ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 39 – గంగా జమున

1
2

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్ కెరియర్‌లోనే అతి గొప్ప ట్రెండ్ సెటర్‌గా ఎంచబడిన ‘గంగా జమున’

[dropcap]1[/dropcap]961లో వచ్చిన ‘గంగా జమున’ సినిమా దిలీప్ కుమార్ కెరియర్‌లో అతి గొప్ప సినిమాగా క్రిటిక్స్ చెబుతారు. ఆ సంవత్సరం జాతీయ అవార్డులలో రెండవ ఉత్తమ చిత్రంగా నిలిచిన ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. తరువాతి తరంలో అమితాబ్ బచ్చన్‌  యాంగ్రీ యంగ్ మాన్‌గా మారడానికి స్ఫూర్తి, ఈ సినిమా నుండే లభించింది. అలాగే గొప్ప సినిమాగా ప్రశంసలందుకున్న షోలే సినిమాలో అందరికి నచ్చే రైలు దాని పక్క గుర్రాలపై బందిపోట్లు వెళ్ళే సీను గంగా జమున నుండి కాపీ చేసిందే. అన్నదమ్ముల మధ్య ఆశయాల వైరం అనే విషయంతో ఆ తరువాత తీసిన దీవార్, అమర్ అక్బర్ ఆంథోనీ, త్రిశూల్ మొదలయిన సినిమాలకు  స్ఫూర్తి కూడా ‘గంగా జమున’. భారతీయ సినిమాలలో ఉత్తమ చిత్రంగా మొదటి పది స్థానాలలో ఈ రోజుకీ నిలిచి ఉన్న సినిమా ఇది. సోవియట్ యూనియన్‌లో కూడా గొప్ప పేరు సంపాదించుకున్న భారతీయ సినిమాగా ‘గంగా జమున’ని ఈ రోజుకీ సినీ విశ్లేషకులు గుర్తు చేసుకుంటారు.

ఈ సినిమాకు సంబంధించి, దిలీప్ కుమార్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. దిలీప్ సాబ్ మాతృభాష హిందుకో (పష్తో). ఇప్పటి పాకిస్తాన్‌లో ఒక ప్రాంతంలోని కొన్ని తెగలు మాట్లాడే భాష ఇది. దీనితో పాటు హిందీ, ఉర్దు, పర్శియన్, బెంగాలీ, గుజరాతి, మరాఠీ, పంజాబీ, పాష్తో, ఇంగ్లీషు భాషలలో ఆయన దిట్ట. వీటితో పాటు ఉత్తర భారత దేశంలోని అవధి, భోజ్పూరి యాసలను అవి తన భాషలే అన్నంత సులువుగా మాట్లాడేవారు.  ఆకాలంలో హిందీ సినిమా రంగంలో త్రిమూర్తులుగా భావించిన దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవ్ ఆనంద్ లు ఒకే ప్రాంతానికి చెందినవారు. దిలీప్ కుమార్, రాజ్ కపూర్ లు పెషావర్ కు చెందిన వారు, బాల్య స్నేహితులు.  దేవ్ ఆనంద్ పంజాబ్ కు చెందిన షకెర్ గర్హ్ తహ్సీల్ కు చెందినవాడు. ఈ ప్రాంతాలిప్పుడు పాకిస్తాన్ లో వున్నాయి.  హిందీ సినిమాలలో పల్లెటూరి యువకుడిగా ఎక్కువ సినిమాలు చేసింది కూడా దిలీప్ కుమారే. గంగా జమున సినిమాలో ఆ పాత్రలు మాట్లాడేది అవధి భాష. హిందీ భాషతో కొంచెమయినా పరిచయం లేనివారికి ఇది అర్థం కాదు. హిందుస్థాని పదాలే కాని భిన్నమైన యాసలో ఉంటాయి. దిలీప్ కుమార్, వైజయంతి మాల ఇద్దరు కూడా ఆ భాషను నేర్చుకుని ఎలా మాట్లాడారంటే, వారు పుట్టినప్పటి నుండి అదే భాష మాట్లాడేవారా అనిపిస్తుంది ఈ సినిమా చూస్తున్నంత సేపు కూడా. మనకే కాదు ఆ ప్రాంతపు ప్రజలకి కూడా ఈ సినిమా అదే అనుభూతిని ఇవాల్టికి కూడా ఇస్తుంది.

ఇక్కడ ఒక నిజం ప్రస్తావించాలి. ఉత్తర భారతీయ  సోదరులకు దక్షిణ భారతీయులు హిందీ సరిగ్గా మాట్లాడరని ఒక యాసతో హిందీ మాట్లాడతారనే ఒక చిన్న చూపు ఉంటుంది. దక్షిణ భారత దేశానికి చెందిన వైజయంతి మాల హిందీ మాట్లాడుతుంటే ఆమె ప్రాంతం ఎవరికీ గుర్తుకు రాదు. అదే స్థాయిలో భోజ్పురి అవధిలను ఆమె ఈ సినిమాలో పలికిన తీరు చూసి ఇప్పటి సినిమా హీరోయిన్లు సిగ్గు పడాలి. భాష నేర్చుకోకుండానే ఆ భాషలో ఉత్తమ నటులయిపోతున్న సినీ భామలకు అసలు భాష, మాట ఆర్టిస్టు ప్రతిభకు కొలమానాలు అన్న సంగతి అర్థం కాదు. డబ్బింగ్‌పై ఆధారపడడం గొప్ప అనుకున్న ప్రస్తుత తరానికి గంగా జమున సినిమా చూపించి అసలు ఆర్టిస్టు ఎంత నేర్చుకోవాలి, ఎంతగా పాత్రతో మమేకం అవ్వాలో చెప్పాలి, అందుకే వైజయంతి మాలకు ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ఇచ్చిన ఉత్తమ నటి అవార్డు సహేతుకం. నాకు టేల్గు రాదు అని ముద్దు ముద్దుగా మాట్లాడుతూ తెలుగు హీరోల ప్రేమ సంపాదించుకునే తెలుగు నటీమణులు నటనను ఎంత దిగజారుస్తున్నారో ఇలాంటి సినిమాలు చూసి తెలుసుకోవాలి. ఆ పా నటీమణుల స్థాయికి, స్టార్డంకు తామెందుకు ఎప్పటికి చేరలేరో అర్థం కావాలి. పాత నటీమణుల పత్ల వున్న గౌరవం, ఆరాధన ఈనాటివారెందుకు అందుకోలేకపోతున్నారో తెలుసుకోవాలి.

ఈ సినిమాలో ఆ ఇద్దరి నటుల బాడీ లాంగ్వేజ్ చూస్తే వారు జీవితంలో పట్నపు గాలి పీల్చినవారు అనిపించదు. దిలీప్ కుమార్ మాట, నడక, డాన్సు ఎంత సహజంగా ఆ పాత్రలో ఒదిగిపోయి ఉంటాయో చూడాలి అంటే మచ్చుకు “నైన్ లడ్ జయిహై” అన్న పాట చూడండి. ఆ పాటకు కొరియోగ్రఫీ ఎంత గొప్పగా ఉందంటే ఇంకో వంద సంవత్సరాలయినా అది ఔట్‌డేటడ్ కాదు. సహజంగా పాటకు అనుగుణంగా కదిలే అ పల్లెటూరి వారిలో ఉన్న లయ, తాళం ముచ్చట గొలుపుతాయి. అంత మంది స్త్రీలతో దిలీప్ కలిసి చేసిన నృత్యం అందులో ఆయన హావభావాలు చూస్తే అయన పట్టణపు గాలి అనుభవించిన వ్యక్తిగా అనిపించరు. ఇప్పుడీ రకం నృత్యాలు పల్లెలలో కూడా కనుమరుగవుతున్నాయి. అసహజమైన సినిమా స్టెప్పులు అక్కడకూ వ్యాపించాయి. సహజమైన జానపద నృత్యాలలో ఉండే పల్లె ఆత్మ ఈ నృత్యంలో కనిపిస్తుంది. దిలీప్ కుమార్ ఈ పాత్రలో ఒదిగిన వైనం, ఒక్క చిన్న జంప్‌తో నేల మీద అమ్మాయి పక్కన కూర్చుని ఆమెతో పాటు ఆయన చేసిన నృత్యం, ఆ తాళానికి అనుగుణంగా శరీరాన్ని కదిలించిన విధానం ఇలా ఎన్నో మేనరిజమ్స్ ఆ పాత్రకు జీవం పోసాయి.

ఈ సినిమాలో ఒక కబడి మేచ్ ఉంటుంది. ఆ సీన్‌ని దర్శకుడు నితిన్ బోస్ చిత్రించిన తీరు చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పటి సినిమాలో హీరో ఒక ఆట ఆడుతున్నప్పుడు ఎంత హైప్ చేస్తారు మనకు తెలుసు. ఈ సినిమాలో కబడి సీనును నిజంగానే వారితో కబడీ ఆడించి, అందరి ఎక్స్‌ట్రాల మధ్య దిలీప్ కుమార్‌ని ఒకరుగా కలిపేసి , అది షూట్ చేసిన విధానం సినిమా వాతావరణానికి అతికినట్టు సరిపోతుంది. వాస్తవ జీవితానికి చాలా దగ్గరగా ఉండేలా తీసిన సినిమా ఇది. చెట్టు కింద బడి, ఆ బడిలో అక్షరాలు దిద్దుకుంటున్న పిల్లలు, అ బడిలో మేస్టారు, ఇప్పుడు కూడా మన దేశంలో ఎన్నో ఊర్లలో ప్రాథమిక పాఠశాలలు ఈ స్థితిలోనే ఉన్నాయి. కాని అవి కమర్షియల్ సినిమాలలో కనిపించవు అంతే. నితిన్ బోస్ కొన్ని సీన్లను ఎంత సింబాలిక్‌గా తీసారంటే, తరువాత ఎన్నో సినిమాలలో ఆ సీన్లు కాపీ చేసారు.

ఈ సినిమాలో గంగగా దిలీప్ కుమార్ మాట్లాడే భాషను షోలే సినిమా నుండి బందిపోటు పాత్ర వేసిన ప్రతి ఆర్టిస్టు కాపీ చేసే ప్రయత్నం చేసారు. అంజద్ ఖాన్ కూడా మిగతా పాత్రలకు విరుద్ధంగా షోలేలో అవధిని మాట్లాడే ప్రయత్నం చేసారు. అమితాబ్ బచ్చన్ తనకంటూ ఒక స్టైల్‌ను ఈ సినిమా ప్రేరణ తోనే నిర్మించుకున్నారు. రాజేష్ ఖన్నా నటుడుగా రాజ్యం ఏలుతున్న రోజుల్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి అమితాబ్‌కు ఈ గంగ పాత్ర స్ఫూర్తి. అమితాబ్ ఈ పాత్రతో అంత కనెక్ట్ కావడానికి కారణం ఆయన అలహాబాద్ ప్రాంతపు వ్యక్తి. అక్కడి జనం ఎక్కువగా మాట్లాడే భాష అవధి. అమితాబ్‌కు కూడా అవధి భాషపై చాలా పట్టు ఉంది. కాని ఏనాడు అలహాబాద్ ప్రాంతాన్నిచూడని వ్యక్తి, ఆ యాసను అంతకు ముందు ఎప్పుడూ మాట్లాడని వ్యక్తి ఒక సినిమాకు ఇంత కన్విన్సింగ్‌గా అవధి భాషను నేర్చుకుని, మాట్లాడి నటించి ఆ ప్రాంతపు జీవాన్ని సినిమాలో ప్రతిఫలించి తనలా ఆ ప్రాంతాలలో జన్మించిన వారు అచ్చెరువు చెందేలా దిలీప్ సాబ్ ఆ పాత్రను నటించిన తీరు, అలహాబాద్ ఆ పరిసర ప్రాంతాల వారు ఆ పాత్రను స్వీకరించిన విధానం చూసిన తరువాత అమితాబ్ తన విషయంలోఈ పాత్రను, దిలీప్ కుమార్ ఫర్మామెన్స్‌ను ఒక చాలెంజ్‌గా తీసుకున్నారు. దిలీప్ కుమార్‌ని జీవితాంతం తన అభిమాన హీరోగా నిలుపుకున్నారు అమితాబ్.

సలీమ్ జావేద్‌లు ఈ సినిమా స్పూర్తితోనే ‘దీవార్’ సినిమాకు కథ, మాటలు రాసుకున్నారు. ఒకే పాత్రలో కామెడీ, రొమాన్స్, ట్రాజెడీ, విలనిజాన్ని కలిపి దిలీప్ కుమార్ చూపిన విధానానికి ఆ తరువాతి తరం నటులు ఎంతగా ఇన్స్పైర్ అయ్యారంటే ఈ సినిమా ప్రభావం నుండి వారు తప్పించుకోలేక పోయారు. అమీర్ ఖాన్ లగాన్, కూడా ఈ సినిమాలో గంగ మేనరిజం నుండి స్ఫూర్తి పొందిన పాత్ర. ‘గంగా జమున’ ఇద్దరు అన్నదమ్ముల కథ. తండ్రి లేని ఆ పిల్లలిద్దరిని తల్లి పెంచుతుంటుంది. అభిమానవతి అయిన ఆమెపై దొంగతనం నేరం మోపబడినప్పుడు ఆ అవమానం భరించలేక ఆమె మరణిస్తుంది. ఆమె చనిపోయిన తరువాత తమ్ముడి భారాన్ని తన పై వేసుకుని అతనికి చదువు చెప్పిస్తాడు గంగ. ఊరిలోని జమీందారు గంగను దొంగగా నిరూపించి జైలుకు పంపిస్తాడు, విడుదల అయ్యాక ఆ జమీందారుతో వైరం పెట్టుకున్నప్పుడు అతన్ని ఊరు వారందరు అడ్డగిస్తారు. తనను తాను రక్షించుకోవడానికి తుపాకి పట్టుకుంటాడు గంగ. ఇక బందిపోటయిన ఈ అన్నను పట్టుకోవడానికి పోలీస్ అయిన జమున వస్తాడు. అన్నను చట్టానికి లొంగిపొమ్మంటాడు. గంగ అప్పటికే ధన్నోని పెళ్ళి చేసుకుంటాడు. ఆమె గర్భవతి. మరో సారి భర్త జైలుకి వెళ్ళడం ఆ తరువాత అనిశ్చత జీవితం ధన్నోని భయపెడుతుంది. గంగ ధన్నో మళ్ళీ అడవికి వెళ్ళిపోతారు. చివరకి పోలీసుల కాల్పుల్లో ధన్నో మరణించడం, ఊరి వారి మీద ప్రతికారం తీర్చుకుందాం అనుకునే గంగను జమున కాల్చి చంపడం సినిమా ముగింపు.

సినిమాలో గంగ చాలా నిజాయితీ పరుడు, అమాయకుడు, మనుష్యులని విపరీతంగా ప్రేమించేవాడు. అతని జీవితంలో జరిగే ప్రతి నష్టం కూడా ఇతరులకు సహాయం చేసే ప్రయత్నంలో జరుగుతుంది. చిన్నప్పుడు జమీందారు బావమరిది నగలు దొంగలించి ఆ పెట్టెను వీధిలో పడేస్తే అందమైన ఆ పెట్టెను   తల్లి కోసం ఇంటికి తీసుకుని వస్తాడు గంగ. ఆ పెట్టె ఇంట్లో దొరికిందని గంగ తల్లిని దొంగ అని జైలుకి పంపిస్తుంది జమీందారిణి. గంగ పెద్దవాడయిన తరువాత ధన్నోపై అత్యాచారం చేయబోయిన జమీందారుతో తలబడి అతనితో శతృత్వం పెంచుకుంటాడు. చివరకు ఆ కోపంతోనే జమీందారు గంగపై దొంగతనం అభియోగం మోపుతాడు. అమాయకంగా విరక్తిగా తానే దొంగనని ఒప్పుకుని జైలు శిక్ష అనుభవిస్తాడు గంగ. విడుదలయి వచ్చిన తరువాత తన తమ్ముడు చాలా హీన స్థితిలో ఉన్నాడని తెలుసుకుని అతన్ని రక్షించుకోవడానికి డబ్బు కోసం జమీందారింటికి వెళతాడు. నిర్లక్ష్యంగా మాట్లాడిన జమీందారు పైకి గొడవకు వెళ్ళి అతని తుపాకి దొంగలించి పారిపోతాడు. ఊరి వారందరు తననో దొంగగా దగాకోరుగా చూసి కోట్టడానికి మీదకు వస్తుంటే పొరపాటున పేలిన ఆ తుపాకి వారిలో కలిగించిన భయాన్ని చూసి దాన్నే తన ఆయుధంగా మార్చుకుంటాడు. చివరకు తమ్ముడు వచ్చి తనకో మార్గం చూపి తనను ఊరిలోకి తీసుకువెళతాడని తన ఇంట్లో తాను ఉండే రోజు వస్తుందని ఆశిస్తే, ఆ తమ్ముడు గంగను లొంగిపొమ్మని అంటాడు. తన ఊరికి దూరంగా ఉండలేక నలిగిపోతున్న గంగ దానికి నిరాకరిస్తాడు. తమ్ముడిని ప్రేమించిన జమీందారు  కూతురు సవతి తల్లి బలవంతంపై మరో వివాహానికి సిద్ధపడినప్పుడు తమ్ముడు ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి ముందుకు రానప్పుడు గంగ బలవంతంగా ఆ అమ్మాయిని వివాహ మంటపం నుండి తీసుకువస్తాడు. ఆ ప్రయత్నంలోనే పోలీసులకి ఎదురు పడతాడు. తమ్ముడిని తిడుతున్న భార్యను పక్కకు తోసేస్తే ఆమె ఎవరో కాల్చిన తుపాకి గుండుకు బలి అవుతుంది. ఇలా గంగ ఇతరుల మంచి కోసం ఏం చేయబోయినా అది అతనికి శిక్షగా మారుతుంది. ఆడుతూ పాడుతూ ఆనందంగా అమాయకంగా ఉండే ఒక వ్యక్తి చివరకు చట్టాన్ని అతిక్రమించే వ్యక్తిగా మారే పరిస్థితులు ఆ క్రమంలో అతని వ్యక్తిత్వంలో వచ్చే మార్పులను దిలీప్ కుమార్ అభినయించిన తీరు అత్యద్భుతం. దిలీప్ కుమార్‌లో ఏం ఉంది అనే వారు ఈ సినిమా చూడాలి, తనది కాని భాషను, నేర్చుకుని ఆ ప్రాంతపు జీవితాన్ని తన పాత్ర ద్వారా నటించి ఒక పల్లెటూరి అమాయక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అతన్ని విషాదం వైపుకి నెట్టిన అతని జీవిన పరిస్థితులను, దిలీప్ అభినయించిన తీరు సినీ పండితులని సైతం ఆకర్షించింది. కమర్షియల్ సినిమాకు దూరంగా ఉండే సత్యజిత్ రే, శ్యాం బెనెగల్ లాంటి వారు కూడా దిలీప్ సాబ్‌ని గౌరవిస్తారు, అతని మెథడ్ యాక్టింగ్‌ని ప్రస్తావిస్తారు. ఒక్క గంగ జమున సినీ ఆర్టిస్టులకు ఒక ఇన్సిట్యూషన్ లాంటిది.

ఈ సినిమాకు నితిన్ బోస్ దర్శకత్వం వహించారు. దాదా సాహెబ్ అవార్డు పొందిన దర్శకులు ఆయన. ఇందులో జమున పాత్రలో నటించిన నాసిర్ ఖార్ దిలీప్ కు స్వయంగా సోదరుడు. ప్రస్తుత నటుడు అయుబ్ ఖాన్ తండ్రి. సినిమాకు డైలాగులు వాజాహత్ మిర్జా  రాసారు. వీరి ఉర్దూ, హిందీ కలగలిసిన డైలాగులు అప్పటి సినిమాలలో చాలా పాపులర్. ఈ సినిమాకు పని చేసిన టీం అంతా కూడా అవధి బాషను అధ్యయనం చేసి, అక్కడి ప్రజలను గమనించి కథను సిద్ధం చేసుకున్నారు. 1971లో ఈ సినిమాను తమిళంలో ఇరు తురువమ్ అనే పేరు మీద రీమేక్ చెసారు. 1980లో ఇదే కథతో మళయాళంలో లావా అనే సినిమా తీసారు. సినిమాకు సినిమాటోగ్రఫీ వి. బాబా సాహెబ్ అందించారు. ఈ సినిమాలో దిలీప్ కుమార్ కొండలపైకి పారిపోతున్నప్పుడు ఒక సీన్ ఉంటుంది. దాహంతో నదిలోకి దిగి నోటితో నీరు తాగుదామనుకుంటాడు గంగ. నీటిలో అతని ప్రత్యర్థుల ప్రతిబింబాలు కనిపిస్తాయి. అవతలి ఒడ్డు నుంచి వారు అతన్ని పట్టుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ షాట్ ఆ సినిమా మూడ్‌ని బాగా ఎలివేట్ చేస్తుంది. అలాగే తుపాకి పేల్చి ఊరి వారిని బెదిరిస్తాడు గంగ, అందరూ అతని నుండి దూరంగా పారిపోతారు. ఒక్క ధన్నో మాత్రం వారి మధ్య అతని వైపుకు వస్తుంది. ధన్నో, గంగల మధ్య అనుబంధాన్ని వివరంచే గొప్ప సీన్ ఇది. ప్రేమ కోసం పెద్ద డైలాగులు లేకుండా వారిద్దరికి ఒకరిపై ఒకరికున్న అనుబంధాన్ని చాలా సున్నితంగా చూపిస్తారు దర్శకులు. చిన్నప్పటి నుండి శత్రువులుగా పోట్లాడుకుంటూ ఉండే వీరిద్దరూ జమీందారి అత్యాచార యత్నం నుంచి ధన్నోని గంగ కాపాడినప్పటి నుండి దగ్గరవుతారు. జమీందారుని కొట్టమని గంగను అభ్యర్థిస్తూ అరిచే ధన్నోలో తనకే తెలియకుండా గంగపై ఆమెకున్న నమ్మకం తెలుస్తుంది. జైలు నుండి విడుదలయి వచ్చిన తరువాత తన కోసం గంగ ఎదురు చూడడం, తనకు గౌరవం ఇవ్వడం చూసి “ఈ చోకరి తో ఎక్ దమ్ గయ్యా హోయి గయి” అన్నప్పుడు దిలీప్ కుమార్ ముఖంలో అమాయకత్వం ఆకర్షిస్తుంది. తన కోసం ఇంతలా మారిన ఆమెను ఎంత అమాయకంగా స్వీకరిస్తాడు గంగ. ఆ పాత్ర వ్యక్తిత్వం ప్రతి మాటలో కనిపిస్తూ ఉంటుంది.

ఉర్దూ ప్రేమ పాటలకు పేరు గాంచిన షకీల్  బదాయినీ, ఇందులో పూర్తి అవధి భోజ్పురి యాసలో పాటలు రాసారు. సినిమాలో మొత్తం ఎనిమిది పాటలుంటాయి. హేమంత్ కుమార్ పాడిన “ఇన్సాఫ్ కీ డగర్ పె” హిందీ సినీ గీతాలలో చాలా గొప్ప పాట. ఈ దేశ యువత నుండి ఆ తరం ఏం ఆశిస్తుందో చెప్పే అద్భుతమైన పాట ఇది. “డుండో డూండో రే సాజనా” మంచి రొమాంటిక్ పాట. ప్రియునితో రాత్రి గడిపిన తరువాత తన చెవి రింగు కనిపించట్లేదని చెప్పే ప్రియురాలి పాట, చాలా సున్నితమైన రొమాన్స్ పలికించిన గీతం అది.  ఈ సినిమాలో నా మానూ, నా మనూ పాట అత్యద్భుతమయినది. తీగలు తీగలుగా సాగి, లతా గొంతు రొమాన్సు తేనెను బొట్లు బొట్లుగా చిలకరిస్తుంది. పరమాద్భుతమయిన పాట ఇది.  ఇక మరో అద్భుతమైన గీతం లత గొంతులో పలికిన “దో హంసో కా జోడా”. “మొరా సుఖ చైన్ భీ జీవన్ భీ మొరా చీన్ లియా, పాపీ సంసార్ నే సాజన్ భీ మెరా చీన్ లియా, పియా బిన్ తడపె జియా రతియా బితౌ కైసె బిరగా కి అగ్ని కొ అసువర్ సె బుజాఊ కైసె” అంటూ సాగుతుంది ఈ పాట.

గంగ జైలుకి వెళతాడు తొమ్మిది నెలల శిక్ష పడుతుంది. అప్పుడు వచ్చే ఈ పాటలో ప్రేమించిన వ్యక్తి లేకుండా తానెట్లా జీవించాలి అని బాధపడే ప్రియురాలి వేదన వినిపిస్తుంది.  ఈపాట చిత్రీకరణ కూడా గొప్పగా వుంటుంది. దిలీప్ కుమార్ ఒక చిన్న జైలుగదిలో తిరుగాడుతూండటం వారిద్దరూ బంధితులన్న భావనను అతి సున్నితంగా కలిగిస్తుంది.  సినిమాలో ఆ ఇద్దరి మధ్య గొప్ప ప్రేమ డైలాగులు నడవవు. కాని వారి మధ్య ప్రేమ చిగురించిందని, ఒక బంధం ఏర్పడిందని ప్రేక్షకులకు అర్థం అవుతూనే ఉంటుంది. ఎక్కడా అతిగా డైలాగులు ప్రేమ ప్రదర్శనలు లేకుండా ఒకరిపై మరొకరికున్న ఆ బంధాన్ని ఈ సినిమా వ్యక్తీకరించిన విధానం చాలా బావుంటుంది. ఆ తరువాత వచ్చే ఈ విరహ గీతం ప్రేక్షకులను కదిలిస్తుంది. నౌషాద్ సంగీతం సినిమాకు అదనపు బలం.

“గంగ జమున” సినిమాకు అందం, బలం అందులోని ఆ సహజత్వం, సరళ స్వభావం, ఎక్కడా అనవసరమైన డాంబికాలు చూపని పాత్రల చిత్రణ. దిలీప్ కుమర్ అభిమానులు ఇప్పటికీ బాధపడేది ఈ సినిమాకు దిలీప్ సాబ్‌కు ఉత్తమ నటుడి అవార్డు రాకపోవడం. నామినేట్ అయినా ఆ సంవత్సరం జిస్ దేశ్ మే గంగా బహ్తీ హై సినిమాకు రాజ్ కపూర్‌కు ఆ అవార్డు లభించింది. ఇది అభిమానులను నిరాశ పరిచినా, గంగా జమున హిందీ సినిమా చరిత్రలో ఒక ట్రెండ్ సెటర్‌గా మిగిలిపోవడమే కాక, దిలీప్ కుమార్ సినిమాలను దగ్గరగా పరిశీలించిన వారందరికీ ఈ సినిమాలో వారి నటన వారి కెరీర్ బెస్ట్‌గా అనిపిస్తుంది. గంగ జమున సినిమాకు స్క్రీన్ ప్లే, కథ కూడా దిలీప్ కుమారే సమకూర్చారు. ఇది వారే స్వయంగా నిర్మించిన చిత్రం కూడా. గంగ పాత్రలో సినీ విశ్లేషకుల మనసులో చెరగని ముద్ర వేసారు దిలీప్ కుమార్, నటనకు ఒక స్థాయి కల్పించి దానికి చేరుకొమ్మని తరువాతి తరానికి సవాలు విసిరారు. ఆ సవాలుని అందుకున్న వారే తరువాతి తరంలో మంచి నటులనిపించుకున్నారు. ఈ సవాలును అందుకుని గంగ పాత్రకు ప్రతిబింబం అనిపించే యాంగ్రీ యంగ్ మాన్ ఇమేజీతో అమితాభ్ మిలీనియం సూపర్ స్టార్ గా ఎదిగాడు. అంటే, పల్లెకు చెందిన గంగ పాత్ర వ్యవస్థపై ఆగ్రహంతో తుపాకీ పట్టి చేసే తిరుగుబాటు, 1970లో వ్యవస్థ పట్ల విసిగి తిరుగుబాతుచేసే ఆంగ్రీ యంగ్ మాన్ పాత్రను ప్రేక్షకులు ఆమోదించేందుకు బాటను సుగమంచేసిందన్నమాట. ఇదీ, ఒక తరం నుంచి మరో తరం అందుకోవటమంటే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here