ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 28 – ఆర్జూ

0
2

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్ తనకు అత్యంత ఇష్టమైన హెత్‌క్లిఫ్ పాత్రను తెరపై మొదటిసారి చేసిన సినిమా ‘ఆర్జూ’

[dropcap]ఎ[/dropcap]మిలి బ్రాంటీ ఇంగ్లీషులో రాసిన ఏకైక నవల వుథరింగ్ హైట్స్. ఈ నవల లోని కథనే ఆధారంగా తీసుకుని దిలీప్ కుమార్‌నే హీరోగా పెట్టి మూడు సినిమాలు తీసారు హిందీ సినీ దర్శకులు. 1950లో ఈ కథతో ‘ఆర్జూ’ అనే సినిమా వచ్చింది, 1951లో ‘హల్‌చల్’ అని ఎస్.కే. ఒఝా దిలీప్ కుమార్ నర్గీస్‌లతో ఇదే కథను సినిమాగా తీస్తే, 1966లో దిలీప్ కుమార్, వహిదా రెహమాన్ లతో ‘దిల్ దియా దర్ద్ లియా’ అనే పేరుతో మరో సినిమా వచ్చింది. ఈ మూడు సినిమాలలో కూడా దిలీప్ కుమార్ వుథరింగ్ హైట్స్ లోని హెత్‌క్లిఫ్ పాత్రను పోలిన పాత్రలను ధరించారు. తాను ప్రేమించిన అమ్మాయి మరో వివాహం చేసుకుందని తెలిసి తనలోని కోపాన్ని ఆమెపై ప్రదర్శించే ఆ పాత్రను దిలీప్ కుమార్ ఓన్ చేసుకున్నారు. మూడు సినిమాలలో కథ కొద్దిగా మారినా పాత్ర పరంగా అవి హెత్‌క్లిప్‌కి దగ్గరగా చిత్రించిన పాత్రలే. అయితే ఆ మూడు పాత్రలల స్వభావంలో తేడా ఉండేలా, ప్రతి పాత్రకి ఒక సొంత వ్యక్తిత్వం ఉండేలా జాగ్రత్తపడ్డారు దిలీప్ కుమార్. హల్‌చల్‌లో ప్రేయసి మరొకరి భార్య అని తెలిసి ఆ షాక్‌తో అతను చనిపోతే ఆర్జూలో ఆమెను బాధపెట్టడానికి ఆమె ఆడపడుచుతో ప్రేమ నటించి చివరకు ఆమె మరణానికి కొంత వరకు కారణమయ్యే పాత్ర దిలీప్ కుమార్‌ది.

ఆర్జూ సినిమాకి కథ, మాటలు అందించింది ప్రఖ్యాత ఉర్దూ రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్. దర్శకత్వం వహించింది ఆమె భర్త షాహిద్ లతీఫ్. ఇది వారికి రెండవ సినిమా. 1950లో వచ్చిన ఈ సినిమా కంటే ముందు 1948లో వీరు ‘జిద్దీ’ అనే సినిమా తీసారు. దేవానంద్ సినీ జీవితం ఈ సినిమా తోనే మొదలయ్యింది. ఆర్జు సినిమాలో దిలీప్ కుమార్‌కి జోడీగా కామిని కౌషల్ నటించింది. బాదల్, కామిని ఇద్దరూ కూడా చిన్నప్పటి నుండి స్నేహితులు. ఒకరంటే మరొకరికి చాలా ఇష్టం. బాదల్ తన అన్న వదినలతో కలిసి ఉంటున్నాడు. కామిని తల్లి తండ్రులు ఆమె బాదల్‌తో చనువుగా ఉండడం ఇష్టపడరు. కామినిని అదే ఊరిలో మరో వ్యక్తి ప్రేమిస్తాడు. ఆమె వెంట పడతాడు. కాని కామిని బాదల్‌ల స్నేహాన్ని గమనించి అతను తనను ప్రేమించిన మరో స్త్రీని పెళ్ళి చేసుకుంటారు. ఆ ఊరిలో అందరికీ వీరి స్నేహం గురించి తెలుసు. కామిని తండ్రి మాత్రం ఏ పనీ చేయకుండా అల్లరిగా తిరిగే బాదల్‌కు తన కూతురినిచ్చి వివాహం చేయడానికి ఇష్టపడడు. అదే ఊరిలో ఠాకుర్ కామినిని చూసి ఇష్టపడతాడు. అతనికొక చెల్లెలు ఉంటుంది. ఠాకుర్ వ్యక్తిగా చాలా మంచివాడు. అతను కూతురిని ఇష్టపడుతున్నాడని కామిని తండ్రికి తెలుస్తుంది. తన కూతురికి అతనే తగిన వరుడని అతను నమ్ముతాడు.

బాదల్ అల్లరిగా తిరుగుతూ ఉండడం వలన తమ పెళ్ళి జరగదని అర్థం చేసుకుంటుంది కామిని, అతన్ని పట్నం వెళ్ళి ఉద్యోగం సంపాదించుకుని బాధ్యత గల వ్యక్తిగా మారమని అడుగుతుంది. ఆమె మాటలు విని ఊరు దాటి వెళ్ళినా మళ్ళి కామిని గుర్తుకు వచ్చి మధ్యలోనే తిరిగి వస్తాడు బాదల్. కామిని అతని ఈ చర్యకు బాధపడుతుంది. ఇలా అయితే తాము ఎప్పటికీ ఒకటవ్వలేమని చెబుతుంది. బాదల్ ఆ రాత్రి ఎవరికీ చెప్పకుండా పట్నం వెళ్ళిపోతాడు. అయితే తన గుడిసె బయట చలిలో పడుకున్న ఒక పేదవాడికి తన గుడిసెలో ఆ రాత్రి ఆశ్రయం ఇస్తాడు. ఆ రాత్రి అనుకోకుండా ఆ గుడిసె తగలబడిపోతుంది. అందులో పడుకున్న ఆ పేదవాని శవం మాడి మసై పోతుంది. అందరూ బాదల్ మరణించాడని అనుకుంటారు. కామిని కుప్పకూలిపోతుంది.

ఈ లోపు ఠాకుర్ కామినిని పెళ్ళి చేసుకుంటానని కబురు చేస్తాడు. పట్నం వెళ్ళి సైన్యంలో చేరతాడు బాదల్. కామినికి ఉత్తరం రాస్తాడు. కాని అ ఉత్తరం ఆమెకు చేరనివ్వరు. ఆమె ఠాకుర్‌ని పెళ్ళి చేసుకుంటుంది. కాని బాదల్‌ని మర్చిపోలేకపోతుంది. కామిని ప్రేమ సంగతి ఠాకుర్‌కి తెలుసు, తనను ఆమె మనస్ఫూర్తిగా ప్రేమించట్లేదని కూడా అతనికి తెలుసు. కాని ఆమెపై ఉన్న ప్రేమతో ఓపిగ్గా ఆమె లోని మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అతను. కామిని భర్త మంచితనం చూసి అతన్ని అభిమానిస్తుంది. అతన్ని సుఖపెట్టాలని కోరుకుంటుంది. కాని బాదల్‌పై ఉన్నప్రేమ మరుపుకు రాదు. కాని భర్త పట్ల తన బాధ్యతలను నెరవేర్చడం తన కర్తవ్యం అనుకుని అతనికి నచ్చినట్లుగా జీవించడం అలవాటు చేసుకుంటుంది.

ఈలోగా బాదల్ ఊరికి వస్తాడు. కామిని ఠాకుర్‌ని పెళ్ళి చేసుకుందని అతనికి తెలుస్తుంది. ఆమె ఏ కారణంతో ఆ వివాహం చేసుకుందో అతను తెలుసుకోవాలనుకోడు. ఆమె తనను మోసం చేసిందని, డబ్బు కోసం మరికరి భార్య అయ్యిందని అతను నమ్ముతాడు. ఠాకుర్ భార్యగా ఆమె సుఖపడుతుందని అనుకుని ఆమె ఆడపడుచు కమలతో స్నేహం పెంచుకుని ఆ ఇంటికి వస్తాడు. కామినికు బుద్ది చెప్పడానికి, ఆమెను బాధపెట్టడానికి కమలతో ప్రేమ నటిస్తూ చనువుగా తిరుగుతూ ఉంటాడు. కామిని ప్రేమ కథ తెలిసిని బాదల్‌ని ఎప్పుడు చూడని కారణంగా అతను కామిని పాత స్నేహితుడు అన్నది ఠాకుర్‌కి కమలకు కూడా తెలీదు. ఈ సంగతి వారికి చెప్పలేక, బాదల్ కమలపై చూపే ప్రేమ నిజం కాదని కామిని కమలకు చెబుతుంది. కాని ఆమె తన వదిన తన ప్రేమను, సంతోషాన్ని చూసి అసూయ పడుతుందని అనుకుంటుంది. చివరకు ఒకసారి కమలే బాదల్‌కి తన వదిన ప్రేమ సంగతి చెప్పి ఆ ప్రియుడు అగ్ని ప్రమాదంలో మరణించాడని చెప్పినప్పుడు, బాదల్‌కి కామిని ఏ పరిస్థితులలో ఠాకుర్‌ని వివాహం చేసుకుందో తెలుస్తుంది. ఠాకుర్ కామిని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం చూసి ముందు ఆమెకు మతి చలించిందేమో అనుకుని భయపడతాడు. కాని చివరకు బాదల్ గురించి నిజం తెలిసి అతన్ని చంపడానికి వెళతాడు. బాదల్ పశ్చాత్తాపంతో ఊరు వదిలి వెళుతున్నప్పుడు ఠాకుర్ అతని ఇంటికి వెళతాడు. బాదల్‌ని చంపుతాడని బెదిరి కామిని ఆ ఇద్దరు మధ్యకు వెళుతుంది. ఠాకుర్ పేల్చిన తుపాకి ఆమెను గాయపరుస్తుంది. చనిపోతూ కామిని బాదల్‌తో, తాను అతన్ని మోసం చేయలేదని చెబుతుంది. అలాగే తన భర్తతో తాను తన కర్తవ్యాన్ని నిజాయితీగా నెరవేర్చానని చెబుతూ వారిద్దరి చేతుల్లో మరణిస్తుంది.

ఆర్జూ సినిమాకి సంగీత దర్శకత్వం వహించింది అనిల్ బిస్వాస్. షంశాద్, లత, తలత్, సుధా మల్హోత్రాలతో పాటూ అనిల్ బిస్వాస్ కూడా “హమే మార్ చలా యె ఖాయాల్” అనే ఒక పాట పాడారు. “కహా తక్ హమ్ ఉఠాయే గమ్”, “జానా నా హమ్సే దూర్ ఆంఖో సె దూర్ జాకే” అనే లత పాటల తో పాటు “అయ్ దిల్ ముఝే ఐసే జగహ్ లే చల్ జహా కోయీ న హో” అనే తలత్ మహమూద్ పాటలు చాలా పాపులర్ అయ్యాయి. కమల పాత్రను శశికళ వేసారు. ఆమెపై “మిలా గయే నయన్” అనే ఒక పాట ఉంటుంది. దీన్ని సుధా మల్హోత్రా పాడారు.

ఇంగ్లీషు నవల వుథరింగ్ హైట్స్‌లో మూడు తరాల చరిత్ర ఉంటుంది. ఇందులో హెత్‌క్లిఫ్ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయ్. ఈ నవలలోని కథావస్తువును అధారంగా తీసుకుని ఈ సినిమా మూడు సార్లు తీసేటప్పుడు కూడా ఎక్కడా పూర్తిగా నవలను చూపించడం జరగలేదు. “హల్‌చల్”లో హీరో ప్రియురాలు తన భార్య ఎప్పటికీ కాలేదని తెలుసుకుని ఆ నిజాన్ని జీర్ణించుకోలేక మరణిస్తాడు. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రల బాల్యం నవలలో చిత్రించిన విధంగా ఉంటుంది. కాని ‘ఆర్జు’లో ఆ బాల్యం కనిపించదు. బాదల్, కామినీలు ఇద్దరు కూడా ఒకే రకమైన కుటుంబాల నుండి వచ్చిన వారు. అయితే ఇందులో రెండో సగం మళ్ళీ వుధరింగ్ హైట్స్‌ను పోలి ఉంటుంది. ఈ కథ కామిని మరణంతో ముగుస్తుంది. ఈ రెండు సినిమాలలో కూడా హీరోలో పూర్తి నెగిటివ్ షేడ్ కనిపించదు. హల్‌చల్‌లో గుండె పగిలి మరణించిన ప్రేమికుడు, ఆర్జూలో ప్రేమికురాలి పరిస్థితి అర్థం చేసుకుని పశ్చాత్తాపపడి చివరకు ఆమెను పోగొట్టుకున్న బాదల్‌ని చూస్తాం. ఆర్జులో బాదల్ పాత్ర కన్నా, కామినీ పాత్రపై కొంత ఎక్కువ ఫోకస్ పెట్టారు ఇస్మత్ చుగ్తాయి. స్త్రీ వాద రచయిత్రిగా ఆమె స్త్రీ పక్షంలో కథను చెప్పే ప్రయత్నం చేయడం స్పష్టంగా కనిపిస్తుంది.

ఒక పక్క ప్రేమించిన ప్రియుడు, స్నేహితుడు, మరో పక్క భర్త అనే బాధ్యత, ఈ రెంటి మధ్య నలిగిపోవలసివస్తే స్త్రీ ఎలాంటి వేదనను అనుభవిస్తుందో ఈ పాత్రలో ఆమె చెప్పే ప్రయత్నం చేసారు. అందుకే ఇది స్త్రీ పక్షాన నిలిచిన సినిమా అనిపిస్తుంది. కమలతో ప్రేమ నటిస్తూ కామిని బాధపడుతుంటే కసిగా చిరునవ్వు నవ్వే బాదల్‌పై కోపం వస్తుంది కూడా. కామిని బాధ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. భర్తతో ప్రేమగా ఉంటూ తన గతం గుర్తుకు వచ్చినప్పుడు ఆమె పడే వేదనను హృద్యంగా చిత్రించారు దర్శకులు. చివరలో భర్తను హంతకుడిగా చూడలేక, బాదల్ మరణిస్తాడేమో అన్న భయంతో తాను అడ్డు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటూ, ఆ ఇద్దరి పురుషులు తనకు ముఖ్యమే అని ప్రేమ పట్ల ఉన్నట్లే వివాహం పట్ల కూడా బాధ్యతతోనే తాను ప్రవర్తించానని ఆమె చెప్పుకోవడం ఆ రోజుల్లో ఎవరికీ ఊహకందని ముగింపు. కామిని పాత్రను చాలా జాగ్రత్తగా మలిచారు ఇస్మత్. ఇద్దరు పురుషుల మధ్య, ఆ ఇద్దరి క్షేమం కోరుతూ ఆమె పడుతున్న వేదనను చూపించడంలో తన సంభాషణల ద్వారా పూర్తి న్యాయం చేసారు. అలాగే తన అడపడుచుతో బాదల్ నాటకం ఆడుతున్నాడని, అతను ఎవ్వరినీ ప్రేమించలేడని కామిని చెప్పడంలో అటు ఆడపడుచు జీవితం పాడవకూడదని, ఆమె మనసు కష్టపెట్టుకోకూడదని, బాదల్‌కి కూడా ఈ మోసం ఫలితానివ్వదని ఆమె అర్థం చేసుకుని ఒక మనసున్న మనిషిగా అందరి బాగు కోరుకోవడం కనిపిస్తుంది. అలాగే ఒక నాటక ప్రదర్శనలో తాను మోసం చేసానని బాదల్ అనుకోవడం గమనించి అది తట్టుకోలేక ఆమె లేచి వెళ్ళిపోవడం చూస్తున్నప్పుడు ఆమె మనసులోని సంఘర్షణ ప్రేక్షకులకు అర్థం అవుతుంది.

దిలీప్ కుమార్‌కి చాలా ఇష్టమైన పాత్ర హెత్‌క్లిఫ్ కాబట్టే దాన్నిమూడు సార్లు సినిమాగా మలచినా, ఆ మూడూ సార్లు తానే ఆ పాత్రల్లో నటించడానికి ఆయన వెనుకాడలేదు. అయితే నవలలో చిత్రించిన పూర్తి స్థాయి హెత్‌క్లిఫ్ పాత్ర అప్పటి భారతీయ సమాజానికి అనుకూలంగా ఊండదు కాబట్టే దాన్ని భారతీయ సినీ ప్రేక్షకుల కోసం ఈ మూడూ సినిమాలలో కూడా మార్చుకుంటూ వెళ్ళారు. ఒకే హీరో మూడు సార్లు ఒకే పాత్రను మూడు భిన్నమైన రీతుల్లో నటించడం చాలా అరుదు. తెలుగులో దేవదాసు పాత్ర వేసిన ఏ.ఎన్.ఆర్. ఆ తరువాత అటువంటి షేడ్స్ ఉన్న చాలా పాత్రలు చేసారు. కాని అన్నిపాత్రలు దేవదాసు కథను పోలి ఉండవు. హిందీలో మనోజ్ కుమార్ ఎన్నో దేశభక్తి ప్రధాన పాత్రలతో సినిమాలు తీసారు. అవి అన్నీ కూడా ఒకే పాత్రను పోలి ఉండవు. ఈ పాత్రల లక్షణాలు ఒకేలా ఉన్నా. అన్నీ భిన్నమైన పాత్రలు. ప్రపంచ సాహిత్యం లోని ఒక పాత్రను భారతీయ సినిమాలో ఇలా మూడు సార్లు ధరించింది మాత్రం దిలీప్ కుమారే. కామిని కౌషల్, దిలీప్ కుమార్ ప్రేమించిన మొదటి సహనటి. అయితే ఆమె తన అక్క ఆక్సిడెంట్లో చనిపోతే ఆమె భర్తను, అక్క పిల్లల కోసం వివాహం చేసుకోవలసి రావడంతో ఆమె సోదరుడు ఆర్జూ తరువాత దిలీప్ కుమార్‌తో ఆమెను నటించనివ్వలేదు. అలా ఈ జంట నిజ జీవితంలో, సినీ తెరపై కూడా చివరి సారిగా కలిసి కనిపించిన సినిమా ‘ఆర్జూ’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here