి కోహినూర్ బాబాగా మారువేషం వేసుకుని వెళ్ళి రాకుమారికి దగ్గరవుతాడు. ఇక్కడ మీనా కుమారి దిలీప్ కుమార్‌ల మధ్య నడిచే కామెడీ చాలా సరదాగా ఉంటుంది. సేనాపతి అసలు సంగతి తెలుసుకుని ధివేంద్రను బంధిస్తాడు. రాజనర్తకి అతనిపై తనకు ఎప్పటినుండో కోపం ఉందని చెప్పి అతన్ని శిక్షించే అవకాశం తాను తీసుకుంటుంది. అతని కళ్ళూ పొడిచేస్తుంది.

గుడ్డి వాడయిన ధివేంద్ర పరిస్థితికి చంద్రముఖి బాధపడుతుంది. ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేయబోతే ధివేంద్ర ఆమెను ఆపి తాను గుడ్డివాడు కాలేదని రాజనర్తకి తాను కలిసి నాటకం ఆడుతున్నామని చెప్తాడు. తరువాత తన రాజ్యం నుండి తమ్ముడు పంపిన సైన్యం వచ్చేదాకా ఓపిగ్గా శిక్ష అనుభవిస్తూ, అప్పుడు యుద్ధం చేసి సేనాపతిని ఓడించి రాజకుమారిని తన రాజ్యాన్ని కాపాడుకుంటాడు. దివాన్ కొడుకు అన్నకు క్షమాపణ చెప్పి తండ్రి చేస్తున్న మోసం గురించి తాను ఆలస్యంగా తెలుసుకున్నానని, ధివేంద్రకు ప్రాణ హాని కలిగించినందుకు అతన్ని బంధించానని చెబుతాడు. అతని భార్యను తల్లి స్థానంలో, కొడుకును తమ్ముడు స్థానంలో చూస్తూ అతన్ని శిక్షించలేనని ధివేంద్ర చెప్పి అతనికి కనువిప్పు కలిగించడంతో సినిమా సుఖాంత మవుతుంది.

సేనాపతిగా జీవన్, దివాన్ భార్యగా లీలా చిట్నిస్ నటించారు. దిలీప్ కుమార్‌కి లీలా చిట్నిస్ చాలా సినిమాలలో తల్లిగా చేసారు. షకీల్ బధాయిని పాటలకి నౌషాద్ సంగీతం అధ్బుతం. “దో సితారో కా జమీన్ పర్ హై మిలన్ ఆజ్ కి రాత్” లతా రఫీ గొంతులలో పలికే అందమైన యుగళ గీతం. “దిల్ మె బజి ప్యార్ కి షెహనాఇయా” అన్న లత పాట, “ఢల్ చుకీ షామ్ ఎ గం”, “జరా మన్ కీ కివాడియా ఖోల్” పాటలు రఫీ గొంతులో, కొయి ప్యార్ కి దెఖే జాదూగరి, చలేంగే తీర్ జబ్ దిల్ పర్ డ్యూయెట్లు నౌషాద్ సంగీత దర్శకత్వానికి నిదర్శనాలు.

సినిమాలో జీవన్ దిలీప్ కుమార్ల మధ్య నడిచే కామిడీ సన్నివేశాలను ఇద్దరు కూడా అద్భుతమైన టైమింగ్‌తో చేసారు. దీనితో పాటు మన తెలుగు మాయాబజార్‌లో మాయా శశిరేఖలా మగ గొంతుతో మాట్లాడి చెలికత్తెను భయపెట్టే మీనాకుమారిను చూసి ప్రేక్షకులు నవ్వుకుంటారు. మీనాకుమారి చేసిన అన్ని సినిమాలలో కామెడీ సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉన్న సినిమా కోహినూర్. ఇద్దరూ ప్రధాన నటులు కూడా బాగా ఎంజాయ్ చేసి ఈ సినిమా చేసారని తెలుస్తుంది. సినిమాలో కత్తి యుద్దాలు, ప్రేమ గీతాలు, మారు వేషాలతో పాటూ ఒక నీటీ అడుగున యుద్ధం సీను కూడా ఉంటుంది. అప్పటి టెక్నిక్ బట్టి ఇది కష్టపడి చిత్రించిన దృశ్యం. తెర మీదా బాగా వచ్చింది కూడా. ఈ సినిమా సక్సెస్ వెనుక దిలీప్ మీనా కుమారిలతో పాటూ రాజనర్తకి రాజలక్ష్మిగా తన నృత్యాలతో అలరించిన కుమ్ కుమ్ కూడా తెర మీద సహాయపడితే తెర వెనుక షకీల్ బధాయినీ, నౌషాద్‌ల కాంబినేషన్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. వీటన్నితోటి కోహినూర్ అందమైన సినిమాగా అప్పటి ప్రేక్షకులకు ఆనందాన్ని పంచింది. అదే సంవత్సరం ముఘల్ – ఎ- ఆజమ్ రిలీజ్ అయినా కోహినూర్ సినిమా కూడా పోటీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు తెచ్చిపెట్టింది.

Exit mobile version