Site icon Sanchika

ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 52 – బైరాగ్

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం దిలీప్ కుమార్ నటించిన ‘బైరాగ్’ సినిమాని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

హీరోగా దిలీప్ కుమార్ ఆఖరి సినిమా బైరాగ్

[dropcap]బై[/dropcap]రాగ్ 1976లో వచ్చిన సినిమా. ఈ సినిమాలో దిలీప్ కుమార్ మూడు పాత్రలను పోషించారు. ఈ సినిమాకు వారికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డ్ నామినేషన్ వచ్చింది. బైరాగ్ సినిమా హిట్ కాలేదు. దీని తరువాత వారు ఐదు సంవత్సరాల బ్రేక్ తీసుకుని తరువాత కారెక్టర్ యాక్టర్‌గా రెండో ఇన్నింగ్స్ మొదలెట్టారు. సినిమా ఫెయిల్ అయినా దిలీప్ కుమార్ నటనకు ప్రశంసలు లభించాయి. బైరాగ్ అలా దిలీప్ కుమార్ హీరోగా చేసిన ఆఖరి సినిమాగా గుర్తుండిపోతుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది అసిత్ సేన్. బెంగాలీలో దీప్ జ్వలే జై, హిందీలో మమతా, అనోఖీ రాత్, సఫర్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అసిత్ సేన్ హిందీ సినిమా దర్శకులలో గౌరవ స్థానం సంపాదించుకున్నారు. దిలీప్ కుమార్‌తో ఇది వీరు చేసిన ఏకైక సినిమా. బైరాగ్ సినిమాకు కమల్ బోస్ సినిమాటోగ్రఫర్‌గా పని చేసారు. బిమల్  రాయ్ ఆంతరంగిక బృందంలో వీరు ముఖ్యలు. బిమల్ రాయ్ సినిమాలలలో ఎక్కువ భాగం వీరి పనితనం కనిపిస్తుంది. హృషీకేశ్ ముఖర్జీ దిలీప్ కుమార్‌తో తీసిన “ముసాఫిర్” సినిమాకు సినిమాటోగ్రఫీ వీరిదే. బిమల్ రాయ్ మరణించిన తరువాత ఆయన అసిత్ సేన్‌తో కలిసి పని చేయడం మొదలెట్టారు. ఆ తరువాత ఫిరోజ్ ఖాన్‌తో కుర్బానీ, జాన్ బాజ్, దయావాన్ లాంటి సినిమాలకు కూడా పని చేసారు. హిందీ సినీ జగత్తులో వీరి కెమెరా నైపుణ్యానికి మంచి పేరు ఉంది.

బైరాగ్ సినిమాకు కథ అందించింది అబ్రర్ అల్వీ. గురుదత్ ఆంతరంగిక మిత్రుడిగా అబ్రర్ అల్వీని ఈ రోజుకీ గుర్తు చేసుకుంటారు. గురుదత్ సినిమాలకి కథ మాటలు అబ్రర్ అల్వీ కూర్చేవారు. “సాహబ్ బీవి ఔర్ గులామ్” సినిమాకు దర్శకత్వ బాధ్యతలను గురుదత్ అబ్రర్ అల్వీకే అప్పగించారు. అంతగా సినీ నిర్మాణంలోని అన్ని శాఖలలో నైపుణ్యం ఉన్న వ్యక్తి ఆయన. అయితే ఇంత మంది ప్రముఖుల పేర్లు ఇక్కడ చెప్పవలసిన అవసరం రావడానికి కారణం, ఒక తరంలో సినీ ప్రపంచంలో వెలుగు వెలిగిన తారలందరూ, కెమెరా ముందు కాని వెనుక కాని దిలీప్ కుమార్ వంటి నటులతో పని చేసిన సాంకేతిక వర్గం, దర్శకులు, పాటల రచయితలు అందరూ కూడా ఒకొక్కరుగా తెరమరుగవుతున్న రోజులవి. పెద్ద హీరోలందరు కూడా తమ కన్నా చిన్న హీరోయిన్లతో నటించే ప్రయత్నం చేసారు. మారుతున్న రోజులను బట్టి మారే ప్రయత్నం చేసారు కాని ఒక్క దేవానంద్ తప్ప ఎవరూ హీరోగా నిలబడలేకపోయారు. బైరాగ్ సినిమాలో దిలీప్ కుమార్ హెలెన్, లీనా చందావర్కర్  లతో నటిస్తున్నప్పుడు కొంత అసౌకర్యానికి గురవుతున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇంతకు ముందు సినిమాలో ప్రేమ సీన్లలో వీరిలో కనిపించిన ఈజ్ ఇందులో లేదు. ఆయన సినిమాలకు సంగీతం ఇచ్చే నౌషాద్, పాటలు రాసే మజ్రూహ్, షకీల్ లాంటి వారు క్రమంగా వెనుకబడిపోయారు. కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ లాంటి కొత్త వారు వెలుగులోకి వచ్చారు. బైరాగ్ సినిమాకు వీరే సంగీతం ఇచ్చారు. కాని అందులో దిలీప్ కుమార్ మార్క్ కనపడదు. బైరాగ్ లో ఛోటీసీ ఉమర్ మే లగ్ గయ రోగ్ పాట బాగా హిట్ అయింది. అయితే పాటకు నటించిన సైరా కానీ, దిలీప్ కానీ, ఛోటీ ఉమర్ వాళ్ళలా కనిపించకపోవటం పాటను దెబ్బ తీసింది.  బైరాగ్ సినిమాలో దిలీప్ కుమార్ దారి తప్పి తెరపైకి వచ్చినవాడిలా, ఏం చేస్తున్నాడో ఏమీ తెలియని అయోమయంతో వున్నవాడిలా, తనదికాని స్థలానికి వచ్చి ఏక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియనివాడిలా అనిపిస్తారు. తండ్రి పాత్రలో గాంభీర్యంకానీ, అల్లరికొడుకు పాత్రలో విలనీకానీ, పల్లెవాడిలో అమాయకత్వం కానీ.. ఏదీ పండించలేకపోయారు. ఈ సినిమాలోనే మరో ఫేమస్ పాటలో అన్నట్టు, పెీతే పీతే కభి కభి యూన్ జాం బదల్ జాతేహై….అలా, ఒక గొప్ప నటుడు అపహాస్యం పాలవటానికి బైరాగ్ నిదర్శనం.. బైరాగ్ సినిమా చూస్తూంటే, ఒక నటుడికి ఎప్పుడు నటన నుంచి తప్పుకోవాలో, ఏ వయసులో ఏ పాత్ర వేయాలో తెలిసివుండటం తప్పని సరి అనిపిస్తుంది. రాజ్ కపూర్ దీవానా, సప్నోంకా సౌదాగర్ వంటి సినిమాల్లో సైరా బాను, హేమా మాలినిల సరసన నటించి అపహాస్యం పాలయ్యాడు. దిలీప్ కు బైరాగ్ నిజానిజాలు చెప్పిన సినిమా.

బైరాగ్ సినిమాకు నిర్మాతలు ముషీర్-రియాజ్‌లు. ముషీర్ ఆలం, రాజ్‌కుమార్ బర్జాత్యలు కలిసి ముషీర్ రియాజ్ అనే పేరుతో డెబ్భయవ దశకంలో మంచి సినిమాలు నిర్మించారు. వీరే దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్‌తో కలిసి చేసిన శక్తి సినిమాకు కూడా తరువాత నిర్మాతలుగా వ్యవహరించారు. రాజ్‌కుమార్ బర్జాత్య  తన కుటుంబంతో రాజశ్రీ ప్రొడక్షన్స్ అనే మంచి సంస్థ ద్వారా ఎన్నో మంచి సినిమాలు తరువాత బాలీవుడ్‌కి అందించారు.

బైరాగ్ సినిమా కథకు వస్తే, కైలాష్ అనే ఒక ధనవంతునికి కంటి జబ్బు ఉంటుంది. చాలా వరకు దాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. అతని భార్య పుష్ప ఎన్ని సార్లు గుర్తు చేసినా మందుల పట్ల నిర్లక్ష్యంగానే ఉంటాడు. ఒక సారి ఈ దంపతులు ఇద్దరు వెళుతున్న కారు ఆక్సిడెంట్ గురి అవుతుంది. తరువాత కైలాష్ కళ్ళు శాశ్వతంగా పోగొట్టుకుంటాడు. అప్పుడే అతని భార్య గర్భవతి అని తెలుస్తుంది. వివాహమయిన చాలా రోజుల వరకు ఆమె తల్లి కాలేకపోతుంది. అమెకు కాన్పులో కవల పిల్లలు పుడతారు. అందులో ఒక బిడ్డ పుట్టు గుడ్డి. తాను సగం జీవితం చూపుతో గడిపి, ఇప్పుడు కళ్ళు పోగొట్టుకుంటే ఎంత బాధ పడుతున్నాడో అది ఆ బిడ్డ పుట్టిన క్షణం నుంచి పడాలని, అది చూసి తామిద్దరు తల్లి తండ్రులుగా జీవితాంతం బాధపడాలని కైలాష్ ఆ బిడ్డను చంపేయమని తన డాక్టర్ మిత్రుడైన మిశ్రాకి చెబుతాడు. అతని ఆ పని చేయనంటే తానే ఆ బిడ్డను చంపేస్తానంటాడు. తప్పక డాక్టర్ తన భార్య చేతికి ఆ బిడ్డనిచ్చి ఒక గుడి మెట్లపై వదిలేస్తాడు. పుష్పకు పుట్టింది ఒకే బిడ్డ అని చెబుతారు.

కొన్ని సంవత్సరాల తరువాత ఆ ఇద్దరు పిల్లలు పెద్దవారవుతారు. గుడి పూజారి పెంచిన భోలేనాధ్ కళ్ళు లేకపోయినా అ ఊరి పెద్ద సహాయంతో, పూజారి సంరక్షణలో భాద్యత గల మంచి వాడిగా పెరుగుతాడు. కైలాష్ దగ్గర ఉన్న సంజయ్ మాత్రం పెద్దల ఎడల భయం లేని వాడిగా తయారవుతాడు. కైలాష్‌కు ప్రతిసారి తాను చేసిన పాపం గుర్తుకొస్తూ ఉంటుంది. భరించలేక తాను చేసిన పని పుష్పకు చెబుతాడు. తన మరో బిడ్డను భర్తే హత్య చేయించాడనేది భరించలేక మనోవ్యధతో ఆమె మంచం పట్టి మరణిస్తుంది. తల్లి లేక, తండ్రి గుడ్డివాడయి, సంజయ్ సరైన సంరక్షణ లేక జులాయిగా మారతాడు. సోనియాతో నిశ్చత్తార్థం జరిగిన తరువాత కూడా లూసి అనే ఒక డాన్సర్‌తో సంబంధం పెట్టుకుంటాడు.

భోలేనాధ్ యజమాని కూతురు తార. తార భోలేనాధ్‌ని ప్రేమిస్తుంది. అయితే ఆమె పెళ్ళి ధనవంతుడైన కున్వల్‌తో కుటుంబం నిర్ణయిస్తుంది. ఆమె తన ప్రేమ సంగతి భోలేనాధ్‌కు చెబుతుంది. కాని అతను అది తప్పని ఆమెను తల్లి తండ్రులు చూసిన చోట వివాహం చేసుకొమ్మని చెబుతాడు. మూడు లక్షలు కట్నం అడిగిన కున్వల్‌కు తాను జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బు ఇచ్చి తారను స్వీకరించమని కోరతాడు. కున్వల్ సంజయ్ స్నేహితుడు. సంజయ్ పోలికలతో ఉన్న భోలేనాధ్‌ని చూసి ముందు అనుమాన పడ్డా, అతను గుడ్డివాడని తెలుసుకుని ఆ డబ్బు తస్కరించి వెళ్ళిపోతాడు. ఆ డబ్బుకు కాపలా కాసే నాగుపాముని భోలేనాధ్ చిన్నప్పటి నుండి పెంచుతాడు. కాని ఆ డబ్బు కున్వల్‌కి ఇస్తున్నప్పుడు ఆ పాము భోలేనాధ్‌ను కాటేస్తుంది. ఆ విషం అతని శరీరంలో ప్రవేశించిన వెంటనే అతనికి చూపు వస్తుంది. తన డబ్బుతో పారిపోయిన కున్వల్‌ని పట్నం వెళ్ళి వెతకాలని నిర్ణయించుకుని బయలుదేరుతాడు భోలేనాధ్.

ఇక పట్నంలో లూసి హత్య జరుగుతుంది. సంజయ్ స్థానంలో భోలేనాద్ వెళ్లవలసి వస్తుంది. తరువాత సంజయ్‌ని కాపాడడానికి కున్వల్ అతన్ని భోలేనాధ్ స్థానంలో ఉంచుతాడు, ఈ సారి కూడా ఆ నాగరాజే భోలేనాధ్ స్థానంలో వచ్చింది అతను కాదని గుర్తు పడుతుంది. భోలేనాధ్‌తో వివాహానికి కుటుంబం అంగీకరించినా తార నిశ్చిత్తార్థానికి ఒప్పుకోదు. వచ్చింధి భోలేనాధ్ కాదని ఆమెకు అర్థం అవుతుంది. కైలాష్‌కి అతని ఇద్దరు కొడుకులు చేరువవడం, ఇద్దరు కలిసి లూసి హంతకుడిని పట్టుకుని చట్టానికి పట్టించి తమను ప్రేమించిన యువతులను పెళ్ళాడడం సినిమా ముగింపు.

బైరాగ్ కథ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోదు. మూడు పాత్రలు పోషించినా దిలీప్ కుమార్ నటన అంతగా రంజింపజేయదు. తనకు హీరోగా కెరీర్ అంతమయిందన్న సంగతి దిలీప్ కుమార్‌కు ఈ సినిమా తెలియజేసింది. ఆనంద్ బక్షీ రాసిన పాటలను మహేంద్ర కపూర్, లత, రఫీలు పాడారు. అప్పట్లో రేడియోలో బాగా వచ్చిన పాటలే కాని దిలీప్ కుమార్ సినిమా స్థాయిలో ఉండవు. ఈ సినిమాలో కైలాష్ భార్యగా పుష్పగా కనిపించిన నటి రూమా గుహా థాకుర్తా. ఈమె కిషోర్ కుమార్ మొదటి భార్య. దిలీప్ కుమార్ నటించిన మొదటి సినిమా జ్వార్ భాటాతో బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసారీవిడ. తరువాత కిషోర్ కుమార్‌తో వివాహం, 1958లో విడాకులు జరిగాయి. తరువాత కలకత్తా వెళ్ళిపోయి బెంగాలీ సినిమాలపై దృష్టి పెట్టారామె. సత్యజిత్ రే భార్య బిజొయా రే కి ఈవిడ అక్క. బ్రహ్మసమాజికుల కుటుంబంలో పుట్టిన ఆమె పెద్ద గురువుల వద్ధ నాట్యం, గానం నేర్చుకున్నారు. తరువాత 1960లో అరుప్ గుహా థకుర్తాని వివాహం చేసుకున్నారీమె. కిషోర్ కుమార్‌తో విడాకుల అనంతరం ఈవిడ హిందీలో నటించలేదు. 1976లో నటించిన బైరాగ్ తరువాత మరే హిందీ సినిమాలోనూ కనిపించరీమె. బెంగాలీ సినిమాలలో మాత్రం మంచి దర్శకులతో పని చేసారు. బైరాగ్ సినిమాలో మరో హీరోయిన్‌గా నటించిన లీనా చందావర్కర్  వివాహం అయిన కొన్ని రోజులకే భర్తను పోగొట్టుకున్న తరువాత తన కన్నా 20 సంవత్సరాలు పెద్దవాడైన కిషోర్ కుమార్‌నే పునర్వివాహం చేసుకున్నారు. బైరాగ్‌లో కిషోర్ కుమార్ మొదటి భార్య రూమా, నాలుగవ భార్య లీనా ఇద్దరూ దిలీప్ కుమార్‌తో నటించారు. రూమా తండ్రి పాత్రకు జోడీగా చేస్తే, లీనా కొడుకు సంజయ్ పాత్రకు జోడీగా చేసారు. దిలీప్ కుమార్‌తో నటించిన నటీమణుల మధ్య ఈ విధంగా వీరిద్దరూ కూడా చేరడం జరిగింది.

బైరాగ్‌లో సైరా బాను పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమా అప్పటికే వారి వివాహం జరిగి పది సంవత్సరాలయింది. ఇద్దరి కెరియర్ లు కూడా హీరో, హీరోయిన్లుగా చివరి దశకు చేరుకున్నాయి. సైరా బాను తరువాత ఒక అరడజను సినిమాలలో కనిపించినా అవి పెద్ద ప్రాముఖ్యత ఉన్న పాత్రలు కావు. దిలీప్ కుమార్ ఒక ఐదు సంవత్సరాల విరామం తరువాత తిరిగి క్రాంతి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి కొన్ని మంచి సినిమాలలో నటించారు. దిలీప్ కుమార్‌కు ఫిలింఫేర్ నామినేషన్ లభించినా ఆ సంవత్సరం ఆ అవార్డు సంజీవ్ కుమార్‌కి “అర్జున్ పండిత్” సినిమాకు లభించింది. ఈ సినిమాలో డాక్టర్ మిశ్రా పాత్రలో నటించింది దిలీప్ కుమార్ తమ్ముడు నాసిర్ ఖాన్. ఈ సినిమా నిర్మాణం చాలా రోజులు పట్టిందని, దీన్ని ఎక్కువగా దిలీప్ కుమార్ గారే డైరెక్ట్ చేసారని కూడా అంటారు. ఏమైనా ఇది దిలీప్ కుమార్ ఇతర సినిమాల స్థాయిలో మాత్రం ఉండదు.

Exit mobile version