Site icon Sanchika

ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 24 – మధుమతి

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

బిమల్ రాయ్ క్లాసిక్ ‘మధుమతి’

[dropcap]బి[/dropcap]మల్ రాయ్ 1958లో తీసిన ‘మధుమతి’. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఇది అంత పెద్ద హిట్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. అంతకు ముందు ‘దేవదాస్’ తీసిన బిమల్ రాయ్ వైజయంతి మాల, దిలీప్ కుమార్లతో మరో సినిమా చేయాలనుకున్నారట. రిత్విక్ ఘటక్ గారి సినీ కేరియర్‌ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఆయనతో కథ రాయించుకున్నారు బిమల్ రాయ్. తన స్టైల్‌కు భిన్నంగా రిత్విక్ ఘటక్ పునర్జన్మ ఇతివృత్తంతో రాసిన కథ మధుమతి. ఇది ఆయన సగమే రాసి వదిలేసారని మిగతాది బిమల్ రాయ్ పూర్తి చేసారని కొందరంటారు. ఈ సినిమాకు రాజేందర్ సింగ్ బేడి సంభాషణలు రాసారు. ‘దేవదాస్’ సినిమా గొప్ప పేరు తీసుకొచ్చినా బిమల్ రాయ్‌కి డబ్బులు సంపాదించి పెట్టలేకపోయింది. చాలా ఆర్థిక ఒత్తిడుల మధ్య సినీరంగంలో నిలదొక్కుకోవడానికి కమర్షియల్ ఎలిమెంట్‌తో ఒక సినిమా తీయడం అవసరం అనిపించి, తన పంథాకు విరుద్ధమయినా ఈ కథతో మధుమతి సినిమా నిర్మించి, దర్శకత్వం వహించారు బిమల్ రాయ్. మధ్యలో సినిమా ఖర్చు పెరిగిపోతే తనకు రావలసిన జీతం తీసుకోకుండా డిస్ట్రిబ్యూటర్ల సహాయంతో ఆయన పని పూర్తి చేసారట. మధుమతి సినిమాకు సంగీతం సలీల్ చౌదరి అందిస్తే శైలేంద్ర పాటలు రాసారు. సలీల్ చౌదరి భారతీయ జానపద బాణీలతో పాటు హంగేరియన్ జానపద శైలిని కూడా కలిపి కంపోజ్ చేసిన పాటలు ఇప్పటికి కూడా అత్యధికంగా నేటి తరం వింటున్న పాత సినిమా పాటల లిస్ట్లో వస్తాయి.

‘మధుమతి’ సినిమా ఫిలింఫేర్ కేటగిరీలలో 12 విభాగాలలో నామినేషన్‌లు పొంది 9 అవార్డులు గెలుచుకుంది. ఇప్పటికీ ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శింపబడుతూనే ఉంది. హిందీలో ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతితో పాటు, ఫిలింఫేర్ విభాగంలో ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్ (బిమల్ రాయ్), ఉత్తమ సహాయ నటుడు(జానీ వాకర్), ఉత్తమ సంగీత దర్శకుడు (సలీల్ చౌదరి), ఉత్తమ నేపథ్య గాయని (లతా మంగేష్కర్), ఉత్తమ సంభాషణ రచయిత (రాజేందర్ సింగ్ బేడి), ఉత్తమ చాయాగ్రహణం (సుదేంద్రు రాయ్), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ (దిలీప్ గుప్తా), ఉత్తమ ఎడిటర్ (హృషికేశ్ ముఖర్జీ) కేటగిరిలలో అవార్డులు పొందింది. 1958లో మొదటి సంవత్సరం నేపథ్య గాయకులకు అవార్డులు ప్రకటించారు. మొట్టమొదట ఈ సినిమాలో “ఆజా రే పరదేశి” పాటకు లతా మంగేష్కర్ ఆ అవార్డు గెలుచుకున్నారు. అప్పట్లో గాయకుల కేటగిరిలో ఒకరికి మాత్రమే అవార్డు ప్రకటించింది ఫిలింఫేర్. అంటే, గాయని లేదా గాయకుడు ఒక్కరినే ఉత్తమ నేపథ్య గాయకులుగా అవార్డు కోసం ఎంపిక చేసేవారు. అలా అప్పటి గాయకులందరిలోకి అవార్డు గెలుచుకున్నారు, ప్రప్రథమంగా లతా మంగేష్కర్.

బిమల్ రాయ్ శైలికి భిన్నంగా ఉన్న ఈ మధుమతి చిత్రం మాత్రం వారికి కమర్షియల్‌గా పెద్ద సక్సెస్‌ను తీసుకొచ్చింది. సినిమాలో ఫొటోగ్రఫీ కూడా కథ మూడ్‌ను బాగా ఎలివేట్ చేస్తుంది. సినిమా మొదటి భాగంలో ఆనందాన్ని, ప్రేమని సూచించే విధంగా చాలా బ్రైట్‌గా ఉండే ఫోటోగ్రఫీ సినిమా రెండవ భాగంలోకి వచ్చేసరికి భయాన్ని, దుఖాన్ని సూచిస్తూ చాలా డార్క్‌గా మారుతుంది. సినిమా షూటింగ్ ప్రపథమంగా నైనిటాల్‌తో చేసారట. కాని చాలా షాట్లు మంచు కారణంగా అనుకున్నవిధంగా రాలేదని బొంబాయి పరిసర ప్రాంతాలలో కృత్రిమ యూకలిప్టస్ చెట్ల సెట్లు వేసి కొన్ని సీన్లు తీయవలసి వచ్చిందట. అయితే ఛాయాగ్రహణం ఎంత గొప్పగా ఊంటుందంటే ఏ షాట్ సహజమైన కొండల మధ్య తీసారు, ఏది స్టూడియోలో తీసారు అన్నది కనుక్కోలేం.

దిలీప్ కుమార్‌కు ఈ సినిమాలో నవరసాలను పలికించే అవకాశం కలిగింది. ఒక టీ ఎస్టేట్‌లో మేనేజర్‌గా పని చేయడానికి వస్తూ ప్రకృతిని ఆస్వాదించే ప్రశాంత చిత్తమున్న వ్యక్తిగా ముందు కనిపిస్తారు ఆయన. తరువాత మధుమతిని కుతూహలంతో గమనించడం, ఆమెతో ప్రేమ, ఆమె కనిపించకపోతే విరహం, ఆమెని వివాహం చేసుకోవాలనే సాహసం, ఆమె తండ్రితో మాట్లాడి అతని నమ్మకాన్ని చూరగొనే వీరత్వం, తరువాత ఆమె కనిపించకుండా పోతే కలిగే బాధ, కోపం, ఉగ్రనారాయణ్‌పై అసహ్యం, చివరకి ప్రతీకారం తీసుకుని తాను కూడా చనిపోయే సన్నివేశం.. ఇలా కథ మొత్తంలో ఆయన అన్ని భావాలు, రసాలు తన వాచకంతోనూ అభినయంతో పలికిస్తారు. ఇన్ని షేడ్స్ ఉన్న పాత్రలు అతి తక్కువ ఉంటాయి భారతీయ సినిమాలో. మొదటి పాట “సుహానా సఫర్”లో అతను కాజువల్‌గా నడుస్తూ ప్రకృతిని ఆస్వాదించడం, ఆజారె పాటలో పై కొండ మీద నుండి క్రింది కొండ పై ఉన్న మధుమతిని చూసేటప్పుడు అతనిలో కుతూహాలం. ‘జుల్మి సంగ్ ఆంఖ్ లగీ” పాటలో మధుమతిలో ప్రేమలో పడుతున్నప్పుడు అతని మొహంలో ప్రతిబింబించే హావభావాలు. దిల్ తడప్ తడప్ కె అన్నపాటలో అతని రొమాంటిజం, తరువాత టూటే హుయె ఖాబో మె అన్న పాటలో మూర్తీభవించిన విషాదం, ఇవే కాదు ఉగ్రనారాయణ్ బొమ్మ వేస్తున్నప్పుడు అతనితో దిలీప్ ఆడే మైండ్ గేమ్, అతన్ని భయపెట్టడానికి తన గొంతులో ఎక్కడా తొట్రుపాటు లేకుండా, తొక్కి పెట్టిన కోపాన్ని కసిని మాటలుగా మార్చి మార్దవంగా మాట్లాడుతూ ఉగ్రనారాయణ్‌లో భయాన్ని ప్రవేశపెట్టే సన్నివేశం, చివరకు వచ్చింది మాధవి అయితే ఆమెకు ఆ గదిలో ఏం జరిగిందో ఎలా తెలిసింది అని ప్రశ్నిస్తున్నప్పుడు అతని మొహంలో అనుమానం, చనిపోయిన మధుమతిని మరోసారి చూసిన విస్మయం.. ఆమె వెంట వెళ్ళడం తప్ప మరో దారి లేదు అన్నటుగా అసహాయంగా ఆమె వెంట నడిచి వెళ్ళి కోట పై నుండి పడిపోయే దాకా అతను మెయింటేయిన్ చేసిన బాడీ లాంగ్వేజ్, వీటన్నిటి జాగ్రత్తగా పరిశీలిస్తే దిలీప్ కుమార్ నటనలోని విశ్వరూపం కనిపిస్తుంది. ఒకే సినిమాలో ఇన్ని షేడ్స్‌తో దిలీప్ కుమార్ ఈ సినిమాకు న్యాయం చేసిన విధానాన్ని గమనిస్తే అతనిది స్టడీ చేయవలసిన మెథడ్ యాక్టింగ్ అని ఎందుకుని అన్నారో అర్థం అవుతుంది.

మధుమతి సినిమాతో ముకేష్ సంగీత జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభమయింది. ముకేష్‌ను అందరూ అందగాడని పొగడటంతో హీరో అయిపోవాలనుకున్నాడు. తానే సినీ నిర్మాణం చేపట్టాడు. మిత్రుడు రోషన్ సంగీత దర్శకుడుగా మల్‌హార్  సినిమా రూపొందించాడు. అతను నటించిన సినిమాలు విడుదల కాలేదు. విడులయిన సినిమాలు నడవలేదు. కానీ, ఆయన హీరో అవటంతో, ఇతర హీరోలు ముకేష్‌ను తమ స్వరంగా వాడటం మానేశారు. చివరికి రాజ్ కపూర్ కూడా మన్నా డే ను తన స్వరంగా ఎంచుకున్నాడా కాలంలో. దాంతో అటు హీరోగా నిలద్రొక్కుకోలేక, ఇటు పాడే అవకాశాలురాక, తినటానికి తిండి లేని పరిస్థితి వచ్చింది. అప్పుడు ఇక మళ్ళీ హీరో మాటే తలపెట్టనని ఒట్టువేసుకుని పాడే అవకాశంకోసం వెతకటం ప్రారంభించాడు ముకేష్. ఆ సమయంలో శంకర్ జైకిషన్ యాహుదీ సినిమాలో దిలీప్ కుమార్ పై యే మెరా దీవానాపన్ హై పాట పాడే అవకాశం ఇచ్చారు. అదే సమయానికి మధుమతి సినిమాలో సుహానా సఫర్ పాట తలత్ మహమూద్ పాడాల్సింది, తనకన్నా డబ్బు అవసరం ముకేష్‌కే ఎక్కువుంది కాబట్టి ఆ పాట పాడే అవకాశం ముకేష్ కి ఇవ్వమని సూచించి తలత్ తప్పుకున్నాడు. అప్పటికి తలత్ కూడా హీరో అవ్వాలని ప్రయత్నించి భంగపడి పాటలు పాడే అవకాశాలనూ పోగొట్టుకున్నాడు. కానీ, ముకేష్‌కు ఎక్కువ అవసరం వుందని తప్పుకున్నాడు. ఇది ముకేష్ కు సినీరంగంలో నిలద్రొక్కుకునే వీలిచ్చింది. తరువాత కళ్యాణ్ జీ ఆనంద్ జీ ల సహాయంతో ముకేష్ రెండో ఇన్నింగ్స్ విజయవంతమయింది.. ఆ రకంగా కూడా మధుమతి ఒక మరపురాని సినిమా.. సుహానా సఫర్ పాట తలత్ పాడి వుంటే???

ఈ సినిమా క్లైమాక్స్ కొన్ని వందల సినిమాలకు ఇన్‌స్పిరేషన్ అయింది. ఈ సినిమా ఫార్ములా మీద ఎన్నో హిందీ సినిమాలు తరువాత నిర్మించారు. మిలన్ సినిమా నుండి ఓం శాంతి ఓం  దాకా ఎన్నో సినిమాలకు ఇది హిందీలో మూలం అయింది. దీపికా పదుకోణె మొదటి హిందీ సినిమా ‘ఓం శాంతి ఓం’ ఆఖరి సీన్ మక్కి టూ మక్కి మధుమతి కాపీ. దిలీప్ కుమార్ రెండు పాత్రలలో నటించిన మొదటి సినిమా ఇది. ముందు దేవిందర్‌గా కనిపించి తరువాత వర్షపు రాత్రి ఉగ్రనారాయణ్ కోటలోకి వచ్చి తన గత జన్మను గుర్తుకు తెచ్చుకుని ప్లాష్‌బాక్‌లో ఆనంద్‌గా కనిపిస్తారు. వైజయంతి మాల మూడు పాత్రలలో కనిపిస్తుంది, ఆనంద్ ప్రేమికురాలు మధుమతిగా, ఆ జన్మలోనే మధుమతి పోలికలతో ఉండే మాధవిగా, తరువాత దేవేందర్ భార్య రాధగా ఆమె మూడు పాత్రలు వేస్తారు.

ఈ సినిమాలో ప్రేమను అన్ని రకాల మూడ్స్‌లో చూపించారు. సంయోగం వియోగం, విరహం, కలయిక, మరణం, తరువాత మరు జన్మ ఇలా ప్రేమ ఒక రూపం నుంచి మరో రూపానికి మారుతూ కనిపిస్తుంది. దీనికి తోడయిన ఛాయాగ్రహణం, అత్యద్భుతమైన సంగీతం, కొండ ప్రాంతపు జీవన విధానం, అమాయకత్వంతో నిండిన అందం, అంతలోనే విషాదం, ఆ విషాదంలో నుంచి తేరుకోవడానికి ప్రేక్షకులకు ఆనందం కలిగించడానికి దేవేంద్ర భార్యగా రాధ కనిపిస్తుంది. ముందు జన్మలో కలవలేని ప్రేమికులు, అప్పటి విషాద కథ, తరువాత జన్మలో ఆనందమైన ముగింపుగా మారడంలో ఒక సంతృప్తి కలుగుతుంది ప్రేక్షకులకు. ఆ భావావేశాలను అన్నిటినీ మూడు గంటలలో వరుసగా అనుభవించే థ్రిల్ ఈ సినిమా ద్వారా కలగడమే ప్రేక్షకులకు లభించే తృప్తి. అదొక మంచి అనుభవం. ఒక కథలో లీనమయి మనసులోని అన్ని రకాల అనుభూతులను సమాన స్థాయిలో అనుభవిస్తూ అత్యంత విషాదం, ఆనందంగా మారడం చూడడమే ఈ కథకున్న బలం. ఈ సినిమా మాస్‌ను క్లాస్‌ను, ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథతో సామాన్య ప్రేక్షకుడు సంతృప్తి పడితే, అద్బుతమైన దృశ్యకావ్యంలా మలిచిన ఆ ఫోటోగ్రఫీ, అందమైన సాహిత్యం, దిలీప్, వైజయంతిమాలల నటన మేధావి వర్గాన్ని కూడా సినిమా దగ్గరకు తీసుకువస్తుంది. అందుకే ఇది అప్పట్లో అంత పెద్ద కమర్షియల్ హిట్ కాగలిగింది.

మధుమతి సినిమాకు కాస్టూమ్స్ డిజైన్ చేసింది యాదుగిరి దేవి. ఈవిడ వైజయంతి మాల అమ్మమ్మ. ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డ్‌కు ఎంపికయినా కూడా దిలీప్ కుమార్‌కు అవార్డు రాలేదు. ఆయనకు కెరియర్ మొత్తం మీద ఎనిమిది ఫిలింఫేర్ అవార్డులు లభిస్తే పదకొండు నామినేషన్లు లబించాయి. అలా మొదటిసారి ఎంపికయి కూడా అవార్డు గెలుచుకోకపోవడం అన్నది మధుమతి సినిమాతో మొదలయింది దిలీప్ కుమార్‌కు. తరువాత పదకొండు నామినేషన్లు, ఎనిమిది అవార్డులతో రికార్డు యాక్టర్‌గా హిందీ సినీ జగత్తుని శాసించారాయన. ఇదే సంవత్సరం రిలీజ్ అయిన కాలాపానీ సినిమాకు దేవ్ ఆనంద్‌కు ఆ సంవత్సరం ఉత్తమ నటుడి ఫిలింఫేర్ అవార్డు లభించింది. అలాగే వైజయంతి మాలకు కూడా మధుమతి సినిమా ఫిలింఫేర్ నామినేషన్ వరకు మాత్రమే తీసుకువెళ్ళగలిగింది. ఆ సంవత్సరం మధుమతి, సాధన రెండు సినిమాలకు వైజయంతి మాలకు ఫిలింఫేర్ నామినేషన్లు లభించాయి. అలా రెండు సార్లు ఒకే సంవత్సరం నామినేట్ అయిన మొదటి నటి ఆమె. అయితే ఆమెకు మధుమతికి కాకుండా ‘సాధన’ సినిమాకు ఫిలింఫేర్ లభించింది. ఇది గమనించవలసిన విషయం.

దిలీప్ కుమార్ ఒక అతి సామాన్యమైన వ్యక్తిగా కనిపిస్తాడు సినిమా అంతా. కాని తన చుట్టూ ఉన్న పాత్రలలో అతను మమేకం అయే విధానంలో, ఎంత లోతుగా అతను తన చుట్టు ఉన్న వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలను కోరుకుంటాడో చూపిస్తూ అతని వ్యక్తిత్వాన్ని అర్థం చేయిస్తారు దర్శకులు. తన దగ్గర పని చేసే వారు కావచ్చు, మధుమతి కావచ్చు, ఆమె తండ్రి కావచ్చు ప్రతి పాత్ర వైపు అతను నిజాయితీతో చూసే ఆ చూపు ఆనంద్ పాత్రను ప్రేక్షకులకు దగ్గర చేసుంది. దానికి ఒక హుందాతనాన్ని కలిపిస్తుంది. కొండల మధ్య ఒక పేద పల్లెటూరి అమ్మాయి వెంటపడే వాడిలా ఉండదు అతని భావ వ్యక్తీకరణ. మధుమతితో అతని సంభాషణ, ఆమెను మౌనంగా అతను గమనించే విధానం చాలా అందంగా ఉంటాయి. కేవలం శరీరాన్నే కాదు మరెదో ఉదాత్తమమైన భావాన్ని, ఆనందాన్ని ప్రేమ ద్వారా పోందాలనుకుంటున్న ఆనంద్ మనకు అర్థం అవుతాడు. మగ అహంకారం, లేదా డామినేషన్ ఎక్కడా కనిపించదు. సున్నితంగా అతను తన ప్రవర్తన ద్వారా మధుమతిపై తనకున్న ప్రేమను చాటుకుంటాడు. మధుమతి ఒక రోజు తనను కలవడానికి రాకపోతే ఆమెను వెతుక్కుంటూ అతను ఆమె ఇంటికి వెళ్ళే సీన్‌లో తనను తాను ప్రేమ కోసం అర్పించుకునే వ్యక్తి కనిపిస్తాడు. సుహానా సఫర్ అనే పాటలో పూలను, కొండలను, అక్కడి వాతావరణాన్ని ఎలా తనలో భాగం చేసుకుంటాడో, అదే భావన, రొమాంటిజం, మధుమతితో ఉన్నప్పుడు వ్యక్తీకరిస్తాడు. ఒకప్పటి రొమాంటిక్ కవులు ప్రకృతిలో ప్రేమికురాలిని చూసినట్లు ఆనంద్ పాత్రకు కూడా మధుమతి ప్రకృతి రెండు ఒకటే అవుతాయి. ఈ అద్భుతమైన రొమాన్స్ చూస్తున్నప్పుడు ప్రేమ పట్ల ఒక అపురూపమైన భావన కలుగుతుంది. అదే ఈ సినిమాను ప్రేక్షకులకు అతి దగ్గర చేయగలిగింది. కొండల మధ్య ప్రేమ గాథలు అంతకు ముందు ఎన్ని వచ్చినా, మధుమతిలో దిలీప్ పాత్ర ఆ ప్రేమను ప్రకృతితో మమేకం చేసినట్లు మరే సినిమా చూపించలేకపోయింది. అందుకే మధుమతి సినిమా చూస్తున్నంతసేపు అందమైన కవిత్వాన్ని అనుభూతిస్తాం. వర్డ్స్‌వ‌ర్త్, కీట్స్, షెల్లీలు గుర్తుకు వస్తారు.

సినిమాలో ఒక సీన్‌లో మధుమతి ఆనంద్‌ను తమ పూర్వీకుల సమాధుల వద్దకు తీసుకువస్తుంది. ఇది గమనిస్తే విషాదం ప్రేమను అంటిపెట్టుకుని ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఆ సమాధుల మధ్య ఆ ప్రేమికులు థామస్ గ్రే రాసిన ఎలిజీని ఒక్క క్షణం గుర్తుకు తీసుకువస్తారు. ప్రేమికులు సమాధుల మధ్య జీవితాన్ని ఊహిస్తూ చూపించిన మరో సినిమా నాకు తెలిసినంత వరకు కూడ మధుమతియే. అయితే మరణం తథ్యమని చెబుతూ కూడా శరీరం నాశనమయినా ప్రేమ జీవించి ఉంటుందన్న దిశగా మధుమతి సాగించిన ప్రయాణం ఒక గొప్ప సినీ అనుభవం.

మధుమతిలో విలన్‌గా ప్రాణ్‌ని మాత్రమే ఊహించుకోగలం. ఈ సినిమా ఆధారంగా వచ్చిన తరువాతి సినిమాలు చూస్తే హీరో దిలీప్‌ని తరువాతి తరం హీరోలు ఎంతగా కాపీ చేసే విఫల ప్రయత్నం చేసారో, అంత నిజాయితీగా ప్రాణ్ పాత్ర ఉగ్రనారాయణ్ మానరిజమ్స్, కొన్ని సార్లు వేషభాషలు, బాడీ లాంగ్వీజ్ కూడా కాపీ చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. అంతగా పునర్జన్మ విషయం మీద తీసిన సినిమాలను ప్రభావితం చేసింది మధుమతి. మదుమతి సినిమా కంటే ముందే ‘మహల్’ అనే సినిమాని కమల్ అమ్రోహి పునర్జన్మ కాన్సెప్ట్‌తో నిర్మించారు. కాని, మధుమతితో బిమల్ రాయ్ ఒక ట్రెండ్‌ను క్రియేట్ చేయగలిగారు. సినిమా నడుస్తున్నంత సేపు మధుమతి ఆనంద్‌ కలవరని మనకు అర్థం అవుతూనే ఉంటుంది. పట్నం వెళ్తున్న ఆనంద్ కోసం ప్రార్థించడానికి తమ కులదేవత వద్దకు మధుమతి ఆనంద్‌ను తీసుకుని వెళుతుంది. అక్కడ దేవుడిని అర్పించిన పువ్వు క్రింద పడిపోతుంది. ఇలా జరిగితే తాను ప్రేమ పొందక ముందే మరణిస్తానని, అది తనకు ఇష్టం లేదని ఆనంద్‌ను పొందడమే తన కోరిక అని అది తీరకుండా చనిపోవడం తనకు ఇష్టం లేదని చెబుతున్నప్పుడు ఆనంద్ ఆమె నుదుటున సింధూరం దిద్ది ఆమెను తనదానిగా చేసుకుని మధుమతికి సంతృప్తి కలిగించడంలో అమాయకత్వంతో పాటు ఆ రెండు పాత్రలకు ఒకరిపై ఒకరికున్న నమ్మకం అర్థం అవుతుంది. ఇది కూడా తరువాత చాలా సినిమాలలో రిపీట్ అయిన సీన్.

మధుమతి సినిమా తప్పకుండా చూడమని చెప్పడానికి ఎన్నో కారణాలున్నాయి. ఉత్తమ నటన, ఉత్తమ దర్శకత్వం, భారతీయ సినిమాకు జీవం అయిన పాటల చిత్రీకరణ, వాటి సౌందర్యం, ముచ్చట గొలిపే మెలోడ్రామా. అందం, ఆనందాల ఆస్వాదనను అనుభవానికి తీసుకొచ్చే గొప్ప దృశ్యకావ్యం మధుమతి.

Exit mobile version