ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 44 – కానూన్ అప్నా అప్నా

1
2

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం దిలీప్ కుమార్ నటించిన ‘కానూన్ అప్నా అప్నా’ సినిమాని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

తెలుగు సినిమా ‘కలెక్టర్ గారి అబ్బాయి’కి రీమేక్ దిలీప్ కుమార్ ‘కానూన్ అప్నా అప్నా’

[dropcap]తె[/dropcap]లుగులో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున కలిసి 1987లో చేసిన ‘కలెక్టర్ గారి అబ్బాయి’ సినిమాని చిత్ర దర్శకుడు బి. గోపాల్ మళ్ళీ హిందీలో ‘కానూన్ అప్నా అప్నా’గా మలిచారు. తెలుగులో ఈ సినిమాకు గణేశ్ పాత్రో సంభాషణలు రాస్తే హిందీలో కాదర్ ఖాన్ రాసారు. ఇంచుమించుగా ఈ రెండు సినిమాలకి కూడా ఒకే సాంకేతిక వర్గం పని చేసారని చెప్పవచ్చు. హిందీ వెర్షన్‌లో దిలీప్ కుమార్ కలెక్టర్ పాత్ర వేస్తే అతని అబ్బాయిగా సంజయ్ దత్ నటించారు. ‘విధాత’ సినిమా తరువాత సంజయ్ దత్‌తో దిలీప్ కుమార్ నటించిన రెండవ సినిమా ఇది. దిలీప్ కుమార్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో నటించిన నటులందరితో చూస్తే పేలవమైన నటనను ప్రదర్శించినది సంజయ్ దత్. అప్పట్లో అతనింకా నటనలో ఓనమాలు దిద్దుకునే దశలోనే ఉన్నారు. కాని దిలీప్ కుమార్ తనతో సంజయ్ దత్ చేసిన సీన్లన్నిటీలో ఎంతో ఓపికను పెద్ద మనసును ప్రదర్శించారనిపిస్తుంది ఈ సినిమా చూస్తున్నంత సేపు కూడా. ఎక్కడా అసహనం లేకుండా పూర్తి స్పేస్ సంజయ్ దత్‌కి ఇచ్చారాయన. సంజయ్ తల్లి నర్గిస్‌తో నున్న చెలిమి, గౌరవం కొన్నిసార్లు పని చేసాయనిపిస్తుంది ఈ సినిమా చూస్తున్నంత సేపు కూడా. నూతన్‌కి దిలీప్ కుమార్‌తో ఇది రెండవ సినిమా. కర్మ సినిమా తరువాత ఆవిడ ఈ సినిమా చేసారు.   ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని నెలలకే ఆవిడ కాన్సర్‌తో మరణించారు.

దక్షిణాది రీమేక్‌లు, దక్షిణాది దర్శకులు, స్టూడియోలతో దిలీప్ కుమార్ చాలా సన్నిహితంగా ఉండేవారు. వారి తరం నటులతో పోలిస్తే ఎక్కువగా దక్షిణాది సినిమాలు, దక్షిణాది దర్శకుల దర్శకత్వంలో నటించింది కూడా దిలీప్ కుమారే. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు జగత్ ప్రతాప్ సింగ్. నిజాయితీ గల కలెక్టరని అతనికి పేరు. చట్టాన్ని అన్ని పరిస్థితులలో గౌరవించాలని, చట్టాన్ని అతిక్రమిస్తే అది నేరం అని, ఎన్నో ప్రయోగాలతో ఎంతో త్యాగం తరువాత నిర్మించుకున్న వ్యవస్థను గౌరవించాలని అందులో లోపాలుంటే చట్టం సహాయంతో పరిష్కరించుకోవాలి తప్ప చట్టం ఏర్పరిచిన నియమాలను అతిక్రమించరాదనే ఆలోచన ఉన్న వ్యక్తి పతాప్ సింగ్. అతని కొడుకు రవి మంచివాడే కాని దుడుకు స్వభావం గల వాడు. రవి స్నేహితుడు సత్యేన్ తండ్రి ఒక నిజాయితీ గల పత్రిక సంపాదకుడు. కబ్జా కన్హైయాలాల్ ఒక్ స్మగ్లర్. చిన్న పిల్లలకు ఐస్ క్రీమ్లో కూడా మత్తు పదార్థాలు కలిపి ఇచ్చి వారిని మత్తుకు బానిసలుగా చేస్తున్న అతని గురించి రాం ప్రసాద్ పేపర్‌లో రాస్తాడు. బదులుగా అతని ప్రెస్‌పై దుండగులు దాడి చేస్తారు. రవి వారితో తలపడి రామ్ ప్రసాద్ ప్రాణాలను రక్షిస్తాడు. ప్రతాప్ సింగ్ కొడుకు చేసిన మంచి పనిని సమర్థించినా ఆ పని చేసే విధానం పట్ల ఆయనకు అభ్యంతరాలుంటాయి. చట్టాన్ని చేతిలో తీసుకునే ఆవేశం మంచిది కాదని, అలా చేస్తే జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఓటమి తప్పదని చెబుతాడు అతను.

కన్హైయాలాల్ దగ్గర బ్రోకర్‌గా పని చేసే భూషణ్ నాధ్ ఒకసారి కలెక్టర్ ఎదురుగా గొడవ చేయబోయి అతనితో చివాట్లు తింటాడు. తరువాత రాజకీయాలలో నిలబడి ఎం.ఎల్.ఏ. అవుతాడు. అయితే అప్పుడు కూడా కలెక్టర్ అతని వద్ద డ్యూటీ చేస్తాడు కాని భూషణ్ నాధ్ ఊహించినట్లు అతని కాళ్లపై పడడు. తనతో అమర్యాదగా మాట్లాడబోయిన భూషణ్ నాధ్‌ని మన దేశంలో ఎవరైనా రాజకీయాలలోకి వచ్చి ఎమ్.ఎల్.ఏ.గా అవవచ్చు కాని కలెక్టర్ అవడం అందరికి సాధ్యం కాదని తన విలువ తనకు తెలుసని బదులిస్తాడు ప్రతాప్ సింగ్.

ప్రతాప్ సింగ్ ఇంట్లో పని చేసే వ్యక్తి కూతురు బసంతిని తన ఖర్చుతో చదివిస్తాడు ప్రతాప్ సింగ్. బసంతి కూడా చదువులో చక్కగా రాణిస్తుంది. ఆమె కాలేజీ వార్షిక ఉత్సవంలో ఎన్నో బహుమతులు కూడా గెలుచుకుంటుంది. కాని అదే రోజు ఆమెను కన్హైయాలాల్ కొడుకు, భూషణ్ కొడుకులు కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపేస్తారు. దోషులను శిక్షించాలని ప్రతాప్ సింగ్ తన రీతిలో ప్రయత్నిస్తూ ఉంటాడు. భూషణ్ రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేసిన సత్యేన్‌పై ఆ ఇద్దరూ మళ్ళీ దాడి చేస్తారు. హస్పటల్‌లో చావు బ్రతుకుల మధ్య ఉన్న అతనికి రక్తం తీసుకొస్తున్న రవిని కూడా అడ్డగిస్తారు. వీరిని తప్పించుకుని రవి హాస్పటల్‌కు వెళ్ళేసరికి సత్యేన్ మరణిస్తాడు. కోపంతో ఆ ఇద్దరిని కొట్టడానికి వెళ్ళిన రవికి వారు వారం రోజుల నుండి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు ఆధారాలు సృష్టించబడి ఉండడం చూసి ఆవేశం పెరిగిపోతుంది. కాని ప్రతాప్ సింగ్ మాత్రం సాక్షాలు లేకుండా వారిని దోషులుగా నిర్ణయించలేం అంటాడు. అంతకు ముందే కన్హైయాలాల్ అక్రమాలకు సంభందించిన కొన్ని డాక్యుమెంట్లు సంపాదించడానికి రవి అతన్ని కిడ్నాప్ చెస్తాడు. ఇవన్ని తెలిసి ప్రతాప్ సింగ్ చట్టాన్ని గౌరవించని వ్యక్తి తన ఇంట్లో ఉండకూడదని రవిని ఇంట్లో నించి పంపించివేస్తాడు. అడ్డు వచ్చిన భార్యకు కొడుకు ప్రపంచాన్ని చూడాల్సిన సమయం ఇదేనని, సురక్షితంగా ఇంట్లో ఉంటూ అతను ఏర్పరుచుకున్న ఆలోచనలోని తప్పు ఒప్పులు ఒంటరిగా ఉండేటప్పుడు మాత్రమే అర్థమవుతాయని నచ్చచెబుతాడు.

రవి ఇంటి నుండి బైటకు వెళ్ళి పోలీస్ ఎస్.ఐ.గా తిరిగి వస్తాడు. అయినా చట్టంలో ఉంటూ చట్టాన్ని అతిక్రమిస్తూ పనులు చేయడం అతని స్వభావం అవుతుంది. బసంతి హంతకులను హస్పిటల్‌లో రోగులుగా సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టరు తాను చేసిన పనికి బదులుగా తన కూతురుకి మెడికల్ సీట్ కావాలని అడుగుతాడు. కలెక్టర్‌గా ప్రతాప్ సింగ్ డాక్టర్ చేసిన తప్పుని నిరూపించి కేసుకి సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో ఉంటాడు. ఆ డాక్టర్ కూతురిపై భూషణ్ కొడుకు అత్యాచారం చేస్తున్నప్పుడు అతన్ని పట్టుకుని స్టేషనుకి లాక్కువస్తాడు రవి. తండ్రి కొడుకులిద్దరూ భూషణ్ కన్హైయాలాల్ పాపాలను బైట పెట్టేంతలో మళ్ళీ రామ్ ప్రసాద్ ఇంటికి దాడికి వెళతాడు కన్హైయాలాల్ కొడుకు. అక్కడ కనిపించిన రవి ప్రియురాలు భారతిపై అత్యాచారం చేయబోతాడు. ఈ దాడి సంగతి తెలిసి ఆక్కడకు వెళ్ళిన ప్రతాప్ కన్హైయాలాల్ కొడుకుని చంపేస్తాడు. అతన్ని రవే అరెస్టు చేస్తాడు. కొడుకు మరణం సంగతి తెలిసి కలెక్టర్ కుటుంబంపై దాడి చేయిస్తాడు కన్హైయాలాల్. అందులో ప్రతాప్ సింగ్ కూతురు చనిపోతుంది. చివరకు తుపాకి పట్టి రవి ప్రతాప్ సింగ్ లిద్దరూ కూడా దోషులపైకి వెళ్ళడం, వారిని చంపేద్దాం అనుకున్న కొడుకు ప్రయత్నాన్ని అడ్డగించి వారిని ప్రతాప్ సింగ్ చట్టానికి అప్పజెప్పడం కథకు ముగింపు.

ఈ సినిమాలో రెండు వేర్వేరు దారులలో న్యాయం కోసం పని చేసే వ్యక్తులుగా సంజయ్ దత్, దిలీప్ కుమార్లు తండ్రీ కొడుకుల పాత్రలలో కనిపిస్తారు. వీరి మధ్య నలిగిపోయే భార్యగా, తల్లిగా నూతన్ నటించారు. దిలీప్ కుమార్‌కి సంజయ్ దత్ ఇద్దరికి కలిపి కొన్ని మంచి సీన్లు ఉన్నాయి. కాని కథలో చాలా అతుకులు కనిపిస్తాయి. దిలీప్ కుమార్ పాత్ర అంత ఎలివేట్ కాలేదు. సంజయ్ దత్ ప్రియురాలి పాత్రలో మాధురి దీక్షిత్‌కు నటనకి పెద్ద ఆస్కారం లేదు. ఉన్న నాలుగు పాటలు కూడా థియేటర్‌లో నుంఛి బైటకు వచ్చేవరకు కూడా గుర్తుఉండవు. ఇందీవర్ రాసిన ఈ పాటలకు బప్పీలహరి మ్యూజిక్ అందించారు. ఎనభైలలో ఉన్న ఎక్సర్సైజుల స్టెప్పుల కనుగుణంగా కూర్చిన బాణీలు అవి. ఆ పాత దిలీప్ కుమార్ పాటలను అస్వాదిస్తూ ఇక్కడి దాకా వచ్చాక ఈ పాటలు అసలు రుచించవు. నిజం చెప్పాలంటే హిమాలయాల సొగసు అనుభవించిన వారికి మట్టిదిబ్బలలో సౌందర్యం కనపడదు కదా..

ఈ సినిమాలో ఒక్క విషయాన్ని సునిశితంగా గమనించవచ్చు. దిలీప్ కుమార్‌కు రాసిన సంభాషణలలో ఉర్దూ పదాల స్థాయి ఎక్కువ. వారికోసం అని ప్రత్యేక శ్రద్ధతో రాసిన మాటలు అన్నది అర్థం అవుతుంది. వారి డైలాగులు గమనిస్తే వారి భాష, యాస స్టైల్‌కి అనుగుణంగా వారికి మాత్రమే ప్రత్యేకమైన పదాలను వాడారని అర్ధం అవుతుంది. హైసియత్, జిమ్మేదారీ, ఆయత్ హోనా, మష్వరా, ఖయాల్, రోషన్ దిమాగ్, ముహర్, వజూద్, నామోనిశాన్ లాంటి పదాలు ఆయన పలికే తీరు చాలా బావుంటుంది. భాషను అందంగా ఎలా మాట్లాడాలో భాషలో స్పష్టతను ఎలా ప్రదర్శించాలో ఆయన డిక్షన్ విని నేర్చుకోవచ్చు.   దిలీప్ కుమార్ ఈ సినిమాలో మాట్లాడిన డైలాగులను రాసుకునే ప్రయత్నం చేస్తే చాలా స్పష్టంగా ఎక్కడ అల్పప్రాణాక్షరాలు వస్తాయో ఎక్కడ మహాప్రాణాక్షరాలు వస్తాయో సులువుగా రాసేసుకోవచ్చు. ఠికానా అని ఆయన పలెకుతున్నప్పుడు వింటే పొరపాటున కూడా టికానా అని రాసుకోం. ఆయన పలికే మాటలలోనే ఒక స్పష్టత ఉంటుంది. భాషా ఉపాధ్యాయులు ఆయన డైలాగులను పిల్లలకు డిక్టేషన్‌గా ఇచ్చి చూడండి తెలుస్తుంది. ఇప్పటి నటులు అస్సలు పట్టించుకోని ఈ విషయాన్ని ఆ రోజుల్లోని నటులు శ్రమించి నేర్చుకున్నారు. తెలుగులో కూడా అప్పటి నటుల డిక్షన్ అంతే గొప్పగా ఉండేది. భాషను అంత గొప్పగా, స్పష్టంగా గ్రామటికల్ తప్పులు లేకుండా ఇప్పుటి తరం పలకలేదు. అసలు ఆ దిశగా ఎవరూ కృషి చేయరు. పైగా పాత సినిమాలలోని డైలాగులలో ఆ అందం ఎందుకుందో కూడా అర్థం చేసుకునే ఓపిక వారికి లేదు.

రఫి పాటలు, దిలీప్ కుమార్ మాటలతో భాష నేర్చుకున్న మా లాంటి వారికి ఆ విషయం బాగా తెలుసు. అందుకే ఏ మాత్రం అలరించని ఈ సినిమాని కూడా దిలీప్ కుమార్ మాటల కోసం చూడాలనిపిస్తుంది. కొడుకుకి చట్టాన్ని అతిక్రమించడంలోని నష్టాలను, అందులోని బాధ్యతారాహిత్యాన్ని విప్పి చెబుతున్నప్పుడు ఆయన పలికిన సంభాషణలు చాలా బాగా ఆకట్టుకుంటాయి. దీనికి కారణం వారు అక్షరాలను పలికిన తీరు, వాక్యాలలో ఇచ్చిన పాజ్లు, భావం అర్థం అవడానికి వాక్యాలను పలికిన విధానం. దీన్ని అర్థం చేసుకుని ఈ కళను అభ్యసిస్తే ఎవరైనా ఎంతమందినైనా తమ వాక్పటిమతో అలరించగలుగుతారు. సినిమాగా ఇది హిట్ అనే అన్నా చాలా రొటీన్‌గా బోర్‌గా అనిపిస్తుంది కొన్ని సందర్భాలలో. కాని కొన్ని సీన్లలో దిలీప్ సాబ్ ముద్ర కొంత ఊరటనిస్తుంది. బి. గోపాల్ తన కెరీర్‌లో తెలుగులో ముప్పై దాకా హిట్ సినిమాలిచ్చారు. హిందీలో వీరు రెండే సినిమాలు చేసారు. అవి ఇన్సాప్ కీ ఆవాజ్, కానూన్ అప్నా అప్నా. ఇవి రెండు కూడా తెలుగు సినిమా రీమేక్‌లే. విలన్ పాత్రలలో అనుపమ్ ఖేర్, కాదర్ ఖాన్‌ల నటనలో కొంత అతి కనిపిస్తుంది. వారి కొడుకులుగా గుల్షన్ గ్రోవర్, తేజ్ సప్రులు నటించారు. తేజ్ సప్రు ఒకప్పటి కారెక్టర్ నటుడు సప్రు కుమారుడు. చాలా సినిమాలలో నటించారాయన. కానూన్ అప్నా అప్నా దిలీప్ సాబ్ నటించిన గొప్ప సినిమాలలో ఒకటి కాదు కాని దిలీప్ కుమార్ నటనను పరిశీలించడానికి చూడదగ్గ సినిమా.

మామూలుగా కన్నా ఎడారిలో నీటి విలువ ఎక్కువ.  అలాగే అన్నీ అమరిన సినిమాలో మెప్పించే నటనకన్నా, ఏవీ సరిగ్గా లేని సినిమాలో మురిపించే నటన గొప్ప తనం మరింత ఎక్కువ. అందుకే, కానూన్ అప్నా అప్నా  లాంటి ఎడారిలో ఒయాసిస్ లా నిలచి ఊరట నిస్తుంది దిలీప్ కుమార్ నటన. కానీ, దిలీప్ కుమార్ రెండవ ఇన్నింగ్స్‌లో ఆయన నటించిన సినిమాల్లో ఆయనకన్నీ రొటీన్ పాత్రలు లభించాయి. మూతి బిగించి, పెదవి అంచులనుంచి సంభాషణలు పలకటం రొటీన్ అయిపోయింది. ఈ రోటీన్ పాత్రలను కూడా భిన్నంగా అనిపించేట్టు చేయటం దిలీప్ కుమార్ ప్రత్యేకత. ఈ విషయంలో అమితాబ్ బచ్చన్ దిలీప్ కన్నా అదృష్టవంతుడు. కొన్ని రొటీన్ వేషలేసినా, రెండవ ఇన్నింగ్స్‌లో అమితాబ్ లోని అసలు నటుడిని ప్రదర్శించే వీలున్న పాత్రలు అధికంగా లభించాయి. అదే దిలీప్ కుమార్ మొదటి ఇన్నింగ్స్‌లో విభిన్నమయిన పాత్రలు ధరించాడు. అలా, ఒకరు లిజెండ్ గా, మరొకరు మిలీనియం స్టార్ లా నిలిచారు. కానూన్ అప్నా అప్నా అనుకున్నా నసీబ్ అప్నా అప్నా అంటే ఇదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here