[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం దిలీప్ కుమార్ నటించిన ‘గోపి’ సినిమాని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]
దిలీప్ కుమార్‌కి మరో ఫిలింఫేర్ నామినేషన్ తెచ్చిన సినిమా ‘గోపి’
[dropcap]1[/dropcap]970లో దిలీప్ కుమార్, సైరా బానుతో నటించిన మొదటి సినిమా ‘గోపి’. 1964లో కన్నడలో “చిన్నద గోంబే” అన్న సినిమా తీసారు బి.ఆర్. పంతులు గారు. దీన్ని ఒకేసారి ‘మురదన్ ముత్తు’గా తమిళంలో కూడా తీసారు. తమిళంలో శివాజీ గణేశన్, దేవిక గార్లు నటిస్తే, కన్నడలో కళ్యాణ్ కుమార్, ఎమ్. వి రాజమ్మ, జయలలిత, గార్లు నటించారు. కన్నడ సినిమాలో బి. ఆర్ పంతులు గారు నటించారు కూడా. ఈ రెండు భాషలలో ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా కథ బెంగాలీ కథ ఆధారంగా రాసుకున్నారని అంటారు. అయితే ఇదే కథను తరువాత 1970లో దిలీప్ కుమార్, సైరా బాను లతో ఏ. భీమ్ సింగ్ దర్శకత్వంలో ‘గోపి’గా తీసారు. తమిళ సినిమాలలో అప్పటికే పెద్ద దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు భీమ్ సింగ్. హిందీలో పద్దెనిమిది సినిమాలు తీసారీయన. తమిళంలో శివాజీ గణేశన్‌తో “ప” అక్షరంతో మొదలయ్యే పేర్లతో సినిమాలు తీయడం వీరి సెంటిమెంట్‌గా ఉండింది. వీరు తీసిన సినిమాలన్నీ కూడా కుటుంబ సంబంధాల నేపథ్యంతో వచ్చినవే.
‘గోపి’ సినిమాకి ముందు హీరోగా రాజేంద్ర కుమార్‌ని అనుకున్నారట. అప్పటికే సైరా బానుతో 1966లో దిలీప్ సాబ్ వివాహం జరిగింది. తరువాత వారిద్దరు జోడిగా ఉంటే సినిమాకు క్రేజ్ పెరుగుతుందని కావచ్చు, నిర్మాతలు రాజేంద్ర కుమార్‌ని తొలగించి దిలీప్ కుమార్‌ని తీసుకున్నారు. పల్లెటూరి యువకుడి పాత్రలకు దిలీప్ కుమార్ నటన ప్రాణం పోస్తుంది అంటారు. అందుకే ఈ సినిమాకు ఆయనే సరిపోతారు అని కూడా అనుకుని ఉండవచ్చు. కాని దిలీప్ కుమార్ మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఆయన నటన అంత గొప్పగా ఉండదు. సినిమా మొదట్లో ఉన్న పట్టు పాత్రపై ఆ తరువాత కనిపించదు. దిలీప్ కుమార్ సినిమాలన్నిటిలో కూడా ఈ సినిమాలో మాత్రం వారి ఆత్మ కనిపించదు. క్రమంగా పాత్రపై ఇష్టాన్ని కోల్పోయారో లేదా మరే కారణమో కాని వారి సినిమాలన్నిటిలో మనకు కనిపించని ఒక వెలితి, చివరకు వారి సెకెండ్ ఇన్నింగ్స్‌లో సినిమాలను చూసినప్పుడు కూడా కనిపించని గాప్ నటనా పరంగా ఈ సినిమాలో కనిపించింది. కళ్ళతో భావాలు పలికించడం దిలీప్ కుమార్ స్టైల్. కాని చాలా ప్లేన్‌గా అభావంగా వారు ఈ సినిమా రెండో భాగంలో కనిపించి ఆశ్చర్యపరుస్తారు. దిలీప్ కుమార్‌పై అభిమానంతో ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఉన్నా పాత్రలో లీనమవకుండా నటించే దిలీప్ కుమార్ మనకు నచ్చరు. అయనలో ఒక వెలితి కనిపిస్తూ ఉంటుంది ఈ సినిమాలో ముఖ్యంగా రెండవ భాగంలో.
‘గోపి’ సినిమాలో ఓమ్ ప్రకాశ్ దిలీప్ కుమార్ అన్నగా నటిస్తే, నిరూపా రాయ్ ఆయనకు వదినగా నటించారు. వీరిద్దరి నటన చాలా బావుంటుంది. కొన్ని సీన్లలో దిలీప్ కుమార్, ఓమ్ ప్రకాశ్ కలిసి నటిస్తున్నప్పుడు దిలీప్ కుమార్ నటన ఓంప్రకాశ్ గారి నటన ముందు పేలవంగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని ఒక సందర్భంలో దిలీప్ కుమార్ గారే ఒప్పుకున్నారు. స్వతహాగా ఓంప్రకాశ్ ప్రతిభ ఉన్న నటుడు, కాని షోరాబ్ మోడి, పృథ్వీరాజ్ కపూర్ లాంటి హేమా హేమీలతో సమాన స్థాయిలో నటించిన దిలీప్ కుమార్ ‘గోపి’ సినిమా దగ్గరకు వచ్చేసరికి ఎక్కడో ఏదో పోగొట్టుకున్నట్లుగా, పాత్రలో ప్రవేశించలేక తడబడట్టుగా కనిపిస్తారు. వారి ఆ తడబాటు వారి నటనలో స్పష్టంగా కనిపిస్తుంది. కాని ఓం ప్రకాశ్ మరో వైపు గొప్ప ఆత్మవిశ్వాసంతో నటించారు. మొదటిసారి దిలీప్ కుమార్ నటన మరో నటుడు ముందు కొట్టుకుపోయింది. నలభై సంవత్సరాలు హిందీ సినీ పరిశ్రమలో ఎన్నో పాత్రలు వేసి మెప్పించిన ఓం ప్రకాశ్ వైవిద్యం ఉన్న గొప్ప నటుడు. “గోపీ” సినిమాలో నిస్సందేహంగా దిలీప్ సాబ్ కన్నా వీరిదే పై చేయి అయింది. నిష్పక్షపాతంగా నిజాన్ని ఒప్పుకుని ఓంప్రకాశ్ నటనా స్థాయిని గౌరవించాలి.
నిరూపారాయ్‌ని హిందీ సినీ ప్రేమికులు మర్చిపోలేరు. ఎందరో సూపర్ స్టార్లకు అమ్మగా చేసి మురిపించిన నటి నిరుపారాయ్, వివాహం తరువాత గుజరాతీ సినిమాలో నటులు కావాలనే ఒక పేపర్ యాడ్ చూసి ఆ అడ్రసుకు తన వివరాలు పంపి ఎంపికయ్యి నటిగా కెరీర్‌ని మలచుకున్నారు ఆమె. అలా నటిగా కొనసాగి పరిశ్రమలో ఎంతో గౌరవమైన పేరు తెచ్చుకున్నారు. మూడు ఫిలింఫేర్ అవార్డులు సంపాదించుకున నటి ఆమె. ‘గోపి’లో ఆమె తన పాత్రకు జీవం పోసారు. ఫరీదా జలాల్ మరో మంచి నటి. ఈ సినిమాలో ఆమె దిలీప్ కుమార్‌కు చెల్లెలిగా నటించారు. దుర్గాఖోటే, లలితా పవర్‌లు కూడా మరో రెండు పాత్రలలో కనిపిస్తారు.
దుర్గాఖోటే మాతృభాష కొంకిణి. 26 ఏళ్ళ వయసులో, భర్త చనిపోయాక ఇద్దరు పిల్లల్ని బ్రతికించుకోవడానికి సినిమాల బాట పట్టిన స్త్రీ ఆమె. సినీరంగంలో ప్రతి ఒక్కరు గౌరవించే వ్యక్తిగా ఎదిగి సినిమాకు ఆమె చేసిన సేవలకు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న నటీమణీ. లలితా పవర్ హిందీ మరాఠీ, గుజరాతీ భాషలలో అప్పట్లోనే ఏడువందల సినిమాలు పైగా నటించారు. సినీ రంగంలో గొప్ప నటి. ఆవిడ చేసిన పాత్రలలో ఎన్నో ప్రయోగాలుండేవి. ఆవిడ తన పాత్రలో చూపే హావభావాలు చాలా గొప్పగా ఉండేవి. “దాగ్”లో అంతకు ముందు దిలీప్ కుమార్ తల్లిగా ఆమె గొప్ప ఫెర్మామెన్స్ ఇచ్చారు. ఆవిడని “ఘరానా” సినిమాలో “దాది అమ్మా దాది అమ్మా మాన్ జావ్” పాటలో చూడాలి. ఎంత చక్కని నటనను చూపిస్తారో. 1942లో జంగ్ ఏ ఆజాదీ అనే సినిమాలో నటిస్తున్నప్పుడు భగవాన్ దాదా అనే మరో నటుడు ఆమెను చెంపదెబ్బ కొట్టాలి. ఆ సీన్‌లో ఆయన ఆమెను ఎంత గట్టిగా కొట్టాడంటే ఆమె చెవి నుండి రక్తం కారడం మొదలెట్టింది. ఆమె ఎడమ పక్క భాగానికి పక్షవాతం వచ్చింది. అలా ఒక కన్ను శాశ్వతంగా చిన్నదయిందట. అయినా ఆమె ఓటమి ఒప్పుకోలేదు. ఆ కన్నుతో నెగిటివ్ పాత్రలకు జీవం పోసి గొప్ప నటిగా పేరు తెచ్చుకున్నారామె. ఆమెకు అప్పట్లో మంచి గాయనిగా కూడా పేరు ఉండేది. 1935లో వచ్చిన హిమ్మతే మర్ద్ అన్న సినిమాలో ఒక పాట కూడా పాడారామె. ఇక ప్రాణ్ “గోపీ” సినిమాలో మరోసారి దిలీప్ కుమార్‌తో ప్రతినాయకుడిగా నటించారు. ముఖ్రీ, జానీ వాకర్‌లు తమదైన శైలిలో అలరిస్తారు.
గోపి అన్న గిరిధారిలాల్ బొమ్మలు తయారు చేస్తుంటాడు. కష్టజీవి. తన సవతి తమ్ముడిని, చెల్లెలిని తన సొంత బిడ్డల్లా చూసుకుంటాడు. అతని భార్య పార్వతి భర్తకు తగ్గ ఇల్లాలు. గోపి అమాయకుడు, లౌక్యం తెలియని వాడు, పైగా ఆవేశపరుడు. అన్నా వదినల గారాబంతో పెద్దగా బాధ్యత తెలియకుండా పెరుగుతాడు. ఆ ఊరిలో జమిందారు లాలా, గిరిధారిలాల్ తయారు చేసిన బొమ్మలను రెండు మూడు రూపాయలకి కొని పట్నంలో యాభై రూపాయలకు అమ్ముకుంటూ ఉంటాడు. అతని వద్ద గిరిధారిలాల్ తన చెల్లెలి పెళ్ళి కోసం ఐదు వేలు దాచుకుంటాడు. పెళ్ళి సమయానికి ఆ డబ్బు తన వద్ద లేదని బుకాయిస్తాడు లాలా. ఈ గొడవలలో దుడుకు వ్యక్తి అయిన గోపి జమిందారి కోపానికి ఎన్నో సార్లు గురి అవుతాడు. చివరకు అతన్ని గిరిధారిలాల్ ఇంటి నుండి వెళ్ళిపొమ్మంటాడు. కోపంతో గోపి పట్నం వెళ్ళి అక్కడ పనికి కుదురుతాడు. గోపి యజమానురాలు దయ గల జమిందారిణీ. ఆమె కొడుకుతో గోపి చెల్లెలి పెళ్ళి నిర్ణయం అవుతుంది. కాని గిరిధారిలాల్, పార్వతిలు ఊరిలో ఉండలేని పరిస్థితులు ఏర్పడతాయి. సీమ అనే దూరపు చుట్టం కూతురు గోపిని ప్రేమిస్తుంది. గోపి అన్న వదినలలే తన కుటుంబం అనుకుని వారికి సేవలు చేస్తూ వారితో ఉండిపోతుంది. ఆమె మీద జమిందారు కన్ను పడుతుంది. సీమ మేనత్తతో కలిసి ఆ జమిందారు ఆమెను మోసంతో వివాహం చేసుకోవాలనుకుంటాడు. సీమ ఆఖరి క్షణంలో అతని నుండి తప్పించుకుని పట్నం పారిపోతుంది. చివరకు కష్టాలన్నీ దూరం అయి గిరిధారిలాల్, గోపీలు కలవడం, జమిందారుకి బుద్ధి చెప్పడం కథకు ముగింపు.
ఈ సినిమాలో ఐదు పాటలుంటాయి. అందులో “సుఖ్ కె సబ్ సాథీ” అన్న ఒక్క పాటే రఫీ పాడారు. వారి గాత్రంలో ఈ వైరాగ్యం అద్భుతంగా పలుకుతుంది. రఫీ హిట్ గీతాలలో ఇది ఒకటి. మిగతా పాటలు లత మహేంద్ర కపూర్లు పాడారు. వాటిలో “రాంచంద్ర కహ్ గయే” అనే పాట పాపులర్ అయింది. హిందీ సినీ నటిమణులలో సైరా బాను గ్లామర్‌తో పేరు సంపాదించుకున్నారు. వీరిని పెద్ద నటిగా క్రిటిక్స్ ఎప్పుడూ ఎంచరు. ఈ సినిమాలో కూడా వీరి నటన అంత చెప్పుకునేటట్టుగా ఉండదు. ఒక రెండు అనవసర డ్యూయెట్లు ఉంటాయి. అందులో వీరి నాట్య ప్రతిభను దర్శకుడు చూపించే ప్రయత్నం చేసారు. ఈ సినిమాలో కుంవర్ పాత్రలో నటించినది సుదేష్ కుమార్. చాలా సినిమాలలో అప్పట్లో సపోర్టింగ్ కారెక్టర్లు చేసేవారు.
గోపీ సినిమాకు సంగీతం అందించింది కళ్యాణ్‌జీ ఆనంద్‌జీలు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌లు వీరి వద్ద అసిస్టెంట్లుగా పని చేసారు. గోపీ సినిమాకు పాటలు రాసింది రాజేంద్ర కిషన్. ఈ సినిమాకు దిలీప్ కుమార్ ఫిలింఫేర్ ఉత్తమ నటుడి కేటగిరీకి ఎంపికయ్యారు. కాని రాజేశ్ ఖన్నా ఆ సంవత్సరం “సచ్చా జూఠా” అనే సినిమాకు ఆ అవార్డు గెలుచుకున్నారు.
గోపి సినిమా సెమీ హిట్ అంటారు. దిలీప్ కుమార్ మంచి సినిమాలలో దీన్ని ఒకటిగా ఇప్పుడు చెప్పినా క్రిటికల్‌గా చూస్తే ఇది దిలీప్ కుమార్ కన్నా, ఓం ప్రకాశ్ కు ఎక్కువ మార్కులు పడవలసిన సినిమా.