ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 55 – సౌదాగర్

0
2

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం దిలీప్ కుమార్ నటించిన ‘సౌదాగర్’ సినిమాని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

సుభాష్ ఘాయ్ మరో బ్లాక్‌బస్టర్ ‘సౌదాగర్’

[dropcap]1[/dropcap]991లో సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో వచ్చిన మరో మల్టీ స్టారర్ సినిమా ‘సౌదాగర్’. సుభాష్ ఘాయ్ బాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాల ద్వారా విజయం సాధించిన దర్శకుడు. ఈయన స్పెషాలిటీ మల్టీ స్టారర్ సినిమాలు. బాలీవుడ్ ఫార్ములాని పట్టుకుని, తన సినిమా దగ్గరకు ప్రేక్షకులను రప్పించుకోవటంలో దిట్ట. ఇప్పుడు ఆ సినిమాలన్నీ వరసగా చూస్తే అతని మాస్ మసాలా కాంబినేషన్‌లు అర్థం అవుతాయి. సౌదాగర్ అప్పట్లో సూపర్ హిట్ సినిమా. “పైగాం” సినిమా తరువాత కలిసి ఏ సినిమాలో నటించని దిలీప్ కుమార్, రాజ్ కుమార్లను ఈ సినిమా కోసం ఒప్పించి నటింపజేయడంతో ఈ సినిమాకు అప్పట్లో ప్రేక్షకులలో ఆకర్షణ చాలా పెరిగింది. దాంతో పాటు సాజన్, లమ్హే, దిల్ హై కి మాన్తా నహీ లాంటి రొమాంటిక్ సినిమాల హవా నడుస్తున్న రోజులవి. మెలొడి ప్రధానమైన పాటలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్న సమయం అది. వీటన్నిటిని అద్యయనం చేసి దిలీప్ కుమార్ రాజ్ కుమార్లతో క్లాస్ నాడి పట్టుకుని మనీషా కొయిరాలా, వివేక్ ముష్రన్ అనే ఇద్దరు కొత్త ఆర్టిస్టులను రొమాంటిక్ జతగా పరిచయం చేస్తూ మంచి సంగీతంతో కూడిన పాటలను ఈ సినిమా కోసం సృష్టించి అన్ని రకాల ప్రేక్షకులు మెచ్చే సినిమా తీసారు సుభాష్ ఘాయ్. అప్పట్లోని యాక్షన్ సినిమాలన్నీ కూడా పగ ప్రతీకారం కథావస్తువుతో ఉండేవి. లేదా టీనేజ్ రొమాంటిక్ కథలు ప్రజలు మెచ్చేవారు. ఈ రెండిటినీ సమపాళ్లలో కలిపి చూపించిన సినిమా కాబట్టే 3 గంటల 25 నిముషాల పాటు సాగిన ఈ సినిమాను కుడా ప్రేక్షకులు అంతే ఉత్సాహంతో చూసారు.

దిలీప్ కుమార్ అవధి, భోజ్పురి యాసతో చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్లే. అది గమనించి ఈ సినిమాలో ఆయన ఒక రైతు బిడ్డ పాత్రను ఇచ్చి, ఆ పల్లెటూరి యాసతో ఆయన చేత నటింపజేసారు ఘాయ్. మరో పక్క రాజ్ కుమార్‌ను ఆర్థికంగా పై స్థాయి వ్యక్తిగా చూపిస్తూ అతనితో రాచరికపు హిందీ పలికిస్తారు సుభాష్ ఘాయ్. ప్రిన్స్ అని అప్పట్లో ఫాన్స్ ముద్దుగా పిలచుకునే రాజ్ కుమార్ రాచరికపు యువకుడిగా, పట్నపు వాసనతో పెరిగిన వ్యక్తిగా చేసిన పాత్రలన్ని హిట్ అయ్యాయి. ఇది గమనించి అదే స్టైల్‌ను ఈ పాత్ర కోసం పెట్టుకున్నారు ఘాయ్. దాని ప్రకారంగా కథ అల్లుకున్నారు. ప్రేక్షకులు ఏది మెచ్చుతారో వాటినే ఆధారం చేసుకుని, కథ రాసుకుని అది సినిమాగా తీసి చాలా హిట్లు సంపాదించుకున్నారు సుభాష్ ఘాయ్. మార్కెట్ బట్టి సినిమాని నిర్మించిన దర్శక నిర్మాత అతను. ఇక మల్టీ స్టారర్ సినిమాలలో అంత మంది నటులను పెట్టుకోవడం వలన అందరికి విడి విడిగా ఉండే ఫాన్స్ ఈ సినిమాకు వారికి కావల్సిన నటుడి కోసం కనెక్ట్ అవుతారు. అలా ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించుకున్న నిర్మాత సుభాష్ ఘాయ్. ఈ ఫార్ములా ఆ రోజులలో బాగా వర్కవుట్ అయింది.

ఈ సినిమాకు ప్రాణం ఫోటోగ్రఫీ. అశోక్ మెహతా సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా బలాన్నిచ్చింది. ముందు పారెరల్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన అశోక్ మెహతా సుభాష్ ఘాయ్ “రామ్ లఖన్” సినిమాతో ఆతని మిత్ర బృందంలో చేరారు. అందమైన లోకేషన్ల మధ్య చిత్రించిన ఈ సినిమాలో మెహతా కెమెరా పనితనం కనిపిస్తుంది. ముఖ్యంగా మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన మనీషా కొయిరాలా, వివేక్ ముష్రన్ లకు ఇది చాలా సహాయపడింది. చాలా ఎమోషన్స్ వారు పలికించలేకపోయిన ప్రతి సారి కెమెరాతో మాట్లాడుతూ కథ సాఫీగా నడిపించారు అశోక్ మెహతా. జాగ్రత్తగా పరిశిలిస్తే వీరి రొమాంటిక్ సన్నివేశాలు, వీరిద్దరి మధ్య నడిచిన విషాద సన్నివేశాలను చాలా వరకు లైటింగ్‌తో   ఆ మూడ్స్‌ని తీసుకువచ్చే పని చేసారు అశోక్ మెహతా. నటులుగా వారిద్దరూ కూడా అమెచ్యూర్ గానే కనిపిస్తారు. ఆ లోపాన్ని అశోక్ మెహతా తన నైపుణ్యంతో కప్పేస్తారు.

దిలీప్ కుమార్, రాజ్ కుమార్ ల పాత్రలలో ఎక్కడా ఒకరు మరొకరిని డామినేట్ చేయకుండా సుభాష్ ఘాయ్ చాలా కష్టపడ్డారనే చెప్పాలి. దిలీప్ కుమార్ ఏ సీన్‌లో కూడా రాజ్ కుమార్‌ని మించకుండా, ఘాయ్ తీసుకున్న జాగ్రత్తలు కనిపిస్తాయి. సంభాషణలు కూడా ఇద్దరికి తూకం వేసినట్లు రాయబడి ఉన్నాయి. అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో మంధారి అనే పాత్రలో కనిపిస్తారు. ఈ పాత్రను చాలా జాగ్రత్తగా మలిచారు ఘాయ్. ఈ కథ అంతా కూడా రోమియో జూలియట్ కథను పోలి ఉంటుంది. రోమియో  జూలియట్‌లో కథ కన్నా కథనానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కథనం కోసం షేక్స్‌పియర్ ఫ్రైర్ లారెన్స్ అనే ఒక పాత్రను సృష్టించారు. ఈ లారెన్స్ రోమియా జూలియట్ లను కలపడానికి కృషి చేస్తాడు. ఆ యిద్దరిని కలపడానికి జూలియట్ చనిపోయినట్లు నమ్మించడానికి ఆమెకు ఒక మందు ఇచ్చి స్పృహ కోల్పేయేలా చేస్తాడు లారెన్స్. అది తెలియని రోమియో ఆమె నిజంగానే చనిపోయిందని ఆత్మహత్య చేసుకుంటాడు. స్పృహ లోకి వచ్చిన జూలియట్ రోమియో చనిపోయాడని తెలుసుకుని అతని చురకత్తితో పొడుచుకుని ప్రాణాలు వదులుతుంది. చాలా మంది ఈ లారెన్స్ పాత్రను ఆధునీకరించే ప్రయత్నం చేసినా అందులో విజయం సాధించలేకపోయారు. సుభాష్ ఘాయ్ రోమియా జూలియట్ ప్రేమ కథలోని ఈ పాత్రను ఆధారం చేసుకుని మంధారిని సృష్టించి అతని ద్వారా కథ నడిపిస్తాడు. ఈ మంధారి పాత్ర కథ చెప్పడం అనే కాన్సెప్ట్ కూడా అప్పట్లో జనాలకు బాగా నచ్చడం ఈ సినిమా విజయానికి మరో కారణం.

దిలీప్ కుమార్ తన పద్ధతిలో బాగా నటించారు. కాని ఇందులో కొన్ని సార్లు మెలోడ్రమా పాళ్ళు ఎక్కువయినట్లు అనిపిస్తుంది. అప్పట్లో హిందీ సినిమాలలో ఈ ఛాయలు ఎక్కువగా కనిప్సిస్తాయి.   ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయింది కాని క్లాసిక్ సినిమాల కోవలోకి రాదు. ప్రేక్షకులకు కావలసింది నటులందరూ అందించారు తప్ప వారు ఆ పాత్రలను ఓన్ చేసుకున్నట్లు కనిపించరు. దిలీప్ కుమార్ ప్రతి పాత్రకు తన సొంత ఆలోచనతో ఒక వ్యక్తిత్వాన్ని అద్దుతారు. ఈ సినిమాలో ఆయన తటస్థంగా ఉండిపోయినట్లు కనిపిస్తుంది. ఇందులో దిలీప్ కుమార్‌ని ఒక డైరక్టర్ చేతిలో నటుడిగా చూస్తాం తప్ప పాత్రను ఓన్ చేసుకుని తన మార్కు వదిలే ఆ పాత దిలీప్ కుమార్ ఈ సౌదాగర్‌లో కనిపించరు. సినిమా హిట్ అయినా నటనా పరంగా ఆయన చాలా విషయాలలో తటస్థంగా ఉండిపోతూ, చెప్పింది చేసుకుంటూ పోయినట్లు కనిపిస్తుంది. వీరి మిగతా సినిమాలలో లాంటి ఇన్వాల్మెంట్ ఈ సినిమాకు ఆయన చూపలేదు. ఇది స్పష్టంగా గమనిస్తాం.

రాజేశ్వర్ సింగ్, వీర్ సింగ్ ఇద్దరూ స్నేహితులు. రాజ్ రాచరికపు కుటుంబానికి చెందినవాడు. వీర్ సింగ్ రైతు బిడ్డ. ఇద్దరి మధ్య స్నేహం ఊరందరికి ఆదర్శం అవుతుంది. రాజ్ వీర్ సింగ్‌కి తన చెల్లెలినిచ్చి వివాహం చేయాలనుకుంటాడు. వివాహం నిశ్చయమయిన తరువాత ఒక పెళ్ళిలో కట్నం దగ్గర గొడవ వచ్చి వివాహం ఆగిపోతుంటే, ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి తప్పని పరిస్థితులలో వీర్ సింగ్ ఆమెను వివాహం చేసుకుంటాడు. అయితే ఇది విని వీర్‌ని ప్రేమించిన రాజ్ చెల్లెలు ఆత్మహత్య చేసుకుంటుంది. చెల్లెలి మరణంతో రాజ్ వీర్‌పై ద్వేషం పెంచుకుంటాడు. వీరిద్దరి వైరం ఊరిని రెండుగా చీలుస్తుంది. రాజ్ మనసు విరిగి లండన్ వెళ్ళిపోతాడు. అతని బంధువు చునియా ఈ పరిస్థితి తనకు అనుకూలంగా తిప్పుకుని రాజ్ ఆస్తి అనుభవిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే వీర్ కొడుకు ఈ వైరాన్ని అంతం చేయాలని ప్రయత్నిస్తున్నాడని తెలిసి చునియా అతన్ని చంపిస్తాడు. ఆ పని రాజ్ చేయించాడని వీర్ నమ్ముతాడు. ఇక ఊరు వచ్చిన రాజ్‌ని ఒక హత్య కేసులో ఇరికించి పన్నెండు సంవత్సరాలు జైలుకి పంపిస్తాడు చునియా. ఇది వీర్ చేయించాడని రాజ్ నమ్ముతాడు. ఇక ఈ ఇద్దరి మధ్య వైరానికి ఎన్నో ప్రాణాలు బలి అవుతాయి.

రాజ్ పెద్ద మనవడు కునాల్, వీర్ వైపు వర్గం అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెను రహస్యంగా వివాహం చేసుకుంటాడు. ఆమెతో ఒక బిడ్డ పుట్టాక ఆమెని చునియా కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి చంపేస్తాడు. రాజ్ మనుష్యుల పట్ల వీర్ వర్గంవారిలో కోపం పెరుగుతుంది. ఆ పుట్టిన బిడ్డను స్వీకరించమని వీర్ రాజ్ కుటుంబీకులను కోరినా ఆ బిడ్దతో తమకేం సంబంధం లేదనే సమాధానం వస్తుంది. వీరిద్దరి మధ్య వైరం ఇంకా పెరుగుతుంది. ఈ లోపు వీర్ మనవడు వాసు, రాజ్ మనవరాలు రాధ ప్రేమించుకుంటారు. ఇది చూసిన మంధారి వారిద్దరి ద్వారా ఆ కుటుంబాలు ఒక్కటవ్వాలని ఆ ప్రేమికులకు సహయపడాలని అనుకుంటాడు. వీర్ ఇంటికి రాధను బంధువుల అమ్మాయిగా పరిచయం చేసి ఆమె అక్కడ కొన్ని రోజులు ఉండేలా చూస్తాడు. అలాగే రాజ్ ఇంట్లో వాసును చేరుస్తాడు. రాజ్‌కి వాసు చాలా దగ్గర వుతాడు. వీర్ కూడా రాధను తన బిడ్డలాగే ప్రేమిస్తాడు. చివరకు వీరిద్దరు ఎవరో తెలియడం, గొడవలు ఇంకా పెరగడం, చునియా రాజ్ ఆస్తులను తాకట్టు పెట్టడం, విషయం తెలిసి వీర్ రాజ్‌లు ఒకటయి చునియాను చంపేసే సమయంలో ఇద్దరూ ఒకరిని ఒకరు పట్టుకుని చనిపోవడం చూస్తాం. చివరకు వాసు, రాధలు వివాహం చేసుకుని అప్పటి తరంలో కుదరని బాంధవ్యాన్ని ఇప్పుడు నిజం చేస్తారు.

‘సౌదాగర్’లో సంభాషణలన్నీ కారెక్టర్ల ఎమోషన్లను చూపించేవిగా కాకుండా ప్రేక్షకుల ఎమోషన్లను  సంతృప్తి పరిచేవిగా ఉంటాయి. వీర్ రాజ్‌ల మధ్య నడిచే సంభాషణలన్నిటిలో హీరోయిజం పాళ్ళు ఎక్కువగా చూస్తాం. అహాన్ని రాజసాన్ని ప్రదర్శిస్తూ ఆ ఇద్దరు ఒకరిపై ఒకరు సవాలు విసురుకోవడం ప్రేక్షకులకు ఆ రోజుల్లో మంచి కిక్ ఇచ్చి ఉండవచ్చు కాని ఇప్పుడు చూస్తే పాత్రల ఆత్మని ఆవిష్కరించడం కన్నా అ నటుల ఇమేజ్‌ని ఎలివేట్ చేసుకుంటూ ప్రేక్షకుల నుండి స్పందన రాబట్టడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. సౌదాగర్ సినిమాలో పాత్రలను బట్టి కథ మలచబడింది తప్ప కథకు ఆధారంగా పాత్రలు తమను తాము మలచుకోలేదు. తొంభైలలో మొదలయిన ఈ ట్రెండ్ ఇప్పటికీ అలాగే సాగుతుంది. స్టార్‌ల ఇమేజ్ ఆధారంగా కథలు మార్చబడుతున్నాయి. అందుకే దిలీప్ కుమార్ మిగతా సినిమాలలో పాత్రలు కనిపిస్తాయి. పాత్రలు మాట్లాడతాయి. కాని ఇందులో మాత్రం దిలీప్ కుమార్ ఇమేజ్ మాత్రమే కనిపిస్తుంది. ఆ ఇమేజ్ నిలపడానికి దర్శకుడు పడిన కృషి కనిపిస్తుంది. ఆ కృషికి సహకరించిన నటుడిగా దిలీప్ కుమార్ కనిపిస్తారు.

సౌదాగర్ సినిమాకు ఎనిమిది ఫిలింఫేర్ నామినేషన్స్ లభించాయి. దిలీప్ కుమార్ ఉత్తమ నటుడిగా నామినేట్ అయ్యారు. అయితే వారికి ఆ అవార్డు రాలేదు. అమితాబ్ బచ్చన్‌కి “హం” సినిమాకు ఉత్తమ నటుడి  అవార్డు వచ్చింది. సుభాష్ ఘాయ్‌కి మాత్రం ఉత్తమ దర్శకుడి అవార్డు ఈ సినిమాతో వచ్చింది. వామన్ భోంస్లే, గురుదత్ షిరాలీ కి ఎడిటింగ్ విభాగంలో మరో అవార్డు వచ్చింది. ‘సౌదాగర్’ పాటలన్నీ అప్పట్లో పాపులర్ అయ్యాయి. “ఈలు ఈలు” పాట మ్రోగని ఇల్లు అప్పట్లో లేదేమో. ఈ పాట చాలా బాగా రాసారు ఆనంద్ బక్షీ. లక్ష్మీకాంత్ ప్యారేరాల్ సంగీత దర్శకత్వం కూడా బావుంటుంది. “ఈలు ఈలు” పాటలో ఎన్ని సందర్భాలలో మనసులో ప్రేమ కలుగుతుందో, చెబుతూ విశ్వవ్యాపమైన ప్రేమను సరళమైన భాషలో ఆప్పటి యువతకు అర్థమయేలా రాయగలిగారు ఆనంద్ బక్షీ. అందుకే ఈ పాట పిల్లలకు, పెద్దలకు అందరికీ ఆ రోజుల్లో నచ్చింది. జానపద బాణీలో సాగే “ఇమ్లీ కా బూటా” పాట కూడా అందరికీ నచ్చుతుంది. “సౌదాగర్ సౌదాకర్” పాటను రూపొందించిన తీరు బాగుంటుంది. ముఖ్యంగా పాట చివరలో అనుపం ఖేర్ పాత్ర సంతోషంతో నృత్యం చేయటం పాటకొక వింత సోయగాన్నిస్తుంది. “హాయ్ క్యా కరూన్ హోటోంపె” పాటలో ఇంటెర్ల్యూడ్ సంగీతంలో మాండొలీన్ అత్యద్భుతంగా ధ్వనిస్తుంది. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం ఈ సినిమా విజయం సాధించటంలో ప్రధానపాత్ర పోషించింది. ఇందులో పాటలు కవితా కృష్ణమూర్తి, మన్హర్ ఉధాస్, మొహమ్మద్ అజీజ్, ఉదిత్ నారాయణ్, సాధనా సర్గం, సుఖ్విందర్ సింగ్, సురేష్ వాడ్కర్‌లు పాడారు. లత రెండు పాటలు పాడారు అందులో “తేరి యాద్ ఆతీ హై” పాట మిగతా వాటిలా పాపులర్ కాకపోయినా లత మార్క్ ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ రోజుకి కూడా. పాటల విషయంలో కూడా గమనిస్తే సుభాష్ ఘాయ్ తన సినిమాలన్నీటిలో కూడా అప్పటి గాయకులందరితో పాడించేవారు. ‘సౌదాగర్’లో ఎనిమిది పాటల్లో ఇంత మంది గాయకులు వినిపిస్తారు. ఇలా అన్ని రకాలుగా మల్టీస్టారర్ సినిమా ‘సౌదాగర్’.

‘సౌదాగర్’ దిలీప్ కుమార్ జీవితంలో ఆఖరి హిట్ సినిమాగా నిలిచిపోతుంది. దీని తరువాత ఏడు సంవత్సరాల గాప్‌తో “కిలా” అనే సినిమాతో దిలీప్ కుమార్ సినీ కెరీర్ ముగిసిందనే చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here