Site icon Sanchika

ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 57 – సగీనా

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం దిలీప్ కుమార్ నటించిన ‘సగీనా’ సినిమాని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

ఉద్యమాలలోని రాజకీయాలను పరిచయం చేసిన తపన్ సిన్హా సినిమా ‘సగీనా’

[dropcap]1[/dropcap]974లో దిలీప్ కుమార్ సైరా బానులతో తపన్ సిన్హా హిందీలో తీసిన చిత్రం సగీనా. ఇది అంతకు నాలుగు సంవత్సరాల క్రితం బెంగాలీలో తీసిన “సగీనా మహతో” సినిమా రీమేక్. అదే నటులతో అదే సాంకేతిక వర్గంతో ఈ సినిమా మళ్ళీ తపన్ సిన్హానే హిందీలో తీసారు. బెంగాలీలో ఈ సినిమాకు వచ్చిన పేరు, హిందీలో రాలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. దిలీప్ కుమార్‌కు హిందీలో వరుస ఫ్లాప్‌లు నడుస్తున్న సమయం. హిందీలో హిట్ కోసం ఆయన పడుతున్న తాపత్రయం ఈ సినిమాలో కనిపిస్తుంది. అలాగే బెంగాల్‌లో టీ ఎస్టేట్ కార్మికుల పోరాటం హిందీ ప్రాంతపు ప్రజలను ఆకర్షించలేదు. అలాగే కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న కమునిస్టు నాయకుల అంతర్గత రాజకీయాలు బెంగాల్ ప్రజల మధ్య చర్చకు వచ్చినట్లు హిందీ ప్రాంతపు వారికి అర్థం కాలేదు. అదీ కాకుండా బెంగాలీ ప్రేమ కథలను ఆదరించినంతగా ఉత్తర భారతీయులు వారి పోరాట గాథలను ఆదరించలేదు. ఇవన్నీ కాకుండా దిలీప్ కుమార్ అప్పటి దాకా కలిసి పని చేసిన సన్నిహితులు ఎవరూ ఈ సినిమాతో కలిసి పని చేయకపోవడం కూడా సినిమాను ఉత్తర భారతీయులకు దగ్గర చేయలేకపోయింది.

తపన్ సిన్హా బెంగాల్ దర్శక దిగ్గజాలలో ఒకరు. ఈ సినిమాలో దిలీప్ కుమార్ సహజ మెథడ్ యాక్టింగ్‌కి విభిన్నంగా అతని చేత నటింపజేసే ప్రయత్నం చేసానని తపన్ సిన్హానే చెప్పుకున్నారు. మొదటి నుండి బెంగాలీ దర్శకులతో దిలీప్ కుమార్‌కు మంచి అనుబంధం ఉండేది. అమియా చక్రవర్తి, బిమల్ రాయ్, నితిన్ బోస్, హృషికేశ్ ముఖర్జీ వీరందరూ దిలీప్ కుమార్ దగ్గర అత్యుత్తమ స్థాయి నటన రాబట్టుకున్నారు. దిలీప్ కుమార్ స్వయంగా బెంగాలీ మాట్లాడతారు కూడా. ఆ భాష పట్ల, సాహిత్యం పట్ల వారికి స్పష్టమైన అవగాహన కూడా ఉండేది.

తపన్ సిన్హా ‘సగీనా’ సినిమాను బెంగాలీ సినిమా తీసిన నాలుగు సంవత్సరాల అనంతరం తిరిగి దానినే హిందీలో పునః నిర్మించారు. కథ ఇతివృత్తం డార్జీలింగ్ టీ ఎస్టేట్లలో 1940 లలో జరిగిన కార్మిక పోరాటాల నేపథ్యంలో సాగుతుంది. ఒరిజినల్‌గా బెంగాలీలో బ్లాక్ అండ్ వైట్‌లో తీసిన సినిమాను హిందీలో నిర్మించేటప్పుడు తపన్ సిన్హా, కలర్‌లో తీసారు. కాని బెంగాలీ చిత్రంలా ఇది రాలేదు అన్నది ఈ రెండు సినిమాలు చూస్తే మనం ఒప్పుకుంటాం. కొంచెం డ్రామా పాలు హిందీలో ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది. సైరా బాను, దిలీప్ కుమార్ మధ్య సీన్లలో కొంత సహజత్వం లోపించినట్లు కూడా కనిపిస్తుంది.

టీ ఎస్టేట్ లలోని ఫాక్టరీలో పని చేసే సగీనా అనాథ. అతని తోటి పనివారే అతని కుటుంబం. సగీనా తాగుడికి బానిస. అలాగే కాస్త స్త్రీ లోలత్వం కూడా ఉన్నట్లు అతనే ఒప్పుకుంటాడు. కాని మనిషిలో న్యాయం ధర్మం పట్ల ఒక అవగాహన ఉంది. తన తోటి కార్మికులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే వ్యక్తి కాదు. కేవలం తన బాగు తాను చూసుకోవాలనే స్వార్థం ఉన్నవాడు కాదు. కాని సమస్యను మేధస్సుతో, లౌక్యంతోనో పరిష్కరించాలనుకునే తత్వం కాదు అతనిది. భుజబలం చూపించి అప్పటికప్పుడు న్యాయం చేయాలనుకునే మనస్తత్వం అతనిది. మిగతా పని వారి కుటుంబాలలో ఏ సమస్య వచ్చినా తన వంతుగా ఏమైనా చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండే వ్యక్తి సగీనా. అతన్ని అందుకే కార్మికులందరూ ఎంతో ప్రేమిస్తారు. అతని బలహీనతలను మన్నిస్తారు. ఆ ఫాక్టరీలో పని చేసే ఒక వ్యక్తి రెండు వందలు డబ్బు ఇచ్చి లలిత అనే ఒక అమ్మాయిని ఆమె చుట్టాల నుండి వివాహం చేసుకుంటానని తన ఊరు తీసుకుని వస్తాడు. కాని అదే రాత్రి ఆ అమ్మాయిని ఎస్టేట్ మేనేజర్ దగ్గరకు పంపిస్తాడు. తిరగబడిన లలిత గురు అనే ఒక వృద్ధుని ఇంట్లో దాక్కుంటుంది. ఆమె గురు ఇంట్లో ఉందని తెలిసి ఆమెను తన వద్దకు పంపమని గురుని అడుగుతాడు మేనేజర్. తానా పని చేయనని గురు అన్నాడని ముప్పై సంవత్సరాలుగా ఆ ఫాక్టరీలో పని చేస్తున్న గురుని కొట్టి కంపెని పని నుండి తీసేస్తాడు మేనేజర్. అందరూ చుస్తూ ఉండిపోతారు తప్ప తిరగబడరు. అతని స్థితి తెలుసుకున్న సగీనా మాత్రం కోపంతో ఆ మేనేజర్‌ని కొడతాడు. అతని ధైర్యం చూసి కార్మికులందరూ సమ్మెకి దిగుతారు. పెద్ద ఆఫీసర్ అసలు విషయం తెలుసుకుని, మేనేజర్‌ని తిట్టి మళ్ళీ పనిలోకి సగీనాని, గురుని తీసుకుంటాడు. ఈ సంఘటనతో సగీనా పట్ల కార్మికులలో నమ్మకం పెరుగుతుంది. లలిత కూడా తనను అమ్మ చూసిన వ్యక్తిని కాదని ఒంటరిగా సగీనా దైర్యంతో బ్రతుకుతుంటుంది.

సగీనా గురించి కమ్యునిస్టు ఉద్యమ పార్టీ వారికి తెలుస్తుంది. అతని పని తమకు అవసరం అని, అతనికి కొంత రాజకీయ అవగాహన కల్పిస్తే పార్టీకి ఉపయోగ పడతాడని. ఇలాంటి వారితో కలిసి పని చేస్తే తమ ఆశయాన్ని త్వరగా సాధించవచ్చని ఆ పార్టీ నాయకుడు దత్తా, తమ వద్ద శిక్షణ పొందుతున్న అమోల్ అనే ఒక కార్యకర్తను సగీనాకు శిక్షణ ఇవ్వడానికి పంపిస్తాడు. తననెందుకు నాయకులు కలుపుకోవాలనుకుంటున్నారో సగీనాకు అర్థం కాదు. కాని ఆ వచ్చిన కార్యకర్త మాత్రం నీ లాంటి వారి అవసరం మన దేశానికుంది, మన పోరాటం ఒకే లక్ష్యం కోసం అంటూ చెప్పిన అదర్శాలు విని ఆ నాయకులు చూపిన దారిలో నడవాలని నిశ్చయించుకుంటాడు సగీనా. సగీనాకి కార్మికులలో ఉన్న మంచి పేరు అతను సాధించుకున్న నమ్మకాన్ని దగ్గరనుండి గమనిస్తాడు ఆ కార్యకర్త. తమ కంపెనీలో అప్పుడే వివాహమయిన ఒక అమ్మాయిపై అత్యాచార యత్నం చేసినప్పుడు ఆ మేనేజర్‌ని దగ్గర ఉండి ఆ అమ్మాయి భర్తతో కొట్టిస్తాడు సగీనా. అది పద్ధతి కాదని కంపెనీపై యుద్ధం పద్ధతిగా జరగాలని చెప్పే ఆ కార్యకర్త మాటలు సగీనాకి అర్థం కావు. కార్మికులు మళ్ళీ సమ్మె చేస్తారు.

కార్మికులలో సగీనాకున్న నమ్మకాన్ని గుర్తించి, పట్నం నుండి వచ్చిన అనిరుద్ద్ అనే పెద్ద నాయకుడు సగీనాను వెల్ఫేర్ ఆఫీసర్‌గా నియమిస్తాడు. విశాఖ అనే మరో కార్యకర్త సగీనాకు సహాయం చేయడానికి అక్కడే అతనితో ఉండిపోతుంది. సగీనాకు ఉండడానికి ఒక పెద్ద ఇల్లు, కావలసిన సౌకర్యాలన్ని సమకూరుతాయి. విశాఖ అతనికి పార్టీ పనులు నేర్పిస్తూ ఉంటుంది. కాగితం మీద సాగే ఆ చైతన్యం ఏంటో సగీనాకు అర్థం కాదు. కాని వారంతా చదువుకున్నవారని, తమ పక్షాన పని చేస్తున్నవారని వారితో కలిసి ఉంటే తమకు మంచి జరుగుతుందని నమ్ముతాడు సగీనా.

విశాఖ ఒక పెద్ద మిల్లు ఓనర్ కూతురు. కాని సోషలిజాన్ని నమ్ముకుని కార్మికుల జీవితాలలో మార్పు రావాలని అన్నిసౌకర్యాలు వదులుకుని పార్టీకి పని చేస్తూ ఉంటుంది. తల్లి తండ్రి తనను వదిలి వేస్తే అనాథగా ఆకలితో తాను చేసిన యుద్దాన్ని సగీనా ఆమెకు తన జీవిత కథగా చెప్పినప్పుడు, తన జీవితంలో కుడా డబ్బు కారణంగా తల్లి తండ్రుల ప్రేమ లేకుండా తాను పెరిగిన విధానాన్ని విశాఖ అతనితో చెబుతుంది. వీరిద్దరి మధ్య పెరుగుతున్న చనువు లలితకు ఇబ్బంది కలిగిస్తుంది. సగీనాను కలకత్తాలో సమ్మొలో పాల్గొనాలని తీసుకువెళ్తారు నాయకులు. ఊరు వదిలిన తరువాత సగీనా పేరు చెప్పి టీ ఎస్టేట్ కార్మికులందరి మీదా అక్రమాలు చేస్తుంది యజమాన్యం. నాయకునిగా హోదా పొందిన తరువాత సగీనా తమకు దూరం అయ్యాడని, స్వార్థపరుడయ్యాడని, తమకు కష్టాలలో సహాయం చేయవలసింది పోయి, తమకు అందుబాటులో లేకుండా మీటింగులని కలకత్తా చుట్టూ తిరుగుతున్నాడని కార్మికులు అతన్ని తప్పుపడతారు. సగీనా పట్ల అందరూ కోపంగా ఉంటారు. సగీనాపై ఉన్న కోపాన్ని ఫాక్టరీ యాజమాన్యం తమపై తీర్చుకోవడం వారు భరించలేకపోతారు.

ఇవేవి తెలియక ఊరు చేరిన సగీనా ఊరివాళ్ళందరు చూపే కోపాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అసలు తానేందుకు తన వారికి దూరం అవ్వవలసి వచ్చిందని ఆలోచించడం మొదలెడతాడు. తనకు తనవారి నుండి ఒక స్ట్రాటజీతో తప్పించారు అని అతనికి అర్థం అవుతుంది.. నాయకుడైన అనిరుద్ద్ పన్నిన కుట్రలో తాను బలి అయ్యానని అర్థం చేసుకున్న సగీనా తన ఊరి వారి తోనే ఉండిపోతాడు. కాని ఫాక్టరీ యాజమాన్యం, ప్రజలు అతన్ని ద్రోహి గానే ఎంచుతారు. ఫాక్టరీ కాల్చేయడానికి సహాయం చేయమన్న పార్టీ వ్యూహాన్ని అతను నిరాకరిస్తాడు. పార్టీని ఎదిరించి ఫాక్టరీని కాపాడుకుంటాడు. యాజమాన్యంతో ఉన్న కోపాన్ని తమకు తిండి పెట్టే పాక్టరీ వైపుకు మళ్ళిస్తే నష్టపోయేది కార్మికులే అని వాదిస్తాడు. అతన్ని ద్రోహిగా ఎంచి ప్రజా కోర్టులో అతనికి శిక్షవేయాలని అనిరుద్ద్ అతని పార్టీ సహచరులు తీర్పు వినిపిస్తారు. అయితే ఆ క్రమంలో ఒకొక్కటిగా జరిగిన సంగతులన్నీ విన్న కార్యకర్తలు విశాఖ, అమోల్‌లు అనిరుద్ద్ తీర్పుని వ్యతిరేకిస్తారు. సగీనా లాంటి నాయకుడిని బలి చేయడానికి పార్టీ సిద్ధాంతాలను వాడుకున్నందుకు అనిరుద్ద్‌ని నిలదీస్తారు. అనిరుద్ద్ తనను ఎదిరించినందుకు అమోల్‌ను తుపాకితో కాలుస్తాడు. తాను నమ్మిన సిద్ధాంతాలు ఎలాంటి స్వార్థపరుల చేతుల్లో విషతుల్యం అవుతున్నాయో తెలుసుకున్న బాధతో అమోల్ మరణిస్తాడు. సగీనాను చంపే ప్రయత్నం చేస్తున్న అనిరుద్ద్‌ని విశాఖ రివాల్వర్‌తో కాల్చి చంపుతుంది.

సినిమాగా చూస్తే ఇది అప్పట్లో చాలా విప్లవాత్మక ధోరణిలో తీసిన సినిమాగా చెప్పవచ్చు. ఉద్యమాల నేపథ్యంలో ఉద్యమ నాయకుల రాజకీయాల నడుమ కార్యకర్తలు ఎలా బలి అవుతూ ఉంటారో ఈ రోజుకీ చర్చించడానికి అందరూ భయపడే అంశం. ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాల నుండి వచ్చే సాహిత్యంలో ఈ కోణం అక్కడక్కడా కనిపిస్తూ ఉంటుంది కాని ఇంత విపులంగా సిద్దాంతలకనుగుణంగా పని చేస్తున్న పార్టీలలోని అంతరంగిక రాజకీయాలను చూపించిన చిత్రం మరొకటి లేదు. ముఖ్యంగా కమ్యునిజం బలంగా వేళ్ళూనికొని ఉన్న బెంగాల్ ప్రాంతపు ఇతివృత్తంతో ఈ కథ రావడం నిజంగా ఆలోచించవలసిన విషయం. అయితే ఈ నేపథ్యాన్ని పక్కన పెట్టి ఏ మాత్రం అవగాహన లేని వారికి ఈ సినిమా చూపిస్తే అంతగా అలరించదు.

దిలీప్ కుమార్ సినిమాలన్నిటిలో భిన్నమైన ఈ సినిమాలో ఆయన నటనలో కొద్దిగా లౌడ్ ప్లే ని జోడించడం వలన దిలీప్ కుమార్ మనకు కొత్తగా కనిపిస్తారు. అలవాటు పడిన ఆయన మేనరిజమ్స్‌ని మార్చుకుని ఆయన కొత్తదనాన్ని చూపిస్తూ నటించి మంచి ప్రయత్నం చేసారు. కాని ప్రేక్షకులు మెచ్చలేదు.  ఎంతగా తనకు అలవాటులేని రీతిలో నటించినా కొన్ని దృశ్యాలలో మాత్రం దిలీప్ కుమార్ తనకలవాటయిన రీతిలో అత్యద్భుతంగా నటిస్తారు. మెరుపులా మెరిసే ఈ దృశ్యాలు ఇతర అరుపులు కేకల హోరులో అణగిపోతాయి. టెలిఫోన్ దృశ్యం, కొండపైనుండి వర్కర్లతో మాట్లాడే సన్నివేశం, బలాత్కారం చేసిన వర్కర్‌ని వదలివేయమని పోలీసులను బ్రతిమిలాడే సన్నివేశం, మిల్లు యజమానితో వాదన, అపర్ణ సేన్ బాల్యానుభవాలను వినే దృశ్యం, ఇలాంటి దృశ్యాలలో అత్యద్భుతమయిన నటన ప్రదర్శిస్తారు దిలీప్ కుమార్.  ఈ సినిమాను బలహీన పరచింది స్క్రిప్ట్. ఫ్లాష్‌బాక్‌లు అధికమైపోయి సినిమా గజిబిజిగా అనిపిస్తుంది. కథా పరంగా, టేకింగ్ పరంగా కూడా డెభ్భైవ దశకంలో హిందీ సినీ ప్రేక్షకుల ట్రెండ్‌కు భిన్నంగా సాగే ఈ సినిమా వారిని అంతగా ఆకట్టుకోలేదు. కాని అన్ని ప్రతికూలమైన పాయింట్ల మధ్య కూడా ఇది తప్పకుండా ఆలోచన రేకెత్తించే సినిమా. ముఖ్యంగా ప్రస్తుత ఉద్యమాల స్థితి, ప్రస్తుత రాజకీయాల పరిస్థితి, ఉద్యమాలలో అన్ని త్యాగం చేసి ఆదర్శాల బాట పట్టినవారి నిజాయితీని వాడుకుని వారి మీద తమ రాజకీయ భవిష్యత్తు సుస్థిరం చేసుకోదల్చిన నాయకులలోని మోసాన్ని ఇంత బాహాటంగా ప్రస్తుత పరిస్థితులలో స్క్రీన్‌పై చూపించడం కష్టం. ఒక వేళ అలాంటి సినిమా తీసినా దానికి “యూ” సర్టీఫికెట్ ఇచ్చి సెన్సార్ చేయకుండా రిలీజ్ చేసే పరిస్థితులు ఉండవేమో. ఈ కథలో సోషలిజం బాట పట్టిన ఉద్యమ నాయకుల మోసాన్ని చూపించినా, అది ప్రతి పార్టీ నేడు అనుసరిస్తున్న నీతి అని ఈ సినిమా చూసిన తరువాత మనం ఒప్పుకుంటాం.

ఈ సినిమాకు సంగీతం అందించింది ఎస్.డీ.బర్మన్. పాటలు రాసింది మజ్రూహ్ సుల్తాన్‌పురి. ఈ సినిమాలో దిలీప్ కుమార్‌కి కిషోర్ కుమార్ పాడారు. “సాలా మై తో సాబ్ బన్ గయా” పాట చాలా పాపులర్ అయింది. దిలీప్ కుమార్‌కి కిషోర్ కుమార్ పాడిన ఒకే ఒక సినిమా సగీనా. సాల మైతొ సాహెబ్ బన్ గయా పాటలో దిలీప్ కుమార్ జోకర్ లా అనిపిస్తాడు.కొన్ని బెంగాలీ సినిమాలో వాడిన పల్లవులని కూడా ఈ సినిమాకు వాడుకున్నారు దర్శకులు. ఈ సినిమాలో హిట్ అయిన మరోపాట తుమ్హారె సంగ్ తో రైన్ బితాయే, కహాన్ బితావూన్ దిన్… విశాఖ పాత్రలో అపర్ణా సేన్ నటించారు. అనిల్ చటర్జీ అనిరుద్ద్‌గా నటిస్తే, ఓం ప్రకాష్ గురుగా తన శైలిలో అలరిస్తారు. కాదర్ ఖాన్‌ను ఒకే ఒక సీన్‌లో చూస్తాం, అలనాటి నటుడు కే. ఎన్. సింగ్ ఫాక్టరీ యజమానిగా కనిపిస్తారు. రాజకీయ అవగాహన కలిగించడానికి మన భారతీయ సినిమాలో రాజకీయ నేపథ్యం మీద వచ్చిన సినిమాలు చాలా తక్కువ. అలాంటి ఇతివృత్తాలతో వచ్చిన సినిమాను పరిశిలించాలంటే ‘సగీనా’ సినిమా తప్పకుండా చూడాలి. నిజాయితీతో తీసిన సినిమా అని ఒప్పుకుంటాం. నేటి రాజకీయ పరిస్థితుల పట్ల కూడా పూర్తి అవగాహన కలిగించే సినిమా ఇది.

Exit mobile version