ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 36 – విధాత

1
2

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్, సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో చేసిన మొదటి సినిమా ‘విధాత’

[dropcap]1[/dropcap]982లో సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘విధాత’. ఇది మల్టీ స్టారర్ సినిమా. ఇందులో దిలీప్ కుమార్‌తో పాటు సంజీవ్ కుమార్, షమ్మీ కపూర్, సంజయ్ దత్, పద్మిని కొల్హాపూరి, అమ్రీష్ పురి తదితరులు నటించారు. అప్పట్లో ఇది బ్లాక్‌బస్టర్ సినిమా. అదే సంవత్సరం “శక్తి” సినిమా చేసిన దిలీప్ కుమార్‌కు విధాత కూడా నటించడానికి మంచి స్కోప్ ఇచ్చింది. ప్రస్తుత సినీ ప్రపంచంలో అరవై సంవత్సరాలుపై బడిన వారు కూడా హీరోయిన్ల వెంట చెట్ల చాటుకి పరిగెత్తాలని అనుకుంటున్నప్పుడు ఇలాంటి కథలు ఈ రోజుల్లో రావడం కష్టమే. ఈ సినిమాలో ఒక్క సునీల్ దత్ తప్ప మిగతా వారంతా వయసుపై బడిన పాత్రలే వేసారు. ఇప్పుడు ముప్పైలు దాటిన వ్యక్తులపై కూడా కథలు తక్కువ అవుతున్నాయి. దిలీప్ కుమార్ తన సెకెండ్ ఇన్నింగ్స్‌లో చాలా మంది కొత్త తరం వారితో నటించారు. ఈ సినిమాలో సంజీవ్ కుమార్ దిలీప్ కుమార్‌లు పోటాపోటీగా నటించడం చూస్తాం. తన వయసుకు మించిన పాత్రలు పోషించడం సంజీవ్ కుమార్ స్పెషాలిటీ. దిలీప్ కుమార్‌తో ఆయన విధాతలో చేసిన సన్నివేశాలు, సంజీవ్ కుమార్ నటనా ప్రతిభకు నిదర్శనాలు. అంతకు ముందు సంఘర్ష్ అనే సినిమాలో మొదట వీరిద్దరు నటించారు. విధాతలో వీరిద్దరి ఫర్మార్మెన్స్ చాలా బావుంటుంది.

విధాత సినిమా కథ రెండు తరాల అంతరాలకు సంబంధించింది. శంషేర్ సింగ్ ఒక రైలింజన్ డ్రైవర్, అతని కొడుకు పోలీస్ ఆఫీసర్ అవుతాడు. కాని ఒక కేసు విషయంలో అతన్ని జగావర్ చౌదరి హత్య చేయిస్తాడు. ఆ హత్యను చూసిన శంషేర్ తన కొడుకు ప్రాణాలు తీసిన నలుగురిలో ముగ్గురిని చంపేస్తాడు. నాలుగో అతన్ని చంపే సమయంలో పోలీసులు చుట్టుముట్టడంతో శంషేర్ అక్కడి నుండి పారిపోతాడు. అతని కోడలు నెలలు నిండక ముందే బిడ్డను కని చనిపోతుంది. ఆ పసి గుడ్డుని బ్రతికించుకోవడానికి శంషేర్ ఆస్పత్రికి తీసుకెళతాడు. కాని అక్కడ బిల్లు కట్టడానికి అతనివద్ద డబ్బులు ఉండవు. అదే చోట వైద్యం చేయించుకుంటున్న మిజ్యా ఆ బిల్లు తాను కట్టి తన వద్ద శంషేరును పనిలో పెట్టుకుంటాడు.  మిజ్యా ఒక గొప్ప వ్యాపారవేత్తగా కనిపించే స్మగ్లర్. అక్కడ పని చేస్తూ శంషేర్, శోభరాజ్‌గా మారి ఆ కంపెనీ చైర్మెన్ పదవిలోకి వస్తాడు.

అతని మనవడు కునాల్ డబ్బు మాయలో పడి చిన్న వయసులోనే దుడుకుగా ప్రవర్తించడం, చేయి దాటిపోయే విధంగా తయారవడం చూసి తనకు పరిచయం అయిన అబు బాబా వద్ద అతన్ని ఉంచి పెంచుతాడు శోభరాజ్. కునాల్ అబు బాబానే తన తండ్రి అని నమ్ముతాడు. పద్నాలుగు సంవత్సరాల దాకా శోభరాజ్ మనవడిని చూడడు. కాని అతని విషయాలు కనుక్కుంటూ ఉంటాడు. ఒక పేద ఇంట బాధ్యతతో పెరుగుతున్న కునాల్ చదువులో గుణంలో ప్రవర్తనలో మంచివాడుగా ఎదుగుతాడు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తరువాత తాత శోభరాజ్ దగ్గరకు తీసుకు వస్తాడు అబు బాబా. శోభరాజ్‌ను తాతగా అంగీకరించినా అబు బాబా ప్రేమను మర్చిపోలేడు కునాల్. అందరూ కలిసే జీవిస్తుంటారు. శోభరాజ్ ఒక స్మగ్లర్ అన్న సంగతి కునాల్‌కి, అబు బాబాకు కూడా తెలీదు.

కునాల్ పేద ఇంటి అమ్మాయి దుర్గని ప్రేమిస్తాడు. దుర్గ తండ్రి శోభరాజ్ వద్ద డ్రైవర్‌గా పని చేస్తూ జైలుకి వెళతాడు. ఆ కుటుంబ పోషణ శోభరాజ్ పంపే డబ్బుతోనే జరుగుతుంది. దుర్గతో వివాహానికి శోభరాజ్ అంగీకరించడు. ఇక్కడ అబు అతనితో విభేదిస్తాడు. కోపంతో ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. జగావర్ చౌదరి శోభరాజ్ వ్యాపారాల పై కన్ను వేసి ఆ కంపెనీ వ్యక్తులతో కలుస్తాడు. వారి మధ్య ప్రాపకం కోసం ప్రయత్నిస్తూ, అక్కడ శోభరాజ్ పరపతి తగ్గించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అతని సలహా మీద దుర్గను కొందరు అపహరిస్తారు. విషయం తెలిసి అబు బాబా దుర్గను కాపాడుతాడు. అప్పుడే అతనికి మొదటిసారి శోభరాజ్ చీకటీ వ్యాపారాల గురించి తెలుస్తుంది. జగావర్ చౌదరి ప్రోద్భలంతో మిగతా వారు అబు బాబాని చంపేస్తారు. తాను ఎంతో ప్రేమించే అబు బాబా హత్య కునాల్‌ను కలిచి వేస్తుంది. తానా హంతకులను పట్టుకుని శిక్షిస్తానని శపథం చేస్తాడు.

అలా చివర్లో తాత శోభరాజే పెద్ద డాన్ అని తెలియడం, తాత నుండి విడిపోవాలని అతను ప్రయత్నించడం, కునాల్‌ని ఆ వ్యాపారాలకు చైర్మన్‌గా చేయనీయకుండా జగావర్ చౌదరి అడ్డుపడడం, కునాల్‌కి తన గతం తెలియడం, చివరకు తన కొడుకుని చంపించింది జగావర్ చౌదరి అని శోభరాజ్‌కు తెలిసి అతను జగావర్‌ను చంపి మనవడి చేతిలో కన్ను మూయడం సినిమా కథ. సినిమా మొదటి నుండి తన సంతానంపై ప్రేమతో తమ జీవితాలను మలచుకునే మనిషి స్వభావం ఆధారంగా నడుస్తుంది. మనిషికి అన్నిటికన్నా తన సంతానం ముఖ్యం అని, పిల్లల కోసం ఏం చేయడాని అయినా మనిషి వెనుకాడడని అలా తన మనవడి కోసం తాను ఎంచుకున్న దారిలో నడిచిన ఒక వక్తి కథ విధాత.

ఈ సినిమాలో సంభాషణలు బావుంటాయి. సచిన్ భౌమిక్, సుభాష్ ఘాయ్, కాదర్ ఖాన్ ముగ్గురు కలిసి ఈ కథ కూర్చారు. సంజయ్ దత్‌కి ఇది మూడవ సినిమా. కష్టపడి చేసాడు కాని అంతమంది దిగ్గజాల మధ్య పిల్లవాడిగానే కనిపిస్తాడు. సినిమా రెండవ సగంలో దర్శకుడి తడబాటు కనిపిస్తుంది. దిలీప్ కుమార్ స్నేహితుడిగా షమ్మీ కపూర్ నటించారు. వీరికి ఈ సినిమాకి ఉత్తమ సహాయ నటుడి ఫిలింఫేర్ అవార్డు లభించింది.  అదే అవార్డుకి సంజీవ్ కుమార్ కూడా నామినేట్ అయ్యారు. ఇప్పుడు ఈ సినిమా చూస్తే సంజీవ్ కుమార్ నటన ఆకర్షిస్తుంది. దిలీప్ కుమార్ సంజీవ్ కుమార్లు కలిసి నటించిన సీన్లన్నీ చాలా బాగా వచ్చాయి. ముఖ్యంగా బిడ్డకి డబ్బు ఇచ్చి చెడగొడుతున్నాడని దిలీప్ కుమార్‌ని సంజీవ్ కుమార్ అబూ బాబాగా మందలించే సన్నివేశం, చివర్లో అబూ బాబా ఇల్లు వదిలి వెళ్ళే సన్నివేశంలో సంజీవ్ కుమార్ నటన పై స్థాయిలో ఉంటుంది.

దిలీప్ కుమార్ కూడా సంజీవ్ కుమార్‌ని తనకు పోటీ ఇచ్చే నటుడిగా గౌరవించేవారట. “సంఘర్ష్”తో తనకు గట్టీ పోటీ ఇచ్చిన సంజీవ్ కుమార్‌ని అతను మర్చిపోలేదు. అదొక చాలెంజ్‌గా తీసుకుని విధాతలో అబు బాబా పాత్రకు ఆయనే సంజీవ్ కుమార్ పేరు విధాత సినిమాకి నిర్మాత అయిన గుల్షన్ రాయ్‌కి చెప్పారట. ఆ సమయంలో గుల్షన్ రాయ్ సంజీవ్ కుమార్‌ల మధ్య మాటలు లేవు. కాని దిలీప్ కుమార్ మాట మీద అ పాత్రకు సంజీవ్ కుమార్‌ని తీసుకున్నారు. సంజీవ్ కుమార్ కూడా అంతే పోటీగా దిలీప్ కుమార్ నటనతో సమాన స్థాయిలో పోటీ పడి నటించారు. దిలీప్ కుమార్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకునేవారు. ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలు మరో నటునికి వెళ్ళిపోయేవి. కాని ఒక నాలుగు సినిమాలు మాత్రం రిజెక్ట్ చేసి తాను తప్పు చేసానని బాధపడుతున్నానని అయని  చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. అవి 1. బైజు బావ్రా… ఇది భరత్ భూషణ్‌కి వెళ్ళింది. హిందీ భాషలోనే ఒక గొప్ప సినిమాగా నిలిచిపోయింది. 2. ప్యాసా – గురుదత్‌ని చిరస్థాయిగా సినీ ప్రపంచంలో నిలిపిన సినిమా ఇది. 3. జంజీర్ – అమితాబ్‌ని సినీ ప్రపంచంలో బాద్షా చేసిన సినిమా, 4. షోలే – ఇందులో ఠాకుర్ పాత్రకు ముందు అనుకున్నది దిలీప్ కుమార్‌ని. ఆయన చేయనని అన్న తరువాత ఆ పాత్ర సంజీవ్ కుమార్‌కి వెళ్ళింది.

కమర్షియల్ సినిమాలలో సహజ నటనను వెతుక్కునే ప్రేక్షకులకు దిలీప్ కుమార్ తరువాత గుర్తుకు వచ్చే మరో పేరు సంజీవ్ కుమార్. మెథడ్ యాక్టింగ్‌కి గురువు దిలీప్ కుమార్ అనుకుంటే అంతే సహజంగా అద్భుతంగా పాత్రలను పోషించిన గొప్ప నటుడు సంజీవ్ కుమార్. వీరిద్దరిలో చాలా పోలికలున్నాయి. ఇద్దరికీ తమ డిక్షన్‌పై పట్టు ఉంది. సంభాషణలు పలకడంలో ఒక సొంత బాణీ ఉంది. మిగతా నటులు వీరిని అనుకరించారేమో కాని వీరిద్దరూ ఎవరినీ అనుకరించక తమకంటూ ఒక సొంత స్టైల్ నిర్మించుకున్నారు. వీరి నటించిన సినిమాలలో పాత్రలు కనిపిస్తాయి, నటులు కారు. స్టార్ ఇమేజ్ వీరి నటనకు ఎప్పుడు అడ్డు రాలేదు. దిలీప్ కుమార్ కన్నా సంజీవ్ కుమార్ చాలా ప్రయోగాలు చేసారు. దిలీప్ కుమార్ కొంత వరకు సేఫ్‌గా పాత్రలను ఎన్నుకున్నారు. రిస్క్ తీసుకోలేదు. కాని ఏ నటుడు తీసుకోని రిస్క్‌ను సంజీవ్ కుమార్ తీసుకున్నారు. ఆ విషయంలో దిలీప్ సాబ్ కన్నా సంజీవ్ కుమార్‌కు ఎక్కువ మార్కులు పడాలేమో. కాని దిలీప్ కుమార్‌కి వచ్చిన క్రేజ్ సంజీవ్ కుమార్‌కి రాలేదు. కాని నటనా పరంగా ఇద్దరు కలిసి నటించినవి రెండు సినిమాలే అయినా ఇద్దరి నటనలో కనిపించే సహజత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విధాత సినిమాలో ఇద్దరిని కలిసి ఒకే స్పేస్‌లో చూస్తున్నప్పుడు వారి నటనలో ఈ సారుప్యత మనకు అర్థం అవుతుంది.

విధాత సినిమాకు సంగీతం అందించింది కళ్యాణ్‌జీ ఆనంద్‌జీలు. సినిమాలో ఐదు పాటలుంటాయి. “హాథో కీ చంద్ లకీరో కా” అనే పాట బావుంటుంది. ఇందులో దిలీప్ కుమార్ పాత్ర మనిషి తన భవిష్యత్తుని తానే నిర్మించుకుంటాడని అంటే, షమ్మీకపూర్ పాత్ర మనిషి అదృష్టానికి దాసోహం అవవలసిందే అంటుంది. ఆనంద్ భక్షి ఈ పాటను చాలా బాగా రాసారు. దీన్ని అన్వర్ హుసెన్, సురెష్ వాడ్కర్‌లు పాడారు. “ఓ సాథీ ఆ” అనే లతా మంగేష్కర్ పాట కూడా అప్పట్లో ఎక్కువగా రేడియోలో వినిపించేది.  ఈ సినిమాలో “సాథ్ సహేలియా ఖడీ ఖడీ “అనేపాటసూపర్ హిట్ అయి సినిమాకు పెద్ద ఆకర్షణగా నిలచి సినిమా విజయంలో తనవంతు పాత్ర పోషించింది.  ఈపాట అసభ్యంగా వుందని వివ్ధ భారతి ఈ పాటను నిషేధించింది.  సినిమాలో సంజయ్ దత్, పద్మిని కొల్హాపురీల మధ్య ప్రేమ కథ అతుకులు బొతుకులుగా వచ్చింది.  ఈ సినిమా షూటింగ్ సమయంలో సంజయ్ దత్ డ్రగ్స్ సమస్యతో సరిగా వచ్చేవాడుకాదు. ఇది సుభాష్ ఘై కు ఆగ్రహం కలిగించింది. అందుకే హీరో సినిమాలో ముందనుకున్నట్టుగా సంజయ్ దత్ ను కాక, జాకీ ష్రాఫ్ ను తీసుకున్నాడు. జాకీ ష్రాఫ్ ను విధాత సినిమాలో ఒక చిన్న పాత్రకు అనుకున్నాడు కానీ, అతని మేనరిజంస్ చూసి చిన్నవేషాల బదులు హీరో వేషమే ఇచ్చాడు సుభాష్ ఘై.  మళ్ళీ పదేళ్ళ తరువాత సంజయ్ దత్ క్తో హల్‌నాయక్ సినిమా తీశాడు సుభాష్ ఘై. అప్పటికి దత్ డ్రగ్స్ అలవాటునుంచి బయటపడ్డాడు. సారిక కూడా ఒక చిన్నపాత్రలో కనిపిస్తుంది. చాలా మంది నటులకు కథా పరంగా పెద్ద స్పేస్ లేదు. శ్రీరామ్ లాగూ, సురేష్ ఓబ్రాయ్, మదన్ పూరి, జగ్దీప్ లాంటి వారికిపెద్దగా నటించే అవకాశం లేదనే చెప్పాలి. కాని ఈ సినిమాలో కూడా దిలీప్ కుమార్, వారితో పాటు సంజీవ్ కుమార్ తమ ప్రతిభను మరో సారి చాటుకున్నారన్నది వాస్తవం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here