ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 41 – మజ్దూర్

0
3

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం దిలీప్ కుమార్ నటించిన ‘మజ్దూర్’ సినిమాని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్ చేసిన మరో మంచి సినిమా ‘మజ్దూర్’

[dropcap]కొ[/dropcap]న్ని సినిమాలు నిజాయితీ, నిబద్ధతతో కష్టపడి తీసినా, అవి ప్రేక్షకుల వద్దకు చేరవలసిన విధంగా, చేరవలసినంతగా చేరలేదంటే చాలా బాధ కలుగుతుంది. మరో పక్క కొన్ని సినిమాలు కేవలం ఏవో జిమ్మిక్కు, మాజిక్కులతో ఎక్కువమందికి చేరి కమర్షియల్‌గా చాలా గొప్ప సినిమాలని పిలవబడతాయి. మన దేశంలోని సినిమాలను గమనిస్తుంటే, ఎప్పుడూ అడ్వర్టైజింగ్ సినిమాను నిర్ణయిస్తుంది. మంచి సినిమా, ఆదర్శాలతో తీయబడిన సినిమా చాలాసార్లు వెనుకపడిపోతుంది. ప్రేక్షక దేవుళ్ళు కొన్ని సార్లు ఎందుకు ఆ మార్కెట్ మాయాజాలంలో పడిపోతారో అర్థం కాదు. ఆవుని కుక్క అని పది సార్లు పిలిస్తే అది కుక్కే అనుకునే జనం కొన్ని సార్లు కుక్కను ఆవు అని ఎవరో చూపిస్తుంటే అది ఆవే అని నమ్మడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం జనం ఆదరిస్తున్న సినిమా వారు నిజంగా ఇష్టపడినది కాదు. వారు దాన్ని అదరించాలని హిప్నటైజ్ చేయబడి ఉంటారు. మార్కెట్ మాయజాలంలో వారి మనసులు మరొకరి రిమోట్‌కి ఆధారంగా నాట్యం చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడే మంచి సినిమా వెనుక పడిపోతుంది.

ప్రతిసారీ ఈ కారణాల వలనే కొన్ని మంచి సినిమాలు ప్రేక్షకులకు చేరట్లేదని అనడం ఇక్కడ ఉద్దేశం కాదు, కాని మార్కెటింగ్ మాయాజాలం, సినీ రాజకీయాలు కూడా చాలాసార్లు సినిమా విజయాన్ని, సినిమా ఎక్కువ మంది ప్రేక్షకుల వద్దకు వెళ్ళనీయకుండా అడ్డగిస్తాయి. దిలీప్ కుమార్ 1983లో బి.ఆర్. చోప్రా బానర్ క్రింద నటించిన ‘మజ్దూర్’ సినిమా ఎందుకు ఎక్కువ మందిని చేరలేకపోయిందో కాని ఇది వారి మిగతా మల్టీ స్టారర్ సినిమాలతో కలిపి చూసి, పోలిస్తే వాటి కన్నా కుడా ఒక చక్కని పై స్థాయి సినిమా. ప్రతీకార భావంతో వచ్చిన ఆ మల్టీ స్టారర్‌లు ఇప్పుడు బోర్ కొట్టిస్తాయి. కాని మజ్దూర్ మాత్రం మెదడుని ఆలోచింపజేసే సినిమా. ఎన్నో గొప్ప విషయాల కలబోత అయిన ఈ సినిమా మాత్రం మిగతా మల్టీ స్టారర్‌లా జనానికి చేరువ కాలేకపోయింది. కాని దిలీప్ కుమార్ కెరియర్ లోని అన్ని సినిమాలను పరిశీలిస్తే దీన్ని వారి కెరీర్‌లో మరో ఉత్తమ చిత్రంగా నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు.

బి.ఆర్ చోప్రా బానర్ మీద అంతకు ముందు తీసిన నయా దౌర్ సినిమా దీనికి ప్రేరణ. ఆ సినిమాలో నటించిన దిలీప్ కుమార్, జానీ వాకర్, నాజర్ హుసేన్‌లు ఈ సినిమాలో కూడా కలిసి నటించారు. తరువాత వచ్చిన పైగామ్ సినిమాలో కొన్ని సీన్లను ఈ సినిమా కోసం వాడుకున్నారు. అలాగే దిలీప్ కుమార్‌కి అత్యంత ఇష్టమైన వుధరింగ్ హైట్స్ నవల లోని హెత్‌క్లిఫ్ పాత్ర ఇందులో స్త్రీ పాత్రగా కనిపిస్తుంది. జాగ్రత్తగా దిలీప్ కుమార్ సినిమాలన్నీ పరిశీలిస్తే మాత్రమే ఈ సినిమా కథ దిలీప్ కుమార్ అంతకు ముందు చేసిన సినిమాల ప్రభావంతో తయారయింది అని అర్థం అవుతుంది. కాని విడిగా చూస్తే ఈ కథ ఎక్కడా దాని ప్రభావాన్ని కోల్పోదు. మానవ సంబంధాలను అన్ని కోణాల నుండి చూపిన చిత్రం ఇది. ఒక పక్క యజమాని కార్మికుల మధ్య సంబంధాలలోని లోపాలను ఎత్తి చూపుతూ అవి ఎలా ఉండాలో చెబుతూ ఒక కుటుంబంలో కుటుంబ పెద్ద పాత్ర అతన్ని అంటిపెట్టుకున్న కుటుంబీకుల మధ్య ఉండే అనుబంధం, భార్యా భర్త, ప్రేమికుల మధ్య ఉండవలసిన స్నేహ సంబంధం, విలువలను మరచి స్వార్థాన్ని తమ జీవిత పరమావధిగా చేసుకున్న ఏ సంబంధం అయినా చివరకు వ్యక్తిని, వ్యవస్థను ఎలా నష్టపరుస్తుందో చాలా చక్కగా చర్చించిన సినిమా ఇది.

బి.ఆర్. చోప్రా సినిమాలకు సాహిర్ లుధియాన్వి అన్ని పాటలు రాసేవారు. 1980లో ఆయన మరణించేదాకా ఈ బానర్‌కి ఆయనే ఆస్థాన కవి. ‘మజ్దూర్’ సినిమా 1983లో వచ్చింది. అప్పటికే సాహిర్ మరణించి మూడు సంవత్సరాలయింది. కాని ఈ సినిమా కథకు ఆయన ఉంటే ఆ కలం జీవం పోసి ఉండేది. అయినా అ లోటు పూడ్చడానికి అన్నట్లు హసన్ కమల్‌ను చోప్రాలు పాటల రచయితగా తీసుకున్నారు. ఉర్దూలో ఒక మంచి రచయితగా వీరికి పేరు ఉంది. బి.ఆర్. చోప్రా “నికాహ్” సినిమాకు గొప్ప పాటలు రాసారీయన. సాహితీపరంగా ఉత్తమ గీతాలను సినీ రంగానికి అందించిన కవి ఇతను. మజ్దూర్ ఆయన పని చేసిన రెండవ సినిమా. ఈ సినిమాలో “హమ్ మెహనత్ కష్ ఇస్ దునియా సె జబ్ అప్నా హిస్సా మాంగేగే, ఇక్ బాగ్ నహీ ఇక్ ఖేత్ నహీ హమ్ సారీ దునియా మాంగేంగే” అన్న పాట ఉంది. కార్మికుల హక్కుల మీద రాసిన పాట ఇది. ఈ సినిమా పాటలన్నిటికీ సంగీతం సమకూర్చిన ఆర్.డి. బర్మన్ మంచి ట్యూన్‌తో ఈ పాటను పాపులర్ చేసారు. అయితే ఈ పాట ఫైజ్ అహ్మద్ ఫైజ్ అనే ఉర్దూ కవి రాసిన కవిత నుండి తీసుకున్న పల్లవి ఆధారంగా తయారయింది. “హమ్ మెహనత్ కష్ జగ్వాలో సె జబ్ అప్నా హిస్సా మాంగేంగే, ఇక్ ఖేత్ నహి ఇక్ దేశ్ నహి హుమ్ సారి దునియా మాంగేంగే” అన్న పల్లవికి కొంత మార్చి జగ్ వాలో అన్న పదం బదులు ఇస్ దునియా సే అనే పదాన్నిపెట్టి రెండో వాక్యంలో ఇక్ ఖేత్, ఇక్ దేశ్ అన్న చోట, ఇక్ బాగ్, ఇక్ ఖేత్ అన్న పదాలను ఉపయోగించి ఆ తరువాత చరణాలు రాసుకున్నారు హసన్ కమల్. సోషలిజాన్ని, కార్మికుల హక్కులను సమర్ధిస్తూ కార్మిక పక్షాన నిలిచే గొప్ప పాట ఇది.

నంద, దిలీప్ కుమార్లు కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా మజ్దూర్. నంద కూడా తన పాత్రను బాగా పోషించారు. ఇది ఆవిడ ఆఖరి సినిమా. కేవలం దిలీప్ కుమార్‌తో నటించడానికి ఈ సినిమా ఒప్పుకున్నానని చెప్పారామె. రాజ్ బబ్బర్ కెరియర్‌లో ఒక మంచి సినిమా మజ్దూర్. దిలీప్ కుమార్‌తో కలిసి చేసే చాలా సీన్లు ఉన్నాయి వారికి. అన్ని చోట్ల కూడా కన్విన్సింగ్‌గా నటించారు. దిలీప్ కుమార్ పిల్లలుగా పద్మినీ కొల్హాపురి, రాజ్ కిరణ్‌లు నటించారు.

సినిమా కథకు వస్తే, సిన్హా అనే ఒక బట్టల మిల్లు వ్యాపారి దగ్గర పని చేస్తుంటాడు దీనానాధ్ సక్సేనా. సిన్హా కార్మికుల క్షేమం కోరుకునే వ్యక్తి. అతని దగ్గర ఆనందంగా పని చేసారు ఆ ఫాక్టరీ కార్మికులు. అతని మరణం తరువాత ఆ కంపెనికి యజమాని అవుతాడు సిన్హా కొడుకు హీరాలాల్. అతనికి లాభాల పట్ల ఉన్న ఆలోచన కార్మికుల గురించి ఉండదు. ఫాక్టరీ బోనస్‌లు ఆగిపోతాయి (ఇంత వరకు నయా దౌర్ కథ). ఫాక్టరీలో ఒక కార్మికుడు పని చేస్తూ ప్రమాదవశాత్తు చనిపోతే అతని ఇంటికి వెళ్ళినందుకు కార్మికుల ఒక్క రోజూ జీతం కోస్తాడు హీరాలాల్. ఈ అన్యాయాన్ని ప్రశించిన దీనానాధ్‌ను అందరి ముందు అవమానిస్తాడు. ఆ ఫాక్టరీలో పని చేసే వారికి కారియర్లు తీసుకొస్తూ ఉంటాడు అశోక్, అతను టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ చదువుతూ ఉంటాడు. తన చదువు కోసం పగలు కారియర్లు మోస్తూ ఉంటాడు. ఫాక్టరీలో ఒక మషీన్ పాడయితే దాన్ని బాగు చేసి తన ప్రతిభ నిరూపించుకుంటాడు కూడా (ఇది పైగామ్ సినిమాలో నుండి తీసుకున్న సీన్). దీనానాధ్ కుటుంబ ఖర్చులకు మిల్లు నుండి బట్ట కొనుక్కు వచ్చి అడిగిన వారికి అమ్ముతుంటాడు. అశోక్ దీనానాధ్‌తో కలిసి ఈ పని చేయడం మొదలెడతాడు. బదులుగా దీనానాధ్ తనకు వచ్చిన లాభంలో నుండి అతనికి కొంత డబ్బు ఇస్తూ ఉంటాడు. ఇలా చిరు వ్యాపారంలో భాగస్వామ్యులయిన వీరి జీవితం దీనానాధ్‌ని హీరాలాల్ అవమానించిన తరువాత మారిపోతుంది.

దీనానాధ్ హీరాలాల్ వద్ధ రాజీనామా చేసాకా, ఒక పాత మిల్లు కొని సొంతగా పని మొదలెడదాం అనుకుంటాడు. దానిలో అశోక్‌ని భాగస్వామిగా చేసుకుంటాడు. అయితే మూడు లక్షల డబ్బు వారి వద్ద ఉండదు. లోను కోసం వెళ్ళిన ప్రతి చోటా వీరికి ఎదురు దెబ్బే తలుగుతుంది. లోన్ కోసం ఒక బాంక్ మేనేజర్‌తో మాట్లాడుతున్న దీనానాధ్‌ని అదే ఊరిలో ఒక గొప్ప వ్యాపారవేత్త అయిన కుందన్‌లాల్ బాత్రా చూస్తాడు. అతను డబ్బు అప్పుగా ఇచ్చి దీనానాధ్‌ని ఆదుకుంటాడు. తన తాత తండ్రులు కూడా దీనానాధ్ స్థితిలోనే వ్యాపారం ప్రారంభించారని, ఆదర్శభావాలున్న దీనానాధ్ లాంటి వ్యక్తుల వల్ల సమాజానికి ఉపయోగమని అందుకే తాను సహాయం చేసానని చెబుతాడు బాత్రా.

బాత్రా కూతురు స్మిత అశోక్‌ని ప్రేమిస్తుంది. మిల్లు బాగా నడిచి వ్యాపారం వృద్ధిలోకి వచ్చినప్పుడు దీనానాధ్ తన వ్యాపారంలో మూడవ భాగస్వామ్యం మిల్లు కార్మికులకు ఇస్తాడు. అతన్ని నమ్మి హీరాలాల్ మిల్లులో పని వదిలి కష్టకాలంలో అతని మిల్లులో పని చేసి ఆ ఫాక్టరీని లాభాల దిశగా నడిపించిన కార్మికులు అతని కుటుంబ సభ్యులుగా మారతారు. దీనానాద్ కూతురు మీనా అశోక్‌ని ప్రేమిస్తుంది. అయితే దీనానాధ్ అశోక్ కూడా తన కూతురిని ఇష్టపడుతున్నాడని నిర్ణయించుకుని మీనాతో అతని పెళ్ళి నిర్ణయిస్తాడు. తన జీవితానికి ఒక దారి చూపిన దీనానాధ్‌ని నిరాశపర్చలేక అశోక్ ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడు. అందువలన స్మితకి శత్రువు అవుతాడు. తనకు దక్కని అశోక్‌ని మరెవరికీ దక్కనీయనని అతనిపై పగ పెంచుకుంటుంది స్మిత. తనని ఇష్టపడే దీనానాధ్ కొడుకు రమేష్‌ని అశోక్‌పై పగ తీర్చుకోవడానికి వివాహం చేసుకుని ఆ ఇంటికి కోడలిగా వస్తుంది (వుధరింగ్ హైట్స్ హెత్‌క్లిఫ్ పాత్ర. ఇదే ఇతివృత్తంతో మూడు రకాల సినిమాలు అంతకు ముందే చేసి ఉన్నారు దిలీప్ కుమార్).

స్మిత మెల్లిగా ఆ కంపెనీలో కూడా భాగస్వామి అవుతుంది. ఇంటా ఆఫీసులో ఆమెని చూస్తూ ఆమె కోపాన్ని భరిస్తూ ఆమె తనతో మానసికంగా ఆడుకోవడం సహించలేక భార్యతో వేరు వెళదాం అనుకుంటాడు అశోక్. కాని దీనానాధ్ దీనికి అంగీకగించడు. రమేశ్ ఫాక్టరీకి సంబంధించిన చదువు కోసం జర్మనీ వెళతాడు. అప్పుడు మీనా గర్బవతి అని తెలుస్తుంది. అనందంగా ఉన్న ఆ కుటుంబాన్ని చూస్తూ మీనా అశోక్ బిడ్డను మోస్తుందన్న నిజాన్ని భరించలేని స్మిత, ఆ రోజు ఒంటరిగా ఉన్న అశోక్‌ని లోబరుచుకోవాలనుకుంటుంది. వారిద్దరిని చూసిన మీనా విషయం అర్థం కాక షాక్‌తో మేడ మీద నుండి పడిపోతుంది. ఆమెకు అబార్షన్ అవుతుంది.

కూతురు ద్వారా సంగతి తెలుసుకున్న దీనానాధ్ అశోక్‌ను ఆ ఇంటి నుండి గెంటేస్తాడు. కోడలిని కుందన్‌లాల్ కూతురుగా ఏమీ అనలేక ఆమె ఆ ఇల్లు కదిలి బైటకు రారాదని అంక్షలు విధిస్తాడు. కంపెనీ నుండి అశోక్‌ను బయటకు పంపేసినందుకు కార్మికులు సమ్మె మొదలెడతారు. ఈ అవకాశాన్ని తన స్వార్థానికి వినియోగించుకోవాలనుకుంటాడు హీరాలాల్. జర్మనీ నుండి వచ్చిన రమేశ్‌కు తన భార్య అశోక్ పాత ప్రేమికురాలని అర్థం అవుతుంది. తనకే సంగతి తండ్రి చెప్పకపోయినా, స్మిత తనను రమేశ్ కోసమే పెళ్ళి చేసుకుందని, తండ్రి అది తెలుసుకుని రమేశ్‌ని దూరం పెట్టాడని అర్థం చేసుకుంటాడు. అశోక్ అంటే మొదటి నుండి రమేశ్‌కి కోపం. ఇప్పుడు అది కసిగా మారుతుంది. తుపాకి తీసుకుని ఫాక్టరీ వర్కర్ల మధ్య జరుగుతున్న గొడవ లోకి వెళతాడు. అక్కడ అశోక్‌ని చంపాలన్నది అతని ఆలోచన. కాని తుపాకి పేలి అతనే మరణిస్తాడు. కొడుకు మరణించాక దీనానాద్ అతని భార్య కూడా అశోకే ఆ గొడవలంతటికీ కారణం అని అతన్ని పూర్తిగా ఆ కంపెనీ నుండి బహిష్కరిస్తారు. రమేశ్ మరణంతో భీతిల్లిన స్మిత తన తండ్రికి తన తప్పు చెప్పినప్పుడు, ఫాక్టరీని ప్రత్యర్ధుల నుండి రమేశ్ కాపాడినప్పుడు దీనానాద్ విషయాన్ని అర్థం చేసుకుని రమేశ్‌ని కుటుంబలోకి ఆహ్వానించి కోడలిని క్షమిస్తాడు. కార్మికులందరి సమస్య పరిష్కారమయి చివరకు కథ సుఖాంతమవుతుంది.

మిల్లు కార్మికులకు యజమానికి మధ్య ఉండాల్సిన అనుబంధం, యజమానికి బానిసకు మధ్య ఉండవలసినది కాదు. యజమాని తప్పు చేసినా, యజమాని తీసుకున్న నిర్ణయాల పట్ల అనుమానం ఉన్నా కార్మికులకు యజమానిని ప్రశ్నించే అధికారం ఉంది. సామ్యవాదం ఇదే చెబుతుంది. ఈ హక్కు కోసమే దీనానాద్ హీరాలాల్‌తో విభేదిస్తాడు. చివరకు అతని ఫాక్టరీలో కార్మికులు కూడా ఈ హక్కు కోసమే పోరాటం చేస్తారు. వారి పోరాటమే చివరకు ఆ కుటుంబానికి మేలు చేస్తుంది. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరిది అన్న విషయాన్ని అద్భుతంగా చూపించిన సినిమా ఇది. అలాగే కుటుంబంలో కూడా ఈ ప్రశ్నించే హక్కు ఉండాలి. కూతురుని వివాహం చేసుకోమనగానే అతని అడుగుజాడలను గుడ్డిగా అనుసరించే వ్యక్తిగా అశోక్ ఆ ప్రస్తావనకు ఒప్పుకుంటాడు. తన ప్రేమ విషయం చెప్పడు. తండ్రి స్థానంలో దీనానాధ్‌ని చూసుకుంటూ అతన్ని యజమానిగానే గుర్తిస్తాడు. అందుకే స్మితకు శత్రువు అవుతాడు. స్మిత కూడా తన ప్రేమ సంగతి ఎవరితో చెప్పదు. ఆమె కూడా తండ్రిని, దీనానాధ్‌ని యజమానులు గానే తలుస్తుంది. అందుకే వారికి తన సమస్య చెప్పుకోలేక మౌనంగా అశోక్ వేరొకరిని వివాహం చేసుకోవడం తన ఓటమిగా స్వీకరిస్తుంది. అతపై ప్రేమను పగగా మార్చుకుంటుంది. కుటుంబంలో చాలాసార్లు పెద్దల పట్ల ఉన్న ఈ యజమాని అనే భావన చిన్నవారికి కష్టాలను తీసుకువస్తుంది. చివరకు స్మిత లోని పగ ఆమె లోని విచక్షణను పోగొడుతుంది. అదే ఒక కుటుంబ పతనానికి దారి తీస్తుంది. సమాజంలో కాని కుటుంబంలో కాని సరైన ఆలోచన, సమస్య పట్ల అవగాహన లేకపోవడం వలనే ప్రమాదాలు జరుగుతాయి. ఒకరినొకరు ప్రశ్నించుకోవడం, చర్చించుకోవడం చాలా కుటుంబాలలో జరగదు. కొన్ని అధికారాలను పెదవి విప్పకుండా భరించడమే గౌరవం అనుకుంటాం.

చివరకు హీరాలాల్‌ని కార్మికులు కొడుతున్నప్పుడు వారిని ఆపి దీనానాధ్ ఇదే విషయం చెబుతాడు. ఇలాంటి కోపతాపాల వలన ఎప్పుడు ఎక్కడా ఎవరికీ న్యాయం జరగదు. యజమాని తన స్వార్థం ఆధారంగా కార్మికులతో సంబంధం పెంచుకోకూడదు. అలాగే ఫాక్టరీలో తప్పులు జరిగితే, ఆ తప్పులకి విరుద్ధంగా పోరాడాలి కాని, తిండి పెట్టే కొమ్మను నరుక్కున్నట్లు ఫాక్టరీ నష్టపోవడం కోసం కార్మికులు కుట్రలు పన్నకూడదు. కుటుంబంలో స్మిత కూడా తనకు న్యాయం జరగలేదని కుటుంబంపై కుట్రలు పన్నుతుంది. చివరకు ఆమె జీవితానికే తీరని నష్టం జరుగుతుంది. యజమాని కార్మికుల మధ్య సంబంధాలలో కూడా యజమానిపై కోపం తిండి పెట్టే పరిశ్రమల వినాశనం వైపుకు తిరిగితే నష్టపోయేది కార్మికుడే, పేదవాడే. ఇది గుర్తించి పోరాటాలు జరగాలి. ఈ సినిమా నిజంగా ఎంత గొప్ప విషయాన్ని చర్చిస్తుందో అర్థమయితే స్ట్రైకులు, నిరసనల పేరు మీద కాలుతున్న బస్సులు, ఆహుతవుతున్న ప్రాణాల గురించి ఆలోచన పెరుగుతుంది. చాలా గొప్పగా తీసిన మజ్దూర్ సినిమా ప్రేక్షకుల వద్ధకు చేరవలసిన రీతిలో చేరకపోవడం దురదృష్టం.

దిలీప్ కుమార్ నటన చాలా గొప్పగా ఉండే మరో సినిమా మజ్దూర్. ఇది నటుడు నాజర్ హుసేన్‌కి కూడా చివరి చిత్రం. నయా దౌర్‌లో కూడా అయన ఒక కలప వ్యాపారిగా చేస్తారు. ఆయన తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, అతని స్థానంలో వచ్చిన కొడుకు ఫాక్టరీలో మార్పులు తీసుకువస్తాడు. ఈ సినిమాలో ఆయన మరణం తరువాత కొడుకు హీరాలాల్ తన పంథాలో ఫాక్టరీ నడపడంతో కథ మొదలవుతుంది. కార్మికులలో ఒకరిగా జానీ వాకర్ కనిపిస్తారు. నయా దౌర్‌లో ఈయన జర్నలిస్టు పాత్ర వేస్తారు. స్మితగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసిన రతి అగ్నిహోత్రి నటన బావుంటుంది. ఈ సినిమాలో పద్మిని పోషించిన పాత్రకు సల్మా ఆఘాని అనుకున్నారట. ఆమెతో “పెహ్లా పెహ్లా ప్యార్” అనే ఒక పాట కూడా రికార్డ్ చేసారు. ఆ పాటను యథాతథంగా ఉంచి పద్మిని కొల్హాపురిపై చిత్రీకరించారు.

ఈ రోజుకు కూడా ఫ్రెష్‌గా అనిపించే ఈ సినిమా దిలీప్ కుమార్ చేసిన మంచి సినిమాలలో ఒకటి అని తప్పకుండా చెప్పుకోవాలి. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రవి చోప్రా బి.ఆర్. చోప్రా కుమారుడు. తక్కువ సినిమాలకు దర్శకత్వం వహించినా మంచి సినిమాలు తీసారు ఆయన. సినిమాల కన్నా టీ.వీ సీరియల్స్ మహాభారత్, రామాయణ్‌లకి ఆయకు దర్శకుడిగా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా కథనంలో వీరి ప్రతిభ కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here