ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 61 – సగీనా మహతో

0
2

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం దిలీప్ కుమార్ నటించిన ‘సగీనా మహతో’ సినిమాని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

ఎమ్.ఎన్. రాయ్ రాడికల్ హ్యూమనిజాన్ని తెరపై చర్చించిన సినిమా ‘సగీనా మహాతో’

[dropcap]‘స[/dropcap]గీనా మహాతో’ 1970లో బెంగాలీలో తపన్ సిన్హా దర్శకత్వంలో వచ్చిన సినిమా. దిలీప్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా మళ్ళీ నాలుగేళ్ళ తరువాత 1974లో హిందీలో ‘సగీనా’గా వచ్చినా, హిందీ సినిమాలో ‘సగీనా మహాతో’ ఆత్మ కనిపించదు. బెంగాలీ సినిమా చూసిన తరువాత కాని ‘సగీనా మహాతో’ పాత్ర కున్న చారిత్రిక నేపథ్యం అర్థం కాదు. ఆశ్చర్యంగా ఒకే దర్శకుడు తన టీంతో రెండు భాషలలో సినిమా తీస్తే హిందీ సినిమా అంతా గందరగోళంగా అనిపిస్తే అవే సన్నివేశాలు బెంగాలీలో చూసినప్పుడు కాని ఆ కథ కున్న లోతు అర్థం కాలేదు. ఒక ప్రయోగంలా ఈ రెండు సినిమాలు చూసిన తరువాత నేటివిటీ సినిమాకు ఎంత అవరసరమో అర్థం అవుతుంది.

బెంగాల్ ప్రాంతంలో కమ్యునిజం చాలా ప్రాముఖ్యత సంపాదించుకున్న సమయం అది. అప్పుడే ఎం.ఎన్. రాయ్ సిద్ధాంతాల గురించి మేధావుల మధ్య చర్చ జరుగుతుంది. సగీనా మహతో అనే ఒక కార్మికుడు చేసిన లేబర్ పోరాటం 1942-43ల మధ్య డార్జిలింగ్ ప్రాంతాలలో కార్మిక ఉద్యమాలకు తెర తీసింది. అప్పటి చారిత్రిక కార్మిక ఉద్యమ పరిస్థితులను ఇతివృత్తంగా తీసుకుని ఎమ్.ఎన్. రాయ్ ప్రతిపాదించిన రాడికల్ హ్యూమనిజం సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటూ ఈ సినిమాను చూసినప్పుడు కాని తపన్ సిన్హా చెప్పాలనుకున్న విషయాలు మనకు అర్థం కావు.

ఒక చదువు రాని మామూలు ఫాక్టరీ కార్మికుడు ఇంగ్లీషు అధికారులకు ఎదురొడ్డి తమ కార్మిక హక్కుల కోసం కార్మికుల శ్రేయస్సు కోసం గళం విప్పుతాడు. అతన్ని తమ నాయకుడిగా ఫాక్టరీ కార్మికులు అందరూ అంగీకరిస్తారు. అయితే పేదరికం, నిరక్షరాస్యత, అట్టడుగు జీవితం ఇవన్నీ సగీనాలో నాయకత్వ లక్షణాలతో పాటు సామాన్య బలహీనతలున్న వ్యక్తిగానే తయారు చేస్తాయి. తాగుడు, కొంత స్త్రీ సహవాసం ఇతని అలవాట్లు. అయితే ఆ అట్టడుగు వర్గంలో ఇవన్నీ సాధారణమే. కష్టించి పని చేస్తే తప్ప ఆకలి తీర్చుకోలేని వర్గంలో ఉండే అసమానతలు, బలహీనతలు అన్నీ ఉన్న మనుషులు వారు. కాని తమ జీవితాలను మెరుగు పరుచుకోవడానికి తమకు తోచిన పద్ధతిలో ఆలోచిస్తారు. సగీనా నాయకత్వం గురించి కలకత్తాలోని కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఒక వర్గానికి కబురు అందుతుంది. అతన్ని తమలో చేర్చుకుని కొంత రాజకీయ అవగాహన, పరిజ్ఞానం అందిస్తే అతను ఒక ఉద్యమ నాయకుడు కాగలడని, ప్రజలలో ముఖ్యంగా శ్రామికులలో అతనికున్న పేరు, నమ్మకం అతని ద్వారా తమ పార్టీ సిద్ధాంతాలు, ఉద్దేశాలు సమగ్రంగా ఎదగడానికి ఉపయోగపడతాయని తలచి పార్టీ పెద్ద సగీనా వద్దకు ఆమోల్ అనే ఒక కార్యకర్తను పంపిస్తాడు. ఈ కార్యకర్త సగీనాతో ఉంటూనే ఉద్యమ అవసరం, ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి అధికార పక్షంపై పోరాటాన్ని ఎలా వ్యూహాత్మకంగా రూపొందించాలి, అనే విషయాలపై అవగాహన కల్పిస్తాడు.

ఫాక్టరీలో ఒక స్త్రీపై అత్యాచార యత్నం చేసిన అధికారి సస్పెండ్ అయ్యే దాకా సగీనా నేతృత్వంలో కార్మికులు సమ్మె చేస్తారు. వారు అడిగిన వాటికి ఒప్పుకోక తప్పదు యాజమాన్యానికి. సగీనాకి కార్మికులలో ఉన్న పేరు చూసి అనిరుద్ధ్ అనే మరో నేత అతన్ని తన పక్షం బలోపేతం చెసుకోవడానికి ఉపయోగించుకోవాలను కుంటాడు. ఒక పక్క కార్మిక పక్షపాతిగా కనిపిస్తూనే ఫాక్టరీ యాజమాన్యంతో కుమ్ముక్కు అయి సగీనా పరపతి కార్మికుల మధ్య తగ్గించడానికి అతన్ని లేబర్ యూనియన్ ఆఫీసర్‌గా ప్రకటించి మంచి జీతంతో, విలాసవంతమైన భవంతి లోకి సగీనాను చేరుస్తాడు అనిరుద్ధ్. సగీనాని తెలివిగా తప్పిస్తున్నారని పార్టీ పెద్దకు అర్థం అయినా అనిరుద్ధ్ రాజకీయం ముందు అతనేం చేయలేకపోతాడు. మరో మహిళా కార్యకర్త విశాఖ సగీనాకు సెక్రెటరీగా ఉంటుంది. అతనికి రాజకీయంగా ఎదగడానికి కావల్సినవి నేర్పిస్తూ ఉంటుంది. మెల్లిగా ఫాక్టరీ నుండి కలకత్తా చేరుస్తారు సగీనాని. కలకత్తా చేరిన సగీనాకు తను ఉండవలసిన చోట లేనని అర్థం అవుతుంది. మూడు నెలల తరువాత తిరిగి ఫాక్టరీకి వచ్చిన అతనికి మారిన ఊరు కనిపిస్తుంది.

సగీనా ఫాక్టరీలో లేకపోవడంతో నాయకుడు లేని కార్మిక దళాన్ని ఫాక్టరీ యాజమాన్యం రక రకాల పద్ధతిలో హింసిస్తుంది. వారంతా సగీనా తమను మోసం చేసాడని, ఒంటరిని చేసాడని నమ్ముతారు. భయంతో అధికారులకు లొంగి జీవిస్తుంటారు. ఫాక్టరీ వ్యవహారాలలో జోక్యం చేసుకోనని సగీనాతో సంతకం పెట్టించుకునే ప్రయత్నంలో అనిరుద్ధ్ ఉంటాడు. సగీనాకు అనిరుద్ధ్ ఆడిన ఎత్తుగడ అర్థం అవుతుంది. తనపై చేయి చేసుకున్న తోటి కార్మికుల మధ్యనే మళ్ళీ వచ్చి చేరతాడు. అయితే అతన్ని నాయకుడిగా తయారు చేసిన పార్టీకి అతను అన్యాయం చేసాడనే నెపంతో ప్రజా కోర్టు నిర్వహించి అతనికి మరణ శిక్ష విధించాలని అనిరుద్ధ్ వ్యూహం పన్నుతాడు. పార్టీ సిద్ధాంతాల కోసం తమ జీవితాలను పణంగా పెట్టిన ఆమోల్, విశాఖ ఉద్యమంలోని రాజకీయాలు అనిరుద్ధ్ లాంటి వారి స్వార్ధానికి ఎలా ఉపయోగపడ్డాయో తెలుసుకుని అనిరుద్ధ్‌కి ఎదురు తిరుగుతారు. అసలైన పోరాటం ప్రజల మధ్య సగీనా లాంటి వ్యక్తులే నిర్వహించాలని, ప్రజలని వదిలి అధికారులుగా మారితే ఏ ఉద్యమం అయినా రాజకీయం అయి తీరుతుందని, ఆనాటి కమ్యూనిస్టు నాయకులు చేసిన తప్పిదం ఇదే అని ప్రత్యక్షంగా చెప్పిన చిత్రం ఇది.

బెంగాలీ భాషలో తీసిన ఈ సినిమా ఇతివృత్తం బెంగాలీ ప్రజలకు బాగా చేరగలిగింది. కారణం బెంగాల్ నేపథ్యానికి, బెంగాల్ లోని ఉద్యమ చరిత్రకు, కార్మిక పోరాటాలకి దగ్గరగా ఉన్న కథా వస్తువు ఇది. కాని హిందీలో వచ్చేసరికి ఆ నేపథ్యాన్ని ప్రజల వద్ధకు తీసుకు రాలేకపోయారు తపన్ సిన్హా. అప్పటి బెంగాల్ ప్రజానికం ఎం ఎన్. రాయ్ చర్చించే రాడికల్ హ్యూమనిజం అనే ఆలోచనను విని విశ్లేషిస్తున్న సమయం అది. ప్రజాతంత్ర వ్యవస్థలో లోపాలు, కమ్యునిజంలోని లోపాలను విస్తృతంగా అధ్యయనం చేసిన ఎమ్.ఎన్. రాయ్ రీజన్, రోమాంటిసిజం, రెవల్యూషన్ కలిపి వచ్చే మార్పు దిశగా ఉద్యమాలు ఉండాలని ప్రతిపాదించారు. ఈ సినిమాలో ఒక పక్క ఆంగ్లేయుల అణిచివేతపై పోరాటం, ప్రజాతంత్రంలోని స్వార్థాన్ని ఎదుర్కుంటూ, కమ్యూనిజం మనిషిపై చూపే అధికారాన్ని విమర్శిస్తూ సగీనా మహతో లాంటి ఉద్యమకారుడు ఈ మార్గాలనన్నిటీని వీడి ప్రజలతో ఉంటూ రాజకీయం చేయలేని ఉద్యమాల దిశగా పని చేయాలని నిర్ణయించుకోవడాన్ని తపన్ సిన్హా చూపిస్తారు. ‘సగీనా మహతో’లో అనిరుద్ధ్ పాత్ర నిడివి ఎక్కువ ఉంచి కమ్యూనిజం చాటున నియంతలుగా మారుతున్న నాయకులను తపన్ సిన్హా చూపించే ప్రయత్నం చేసారు. ఈ ప్రయత్నం హిందీ సినిమాలో అంత స్పష్టంగా రాకపోవడం, కొన్ని అనవసరమైన పాటలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన సగీనా పాత్ర మనకు అర్థం కాదు. ఈ తప్పు జరగకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా ఒక రాజకీయ పరిజ్ఞానంతో తీసిన సినిమాను హిందీ ప్రజలు చూడగలిగి ఉండేవారు.

అంతే కాకుండా బెంగాలీ సినిమాలో దిలీప్ కుమార్ నటన చాలా బాలెన్స్‌డ్‌గా ఉంటుంది. చదువురాని ఒక అమాయకుడు, వ్యసనాల మద్య మంచితనాన్ని నిలుపుకునే ఒక సామాన్యుడు తన హక్కుల కోసం మొండిగా పోరాడే జనం మెచ్చిన నాయకుడిగా అతని నటన చాలా బావుంటుంది. తన మార్గాన్నిఎంచుకుని తానేం చేయాలో అర్థం చేసుకునే ప్రయత్నంలో చాలా సార్లు రాజకీయంతో తన ఆలోచనలు కలవక ఒక అయోమయంలో మునిగిపోయి తన దారి వెతుక్కునే ఒక బాటసారి కనిపిస్తాడు ఆ పాత్రలో. ముఖ్యంగా జనం నుండి వేరు చేయబడినప్పుడు నీటీ నుండి వేరైన చేపగా అతను తపించిపోవడం, జనంతో మళ్ళీ కలవడానికి అతను ఆత్రపడడం, ఇలాంటీ సీన్లలో దిలీప్ నటన బావుంటుంది. కాని హిందీ సినిమాలో దిలీప్ సాబ్ నటనలో ఒక టెన్షన్ చూస్తాం. అప్పటికే దిలీప్ కుమార్ ప్రభ హిందీలో అంతరించి పోతుంది. దాన్ని ఈ సినిమాతో నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్న అసహాయ మధ్య వయసు నటుడుగా దిలీప్ కుమార్ కనిపిస్తారు తప్ప ‘సగీనా’గా ఆ సినిమాలో కనిపించక లేకపోవడం కూడా హిందీ సినిమా ప్లాప్‌కు కారణం. బెంగాలీలో ఆ పాత్ర చేస్తున్నప్పుడు దిలీప్ కుమార్‌లో ఉన్న ఈజ్ హిందీ వర్షన్‌లో కనిపించదు. ఇది కూడా సినిమా హిందీలో ఫ్లాప్ అవడానికి కారణం కావచ్చు.

‘సగీనా మహతో’ సినిమాలో బెంగాలీ సంగీతం ఆ ప్రాంతపు సాంప్రదాయ జానపద బాణీలో సినిమా అంతా ఉంటుంది. హిందీలో పాటలకు కమర్షియల్ పోకడలు తగిలించారు. అవి పాత్ర గాంభీర్యాన్ని తగ్గించాయి. అందుకే సగీనా మహతోను చూసిన తరువాత హిందీ సగీనా మనకు నచ్చదు. అందులో దిలీప్ కుమార్ అసలు నచ్చరు.

‘సగీనా మహతో’ ఏడవ మాస్కో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌కు ఎన్నికయిన సినిమా. దీనికి చాలా అవార్డులు వచ్చాయి. ఇప్పటికి రాజకీయ నేపథ్యంతో వచ్చిన చారిత్రిక సినిమాగా దీనికి భారతీయ సినిమాలో గౌరవనీయమైన స్థానం ఉంది. ఈ సినిమాకు సంగీతం అందించింది అనూప్ ఘోషాల్. సంగీతకారుడిగానే కాక రాజకీయాలలో క్రియాశీలక పాత్ర వహించిన అనూప్ ‘సగీనా మహతో’కి బెంగాల్ ప్రాంతపు జానపద బాణీలో కూర్చిన పాటలు ఈ ఇతివృత్తానికి సరిగ్గా సరిపోతాయి. ఘోర్ కిషోర్ ఘోశ్ రాసిన కథ ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. బెంగాలీ సినిమాను సబ్ టైటిల్స్‌తో చూస్తున్నప్పుడు దిలీప్ కుమార్, సైరా బాను ఇద్దరు కూడా మధ్యలో హిందీలో సంభాషణలు పలకడం గమనిస్తాం. భాషాపరంగా చాలా నిక్కచ్చిగా ఉండే దిలీప్ కుమార్ హిందీ వాక్యాలతో బెంగాలీ పలకడం, అప్పట్లో సిలిగురిలో మాట్లాడే భాషను పోలి ఉండడానికి కావచ్చు అనిపించింది. మిగతా పాత్రలలో అనిల్ చటర్జీ, స్వరూప్ దత్తాలు కనిపిస్తారు. విశాఖ పాత్రలో నటించిన సుమితా సన్యాల్ హిందీలో కూడా కొన్ని మంచి చిత్రాలలో సహాయ నటిగా నటించారు. ఆనంద్ సినిమాలో అమితాబ్ సరసన నటించారు ఆవిడ. ఈ పాత్రనే హిందీలో అపర్నా సేన్ చేసారు. కాని అపర్నా సేన్ కన్నా కూడా ఆ పాత్రకు సుమితా సన్యాల్ పూర్తి న్యాయం చేసారని చెప్పవచ్చు. ‘సగీనా మహతో’ దిలీప్ కుమార్ నటనకు మరో ఉదాహరణగా చెప్పవచ్చు. ఇతివృత్తం అర్థం కాని అయోమయంలో ప్రేక్షకులు ఉండడంతో సినిమా నచ్చకపోవడం తప్ప, బెంగాల్ ఉద్యమ నేపథ్యంతో కొద్దిగానన్నా పరిచయం ఉన్నా, చత్తీస్‌ఘుర్, తెలంగాణలోని నక్సలైట్ ఉద్యమ నేపథ్యం గురించి తెలిసి ఉన్నా ఈ సినిమా ఇతివృత్తం ఆ ప్రేక్షకులను ఆలోచనలలో పడేస్తుంది. హిందీలో ఇదే చిత్రం నిరాశ పరిచినా బెంగాలీ చిత్రం మాత్రం, ఒక గొప్ప సినిమాగానే నిలిచిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here