Site icon Sanchika

ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 45 – మిలన్

[dropcap]‘మి[/dropcap]లన్’ 1946లో వచ్చిన సినిమా. దీనికి ఆధారం రబీంద్రనాధ్ ఠాగోర్ నవల ‘నౌకా డూబీ’. బాంబే టాకీస్ నిర్మించిన ఈ సినిమాకు దర్శకత్వం వహించింది నితిన్ బోస్. దిలీప్ కుమార్ కెరీర్‌లో ‘మిలన్’ సినిమాకు ముఖ్య పాత్ర ఉంది. ఇది దిలీప్ సాబ్‌కి మూడవ సినిమా. దిలీప్ కుమార్‌ను మెథడ్ యాక్టింగ్ వైపుకు నడిపించిన సినిమా కూడా ఇదే. తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ నిర్మించుకోవలసిన అవసరం ఆయన ఈ సినిమాలోనే గుర్తించారు. ముఖ్యంగా ఆ దిశగా ఆయన ఆలోచనను మళ్ళించినది నితిన్ బోస్. నితిన్ బోస్ ప్రభావం దిలీప్ కుమార్ కెరీర్ అంతటా కనిపిస్తుంది. పాత్రలని ఎలా అర్థం చేసుకోవాలి అన్న టెక్నిక్ దిలీప్ సాబ్‌కు నేర్పించింది నితిన్ బోస్. ఒక సీన్‌ని ఇచ్చి ఆ సన్నివేశంలో ఆ పాత్ర మనోభావాలెలా ఉంటాయో కాగితం మీద రాసుకొమ్మని చెప్పేవారట నితిన్ బోస్. ఈ పద్ధతి తనకి చాలా విషయాలు నేర్పించిందంటారు దిలీప్ కుమార్ తన ఆత్మకథలో.

‘మిలన్’ నితిన్ బోస్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా. నటనలో తనకు తానే గురువునవ్వాలని, తను నటించబోయే ప్రతి పాత్రను అది తనే అనుకుని, ఆ సన్నివేశంలో తానెలా ప్రవర్తిస్తాడో ఆలోచించి, అనుభవించి, ఆ భావాలను పలికించడం తన పద్ధతి కావాలని అప్పుడే నిర్ణయించుకున్నారు దిలీప్ సాబ్. షూటింగ్‌లో ఉన్నంత సేపు తన సొంత వ్యక్తిత్వం తనలోకి చొచ్చుకు రాకుండా ఆ పాత్రే తానని అనుకుని పని చేయడం దిలీప్ సాబ్ ఒక పద్ధతిగా అవలంబించడం మొదలయింది ‘మిలన్’ తోనే. దాన్ని ఆ తరువాత మెథడ్ యాక్టింగ్ అనడం మొదలెట్టారు సినీ విశ్లేషకులు. అదేంటో తెలియకుండానే, ఆ పదం గురించి వినకుండానే తన నటనలో సహజత్వం కోసం ఆ దారిలో నడిచి భారతదేశంలో మొదటి మెథడ్ యాక్టర్‌గా క్రిటిక్స్‌చే ప్రశంసలు అందుకున్నారు దిలీప్ కుమార్. ఇచ్చిన స్క్రిప్ట్‌ని దాటి కారెక్టర్‌ని చూడడం దిలీప్ సాబ్ నితిన్ బోస్ దర్శకత్వంలో నేర్చుకున్నారట. స్క్రిప్ట్‌కే పరిమితం అవకుండా అ పాత్ర మనసులోకి చొచ్చుకుపోయి ఆ పాత్రను తనలో ఆవహించుకుని నటించడం మొదలెట్టారు ఈ సినిమాతో.

నితిన్ బోస్ ఆయనకి ఈ సినిమాలో నటించేటప్పుడు ప్రతిసారి చెప్పిన మాట, “మంచి స్క్రిప్ట్ నటుడికి చాలా సహాయం చేస్తుంది. దాన్ని అనుకరిస్తూ, అక్కడితో ఆగకుండా, రచయిత చెప్పాలనుకుంటున్న విషయాన్ని సూక్ష్మంగా గ్రహించి ఆ వాక్యాల నడుమ ఉన్న గాఢతను అర్థం చేసుకున్న వాడే ప్రజలు మెచ్చే నటుడు అవగలడు. అప్పుడే నటుడి నటనా స్థాయి పెరుగుతుంది. అక్కడే నటుడి వ్యక్తిత్వంలో సొంత బాణీ ఏర్పడుతుంది”. దీన్ని దిలీప్ సాబ్ ఎప్పుడూ మర్చిపోలేదు.

దిలీప్ కుమార్‌ని సినీ రంగానికి పరిచయం చెసిన దేవికా రాణి ప్రతి సీన్ రిహార్స్ చేయడం వెనుక ఉన్న అవసరాన్ని నొక్కి చెప్పేవారట. ఒక నటుడు తన సీన్ ఏ స్థాయిలో ఉండాలో ఒక అంచనా వేసుకుని ఆ స్థాయికి చేరేదాకా దాన్ని మళ్ళీ మళ్ళీ చేసి చూసుకోవాలన్న పద్ధతిని ఆవిడ బాంబే టాకీస్‌లో పని చేస్తున్న ప్రతి నటుడికి, నటికీ చెప్పేవారు, వారితో అలా రిహార్సిల్స్ చేయించేవారు. దాన్ని దిలీప్ కుమార్ జీవితాంతం పాటించారు. ప్రొఫెషనల్‌గా ఎదిగిన తరువాత కూడా ప్రతి సీన్ ఎలా రావాలో తనే ఒక కొలమానం పెట్టుకుని ఆ స్థాయిలో అది వచ్చే దాకా మళ్ళీ మళ్ళీ చేసేవారట. తనకు రిహార్సల్స్ సంతృప్తి కలిగిన తరువాతే షాట్ ఇచ్చేవారట. బోంబే టాకీస్ లో అశోక్ కుమార్, ఎస్. ముఖర్జీల సహవాసం కూడా దిలీప్ కుమార్ పై ప్రభావం చూపింది. సినిమా నటన వ్యాకరణం వీరినుంచే నేర్చుకున్నాడు దిలీప్ కుమార్. ఎస్. ముఖర్జీ దిలీప్ కుమార్ కు మరో విషయం నేర్పాడు. అదికూడా దిలీప్ కుమార్ కేరీర్ పైనేకాదు, వ్యక్తిత్వంపైకూడా ప్రభావం చూపింది. నటుడు వేరు స్టార్ వేరు. స్టార్ కన్నా నతుడే ప్రధానం. స్టార్ ను మార్కెట్ తయారుచేస్తుంది. నటన అనేది నటుడి సృజనాత్మకతపై ఆధారపడివుంటుంది. స్టార్ ఎప్పుడూ నటుడిని ప్రభావితం చేయకూడదు. ఇది దిలీప్ కుమార్ నట జీవితం సాంతం ఆయన పాటించిన సూత్రం. ఇలా  నేర్చుకున్న పాఠాలే ఆయనని ఆ స్థాయికి తీసుకువెళ్ళాయి. తరువాత ఆ స్థాయిని జీవితాంతం ఆయన నిలుపుకోవడానికి ఈ పాఠాలే దోహదపడ్డాయి. ఇదంతా వారి ఆత్మకథలో విస్తారంగా చెప్పుకొస్తారు. అలా చూస్తే ‘మిలన్’ దిలీప్ కుమార్ నటనకు మార్గాన్ని నిర్మించుకోవడానికి ఉపయోగపడిన సినిమా.

‘మిలన్’లో దిలీప్ కుమార్ పాత్ర పేరు రమేశ్. కలకత్తాలో లా చదువుతూ ఉంటాడు. పరీక్షలు అయిపోతాయి. జొగెన్ అనే సహద్యాయి అతని ఇంటి పక్కనే ఉంటాడు. అతని ఇంట్లో సాయంత్రాలు గడపడం రమేశ్‌కి అలవాటు. జోగెన్ చెల్లెలు హేమనళినిని ప్రేమిస్తాడు రమేశ్. హేమనళిని మరో స్నేహితుడు అక్షయ్ కూడా ఆమెను ఇష్టపడతాడు. అతను రమేశ్ తండ్రికి ఒక ఆకాశరామన్న ఉత్తరం రాసి రమేశ్ హేమనళినిల మధ్య పెరుగుతున్న స్నేహం గురించి సమాచారం ఇస్తాడు. రమేశ్ తండ్రి సాంప్రదాయవాది. హేమనళిని తండ్రి ఆధునిక భావాలున్న వ్యక్తి. ఈ సంబంధం కలవదని భావిస్తాడు రమేశ్ తండ్రి. అతను ఆ ఊరిలో ఉన్న ఒక వితంతువు కూతురయిన సుశీలతో కొడుకు పెళ్ళి నిర్ణయిస్తాడు. రమేశ్ తన మనసు సంగతి ఎంత చెప్పాలన్నా తండ్రి వినడు. కలకత్తా వచ్చి కొడుకుని తనతో తీసుకుని వెళ్ళి తాను నిశ్చయించిన అమ్మాయితో వివాహం జరిపిస్తాడు రమేశ్, సుశీలలు ఒకరినొకరు చూసుకోరు కూడా. వివాహం తరువాత పెళ్ళి వారు పెళ్ళి కూతురింటి నుండి తమ ఊరికి నదిలో ప్రయాణిస్తున్నప్పుడు తుఫాను వచ్చి వారి నావ తిరగబడి పోతుంది. నావలో ప్రయాణిస్తున్న రమేశ్ ఒక్కడే ఒడ్డుకు కొట్టుకు వస్తాడు. స్పృహ వచ్చిన అతను కొంచెం దూరంలో పెళ్ళి కూతురు దుస్తులలో ఒక అమ్మాయి పడి ఉండడం చూస్తాడు. ఆమెను తీసుకుని తన ఇంటికి చేరతాడు. అయితే సుశీల అని ఆమెను పిలిచినప్పుడు తాను సుశీలను కానని తన పేరు కమల అని ఆమె చెబుతుంది. తనకు తల్లి తండ్రీ లేరని, మేనమామ ఇంట చాలా కష్టాల మధ్య పెరిగానని, తనను కోరి ఒక వ్యక్తి పెళ్ళి చేసుకోవడం తనకు మరో జన్మ ఇచ్చినట్లు అని ఆమె అంటుంది. అప్పుడు రమేశ్‌కి అర్థం అవుతుంది, తన భార్య మరణించిందని, మరో పెళ్ళి వారి నావ నుండి కొట్టుకువచ్చిన కమలను తాను రక్షించి తీసుకువచ్చానని.

తండ్రికి పిండ ప్రదానాలు జరిగిన తరువాత కమల గురించి ఆలోచిస్తాడు రమేశ్, ఆమెకు నిజం చెబితే ఆమె ఎలా స్పందిస్తుందో తెలీదు. అందుకని ఆమెని ఇంట ఉంచుకుని ఆమె మేనమామ అడ్రస్సుకి ఉత్తరం రాస్తాడు. జవాబు వచ్చే లోగా ఒకే ఇంటిలో తామిద్దరూ ఉండడం బావుండదని, కమలను చదువు కోసమని హాస్టల్‌లో చేరుస్తాడు. భర్తకు దూరంగా ఉండడానికి కమల ఇష్టపడదు. ఈ లోపల కమల మేనమామ మరణించాడని, ఆమె వివాహం నళినాక్ష అనే ఒక డాక్టర్‌తో జరిగిందని ఆమె మేనమామ స్నేహితుడు ఉత్తరం రాస్తాడు. రమేశ్ నళినాక్ష కోసం వాకబు చేయడం మొదలెడతాడు.

హేమనళినిని మామూలుగానే రమేశ్ కలుస్తూ ఉంటాడు. కాని అక్షయ్ పూనుకుని రమేశ్ వివాహం సంగతి హేమనళిని కుటుంబానికి చేరవేస్తాడు. హేమనళిని తండ్రి రమేశ్‌తో కూతురు వివాహానికి తేదీ కూడా నిర్ణయిస్తాడు. కాని తాను ఆ వివాహం అప్పట్లో చేసుకోనంటాడు రమేశ్. తననేమీ కారణం అడగవద్దని తనను నమ్మమని మాత్రమే హేమనళినికి చెబుతాడు. కాని ఈ లోగా అతని వివాహం గురించి, అతను భార్యని హాస్టల్‌లో ఉంచాడన్న సంగతి అక్షయ్ ద్వారా తెలుసుకుని హేమనళిని కృంగిపోతుంది. ఆమె బాధ చూడలేక స్థాన మార్పుకు ఆమెను కాశి తీసుకువెళతాడు ఆమె తండ్రి.

రమేశ్ హేమనళినికి పరిస్థితి వివరిస్తూ ఉత్తరం రాస్తాడు. కాని అది పోస్ట్ చేయడు. ఆ ఉత్తరాన్ని కమల చదివి తన పరిస్థితి అర్థం చేసుకుంటుంది. ఆత్మహత్య చేసుకోవాలని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఆమెని రక్షించి చివరకు ఆమెను నళినాక్ష తల్లి వద్ద పనికి కుదురుస్తుంది ఆమె స్నేహితురాలు. నళినాక్ష తన భర్త అని ఆమెకు అర్థం అవుతుంది. కాని నళినాక్ష తల్లి మాత్రం కాశీలో పరిచయం అయిన హేమనళినితో అతని పునర్వివాహం నిర్ణయిస్తుంది. తన భార్య కమల బ్రతికి ఉండవచ్చని కొన్నాళ్ళు వివాహం చేసుకోకుండా ఆగుదాం అన్న కొడుకు మాటలు ఆమె వినదు. చివరకు అందరికి నిజం తెలియడం, కమల నళినాక్ష కలవడం, హేమనళిని రమేశ్‌లు ఒకటవడం కథకు ముగుంపు.

రబీంద్రనాధ్ ఠాగోర్ రాసిన నవలలో ‘నౌకా డూబీ’ని చాలా మంది ఇష్టపడతారు. ‘మిలన్’ సినిమా అనుకున్నంతగా విజయం సాధించకపోయినా ఈ సినిమాను మళ్ళీ బాంబే టాకీస్ నిర్మాణంలోనే నితిన్ బోస్ 1947లో బెంగాలీలో తీసారు. ఇదే కథను మళ్ళీ రామానంద్ సాగర్ 1960లో జెమినీ స్టూడియోస్ నిర్మాత ఎస్.ఎస్. వాసన్ నిర్మాతగా వ్యవహరించగా “ఘూంఘట్” అని తీసారు. బెంగాలీలో మళ్ళీ 1979లో అజయ్కర్ దర్శకత్వంలో మరోసారి ఈ కథతో “నొకా డూబి” అనే పేరుతో మరో సినిమా వచ్చింది. రితుపర్ణోఘోష్ 2011లో మళ్ళీ బెంగాలీ భాషలో ఇదే కథను “నౌకా డూబీ” పేరుతోనే తీసారు. అలా ఐదు సార్లు ఈ కథ బెంగాలీ ఇంకా హిందీలలో సినిమాగా వచ్చింది. తెలుగులో కూడా ఈ కథ ఆధారంగానే 1956లో తాతినేని ప్రకాశరావు “చరణ దాసి” సినిమాగా తమిళంలో “మథర్ కులా మణిక్కం” సినిమాగా తీసారు. 1997లో ముత్యాల సుబ్బయ్య గారు “ఒక చిన్న మాట” అనే సినిమా ఇదే కథ ఆధారంగా తీసారు. ఇన్ని సార్లు తెరకెక్కిన ఈ కథకు ఉన్న బలం అర్థం చేసుకోవచ్చు.

మిలన్‌లో రమేశ్‌గా దిలీప్ కుమార్, కమలగా మీరా మిశ్రా, హేమనళినిగా రంజన నటించారు. మీరా మిశ్రా మిలన్ సినిమా కాకుండా సబ్యచాచి (1948), చోటీ మా (1952) సినిమాలతో పేరు తెచ్చుకున్నారు. రంజన కూడా అప్పట్లో పాపులర్ నటి. 1943లో వచ్చిన రామ్ రాజ్య ఆమె మొదటి సినిమా అంటారు. నూతన్ తనూజల తల్లి శోభనా సమర్థ్‌కు మంచి పేరు తెచ్చిన సినిమా ఇది. నితిన్ బోస్ ‘మిలన్’ సినిమాకు ముందు కలకత్తా లోని న్యూ ధియేటర్స్‌లో పని చేసేవారు. బాంబే టాకీస్‌కి వచ్చాక ఇది వారు చేసిన, మొదటి సినిమా. అలా బాంబే టాకీస్‌కి దిలీప్ కుమార్, నితిన్ బోస్‌లు కలిసి పని చేసిన మొదటి సినిమా కూడా ‘మిలన్’.

‘మిలన్’కు సంగీతం అందించింది అనిల్ బిస్వాస్. పాటలు రాసింది ప్యారేలాల్ సంతోషి, ఆర్జు లఖ్నవి. ఈ సినిమాకు అన్ని పాటలు పాడింది పారుల్ ఘోష్. ఈమె అనిల్ బిస్వాస్ చెల్లెలు. హిందీ సినిమా చరిత్రలో మొదటి రికార్డెడ్ గాయనిగా ఆమెని గుర్తుంచుకుంటారు. అంటే అప్పటి దాకా సినిమాలలో తమ పాటలు తామే పాడుకునే వారు ఆర్టిస్టులు. అలా కాకుండా మొట్టమొదట ప్లే బాక్‌కి పాట రికార్డు చేసింది పారుల్ ఘోష్. ఆమె గొంతు ఈ సినిమాలో వినవచ్చు ఇప్పటి తరం. గీతా దత్ ఈ సినిమాకు రెండు పాటలు పాడారు. లతా ఆశలు సినీ గీతాల వైపుకు రాక ముందే గీతా దత్ గొప్ప పేరున్న గాయనిగా సినీరంగంలో చలామణి అవుతున్నారు.

ఇలా ఎన్నో చారిత్రిక అంశాలతో మిలన్ సినిమాను చూసినప్పుడు హిందీ సినీ ప్రస్థానంలో ఈ సినిమాకున్న విశిష్టత అర్థం అవుతుంది. ఇందులో దిలీప్ కుమార్ ఒక బలహీన మనస్కుడైన మంచివానిగా కనిపిస్తారు. ఈ పాత్ర నుండే అండర్ ప్లే అనే విధానం లోని శక్తిని వారు గుర్తుంచినట్లున్నారు. ఎవరినీ నొప్పించలేక, మనసులో విషయం చెప్పలేక, అందరికీ అనుకూలంగా బ్రతకాలని తాపత్రయపడే సగటు మధ్యతరగతి మనస్తత్వం ఉన్న రమేశ్ పాత్ర నిజంగానే అప్పట్లోని హీరోయిక్ పాత్రల మధ్య ఒక చాలెంజ్. దానికి అంగీకరించి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసారు దిలీప్ కుమార్.

దిలీప్ కుమార్ సినీరంగంలో అడుగుపెట్టినప్పుడు, సినీ రంగం వయసు కనీసం 30 ఏళ్ళు కూడా లేదు. దిలీప్ కుమార్ చాలా జాగ్రత్తగా పాత్రలను ఎంచుకునేవారు. ప్రతి పాత్రలో ఏదో కొత్తదనం, ప్రత్యేకత వుండాలని తపనపడేవారు. తన ప్రతి సినిమా ఏదో ఒక వైశిష్ట్యం కలిగివుండాలని కోరుకునేవారు. అందుకే ఆయన నటించిన 64 సినిమాల్లో ప్రతి సినిమా ఏదో ఒక అంశం ఆధారంగా గుర్తుండిపోతుంది. దిలీప్ కుమార్ తన నట జీవితంలో ఎవరినీ అనుకరించలేదు. కానీ, మనోజ్ కుమార్ నుంచి, అమితాబ్ బచ్చన్ ద్వారా, షారుఖ్ ఖాన్ వరకూ ప్రతి అగ్రశ్రేణి నటుడూ ఆయనను అనుకరించాలని తపన పడ్డారు. ఆయన ఆధారంగా తమ నటనకు మెరుగులు దిద్దారు.  మిలన్ కన్నా ముందు దిలీప్ కుమార్ నటించిన జ్వార్ భటా, ప్రతిమా సినిమాలలో దిలీప్ కుమార్ నటన తీవ్రమైన విమర్శలకు గురయింది. జైలు లోంచి పారిపోయి వచ్చిన ఖైదీలా వున్నాడని హేళన చేశారు. కానీ, 1946లో మిలన్ నుంచి, 1952లో దీదార్ నడుమ 12 సినిమాల్లో నటించారు దిలీప్ కుమార్. దీదార్‌తో సూపర్ స్టార్ అయ్యాడు. పారిపోయిన ఖైదీలా వుండే దిలీప్ కుమార్, సినిమాల్లో నటనకు ప్రామాణికాలేర్పరచిన లిజెండ్‌గా ఎదగటం మిలన్‌తో ప్రారంభమయింది. నటన విషయంలో  ప్రామాణికాలేర్పరచిన  దిలీప్ కుమార్   నట జీవితాన్ని అర్థం చేసుకోవటంలో ఈ ఆరంభ సినిమాలు అత్యంత ప్రాధాన్యం వహిస్తాయి. ముఖ్యంగా మొదటి రెండు సినిమాల  ప్రింట్లు అలభ్యం అవటంతో, దిలీప్ కుమార్ ఆరంభం  నటనను అధ్యయనం చేయటంలో మిలన్ సినిమా మరింత ప్రాధాన్యం వహిస్తుంది.

Exit mobile version