Site icon Sanchika

ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 22 – లీడర్

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్‌కు ఆరవ ఫిలింఫేర్ అవార్డు తీసుకొచ్చిన ‘లీడర్’

[dropcap]ది[/dropcap]లీప్ కుమార్‌కి ఆరవ ఫిలింఫేర్ అవార్డు తీసుకొచ్చిన సినిమా ‘లీడర్’. 1964లో వచ్చిన ఈ సినిమా రొమాంటిక్ కామెడి. ఈ సినిమా స్క్రీన్ ప్లేలో చాలా లోపాలున్నాయి. భారీ సెట్లతో పెద్ద తారలతో తీసిన సినిమా ఇది. కానీ దీనికి కథా బలం లేదు. ఈ సినిమాకు ప్రాణం, ఊపిరి నౌషాద్ సంగీతం. లీడర్ అంటే ఏదో పొలిటికల్ డ్రామా అనుకునే అవకాశం ఉంది. కాని ఇది పక్కా రొమాంటిక్ కామెడి. వైజయింతి మాల, దిలీప్ కుమార్ల కాంబినేషన్ అప్పటీకే హిట్ పెయిర్ అన్న నానుడితో దూసుకుపోతున్న రోజులవి. ఆ క్రేజ్‌ని ఉపయోగించుకున్న సినిమా. దిలీప్ కుమార్ ఇంతకు ముందు సినిమాలలో కన్నా కూడా ఇందులో గ్లామర్ హీరోగా అలరిస్తారు. లీడర్ సినిమా కథని దిలీప్ కుమారే తయారు చేసుకున్నారు. దీనికి దర్శకత్వం వహించింది, స్క్రీన్ ప్లే రాసింది మాత్రం రామ్ ముఖర్జీ. ప్రస్తుత బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ తండ్రి ఈయన. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది శశిధర్ ముఖర్జీ. ఈయన అశోక్, కిశోర్, అనూప్ కుమార్ల చెల్లెలి భర్త. ఈ ముగ్గురిని సినీ రంగానికి పరిచయం చేసింది కూడా వీరే.

‘లీడర్’ సినిమాకు పాటలు రాసింది షకీల్ బధాయినీ. సంగీతం నౌషాద్‌ది. లత, ఆశా, రఫీలు పాటలను గానం చేసారు. “అప్ని ఆజాది కొ హం” అనే దేశభక్తి గీతం చాలా పాపులర్ అయింది. ఇప్పటికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే నాడు ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. సినిమాలో మొత్తం ఎనిమిది పాటలుంటాయి. ఇందులో “తెరి హుస్న్ కి క్యా తారీప్ కరూ” పాట ఒకసారి వింటే తనివి తీరదు. ఈ పాట చిత్రీకరణ కూడా అంతే అందంగా ఉంటుంది. ఈ సినిమా చూసి దిలీప్ కుమార్‌ని ట్రాజెడి కింగ్ అనాలనిపించదు. అందమైన సంభాషణలా సాగే ఈ పాటలో దిలీప్, వైజయంతి మాలల అభినయం చూడాలి. ప్రేమను కళ్ళతో వ్యక్తీకరించవచ్చు అని, అసలు కళ్ళు మాట్లాడే భాష ఒకటుంటుందని ఇప్పటి సినిమాలలో పాట చిత్రీకరణ చేసే వాళ్ళకు అస్సలు తెలీదు. పాటను క్లోజ్ అప్ షాట్లలో తీసే అవసరం ప్రస్తుత తరానికి లేదు కాని ఇలాంటి కొన్ని పాటల చిత్రీకరణ చూస్తే కథ అతకులు బొతుకులుగా ఉన్నా సినిమాను ఈ పాటల కోసం ఆస్వాదిస్తాం. అసలు ఇప్పటి టెక్నాలజీ పుణ్యమా అని అన్ని పాటలు విని ఆనందించవచ్చు. కాని వాటిని చిత్రీకరించిన తీరు కోసం ఈ నటుల హావ భావ విన్యాసాల కోసం ఆ పాటలు చూస్తే ఆ ఆనందం వేరు. ఆ ఆనందం కోసం పాత సినిమాలను చూసే సినీ ప్రేమికులు ఇంకా ఉన్నారు. హీరోయిన్ పక్కన కూర్చుని కళ్ళతో ఎక్కడా వెకిలితనం లేకుండా ముఖంపై విస్మయాన్ని ఆనందాన్ని, తృప్తిని, సంతృప్తిని దిలీప్ కుమార్ ఈ పాటలో ప్రదర్శిస్తే ఎంత బావుంటుందో. ఆ సినిమాలలోని ప్రేమలో ఉన్న ఆనందం ఇప్పటి పాటలలో దొరకదు. దిలీప్ కుమార్ ఈ ప్రేమ పాటలలో హీరోయిన్‌ని ముట్టుకునేదే చాలా తక్కువ. పక్కనే ఉండి ముఖంలో ఆ భావాలను పలికించడం, ఆ వీనుల విందైన సంగీతాన్ని తన కళ్ళతో పలికించే విధానం, పాట రాసిన కవి భావాన్ని పెదవుల పైకి తీసుకొచ్చే విధానం ఇవే అతని సినిమాలకు ప్రధాన ఆకర్షణ. “మై భీ హు అజబ్ ఎక్ దీవానా మర్తా హు నా ఆహే భర్తా హూ, కహీ భూల్ సె తూ న సమజ్ బైఠే కి మై తుజ్ సె ముహబ్బత్ కర్తా హూ” అన్న లైన్‌లో దిలీప్ కుమార్ మొహంలో ఆనందం మెరుస్తుంటుంది. నిజంగా ప్రేమలో పడి తన మనసుని విప్పి చెప్తున్న నిజాయితీ ఆకట్టుకుంటుంది. అది నటన అంటే. ఇప్పుడు ఎన్ని బ్రేక్‌లు షేక్లు వెనుక డాన్సర్లు ఉన్నా ఈ ఫీల్ మాత్రం రాదు కదా.. ముఝే దునియవాలో పాటలో రఫీ, దిలీప్ కుమార్ ల నడుమ స్వరంలో నటన, ముఖంలో భావాలతో నటనల నడుమ చక్కని జుగల్‌బందీ చూడవచ్చు. ప్రతి ఒక్క పదాన్నీ ర్ఫీ పలికిన తీరు, దానికి దిలీప్ అభినయం చూస్తూంటే రఫీ పదాలతో నటిస్తున్నాడా, దిలీప్ తన నటనతో రఫీ పలికే భావాలకు అర్ధాన్నిస్తున్నాడా అనిపిస్తుంది.

సాహిర్ లుధియాన్వి కవిత్వాన్ని ఆస్వాదించే వారికి వారి తాజ్ మహల్ కవిత పరిచయమే “ఎక్ షెహంషాహ్ నే దౌలత్ కా సహారా లేకర్ హమ్ గరీబో కా ఉడాయా హై మజాక్” అన్న పంక్తులతో తాజ్ మహల్ వెనుక ఉన్న రాజాహంకారాన్ని, తన శైలిలో చీల్చి చెండాడారు ఆయన. ఈ కవిత అప్పటి గొప్ప కవులందరినీ ఎదో ఒకరకంగా ప్రభావితం చేసింది. ఈ సినిమాలో దానికి జవాబుగా లేదా తాజ్ మహల్‌పై తన అభిప్రాయం చెప్పాలని కావచ్చు షకీల్ బధాయినీ ఒక పాట రాసారు. సందర్భం లేక పోయినా తాజ్ మహల్ సన్నివేశాన్ని క్రియేట్ చేసి షకీల్ పాటను ఈ సినిమాకు వాడుకున్నారు. “ఎక్ షహంషాహ్ నె బన్వా కె హసీన్ తాజ మహల్, సారీ దునియా కొ మొహబ్బత్ కీ నిషానీ దీ హై, ఇస్కె సాయె మె సదా ప్యార్ కె చర్చే హోంగే , ఖత్మ్ జొ హొ నా సకెగీ వొ కహానీ దీ హై” అంటూ షకీల్ బధాయినీ సాహిర్ కవితలోని పంక్తుల నుండే ఏరి ఈ పాటను కూర్చి ఆ పాటకు జవాబుగా తాజ్ మహల్‌ను రాచరికపు అహంకారంగా కాక ప్రేమకు ప్రతీకగా చూపే ప్రయత్నం చేసారు. అప్పట్లో కవుల మధ్య పోటీ ఆ స్థాయిలో ఉండేది. కవితగా ఇది కూడా చాలా బావుంటుంది. “మెరె మెహబూబ్ కహీ ఔర్ మిలా కర్” అని సాహిర్ రాసిన తాజ్ మహల్ కవిత 1964 లోని ఘజల్ అనే సినిమాకు పాటగా పెట్టుకున్నారు. అదే సంవత్సరం వచ్చిన ఈ లీడర్ సినిమాకు షకీల్ బధాయిని “తాజ్ ఇక్ జిందా తస్వీర్ హై కిసీ షాయిర్ కా” అంటూ తాజ్ వద్ధ ప్రియురాలిని కలవాలని ముచ్చట పడే ప్రియుని ప్రేమను చూపించారు. ఒకే సంవత్సరం ఇద్దరు కవులు రాసిన భిన్న అభిప్రాయాలు రెండు గొప్ప పాటలుగా మన ముందుకు వచ్చాయి. ఈ రెండు పాటలు కూడా రఫీ పాడడం మరో విశేషం. ఘజల్ సినిమాలో సాహిర్ పాట పూర్తిగా హీరో సునీల్ దత్‌పై చిత్రించారు. కాని షకీల్ బధాయినీ తన పాటను మాత్రం డ్యూయెట్‌గా మార్చారు. ఎంతటి సాహిత్యాత్మక పోటీ ఉండేది ఆ రోజుల్లో అనే దానికి ఈ రెండు పాటలు ఒకే సంవత్సరం ఒకే గాయకుడు పాడడం, రెండు భిన్న భావజాలాల ప్రదర్శన చూస్తే అర్థం అవుతుంది.

“హమీ సే ముహబ్బత్ హమీ సే లడాయి” అనే పాటలో దిలీప్ కొంటేదనం చిలిపితనం చూడాలి. చాలా ఎంజాయ్ చేస్తాం ఈ పాట చూస్తూ. అతని బాడీ లాంగ్వేజ్ ఎంతగా ఈ పాటల చిలిపితనానికి ట్యూన్ అయి ఉంటుందంటే చాలా ఈజ్‌తో ఈ పాటలన్నీ చేసారని అర్థం అవుతుంది. రఫీ గొంతులో పలికే ఆ చిలిపితనపు అల్లరికి పూర్తి న్యాయం చేయగలిగారు దిలీప్ కుమార్. “ముఝె దునియా వాలో’ అన్న పాట కూడా ఇప్పటి తరానికి ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది.

విజయ్ ఖన్నా లా చదువుతూ ఒక ప్రెస్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తూ ఉంటాడు. యువక రక్తంలో ఉద్రేకం ఉండీ, ఆదర్శాలుండీ అవి ఆచరణలో ఎక్కడ ఎలా పెట్టాలో తెలియని సందిగ్ధావస్థలో ఉండే యువకులకు ప్రతినిధి అతను. సునీత రాజ కుటుంబం నుంచి వచ్చిన స్త్రీ. ఆమె తండ్రి ప్రజలతో కూతురు మమేకం అయి జీవించాలని తలచి ఆమెను, తన చిన్న కొడుకుని బొంబాయిలో పెట్టి చదివిస్తూ ఉంటాడు. ఎలక్షన్ల సమయంలో సునీత బాగోగులు చూసుకుంటున్న ఆచార్య గారికి ప్రత్యర్థుల నుండి సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక ఎలక్షన్ ర్యాలీలో గొడవ జరిగినప్పుడు తెలివిగా దాన్ని పెరగకుండా ఆపుతాడు విజయ్. అయితే ఒక ఫోటోను ఫోర్జ్ చేసి సునీత ముఖం అంటించి ప్రచురించినందుకు విజయ్ అంటే సునీత కోపం పెంచుకుంటుంది. ఆమెకు తానెవరో చెప్పకుండా పరిచయం చేసుకుంటాడు విజయ్. మరో పక్క ఫోన్‌లో విజయ్‌లా ఆమెను ఉడికిస్తూ ఉంటాడు. విజయ్ తల్లి తండ్రులు బలవంతంగా అతని పెళ్ళి ఎవరితోనో నిర్ణయిస్తారు. అందుకని తనతో చనువుగా ఉండే కుర్రాళ్ళతో విజయ్ మరో రాష్ట్రానికి పారిపోతాడు. అతను తీసుకువెళ్ళిన కుర్రవాళ్ళలో సునీత తమ్ముడు కూడా ఉన్నాడు. అలా తమ్ముడిని వెతుక్కుంటూ వెళ్ళిన సునీత విజయ్ ఎవరో తెలియకుండా మరో పేరుతో తనను కలిసిన విజయ్‌ని ప్రేమిస్తుంది. చివరకు అతనే విజయ్ అని తెలియడం అయినా అతన్ని ఆమె కోరుకోవడం. విజయ్ తల్లి తండ్రులు సునీతను అంగీకరించడం జరుగుతుంది.

అయితే సునీత తండ్రి ఈ పెళ్ళికి ఒప్పుకోడని తెలిసి సునీత ముందు విజయ్‌ని ఆచార్య గారికి పరిచయం చేస్తుంది. ఆచార్య విజయ్‌ల మధ్య నడిచే సంభాషణ ఒక్కటే ఈ సినిమా మొత్తం మీద లాజికల్‌గా కనిపించేది. వారిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఆచార్య ప్రత్యర్థులు అతన్ని హత్య చేస్తారు. విజయ్‌పై ఆ హత్యా నేరం పడుతుంది. ఇక అక్కడి నుండి సునీత సహాయంతో పారిపోయి సునీత తండ్రి వద్దకు చేరి విజయ్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని అసలు హంతకున్ని పట్టుకోవడం సినిమా ముగింపు. కథంతా అతుకులతుకులుగా కనిపిస్తుంది. సునీత తమ్ముడు మళ్ళీ కనిపించడు. మధ్యలో రెండు నృత్యాల కోసం ఆదివాసీలను తీసుకురావడం, అక్కడ ఖరీదైన సెట్లు, అంతు పట్టని మెలోడ్రామా కొంచెం పెద్ద మోతాదులోనే ఉన్నా సినిమా పాటలు మాత్రం చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. దిలీప్ కుమార్ వైజయంతి మాలల జోడి చాలా బావుంటుంది.

లీడర్ పూర్తి సినిమాస్కోప్‌లో తీసిన సినిమా. భోజ్పురి సినిమా పితామహుడుగా పిలిచే నాజిర్ హుసేన్ దిలీప్ కుమార్ సినిమాలు చాలా వాటిల్లో నటించారు. ఇందులో ఆయన దిలీప్ కుమార్ తండ్రిగా కనిపిస్తారు. బిమల్ రాయ్‌కి అత్యంత ఆప్తులు ఆయన. వారి సినిమాలన్నిటిలో కూడా నాజిర్ హుసేన్‌కు ఒక ముఖ్య పాత్ర ఉండేది. చాలా సినిమాలను నిర్మించి దర్శకత్వం వహించారు కూడా. కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ రైటర్ గానూ పని చేసారు. సుమారు 500 హిందీ సినిమాలలో నటించిన వీరు భారతీయ సినిమా ప్రస్థానాన్ని ఆది నుండి చూసి అనుభవించిన సినీ దిగ్గజం. ఈ సినిమాకు సంభాషణలు రాసింది వాజాహత్ మిర్జా. మదర్ ఇండియా సినిమాకు గాను ఆస్కార్‌కు నామినేట్ అయిన మొదటి భారతీయుడు.

లీడర్ సినిమాలో దిలీప్ కుమార్ వైజయంతి మాలల నడుమ తెరపై రొమాన్స్ ఉట్టిపడుతూంటుంది కానీ, సినిమా షూటింగ్ అప్పుడు ఇరువురి నడుమ ఉద్విగ్నతలు తీవ్ర స్థాయిలో వుండేవి. ఇదే సమయానికి రాజ్ కపూర్ సంగం సినిమా నిర్మిస్తున్నాడు. సంగం సినిమాలో నాయిక కూడా వైజయంతి మాలా నే. నిజానికి సంగం సినిమాలో రాజేంద్ర కుమార్ పాత్రకు ముదుగా దిలీప్ కుమార్‌ను అడిగేడు రాజ్ కపూర్. దిలీప్ ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పటికే ఇద్దరి నడుమా ప్రొఫెషనల్ రైవలరీ వుండేది. ఇద్దరి సినిమాలో ఒకేసారి తయారవటము, రెండు సినిమాల్లో ఒకే హీరోయిన్ కావటమూ వైజయంతి మాల ను చాలా కష్టపెట్టింది. సంగం షూటింగ్ లో లేటయితే దిలీప్ కుమార్‌కు కోపం వచ్చేది. లీడర్ షూటింగ్‌కు త్వరగా వెళ్ళాలంటే రాజ్ కపూర్‌కు కోపం వచ్చేది.  లీడర్ షూటింగ్ తరువాత సంగం షూటింగ్‌కి వెళ్ళల్సివుంటే దిలీప్ కుమార్ వైజయంతి మాలను త్వరగా వెళ్ళనిచ్చేవాడు కాదు. అక్కడ రాజ్ కపూర్‌కు కోపం ఆలస్యమయితే. పైగా అతనితో వైజయంతి మాలకు రొమాన్స్ నడుస్తూండేది ఆకాలంలో. దీనికి తోడు ఆ సమయంలో రాజ్ కపూర్, వైజయంతి మాలల నడుమ సాన్నిహిత్యం పెరుగుతూండటం, అందుకు సంబంధించిన వార్తలు వెలువడుతూండటం కూడా దిలీప్ కుమార్ వైజయంతి మాలను సతాయించేందుకు కారణాలయ్యాయి. చివరికి రాజ్ కపూర్ భార్య ఈ వ్యవహారంతో విసిగి రాజ్ కపూర్‌ను వదలి కొన్నాళ్ళు హోటల్‌లో వుండటం, విడాకులిచ్చేస్తానని బెదిరించటంతో ఈ వ్యవహారం పాకానపడింది. అది, వైజయంతి మాల, రాజ్ కపూర్ డాక్టర్, బాలిని పెళ్ళిచేసుకోవటంతో సమసిపోయింది. కానీ, లీడర్ సినిమా షూటింగ్ సమయంలో మాత్రం చెప్పుకునేందుకు ఒక్క మంచి అనుభవం లేదని వైజంతి మాల గతాన్ని తలచుకుంటూ చెప్పిది.

ఈ సందర్భంలో దిలీప్ కుమార్ గురించి ఒక అప్రస్తుత  విషయం చెప్పుకోవాలి. దిలీప్ కుమార్ గొప్ప నటుడే కానీ, సినిమా నిర్మాణ సమయంలో దర్శకులను బాగా చికాకు పెట్టేవాడు. ఆరంభంలో కూడా జోక్యం చేసుకునేవాడు కానీ, రాను రాను అది ఎక్కువయింది. ఎంతగా అంటే, సినీ నిర్మాణం ఆలస్యం అయ్యేది. కొన్ని ప్రాజెక్టులు సగంలో ఆగిపోయేవి. కథ స్క్రిప్ట్ విషయాల్లో త్వరగా రాజీపడేవాడు కాదు.  దాంతో దిలీప్ కుమార్ ను హీరోగా తీసుకోవటం అంటే, ఏరి కోరి ఇబ్బందులపాలవటం అన్న అభిప్రాయం ప్రబలింది. అందుకే, 1960లో ముఘల్-ఎ-ఆజం సినిమా తరువాత దిలీప్ కుమార్ సినిమాలు తగ్గటం ఆరంభమయిది. పెద్ద నిర్మాతలు దూరంగా వుండటంతో, సినిమాల నాణ్యత తగ్గింది. ముఘల్-ఎ-ఆజం తరువాత మళ్ళీ 1967 లో రాం ఔర్ శ్యాం వరకూ దిలీప్ కుమార్ కు చెప్పుకోదగ్గ హిట్ సినిమా లేదు. లీడర్ కూడా అంత విజయవంతం కాలేదు. గంగా జమునా సినిమాకు క్లాసిక్ గా పేరు వచ్చినా ఆర్ధికంగా అంతగా లాభాలు సాధించలేదు. కానీ, నటుడిగా దిలీప్ కుమార్ ఇమేజీ పెరిగిందే తప్ప తగ్గలేదు. ఎంతగా అంటే 1980 దశకంలో దిలీప్ కుమార్ లివింగ్ లెజెండ్ గా పరిగణించారు. కానీ, దిలీప్ కుమార్ గొప్ప నటన అంటే ప్రధానంగా 1960 కన్నా ముందరి సినిమాలనే ప్రస్తావించుకోవాల్సివుంటుంది. ఇందుకు లీడర్ ఒక చక్కని ఉదాహరణ.  అందుకే, సుధాకర్ బొకాడే దిలీప్ కుమార్ దర్శకత్వంలో కళింగా అనే సినిమా తీస్తానని ప్రకటించినప్పుడు అందరూ అది పూర్తికాదని అభిప్రాయపడ్డారు. సినిమాలో నటించాలని ధర్మేంద్ర ఉబలాట పడ్డాడు. తనను  కాకున్నా సన్నీ డియోల్ ను తీసుకోమని అభ్యర్ధించాడు. కుదరలేదు. అంజాద్ ఖాన్ ఆ సినిమాలో నటించాడు. సినిమా పూర్తయింది  కష్టం మీద, కానీ విడుదలకాలేదు. సినిమా షూటింగ్  సమయంలో క్రికెట్ లో భారత్ ఓడిపోతే షూటింగ్ కాన్సిల్. ఎవరయినా సమయానికి రాకపోతే కేన్సిల్. అసలు కథ, స్క్రిప్ట్ తయారీకే చాలా కాలం పట్టింది. ఇంతలో ప్రధాన పాత్ర పోషిస్తున్న రాజ్ కిరణ్ అదృశ్యమయ్యాడు. ఆయన కోసం వెతకటంలో సమయం పోయింది. 20 ఏళ్ళ తరువాత కాలిఫోర్నియాలో కనిపించాడీయన. కొన్ని రకాల పక్షులను షూట్ చేయటంకోసం ఒక సంవత్సరంపాటూ యూనిట్ దేశమంతా తిరిగింది. అయినా ఈ సినిమాను చూసే అదృష్టం సినీ ప్రేమికులకు లేకుండా పోయింది.

లీడర్ సినిమాలో కథాలోపాల వల్ల కావచ్చు ఇన్ని చక్కని పాటలున్నా కమర్షియల్‌గా ఈ సినిమా పెద్ద హిట్ కాలేదు. కాని దిలీప్ కుమార్‌కి మాత్రం ఆరవ ఫిలింఫేర్ అవార్డు తీసుకొచ్చింది. అలా దిలీప్ కుమార్ సినిమాల అధ్యయనంలో తప్పక చూడాల్సిన సినిమాగా నిలిచిపోయింది.

Exit mobile version