ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 27 – జోగన్

2
2

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్, నర్గిస్‌లు అసాధారణమైన నటనను ప్రదర్శించిన ‘జోగన్’

దిలీప్ కుమార్ సినిమాలలో చాలా తక్కువ చర్చకు వచ్చేది ‘జోగన్’. ఈ సినిమా 1950లో కిదార్ నాథ్ శర్మ దర్శకత్వంలో వచ్చింది. మధుబాల, గీతా బాలి, రాజ్ కపూర్, భరత్ భూషణ్, తనూజ, మాలా సిన్హా లను నటులుగా సినిమా ప్రపంచానికి పరిచయం చేసిన కిదార్ శర్మ ఎన్నో మంచి చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలకు కథలు మాటలు కూడా రాసారు. హిందీ సిని ప్రపంచ చరిత్రలో చాలా గౌరవాన్ని సంపాదించుకున్న సినీ దిగ్గజం ఆయన. వీరి దర్శకత్వంలో వచ్చిన జోగన్ నర్గిస్ లోని నట విశ్వరూపాన్ని సినీ ప్రపంచానికి మొదటిసారి చూపిన సినిమా. ‘జోగన్’ సినిమాలో దిలీప్ కుమార్ నర్గిస్ ఇద్దరూ కూడా ఎంత గొప్పగా నటించారంటే. ఆ పాత్రలని మరెవ్వరూ అలా పోషించలేరు అని ఖచ్చితంగా చెప్పగలం.

ఒక గుడిలో భక్తి పాటలు పాడుతూ ప్రజలను భక్తి మార్గం వైపుకు తీసుకురావడమే జీవిత ధ్యేయంగా బ్రతుకుతున్న ఒక సన్యాసినిని మొదటి చూపులో ప్రేమిస్తాడు విజయ్. మీరా దేవి పేరుతో సంసార బంధాలకు దూరంగా జీవించే ఆమె తమ ఊరి గుడిలో పాడుతున్నప్పుడు మొదటిసారి ఆమె గొంతు విని ఆకర్షితుడవుతాడు విజయ్. విజయ్ నాస్తికుడు. తమ ఊరిలో స్థిరాస్తి అమ్మాలని వస్తాడు. కాని గుడిలో మీరా దేవిని చూసిన క్షణమే అతనిలో అలజడి మొదలవుతుంది. ఆస్తి అమ్మడం మాని ఆమె కోసం ఆ ఊరిలో ఉండిపోతాడు విజయ్. ఆమెను చూడాలని, ఆమె పాట వినాలని గుడి బైట ప్రతిరోజు నిలబడడం మొదలెడతాడు విజయ్. మీరా దేవి కూడా అతన్ని చూస్తుంది. ఆమెకు తెలీయకుండానే ఆమె మనసు అతని పట్ల ఆకర్షణతో నిండిపోతుంది. మొదటిసారి గుడి బైట అతన్ని చూసి మధ్యాహ్న వేళలో మగవారు అటు రాకూడదని  మందలిస్తుంది. కాని విజయ్ నిజాయితీగా ఆమె కోసమే తాను గుడి బైట ఉంటున్నానని చెబుతాడు. విజయ్‌కి మీరా దేవిని అల్లరి పెట్టాలనో ఆమెను రాక్షసంగా పొందాలనో ఉండదు. ఆమెను చూడగానే అతని మనసు పలికే వేదన అతనికే ఆశ్చర్యం కలిగిస్తుంది. మీరా దేవి అతన్ని అక్కడకు రావద్దని చెప్పినప్పుడు, ఆమెకు ఇబ్బంది కలగకూడదని అతను సరే అంటాడు. కాని ఆమె పాటలు వినకుండా, ఆమెను చూడకుండా ఉండలేకపోతాడు.

ప్రతి రోజు ఆమె ఇంటి గుమ్మంలో ఒక గులాబి పువ్వును ఉంచడం అతని దినచర్య అవుతుంది. ఆమెకు ఆరోగ్యం బావోలేదని తెలిసి వదినను వైద్యుడి దగ్గరకు పంపిస్తాడు. ఆమెకు కనపడకుండా ఆమె గురించి ఆలోచిస్తూ ఆమె సౌకర్యాల గురించి ఆరా తీస్తూ ఉంటాడు. ఒక రోజు నది ఒడ్డున మీరా అతన్ని అనుకోకుండా కలుస్తుంది. అతనితో మొదటిసారి మాట్లాడుతూ అతని రాకతో తనలో కూడా అలజడి మొదలయ్యిందని అలా జరగకూడదని, అది తప్పని తనలో అపరాధ భావం పెరిగిపోతుందని, అతనితో తనలోని బాధను చెప్పుకుంటుంది. ప్రతి రోజు అతనెందుకు తన గుమ్మంలో పూలు ఉంచుతున్నాడో చెప్పమని అడుగుతుంది. విజయ్ ఆమెను ఇంత చిన్న వయసులో సన్యాసినిగా ఎందుకు మారవలసి వచ్చిందని, ఆమె కళ్ళలో గూడు కట్టుకున్న విషాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పమని అడుగుతాడు. తన మనసును అతను కేవలం తనను చూసి ఎలా కనిపెట్టగలుగుతునాడో మీరాకు అర్థం కాదు. కాని అతని సాంగత్యం లోని ఆనందాన్ని ఆమె మనసు తెలుపుతూనే ఉంటుంది. ఇది ఆమెను చాలా భయానికి గురి చేస్తుంది. అతనితో మాట్లాడాలని తనకు అనునిత్యం, ఎందుకు అనిపిస్తూ ఉంటుందో ఆమెకే అర్థం కాని పరిస్థితిలో పడిపోతుంది. అతను అడిగాడని తన గతాన్ని అతనికి వినిపిస్తుంది.

ఒక భూస్వామి కూతురు సురభి. తండ్రి అప్పుల్లో మునిగిపోతే అన్న తాగుబోతయ్యి తిరుగుతుంటాడు. సురభికి జీవితంలో సంతోషం ఇచ్చేవి సంగీతం, కవిత్వం. వాటిని ఆస్వాదిస్తూ తాను సృష్టించుకున్న కలల ప్రపంచంలో వాస్తవ నిజ జీవితాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది సురభి. అప్పు కట్టలేక తండ్రి నిస్సహాయుడయినప్పుడు ఆమె అన్న ఆమె వివాహం ఒక ముసలి వ్యక్తితో ఖాయం చేస్తాడు. తండ్రి ఆమెను రక్షించే స్థితిలో లేకపోవడం చూసి ఆమె ఇల్లు వదిలి సన్యాసినుల ఆశ్రమానికి వస్తుంది. అక్కడ అమ్మగా పిలవబడే నిర్వాహకురాలు సురభిని దీక్షలోకి తీసుకుంటుంది. ఈ మార్గం చాలా కష్టమని ఆమె తట్టుకోలేదని చెప్పినా, జీవితంపై ఆశ తనకు లేదని భగవంతుని సేవలోనే తన రోజులు గడుపుతానని సురభి దీక్ష తీసుకుంటుంది. అక్కడే మీరా దేవిగా మారుతుంది.

హాయిగా సాగుతున్న ఆమె జీవితంలో విజయ్ ఆగమనం తుఫాను రేపుతుంది. విజయ్ ఆమెను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని ఎంత ప్రయత్నించి ఆమెకు దూరంగా ఉన్నా అతని సాంగత్యాన్ని కోరుకునే మనసుని అమె నియంత్రించుకోలేక పోతుంది. చంపుకున్నానని ఆమె భావించిన కోరికలు విజయ్ రాకతో ఆమెలో కల్లోలం సృష్టించడం మొదలెడతాయి. మనసు ఆశాంతిగా గందరగోళంగా తయారవుతుంది. దాన్ని తప్పించుకోవడానికి ఆమె ఆ ఊరు  వదిలి మఠానికి తిరిగి వెళ్ళిపోతుంది. కాని అక్కడా ప్రశాంతత లభించదు. కఠినమైన సాధన చేస్తూ శరీరాన్ని శుష్కింపజేసుకుంటుంది. ఆ పరిస్థితులలోనే ఆమె మరణిస్తుంది. ఆమె మరణం తరువాత ఆమె తన మనసులోని బాధను రాసుకున్న ఒక పుస్తకాన్ని ఆమె స్నేహితురాలు, తోటి సన్యాసిని విజయ్‌ని వెతుక్కుంటూ ఆ ఊరు వచ్చి విజయ్‌కి ఇస్తుంది.

ఈ సినిమాను చూస్తున్నంత సేపు విజయ్, మీరా పాత్రలలోని బాధ మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఇందులో ఎక్కడ కూడా ఎవరి మార్గం ఒప్పు, ఎవరిది తప్పు అన్న వాదన కనిపించదు. స్త్రీ ఆకర్షణ విజయ్‌కి కొత్త కాదు. అతని స్నేహితుని ప్రోద్బలంతో ఒక నాట్యగత్తెకు దగ్గర అవుతాడు విజయ్. అమె సాంగత్యాన్ని కోరుతున్న మిత్రుని లోని ఆకలిని తాను గుర్తించానని విజయ్ మిత్రుడు అన్నప్పుడు స్త్రీ పురుషుల మధ్య ఒక్క శారీరిక ఆకలే కాదు ఒక బంధం కోసం వెతుకులాట కూడా ఉంటుందని జవాబిస్తాడు విజయ్. ఈ సంఘటన అతనిలోని ప్రేమ భావనను సూచిస్తుంది. అక్కడే ఆ నాట్యగత్తె ఇంటికి వచ్చిన సన్యాసి విజయ్‌ను చూసి అతనిలోని నాస్తికత్వాన్ని ఒక అన్వేషణగా గుర్తించి దాన్ని కూడా తాను గౌరవిస్తున్నానని చెప్పి విజయ్ లోని ఆలోచనను పెంచుతాడు. ఆస్తికులు, నాస్తికులు కూడా తమ జీవితం అంతా ఒక అన్వేషణలోనే గడుపుతారని, అందరి అన్వేషణ సత్యం అనే భగవంతుని కోసమే అని, కొందరు తనలా పేదవారిలో భగవంతున్ని చూస్తే, విజయ్ ఒక నాట్యగత్తెలో భగవంతున్ని చూస్తున్నాడు తప్ప అతను వెళుతున్న మార్గం విమర్శించవలసినది కాదని ఆ సన్యాసి చెబుతాడు. మార్గాలు వేరయినా ఎవరి అన్వేషణ లోని లోతు వారిదే అని ఒకోసారి ఆస్తికుడు నాస్తికుడు కూడా వారు నడిచే మార్గాలలో కలిసే అవకాశం ఉంటుందని చెప్తాడు. విబిన్నమైన భావజాలాలతో జీవన ప్రయాణం సాగిస్తున్న వారందరూ ఒకరి పట్ల మరొకరు గౌరవ భావాన్ని ప్రదర్శించడం ఈ సినిమాలో కనిపించే గొప్ప విషయం.

దేవున్ని అస్సలు నమ్మని విజయ్ మీరా దేవి లోని భక్తి భావాన్ని, ఆమె నమ్మకాలను, ఆమె జీవన మార్గాన్ని గౌరవిస్తాడు. ఆమె ఉనికి అతనిలో ఎన్నో కోరికలు రేపినా తన వల్ల ఆమె వెళ్తున్న మార్గంలో ఇబ్బంది కలగకూడదని ఆమెకు దూరంగా ఉండిపోతాడు విజయ్. విజయ్ మీరా దేవి మాట్లాడుకుంటున్నప్పుడూ వారికి ఒకరిపై ఒకరికున్న కోరిక కన్నా వారికి ఒకరి పట్ల మరొకరికి ఉన్న గౌరవాన్ని చూపిస్తారు దర్శకులు. కేవలం కళ్ళతో తమలోని బాధను వ్యక్తీకరిస్తూ, ఈ ఇద్దరు నటులు కూడా ఈ సినిమాకు గొప్ప న్యాయం చేసారు. నర్గిస్‌కు కూడా తాను నటించిన సినిమాలన్నిటిలో కూడా ‘జోగన్’ అంటే చాలా ఇష్టం అట. ఈ పాత్రను ఆవిడ చాలా నిజాయితీగా చేసారని అర్థం అవుతుంది సినిమా చూస్తే. విజయ్‌కు దగ్గరగా వచ్చినప్పుడు ఆమె మనసు అతని సాంగత్యాన్ని కోరడం, ఆమె బుద్ధి అది తప్పని చెప్పడం ఈ రెంటి మధ్య నలిగిపోతున్నప్పుడు ఆమె పడుతున్న వ్యథను తన ముఖంలో అద్భుతంగా పలికించారు ఆవిడ. అలాగే ఆమెను అమితంగా గౌరవిస్తూ ఆమెతో ఆ క్షణ కాల సాంగత్యాన్ని ఆస్వాదిస్తూ, తన మనసును మౌనంగా ఆమెకు తెలుపుతూ తన ప్రేమలోని బాధను వేదనను వ్యక్తీకరిస్తునప్పుడు దిలీప్ కుమార్ ముఖంలో కదలాడే భావాలు, అతని గొంతులోని ఆ అసహాయత దుఖం, వింటే అతన్ని సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు.

మనిషికి ప్రశాంతత తన లోపల్నించే రావాలి అన్నది నిజం. దానికోసం ఎంతో కష్టపడుతుంది మీరా. కాని ప్రేమను కోరుకుంటున్న మనసును సర్ది చెప్పుకోవడం అదీ ప్రేమ వాకిట్లోకి వచ్చి నిలిచినప్పుడు ఎంత కష్టమవుతుందో జోగన్ పాత్ర చెబుతుంది. ఆమె అవలంబించే మార్గాలన్నీ అసఫలం అయి చివరకు ఆ బాధ తట్టుకోలేక ఆ శరీరం కూలిపోవడం వరకు ఆమె పడే బాధను నర్గిస్ పలికించిన తీరు చూస్తే సహజ నటనకు అర్థం తెలుస్తుంది. మీరా దేవి ఊరు వదిలి వెళ్ళిపోయాక ఒక వర్షపు రాత్రి గుడి బయట ఆమె జ్ఞాపకాలతో సంచరించే విజయ్‌ని లోపలి గదిలోకొచ్చి విశ్రాంతి తీసుకోమని పూజారి చెబుతాడు. ఆ గదిలో మీరా దేవి కొన్ని రోజులు గడుపుతుంది. ఆ గదిలో ఆమె నిదురించే బల్ల వద్ద నిస్సహాయంగా కూలిపోతాడు విజయ్. మీరా దేవి పడుకున్న చోట తాను పడుకోలేక, ఆ బల్ల క్రింద కూర్చుని అతను కుమిలిపోవడం చూస్తే మీరా దేవి పట్ల అతనికున్న భావన అర్థం అవుతుంది. ఈ సీన్‌లో దిలీప్ కుమార్ బాడీ లాంగ్వేజ్‌ని గమనించాలి. కెమారాకి వీపు చూపిస్తూ అతని నడకలో నిస్సహాయతను అతను అభినయించిన తీరు గమనించాలి.

సినిమాలో మొత్తం పదిహేను పాటలుంటాయి. పన్నెండు పాటలు గీతా దత్ పాడారు. అన్నీ కూడా భజన్ రూపంలో ఉంటాయి. ఐదు మీరా భజన్ల మధ్య ఈ భక్తి విషాద రస గీతాలు మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తాయి. రెండు పాటలు షంషాద్ బేగం పాడితే ఒకటి తలత్ మహమూద్ పాడారు. జోగన్ అపురూపమైన ప్రేమ కథ. మనసుపై నియంత్రణ సాగించే సమాజం, సమాజం నిర్దేశించిన విలువలపై మనసు సాగించే పోరాటం, వీటి మధ్య నలిగిపోయే మానవ జీవితాలను చూపించిన విషాద ప్రేమ కథ ఇది. సినిమా చాలా భాగం క్లోజ్ అప్ షాట్లతో నడుస్తుంది. ఇప్పటి పాకిస్తాన్ లోని హైదరాబాద్‌లో పుట్టిన బులో చందీరామ్ రామ్ చందాని ఈ సినిమాకు సంగీతం అందించారు. డెబ్బైకు పైగా సినిమాలకు సంగీతం అందించిన వీరు చివరలో పని ఇచ్చేవారు లేక, పట్టించుకునేవారు లేక అశాంతితో 73 ఏళ్ల వయసులో 1993లో ముంబయ్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.

సంగీత పరంగా కాని, కథా పరంగా కాని, నటనా పరంగా కాని జోగన్ ఒక క్లాసిక్. చాలా మంది మర్చిపోయిన ఈ సినిమా దిలీప్ కుమార్, నర్గిస్ ఇద్దరు కూడా గొప్పగా నటించిన చిత్రం. నటనను స్టడి చేసే నేటి తరానికి ఎంతో ఉపయోగ పడే సినిమా ఇది. చాలా ఫిలసాఫికల్ ఇంటెన్సిటి ఈ సినిమా కథలోనూ, సంభాషణాలలోనూ కనిపిస్తుంది. తక్కువ సంభాషణల మధ్య కేవలం వారి ముఖకవళికలతో ఆ నటులిద్దరూ ఈ సినిమాను నడిపించారు. ఇలాంటి పాత్రలు అందరూ చేయలేరు. ఇది ఆ ఇద్దరు మహానటులకే సాధ్యం. ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం, తరువాతి తరంలో రొమాంటిక్ హీరో గా పేరు తెచ్చుకున్న రాజేంద్రకుమార్‌కి ఇది మొదటి సినిమా. దిలీప్ కుమార్ స్నేహితుడిగా ఒక చిన్న పాత్రతో ఈ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసారు రాజేంద్ర కుమార్. ఇందులో బాల నటిగా తబస్సుమ్ అలరిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here