Site icon Sanchika

ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 43 – ఉడన్ ఖటోలా

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం దిలీప్ కుమార్ నటించిన ‘ఉడన్ ఖటోలా’ సినిమాని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

నౌషాద్, దిలీప్ కుమార్, షకీల్ బదాయూనీల త్రయం ఇచ్చిన మరో మ్యూజికల్ హిట్ ‘ఉడన్ ఖటోలా’

[dropcap]1[/dropcap]955లో వచ్చిన దిలీప్ కుమార్ సినిమా ‘ఉడన్ ఖటోలా. దిలీప్ కుమార్ పాత సినిమా కథలు చాలా వరకు ఒక దానితో మరొకటి పోలి ఉంటాయి. చిన్నప్పుడు స్నేహితులయిన అమ్మాయి అబ్బాయి తరువాత పెద్దవారయి ప్రేమికులవడం అన్నది వీరి చాలా సినిమాలలో కామన్ పాయింట్. అప్పటి రొమాంటిక్ సినిమాల కథలన్నీ ఇంచు మించు ఒకేలా ఉండేవి. ఈ కథ కూడా హీరో విమానం కూలి ఒక కొత్త ప్రదేశానికి చేరి అక్కడ తనకు సపర్యలు చేసే అమ్మాయితో ప్రేమలో పడడంతో మొదలవుతుంది. ఇది ‘తరానా’ సినిమాలో కూడా చూస్తాం.

ఉడన్ ఖటోలా జానపద సినిమా. హీరో నడిపే విమానం ఎగురుకుంటూ చాలా దూరం ప్రయాణించి ఒక దూర దేశంలో పడిపోతుంది. ఆ ప్రమాదంలో గాయపడిన కాశీని ఆ దేశంలోని ఒక అమ్మాయి కాపాడుతుంది. ఆమె సోని. ఆ దేశంలో పరిపాలన అంతా కూడా స్త్రీల చేతులలో ఉంటుంది. మాతృస్వామ్య వ్యవస్థను పాటించే ఆ దేశంలో నియమాలు కూడా వేరుగా ఉంటాయి. ఆ దేశంలో పరదేశీయులు ఎనిమిది రోజులకు మించి ఉండకూడదు. కాని తిరుగు ప్రయాణానికి వనరులు సమకూర్చుకోవడానికి, దారి సుగమం అవడానికి ఇంకా సమయం పడుతుంది. కాబట్టి కాశీ ఆ దేశపు రాణికి తానక్కడ ఉండడానికి అనుమతి ఇవ్వమని అడగడానికి వెళతాడు. అతనికి సపర్యలు చేసిన సోనితో అతను ప్రేమలో పడతాడు. కఠినురాలని పేరు పొందిన ఆ రాణి కూడా కాశీని చూడగాని ఆకర్షితురాలవుతుంది. అతను ఆ రాజ్యంలో ఉండడానికి అనుమతి ఇస్తూ ప్రతి రోజు తన దగ్గర సమయం గడపాలని,  పాటతో తనను అలరించాలని నియమం పెడుతుంది.

రాణికి దగ్గరవుతున్న కాశీని చూసి సోని బాధపడుతుంది. సోని కాశీని కలుద్దామని నది ఒడ్డుకు పిలుస్తుంది. నదిలో యీతకు దిగిన వ్యక్తిని చూసి కాశీ తన ప్రేమ తెలుపుతూ పాట పాడతాడు. కాని ఆమె రాణి అని తరువాత తెలుస్తుంది. ఇలా ఒకటి రెండు సందర్భాలలో జరగడంతో రాణికి కూడా కాశీ తన వాడే అని నమ్మకం కలుగుతుంది. ఆమె ఒక ఉంగరాన్ని బహుమతిగా కాశీకి ఇస్తుంది. ఈ ప్రాంతపు వివాహపు ఆచారాలు తెలియని కాశీ దానిని స్వీకరిస్తాడు. కాని అలా ఉంగరం స్వీకరించడం ఆ యువతిని భార్యగా అంగీకరించడం అని తెలిసిన సోని ఆ ఉంగరాన్ని రాణికి తిప్పి పంపిస్తుంది. తాను కూడా మగ వేషంలో ఆ రాజమందిరంలో పనికి కుదురుతుంది. ఆమెను కాశీ కూడా తన మిత్రుడుగా పరిచయం చేస్తాడు. అదే రాజ్యంలో షోను, సోనిని పెళ్ళి చేసుకుందామనుకుంటాడు. ఆమె కాశీని ప్రేమిస్తుందని అతనికి తెలుసు. కాశీపై రాణి కన్నుందని ఎప్పటికైనా ఆమె అతన్ని సొంతం చేసుకుంటుందని షోను సోనికి చెబుతూ ఉంటాడు. ఆమె మనసు మళ్ళించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.

చివరకు రాణికి సోని గురించి తెలియడం కాశీ తనను ప్రేమించట్లేదని అతను తన అధికారానికి దాసుడవడని అర్థం అవడం జరిగుతుంది. అంతకు ముందు సోని మగవాని వేషంలో నడుపుతున్న నావను నీళ్ళ పాలు చేసిందని కాశీ ఆమెను కొరడాతో కొట్టాలని లేదా మరణదండన విధిస్తానని రాణి భయపెడుతుంది. కాశీ సోనీని కాపాడడానికి ఆమెను కొరడాతో శిక్షిస్తాడు. మరో పరిచారిక తెర చాటున నుంచుని తన మాటలు వింటుందని ఆమెను హత్య చేస్తుంది రాణి. మరొకసారి సోని, కాశీల ప్రేమ సంగతి తెలుసుకుని సోని నిప్పులపై కట్టిన తాడు మీద నడవాలని శిక్ష వేస్తుంది. రాణి లోని క్రూరత్వం ప్రతీసారి కనిపిస్తూ ఉంటుంది. చివరకు కాశీకి మరణ శిక్ష విధిస్తానని అది తప్పించాలనుకుంటే సోని ఆమె తండ్రి నిర్ణయించిన స్వయంవరంలో షోనుని భర్తగా స్వీకరించాలని రాణి షరతు పెడుతుంది. తప్పని పరిస్థితులలో సోని, షోను మెడలో మాల వేస్తుంది. కాని ఆ రాజ్యంలోని ఆ అరాచకత్వానికి వారి రాజ్య దేవునికి కోపం వస్తుంది. సముద్రం పొంగి రాజ మందిరం కొట్టుకుపోతుంది. రాణి మరణిస్తుంది. ఆ రాజ్యాన్ని బ్రతికించుకోవాలంటే ఒకరు తమను తాము బలి చేసుకోవాలి. కాశీ తాను ప్రాణ త్యాగం చేస్తానని అంటాడు.  ఈ సారి కూడా అతన్ని కాపాడడానికి సోని తన ప్రాణాలు ఇచ్చి ప్రేమించిన కాశీని, తన మాతృదేశాన్ని కూడా రక్షిస్తుంది.

కథ అంతా కూడా ఫ్లాష్‌బాక్‌లో వస్తుంది. ఒక యాత్రికుడు సముద్రంలో నావ మునిగితే, దాన్నుండి బయటపడి ఒడ్డుకు కొట్టుకువస్తాడు. ఒక చిన్న గుడిసె కనిపిస్తుందతడికి. ఆ రాత్రి అక్కడ ఉండడానికి చోటివ్వమని గుడెసె లోని ఒక ముసలి వ్యక్తిని అడుగుతాడు. ఆ రాత్రి అతనికి ఒక అందమైన యువతి వచ్చినట్లు కనిపిస్తుంది. కాని అతని గొంతు విని ఆమె మాయమవుతుంది. అది విన్న ఆ ముసలి వ్యక్తి ఆమె కోసమే తానిన్నాళ్ళూ బ్రతికి ఉన్నానని తన కథ వినిపిస్తాడు. సోని తనను ఆత్మహత్య చేసుకోవద్దని తన చివరి కోరికగా అతను చాలా కాలం ఆనందంగా జీవించాలని కోరుకుంటుంది. తను వచ్చి అతన్ని తీసుకువెళతాననీ అంటుంది. ఆమె కోసం ఎదురు చూస్తూ అతను ముదుసలి అయిపోయినా ఆశ చావక ఎదురు చూస్తూ ఉంటాడు, చివరకు సోని వచ్చి అతన్ని తనతో తీసుకెళ్ళడం కథకు ముగింపు,

కథగా ఇది ఇప్పుడు చాలా హస్యాస్పదంగా అనిపిస్తుంది. జానపద కథలన్నీ ఇలానే ఉండేవి. మగ ఆకారంలోనూ ఆడ వేషంలోనూ సోని ఒకే గొంతుతో పాడుతుంది. ఆప్పుడు కూడా ఆమెను రాణి గుర్తు పట్టదు. ఇలాంటి కొన్ని విషయాలు కథంతా కనిపిస్తాయి. కాని ఈ సినిమాకు జీవం నౌషాద్ సంగీతం. అసలు నౌషాద్, షకీల్ బదాయూనీ దిలీప్ కుమార్లది ఒక క్లాసిక్ కాంబినేషన్‌లా నిలిచిపోయింది. ఈ సినిమాకు పాటలు షకీల్ బదాయూనీ రాస్తే నౌషాద్ సంగీతం అందించారు. ఆ పాటల మధ్య ఈ మాయా మంత్రాల సినిమా కూడా హాయిగా అనిపిస్తుంది. సినిమాలో మొత్తం పదకొండు పాటలున్నాయి. అన్నిటిని లతా మంగేష్కర్, రఫీలు పాడారు. అసలు రికార్డింగ్‌లో ముందు ఈ పాటలన్నీ సుధా మల్హోత్రా పాడారట. అది విని తరువాత లత ఫైనల్‌గా పాడారు. అలా సుధా మల్హోత్రా చాలా పాటలు రికార్డు చేసి లత కోసం ఉంచితే వాటిని లత స్వరంలో రికార్డు చేసి మార్కెట్లోకి పంపించేవారట. లత చాలా పై స్థాయికి వెళ్ళిన రోజులవి. సాహిర్ లుధియాన్వి గాయకులకన్నా రచయితలు ముఖ్యం ఆన్న సిద్ధాంతంతో లత కన్నా తనకు ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేసేవారట. లతతో పోటీకి ఆయన తన పాటలను సుధా మల్హోత్రాతో పాడించేదాకా సుధా మల్హోత్రా ప్రపంచానికి పెద్దగా తెలియదు.

ఉడన్ ఖటోలా అంటే అప్పటి వారికీ కూడా గుర్తుకు వచ్చేది “ఓ దూర్ కే ముసాఫీర్” అనే పాట. నౌషాద్, షకీల్. దిలీప్ కాంబినేషన్‌లో వచ్చిన అద్భుతమైన పాట ఇది. “హమ్ రహ్ గయే అకేలే” అని ఆ పాటలో ఎన్ని సార్లు వస్తుందో అన్ని సార్లు రఫీ ఆ పదాన్ని రకరకాలుగా పలుకుతారు. ప్రతీసారి ఒక విషాదాన్ని మోసుకొచ్చే ఈ పాట హిందీ సినిమా పాటలలో ఒక గొప్ప గీతం అని చెప్పవచ్చు. ఈ పాటకు ముందు వచ్చే సాకీ “చలే ఆజ్ తుమ్ జహా సె హుయీ జిందగీ పరాయి, తుమ్హె మిల్ గయా ఠికానా హమే మౌత్ భీ న ఆయీ’ తరువాత ఎన్నో సందర్భాలలో ప్రేయసి ప్రియులు దూరమయే సన్నివేశాలలో ఉపయోగించేవారు. ఇదే పాటలో “చారో తరప్ లగే హై బర్బాదీయో కే మేలే రే” అన్న వాక్యాని రఫీ పాడిన విధానం చాలా గొప్పగా ఉంటుంది. సినిమా ఆఖర్లో వచ్చే ఈ పాటలో దిలీప్ పలికించిన భావాలు కూడా మర్చిపోలేం. “నా తూఫాన్సే   ఖేలో నా సాహిల్ సే ఖేలో” అనే మరో పాట కూడా రఫీ గొంతులో మధురంగా వినిపిస్తుంది. “మొహబ్బత్ కీ రాహోమే చలనా సంభల్ కే. యహా జో భీ ఆయా గయా హాథ్ మల్కే” మర్చిపోలేని కంపోజిషన్. లతా పాడిన “హమారే దిల్ సె న జానా” పాట కూడా మర్చిపోలేని గీతం. “మోరే సైయ్యజీ ఉతరేంగే పార్ ఓ నైయ్యా ధీరే బహో” పాట వెనుకాల వచ్చే కోరస్ అద్భుతంగా ఉంటుంది. “మెరా సలామ్ లేజా, దిల్ కా పైగామ్ లేజా” “హాలే దిల్ మై క్యా కహూ” “నా రో ఐ దిల్ కహీ” ఇలాంటి గొప్ప పాటలున్న సినిమా ఇది. ఉడన్ ఖటోలా సినిమాలో పాటలు లేకపోతే సినిమాను ఊహించుకోలేము. నిమ్మి సోనిగా నటిస్తే రాణి పాత్రలో టంగుటూరి సూర్యకుమారి గారు కనిపిస్తారు.

టంగుటూరి సూర్యకుమారి మన తెలుగు వారికి పరిచయం అయిన పేరే, ప్రకాశం గారి మేనకోడలు, గొప్ప నటి గాయకురాలు కూడా. “మా తెలుగు తల్లికి” ఆవిడ పాడిన తరువాత రాష్ట్ర గీతం అయిపోయింది. ఎన్నో ప్రయివేట్ పాటలు పాడి గొప్ప పేరు సంపాదించుకున్నారామె, ఈ సినిమాకు ముందే తెలుగు, తమిళంలో ఇరవయ్ అయిదుకి పైగా సినిమాలు చేసారు. గ్రామొఫోన్లు కూడా పెద్దగా పరిచయం లేని రోజుల్లోనే ఆమె పాటలు రికార్డు అయ్యాయి. ఆవిడ పాటలు వినిపించే రెస్టారెంట్లలో జనాలు కిటకిటలాడేవారట. ధియేటర్‌ని విశేషంగా ప్రేమించిన ఆవిడ లండన్‌లో ధియేటర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు. ఎల్విన్ అనే ఒక కవి, చిత్రకారుడిని వివాహం చేసుకుని నటిగా, నాట్యగత్తెగా ఎన్నో అవార్డులు అంతర్జాతీయంగా పొందారామె. సూర్యకుమారి కేవలం రెండు హిందీ సినిమాలలో నటించారు వతన్, ఉడన్ ఖటోలా. ఈ సినిమాలో ఆవిడ చాలా అందంగా రాజసంతో కనిపిస్తారు. నిమ్మి కన్నా కూడా వీరి నటన అకట్టుకుంటుంది. అందుకే ఆమెకు ఆ సంవత్సరం ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ నామినేషన్ లభించింది. కాని అవార్డు నిరుపా రాయ్ ‘మునీంజీ’ సినిమాకు తీసుకున్నారు. ఈ సినిమాలో సూర్యకుమారి నటన, ఆవిడ దుస్తులు, ఆవిడ హావభావాలు చాలా గొప్పగా ఉంటాయి. కాని సినిమా రంగం ఆమెలోని నటిని తృప్తి పరచలేకపోయింది. అందుకే దేశం వీడి స్టేజీని ప్రేమించి అంతర్జాతీయంగా నాటక రంగానికి ఎంతో సేవ చేస్తూ జీవించారావిడ. ఇక్కడ డబ్బు, పేరుని వదిలి ఎన్నో ప్రయాసలకు ఓర్చి తన లోని కళా తృష్ణ నడిపించిన దశగా నడిచిన స్త్రీ సూర్యకుమారి గారు. ఆవిడను ఈ సినిమాలో చూడడం గొప్ప అనుభవం. నౌషాద్‌కి కూడా ఈ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలింఫేర్ నామినేషన్ లభించినా ఆ సంవత్సరం ‘నాగిన్’ సినిమాకు హేమంత్ కుమార్ ఆ అవార్డు గెలుచుకున్నారు. షోలే సినిమాలో మెహబూబా పాటలో నటించి అలరించిన జలాల్ ఆఘా తండ్రి ఆఘా ఈ సినిమాలో సోనీ అన్న హీరా పాత్రలో కనిపిస్తారు. ఆఘా కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ సినిమాలో కూడా టున్ టున్‌తో కలిసి వీరు పండించిన హాస్యం బావుంటుంది. ఈ సినిమాలో ముందు మధుబాలని అనుకున్నారట కాని అప్పటికే ఆమె ఆరోగ్యం సరిగా లేనందు వలన ఆమె ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదని అంటారు.

ఉడన్ ఖటోలాని ఇప్పుడు ఆ అందమైన పాటల కోసం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పాట ఒక ఆణిముత్యంగా నిలిచిపోతుంది. దిలీప్ కుమార్‌కి ఇదొక మ్యూజికల్ హిట్. ఈ సినిమాకు దర్శకత్వం, ఎస్, యు సన్నీ చేసారు. “ఓ దూర్ కే ముసాఫిర్ పాట” ఈ సినిమాలో వస్తుందన్న ఒక్క కారణం ఈ సినిమాను అమరం చేస్తుంది.

Exit mobile version