ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 26 – యహూది

0
2

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

ఆఘా అషర్ కశ్మీరి ఉర్దూ నాటకాన్ని సినిమాగా మార్చిన బిమల్ రాయ్ – ‘యహూది’

[dropcap]1[/dropcap]913లో ఆఘా అషర్ కశ్మీరి ఉర్దూలో ‘యహూది కీ లడకీ’ అనే నాటకం రాసారు. జ్యూస్ పై రోమన్లు జరిపిన మారణహోమాలను చర్చించే సందర్భంలో రాసిన నాటకం ఇది. పార్సీ ఉర్దూ నాటక ప్రపంచంలో ఇది చాలా పేరు ఉన్న నాటకం. దీన్ని హిందీలో మూడు సార్లు సినిమాగా తీసారు. 1933లో కె.ఎల్. సైగల్‌తో ఈ సినిమా మొదటిసారి తీసారు. తరువాత 1956లో నానుభాయ్ వకీల్ దీన్నిమళ్ళీ సినిమాగా తీసారు. మళ్ళీ 1957లో ఎస్.డి.నారంగ్ గారు ఇదే నాటకాన్ని సినిమాగా తీసారు. బిమల్ రాయ్ – దిలీప్ కుమార్, షోరాబ్ మోడీ నాజిర్ హుసేన్, మీనా కుమారీ, నిగర్ సుల్తానా లతో 1958లో మళ్ళీ ‘యహూది’ అన్న సినిమా తీసారు. ఉర్దూ, ఖరీ బోలీ, బ్రజ్ భాషలను కలిపి రాసిన ఈ నాటకాన్ని యథాతథంగా చిత్రించే ప్రయత్నం చేసారు బిమల్ రాయ్. యహూది సినిమాలో దిలీప్ కుమార్ షోరాబ్ మోడిలను, నాజిర్ హుసేన్‌ను కలిసి చూడడం ఒక అనుభవం.

షోరాబ్ మోడి మన దేశం గర్వంగా చెప్పుకోదగ్గ నటుడు. స్టేజి ఆర్టిస్ట్‌గా ఎన్నో నాటకాలను ప్రదర్శించిన షోరాబ్ మోడి తరువాత సినీ రంగంలోకి వచ్చి చాలా మంచి సినిమాలలో నటించడమే కాకుండా దర్శకత్వం వహించి నిర్మించారు కూడా. “పుకార్”, “సికందర్” సినిమాలను ఇప్పటికీ అతని అభిమానులు మర్చిపోలేరు. షోరాబ్ మోడి డైలాగ్ డెలివరీ ఎంత పాపులరో చెబుతూ ఈ సంఘటన చెబుతారు అప్పటి తరం వారు. ఒకసారి ఆయన ఒక నాటకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, ముందు సీట్ళో కళ్ళు మూసుకుని ఎటో తల పెట్టి కూర్చున్న ఒక వ్యక్తి కనిపించాడట. అది తనకు అవమానం అని భావించి షోరాబ్ నిద్రపోతున్న అతన్ని హాలు నుండి పంపించేయమని నిర్వాహకులతో చెప్పారట. వారు వెళ్ళి ఆ వ్యక్తిని బైటకు పిల్చుకుపోయారు. తరువాత షోరబ్‌కు తెలిసింది, ఆ వచ్చిన వ్యక్తి పుట్టు గుడ్డి అని. కేవలం షోరబ్ గొంతు నుండి వచ్చే ఆ డైలాగులు వినడానికి అతను ఆ నాటకానికి వచ్చాడని తెలిసింది. అంతటి అభిమానాన్ని సంపాదించుకున్న వ్యక్తి షోరాబ్. ఇది అతిశయోక్తి కాదనడానికి మనం ఒక్క యహూది చూపించవచ్చు. ఇందులో ఆయనకు రాసిన డైలాగులు, ఆయన వాటిని పలికిన విధం, ఉర్దూ భాషని మధురంగా పలికించిన ఆ స్టైల్ మర్చిపోలేం. సినిమాకి వాచకం ఎంత అవసరమో, అది నటుడికి ఎంతటి బలమో తెలియాలంటే షొరాబ్ మోడిని యహూది సినిమాలో చూడాలి.

అతనితో పాటు పోటీ పడి నాజిర్ హుసేన్ దిలీప్ కుమార్లు చూపిన నటన ఈ సినిమాకు హైలైట్. ఎజ్రా ఒక నగల వ్యాపారి. అతని కొడుకు ఎలిహా. కొడుకంటే ఎజ్రాకి ప్రాణం. అతని ఇంట్లో అతని సేవకుడు ఇమాన్యుయల్ తల్లి లేని ఎలిహాని చూసుకుంటూ ఉంటాడు. చాలా చలాకీగా ఉండే ఎలీహా అల్లరివాడు. ఒక రోజు రోమన్ గవర్నర్ బ్రూటస్ ఆ వీధిలో వెళుతూ ఉంటాడు. ఇంటి బాల్కనీలో నుంచున్న ఎలిహా చేతి నుండి ఒక రాయి జారి క్రింద పడుతుంది. బ్రూటస్‌కు అది తగులుతుంది. అతని సైనికులు ఎలీహాని పట్టుకుంటారు. చిన్న పిల్లవాడు కావాలని చేసిన తప్పిదం కాకపోయినా అది తనకు అవమానమే అనుకున్న బ్రూటస్ ఎలీహాని బంధించి తీసుకెళతాడు. ఎలీహాని కాపాడాలని ఇమాన్యుయల్ ఆ శిక్ష తనకు వేయమని వేడుకున్నా బ్రూటస్ వినడు. ఇంటికి వచ్చిన ఎజ్రా ఈ సంగతి తెలిసి బ్రూటస్ ఇంటికి వెళతాడు. బ్రూటస్‌కు ఎలీహా వయసులో ఉన్న కూతురు ఉంటుంది. ఆమె లిడియా, లిడియా అంటే బ్రూటస్ కు ప్రాణం. ఎజ్రా తన బిడ్డను క్షమించమని బ్రతిమాలుకుంటాడు. బ్రూటస్ కాళ్ళు పట్టుకుంటాడు. అతను కరగకపోతే చివరికి లిడియా కాళ్ళు కూడా పట్టుకుంటాడు. లిడియా తండ్రిని తన కోసం ఎజ్రా కొడుకుని క్షమించమని అడుగుతుంది. బ్రూటస్ కూతురు కోసం సరే అన్నా, భటులకు మాత్రం ఎలిహాను సింహాలకు ఆహారంగా వేయమని చెబుతాడు. భటులు ఎజ్రా ఎంత బ్రతిమిలాడినా అతని కళ్ళ ముందే ఎలీహాను సింహాలకు ఆహారంగా వేస్తారు. ఆ దుఃఖంతో రోమన్ సామ్రాజ్యపు అహంకారాన్ని తూలనాడుతూ ఎజ్రా ఇంటికి వస్తాడు. కాని అతని సేవకుడు ఇమ్మాన్యుయల్ మాత్రం ఈ అన్యాయాన్ని సహించలేకపోతాడు. అతను బ్రూటస్ ఇంటి నుండి లిడియాను తీసుకువస్తాడు. ఆమెను చంపాలని అనుకుంటాడు. కాని ఎజ్రా అతన్ని ఆపుతాడు. అమాయకమైన ఆ బిడ్డను అలా చంపడం అన్యాయమని అంటాడు. అప్పుడే సైనికులు ఆ ఇంటిని చుట్టుముడతారు. ఎజ్రా లిడియాను తీసుకుని మరో ఊరికి పారిపోతాడు. ఆమెకు హనా అన్న పేరు పెట్టీ తన కూతురుగా పెంచుకుంటాడు. హనా కూడా ఎజ్రా తన తండ్రే అని నమ్ముతుంది. తాను యహూది కూతురిని అనే అనుకుంటుంది.

రోమ్ చక్రవర్తి తన కోడుకు మార్కస్ వివాహం బ్రూటస్ మేనకోడలు ఆక్టేవియాతో నిర్ణయిస్తాడు. ఆక్టేవియా మార్కస్‌ను చాలా ఇష్టపడుతుంది. కాని మార్కస్ ఆ వివాహం గురించి పెద్దగా ఆలోచించడు. ఒకసారి యహూది బస్తీ నుండి అతను వస్తున్నప్పుడు అతని రథం తిరగబడి అతను గాయపడతాడు. అప్పుడు అక్కడ అతను మొదటిసారి హనాని చూస్తాడు. మొదటి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. తన రాజ్యానికి వెళ్ళినా ఆమెను మర్చిపోలేకపోతాడు. చివరకు తాను ఒక యహూదిగా దుస్తులు ధరించి ఆ బస్తీకి వస్తాడు. తానొక నగల వ్యాపారినని, తన పేరు మొన్షియా అని చెప్పి ఎజ్రాను కలుసుకుని హనాతో పరిచయం పెంచుకుంటాడు. హనా కూడా అతన్ని ప్రేమిస్తుంది. కాని యహూదిల కొత్త సంవత్సరపు ఉత్సవాలలో ప్రార్థన చేసి పంచిన రొట్టెను మొన్షియా పడేయడం చూసి ఆమెకు అనుమానం వస్తుంది. తరచి అడిగినప్పుడూ తాను రోమన్ అని ఒప్పుకుంటాడు మార్కస్. ఈ సంగతి తెలిసి ఎజ్రా కూడా అతన్నితన కూతురి భర్తగా అంగీకరించడు. అతను యహూదిగా మారితే తప్ప ఆ వివాహం జరగదని అంటాడు ఎజ్రా. తన మతం మార్చుకోవడానికి ఒప్పుకోడు మార్కస్. అది తన వ్యక్తిత్వానికి మచ్చ అని తన ప్రేమకు అవమానం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

ఒక రాజకుమారుడిగా, రోమ్ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని తనతో వివాహానికి ఒప్పుకొమ్మని ఆక్టేవియా మార్కస్‌ని ఒప్పిస్తుంది. వారి వివాహ సమయంలో అతిథులుగా అక్కడికి వచ్చిన హనా ఎజ్రాలు మార్కస్‌ను గుర్తు పడతారు. అతను తనను ప్రేమించి మోసం చేసాడని తనకు న్యాయం చేయమని హనా రోమ్ చక్రవర్తిని అడుగుతుంది. వివాహం ఆగిపోతుంది. కాని ఆ రాత్రి ఆక్టేవియా హనాను కలిసి ఆమె తన అభియోగం వెనక్కు తీసుకోకపోతే మార్కస్‌కు మరణ శిక్ష విధిస్తారని చెబుతుంది. హనా మార్కస్‌ను రక్షించడానికి బ్రూటస్‌తో తాను మార్కెస్ విషయంలో పొరపడ్డానని, తనను మోసం చేసింది మరో వ్యక్తి అని చెబుతుంది. తప్పుడు అభియోగం చేసినందుకు బ్రూటస్ ఆమెను ఆమె తండ్రి ఎజ్రాను వేడి నూనెలో వేసి చంపించే శిక్ష విధిస్తాడు. అప్పుడు ఎజ్రా బ్రూటస్‌కి ఆమె అతని కూతురు లిడియా అనే నిజం చెప్పి మరణిస్తాడు. బ్రూటస్ హనాను కూతురుగా దగ్గరకు తీసుకోవాలనుకున్నా హనా అతన్ని తండ్రిగా అంగీకరించదు. ఒంటరిగా వెళ్లిపోతుంది. కాని ఆమెకు పడే శిక్ష తాను చూడకుండా ఉండాలని మార్కస్ తన కళ్ళల్లో విషం పోసుకుని గుడ్డివాడుగా మారతాడు. అతన్ని స్వీకరించి హనా అతనితో కలిసి వెళ్ళిపోవడం సినిమా ముగింపు.

యహూదిలపై రోమన్లు జరిపిన అత్యాచారం, వారిపై చూపిన వివక్ష ఇవన్నీ ఈ కథలో కనిపిస్తాయి. యహూది సినిమాలో షోరబ్ మోడికి రాసిన డైలాగులన్నీ కూడా కవిత్వపు పంక్తులే. ఉర్దూలో ఈ రెండు లేదా నాలుగు వాక్యాల కవితలను షాయరీ అంటారు.

“తుమ్హారె హీ లియె పైదా హుయె దునియా కె నజారె… చమక్తె హై తుమ్హారి రోష్ని సె చాంద్ ఔర్ తారె, తుమ్హారా గమ్ హై గమ్, ఔరొన్ కా గమ్ ఖ్వాబ్ – ఒ- కహాని హై, తుమ్హారా ఖూన్ హై ఖూన్ హమారా ఖూన్ పాని హై”

తమపై వివక్ష చూపుతున్న రోమన్లను చూసి లోకం అంతా మీ కోసమేనా, సూర్య చంద్రుల వెలుగు మీకేనా. మీ బాధ బాధ, మావి కథలా.. మీ రక్తం రక్తమయితే మాది నీరా అని షోరాబ్ కోపంతో ప్రశ్నిస్తాడు బ్రూటస్‌ని.

“నా చేడ్ అబ్ ముఝ్కో, రెహ్నే దె యహి తక్ దాస్తాన్ మేరి, కహూంగా సచ్ తొ జల్ జాయెగా దిల్ తెరా.. జబాన్ మేరి”

ఇక్కడితో ఆపేసేయ్ నేను నిజాలు చెప్పబోతే తట్టుకోలేరు అంటూ బ్రూటస్‌ని అతను వెక్కిరించడంలో ఎజ్రా ఆత్మగౌరవం కనిపిస్తుంది.

“డూబ్ మరో ఇస్ ఇన్సాఫ్ పర్, ఆంసు బహావొ ఇస్ కానూన్ పర్, జొ కమ్జోరో కె లియె తల్వార్ కి ధార్, ఔర్ జబర్దస్త్ కె లియె బాగ్- ఎ- బహార్ హై, జొ అప్నె లియె నగ్మె-ఎ-సాజ్, ఔర్ హమారి లియె మౌత్ కి ఆవాఝ్ హై”—— రోమన్ న్యాయాన్ని నమ్మలేక అందులోని మోసాన్ని బయట పెడుతూ ఎజ్రా ఆవేశంతో పలికే మాటలు అవి.

ప్రేమలో పడ్డ ప్రేమికుడిగా మార్కస్ మొదటి సారి హనాని చూసి పరవశంతో చెప్పే మాట ఇది..

“తారీఫ్ ఉస్ ఖుదా కి జిస్నె జహాన్ బనాయా… ఉన్కొ హసీన్ బనాకర్ ముఝ్కో జవాన్ బనాయా”

ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవున్ని మెచ్చుకోవాలి, ఆమెను అందంగా తయారు చేసి నాకు యవ్వనాన్ని ఇచ్చినందుకు అనే అర్థంతో దిలీప్ కుమార్ గొంతులో పలికిన ఈ షేర్ విని పులకించి పోని ప్రియులు ఉండరు.

మరో చోట షోరాబ్ మోడి గొంతులో పలికే షేర్ ఇది…..

“ఐ ఖుదా తూ జిస్ హాల్ మె రఖెగా ఖుష్ రహెంగె, తెరి ఖుషి మె ఖుష్ తెరా ఖిద్మత్ గుజర్ హై, బందా హూ తెరా తు మెరా పర్వదిగార్ హై” —- నువ్వెలా ఉంచినా ఏ స్థితిలో ఉంచినా అది నేను మౌనంగా స్వీకరిస్తాను అంటూ భగవంతుని పై తన నమ్మకాన్ని ప్రదర్శిస్తాడు ఎజ్రా.. మరో చోట అతనే అంటాడు “నికల్ చల్నే కి యె హస్రత్ బడి ముష్కిల్ సె నికలెగీ – కలెజా చీర్ దెగి బద్దువా జొ దిల్ సె నికలెగీ”…. నా మనసు నుండి వచ్చే శాపం మనసును గాయపరుస్తుంది అని చెప్పుకుంటాడు. తన కూతురు హనా తన మాటను గౌరవించక ఒక రోమన్  వెనుక వెళ్ళాలనుకోవడం చూసినప్పుడు గాయపడిన తండ్రి మనసు ఇలా కవిత రూపంలో వస్తుంది.

“జిసె పాలా థా ఖూన్ – ఎ –దిల్ సె జార్ ఔర్ నథవాన్ హోకర్, ఖబర్ క్యా థి వొహి దెగీ దగా ఇక్ దిన్ జవాన్ హోకర్”

గుండెపై పెట్టుకుని పెంచిన పిల్ల యువతిగా మారి ఆ గుండెనే కోస్తుందే అన్న అతని మాట లోని వేదన హనా తట్టుకోలేకపోతుంది. తండ్రి చేయి పట్టుకుని మార్కస్‌కు దూరం అవుతుంది.

ఈ సినిమాకు ప్రాణం ఈ సంభాషణలే…. అందుకే ఇది నాటకంగా అంత గొప్ప పేరు తెచ్చుకుంది. యహూది సినిమాలో షొరాబ్ మోడి ఈ షేర్లు పాత్రలో లీనమయి చెబుతున్నప్పుడూ ఉర్దూ భాష ప్రేమలో పడిపోతాం. ఎంత తీయని భాష అది, అందులో సాహిత్యం ఎంత గొప్పగా ఉంటుందో, కవిత్వంలో ఎంత అందం ఉందో అనుభవిస్తాం.

ఈ సినిమాకు స్క్రీన్ ప్లే నబేందు ఘోష్ రాసారు. ఇక మాటలను వాజాహత్ మిర్జా రాసారు. దిలీప్ కుమార్ నటించిన చాలా సినిమాలకు ఈయన డైలాగులు రాసారు. శంకర్ జైకిషన్ సంగీతం అందిస్తే, పాటలు శైలేంద్ర రాసారు. ఇందులో వచ్చే “యె మెరా దీవానాపన్ హై” అన్న ముఖేష్ పాట హిందీ పాటలలో ఒక గొప్ప పాటగా ఈ రోజుకీ వినిపిస్తూ ఉంటుంది. యే మేరా దీవానాపన్ హై పాట ముకేష్ పాడటం వెనుక ఒక కథ వుంది. దిలీప్ కుమార్ ప్రధానంగా తలత్ మహమూద్ స్వరాన్ని ఇష్టపడతాడు. కానీ, ఈ సినిమాలో ఈపాటను పాడేందుకు శంకర్ జైకిషన్ , ముకేష్ ను ఎంచుకున్నారు. అప్పుడు ముకేష్ హీరో అవ్వాలని ప్రయత్నించి, భంగపడి సినిమాలు లేని పరిస్థితిలో ఇక నటన పేరెత్తనని ఒట్టువేసుకుని మళ్ళీ పాడే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాడు. దాంతో అతనికి పాడే అవకాశం ఇవ్వాలని శంకర్ జైకిషన్‌లు నిశ్చయించారు. కానీ, దిలీప్ కుమార్ ఒప్పుకోలేదు. అందాజ్, మేలా కాలమ్నుంచీ దిలీప్ కుమార్ ముకేష్ స్వరాన్ని మెచ్చలేదు. అందాజ్ సమయంలో మహబూబ్ ఖాన్ పై అలిగేడుకూడా, పాటలన్నీ ముకేష్‌తో పాడించినందుకు. యహుదీ కాలానికి దిలీప్ కుమార్ సూపర్ స్టార్. అయితే, శంకర్ జైకిషన్ తమ పట్టువిడవలేదు. చివరికి, పాట రికార్డ్ చేసి వినిపిస్తే, నచ్చకపోతే అప్పుడు తలత్ స్వరంలో మళ్ళీ రికార్డ్ చేయాలని ఒప్పందం జరిగింది. శంకర్  జైకిషన్ పాటను ముకేష్ స్వరంలో రికార్డ్ చేశారు. దిలీప్ కుమార్ విన్నాడు. పాట వింటూంటే అతని కళ్ళు తడి అయ్యాయి. పాట ముకేష్ కు రెండవ జీవన ప్రదానం చేసింది. దీని తరువాత మదుమతిలో సుహానా సఫర్ పాటతో ముకేష్ నిలద్రొక్కుకున్నాడు. అంటే, ముకేష్ రెండవ ఇన్నింగ్స్ లో నిలద్రొక్కుకోవటానికి దిలీప్ కుమార్ రెండు సినిమాలు దోహదం చేశాయన్నమాట. కానీ, ఈ సినిమా తరువాత శంకర్ జైకిషన్ మరో దిలీప్ కుమార్ సినిమాకి సంగీతం ఇవ్వలేదు.  సినిమాలో మొత్తం ఏడు పాటలుంటాయి. “ఆంసూ కీ ఆగ్ లెకె తెరి యాద్ ఆయి” అన్న పాటను హస్రత్ జైపురి రాసారు. మిగతా పాటలన్ని శైలేంద్ర రాసారు. ఎజ్రాగా సోహ్రాబ్ మోడి, మార్కస్‌గా దిలీప్ కుమార్, బ్రూటస్‌గా నాజర్ హుసేన్, ఆక్టేవియాగా నిగర్ సుల్తాగా, హానాగా మీనా కుమారి గొప్పగా నటించారు. ఈ సినిమాలో రోమన్‌గా విభిన్నమైన హెయిర్ స్టైల్‌తో కనపిస్తారు దిలీప్ కుమార్. దిలీప్ కుమార్, నాజిర్ హుసేన్‌ల మధ్య జరిగే సంభాషణలో ఆ ఇద్దరి నటుల విశ్వరూపం కనిపిస్తుంది. ఇది దిలీప్ కుమార్ సినిమాగా చూసినా మర్చిపోలేని నటనను వాచకాన్ని షోరాబ్ మోడిలో చూస్తాం. ఈ సినిమాకు శైలేంద్రకు ఫిలింఫేర్ అవార్డు లభించింది. అది “యే మెరా దీవానాపన్ హై” పాటకు రావడం గమనించవలసిన విషయం. హిందీ సినిమాలలో ఒక క్లాసిక్‌గా నిలిచిపోయిన సినిమా ‘యహూది’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here