ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 29 – దిల్ దియా దర్ద్ లియా

2
2

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

అత్యద్భుతమైన నటన…. కథగా నిరాశపరిచిన ‘దిల్ దియా దర్ద్ లియా’

[dropcap]ఎ[/dropcap]మిలి బ్రాంటీ ఉథరింగ్ హైట్స్ నవల నేపథ్యంలో తీసిన మరో దిలీప్ కుమార్ సినిమా ‘దిల్ దియా దర్ద్ లియా’. అంతకు ముందు ఇదే కథ అధారంగా వచ్చిన ఆర్జూ, హల్‌చల్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలో హెత్‌క్లిఫ్ పాత్రను ‘శంకర్’ పేరుతో భారతీయం చేస్తూనే చాలా వరకు హెత్‌క్లిఫ్ పాత్రలోని షేడ్స్‌ను ఈ సినిమాలో చూపించే ప్రయత్నం జరిగింది. 1966లో వచ్చిన ఈ సినిమాలో దిలీప్ కుమార్‌కు జంటగా వహిదా రెహమాన్ నటించారు. ఈ సినిమాకి నౌషాద్ సంగీతం వన్నెలద్దింది. ఈ సినిమా సమయానికి దిలీప్ కుమార్ దర్శకుల పనిలో జోక్యం చేసుకోవడం కనిపిస్తుంది. చాలా భాగాలకి ఆయనే దర్శకత్వం వహించారు అని కొందరు చెప్తారు. అందుకే దర్శకులుగా అబ్దుల్ రషీద్ కర్దార్ మాత్రమే స్క్రీన్‌పై కనిపించినా అన్ని మాధ్యమాలలో దిలీప్ కుమార్ పేరుని ఈ సినిమా దర్శకుడిగా చేర్చడం చూస్తాం. ‘దిల్ దియా దర్ద్ లియా’లో మంచి పాటలున్నాయి. అందరూ నటులు గొప్పగా నటించారు కాని సినిమాగా దీన్ని చూస్తే చాలా లోపాలు కుడా కనిపిస్తాయి. ఇది కమర్షియల్‌గా కూడా హిట్ కాలేదు. సినిమా సరిగ్గా రాలేదని దర్శకులు నిరాశ వ్యక్తపరిచారు. అయితే ఈ కథ ఆధారంగానే 1983లో ‘దెహలీజ్’ అనే ఒక పాకిస్థానీ చిత్రం నిర్మించారు. తరువాత దెహ్లీజ్‌ని ఆధారం చేసుకుని 1985లో ‘ఊంచే లోగ్’ అనే హింది సినిమా రాజేష్ ఖన్నా, సల్మా ఆఘా లతో తీసారు.

‘దిల్ దియా దర్ద్ లియా’లో దిలీప్ కుమార్ పాత్ర వరకూ చాలా గొప్పగా ఫ్రేం చేసారు. అతనికి రాసిన సంభాషణలు, వాటిని దిలీప్ కుమార్ పలికించిన తీరు కూడా అద్బుతంగా ఉంటుంది. వీటికి తోడు షకీల్ బదాయినీ రాసిన పాటలకు నౌషాద్ సంగీతం అద్భుతాలు పలికించింది. “కోయీ సాగర్ దిల్ కొ బెహలాతా నహీ”, “గుజరే హై ఆజ్ ఇష్క్ మే హమ్ ఉస్ ముకామ్ సే” అన్న రెండు పాటలు వేరెవ్వరు అలా పాడలేరన్నంత గొప్పగా ఆలపించారు రఫీ. ఈ రెండు పాటలలో దిలీప్ కుమార్ అభినయం కుడా ఉత్తమ స్థాయిలో ఉంటుంది.

కథకు వస్తే ఒక రాజకుటుంబంలో యువరాజు తండ్రిని కలవడానికి సముద్రంలో కుటుంబంతో ప్రయాణం చేస్తున్నాడు. దారిలో తుఫానులో పడవ చిక్కుకుని యువరాజు, అతని భార్య మరణిస్తారు. కాని వారి చిన్న బిడ్డ మాత్రం ఒడ్డుకు కొట్టుకుని వస్తాడు. అతని మెడలో ఒక రాజ ముద్రిక ఉన్న హారం ఉంటుంది. ఈ బిడ్డ మరో రాజ కుటుంబానికి దొరుకుతాడు. అక్కడి రాజా వారు శంకర్ అని ఈ పిల్లవానికి పేరు పెట్టి తన బిడ్డలు రమేష్, రూపలతో సమానంగా పెంచుతాడు, చిన్నప్పటి నుండి రమేష్‌కు శంకర్ అంటే అసహ్యం, తండ్రి మరణించిన తరువాత శంకర్ ఆ ఇంటి నౌకరు అవుతాడు. రమేశ్ చేతిలో ఘోరమైన అవమానాలు పొందుతూ ఆ ఇంట్లో రూప కోసం ఉంటాడు శంకర్. రూప అతన్ని ప్రేమిస్తుంది. ఆ కుటుంబానికి దగ్గరయిన మరో రాజకుటుంబంలో సతీశ్, మాలలు అన్నా చెల్లెల్లు. సతీశ్ రూపను ప్రేమిస్తాడు. ఆమెను తాను వివాహం చేసుకోదలిచినట్లు కూడా చెబుతాడు. కాని రూప అతన్ని తిరస్కరిస్తుంది. ఒక రోజు రమేశ్ చేతిలో అందరి ముందు అవమానం పాలైన శంకర్ రమేశ్‌పై తిరగబడతాడు. రూప శంకర్‌ను ప్రేమిస్తుందని అప్పుడే తెలుసుకున్న రమేశ్ దుండగులతో శంకర్‌ను ముట్టడించి అతన్ని కొండ మీద నుండి నదిలోకి తోసివేస్తాడు. శంకర్ చనిపోయాడని అందరూ అనుకుంటారు.

రమేశ్ తారా బాయి అనే ఒక నాట్యగత్తె మోజులో ఉంటాడు. ఆస్తి అంతా హరించుకుపోతూ ఉంటుంది. శంకర్ చనిపోయిన దుఖంలో, అన్న అలవాట్లతో దిక్కుతోచని రూపని సతీశ్, మాలలు తమ ఇంటికి తీసుకుని వెళతారు. ఈ లోపల రమేశ్ ఇంటిని తారా బాయి ఆక్రమించుకుంటుంది. అక్కడకు రూపని రానివ్వదు. దిక్కుతోచని పరిస్థితులలో రూపకు సతీశ్ ఆశ్రయం స్వీకరించవలసి వస్తుంది. అయితే ఈ లోపు పెళ్ళి కాకుండా ఆమె సతీశ్ ఇంట్లో ఉంటుందని ఊరంతా ఆమెపై నిందలు వేస్తున్నప్పుడు సతీశ్ రూప తన కాబోయే భార్య అని అందరి నోర్లు మూయిస్తాడు. తప్పని పరిస్థితులలో కుటుంబ గౌరవం కోసం రూప సతీశ్‌ని వివాహం చేసుకోవడాన్ని అంగీకరిస్తుంది.

శంకర్ తన జన్మ రహస్యం తెలుసుకుని తన రాజకుటుంబానికి చేరుకుంటాడు. అక్కడ ఆస్తి అతని పరమవుతుంది. ఆ హోదాతో రమేశ్ దగ్గరకు వచ్చి రూపని వివాహం చేసుకుంటానని అంటాడు. కాని రూప పెళ్ళి నిశ్చయమయిపోయిందని రమేశ్ చెబుతాడు. రూప తనను మోసం చేసిందని ఆమెపై ద్వేషాన్ని, కోపాన్ని, అసహ్యాన్ని పెంచుకుంటాడు శంకర్. ఆమెకు బుద్ధి చెప్పాలని ఆమెను, రమేశ్‌ను హింసించాలని తన కసిని తీర్చుకోవాలని నిశ్చయించుకుంటాడు. రమేశ్ ఇల్లు తనే కొని దాన్ని తన పరం చేసుకుంటాడు. సతీశ్ చెల్లెలు మాలతో చనువు పెంచుకుంటాడు. ఆమెకు రూపకు మధ్య దూరం పెరుగుతుంది. అనుక్షణం రూప వెంట ఉంటూ ఆమె మనసును అల్లకల్లోలం చేస్తాడు. అతనిలోని ద్వేషాన్ని, కోపాన్ని చూసి రూప భయపడుతుంది. తనను, తన పరిస్థితిని అర్థం చేసుకొమ్మని ఆమె శంకర్‌ను అడిగినప్పుడు రూపను తనతో వచ్చేయమని అంటాడు శంకర్. కాని లోకంలో తమ కుటుంబ గౌరవం దెబ్బతింటుందని రూప అతని ప్రతిపాదనను ఒప్పుకోదు. ఆమెపై ఇంకా కోపం పెరుగుతుంది శంకర్‌లో.

ప్రేమ విషమిస్తే ఎంత క్రూరంగా మారుతుందో ఈ సినిమాలో శంకర్ పాత్రలో చూస్తాం. చివర్లో రూపను శంకర్ బ్రతిమాలుకోవడం, సతీష్‌తో పెళ్ళి జరగవలసిన రోజే ఆమె శంకర్ కోసం అన్ని వదిలి రావడం సినిమా ముగింపు. వుధరింగ్ హైట్స్‌లోలా కాకుండా కథను సుఖాంతం చేసి శంకర్ పాత్ర వ్యక్తిత్వాన్నే పూర్తిగా మార్చివేసారు దర్శకులు. అప్పటి దాకా పరువు ప్రతిష్ఠ అంటూ సతీశ్‌ని వివాహం చేసుకోవడం తన బాధ్యత అనుకున్న రూప మరు నిముషంలో శంకర్ కోసం పరుగెత్తుకు రావడం కొంచెం నాటకీయంగా అనిపిస్తుంది. అంత కసితో కోపంతో రగిలిపోయే శంకర్ చివరకు రూప కాళ్ళపై పడి బ్రతిమాలుకోవడంలో శంకర్ లోని ప్రేమ కారణంగా జనించిన కోపం, ఆ కోపాన్ని అంటి పెట్టుకున్న బాధ, కనిపించినా అది స్క్రీన్‌పై అంత బాగా రాలేదు. అయితే సినిమా మొత్తంలో శంకర్‌గా దిలీప్ కుమార్‌కు నటించడానికి పూర్తి స్కోప్ ప్రతి సీన్‌లో క్రియేట్ అవుతూ వెళ్ళడం కనిపిస్తుంది. ఒక దేవుని విగ్రహం దగ్గర తన మనసులోని బాధను కోపాన్ని అసహ్యాన్ని బయటపెట్టుకునే శంకర్‌గా దిలీప్ కుమార్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఆ డైలాగ్ మాడ్యులేషన్ మరెవరూ చేయలేరు అన్నంత గొప్పగా ఉంటుంది ఆ సీన్. కాని సినిమాగా చూస్తే అప్పటి దాకా వచ్చిన దిలీప్ కుమార్ సినిమాలలో మనకు ఆయా పాత్రలు కనిపిస్తాయి. కాని 60ల దశకం నుంచి సినిమా మొత్తంలో దిలీప్ కుమార్ కనిపించడం మొదలవుతుంది. దాని వలన సినిమా కథ చాలా ప్రభావితమయి కథగా ఆ తరువాతి సినిమాలు అలరించవు.

‘దిల్ దియా దర్ద్ లియా’లో దిలీప్ కుమార్ డామినేషన్ చూస్తాం. అలాగే అతనిలోని గొప్ప నటుడినీ చూస్తాం. కొన్ని సీన్లను చూసి దిలీప్ ప్రతిభకి ఫిదా అవకుండా ఉండలేం కాని కథాపరంగా సినిమాను సరిగ్గా మలచలేదన్నది మాత్రం అందరం అంగీకరించి తీరతాం. రూపగా వహిదా రెహమాన్ బాగా చేసారు. కాని చివరి సీన్లలో ఒక అయోమయం ఆమెలో కనిపిస్తుంది. ప్రాణ్ తన పాత్రకు నూరు శాతం న్యాయం చేసారు. ఈ సినిమా నౌషాద్ పాటలు లేకపోతే ఊహించలేం. “కోయీ సాగర్ దిల్ కొ బెహలాతా నహీ” ఈ పాట అప్పటిదాకా నెగిటివ్ షేడ్స్‌లో కనిపించే దిలీప్ కుమార్‌పై జాలి కలిగించేలా ఉంటుంది. “బేఖుదీ మే భీ కరార్ ఆతా నహీ” అనే వాక్యం దగ్గర ప్రతి సారి దిలీప్ కుమార్ మొహంలో ఒక ఓటమి నిస్సహాయత చూస్తాం. “దిల్ రుబా మైనె తేరే ప్యార్ మె క్యా క్యా న కియా దిల్ దియా దర్ద్ లియా” అనే పాటలో అతని భావాలకీ ఈ కోయీ సాగర్ పాటలో అతని నిస్సహాయతకు “సావన్ ఆహే యా న ఆయే’ అన్న పాటలో అతని ఆనందాన్ని “గుజరే హై ఆజ్ ఇష్క్ మే” అన్న పాటలో అతని మొహంలో నిండి ఉన్న విషాదాన్ని చూస్తే ఇన్ని భావాలను అంత కన్విన్సింగ్‌గా పలికించగలిగినందుకు ఆయన నటనకు నీరాజనాలు అర్పిస్తాం. రఫీ కూడా అంత అద్భుతంగానే పాడారు. “హమ్కో న యే గుమాన్ థా వొ సంగ్దిల్ సనం,  రాహే వఫా సె తేరె బెహక్ జాయేంగే కదం,  చల్కేగా జహర్ భీ తెరీ ఆంఖో కె జామ్ సే” అన్న వాక్యాలను రఫీ పలికించిన తీరు చూస్తే ఆయనకు భక్తులు కాకుండా ఉండలేం. ప్రేమలో మోసపోయిన వ్యక్తి మనసులోని మంటను ఇంత గొప్పగా పలికించడం అందరికీ సాధ్యం కాదు.

చాల చోట్ల దిలీప్ కుమార్ చేసిన సీన్లలో తప్ప మరెక్కడా అంత డెప్త్ కనిపించదు. గొప్పగా నటించగలిగిన నటులకు కూడా అవకాశం లభించలేదా అనిపిస్తుంది. ఒక పాటలో వహీదా జుట్టు ముఖం పై విరబోసుకుని దుఖాన్ని ప్రకటిస్తూ కనిపిస్తుంది. ఆ షాట్లో గురుదత్ చిత్రీకరణ గుర్తుకు వస్తుంది. శ్యామా కూడా మాలగా మంచి నటననే ప్రదర్శించారు. శంకర్ తరుపున మాట్లాడుతున్నప్పుడు, చివరకు అన్న కాళ్ళపై పడి రూపను శంకర్ దగ్గరకు వెళ్ళనివ్వమని అడుగుతున్నప్పుడూ ఆమె నటన బావుంటుంది. అయితే గమనిస్తే సినిమా అంతా మొదటీ నుండి చివరి దాకా ఎటువంటి వ్యక్తిత్వపు మార్పులు లేకుండా సహజంగా కనిపించే పాత్ర రమేశ్. రాచరికం పోయి పేదవాడయినా శంకర్‌పై కోపం అతనిలో తగ్గదు. అతని సహజ గుణం అన్ని సందర్భాలలో కనిపిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా పరికించి చూస్తే ప్రతి పాత్ర కూడ తన సహజ ప్రవృత్తి కి భిన్నంగా కొన్ని సందర్భాలలో కనిపిస్తాయి కాని ప్రాణ్ మాత్రం ఒకే రకమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ చాలా సహజంగా మనకు కనిపిస్తారు. ఈ సినిమాలలోని మిగతా పాత్రలన్నిటిలో సహజమైన పాత్రగా తన సహజ స్వభావంతో మొదటి నుండి చివరి దాకా నాచురల్‌గా కనిపించే పాత్ర రమేశ్. ఈ పాత్రను పోషించినందుకు ఆయనకు ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ నామినేషన్ లభించింది. దిలీప్ కుమార్‌కి కూడా ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ నామినేషన్ లభించింది కాని ఆ సంవత్సరం దేవానంద్ గైడ్ సినిమాకు ఆ అవార్డు గెలుచుకున్నారు. సహాయ నటుడిగా అశోక్ కుమార్ అఫ్సానా సినిమాకు అవార్డు గెలుచుకున్నారు.

దిల్ దియా దర్ద్ లియా సినిమాను విశ్లేషిస్తే కొన్ని సత్యాలు బోధపడతాయి. సినిమా ప్రజలను ప్రభావితం చేయగల శక్తివంతమయిన మాధ్యమం. కళాకారులు ప్రజల భావనలను తమ ఇష్టం వచ్చిన రీతిలో మలచగలుగుతారు.  కానీ, సామాజిక మనస్తత్వం కూడా కళాకారుల ఆలోచనను ప్రభావితంచేస్తుంది.  1950 దశకంలో అధిక శాతం సినిమాలు విషాదాంత కథలు. దిలీప్ కుమార్ ట్రాజెడీ కింగ్ అయినా, ఇతర సినిమాలు కూడా విషాదాన్ని గుప్పించటంలో వెనుకాడలేదు. బైజు బావ్రా, మదర్ ఇండియా, బసంత్ బహార్ తో సహా పలు హిట్ చిత్రాలు విషాదాన్ని గుప్పించాయి. ఆ కాలంలో ప్రజలు విషాదాన్ని పెద్ద ఎత్తున స్వీకరించారు. విషాదం ఒక రకంగా ఫేషన్ అయింది. మీనా కుమారి సినిమాలంటే కళ్ళొత్తుకోవటానికే సినిమాలకు వెళ్ళేవారు. నర్గీస్ సినిమాలు అదాలత్, లాజ్వంతి వంటివి కూడా విషాదం వైపు మొగ్గుచూపినవే. హీర్ రాంఝా, లైలా మజ్ఞు, దేవ్‌దాస్ వంటి సినిమాలు విషాదాన్ని ప్రామాణికం చేశాయి. ఆ కాలంలో ప్రజలు స్వచ్చందంగా విషాదాన్ని కౌగలించుకొనేవారు. త్యాగం అన్నది గొప్ప విషయం. కానీ, 1960 దశకంలో ఈ పరిస్థితి మారింది. హీరోలు, హీరోయిన్లు ప్రేమించే హక్కుని సాధించుకోవటం మొదలుపెట్టారు. ఏడవటంకోసం కాదు, ఆనందించటంకోసం జీవితం అన్న భావన బలపడసాగింది. ముఖ్యంగా, శమ్మి కపూర్ పెద్ద ఎత్తున విజయం సాధించటంతో, హీరో ప్రేమను త్యాగం చేసి, నాయిక పెళ్ళిచేసుకుంటూంటే, నీడలో వొదిగి ఆశీర్వదించి మౌనంగా వెళ్ళి విషాదగీతం పాడుకునే రోజులు చెల్లిపోయాయి. యాహూ, అని అరుస్తూ, దుంకుతూ, నాయికను ఎత్తి విసిరేస్తూ, కుదిపేస్తూ, త్యాగం చేస్తున్నట్టు కనిపిస్తూనే అనుకున్నది సాధించే తరం తెరపైకి వచ్చింది. విషాదాంతాలు తిరస్కృతమవటం ఆనవాయితీ అయింది. చివరికి ముఘల్-ఎ-ఆజం కూడా ఆఖరికి అనార్కలి బ్రతినట్టు చూపి విషాద గాధలకు కాలం చెల్లిందని నిరూపించింది. అలాంటి సమయంలో దిల్ దియా దర్ద్ లియా సినిమా తయారయింది. ఇలాంటి సినిమాలే గతంలో ఎలాంటి సంకోచంలేకుండా విషాదంతో ముగిసాయి. కానీ, దిల్ దియా దర్ద్ లియా రూపకర్తలు ఈ సినిమాను విషాదంతో ముగించటానికి భయపడ్డారు. దాంతో, విషాదం తప్ప మరో విధంగా ముగిసే వీలులేని సినిమాను హఠాత్తుగా, అందరి వ్యక్తిత్వాలకు, స్వభావాలకూ విరుద్ధంగా సంతోషంతో ముగించారు. ఇది ప్రేక్షకులలో ఒక విరుద్ధమయిన భావనను కలిగించింది. సినిమాను అభాసుపాలు చేసింది. సినిమాలో పాత్రల వ్యక్తిత్వాలన్నీ నిర్దిష్టమయిన రీతిలో అత్యద్భుతంగా రూపొందాయి. దిలీప్ కుమార్ పాత్ర ప్రేమ  ద్వేషాల మధ్య నలుగుతూ నరకాన్ని అనుభవిస్తూంటుంది. అందరికీ నరకాన్ని చూపిస్తూంటుంది. ప్రేమ  ద్వేషంగా మారితే  ఎంత భయంకరంగా వుంటుందో చూపించటమేకాదు, అనుక్షణం ద్వేషాగ్నిలో రగులుతూ, ప్రేమలో మరణిస్తూ, ద్వేషంలో జీవిస్తూ, ప్రేమకోసం తపించటమనే నరక బాధకన్నా ఘోరమయిన బాధను శంకర్ అనుభవిస్తూంటాడు. ఇక అతనికి నిష్కృతిలేదు. ఆ దారినుంచి వెనక్కువెళ్ళేవీలులేదు. నాయిక పాత్ర ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తూంటుంది. ఆమెకు కూడా మరణం తప్పించి వేరే గతిలేదు. అంటే సినిమా, ఆకాశంనుంచి, ఎలాంటి ఆధారంలేకుండా నేలపైకి పడిపోతున్న విమానంలాటి పరిస్థితిలో వుందన్నమాట. ఒక పెద్ద విస్ఫోటనంతో విమానం నేల కూలక తప్పదు. ప్రేక్షకుడు అందుకు మానసికంగా సిధ్ధమయిపోతాడు. ఇక ఎప్పుడు, ఎక్కడ అన్నది తప్ప నేలపై కూలటం తప్పనిసరి. మరో గత్యంతరంలేదు. అలాంటి పరిస్థితిలో, హఠాత్తుగా విమానానికి రెక్కలువచ్చి ఆకాశంలోకి ఎగిరినట్టు చూపిస్తే, చిన్న పిల్లలు కూడా నమ్మరు. తిరస్కరిస్తారు. దిల్ దియా దర్ద్ లియాలో అదే జరిగింది. ముగింపు అత్యద్భుతంగా రూపొందిన సినిమా మొత్తాన్ని దెబ్బ తీసింది. చుక్క విషం కుండెడు పాలను పాడుచేసినట్టు, కళాకారులలోని ఆత్మవిశ్వాస రాహిత్యం ఒక అత్యద్భుతమయిన సినిమాను అత్యంత హాస్యాస్పదం చేసింది. ఒక మరపుకురాని సినిమాను గుర్తుతెచ్చుకోలేని సినిమాగా మలచింది.  సినిమా మొదతినుంచీ తర్క దూరంగా వుంటే ప్రేక్షకులు ముగింపును పట్టించుకునేవారు కారు. 1960 దశకంలో ప్రేక్షకులు విషాద గాథలను మెచ్చరన్న ఆలోచనతో, విషాదాంతమయితే ఎన్నటికీ మరపురానిరీతిలో నిలిచే సినిమాను సుఖాంతంచేసి కళాకారులు ఆత్మవిశ్వాస రాహిత్యాన్ని ప్రదర్శించారు. రాజ్ కపూర్ ఆహ్ సినిమాను ఆరంభంలో విషాదాంతం చేశాడు. ప్రేక్షకులు మెచ్చరేమో అన్న భయంతో సుఖాంతంగా మార్చాడు. ప్రేక్షకులు తిరస్కరించారు. ప్యాసాను విషాదాంతం నుంచి సుఖాంతంగా మార్చారు. సూపర్ హిట్ అయింది. కాగజ్ కే ఫూల్ విషాదాంతం. పరాజయం పాలయింది. సాహబ్ బీబి ఔర్ ఘులాం చివరలో మీనా కుమారి, గురుదత్ పాత్రల నడుమ లైంగిక సంబంధం వున్నట్టు సూచించారు ఆరంభంలో. కానీ, ప్రేక్షకుల రియాక్షన్ చూసి, దాన్ని తొలగించారు. అంటే, కళాకారులు ఆత్మ విశ్వాస రాహిత్యంతో, ప్రేక్షకులు ఇది మెచ్చుతారు, ఇది మెచ్చరు అని ఎన్ని రకాల ఆలోచనలు చేసినా, సినిమాలో పాత్రల వ్యక్తిత్వాలకు భంగం కలిగినా, సినిమా తర్క విరుద్ధంగా  వున్నా, ప్రేక్షకులు నిర్మోహమాటంగా తిరస్కరిస్తారు. కాబట్టి కళాకారులు కథను, పాత్రలను అనుసరించి, లాజికల్ ముగింపునివ్వాలి. లేకపోతే సినిమా కళాకారులు అభాసుపాలవటమేకాదు. వారు ఆశించినదీ దక్కదు. ఇందుకు ప్రధాన నిదర్శనం దిల్ దియా దర్ద్ లియా. భారతీయ చలనచిత్రాల్లో విలక్షణమయిన, అత్యద్భుతమయిన పాత్రల వ్యక్తిత్వ చిత్రణ వున్న సినిమాగా చిరకీర్తినార్జించాల్సిన సినిమా అభాసుపాలయి, ఎవరూ గుర్తించుకోని సినిమాగా మిగలటానికి ప్రధాన కారణం సినిమా ముగింపు తర్కదూరం కావటమే, ప్రేక్షకులు విషాదాంత గాథలను మెచ్చరన్న ఆత్మవిశ్వాస రాహిత్యమే .1970 దశకంలో విషాదాంతం చేయాలనుకుని సుఖాంతం చేసిన బాబీ, 1980ల్లో సుఖాంతం చేయాలనుకుని, విషాదాంతం చేస్తే సూపర్ హిట్  అయిన ఏక్ దూజే కే లియే వంటి సినిమాలను విశ్లేషిస్తే, సినిమా విజయంలో లాజిక్ పోషించే పాత్ర స్పష్టమవుతుంది. లాజిక్ లేని సినిమా మాజిక్ చేయలేదు.

సినిమాలో హాస్యనటుడిగా జానీ వాకర్, టున్ టూన్ ల పాత్రలు అప్రస్తుతంలా అనిపిస్తాయి. కథతో పెద్దగా సంబంధం లేని ఆ పాత్రలు చాలా పేలవంగా ఉన్నాయి. ‘దిల్ దియా దర్ద్ లియా’ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అత్యద్భుతంగా నటించిన నటులుండి కూడా నిరాశపరిచిన సినిమా అని అనిపిస్తుంది. కథకు ముగింపు కన్విన్సింగ్‌గా లేకపోతే ఎంత గొప్ప నటన అయినా సినిమాకి ఉపయోగపడదని సినీ  దర్శకులకు పాఠం చెబుతుంది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here