Site icon Sanchika

ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 51 – ఆద్మి

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం దిలీప్ కుమార్ నటించిన ‘ఆద్మి’ సినిమాని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్ కెరీర్‌లో మరో ఉత్తమ చిత్రం ‘ఆద్మి’

[dropcap]‘ఆ[/dropcap]ద్మి’ సినిమా 1968లో వచ్చింది. దీనికి మూలం 1962లో శివాజీ గణేశన్ నటించిన “ఆలయమణి” అనే సినిమా. దీన్నే తెలుగులో 1964లో ఎన్.టీ.ఆర్.తో “గుడి గంటలు”గా తీసారు. తరువాత నాలుగు సంవత్సరాలకు దిలీప్ కుమార్‌తో ‘ఆద్మి’ వచ్చింది. కొన్ని సినిమాలు ఇలా మూడు, నాలుగు భాషలలో రీమేక్ అవడం మనకు కొత్త కాదు. ఇవి ఆ నటులకు పరీక్ష కూడా. ఇప్పుడు ఆ పాత సినిమాలను ఏ పక్షపాతం లేకుండా, ఇతర ప్రభావాలకు లోను కాకుండా, ఎవరు బాగా చేసారో విశ్లేషిస్తే కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. ‘ఆద్మి’ సినిమాను అదే దృష్టితో చూడాలి.

ఈ సినిమా గురించి చెప్పబోయే ముందు కొంత అప్రస్తుతం అయినా ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. తెలుగులో సావిత్రి గారు “చివరకు మిగిలేది” అనే సినిమాను 1960లో చేసారు. దీన్నే 1969లో వహిదా రెహమాన్‌తో “ఖామోషీ”గా తీసారు. ఈ రెండు సినిమాలకు మాతృక 1959 బెంగాలీలో సుచిత్ర సేన్ చేసిన “దీప్ జ్వెలే జాయ్” ఈ మూడు సినిమాలు చూసినప్పుడు కూడా సావిత్రి గారి నటన సుచిత్రా సేన్, వహిదా రెహ్మాన్‌ల కన్నా ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. సుచిత్రా సేన్ చాలా గొప్ప నటి. కాని సినిమా ఆఖర్న హీరోయిన్ మతి చలించే సీన్‌లో సావిత్రి గారి మొఖంలో పలికిన భావాలు ఆవిడ నటనా స్థాయిని చెబుతాయి. అలాంటి కంపారిజన్ మళ్ళీ నా వరకు నేను చేసుకున్నది ఈ ఆద్మి సినిమాలో.

ఆలయమణిలో శివాజీ గణేశన్, గుడిగంటలులో ఎన్.టీ ఆర్, ఆద్మిలో దిలీప్ కుమార్ ఈ ముగ్గురి నటన ఏ పక్షపాతాలు లేకుండా కేవలం నటన కోసం చూస్తే దిలీప్ కుమార్ ‘ఆద్మి’ ఖచ్చితంగా మిగతా సినిమాలకన్నా పై స్థాయిలో ఉంది. ఇందులోని రాజేష్ పాత్రకు దిలీప్ కుమార్ ఎంత న్యాయం చేసారో, ఎన్ని షేడ్స్ అందులో చూపించగలిగారో ఒకో సీన్ మనం మూడు భాషలలో తిప్పి చూసుకుంటుంటే మనకే అర్థం అవుతుంది. ‘ఆద్మి’లో ఒక స్టార్ కనిపించడు, ఒక నటుడు కనిపిస్తాడు. కేవలం ఆ పాత్రే కనిపిస్తుంది. తమిళంలో శివాజీ గారిది లౌడ్ ఫర్మామెన్స్. శివాజీ గణేశన్ గారి సినిమాలు తెలుగులో ఎన్.టీ.ఆర్. గారు చేసున్నప్పుడు అదే స్టైల్ ఫాలో అవుతారు. కాని దిలీప్ కుమార్ మాత్రం మిగతా నటుల స్టైల్ జోలికి వెళ్ళకుండా, కేవలం రాజేశ్ పాత్రను తీసుకుని దానిలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రను తెర మీద ఆవిష్కరింఛారు. మొదటి సినిమాకు ఈ ఆద్మికి మధ్య ఆరు సంవత్సరాల సమయం రావడంతో ఆ పాత్రను ఇంకా గొప్పగా తెర పైకి తేవడానికి అవకాశం కూడా ఉండింది. మొదటి రెండు సినిమాలలో జరిగిన పొరపాట్లను ఈ సినిమాలో దిద్దుకోగలిగారు దర్శకులు భీంసింగ్. తెలుగులో వీ. మధుసూధనరావు గారు, తమిళంలో కే శంకర్ గారు దర్శకత్వం చేసిన ఈ సినిమాలు కాలంతో పాటు పాత పడ్డాయి. కాని ‘ఆద్మి’ ఈ రోజు చూసినా మనల్ని కథలోకి తీసుకెళ్ళీ, ఆ పాత్రకు దగ్గర చేయగల సినిమా. దీనికి కారణం ఒక్క దిలీప్ కుమార్ నటన.

‘ఆద్మి’ సినిమాకు మరో కనిపించని హీరో, ఈ సినిమాకు మాటలు రాసిన అక్తర్-ఉల్-ఈమాన్ అనే ఉర్దూ రచయిత. 1962లో తన ఉర్దూ కవితా సంకలనం యాదె కు సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న రచయిత ఇతను. ఆద్మి సినిమా ఆఖరున ఒక డైలాగ్ దిలీప్ కుమార్‌తో చెప్పిస్తారు దర్శకులు “గల్తి కర్నే వాలా ఆద్మి హోతా హై పర్ పచ్‌తానే వాలా ఇంసాన్” తప్పు చేసిన వాడు మనిషి, పశ్చాత్తాపం పడేవాడు మానవుడు. సినిమా కథ అంతా ఈ ఒక్క వాక్యంలో వస్తుంది. మన దేశంలో మనిషి మనసులోని కోణాలను ఆవిష్కరిస్తూ, అతనిలోని మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణను వ్యక్తపరిచే సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. దిలీప్ కుమార్ తన కెరీర్‌లో ఇలాంటి ఇతివృత్తంతో రెండు సినిమాలు చేసారు. మెహమూబ్ ఖాన్ దర్శకత్వంలో “అమర్” తరువాత భీంసింగ్ దర్శకత్వంలో “ఆద్మి.” కాని ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ధ విజయం సాధించలేకపోయాయి. కాని దిలీప్ కుమార్ అత్యద్భుత ఫర్మామెన్స్ ఇచ్చిన సినిమాలు ఇవి. “అమర్”లో కన్నా ‘ఆద్మి’ సినిమాకు ఆయనలో చాలా పరిపక్వత వచ్చింది. అందుకే ఈ పాత్రను ఆయన అంత గొప్పగా చేయగలిగారు. కాని దీన్ని జనం మెచ్చకపోవడం ఆయనకు ఒకరకంగా జరిగిన అన్యాయమే.

రాచరికపు వంశానికి చెందిన రాజేశ్ ఒంటరివాడు. తన క్రింద పని చేస్తున్న వారి పట్ల ఎంతో బాధ్యతతో నడుచుకునే వ్యక్తి. అతని పట్ల అందరూ గౌరవం చూపుతారు. తండ్రి లేని శేఖర్‌కి అన్నీ తానయి డాక్టర్ చదివిస్తాడు. తన హాస్పిటల్ లోనే ఉద్యోగం ఇస్తాడు. ఎవరినీ బాధపెట్టని వ్యక్తి. కాని అతనికే మానసిక ప్రశాంతత ఉండదు. చిన్నతనంలో తన కిష్టమైన స్నేహితురాలు చనిపోతే ఆమె గుర్తుగా తన దగ్గర ఉంచుకున్న బొమ్మను బాబు అనే స్నేహితుడు లాక్కున్నాడని కోపంతో అతన్ని సముద్రంలోకి కొండ పైనుండి తోసివేస్తాడు. బాబు మరణం అతని మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. తనలో ఆ కోపం, క్రూరత్వాన్ని జయించాలని అతను జీవితాంతం చాలా కష్టపడతాడు. కాని ఒంటరిగా ఉన్నప్పుడు తాను చేసిన ఆ తప్పు అతనికి గుర్తుకు వస్తూనే ఉంటుంది. ప్రతి మనిషిలో ఇలా రెండు భిన్న దృవాలుంటాయి. సమయాన్నిబట్టి, పరిస్థితులను బట్టి అవి బైటకు వస్తూ ఉంటాయి. ఈ ఇతివృత్తంతో రాబర్ట్ లూయి స్టీవెన్సన్ రాసిన The strange case of Dr. Jekyl and Mr. Hyde అన్న నవల చాలా మందికి తెలుసు.

మనిషిలోని ఆ మరో మనిషితో మనిషి ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉంటాడు. రాజేశ్‌లో చెడు పై ప్రతిసారి మంచి గెలుస్తూ ఉంటుంది, ఇది అతను చేసిన తప్పులను గుర్తు చేస్తూ ఉంటుంది. తాను చిన్నతనంలో చేసిన తప్పు ఎప్పుడు తనను ప్రశ్నిస్తూ తనని దోషిగా నిలదీస్తున్నట్లు అతనికి అనిపిస్తూ ఉంటుంది. దీనితో పాటు తనలో ఆ రెండవ మనిషి మరే సందర్భంలో పైకిలేస్తాడో అన్న చింత కూడా అతన్ని బాధిస్తూనే ఉంటుంది. తన దగ్గర పని చేసే గిర్దారి లాల్ కూతురు మీనాని అతను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. రాజేశ్ సహాయాన్ని మంచి మనసును అర్థం చేసుకున్న శేఖర్, కొన్ని సందర్భాలలో తాను ఓడి అతన్ని గెలిపించడానికి కూడా వెనుకాడడు. తను ప్రేమించిన మీనానే రాజేశ్ ప్రేమించాడని తెలిసిన తరువాత కూడా ఈ సంగతి రాజేశ్‌కి చెప్పకుండా వారి పెళ్ళి కుదుర్చుతాడు. మీనా కూడా రాజేశ్ తన అక్క పెళ్ళికి చేసిన సహాయం, అతని మనసుని, మంచితనాన్ని అర్థం చేసుకుని తన ప్రేమను త్యాగం చేస్తుంది.

మాయాదేశ్ అనే ఒక వ్యక్తి రాజేశ్ తండ్రి సమయం నుండి ఆ ఇంట్లోపని చేస్తూ ఉంటాడు. ఇతను చేసిన కుట్రకు కారు ఆక్సిడెంట్‌లో రాజేశ్ కాళ్ళు పోతాయి. ఆ స్థితిలో తాను మీనాని వివాహం చేసుకుని ఆమెకి అన్యాయం చేయనంటాడు రాజేశ్. కాని తనను రక్షించి బదులుగా తన కాళ్ళు పోగొట్టుకున్న రాజేశ్ పట్ల తన బాధ్యత తాను మరచిపోనని,ఎట్టి పరిస్థితులలో అతనితోనే తన జీవితం అని నిశ్చయించుకుంటుంది మీనా. ఒక వైపు కాళ్ళు లేని అసహాయత, చేతి కందినట్టే అంది దూరమయిన సుఖప్రద జీవితం ఇవన్నీ రాజేశ్ మనసును తొలుస్తూ ఉంటాయి. ఆ సమయంలో మీనా శేఖర్ల గురించి పుకార్లు విని అతనిలో కలవరం బయలు దేరుతుంది, కొన్ని సందర్భాలలో మీనా వైపు చూసే శేఖర్ చూపు వారిద్దరి మద్యలో ఏదో ఉందన్న భావాన్ని కలిగిస్తుంది. తన జీవితంలోని విషాద గాథను నిజాయితీగా మీనాతో చెప్పుకున్నప్పుడు, మీనా తాను కూడా తమ పూర్వ ప్రేమ సంగతి రాజేశ్‌తో చెప్పుకోవాలనుకుంటుంది కాని శేఖర్ ఆమెను ఆపుతాడు. వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న అనుమానం రాజేశ్‌లో ఆ మరో మనిషిని బైటకు తీసుకువస్తుంది. అది శేఖర్ పట్ల కోపంగా మారుతుంది. బాబుని సముద్రంలో తోసిన చోటే శేఖర్‌నూ నెట్టేస్తాడు రాజేశ్. కాని సముద్రంలో శేఖర్ ఒక రాయి పట్టుకుని పైకి వస్తాడు. రాజేశ్ పడుతున్న బాధ అర్థం చేసుకుని అతనికి తన గతాన్ని చెబుతాడు.

శేఖర్ మీనాల మధ్య తాను మధ్యలో వచ్చానని, తన కారణంగా ఇద్దరు ప్రేమికులు విడిపోయి ఇప్పుడు బాధ్యతల నడుమ కొట్టూమిట్టాడుతున్నారని తెలుసుకున్న రాజేశ్ తనలోని కోపానికి, తనని ప్రేమిస్తున్న వ్యక్తులకు తాను ఇచ్చిన దుఃఖానికి సిగ్గుపడి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోబోతాడు. కాని అతన్ని ఒక జాలరి రక్షిస్తాడు. రమేశ్‌కి ఈ ప్రమాదం వలన పోయిన కాళ్ళు వస్తాయి. శేఖర్ మీనా ఇద్దరు కూడా రాజేశ్‌కు తాము అన్యాయం చేసామని బాధపడతారు. తన తదనంతరం ఆ ఇద్దరికి రాజేశ్ రాసిన ఆస్తిని ఇద్దరూ స్వీకరించరు. లోకం వేసే నిందలను తప్పించడానికి శేఖర్ తనను కోరుకుంటున్న ఆర్తిని పెళ్ళి చేసుకుంటే, రాజేశ్ జ్ఞాపకాలతో తన ఆస్తి కూడా శేఖర్ పరం చేసి మీనా మరణించబోయేంతలో రాజేశ్ ఆమెను చేరడంతో కథ సుఖాంత మవుతుంది.

దిలీప్ కుమార్ నటన ప్రతి ప్రేమ్‌లో కదిలిస్తుంది. ఒంటరితనంతో బాధపడుతున్న వ్యక్తిగా, ప్రేమ కోసం తపిస్తున్న ప్రేమికుడిగా, అందరికీ న్యాయం చేయాలని, తన వలన ఎవరూ బాధపడకూడదని చూసే మంచివానిగా తన చిన్ననాటి గతం తనలోని మరో మనిషిని నిత్యం గుర్తు చేస్తుంటే దానికి కృంగిపోతున్న వ్యక్తిగా చాలా గొప్ప ఫెర్ఫార్మెన్స్ ఇస్తారు ఆయన. దిలీప్ కుమార్ కోసం ప్రత్యేకంగా రాసిన సంభాషణలు చాలా బావుంటాయి. వాటిని ఆయన పలికించిన తీరు, ఆ పాత్ర ఆత్మని ఆవిష్కరిస్తుంది. ఎటువంటి ఎమోషన్ అయినా మృదువుగా పలికి మిగతా పాత్రల మధ్య అంత అండర్ ప్లే చేసి మరీ ఆ పాత్రను దిలీప్ కుమార్ ఎలా ఎలివేట్ చేస్తారో ఆయనకే తెలియాలి. మంచి సంస్కారం సభ్యతతో మృదువైన భాషతో ఆయన ప్రేక్షకుల మనసు దోచుకోగలరు. మీనాని “ఆప్” అని సంభోధిస్తూ తన మనసులోని ప్రేమను అయన చూపుతున్న సీన్లలో, మీనా తండ్రికి తాను మీనాని వివాహం చేసుకోదలచానని చెబుతూ ఆమె అక్క వివాహానికి డబ్బు ఇస్తూ, తాను మీనాని వివాహం చేసుకోవడానికి ఆ డబ్బుకి ఎటువంటి సంబంధం లేదని మీనా అనుమతి లేకుండా వివాహం జరగదని అంటూ అతను చూపే మర్యాద, ఆ సీన్‌లో దిలీప్ కుమార్ చూపించిన భావాలు అతని పై ప్రతి ఒక్కరికి ఇష్టానికి పెంచుతాయి.

దిలీప్ కుమార్ నటనలో గొప్పతనం అతను కళ్లతో పలికించే భావాలు. అన్ని ఉన్నా కూడా ఒంటరితనాన్ని భరిస్తూ ప్రేమ కోసం అర్రులు చాస్తున్న వానిగా ఆ కళ్ళల్లో వచ్చీ పోయే ఆ కన్నీరు, దాని మాటున అతని అసహాయత, చక్రాల కుర్చీకి పరిమితం అయినప్పుడు తన స్థితికి బాధపడుతూ, తన దుఃఖం మరొకరి దుఃఖం కాకూడదని అతను తాపత్రయపడే విధానం చాలా గొప్పగా అభినయించారు. దిలీప్ కుమార్ సినిమాలలో మర్చిపోలేని సినిమా ఆద్మి.

స్క్రీన్ మీద దిలీప్ కుమార్ ఉంటే పక్కన ఎవరూ కనిపించరు, ఆయన కనిపించనివ్వరు. అది ఆయన మాజిక్. మనోజ్ కుమార్‌తో పాటు వహిదా రెహ్మాన్ కూడా ఆయనతో సమాన స్థాయిలో నటించలేకపోయారు ఈ సినిమాలో. అంతగా ఆడియన్స్‌ని ఆకర్షిస్తారు ఆయన. దిలీప్ కుమార్ సినిమాలతో పరిచయం లేనివారు ఆయనను చూస్తే హీరోగా కూడా ఒప్పుకోరు. ఆయనను మించిన అందమైన హీరోలు చాలా మంది ఉన్నారు. అతి మామూలు హేర్ స్టైల్‌లో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఆయన పాత్రకు ఒక రాజరికాన్ని తీసుకు వస్తారు. అది ఎలా ఏ కోణంలో సాధ్యం అవుతుందో మనకు అర్థం కాదు. కాని స్క్రీన్‌పై దిలీప్ కుమార్ కనిపిస్తే ఎటువంటి నటుడు అయినా ఆయన పక్కన చిన్నబోవడం చూస్తాం. అతనితో సమానంగా కనిపించాలంటే ఒక పృథ్వీరాజ్ కపూర్, షోరాబ్ మోడి, నాజిర్ హుసేన్ స్థాయి నటులే కావాలి. మిగతా వారెవ్వరూ ఎంత ప్రయత్నించినా వారి నుండి ఆడియన్స్ దృష్టి మరల్చలేరు. ఉర్దూలో ఒక పదం ఉంది ‘తెహజీబ్”. ఈ పదానికి అర్థం దిలీప్ కుమారే. హిందీ సినీరంగంలో “తెహజీబ్ కా బాధ్షా” దిలీప్ కుమార్ అనే చెప్పుకోవాలి. ఇంకో విషయం గమనిస్తే అతని నటనను అనుకరించాలి అనిపించదు, కేవలం ఆస్వాదిస్తాం. మిగతా నటులు పలికే సంభాషణలను, దిలీప్ కుమార్ పలికే సంభాషణలను గమనిస్తే వీరిని అనుకరించాలనే కోరికే కలగదు, ఆ సంభాషణలు బట్టి పట్టి తిరిగి చెప్పాలనే సాహసం కూడా చేయలేం. భాషను భావాన్ని ఆస్వాదించడం మాత్రం నేర్చుకుంటాం. అందుకే బహుశా దిలీప్ కుమార్ గొంతుని మిమిక్రీ ఆర్టిస్టులు కూడా ఎక్కువగా ప్రయత్నించలేదు. నాకు తెలిసినంత వరకు ప్రతి నటుని డైలాగులని మిమిక్రీలో కామెడీ దిశగా పలికి జనానికి చేరువయిన మిమిక్రీ ఆర్టిస్టులు కూడా దిలీప్ కుమార్ డైలాగుల జోలికి వెళ్ళలేదు. అంతటి గౌరవాన్నిసినిమా సంభాషణలకు తీసుకు వచ్చిన ఏకైక నటుడు దిలీప్ సాబ్ మాత్రమే.

ఆద్మి సినిమాలో నౌషాద్ సంగీతంతో ప్రాణం పోసుకున్న మంచి పాటలున్నాయి. వాటిని రాసింది షకీల్ బదాయినీ. “ఆజ్ పురానీ రాహో సే” చాలా హిట్ పాట. “నా ఆద్మీ కా కోయీ భరోసా” ఆన్న పాటలో రఫీ గొంతులో విషాదాన్ని వింటే ఒక దుఃఖం ఆక్రమిస్తుంది. షకీల్ బదాయినీ ఈ పాటను చాలా గొప్పగా రాసారు. ఈ పాటకు ముందు వచ్చే సాకీ ఇలా ఉంటుంది “తేరీ ముహబ్బత్ పే షక్ నహీ, తెరీ వఫావొ కొ మాన్తా హూ మగర్ తుఝ్కో కిస్కీ ఆర్జూ హై, మై యె హకీకత్ భీ జాన్తా హూ” అసలు ఆ పదాలను ఏర్చి కూర్చి రాసేవారు ఆ పాటలను. “నీ ప్రేమ పై నాకు అనుమానం లేదు. నీ ఇష్టాలను నేను అంగీకరిస్తున్నా, కాని నీకు ఎవరి పై కోరిక ఉందో ఆ నిజం కూడా నేను తెలుసుకున్నా”

ఒక ప్రేమికుడికి తన ప్రియురాలు మరొకరితో ప్రేమలో ఉందన్న బాధ, ఆమె మీద ఇష్టం కలగలిపి రాసిన ఈ పదాలు మన జీవితాలలో ఎవరితో ఒకరితో మనం అనుభవించినవే. జాగ్రత్తగా గమనిస్తే ఇది ఇద్దరి ప్రేమికుల సంభాషణే కానక్కర్లేదు. మనం నమ్మిన వ్యక్తులు, మన అనుకున్న వారు మనల్ని ఇతరుతో కలిసి తక్కువగా చూస్తున్నారనే బాధకు చాలా దగ్గరగా వచ్చిన సాకీ ఇది. దాన్ని అదే స్థాయిలో అనుభవిస్తారు కాని ఆ బాధని ఇంత అందంగా, భావయుక్తంగా చెప్పలేరు అందరు. ఈ సాకీని పలుకుతున్నప్పుడు దిలీప్ మొహంలో మోనాలీసా పెయింటింగ్ లో లాగా మనకు కావలసిన భావాన్ని చూసుకోవచ్చు, ఒకోసారి ఒకోలా కనిపిస్తారు. బాధ, క్రోధం, ఆక్రోశం, కోపం, అన్నీ భావాలను ఒకేసారి చూపిస్తారు, అదే వీల్ చైర్‌లో కూర్చుని. “నా హుస్న్ మె అబ్ వొ దిల్ కషీ హై, నా ఇశ్క్ మే అబ్ వో జిన్దగీ హై, జిథర్ నిగాహే ఉఠాకే దెఖో సితమ్ హై దోఖా హై బెరూఖీ హై” ఈ వాక్యాలు రఫీ గొంతులో విని ఆ విషాదంలోని నిజాన్ని ఒక్క క్షణం అన్నా అనుభవించకుండా ఉండటం సాధ్యం కాదు. ఇప్పటి సినీ గీతాలు ఈ స్థాయిలో మనసును తాకవు. ఇంతకన్న గొప్ప పాటలు వస్తే తప్ప ఈ పాటలను మర్చిపోవడం సాధ్యం కాదు, ఎన్ని యుగాలయినా…  “కైసీ హసీన్  ఆజ్ బహారోం  కి రాత్ హై” అన్న పాటను రఫీ, మహేంద్ర కపూర్‌లు కలిసి పాడారు. రఫీ గొంతులో ఆ ఆత్మవిశ్వాసం, మహేంద్ర కపూర్ గొంతులో కాస్త తడబాటు వినిపిస్తూనే ఉంటాయి. సినిమా సన్నివేశానికి సరిపోయింది ఇది. ఇది వీరిద్దరూ కలిసి పాడిన ఏకైక డ్యూయెట్. నిజానికి ఈ పాట తలత్, రఫీలు కలసి పాడేరు. కానీ, మనోజ్ కుమార్ తనకు తలత్ గొంతు నప్పదని పట్టుపట్టటంతో ఆ పాటని మహేంద్ర కపూర్‌తో డబ్ చేయించారు. అలా, ఈ ఇద్దరు కలసి పాడిన అరుదయిన పాటగా ఈ పాట మిగిలిపోయింది. కానీ, ఈ అనుభవంతో తలత్ సినిమా పాటలకు దూరమయ్యాడు. అతని కెరీర్ సమాప్తమయింది.  ఆద్మి సినిమాలో కానీ, గుడిగంటలు సినిమాలో కానీ కీలకమయిన పాట ఆజ్ పురానీ రాహోన్సే, జన్మ మెత్తితిరా అనుభవించితిరా…పాట. తెలుగులో ఈ పాట కాస్త నెగటివ్ షేడ్స్ వున్న పాట. పశ్చాత్తాపం అధికంగా కనిపిస్తుంది. కానీ, హిందీలో షకీల్ ఈ పాటను పూర్తిగా పాజిటివ్ పాటగా మలచాడు. కొత్త జీవితం లభిస్తోంది. జీవితం మారింది. మనస్సుకు గొప్ప జ్ఞానం లభించింది. నాలోనే నాకు కొత్త మనిషి కనిపించాడు. దైవభావనకు దగ్గరగా చేరుకునాను..అంటూ అత్యద్భుతమయిన గీతంగా సృజించాడు షకీల్ ఈ పాటను.

ప్రేమ అబ్సెషన్‌గా మారకుండా ఉండడానికి చాలా విజ్ఞత కావాలి. ఆ విజ్ఞత కోసం ఒక వ్యక్తి చేసిన జీవన ప్రయాణం ‘ఆద్మి’. మనకు దక్కనిది మరొకరికి దక్కకూడదు అన్న ఆలోచన ప్రతి మనిషికీ సహజంగా వచ్చేదే. కాని దీన్ని అధిగమించే మంచితనం, వ్యక్తిత్వం అలవర్చుకోవడం మనిషి జీవన ప్రయాణంలో చాలా అవసరం. ఆ అవసరాన్ని గుర్తు చేస్తూ దాని కోసం మనిషి పడే తపనను, కష్టాన్ని చూపుతూ అది మనిషిని ఎంత ఉన్నత స్థితికి చేరుస్తుందో ఈ సినిమాలో చూస్తాం. ఆధ్యాత్మికత పేరున కూడ మనిషి ఈ స్థితినే అన్వేషిస్తాడు. ‘ఆద్మి’ లో రాజేశ్ పాత్ర చేసినది అదే. తనలోని ఆ మరో మనిషిని గుర్తుంచి అతన్ని తన నుండి వేరు చేసుకోగలగడం అంత సులువైన పని కాదు. కాని అది చేసుకోగలవాడు మనుషులలో కల్లా ఉత్తముడు. శిల్పి ఉలిలో రాతిని చెక్కి అందులోని అనవసర భాగాలను నిర్ధాక్షిణ్యంగా పిండి చేసి శిల్పాన్ని చెక్కినట్లే మనిషి తనను తాను చెక్కుకుంటూ తనలోని చెడుని దూరం చేసుకుంటూ తనని తాని శిల్పంగా మలచుకోవాలి. దానికి కనీస ప్రయత్నం చేయాలి. అలా తయారయిన మనిషే సత్పురుషుడు. ఈ సినిమా కథ చెప్పేది అదే. మనిషి మానవుడిగా మారేటప్పుడు మనసు ఆడే ఆటే ‘ఆద్మి’ సినిమా కథ. ఈ సినిమా అప్పట్లో ఆడియన్స్‌ని అలరించలేదని, సినిమా హిట్ కాదని తెలిసినపుడు మన ప్రేక్షకుల స్థాయికి జాలిపడాలి అనిపిస్తుంది. ‘ఆద్మి’ సినిమాలో నటనకు దిలీప్ కుమార్ ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడి కేటగిరికి ఎంపికయ్యారు. కాని ఆ సంవత్సరం “బ్రహ్మచారి” సినిమాకు ఆ అవార్డు షమ్మీ కపూర్‌కి లభించింది. అవార్డు వచ్చినా, రాకపోయినా, బాక్సాఫీసు వసూళ్ళు సాధించినా సాధించకపోయినా “ఆద్మి” సినిమాలో దిలీప్ కుమార్ నటన చాలా మంది నటులకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. ఇది వారి కెరియర్‌లో నిస్సందేహంగా వచ్చిన మరో ఉత్తమ ఫెర్మామెన్స్.

Exit mobile version