ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 42 – సంఘర్ష్

0
3

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం దిలీప్ కుమార్ నటించిన ‘సంఘర్ష్’ సినిమాని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

మహాశ్వేతాదేవి కథ ఆధారంగా తీసిన దిలీప్ కుమార్ సినిమా ‘సంఘర్ష్’

[dropcap]సి[/dropcap]నిమాకు సాహిత్యానికి ఒకప్పుడు మంచి సంబంధం ఉండేది. సినిమాలో పాటలు, కథ కూడా ప్రముఖ సాహితీకారుల రచనల ఆధారంగా ఆ రోజుల్లో రాసేవారు. మహాభారత రామాయణాలపై వచ్చిన సినిమాలు అనేకం. ఇక కాళీదాసు గ్రంథాలు, ఠాగోర్, శరత్, ప్రేమచంద్, ఫణీశ్వరనాధ్ రేణు, ఇస్మత్ చుగ్తాయి, మంటో లాంటి సాహిత్యకారుల కథలు హిందీ సినిమాకు వస్తువు అయ్యాయి. రష్యన్ సాహిత్యంలో క్రైమ్ అండ్ పనిష్మెంట్ లాంటి నవలలు, ఇంగ్లీషు సాహిత్యంలో షేక్స్పియర్, ఎమిలి బ్రాంటి, ఆర్.కే. నారాయణ్ వంటి రచయితల నవలలు హిందీ సినిమా కధను ప్రభావితం చేసాయి. అలాగే ఉర్దూ, హిందీ సాహిత్యంలో గొప్ప పేరు తెచ్చుకున్న సాహిర్, నీరజ్, ప్రదీప్ లాంటి కవులు సినిమాలకు రాయడం మొదలెట్టారు. అలా సాహిత్యకారులు, సినిమా కళాకారుల మధ్య మంచి సంబంధాలుండేవి. సినిమా నిర్మాణం కూడా అదే స్థాయిలో ఉండేది. మహాశ్వేతాదేవి బెంగాల్‌లో గొప్ప కథకురాలు. ఆవిడ రాసిన “లాయ్లీ అస్మానెర్ అయ్నా” అనే బెంగాలీ లఘు కథ అధారంగా తీసిన సినిమా ‘సంఘర్ష్’. ఇది 1968లో వచ్చిన సినిమా. ఈ సినిమాలో నటించేటప్పటికే దిలీప్ కుమార్ పెద్దవారయిపోయారు. ప్రతి నటుడి జీవితంలో ఇలాంటి ఒక సంధి కాలం ఉంటుంది. హీరో వేషాలకు పెద్దవారుగా, కారెక్టర్ వేషాలకు చిన్నవారుగా అనుకునే కాలం వారి జీవితంలో అరవైల ఆఖరున వచ్చింది. దిలీప్ కుమార్ ఈ సినిమాలో పెద్ద వయసుతో ముఖంలోని ఆ పాత చార్మ్ కోల్పోయి కనిపిస్తారు. అయితే ఈ సినిమాలో విషయం వినూత్నంగా ఉంటుంది. హీరో ఒక ప్రత్యేక దొంగల తెగకు సంబంధించినతను. వారణాసి లోకి శాక్త  పూజారుల తెగకు సంబంధించిన వ్యక్తి. అతని జీవితంలో వచ్చిన మార్పుల అధారంగా ఈ కథ నడుస్తుంది. ఈ తెగ వారణాసిలో ఒకప్పుడు ఉండిందని, సాంప్రదాయంగా నరబలులు, యాత్రికులను దోచుకోవటాలు జరిగేవని, ఇవన్నీ కాళీమాత ఉపాసకులు చేసేవారని ఈ రోజుకీ చెప్పుకుంటారు.

శాక్త  తెగకు సంబంధించిన వారు వృత్తి రీత్యా దొంగలు, కాళీ ఉపాసకులు. మాతకు నరబలి ఇవ్వడం వారి సాంప్రదాయం. అలాగే దొంగతనాలు చేయడం వారి వృత్తి. ఆ తెగకు చెందిన భవానీ ప్రసాద్‌కు ఒక కొడుకు. కాని అతను ఈ సాంప్రదాయాన్ని విభేదిస్తాడు. తనకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. అతని మొదటి సంతానం మగబిడ్డను, చిన్నతనంలోనే భవానీ ప్రసాద్ తనతో తీసుకు వెళ్ళిపోతాడు. ఆ బిడ్డను శాక్త  తెగ వారసుడిగా తన సాంప్రయాద నరబలి, వృత్తిని ముందుకు తీసుకుని వెళ్ళే తన మనవడిగా, శిష్యుడిగా శిక్షణ ఇస్తూ ఉంటాడు భవానీ ప్రసాద్. కుందన్‌కి తాత దగ్గర ఉండడం ఇష్టం లేదు. అతని తల్లి కూడా బిడ్డకు దూరంగా ఉండలేకపోతుంది. కాని వారెవ్వరూ భవానీ ప్రసాద్‌ని అడ్డగించలేరు. ఎవరికి ఇష్టం లేకపోయినా కొడుకు దారి తప్పినందుకు మనవడు తన దారిలో నడవాలన్నది భవాని ప్రసాద్ నిర్ణయం.

భవానీ ప్రసాద్ తన సోదరుడినే హత్య చేయిస్తాడు. అతని కొడుకు భవానీ ప్రసాద్ చేసే పనులు బయట పెడుతూ ఉంటాడు. భవాని ప్రసాద్ కొడుకు, తన బిడ్డ కుందన్, భార్య పడుతున్న వేదన చూసి కుందన్‌ని భవాని ప్రసాద్‌కి దూరంగా తనతో తీసుకెళ్ళిపోవాలనుకుంటాడు. తన కన్న కొడుకు అన్న ఆలోచన కూడా లేకుండా అతన్ని హత్య చేయిస్తాడు భవానీ ప్రసాద్. ఆ నేరం తమ్ముడి కొడుకు నౌబత్ లాల్‌పై వేస్తాడు. అయితే నౌబత్‌లాల్ కుందన్ తండ్రి రక్తంలో తడిచిన షాల్ తీసుకుని వచ్చి చూపించి అతన్ని తండ్రే హత్య చేయించాడని చెబుతాడు. అయితే భవానీ ప్రసాద్ చలించడు. నౌబత్ లాల్‌ని కూడా చంపిస్తాడు. నౌబత్ లాల్‌కు ఇద్దరు కొడుకులు గణేశీ ప్రసాద్, ద్వారకా ప్రసాద్. వీరిద్దరూ కూడా వేరే ఊరు వెళ్ళిపోతారు. కాని తమ తండ్రి మరణానికి కారణమయిన వ్యక్తిని, అతని వారసుడిని చంపుతాం అని ప్రతిజ్ఞ చేస్తారు.

కుందన్ చిన్నప్పటి స్నేహితురాలు మున్నీని ఒక వేశ్యాగృహం నడిపే స్త్రీ దత్తత తీసుకుంటుంది. మున్నీ కలకత్తాలో పేరు పొందిన వేశ్య లైలాగా మారుతుంది. ఆమె సంరక్షకురాలు మరణించాక ఆమె బెనారస్ వస్తుంది. అక్కడ ఆమెను చూసి ప్రేమిస్తాడు కుందన్, కాని ఆమె తన స్నేహితురాలుగా గుర్తుపట్టలేడు. లైలా అతన్ని గుర్తించినా మౌనంగా ఉండిపోతుంది. గణేశీ ప్రసాద్, ద్వారకా ప్రసాద్‌లకు కుందన్ చెల్లెలి పెళ్ళికి ఆహ్వానం అందుతుంది. వారు లైలాను కుందన్‌ని ప్రేమ మత్తులో ముంచి తమ వద్దకు తీసుకురమ్మని బదులుగా ఆమె కోరినంత ధనం ఇస్తామని చెబుతారు. లైలా బాల్య స్నేహితుడు కుందన్‌ని రక్షించడానికి ఈ పనికి ఒప్పుకుంటుంది. అతని ప్రాణాలు రక్షిస్తుంది కూడా. కాని కుందన్‌పై పగతో ఉన్న ద్వారకా అతన్ని గాయపరచబోయి తాను గాయపడతాడు. అన్న దగ్గరకు తనను చేర్చమని ఈ వైరానికి స్వస్తి పలుకుదామని కుందన్ కోరిన దానికి అంగీకరిస్తాడు. కాని అన్న వద్దకు వెళ్ళిన కాసేపటికే ద్వారకా మరణిస్తాడు.

మున్నీ ప్రత్యర్థులు పంపగా వచ్చినా, నిజంగానే కుందన్‌ని ప్రేమిస్తుంది. కాని భవానీ ప్రసాద్ ఆమె వేశ్య అని కుందన్‌ని వశపర్చుకుని అతన్ని హత్య చేయించడానికి వచ్చిందని అందరు ముందు చెబుతాడు. కుందన్, లైలాపై కోపగించుకుని ఆమె దగ్గర నుండి వెళ్ళిపోతాడు. ఈలోగా భవానీ ప్రసాద్ మరణించడం, అతని మరణానికి ముందు అతనే తన తండ్రి హంతకుడని కుందన్‌కి తల్లి ద్వారా తెలియడం జరుగుతుంది. ఇంత జుగుప్సాకరమైన తమ వంశాచారం ఇక సాగరాదని, తమ వల్ల గణేశీ కుటుంబం పొందిన బాధకు తాము నిజంగానే బాధ్యులమని ఒప్పుకుంటాడు కుంధన్, అతను గణేశీ దగ్గర పనివాడిగా చేరి తమ పాపానికి ప్రాయశ్చిత్తం అతని సేవతో తీర్చుకుందామనుకుంటాడు. గణేశీ లైలాను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడని విని అతని కోసం తన ప్రేమను కూడా త్యాగం చేయాలనుకుంటాడు కుందన్. భవానీ ప్రసాద్ మనుష్యులు కుందన్ గణేశి చేతిలో గాయపడకుండా కాపాడుతూ ఉంటారు. గణేశి కుందన్‌ని ఎప్పుడూ చూడకపోవడం వలన అతన్ని గుర్తుపట్టడు. తన దగ్గర పని చేస్తున్న వ్యక్తి తన పెదనాన్న కుమారుడు కుందన్ అని అతనికి తెలీదు. అతన్ని భజరంగ్ అని పిలుస్తూ తన అనుచరుడిగా చేసుకుంటాడు. అయితే ఒక సమయంలో అతనికి కుందన్‌పై అనుమానం వచ్చినప్పుడు గణేశీ ఆవేశంతో కుందన్‌ని గాయపరచకుండా అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు, భవానీ ప్రసాద్‌కు నమ్మిన బంటు అయిన వ్యక్తి. అయితే కుందన్ గణేశీని కాపాడి తనను చిన్నప్పటి నుండి పెంచిన తన తాన స్నేహితుడిని చంపి తన అన్నను రక్షించుకుంటాడు. ఆ హత్యతోనయినా మూడు తరాల తమ వైరం మాసిపోవాలని కోరుకుంటాడు. ఇరు కుటుంబాలు ఈ వైరాన్ని పక్కన పెట్టి సోదరులుగా జీవిద్దామని గణేశీని బ్రతిమిలాడుతాడు. తమ్ముడు ద్వారకా ప్రసాద్‌ను పోగొట్టుకున్న గణేశీ చివరకు కుందన్‌ని క్షమించి అతన్ని తన సోదరుడిగా అంగీకరిస్తాడు. కుందన్ తరతరాల తమ వృత్తిని వదిలేస్తాడు. లైలా కూడా తన వృత్తి మాని కుందన్‌ని వివాహం చెసుకుంటుంది.

సినిమా కథలో వారణాసిలోని శాక్త  తెగలోని ఆచారాలను వెలికి తీసుకువచ్చే ప్రయత్నం చేసారు మహాశ్వేతాదేవి. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోదు. దిలీప్ కుమార్‌తో పాటు వైజయంతి మాలలో కూడా చాలా శారీరిక మార్పులు చూస్తాం. ఇద్దరూ నటనా పరంగా తమ ప్రతిభను చూపించినా ఆ పాత్రలకు కొంచెం పెద్దవారయ్యారనిపిస్తుంది. ఇది దిలీప్ కుమార్ వైజయంతి మాల కలిసి చేసిన ఆఖరి సినిమా. ఈ సినిమాలో గణేశీగా బల్రాజ్ సాహనీ, ద్వారకాగా సంజీవ్ కుమార్ నటించారు. దిలీప్ కుమార్‌తో బలరాజ్ సాహనీకి హల్చల్ తరువాత ఇది రెండవ సినిమా. సంజీవ్ కుమార్‌కి ఇది దిలీప్ సాబ్ తో మొదటి సినిమా. భవాని ప్రసాద్‌గా జయంత్ బావుంటారు. సంఘర్ష్ సినిమాకు దర్శకత్వం వహించింది హమామ్ సింగ్ రావైల్. మెహ్బూబ్ కీ మెహంది, మెరె మెహబూబ్ లాంటి మంచి సినిమాలు తీసిన దర్శకుడు ఆయన. ఈ సినిమాకు పాటలు షకీల్ బధాయినీ రాస్తే, సంగీతం నౌషాద్ అందించారు. సినిమాలో ఏడు పాటలుంటాయి. ఇందులో “మేరే పైరో మే గుంగురూ” అన్న పాట చాలా పాపులర్ అయింది. కాని ఈ పాటను దిలీప్ కుమార్ ఇంతకు ముందు చేసిన సినిమాల స్థాయిలో చేయలేకపోయారన్నది నిజం. ఆ ఎనర్జీ వారిలో ఈ సినిమాకు లేదు. ఈ సినిమాలో సంభాషణలు కూడా అవధ్‌లోనే ఉన్నా గంగా జమున స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయాయి. రఫీకి “మేరే ఫైరో మె గుంగ్రూ” అన్న పాట చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది. ఆ పాటకు వారు గాయకునిగా పూర్తి న్యాయం చేసారన్నది మాత్రం నిజం. “జబ్ దిల్ సె దిల్”, “ఇష్క్ దివానా హుస్న్ భి ఘాయల్” అన్న పాటలు కూడా బావుంటాయి కాని అంత పాపులర్ కాలేదు.

దిలీప్ కుమార్, వైజయంతి మాలల నడుమ రొమాంటిక్ అనుబంధం వుండేది. అది, ఆమె సంగం సినిమాలో నటించటం, రాజ్ కపూర్‌కు దగ్గరవటంతో బెడిసికొట్టింది. లీడర్ సినిమా సమయంలో దిలీప్ కుమార్ ఆమెను సతాయించటంతో వారి సంబంధం పూర్తిగా చెడింది. సంఘర్ష్ సినిమాలో వారిద్దరి నడుమ ఉద్విగ్నతలు స్పష్టంగా తెలుస్తాయి. వారి గొడవలు తారాస్థాయికి చేరి వారినడుమ మాటలు బంద్ అయ్యేనాటికి సంఘర్ష్ సినిమా అధిక శాతం షూటింగ్ పూర్తవటంతో ఆమె అతి కష్టం మీద సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమాలో వారిద్దరూ కలసి నటించే సన్నివేశాలేవీ ఇద్దరూ కలసి నటించినవి కావు. ఎవరికి వారు విడిగా నటిస్తే, ఎడిటింగ్ లో వాటిని కలిపారు. అందుకే, ఇద్దరూ ఒకే ఫ్రేంలో చాలా అరుదుగా కనిపిస్తారు. అది ఈ సినిమాను దెబ్బ తీసింది. అంతేకాదు, ఈ సినిమా తయారీనాటికి హీరోగా దిలీప్ కుమార్ భవిష్యత్తు ప్రశ్నార్ధకంలో పడింది. ముఘల్-ఎ-ఆజం తరువాత అతనికి మరో హిట్ సినిమాలేదు. వయసయిపోతూండటం, అతని స్థాయికి తగ్గ వేషాలు లభించకపోటం, అతనికి సాన్నిహిత్యంవున్న నిర్మాతలు, దర్శకులు ఒకరొకరుగా కనుమరుగయిపోతూండటంతో పాటూ నౌషాద్ తరహా సంగీతానికి కాలం చెల్లిందన్న ఆలోచన స్థిరపడటం కూడా దిలీప్ కుమార్ కెరీర్ చివరి దశకు వచ్చిందన్న భావన కలిగించాయి. దాంతో దిలీప్ కుమార్ సినీ నిర్మాణం పనుల్లో జోక్యం చేసుకోవటం , దర్శకులను చికాకు పెట్టటం ఎక్కువయింది. ఇదే సమయానికి ధర్మేంద్ర, సంజీవ్ కుమార్, రాజేష్ ఖన్న, జితేంద్ర, మనోజ్ కుమార్ వంటి యువ నటులు తెరపైకి రావటం, వారు యువకులను ఆకర్షించటం కూడా దిలీప్ కుమార్ తరానికి కాలం చెల్లిందన్న ఆలోచనను బలపరిచాయి. వైజయంతిమాల సైతం సరయిన పాత్రలు లభించక ఇబ్బంది పడుతోంది ఆ సమయానికి. కొత్త తరం నాయికలు తెరపైకి వచ్చి, నాయిక అంటే పాటలు పాడి, నృత్యాలుచేసే అందాల బొమ్మ మాత్రమే అన్న అభిప్రాయం వేళ్ళూనుకుంటున్న సమయమది. దాంతో వ్యక్తిత్వం వున్న నాయిక పాత్రలు అడుగంటుతున్నాయి. ఇది, ఆ తరం నటీమణులందరినీ ఇబ్బందికి గురిచేసింది. వైజయంతి మాల ప్రిన్స్ వంటి సినిమాల్లో నటించింది కానీ, అలాంటి రోల్స్ ఆమె వ్యక్తిత్వానికి సరిపడవు. ఆమె ఎన్నో ఆశలు పెట్తుకున్న ఆమ్రపాలి విఫలమవటం, రాజ్ కపూర్ సైరా బాను, హేమా మాలిని వంటి యువ నటీమణుల ఆధారంతో తన కెరీర్‌ను నిలుపుకోవాలని ప్రయత్నించటంతో ఆమె డాక్టర్ బాలిని పెళ్ళి చేసుకుని సినిమా కెరీర్‌కు స్వస్తి చెప్పింది.
దిలీప్ కుమార్ కు సైతం తన కెరీర్ చివరి దశకు చేరుకుందని అర్థమయింది. రాం ఔర్ శ్యాం హిట్ అవటం అతని కెరీర్‌కు వెంటిలేటర్ లాంటిది. ఇకొన్నేళ్ళు ముందుకు నడిచే ఊపిరి పోసింది. ఆ తరువాత ఆయన యువ హీరోయిన్ల ఆధారంగా తన కెరీర్‌ను ముందుకు నడపాలని చూశాడు. కానీ, యువ దర్శకులు అతడిని హాండిల్ చేయలేకపోవటం, ఆయన వీరి పని తీరుతో రాజీపడలేకపోవటం, ఆయన ఆకారం మారిపోవటం సినిమాలు ఘోరంగా పరాజయం పాలవటంకూడా ఆయన కేరీర్‌ను దెబ్బతీశాయి.
ముఘల్-ఎ-ఆజం కు రాం ఔర్ శ్యాం కూ నడుమ మెరే మహెబూబ్ తప్ప నౌషాద్‌కు సైతం మరో హిట్ సినిమా లేకపోవటం, దిలీప్ కుమార్ సినిమాల వరుస పరాజయం నౌషాద్ కెరీర్‌ని దెబ్బ తీసింది. సాథి సినిమాతో ఆయన తన పంథా మార్చుకోవాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 1970 కల్లా నౌషాద్ కేరీర్ దాదాపుగా సమాప్తమయిపోయింది.  ఈ సినిమాకు దర్శకత్వం హెచ్ ఎస్ రవైల్, కుమారుడు రాహుల్ రవైల్ తరువాతి కాలంలో పేరుపొందిన దర్శకుడయ్యాడు.

సినిమాలో ఉత్తరభారతదేశంలో ముఖ్యంగా వారణాసి ప్రాంతపు వేషధారణను చూపించడానికి దర్శకులు శ్రమించారు. హిందూ ముస్లిం సాంప్రదాయాల కలయికతో నిండిన ఆనాటి వారణాసి ప్రజల వేషభాషలను చూపించడంలో సఫలం అయ్యారు. దిలీప్ కుమార్ పాత్రలను ఎన్నుకునే తీరులో ఒక విశిష్టత ఉంటుంది. ఈ కథలో శాక్త  తెగ వారసుడు కుందన్, అందరూ ఇష్టపడే పాత్ర కాదు. అయినా దాన్ని వారు చేయడం ఒక సాహసమే. ఈ సినిమాలో నటిస్తున్నప్పటికి వైజయంతి మాల, దిలీప్ కుమార్ల మధ్య మాటలు లేవట. అందుకని చాలా వరకు సీన్లు వారివి విడివిడిగా షూట్ చేసారట. ఇప్పటి తరానికి పాపులర్ డైరెక్టర్ రాజేష్ రోషన్ ఈ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్‌గా పని చేసారు.

సంఘర్ష్ సినిమాలో ప్రేక్షకులను ఆలోచనలలో పడేసే పాత్ర భవనీ ప్రసాద్‌ది. తన వృత్తి పై అతనికున్న గౌరవం, కాళీమాత నరబలితోనే ప్రసన్నురాలవుతుందన్న నమ్మకం, అన్ని కిరాతకాలు భక్తి మత్తులో అతను నిర్భయంగా చేసే విధానం మతం లోని మౌఢ్యం ఎంత భయంకరంగా ఉంటుందో తెలియజేస్తుంది. తన తమ్ముడిని, పిన తండ్రిని, చివరకు కొడుకుని కూడా చంపడానికి వెనుకాడని అతని మూఢత్వం మన దేశంలో భక్తి ముసుగున జరుగుతున్న హింసను మరోసారి గుర్తుకు తెస్తుంది. మున్నీ అని తాను అనుకుంటున్న చిననాటి స్నేహితురాలు లైలాగా మారిందని, వేశ్యావృత్తిలో పేరు గడించిందని కుందన్‌కు తెలిసినప్పుడు ఆమె తనను మోసం చేసిందని బాధపడతాడు. దొంగ వృత్తిలో బ్రతికిన తన తాత నీడన పెరిగిన అతనే లైలా గా మున్నీని అంగీకరించలేకపోతాడు. కాని ఎప్పుడయితే తన తండ్రి, తన పినతండ్రి ఆయన తండ్రి కూడా తన తాత వృత్తికి బలయ్యారని తెలుస్తుందో అప్పుడే అతనికి లైలా వృత్తి తమ కుల వృత్తి కన్నా నయం అని, తాము చేసిన పాపాలు పరిహాలు లేనివని అర్థం అవుతుంది. మళ్ళీ లైలాను కలిసి నపుడు ఆమెను ద్వేషించడు. తను ఏ విధంగా ఈ వృత్తిలోకి లాగబడ్డాడో లైలాదీ అదే పరిస్థితి అని అర్థం చేసుకుంటాడు. తన వృత్తి నుండి బైటకు వచ్చే అధికారం కోసం తానెంతగా కష్టపడుతున్నాడో లైలా కూడా అదే చేస్తుందని అర్థం చేసుకుంటాడు. పరిస్థితులు మనుష్యుల ఇష్టాలపై వారి జీవితాలపై ఎలా తమ ప్రభావం చూపుతాయో తెలుసుకున్న తరువాత లైలా అన్ని విషయాలలో తన సహచరి కాదగినది అని అర్థం చేసుకుంటాడు. సమాజంలో నీచ వృత్తులుగా ఎంచబడేవి దొంగతనం, వ్యభిచారం. వీటిలో చిక్కుకుని బైటపడాలని, తమ జీవితాలను మంచి దిశగా మళ్ళించుకోవాలని లైలా కుందన్‌లు చేసిన ప్రయత్నమే ఈ సంఘర్ష్. దిలీప్ కుమార్‌కు ఈ సినిమా ఫిలింఫేర్ నామినేషన్ తీసుకొచ్చింది. బెంగాల్ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ దిలీప్ కుమార్‌కి ఈ సినిమాకు ఉత్తమ నటుడి అవార్డు, వైజయంతి మాలకు ఉత్తమ నటి అవార్డు, భవాని ప్రసాద్‌గా నటించిన జయంత్‌కు ఉత్తమ సహాయ నటుడి అవార్డు ఇచ్చి సత్కరించింది. సంఘర్ష్ సినిమాకు మాటలు రాసింది గుల్జార్ మరియు అబ్రర్ అల్వీ. వీరిని కూడా రచయిత ద్వయంగా ఉత్తమ రచన క్రింద బెంగాల్ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ సత్కరించింది.

కథా పరంగా కొంచం విభిన్నంగా ఉన్న సంఘర్ష్ ప్రేక్షకులను అంతగా అలరించదు. ఇంతకు ముందు సినిమాలలో దిలీప్ కుమార్ వైజయంతిమాలల మధ్య కెమిస్ట్రీ ఇందులో లేకపోవడం, ఇద్దరిలో ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే శారీరిక మార్పులు రావడం, ఇవి కూడా సినిమాను ప్రేక్షకులు మెచ్చక పోవడానికి కారణాలు. నౌషాద్, షకీల్ బదాయినీలలో కూడా ఆ ముందున్న బలం లేకపోవడం గమనిస్తాం. దిలీప్ కుమార్ వైజయంతిమాలతో ఏడు సినిమాలలో కలిసి నటించారు. అంతకు ముందు రామ్ ఔర్ శ్యాంలో కూడా వైజయంతి మాలనే ముందు తీసుకున్నారట. కాని వారిద్దరి మధ్య ఉన్న గొడవల కారణంగా ఆమె కొన్ని సీన్ల తరువాత చేయనంటే వహిదా రెహమాన్‌ని తీసుకున్నారని అంటారు. వారిద్దరి నడుమ మాటలే లేకుండా ఈ సినిమా చేయవలసి రావడం లోని గాప్ కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here