Site icon Sanchika

ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 59 – జ్వార్ భాటా

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం దిలీప్ కుమార్ నటించిన ‘జ్వార్ భాటా’ సినిమాని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్ మొదటి సినిమా జ్వార్ భాటా

[dropcap]యూ[/dropcap]సఫ్ ఖాన్ అనే ఒక యువకుడు బాంబే టాకీస్ అనే పెద్ద స్టూడియోలో ఏదన్నా చిన్న పని దొరుకుతుందా అని కనుక్కోవడానికి లోనికి వెళ్లాడు. ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉన్న ఆ అబ్బాయిని ఆ స్టూడియో యజమానురాలు చూసింది. ఆమెకు అతనిలో ఏం కనిపించిందో కాని తన సినిమాకి హీరోగా తీసుకుంది. జీతంగా పన్నెండు వందల రూపాయలు అని చెప్పినప్పుడు అది సంవత్సర జీతం అనుకున్నాడట యూసఫ్ ఖాన్. అది నెలకి అని తెలిసి ఏ పని అయినా చేయడానికి సిద్దపడ్డారట. అప్పడే అశోక్ కుమార్ బాంబే టాకీస్ వదిలేసి వెళ్ళిపోయారు. బాంబే టాకీస్‌లో ముఖ్య నటుడిగా నటిస్తున్న అతను ‘కిస్మత్’ పెద్ద హిట్ అయిన తరువాత తానే సొంతంగా మరో ప్రొడక్షన్ హౌస్ నిర్మించుకోవాలని ఆలోచించి బాంబే టాకీస్ వదిలేసి వెళ్లిపోయారట. అతని స్థానంలో మరో అందమైన హీరో కోసం వెతుకుతున్నారు దేవికా రాణి. దిలీప్ కుమార్‌కి స్క్రీన్ టెస్ట్ చేయిస్తే ఆమెకు ఆ ఫోటోలు నచ్చాయి. అప్పటికే ఆమె దగ్గర జ్వార్ భాటా కథ సిద్ధంగా ఉంది. అ కథ కోసం అందమైన రొమాంటిక్ హీరో అవసరం అని యూసుఫ్ ఖాన్ పేరు సరిపోదని ఆమె భావించారట. అలాగే తండ్రికి చెప్పకుండా బొంబాయి చేరిన దిలీప్ కుడా పేరు మార్చుకుని చాటుగా తండ్రికి తెలియకుండా సినిమాలు చేద్దామనే ఆలోచన లోనే ఉన్నారు.

భగవతీ చరణ్ వర్మ హిందీ సాహిత్యంలో పెద్ద కథకుడు. జ్వార్ భాటాకి స్క్రీన్ ప్లే రాసింది ఆయనే. ఆయన మూడు పేర్లు సూచించారట దిలీప్ కుమార్, వాసుదేవ్, జహాంగీర్. దేవికా రాణీకి వాసుదేవ్ అన్న పేరు నచ్చింది. కాని యూసఫ్ ఖాన్ కు దిలీప్ కుమార్ అన్న పేరు నచ్చిందట. అలా హిందీ సినిమా ప్రపంచంలో దిలీప్ కుమార్ జననం జరిగింది. అయితే జ్వార్ భాటా సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. బాబు రావ్ పటేల్ లాంటి ఆనాటి సినీ విశ్లేషకులు దిలీప్ కుమార్ జైలు నుండి తప్పించుకున్న ఖైదీలా ఉన్నారని, అతనికి హిందీ సినిమాలో భవిష్యత్తే లేదని రాసారు. జ్వార్ భాటాలో కూడా ఆయన రెండవ హీరో గానే చేసారు. సినిమా కథ పరమ చెత్తగా ఉందని ఆ కథతో పోలిన ఎన్నో కథలు ఇంతకు ముందే వచ్చాయని, ఈ సినిమాలో కొత్త పాయింట్ ఏమీ లేదని, కొత్త హీరో శరీరంలో రక్తం లేకుండా పాలిపోయి కొన్ని నెలకు తిండి లేనివాడిగా ఉన్నాడని రాసారు. అయనే తరువాత “బాబుల్” సినిమాలో దిలీప్ కుమార్ నటనకు ప్రశంసల జల్లు కురిపించారు. జ్వార్ భాటా 29 నవంబరు 1944న బొంబాయి లోని గిర్గామ్‌లో మెజిస్టిక్ థియేటర్‌లో రిలీజయ్యింది. ఈ రోజు ఆ థియేటర్ లేదు, ఆ సినిమా ప్రింట్ కూడా లేదు.

జ్వార్ భాటా సినిమా కథకు వస్తే ఒక పెద్దాయనకు ఇద్దరు కూతుర్లు, రమ, రేణు. నరేంద్ర అనే ఒక ధనవంతుని పెళ్ళి రమతో నిశ్చయమవుతుంది. అయితే తన కాబోయే భార్యను చూద్దామని అత్యుత్సాహంతో అతను తానెవరో చెప్పకుండా వారింటికి వస్తాడు. రేణుని రమ అనుకుని కలుస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. పెళ్ళి తరువాత తాను ప్రేమించిన అమ్మాయి తన మరదలు అని తాను పెళ్ళి చేసుకున్న అమ్మాయి పై తనకు ప్రేమ లేదని నరేంద్రకు అర్థం అవుతుంది. రేణు ఇల్లువదిలి వెళ్ళిపోవలసి వస్తుంది. జగదీష్ అనే ఒక సంగీతకారుడ్ని ఆమె కలుసుకుంటుంది. రేణు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె అక్క గర్భవతి అని కాని చాలా జబ్బు చేసి ఉందని ఎక్కువ కాలం బ్రతకదని తెలుస్తుంది. తల్లిని రక్షించాలా బిడ్డను రక్షించాలా నిర్ణయించుకోవలసిన సమయంలో అప్పటిదాకా దేవున్ని దూషిస్తూ గడిపిన రేణు అతనితో సంధి చేసుకుంటుంది. జగదీశ్‌గా దిలీప్ కుమార్, రమగా షమీన్, రేణుగా మృదులా రాణి, నరేంద్రగా ఆగా జాన్ ఈ సినిమాలో నటించారు. దిలీప్ కుమార్ కన్నా మృదులకు మంచి భవిష్యత్తు ఉందని విశ్లేషకులు చెప్పారట. కాని ఒక నాలుగు సంవత్సరాల తరువాత మృదుల చిన్న చిన్న పాత్రలకే పరిమితమయితే దిలీప్ కుమార్ సూపర్ స్టార్‌గా మారారు.

రెండో పాత్రలో షమీం బానో నటించారు. ఖుర్షిద్ బానో అనే ఒకప్పటి గాయకురాలు, మీనాకుమారికు ఈవిడకు చుట్టరికం ఉంది. దేశ విభజన తరువాత పాకిస్తాన్ వెళ్ళిపోయింది వీరి కుటుంబం. నరేంద్ర పాత్రలో నటించిన ఆఘా జాన్ అప్పటికే కొన్ని సినిమాలు చేసి ఉన్నారు. ఈ సినిమాలో ఎక్కువ నిడివి ఉన్న పాత్ర వీరే పోషించారు.

జ్వార్ భాటా సినిమాకు దర్శకత్వం వహించింది అమియా చక్రవర్తి. ఈయన భార్య పండిత్ రవి శంకర్ కుటుంబ సభ్యురాలు. 1940 లలో మంచి దర్శకుడిగా ఆయనకు పేరు ఉండింది. జ్వావ్ భాటా తరువాత దిలీప్ కుమార్‌తో దాగ్ అనే మరో సినిమా చేసారయన కొన్ని సంవత్సరాల తరువాత. ఆ సినిమాకే దిలీప్ కుమార్‌కు మొదటి ఫిలింఫేర్ అవార్డు లభించింది. ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో రూమా గుహ కనిపిస్తారు. అప్పుడు ఆమె వయసు పది సంవత్సరాలు. తరువాత ఈమె కిషోర్ కుమార్‌ని వివాహం చేసుకున్నారు. ఈ సినిమాలో మొత్తం తొమ్మిది పాటలుంటాయి. ఎక్కువగా మన్నాడే పారుల్ ఘోశ్ ఆ పాటలను పాడారు. సంగీతం అందించింది అనిల్ బిస్వాస్. సంగీత్ నాటక అకాడమీ అవార్డు పొందిన అనిల్ బిస్వాస్ ఎన్నో గొప్ప సినిమాలకు సంగీతం అందించారు. సినీ సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేసిన సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.

ఈ సినిమాకు చాయా గ్రహణం అందించింది రాధు కర్మాకర్. ఈయన తరువాత ఆర్.కే స్టూడియోకి పని చేశారు. ఆవారాతో మొదలు పెట్టి రాం తేరి గంగా మైలీ వరకు అన్ని సినిమాలకు ఆర్.కే. వారికి నలభై సంవత్సరాలుగా పని చేసారు. “జిస్ దేశ్ మే గంగా బెహతీ హై” సినిమాకు దర్శకత్వం వహించింది కూడా వీరే. దిలీప్ కుమార్ మూడవ సినిమా మిలన్‌కి కూడా అయనే సినిమాటోగ్రాఫర్. ఆ సినిమాలో రాత్రి దృశ్యాలను ఈయన తీసిన విధానం చూసిన రాజ్ కపూర్ తరువాత తన ఆవారా సినిమాకు పని చేయమని ఆహ్వానించారట. ఆలా అప్పటి నుండి ఆయన రాజ్ కపూర్ చనిపోయిన తరువాత వచ్చిన హీనా సినిమాకు కూడా సినిమాటోగ్రఫర్‌గా పని చేసారు. 93లో కార్ ఆక్సిడెంట్‌లో మరణించే దాకా ఆయన పని చేస్తూనే ఉన్నారు. కే.ఎన్. సింగ్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించారట.

జ్వార్ భాటా సినిమా కూడా ఇప్పుడు లభ్యం అవట్లేదు. ఈ సినిమా గురించి పైనిచ్చిన సమాచారం అంతా కూడా వివిధ వ్యాసాల నుండి సేకరించినదే. కాని ఒక్క విషయం మాత్రం ఇక్కడ తెలుసుకోవాలి. దిలీప్ కుమార్ కోరి సినిమాను తన వృత్తిగా ఎంచుకోలేదు. పండ్ల వ్యాపారం చేసే కుటుంబంలో పుట్టిన యూసుఫ్ ఖాన్, ఒక మిలిటరీ ఏరియాలో చిన్న దుకాణం మొదలెట్టి వ్యాపారం చేసుకోవాలనుకుంటున్న ఆయన అనుకోకుండా హీరో అయ్యారు. తరువాత ఆ వృత్తినే ఆయన ప్రేమించారు. తరువాత ఆ వృత్తికి పూర్తి న్యాయం చేసి ఎందరికో నటన పాఠాలు చెప్పే స్థాయికి వచ్చారు. చాలా మంది హీరోలుగా కోరుకుని, ఎన్నుకుని ఈ వృత్తిలోకి వచ్చిన వారు కాదు. జ్వార్ భాటాలో తననేం చేయమంటే అది చేసానని, వాస్తవ ప్రపంచానికి, వాస్తవం కాని ఈ ప్రపంచానికి మధ్య చాలా కన్‌ప్యూజన్‌తో ఆ సయయంలో ఒక లాంటి అయోమయ స్థితిలో తానున్నానని ఆయన తన ఆత్మకథలో చెప్పుకున్నారు.

జ్వార్ భాటా దిలీప్ కుమార్ నటించిన మొదటి సినిమా అని మాత్రమే చెప్పగలం. ఈ సినిమా గురించి ఎక్కువ సమాచారం కూడా లేదు. సినిమా ప్రింట్ కొన్ని దశాబ్దాల నుండి లేకుండా పోయిందని చెప్తారు.

Exit mobile version