Site icon Sanchika

ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 53 – సాధు ఔర్ షైతాన్

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం దిలీప్ కుమార్ నటించిన ‘సాధు ఔర్ షైతాన్’ సినిమాని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్ స్క్రీన్ పై మూడు నిముషాలు కనిపించిన మరో సినిమా ‘సాధు ఔర్ షైతాన్’

[dropcap]హై[/dropcap]దరాబాదీ యాసను హిందీ సినిమాకు ప్రత్యక్షంగా పరిచయం చేసింది మెహమూద్. కామెడీ నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఆయన. హైదరాబాదీ ఉర్దూని తన సినిమాలలో వాడుకుని దక్కని భాషను ఉత్తరాదికి పరిచయం చేసారు. బాల నటుడిగా ముందు కెరీర్ మొదలెట్టి, తరువాత ప్యాసా, దో భీఘా జమీన్ లాంటి సినిమాలలో చిన్న పాత్రలు చేస్తూ చివరకు కామెడీ హీరోగా ఎదిగి తన పేరుతో గ్లామర్ సంపాదించుకున్న మెహమూద్ 1968లో చేసిన సినిమా ‘సాధు ఔర్ షైతాన్’. తమిళ సినిమా “సాధు మిరాందల్”కు ఇది హిందీ రీమేక్. తమిళంలో ఈ సినిమాను నిర్మించి స్క్రీన్ ప్లే చేసిన భీంసింగ్ హిందీ రీమేక్‌కి దర్శకత్వం వహించారు. 1958లో అప్పటి మద్రాస్‌లో సూర్యనారాయణ అనే ఒక బ్యాంక్ ఉద్యోగస్థుడిని అతని స్నేహితుడు నారాయణ స్వామి మరో ఇద్దరితో కలిసి హత్య చేసాడు. అప్పుడు సూర్యనారాయణ వద్ద బ్యాంకు డబ్బు ఉండింది. ఈ హత్య నారాయణస్వామి కారులో జరిగింది. దీన్ని ఆ రోజుల్లో సూర్యనారాయణ మర్డర్ కేస్ అని పత్రికలు చాలా కవర్ చేసాయి. నిజజీవితంలో జరిగిన ఈ ఇతివృత్తాన్ని తీసుకుని సినిమాకు స్క్రీన్ ప్లే రాసుకున్నారు భీం సింగ్. అలా 1966లో వచ్చిన తమిళ సినిమలో నగేష్, టీ.ఆర్. రామచంద్రన్‌లు ప్రముఖ పాత్రలు పోషించారు. తమిళంలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమాను తరువాత హిందీ వాతావరణానికి తగ్గట్టుగా కూర్చి హిందీలో ‘సాధు ఔర్ షైతాన్’గా తీసారు. తమిళంలో నగేష్ చేసిన పాత్రను హిందీలో మెహమూద్ చెసారు.

ఓమ్ ప్రకాష్ నీతికి కట్టుబడే వ్యక్తి అంటే సాధుగా, ప్రాణ్ దుర్మార్గుడు అంటే షైతాన్‌గా నటించిన ఈ సినిమా మంచి చెడుల మధ్య జరిగే యుద్దాన్ని చూపిస్తుంది. బజరంగ్ నిజాయితీ పరుడైన టాక్సీ డ్రైవర్. చదువుకునే అవకాశం జీవితంలో రాకపోయినా కష్టపడి స్వయంకృషితో ఇంగ్లీషు భాష పై పట్టు సాధించి సొంతంగా విద్యని ఆర్జిస్తాడు. డిగ్రీలు లేని అతను టాక్సీ నడుపుతుంటాడు. తల్లి తండ్రి లేని బజరంగ్‌ని పెంచిన అత్త సాధూరాం అనే బ్యాంక్ మానేజర్ ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. సాధూరాం భార్య మరణించిన తరువాత తన ఇద్దరు పిల్లల్ని జాగ్రత్తగా అన్నీ తానే అయి పెంచుతుంటాడు. సాధూరాం స్నేహితుడిని అంటూ షేర్‌ఖాన్ అనే వ్యక్తి సాధూరాం వద్దకు వస్తాడు. సాధురాం అతన్ని తన చిన్ననాటి స్నేహితుడనే అనుకుని అతన్ని నమ్మి, కష్టాలలో ఉన్నడంటే డబ్బు పరంగా చాలా సహాయం చేస్తాడు. తన పేరు మీద వేరే వారి వద్ద అప్పు చేసి అతనికి ఇస్తాడు. ఈ మోసంతో షేర్‌ఖాన్ సంతృప్తి పడడు. అతని దృష్టి అంతా సాధురాం పని చేసే బ్యాంకు దోచుకోవడం మీద ఉంటుంది. సాధురాంకి బ్యాంక్‌లో నిజాయితీపరుడనే పేరు ఉంటుంది. అతని వద్ద ఉన్న బ్యాంక్ కాష్ బాక్స్ తాళాన్ని తస్కరించి, దాని మారు తాళం చెవి తయారు చేసుకుని బ్యాంకు డబ్బు దొంగలిస్తాడు షేర్‌ఖాన్. ఆ దొంగతనం సాధూరాం మీదకు వచ్చేలా కుట్ర పన్నుతాడు. ఆ డబ్బు రక్షించుకునే ప్రయత్నంలో సాధూరాం అతన్ని హత్య చేసి బజరంగ్ టాక్సీలో అతని శవాన్ని వదిలేస్తాడు.

బజరంగ్ సాధూరాం పిల్లలకు టీచర్‌గా పని చేసే విద్యను ప్రేమిస్తాడు. విద్య అన్న దీనానాథ్ ఒక కళాకారుడు. బజరంగ్ టాక్సీలో వెనుక సీటు క్రింద షేర్‌ఖాన్ శవాన్ని పెట్టుకుని పాసెంజర్లను ఎక్కించుకుని వారు పడుతున్న అవస్థ అర్థం కాక తనదైన ప్రపంచంలో ఉంటూ టాక్సీ నడుపుకుంటూ పోతాడు. సినిమాలో ఒక అరగంట పాటు నడిచే ఈ సీన్ సినిమాలో కామెడీని బాగా పండిస్తుంది. చివరకు మంచి గెలిచి, దొంగ అన్న నింద పడిన సాధురాం ఆ డబ్బుని తీసుకుని బ్యాంకుకు అప్పగించి తన నిజాయితీని నిరూపించుకుంటాడు. కోర్టు అతను తన ప్రాణ రక్షణకు, ప్రజల డబ్బు రక్షించుకోవడానికి చేసిన ఆ హత్యకు అతన్ని శిక్షించకూడదని తలచి అతన్ని నిర్దోషిగా ఎంచి విడుదల చేస్తుంది. బజరంగ్ విద్యల వివాహంతో సినిమా ముగుస్తుంది.

దిలీప్ కుమార్ సినిమా పరిచయాల క్రమంలో ఈ సినిమా ప్రస్తావన రావడానికి కారణం ఈ సినిమాలో దిలీప్ కుమార్ ఒక మూడు నిముషాలు గెస్ట్ పాత్రలో కనిపిస్తారు. ముంతాజ్‌తో రామ్ ఔర్ శ్యామ్‌లో ఆయన చేసిన రామ్ పాత్రకు కొనసాగింపుగా చెరుకు గడ నములుకుంటూ బజరంగ్ టాక్సీకి అడ్డు వస్తారు దిలీప్ కుమార్ ముంతాజ్‌లు. ఈ పాత్రలకు డైలాగులు ఉండవు. పల్లె నుండి పట్నం వచ్చిన అమాయక జంటగా కనిపిస్తారు ఆ ఇద్దరు కూడా. సాధు ఔర్ షైతాన్‌లో దిలీప్ కుమార్ ముంతాజ్‌లతో పాటు అశోక్ కుమార్ ఒక మేకప్ ఆర్టిస్టుగా, సునీల్ దత్ ఒక చర్చి ఫాదర్‌గా బజరంగ్ టాక్సీ ఎక్కి అందులో ఉన్న శవాన్ని చూసి జడుసుకున్న పాసెంజర్లుగా కనిపిస్తారు. మరో చోట హైదరాబాదీ యాసలో సాగే ఒక నాటకంలో దేవలోకం వెళ్ళిన మెహమూద్‌కి కనిపించిన నారదుడిగా జీవన్, పార్వతి పాత్రలో నిరూపారాయ్ నటించారు. ఇక విద్యగా ఈ సినిమాలో దక్షిణ భారతపు హీరోయిన్ భారతి కనిపిస్తారు. కన్నడ నటి భారతి తెలుగు సినిమాలలో కూడా నటించారు. గోవుల గోపన్న సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితురాలే. మెహర్బాన్ అనే హిందీ సినిమాతో ఈమెను హిందీ రంగానికి పరిచయం చేసారు భీమ్ సింగ్. సాధు ఔర్ షైతాన్ వీరి రెండవ హిందీ సినిమా. తరువాత కూడా కొన్ని ప్రముఖ హిందీ సినిమాలలో నటించారు ఆవిడ. భారతి అన్నగారి పాత్రలో కిషోర్ కుమార్ నటించారు. కామెడీ ట్రాక్ లోనే ఈ పాత్ర ఉంటుంది. 1968 లోనే “పడొసన్” సినిమా వచ్చింది. ఆ సినిమాలో మెహమూద్, కిషోర్ కుమార్లు పలికించిన కామెడీ జనాలకు చాలా నచ్చింది. దానితో మళ్ళీ కామెడీ ట్రాక్ పట్టారు కిషోర్ కుమార్.

పెద్ద హీరోగా చేస్తూ చిన్న సినిమాని ఆదరించడానికి ఇలా అతి చిన్న పాత్రలో నటించడానికి దిలీప్ కుమార్ ఎప్పుడు తక్కువగా భావించలేదు. స్టార్ ఎంట్రీగా కాకుండా ఒక సామాన్యుడిగా మూడు నిముషాలు ఆయన కనిపించి వెళ్లిపోవడం ఈ సినిమాలో చూస్తాం. ఆ సీన్ కోసం వారే రావలసిన అవసరం లేదు కూడా. ప్రేక్షకుల మూడ్, ఆసక్తి మెయిన్‌టేన్ చేయడానికి సినిమాకు వారి రాక ఉపయోగపడుతుందనుకుంటే కాదనకుండా సినిమాను, అందులోని వర్ధమాన నటులను ఉత్సాహపరచడానికి ఆయన అలాంటి పాత్రలు సంతోషంగా చేసారు.

దిలీప్ కుమార్ స్క్రీన్‌పై కనిపించిన సినిమాలన్నీ పరిచయం చేసే పనిలో భాగంగా ఈ సినిమాను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అలాగే అరవైలలో మారుతున్న ప్రేక్షకుల ట్రెండ్‌కు సూచనగా కూడా ఈ సినిమాను చూడవచ్చు. దిలీప్ కుమార్ ఆద్మి, గోపి సినిమాలకు భీంసింగే దర్శకత్వం వహించారు. తమిళ సినిమాలను హిందీలో ఎక్కువగా రీమేక్ చేసిన దర్శకులు ఆయన. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలుంటాయి. రఫీ, ఆశా, మన్నాడే, ఉషా మంగేష్కర్‌లు ఈ పాటలు పాడారు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌లు ఈ పాటలకు సంగీతం సమకూర్చారు.

Exit mobile version