ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 40 – కర్మా

2
2

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

సుభాష్ ఘాయ్ దిలీప్ కుమార్‌తో తీసిన మరో మల్టీ స్టారర్ సినిమా ‘కర్మా’

[dropcap]సు[/dropcap]భాష్ ఘాయ్ ‘విధాత’ సినిమా తరువాత 1986లో దిలీప్ కుమార్‌తో తీసిన మరో సినిమా ‘కర్మా’. విధాత లాగే ఇది కూడా ఒక మల్టీ స్టారర్. ఇందులో దిలీప్ కుమార్‌తో మొదటిసారి నూతన్ నటించారు. నూతన్ కూడా యాభైవ దశకం సినిమాలలో గొప్ప నటిగా పేరు తెచ్చుకున్నారు. బిమల్ రాయ్‌కి ఇష్టమైన నటి ఆవిడ. కాని ఎందుకో నూతన్ దిలీప్ కుమార్‌లు కలిసి ఏ సినిమాలో నటించలేదు. అంతకు ముందు ఒక సినిమా చాలా భాగం తీసినా అది ఎందుకో రిలీజ్ అవకుండా ఆగిపోయింది. అది జరిగిన చాలా సంవత్సరాల తరువాత వారిద్దరిని జోడీగా సుభాష్ ఘాయ్ ఈ సినిమాలో నటింపజేసారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ విలన్‌గా నటించారు. మిగతా పాత్రలలో జాకీ ష్రాప్, నసీరుద్దీన్ షా, అనిల్ కపూర్, శ్రీదేవి, ఫూనమ్ ధిల్లాన్, శక్తీ కపూర్, దారా సింగ్, నటించారు. సుభాష్ ఖాయ్ భారీ సినిమాలకు ఆ రోజులో ట్రేడ్ మార్క్ దర్శకుడు. ఈ సినిమాను తనకు నచ్చిన ప్రమాణాలలో తీసి దీన్ని పెద్ద బాక్సాఫీస్ హిట్ చేసారు.

దిలీప్ కుమార్ మొదటి సినిమాలను నుండి వరుసగా అన్నీ చూసుకుంటూ ఈ సినిమాకు రావడం వలన హిందీ సినిమాలో వచ్చిన ఎన్నో మార్పులను అధ్యయనం చేస్తూ, మారిన సామాజిక, నైతిక, ప్రమాణాలను కూడా తెలుసుకునే అవకాశం కలిగింది. అంతకు ముందు సినిమాలలో హీరోయిన్లకు ఈ సినిమాలలో శ్రీదేవి పాత్రను పోల్చి చూస్తే ఎంత అనుహ్యంగా స్త్రీ పరంగా సమాజ దృష్టికోణం మారుతూ వచ్చిందో అర్థం అవుతుంది. స్త్రీ చదువుకోని రోజుల్లో ఆమెను ఇంట బంధించి ఉంచి స్వేచ్చగా ఆలోచించనీయని రోజుల్లో సినిమాలలో చూపిన స్రీ పాత్రలన్నీ గొప్ప వ్యక్తిత్వంతో కనిపిస్తాయి. దిలీప్ సాబ్ సినిమాలో అన్ని పాత్రలను తరచి చూస్తే ఒక నర్గిస్, నళిని జయవంత్, మధుబాలా, మీనా కుమారీ, కామినీ కౌషల్, వైజయంతిమాల, నిమ్మి వీరందరూ కూడా నటులతో సమానంగా నటించేవారు. వారి పాత్రలకు అంత బలం ఉండేది. ఆ సినీ సాహిత్యానికి కూడా అంత బలం ఉండేది.

కాని ఎనభైలలోకి వచ్చేసరికి స్త్రీలకు స్వేచ్ఛ వచ్చింది, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మరి ఆ కాలంలో స్త్రీలను వలువలు ఒలిచి చూపడం ఎటుకు పయనమో అర్థం కాదు. పోనీ ఆ స్త్రీ పాత్రలకు పురుష పాత్రలతో పాటు సమానమైన బలం ఉందా అంటే అదీ లేదు. కేవలం పాటలు, అంగాంగ ప్రదర్శనలకే పరిమితం అయిపోయిన తారలు ఉద్భవించారు. అయినా అప్పటి సినిమాలను చూస్తే ఒక నటికి మరో సినిమాలోనయినా నటించే అవకాశం వచ్చేదేమో, శ్రీదేవి, పూనమ్ ధిల్లాన్‌లు కొన్నిమంచి సినిమాలు కూడా చేసారు. ప్రాధాన్యమున్న పాత్రలు చేసారు. 2000కి వచ్చేసరికి సినిమాలో స్త్రీ ఒక భోగ వస్తువు మాత్రమే. ఒక కమోడిటీ మాత్రమే అయిపోయింది. ఎంతో కష్టం మీద తప్ప స్త్రీకి పురుషునితో సమానంగా ప్రాధాన్యం ఉన్న పాత్రలు సృష్టించబడలేదు కమర్షియల్ సినిమాలో. పారలెల్ సినిమాలో షబానా, స్మితా, దీప్తీ నావెల్ లాంటి నటులు కనిపించినా, కమర్షియల్ సినిమాలో స్త్రీ పాత్రల పరిస్థితి చాలా సందర్భాలలో అధ్వానంగా కనిపిస్తుంది. దిలీప్ కుమార్ సినిమాలన్నీ వరుసగా చూస్తున్నప్పుడు, ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ ముందు అర్ధ నగ్నంగా నీళ్లలో తడుస్తూ శ్రీదేవి చేసిన నృత్యం చూస్తే నాకు కలిగిన ఆలోచన ఇది.

రాణా విశ్వ ప్రతాప్ సింగ్ ఒక జైలుకి జైలర్. అతని దృష్టిలో పరిస్థితుల కారణంగా నేరం చేసేవారు కొందరయితే, స్వతహాగా నేరంతో జీవితం గడిపే క్రూరులు మరికొందరు. వారిద్దరిని ఒకే రీతిగా శిక్షించడం తప్పన్నది అతని వాదన. పరిస్థితుల కారణంగా నేరస్థులయిన వారిని గుర్తించి, వారిని మార్చి దేశ ప్రయోజనానికి ఉపయోగించవచ్చనేది అతని ఆలోచన. అతని కుటుంబం అంతా కుడా అతనికి ఎలాట్ అయిన జైలు క్వార్టరులోనే ఉంటారు. ప్రతాప్ సింగ్‌కి ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకుకి వివాహమయి కోడలు వారి చిన్న కూతురు కూడా వీరితోనే ఉంటారు. రెండవ కొడుకు పెళ్ళి నిశ్చయమవుతుంది. మూడవ కొడుకు స్కూలులో చదువుకునే చిన్న పిల్లాడు. విదేశీ టెర్రరిస్టులతో పని చేసే మైఖిల్ డాంగ్‌ని భారత ప్రభుత్వం అరెస్టు చేసి ప్రతాప్ సింగ్ ఉన్న జైలుకి పంపుతుంది. అక్కడ తనకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కావాలని గొడవ పెట్టుకుంటాడు డాంగ్. అతన్ని సింగ్ చెంపదెబ్బ కొడతాడు. డాంగ్ అనుచరులు జైలును చుట్టుముట్టి డాంగ్‌ను విడుదల చేసుకుని తీసుకుని వెళతారు. కాని ప్రతీకారంగా జైలులో ఎందరో పోలీసులను, ఖైదీలను హత్య చేయిస్తాడు డాంగ్. అంతే కాకుండా ప్రతాప్ సింగ్ కొడుకులిద్దరినీ, కోడలిని, మనవరాలిని హత్య చేస్తారు. ఈ హత్యలన్నీ చూసిన సింగ్ భార్య గొంతు పోతుంది. ఆతని చిన్న కొడుకు వెన్నుకు దెబ్బ తగిలి నడిచే శక్తి పోగొట్టుకుంటాడు.

సింగ్ తిరిగి వచ్చి జరిగినది చూసి అంతమంది ప్రాణాలు తీసిన డాంగ్‌పై ప్రతికారం తీర్చుకోవాలనుకుంటాడు. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ప్రభుత్వ సహాయంతో జైలులో ఉరి శిక్ష పడిన ముగ్గురు వ్యక్తులను తన పనికి ఎన్నుకుంటాడు. వాళ్ళే జానీ, బైజు, ఖైరుద్దీన్. ఉరి తప్పిందని సంతోషించి వారు సింగ్‌తో కలుస్తారు. కాని అతని పగతో, బాధతో వారు ఒకటి కాలేకపోతారు. బైజు, జాని ఇద్దరు యువతులని ప్రేమిస్తారు. తమ ప్రియురాళ్ళూ, తాగుడు మత్తులో పడి కొట్టుకుంటున్న వారిలో మార్పు కోసం సింగ్ అహర్నిశలు కష్టపడతారు. ఒకసారి తాగి పడిపోయిన బైజీ, జాని, అసహయంగా బందీ అయిన ఖైరుద్దిన్ ముగ్గురూ చూస్తుండగానే దాడి చేసిన దుండగులతో ఒంటరిగా యుద్ధం చేస్తూ ప్రతాప్ సింగ్ గాయపడతాడు. అప్పుడు కనువిప్పు కలిగి ఆ ముగ్గురు కలిసి డాంగ్‌ను చంపడం సినిమా కథ. ఖైరుద్దిన్ ఈ మిషన్‌లో చనిపోతే, మిగిలిన యిద్దరు ప్రాతప్ సింగ్ పోగొట్టుక్కున్న కొడుకులుగా ఆ కుటుంబంతో కలిసి జీవిస్తారు. చివర్లో సింగ్ భార్య రుక్మిణికి పోగొట్టుకున్న గొంతు వస్తుంది.

సినిమా అంతా ఒకే పాట వెంటాడుతుంది. “హర్ కరమ్ అప్నా కరెంగే ఐ వతన్ తేరే లియే” ఇదే పాటను ఐ సనమ్ తెరే లియే అంటూ భార్య కోసం ప్రతాప్ సింగ్ పాడతారు. ఈ పాట కోసం ఆయన ఒక కవితను స్వీయ గొంతులో వినిపిస్తారు. సినిమాలో తెలుగు నటుడు కైకాల సత్యనారాయణ కనిపిస్తాడు. శ్రీదేవి చిన్నాన్నగా ఇతను నటించారు. తెలుగు యాసతో హిందీ మాట్లాడుతూ మధ్యలో చాలా సందర్భాలలో తెలుగులో మాట్లాడుతూ ఉంటాడు. “మేరె కర్మా తూ” అనే మరో పాట కూడా హిట్ పాట. సినిమాలో దారా సింగ్ మొదట ఒక ఖైదీ. ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్న తన తమ్ముడికి రక్తాన్ని తీసికెళ్ళేటప్పుడు ట్రక్‌ని అడ్డుకుని లంచం అడిగిన పోలీస్‌ను చంపుతాడు దారా సింగ్. అయితే ఏ తమ్ముడి కోసం ఈ హత్య చేస్తాడో అతను చివర్లో డాంగ్ మనిషి అని తెలుస్తుంది. అది తెలిసిన వెంటనే దారా సింగ్ తమ్ముడిని చంపేస్తాడు. కొంత నాటకీయంగానే కొన్ని సీన్లు ఈ సినిమాలో కనిపిస్తాయి.

దిలీప్ కుమార్ కోసం ప్రత్యేకంగా రాసిన కొన్ని సీన్స్ ఉన్నాయి. కాని ఆయనే ముఖ్య పాత్ర అయినా పెద్దగా ఫర్మామెన్స్‌కి అవకాశం లేదనిపిస్తుంది వీరి ఇతర సినిమాలతో పోల్చి చూస్తే. ముఖ్యంగా జైలులో ఖైదీల సంస్కరణ, జైలరు కథ అన్నప్పుడు చాలా మందికి గుర్తు కొచ్చే సినిమా “దో ఆంఖే బారహ్ హాత్”. సుభాష్ ఘాయ్ కూడా ఆ సినిమా ఆధారంగానే కథ నిర్మించుకున్నారని అంటారు. కాని ‘కర్మా’ సినిమా శాంతారాం మాస్టర్‌పీస్ స్థాయికి చాలా దూరంలో ఉంది. సంస్కరణ కోసం తెచ్చిన ఆ ముగ్గురు ఖైదీలలో ఇద్దరికి ప్రేమ కథలలోకి ఇరికిచ్చి సినిమా కాన్సెప్ట్ పక్క దారి పట్టించారు దర్శకులు. కాని అన్ని సినిమాలల వలే దిలీప్ కుమార్ తన పాత్రను చాలా జాగ్రత్తగా మంచి టైమింగ్ ఉన్న డైలాగ్ డెలివరీతో పోషించారు. అయితే ఆయన రెండవ ఇన్నింగ్స్‌ను పరిశిలిస్తే అన్ని పాత్రలు ఒక దానితో మరొకటి పోలి ఉంటాయి. ఎనభైల సినిమాలన్నీ కూడా కోపంతో రగిలిపోతున్న పాత్రలు, ప్రతీకారాలు, లేదా పక్కా రొమాన్స్‌తో నిండిన కథలు. ఇందులో దిలీప్ కుమార్ కోసం ప్రతికారం తీర్చుకునే నిజాయితీపరుడైన వ్యక్తి పాత్రలే సృష్టించబడ్డాయి. విధాతలో అయన ఒక స్మగ్లర్‌గా కనిపిస్తే, కర్మ, శక్తిలో ఒక పోలీసాఫీసర్‌గా చూస్తాం. మషాల్‌లో ఒక జర్నలిస్టుగా ఉండి స్మగ్లింగ్‌లో ప్రవేశించే వ్యక్తిని చూస్తాం. ఇవన్నీ కూడా ప్రతీకారం నేపథ్యంగా తీసిన సినిమాలే.

ఇది మల్టీ స్టారర్ అయేసరికి కొంతమంది నటులు చాలా తక్కువ సీన్లలో కనిపిస్తారు. బిందు, ముక్రీ, షమ్మీ, లాంటి నటులకు పెద్ద స్కోప్ లేకపొయింది కథలో. సినిమాకు సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్ అందిస్తే, ఆనంద్ భక్షీ పాటలు రాసారు. ఇందులో అందరు నటులు కూడా దిలీప్ కుమార్‌తో నటించడానికి సినిమా ఒప్పుకున్నవారే. నసీరుద్దీన్ షా కూడా అందుకే ఈ సినిమా చేసారు. వీరిద్దరు తలపడే ఒక సీన్ ఉంటుంది ఈ సినిమాలో. దాన్ని సుభాష్ ఘాయ్ దిలీప్ సాబ్, నసీర్‌తో వేరు వేరుగా షూట్ చేసారట. కెమెరా వైపుకు చూస్తే దిలీప్ కుమార్ డూప్‌లా మరొకరుండగా నసీర్ తన డైలాగులు చెబితే, దిలీప్ సాబ్ కూడా అదే చేసారట. దీనికి కారణం తెలీదు కాని నసీరుద్దీన్ మాత్రం తాను మోసపోయానని సుభాష్ ఘాయ్‌తో మరే సినిమా చేయనని బాహాటంగానే చెప్పుకున్నారు. శ్రీదేవి కూడా ఈ మల్టీ స్టారర్‌లో తనకు పెద్దగా నటనకు ఆస్కారం లేదని ఆ తరువాత మల్టీస్టారర్ లలో బాలీవుడ్ లో నటించనన్నారట.

కర్మా 1986 సంవత్సరంలో పెద్ద హిట్ సినిమాగా రికార్డ్ అయింది. ఈ సినిమా తరువాత దిలీప్ కుమార్ తన బాల్య స్నేహితుడు ముక్రీతో మరే సినిమాలో కలిసి నటించలేదు. వారికి కలిసి పని చేసి అవకాశం ఈ సినిమా తరువాత మరి రాలేదు. మంచి ఉద్దేశంతో తీసిన సినిమా కాని మల్టీస్టారర్‌గా మాత్రమే ‘కర్మా’ ఈ రోజుకీ గుర్తుండిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here