[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]
ముక్కోణపు ప్రేమ కథా చిత్రాలకు మొదటి రూపం – బాబుల్
[dropcap]1[/dropcap]950లో వచ్చిన సినిమా బాబుల్. ఆ సంవత్సరం వచ్చిన సినిమాలలో ఇది కమర్షియల్‌గా పెద్ద హిట్. ఇందులో ప్రధాన పాత్రలలో దిలీప్ కుమార్, నర్గిస్, మునావర్ సుల్తానాలు నటించారు. దిలీప్ కుమార్ ట్రాజెడీ కింగ్ గా గుర్తింపు పొందేందుకు బీజం వేసిన సినిమా ఇది. సినిమాలో మొత్తం పదిహేను పాటలున్నాయి. సంగీతం నౌషాద్ . పాటల రచయిత షకీల్ బదాయునీ. షంషాద్ బేగం, తలత్ మెహమూద్, రఫీ లతా మంగేష్కర్లు పాటలకు జీవం పోసారు. ఇది ఒక ముక్కోణపు ప్రేమ కథా చిత్రం. ఒక హీరో ఇద్దరు హీరోయిన్ల కాన్సెప్టు. కాని పాత్రలను మలిచిన తీరు బావుంటుంది. ప్రేమ అనే విషయాన్ని మూడు పాత్రలు తమ జీవితంలో ఎలా ఆపాదించుకున్నారో చెప్పిన సినిమా ఇది.
అశోక్ ఒక ధనవంతుని కొడుకు. అతనికి బాధ్యత అలవాటు చేయాలని తండ్రి పోస్ట్ మాస్టర్ ఉద్యోగం వేయిస్తాడు. ఒక ఊరికి పోస్ట్ మాస్టర్‌గా వస్తాడు అశోక్. అతని క్రింద పని చేసి వ్యక్తి కూతురు బేలా. ఒంటరివాడని అతని అవసరాలు బేలా చూసుకుంటుంది. ఆ క్రమంలోనే అశోక్‌ని ఆమె ప్రేమించడం మొదలెడుతుంది. అశొక్ బేలాతో చనువుగా ఉంటాడు కాని ఆమెను ప్రేమించడు. అతని చనువుని ప్రేమ అని ఊహించుకుంటుంది బేలా. అదే ఊరిలో జమ్నాదాస్ అనే ధనికుడు అశోక్ తండ్రికి మిత్రుడు. అతని కూతురు ఉష. చిన్న గొడవతో మొదలయిన వీరి పరిచయం తరువాత ప్రేమగా మారుతుంది. ఉష ధనవంతురాలి కూతురు, చదువుకున్నది, అందమయినది, కాబట్టి అశోక్‌కి అన్ని విధాల జోడి అనిపిస్తుంది. బేలా వారిద్దరిని చూసి ఈర్ష్యతో దహించుకుపోతుంది. ఆమె ఎంతగా అశోక్‌ని ప్రేమిస్తుందంటే అతన్ని వేరొకరితో చూడలేదు. అశోక్ పేదదయిన బేలా వివాహానికి నగలు కూడా కొని ఇస్తాడు. అది కూడా తనపై ప్రేమతోనే అని నమ్ముతుంది బేలా.
అశోక్ ఉషని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. వారిద్దరి ప్రేమ భరించలేని బేలా ఉషని ఒక రోజు కలిసి ఆమె తన ప్రేమను దొంగలిస్తుందని, అశోక్ తనని ప్రేమిస్తున్నాడని, పెళ్ళి చేసుకోబోతున్నాడని, ఉష రాక వారి ప్రేమకు భంగం కలిగిస్తుందని, ఆమెను తమ జీవితాలనుండి తప్పుకొమ్మని అర్థిస్తుంది. ఉష బేలా మాటలు నమ్ముతుంది. తన వలన ఒక అమాయకురాలి జీవితం సమస్యల మయం అవకూడదని అశోక్‌ని కలవడం మానుకుంటుంది. తండ్రి కుదిర్చిన వివాహానికి ఒప్పుకుంటుంది. అశోక్ మాత్రం ఉష తననుండి దూరం అవడం భరించలేకపోతాడు. చాలా బాధపడతాడు. ఆ బాధలో ఆక్సిడెంట్‌కి గురి అవుతాడు. బేలా అతనికి సేవలు చేస్తుంది. కాని నిత్యం ఉషను తలుచుకునే అతన్ని చూసి బాధపడుతుంది. ఉష సాంగత్యాన్నే అతను కోరుకుంటున్నాడని, ఆమె లేకపోతే చనిపోతాడేమో అని భయపడి ఉషను కలిసి నిజం చెబుతుంది.
బేలా ఈ పరిణామాలకు సంతోషిస్తుంది. ఉష అశోక్‌ని వివాహం చేసుకొమ్మని, అతను వివాహం చేసుకుంటానని అంటేనే తాను పెళ్ళికి సిద్ధపడతానని అంటుంది. అశోక్ ఆమెకు తాను కూడా త్వరలో పెళ్ళి చేసుకుంటానని ప్రమాణం చేస్తాడు. ఉష పల్లకిలో అత్తవారింటికి వెళ్తున్నప్పుడు ఆ వీడుకోలుని చూడాలని బేల ఒక చెట్టుపైకి ఎక్కుతుంది. కాని ప్రమాదవశాత్తు జారి పడి అపస్మారక స్థితికి చేరుకుంటుంది. ఆమె ఇంక ఎక్కువ సేపు బ్రతకదని తెలిసి ఆమె ఆఖరి కోరిక తీర్చడానికి ఆమె పాపటిలో కుంకుమ అద్దుతాడు అశోక్. బేలాకి ఎప్పుడూ తనని ఒక ముసుగు వీరుడు గుర్రం మీద వచ్చి తీసుకువెళ్ళిపోతూ ఉన్నట్లు కల వస్తూ ఉంటుంది. మరణానికి దగ్గరవుతున్నప్పుడూ మళ్ళీ ఆ ముసుగు వీరుడు కనిపిస్తాడు. అతను తన కోసం వచ్చిన మృత్యువు అని ఆమెకు అప్పుడు అర్థం అవుతుంది. అశోక్ భార్యగా మరణిస్తుంది.
సినిమా పాటలు, పాత్రల నడకలో కొంత మెలోడ్రామా కనిపిస్తుంది. ముఖ్యంగా నర్గిస్ కొత్తగా వచ్చినప్పుడు చేసిన సినిమా ఇది. ఇందులో ఆమె నటనలో పరిణతి కనిపించదు. ఈ సినిమాను గుర్తు చేసుకోవడానికి ఒక కారణం ఉంది. ఇది 1950 అంటే స్వతంత్రానికి మూడు సంవత్సరాల తరువాత వచ్చిన సినిమా. అప్పటికే దేశ విభజన జరిగిపోయింది. ఈ సినిమాలో నటించిన నటులు సాంకేతిక వర్గం చాలా వరకు ముస్లింలు. నర్గిస్, దిలిప్, మునావర్ సుల్తానా, ఖుర్శీద్, నౌషాద్, షకీల్, కథ రాసిన అజ్మి బాజిద్‌పురి, ఎడిటర్ మూసా మంసూర్, ఒక లత తప్పించి అందరూ గాయకులు ముసల్మానీయులే. వీరంతా భారతదేశంలోనే ఉండడానికి ఇష్టపడ్డారు. ఎన్ని మత విధ్వంసాలు జరిగినా ఆ రోజుల్లో భారతదేశం లోనే ఉండాలని వారనుకున్నారంటే ఇంత పెద్ద ఎత్తున సినీ రంగంలో విస్తరించి పని చేసారంటే గర్వించదగ్గ పరిణామం. నటులందరూ ముసల్మానులు కాని వేసింది హిందూ పాత్రలు. ఉత్తర భారత హిందీలో సినిమా నడిచినా హీరో హీరోయిన్లు ఒకరినొకరు ఆప్ అని సంబోధించుకోవడం చూస్తాం. అసలు పరస్పర సంబోధనలో ఆ గౌరవం ఇప్పుడు ఆధునికత మాటున కనిపించదు. మనం మాట్లాడే భాష ఎంతటి గాంభీర్యాన్ని కోల్పోయిందో ఈ సినిమాలలోని హీరో హీరోయిన్ల సంభాషణ చూసి తెలుసుకోవచ్చు. ఇప్పటి తరం అలా మాట్లాడడం ఊహించగలమా? హిందీ భాష పై ఉర్దూ ప్రభావం, హిందీ సినిమా పై ఉర్దూ ప్రభావం ఈ సినిమాలో గమనించవచ్చు.
ఇక సినిమా అంతా కూడా ఇండోర్ లోనే తీసారు. ఆ సెట్స్‌లో రాత్రి ఎఫెక్టుకి వాడిన లైటింగ్ గమనించాలి. ఫాలి మిస్త్రి అప్పట్లో పేరున్న సినిమాటొగ్రాఫర్. గైడ్ సినిమాకు కూడా ఈయనే సినిమాటోగ్రాఫర్‌గా పని చేసారు. దేవానంద్ సినిమాలు చాలా వాటికి కెమెరా పనితనం ఇతనిదే. సినిమాలో రాత్రి సన్నివేశాలు చిత్రించడంలో ఇతనిది అందె వేసిన చేయి. ఈ సినిమాలో పాటలన్నీ కూడా రాత్రి పూట లేదా వెన్నెల్లో సాగుతాయి. ఈ పాటలలో ఫాలి మిస్త్రి పనితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఒక అద్వితీయ అందం ఆస్వాదిస్తాం ఆ షాట్లన్నిట్లో కూడా. గురుదత్ సినిమాలకు కెమెరామాన్ అయిన వీ.కే మూర్తి ఈయన శిష్యుడే. అప్పటి తరం నాయిక శ్యామాని ఈయన వివాహం చేసుకున్నారు.
ఇక నౌషాద్ సంగీతం గురించి చెప్పక్కరేదు. “ఛోడ్ బాబుల్ కా ఘర్” అనే పాటను లత, రఫీ, షంషాద్ బేగమ్‌లు వేరు వేరు సందర్భాలలో పాడతారు. ఇప్పటికి ఉత్తరాదిన పెళ్ళి పాటలలో ఇది వినిపిస్తూనే ఉంటుంది. నదీ కినారే సాథ్ హామారే పాటలో ఫాలి మిస్త్రీ ఫోటోగ్రఫీ పనితనం కనపడుతుంది. రఫీ ఈ పాటలో పడవవాని కోసం గొంతు విప్పుతారు. ఈ సినిమా వచ్చిన సమయంలో షంషాద్ చాలా పాపులర్ గాయని. నౌషాద్, ఓ పీ నయ్యర్, ఎస్.డి బర్మన్ లాంటి వారు సంగీత దర్శకులుగా పేరు సంపాదించుకోవడానికి షంషాద్ పాటలే సహాయపడ్దాయని వారే చాలా సందర్భాలలో చెప్పుకున్నారు కూడా. ఈ సినిమాలో తలత్‌తో “మిల్తే హీ ఆంఖే దిల్ హువా దీవానా కిసీకా” అని షంషాద్ పాడిన పాపులర్ పాట ఈ రోజుకి కూడా వినిపిస్తూనే ఉంటుంది. ఆ పాటలో షంషాద్ గొంతు చాలా బావుంటుంది. ఎందరో గాయకులు తరువాత వచ్చినా ఈ రోజుకీ మరో షంషాద్ బేగం మనకు లేకపోవడం గమనిస్తే ఆమె పాటల గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. కిషోర్ కుమార్ మదన్ మోహన్‌ల సంగీత జీవితం షంషాద్ పాటలకు కోరస్ పాడడంతో మొదలయ్యింది. సినిమాలో ఉష పాత్ర వేసిన మునావర్ సుల్తానా అప్పట్లో చాలా పాపులర్ నటి. సురయ్యా, నూర్జహాన్ సమకాలీకురాలు. ఈ సినిమాలో మొత్తం 15 పాటలున్నాయి. సినిమా కథ ప్రధానంగా పాటల సహాయంతో నడుస్తుంది. పాటల నడుమ సంభాషణలున్నట్టనిపిస్తుంది. ఈ చిత్రాన్ని సమీక్షించిన అయొవా(IOWA) యూనివర్శిటీ విమర్శకులు this film is essentially a ghazal anthology in which brief dialogues serve largely to connect and frame each successive lyric అని అభిప్రాయపడ్డారు.
బాబుల్ సినిమా గాయకుడిగా తలత్ మహమూద్ మరచిపోలేని సినిమా. మహమ్మద్ రఫీ ఉచ్చస్థాయికి చేరెందుకు దారి సుగమం చేసిన సినిమా. ఈ సినిమాలో తలత్ మహమూద్ ఆరు పాటలుపాడేడు. రఫీ పాడినవి రెండే పాటలు. అంటే, నౌషాద్ తలత్ కే ప్రాధాన్యం ఇస్తున్నాడన్నమాట. కానీ, ఈ సినిమా పాట మితే హి ఆంఖె పాట రికార్దింగ్ సమయంలో తలత్ సిగరెట్ తాగుతూ నౌషాద్ కంటబడ్డాడు. నౌషాద్ కు రికార్డింగ్ స్టూడియో మందిరంతో సమానం. దాంతో, ఈ సినిమా తరువాత నౌషాద్ మళ్ళీ తలత్ మహమూద్ తో పాట రికార్డ్ చేయలేదు. ఆద్మీ, లవ్ అండ్ గాడ్ సినిమాల్లో చెరో పాట నౌషాద్ తలత్ తో పాడించేనాటికి రఫి అందనంత ఎత్తుకు ఎదిగాడు. ఆ ఎదుగుదలను వేగవంతం చేసిన బైజు బావ్రా సినిమాలో పాటలు పాడాల్సిన తలత్ ను తొలగించి రఫీ తో పాడించేందుకు బాబుల్ సినిమా కారణమయింది.
బాబుల్ సినిమా హిందీ సినిమాల్లో తొలి సారిగా హాస్య నటిని ప్రవేశపెట్టిన సినిమా. అఫ్సానా లిఖ్ రహీ హూన్ అనే అద్భుతమయిన పాట పాడిన ఉమా దేవి, టున్ టున్ గా రూపాంతరంచెందిన సినిమా ఇది. ఆమెకు టున్ టున్ అన్న పేరుపెట్టింది దిలీప్ కుమార్ కావటం విశేషం.
దిలీప్ కుమార్ అందంగా కనిపించే సినిమాలలో ఇది ఒకటి. అసలు లవ్ ట్రయాంగిల్‌కు ఒక రూపం దిలీప్ సినిమాలతోనే వచ్చింది. బాబుల్‌లో అశోక్ ప్రేమను బాధ్యతగా చూస్తే, బేలా దాన్ని అధికారం అనుకుంటుంది. ఉష దృష్టిలో ప్రేమకు అర్థం త్యాగం, అందుకే అశోక్ బేలాకు మాట ఇచ్చాడని తెలిసి తాను బాధపడినా వారిద్దరి జీవితాల నుండి తప్పుకుంటుంది. అశోక్ ఆక్సిడెంట్ గురించి తెలుసుకుని బాధపడుతుంది కాని తానుగా అతని వద్దకు రాదు. ఈ మూడు పాత్రల చూట్టూ అల్లిన ఈ ప్రేమ కథ, దిలీప్ కుమార్ సినిమాలలో చాలా పెద్ద కమర్షియల్ హిట్. బేలాగా నర్గిస్‌లో కొంత అపరిపక్వత కనిపించినా, ఆమెలోని ఈర్ష్య భావాన్ని ప్రేమికులను విడదీసిన పాపాన్ని ఆమె మరణంతో కడిగేసి దర్శకులు ఆమె పాత్రను కూడా ప్రేక్షకులకు దగ్గర చేయగలిగారు. ఈ సినిమా తరువాత ట్రయాంగిల్ లవ్ స్టోరీల ట్రెండ్ ఊపందుకుందని చెప్పవచ్చు.