[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం దిలీప్ కుమార్ నటించిన ‘ముఘల్-ఏ-ఆజం’ సినిమాని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]
భారతీయ సినిమాలో ఒక అద్భుత కావ్యం ముఘల్-ఏ-ఆజం
[dropcap]ము[/dropcap]ఘల్-ఏ-ఆజం 1960లో వచ్చిన సినిమా. ఈ సినిమా గురించి చాలా మంది సినీ విశ్లేషకులు ఎంతో చెప్పారు. ముఘల్-ఏ-ఆజం గురించి పుస్తకాలే వచ్చాయి. ఎంతో సినీ చారిత్రిక నేపథ్యం ఉన్న ఈ సినిమా దిలీప్ కుమార్‌ని భారతీయ సినీ ప్రపంచంలో చిరంజీవిగా నిలిపింది. ఇప్పటి తరం ఈ సినిమా చూడకపోయినా దీని గురించి ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. ముఘల్-ఏ-ఆజం గురించి చెప్పుకోవడం అంటే ఆనాటి సినీ దిగ్గజాలను ఒకసారి స్మరించుకోవడం.
దిలీప్ కుమార్ అసలు పేరు యూసఫ్ ఖాన్ అన్నది అందరికీ తెలుసు. నేటి పాకిస్తాన్ ప్రాంతంలో పుట్టిన ముస్లిం ఆయన. అయితే ఆయన నటించిన అరవై ఒక్క సినిమాలలో కూడా అయన వేసిన పాత్రలన్నీ హిందూ పాత్రలే. ఒక్క ముఘల్-ఏ-ఆజంలో మాత్రమే సలీంగా, ఒక ముస్లిం యువకుడిగా ఆయన కనిపిస్తారు. ఈ సినిమాలో ఆయన ముస్లీం పాత్ర వేసినా అతని తల్లి జోధాబాయి హిందూ. అంటే ముఘల్-ఎ ఆజం లోనూ ఆయబ సగం హిందూ పాత్రనే. ఈ సంగతిని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవలసిన అవసరం ఇప్పటి పరిస్థితులలో ఉంది. ఒక ముస్లిం యువకుడు హిందూ పాత్రలను చేస్తూ ఆ పాత్రలకు అనుగుణంగా భాషను, ఆహార్యాన్ని మార్చుకుని, గుడిలో భక్తునిగా నటించిన సన్నివేశాలు, భజనలు పాడుతూ చేసిన సినిమాలతో కోట్ల మందికి చేరువయ్యారు. అప్పటి విభజనానంతర పరిస్థితులలో కూడా కళకు, మతానికి సంబంధం లేదని నిరూపించి, జీవించిన వారిలో ఆయన ఒకరు. దిలీప్ కుమార్ తన జీవితంలో చేసిన ఒకే ఒక ముస్లిం పాత్ర సలీం. ఈ పాత్ర కూడా అతనికి అనుకోకుండా వచ్చిందే.
అసలు ముఘల్-ఏ-ఆజంకు ఆధారం ప్రఖ్యాత ఉర్దూ రచయిత ఇంతియాజ్ అలీ తాజ్ రాసిన అనార్కలి అనే నాటకం. 1922లో తాజ్ రాసిన ఈ నాటకాన్ని అర్దేషర్ ఇరానీ ఒక మూకీ సినిమాగా 1928లో తీసారు. మళ్ళీ ఆయనే సౌండ్ చేర్చి 1935లో అనార్కలీని రెండోసారి సినిమాగా తీసారు. 1946లోనే ఈ సినిమాను మళ్ళీ తన పద్ధతిలో తీయాలని కే.ఆసిఫ్ అనుకున్నారు. అమానుల్లా ఖాన్, వాజాహత్ మిర్జా, కమల్ అమ్రోహి, ఎహ్సాన్ రిజ్వీలతో సంభాషణలు రాయించడం కూడా మొదలెట్టారు. చంద్రమోహన్‌ను అక్బర్‌గా, సప్రును సలీంగా, నర్గిస్‌ను అనార్కలిగా అనుకున్నారు కూడా. కాని కొన్ని కారణాల వలన సినిమా మధ్యలో ఆగిపోయింది. భారత దేశ స్వాతంత్ర్యం, దేశ విభజన తరువాత పరిస్థితులు అనుకూలంగా లేనందువలన ఈ సినిమా నిలిచిపోయింది. చంద్రమోహన్ హార్ట్ ఎటాక్‌తో చనిపోవడం, సినిమాకు సంబంధించిన ఫైనాన్సర్లు పాకిస్తాన్ వెళ్ళిపోవడం వలన కూడా సినిమాను పునః ప్రారంభించడం కుదరలేదు. ఈ లోపున నందలాల్ జస్వంత్ లాల్, ప్రదీప్ కుమార్, బీనారాయ్‌లతో 1953లో “అనార్కలి” అనే సినిమా తీసారు. ఆ సినిమాను ఆధారం చేసుకుని వేదాంతం రాఘవయ్య గారు తెలుగులో 1955లో ఎస్వీ రంగారావు అక్బర్‌గా, అంజలీ దేవి అనార్కలిగా, ఏ.ఎన్.ఆర్. సలీంగా “అనార్కలి”ని తీసారు. ఆదినారాయణరావు గారు నిర్మించిన ఈ సినిమా తమిళంలో కూడా డబ్ అయి విజయం సాధించింది. ఈ సినిమాకు తెలుగులో సీనియర్ సముద్రాల గారు మాటలు అందించారు.
1960లో ఈ సినిమా మళ్ళీ తీయాలని సంకల్పించినప్పుడు దిలీప్ కుమార్‌ను సలీంగా తీసుకోవడానికి కే.ఆసీఫ్ ముందు అంగీకరించలేదు. ఇక అనార్కలిగా సురయ్యాని అనుకున్నారట. కాని చివరకు సినిమా ప్రొడ్యూసరు షపూర్జీ పలోన్జీ కోరిక మీద దిలీప్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. తరువాత మధుబాలను అనార్కలిగా అనుకోవడం జరిగింది. ఇక అక్బర్ పాత్రకు ఏకగ్రీవంగా పృథ్వీరాజ్ కపూర్‌ను అనుకోవడం జరిగింది. ముఘల్-ఏ-ఆజం తీయడానికి చాలా డబ్బుతో పాటు ఎందరి సమయమో ఖర్చయింది అని సినీ విశ్లేషకులు చాలా సందర్భాలలో చెప్పారు. ఈ సినిమా ప్రీమియర్, టిక్కెట్లు అన్నీ కూడా సంచలనాలే. భారతదేశం గర్వించదగ్గ సినిమాగా ఎప్పటికీ ప్రజల మనసులో నిలిచి ఉండే ముఘల్-ఏ-ఆజం గురించి హిందీ తెలియని తెలుగువారికి చెప్పాలంటే, తెలుగు వారికి “మాయా బజార్” ఎలాగో హిందీ సినీ ప్రేక్షకులకు “ముఘల్-ఏ-ఆజం” అలా అని ఒక్క వాక్యంలో చెప్పవచ్చు. ఈ రెండు సినిమాలకు చాలా పోలికలున్నాయి. ఒక అందమైన కళారూపానికి కావలసిన అన్ని వనరులను పుష్కలంగా నింపి కలిపి కూర్చిన కళాధనం ఈ రెండు సినిమాలు. వీటిలో ప్రతి ఫ్రేమ్, ప్రతి వాక్యం, ప్రతి సీన్ ప్రేక్షకులకు అమృత గుళికలే.
అనార్కలి అన్న వ్యక్తి చరిత్రలో ఉంది అని అంటారు. అయితే ఈ ప్రేమ కథలో ఎంత నిజం ఉందో మాత్రం తెలీదు. జహంగీర్ (సలీం) రాసిన ఆత్మకథలో అనార్కలి ప్రస్తావన అసలు రాదు. అక్బర్ సమయంలో వచ్చిన సాహిత్యంలో ఎక్కడా అనార్కలి ప్రస్తావన రాదు. అయితే అనార్కలి బాజార్ అని ఒక మార్కెట్టు లాహోర్‌లో ఈ రోజుకీ ఉండడం, ఆమె సమాధి లాహోర్‌లో ఉండడం వలన అనార్కలి అన్నవ్యక్తి ఈ భూమిపై జీవించిందని చెప్పవచ్చు. 1615లో అక్బర్ మరణం తరువాత జహంగీర్ అనార్కలి సమాధిపై పాలరాయితో ఒక చప్టా నిర్మించాడని ఒక చరిత్ర పుస్తకంలో ఉంది అని చెబుతారు. విలియం ఫిన్చ్ అనే ఒక బ్రిటీష్ వ్యాపారి లాహోర్‌లో వ్యాపార నిమిత్తం అనార్కలి కథ నడిచిన సమయంలో అంటే 1608 – 1611 మధ్య గడిపారట. అతను రాసుకున్న కథ ప్రకారం అనార్కలి అక్బర్ భార్య అని, అక్బర్‌తో ఆమెకు డానియల్ షాహ్ అనే ఒక కుమారుడు కూడా ఉన్నాడని, అనార్కలికి తన కొడుకు సలీం మధ్య అక్రమ సంబంధం ఉందని అక్బర్ అనుమానించాడని అందుకే ఆమెను లాహోర్ కోటలో గోడలో జీవ సమాధి చేసాడని చెప్తాడు. అందుకే ముఘల్-ఏ-ఆజం కథకు చారిత్రిక వాస్తవాలకు పోలిక లేదు. అంతకు ముందు తీసిన అనార్కలి సినిమాలలో అక్బర్ ఆమెను జీవ సమాధి చేయించడం కనిపిస్తుంది. అయితే ముఘల్-ఏ-ఆజంలో ఆక్బర్ ఆమెను క్షమించి దేశం నుండి పారిపోయే అవకాశం కల్పించినట్లు కే.ఆసీఫ్ చూపిస్తారు. అలాగే సలీం పద్దెనిమిది సంవత్సరాల నుండే మత్తులో మునిగి తేలుతూ ఉండేవాడని, పరమ క్రూరుడని, తండ్రితో యుద్ధం చేసి తండ్రి ఆప్తమిత్రుడిని కూడా హత్య చేసాడని చరిత్రలో కొన్నిచోట్ల ఉన్నా ఈ సినిమాలో మాత్రం, సలీం అవన్నీ అనార్కలి కోసం చేసాడని చూపిస్తారు దర్శకులు. దీనికి కూడా చారిత్రిక ప్రమాణాలు లేవు. ఇన్ని చారిత్రిక అవాస్తవాల కారణంగా ముఘల్-ఏ-ఆజంను చారిత్రిక సినిమాగా ఎప్పుడు ఎవరూ పరిగణించలేదు.
అచ్చంగా తెలుగు సినిమా మాయాబజార్‌పై కూడా ఇలాంటి చర్చే జరుగుతుంది. శశిరేఖ అన్న కూతురు బలరామునికి ఉన్నట్లు ఎక్కడా ప్రస్తావన లేదు. వ్యాసభారతంలో మాయా బజార్ ప్రస్తావనే రాదు. కవిత్రయ భారతంలో కూడా ఈ కథ కనిపించదు. అయినా మాయాబజార్ సినిమా “శశిరేఖా పరిణయం” అనే ఇతివృత్తంతో రూపొంది, తెలుగు వారికి గర్వ కారణం అయింది. ముఘల్-ఏ-ఆజంకి, మాయా బజార్‌కీ ఇలా ఎన్నో పోలికలు తెలుగువారమయిన మనం చూడవచ్చు.
ఒక అందమైన కళారూపానికి కావలసింది ఏంటీ? అద్భుతమైన చిత్రీకరణ, ఆత్మలను సృశించగలిగే సంగీతం, సాధారణ జన జీవితానికి దూరంగా కలల ప్రపంచంలో విహరింపజేయగల ఊహాశక్తిని ప్రేరేపించగల కథనం, మనసులోని భావాలని అందమైన పదాలుగా మార్చగల అద్భుతమైన సాహిత్యం, ఇక అందమైన, ధీరోదాత్తతకు ప్రతీకలుగా నిలిచిపోయే పాత్రలు, ఇవన్నీ మన మనసులో నిత్యం జనించే కోరికలకు ప్రతిరూపాలుగా కనిపించగలగాలి. అప్పుడే కదా అది దృశ్య కావ్యం అవుతుంది. ఇవన్నీ ముఘల్-ఏ-ఆజంలో చూస్తాం.
ఒక ప్రేమికుడు ప్రేమికురాలికి తన మనసుని పదాల రూపంలో పంపిస్తాడు. రాజే వలచి వచ్చినాడని తెలిసి తన సాధారణ స్థితికి భయపడి ఆమె అతన్ని నిరాకరిస్తూ ఒక ఉత్తరం రాస్తుంది. కాని ఆ ఉత్తరాన్ని ఒక తామర మొగ్గలో పెట్టి నీళ్ళల్లో ప్రేమికుడు ఉన్న దిశగా వదిలిపెడుతుంది. ఈమెయిల్, వాట్సప్ లలో అన్నీ నిర్ణయాలయిపోతున్న ఈ తరానికి ఇలాంటి రొమాంటిజమ్ అర్థం కాదేమో కాని, అది వాస్తవం కాకపోయినా చాలా అందమైన భావనగా మాత్రం మిగిలిపోతుంది చూస్తున్న వారి మనసులలో. ప్రేమికుల మధ్య హంస వారధి అయినా, మేఘాలతో సందేశాలు చెప్పుకున్నా ఆ భావాలలో ఉన్న విస్తృతత, కల్పన, అందం ఆ ప్రేమ స్థాయిని పెంచుతాయి. ఇది సాధ్యమా అన్న ప్రశ్న అక్కడ రాదు. సాధ్యమేమో అన్న అనుభూతిలో నెట్టివేయబడతాడు ప్రేక్షకుడు. అప్పుడు సలీం అనార్కలిల ప్రేమ కథ ఇద్దరు స్త్రీ పురుషులు తమ కలయిక కోసం తపిస్తున్న సాధారణ కథలా అనిపించదు. అద్భుతమైన సమాగమానికి ఆ సందేశాలు నాంది అనిపిస్తాయి. ఇటువంటి పొయెటిక్ చిత్రీకరణ సినిమా ముఘల్-ఏ-ఆజం అంతా కూడా చూస్తాం.
సలీం అనార్కలిలు కలిసి సమయం గడుపుతున్న దృశ్యాలలో వెనుక ఉస్తాద్ బడే ఘులాం అలీ ఖాన్ గారి రాగాలాపన, తెరపై దిలీప్ కుమార్, మధుబాలల ప్రేమ సన్నివేశాలు కనిపించినప్పుడు, ఇది భారతీయ సినీ గీతాల చిత్రీకరణలోనే ఒక అద్భుతమైన చిత్రీకరణ అని ఒప్పుకుంటాం. ఠుమ్రీ అనే బాణిలో ప్రఖ్యాతి గాంచిన బడే ఘులాం అలీ ఖాన్ గారిని ఈ పాట కోసం ప్రత్యేకంగా పిలిపించారు కే.ఆసీఫ్. సినిమాలకు అస్సలు పాడనని భీష్మీంచుకుని కూర్చున్న అయన్ని ఆసిఫ్ ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి మీ విద్వత్తుని కొలిచే ధనం నా దగ్గర లేదు అనే మాటతో తన సినిమాలో పాడడానికి ఒప్పించారట. క్లాసికల్ సంగీతం గురించి ఏ మాత్రం అవగాహన లేని వారికి కూడా ఆనందానుభూతులను పంచే ఈ పాట చిత్రీకరణ ప్రస్తుత తరం చూసి తీరవలసిన సీన్. ఒక పక్షి ఈకతో సున్నితంగా అనార్కలిని తాకుతూ దిలీప్ కుమార్ పలికించే భావాల గురించి చెప్పడానికి భాష సరిపోదు. అంత కన్నా గొప్ప ప్రేమ గీతం భారతీయ సినీ జగత్తులో మరొకటి లేదు, రాదు కూడా. ఈ పాటలో నటించిన దిలీప్ కుమార్, మధుబాలల గురించి ఇక్కడ తప్పకుండా చెప్పుకోవాలి. ఈ సినిమాకు ముందు వారిద్దరూ ప్రేమికులుగా ఏడు సంవత్సారాలు చెలామణి అయ్యారు. నయా దౌర్ సినిమాకి సంబంధించిన కోర్టు కేసులో, జీవించి ఉన్నంత కాలం తాను మధుబాలను ప్రేమిస్తూనే ఉంటానని దిలీప్ కుమార్ జడ్జి ముందే చెప్పారట. అయితే కొన్ని కారణాల వలన, ఈ సినిమా అప్పటికి వారిద్దరూ విడిపోయారు. ఇద్దరి మధ్య మాటలు లేవు. కాని ఈ ప్రేమ సన్నివేశాన్ని వాళ్ళిద్దరూ కలిసి పండించిన విధానాన్ని గమనిస్తే నటనకు ఆ ఇద్దరు ఆర్టిస్టులు ఇచ్చిన ప్రాధాన్యత తెలుస్తుంది.
ఒక సినిమాలో జంటగా నటించే ఆర్టిస్టుల మధ్య కెమిస్ట్రీ కోసం వారిద్దరిని కలిసి జీవించమనే హాలీవుడ్ సంస్కృతిని ఆచరించడం తప్పదనే భావనతో కొందరు ఆర్టిస్టులు ఉండడం చూస్తున్నప్పుడు, వారిచ్చే ఇంటర్వ్యూలు వింటూన్నప్పుడు ఈ సీన్ ముఘల్-ఏ-ఆజం ప్రేక్షకులకు గుర్తుకు వస్తూనే ఉంటుంది. ఇంతకు మించిన రొమాంటిక్ సీన్ మరొకటి వెతికినా భారతీయ సినిమాలో దొరకదు. లిప్ లాక్కులతో పోస్టర్లు తయారు చేయించి సినిమాకు పబ్లిసిటీ ఇచ్చుకోవచ్చేమో కాని ఈ పోయెటిక్ ఎసెన్స్‌ను చిత్రీకరించడానికి కావలసిన రస హృదయాలు మళ్ళీ జన్మించాలంటే, సంగీత, సాహిత్య, దృశ్య కళలను ఒక ఉన్నమైన ఉదాత్తమమైన స్థాయిలో ఆస్వాదించే శక్తి ఉన్న మనుష్యులు కావాలి. వారు ఇప్పటి ఆధునిక జీవనంలో దొరకడం కష్టం. అందుకే అంత గొప్ప ప్రేమ గీతాలను చిత్రీకరించటం ఇప్పుడు సాధ్యపడట్లేదు.
మహమ్మద్ రఫీ లాంటి గాయకులు పాటకు ఐదు వందలు తీసుకుంటున్న సమయంలో బడే ఘులాం అలీ ఖాన్‌కు ఈ పాటకు పాతిక వేలు లభించాయి. ముఘల్-ఏ-ఆజంలో వీరివి రెండు పాటలుంటాయి. ఒకటి పైన చెప్పుకున్న – ప్రేమ్ జోగన్ బన్ కే, అయితే మరొకటి “శుభ్ దిన్ ఆయో” అనే పాట. ఇవి రెండు కూడ బ్యాక్‌గ్రౌండ్ గీతాలే. సినిమాలో తాన్‌సేన్ పాడుతూ ఉంటే ఆ నేపథ్యంలో నటులు కనిపిస్తారు. “శుభ్ దిన్ ఆయో రే” అనే పాట పూర్తిగా రెండు నిముషాలు కూడా ఉండదు. ఈ పాటను సలీం కొన్ని ఏళ్ళ తరువాత నగరానికి వచ్చినప్పుడు రాజమందిరంలో ఆనందాన్ని చూపించడానికి చిత్రీకరించారు కే.ఆసీఫ్. బడే గులాం అలీ ఖాన్ తరువాత ఏ సినిమాకీ పాడలేదు. ఆయన పాటలు చిత్రీకరించబడిన ఒకే ఒక హీరో దిలీప్ కుమార్ మాత్రమే.
ఈ గాన గంధర్వుడు తన చివరి రోజులు హైదరాబాద్‌లో గడిపారు. నేటి పాకిస్తాన్ లోని కాసుర్‌లో జన్మించిన ఆయనను ఇరవైవ శతాబ్దపు తాన్‌సేన్ అని సంగీతాభిమానులు పిలుచుకునేవారు. 1968లో హైదరాబాద్ లోని బషీర్భాగ్ పాలెస్‌లో వీరు మరణించారు. దైరా మీర్ మోమొన్ అనే హైదరాబాదు సూఫీ సాధువుల శ్మశాన వాటికలో వీరిని ఖననం చేసారు. వీరి జ్ఞాపకార్థం హైదరాబాద్, బషీర్ బాగ్ లోని ముఖ్య వీధిని బడే గులామ్ అలీఖాన్ మార్గ్ అని ఈ రోజుకీ పిలుస్తారు. వీరి సంగీతాన్ని అభిమానించని సంగీత తరం లేదు. 2006లో కూడా ‘ఢిల్లీ 6’ అనే సినిమాలో “భోర్ భయే” అనే వీరి కంపోజిషన్‌నే శ్రేయా ఘోషల్, ఏ.ఆర్. రెహ్మాన్‌తో కలిసి పాడారు. ఇక మన ఘంటశాల గారికి ఉస్తాద్ బడే ఘులాం అలీ ఖాన్ గారు అంటే ప్రాణం, వీరిని రెండు నెలలు తన ఇంట్లో పెట్టుకుని వీరి సంగీత సాధనాన్ని స్వయంగా వీక్షించి వారి వద్ద హిందుస్తానీ వెళుకువలు నేర్చుకున్నారు ఘంటశాల గారు. ఈ శిష్యరికం తరువాతే వారు సంగీత దర్శకత్వం వహించిన సినిమాలలో హిందుస్తానీ బాణీలు కనిపిస్తాయి.
ఘంటశాల గారు పూర్తి శాకాహారి అయితే బడే ఘులాం అలీ ఖాన్ గారికి మాంసం లేనిదే ముద్ద దిగదు. అది తెలిసి ఘంటశాల గారు వీరికి తన ఇంటి పైన ప్రత్యేకమైన బస ఏర్పాటు చేసి వారి కోసం ఒక వంటవాణ్ణి నియమించి మాంసాహారాన్ని వండించి వారికి సేవ చేసుకున్నారు ఆ రెండు నెలలు. అంతటి అభిమానాన్ని అంత మంది వద్ద చూరగొన్న బడే ఘులాం అలీ ఖాన్ గారు పాడిన ఒకే ఒక సినిమా “ముఘల్-ఏ-ఆజం”.
ఇక ఈ సినిమాకు నౌషాద్ ఇచ్చిన సంగీతం గురించి చెప్పుకోవాలి. నౌషాద్ పాటలు వినగానే, బ్లాక్ బస్టర్ ఫీలింగ్ ఇవ్వవు. అవి వినగా వినగా తేనె జుర్రుకుంటున్నట్లు పాతవవుతున్న కొద్దీ, అలవాటవుతున్న కొద్దీ మధురాతి మధురంగా వినిపిస్తాయి. నౌషాద్ సంగీతాన్ని ఆస్వాదించడం కూడా ఒక ప్రత్యేక అనుభవమే. ఈ సినిమాలో క్లాసికల్, ఫోక్ రెంటి కలయిక కనిపిస్తుంది. షకీల్ బధాయునీ రాసిన పాటలకు నౌషాద్ కూర్చిన రాగాలు, ఉత్తర భారత సాంప్రదాయానికి ప్రతీకలు. ముఖ్యంగా ముస్లిం హిందూ సాంప్రదాయ సమ్మేళనానికి ఉదాహరణలు. “మోరె పన్ ఘట్ మే” అన్న కృష్ణాష్టమి పాటను అక్బర్ దర్బారులో పాడడాన్ని ఊహించుకుంటే ఇంతకన్నా గొప్ప హిందూ ముస్లిం సాంప్రదాయపు కలయిక మరొకటీ సినిమాలలో కనిపించదు. “కంకరీ మోహె మారీ, గఘరియా ఫోడ్ డాలీ మోరె సాడీ అనాడి భిగోయ గయో రే” అన్న పదాలను ఉపయోగించిన షకీల్ బధాయుని మరో చోట ఒక ఖవ్వాలిలో వాడిన పూర్తి ఉర్దూ పదాలు చూడండి.
ఇద్దరు స్త్రీలు ఒకే పురుషుడ్ని ప్రేమిస్తాడు. అతనితో ప్రేమ సఫలం అయితే భారతదేశపు రారాణీగా తన నెత్తిన అలంకరింపబడే కిరీటాన్ని గురించి కలకు కంటుంది బహార్. మరో చోట అనార్కలి మాత్రం తనను తాను ఆ ప్రేమికుడిని ఎంతగా సమర్పించుకోవాలా అని ఆలోచిస్తుంది. ఆమెకు ప్రేమలో తాను నెరవేర్చాల్సిన ధర్మమే కనిపిస్తుంది తప్ప తనకు ఆ పురుషుని ద్వారా లభించే సుఖం గురించిన ఆలోచన ఉండదు. ఈ ఇద్దరు స్త్రీల ప్రేమను ఒక ఖవ్వాలి రూపంలో రాసారు షకీల్ బధాయునీ. ‘తెరె మెహఫిల్ మె కిస్మత్ ఆజ్మాకర్ హమ్ భీ దెఖేంగే, ఘడి భర్ కోనజదీక్ ఆకర్ హమ్ భీ దేఖేంగే’ అని ఒక స్త్రీ అంటుంది. ఆమెకి సలీం తన జీవితంలో వచ్చే ఒక కోణం మాత్రమే. దానికి బదులుగా “తెరె కదమో పె సర్ అప్నా ఝుకాకర్ హమ్ భీ దేఖేంగే” అంటుంది అనార్కలి. ఈమె దృష్టిలో ప్రేమ అంటే సంపూర్ణంగా తనను తాను మరొకరికి అర్పించుకోవడం. “గమే దిల్ సె జరా దామన్ బచాకర్ హమ్ భీ దేఖేంగే” అంటుంది బహార్. జీవితంలో ఆనందాన్ని అనుభవించడానికి ఆమెకు ప్రేమ కావాలి. అనార్కలి మాత్రం ‘అగర్ దిల్ ఘమ్ సె ఖాలీ హో తో జీనే కా మజా క్యా హై నాహో ఖూనే జిగర్ తో అష్క్ పీనే కా మజా క్యా హై, ముహబ్బత్ మే జరా ఆంసూ బహాకర్ హమ్ భీ దెఖేంగే” అంటుంది. కన్నీళ్ళతో నిండిన ప్రేమలో ఔనత్యాన్ని ఆస్వాదించడానికి ఆమె సిద్ధపడుతుంది. “ముహబ్బత్ కర్నే వాలో కా హై బస్ ఇత్నా హీ అఫ్సానా, తడప్నా చుప్కె చుప్కె ఆహే భర్నా ఘుట్కె మర్ జానా, కిసీ దిన్ యె తమాషా ముస్కురాకర్ హమ్ భీ దేఖేంగే” అంటుంది బహార్. ఆమె దృష్టిలో ప్రేమ ఒక తమాషా. ఒక ఆట అది ఆడు చూస్తాను అంటుంది. “ముహబ్బత్ హమ్నె మానా జిందగీ బర్బాద్ కర్తీ హై, యె క్యా కమ్ హై కి మర్ జానె పె దునియా యాద్ కర్తీ హై, కిసీకే ఇష్క్ మే దునియా లుటాకర్ హమ్ భీ దెఖేంగే” అంటుంది అనార్కలి. ప్రేమలో జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కూడా తాను సిద్ధమే అని ప్రకటిస్తుంది.
వీరిద్దరి మధ్య పోటీలో బహార్‌కి తన చేతిలోని పూవునిచ్చి అనార్కలికి ఆమె ఆలోచనలకు ముళ్ళే జీవితంలో దొరుకుతాయని గులాబీ కొమ్మకున్న ముళ్ళని కానుకగా ఇస్తాడు సలీం. ఇక్కడ అనార్కలిగా మధుబాల, బహార్‌గా నిగర్ సుల్తానాలతో వారి పాటలోని వాక్యాలను షాయిరీలుగా పలికుతూ వారికి ఈ బహుమతులు ఇస్తాడు సలీం పాత్రలో నటించిన దిలీప్ కుమార్. ఆ గేయంలోని వాక్యాలను కవితా రూపంలో దిలీప్ కుమార్ పలుకుతుంటే వినాలి. ఉర్దూ పదాలను అంత అందంగా ఎవరూ పలకలేరేమో అన్నంత గొప్పగా ఉంటుంది ఆ సీన్. లతా, శంషాద్ బేగంలు కలిసి పాడిన పాటలోని ఆ వాక్యాలను దిలీప్ కుమార్ గొంతులో పలుకగా వింటే ప్రతి కవితకు గానం అవసరం లేదేమో అనిపిస్తుంది. ఇక ముళ్ళు అందుకున్న అనార్కలిగా మధుబాల “కాంటో కో ముర్ఝానే కా ఖౌఫ్ నహీ హోతా” అని బదులిస్తున్నప్పుడు అందులోని భావం అర్థమయిన ప్రేక్షకులకు మధుబాల, దిలీప్ కుమార్ల మొహంలో వచ్చీ పోయే భావాలను ఆస్వాదించడం కన్నా మించిన మరో ఆనందం ఉండదు.
ఇక అక్బర్‌గా పృథ్వీరాజ్ కపూర్ గురించి చెప్పుకుంటూ పోతే సినిమాలో ప్రతి సీన్‌ని వివరించాలి. సలీం అనార్కలిలు చాటుమాటుగా కలుసుకుంటున్నారని తెలుసుకుని అక్బర్ వారిద్దరూ కలిసి ఉన్నప్పుడు వెళతాడు. రాజసంగా నడుచుకుంటూ వస్తున్న అతన్ని చూసి భయపడి పోతుంది అనార్కలి. పారిపోదాం అనుకుంటే ఎదురుగుండా వచ్చేది చక్రవర్తి, ఏం చేయాలో తెలియక సలీం వద్దకు వచ్చి అతన్ని అల్లుకుపోతుంది. అక్బర్‌లో ఒక తండ్రి కన్నా చక్రవర్తిని చూపించే ప్రయత్నం చేస్తాడు ఆసీఫ్ సినిమా అంతా కూడా. ఈ విషయాన్ని ప్రేక్షకులకు అర్థం చేయించడానికి ఈ ఒక్క సీన్ చక్కగా ఉపయోగపడుతుంది. ఆ వచ్చింది తన ప్రియుడి తండ్రి అయితే, ఆ నిమిషంలో అతను తన ప్రియుడి తండ్రి అన్నదే మర్చిపోయి అతని ముందే సలీంను అల్లుకుని పోయే అనార్కలి కళ్ళల్లో ఒక చక్రవర్తి నుండి తనను రక్షించమనే వేడుకోలు కన్పిస్తుంది. కొంత సేపటికి గాని తాను ఆ తండ్రి కొడుకునే కౌగలించుకున్నానని ఆమెకు అర్థం కాదు. ఈ సీన్‌లో దిలీప్ కుమార్ సన్నని నవ్వుతో తండ్రి వైపు చూసే చూపు బహుశా ఆ వయసు పిల్లలకు వన్స్ మోర్ అనిపించేలా ఉంటుంది. నటనలోనే చక్రవర్తి అయిన పృథ్వీరాజ్ కపూర్‌ని, దిలీప్ కుమార్ తప్ప మరొకరు ఎదుర్కోలేరేమో అన్నంత గొప్పగా వచ్చిన సీన్ అది. ఈ సీన్‌లో మాటలుండవు. కేవలం ఈ ముగ్గురు నటుల ఎక్స్‌ప్రెషన్‌లు మాత్రమే. అక్కడ మాటలు అవసరం అనిపించవు కూడా. అక్బర్ తిరిగి నడుచుకుంటూ హుందాగా బైటికి వెళ్ళిపోయే దాకా దిలీప్ కుమార్ వీపుపై నుండి, నడిచి వెళ్ళిపోతున్న పృథ్వీరాజ్ కపూర్‌పై షాట్‌ని కెమెరా చూపించే విధానం, అక్కడినుండి అక్బర్ వచ్చి అనార్ పువ్వును చేతితో నలిపే దాకా కెమెరా ప్రేక్షకులకు చాలా సంగతులు చెబుతుంది. ఇక అక్కడి నుండి నడుస్తుంది తండ్రీ కొడుకుల మధ్య యుద్దం. “ఏక్ బేరహమ్ షెహన్షా కీ కైద్ఖానే మే సలీం కీ అనార్కలి దం నహీ తోడేగీ” అంటూ సలీం తల్లి దగ్గర తన కోపాన్ని వెదజల్లడంతో ప్రేమ కథలో మరో కోణానికి వస్తారు ప్రేక్షకులు. ఆ ఇద్దరు తల్లి కొడుకుల వాగ్వివాదాన్ని నిశబ్దంగా వింటున్న అక్బర్ లోని ఆలోచనలు ప్రేక్షకులను తాకుతాయి.
నటులకు భాషపై సంపూర్ణమైన పట్టు ఉండాలి. ఏ పదాన్ని ఎలా పలకాలో వాళ్లకు అవగాహన ఉండాలి. ఈ సూత్రాన్ని ఇప్పటి తరంలో చాలా మంది నటులు మర్చిపోతున్నారు. దిలీప్ కుమార్‌లో ఉన్న పెద్ద ప్లస్ ఆయన డైలాగులు పలికే తీరు. ఇందులో ఆయనతో పాటు పృథ్వీరాజ్ కపూర్‌ని చూస్తూంటే వారిద్దరి మధ్య నడుస్తున్న సంభాషణలను వింటుంటే భాష, డైలాగులు ఆర్టిస్టుల నటనను ఎంతగా ఎలివేట్ చేస్తాయో ప్రతీ చోటా తెలుస్తుంది. అక్బర్ జైలులో పెట్టిన అనార్కలితో మాట్లాడుతున్న సంభాషణలు వింటే అధికారానికి ప్రజాస్వామ్యానికి జరుగుతున్న యుద్ధంలా అవి వినిపిస్తాయి తప్ప ఒక రాజు తన కొడుకు ప్రేమించిన సాధారణ స్త్రీతో మాట్లాడే సంభాషణలుగా మాత్రమే అవి మిగిలిపోవు. అందుకే ఈ సినిమా చూస్తున్నంత సేపు నియంతృత్వపు రాజరికంపై, ప్రజా పోరాట చిహ్నాలు కనిపిస్తాయి ఆ సంభాషణలలో. “అక్బర్ కా ఇన్సాఫ్ ఉస్కా హుక్మ్ హై” అంటూ తన అధికారాన్ని ప్రకటించుకునే చక్రవర్తి ఒక పక్క కనిపిస్తాడు, అక్కడే “తుఝే సలీం కో భూల్నా హోగా” అంటూ తన కొడుకుని మర్చిపొమ్మని, అతని భవిష్యత్తుకు అడ్డు రావద్దని అడిగే ఒక తండ్రి కనిపిస్తాడు, “ఔర్ ఇత్నా హీ నహీ ఉసే యె భీ యకీన్ దిలానా హోగా కి ఉస్సె తుజే కభీ భీ ముహబ్బత్ నహీ” అన్నప్పుడూ ఒక రాజకీయ చతురుడు కనిపిస్తాడు. ఒకటే డైలాగుని ఒకే టేక్‌లో ఈ మూడు భావాలతో పలికిస్తారు పృథ్వీరాజ్ కపూర్. ఈ సినిమాకు సంభాషణలు ఎంత మేధోమథనంతో రాయబడ్డాయో చెప్పడానికి ఈ సీన్‌ని స్టడీ చేయాలి. దానికి జవాబుగా “జొ జబాన్ ఉన్కీ మొహబ్బత్ కా ఇకరార్ హీ న కర్ సకీ థీ వొ ఇన్కార్ క్యా కరేగీ” అని బదులిచ్చే అనార్కలి లోని అమాయకత్వం మర్చిపోలేం. ఈ సినిమాలో జైలు సీన్లలో మధుబాలను బంధించిన ఇనుప గొలుసులు నిజమైనవి అని, వాటితో నిలబడి గంటలు షూటింగ్ చేయడం వలన అప్పటికే గుండె జబ్బుతో బాధపడుతున్న ఆమె చాలా రోజులు మంచానికి పరిమితమై ఉండిపోయిందని కూడా చెప్తారు అప్పటి నటులు.
ఇక తరువాత వచ్చే శీష్ మహల్ సీన్. రెండు సంవత్సరాలు కష్టపడి తయారు చేసిన సెట్‌లో కలర్‌లో వచ్చే పాట “జబ్ ప్యార్ కియా తో డర్నా క్యా” లో తనను మోసం చేసిందనుకున్న ప్రియురాలు తండ్రికి ఇచ్చే జవాబుని తన ప్రేమను బాహాటంగా ప్రదర్శించుకునే సన్నివేశాన్ని సింహాసనం మీద కూర్చున్న దిలీప్ కుమార్ అర్థం చేసుకోవడం, ఒక సామాన్యమైన నాట్యగత్తె తన రాచరికాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు అక్బర్‌లో కలిగే కోపాన్ని, జోధాబాయ్ ఆశ్చర్యాన్ని దుర్గా ఖోటే, పృథ్వీరాజ్ కపూర్ల అభినయంలో చూస్తాం. రాచరికాన్ని ప్రశ్నించే సాధారణ జనంలోని తిరుగుబాటుకి చిహ్నంగా కూడా ఈ పాటను చూడవచ్చు. మొదటిసారి ఖైదులో పెట్టినప్పుడు అనార్కలి భయపడుతుంది, కాని తరువాత తాను చేయాల్సిన పోరాటానికి స్పష్టమైన రూపం ఈ పాట ద్వారా ఆమె సమకూర్చుకుంటుంది. చివరకు ఖైదు చేయించిన అక్బర్‌కు సలాం చేసి అతనిపై నున్న గౌరవాన్ని కూడా చాటుకుంటుంది. అప్పటిదాకా అమాయకురాలిగా, బలహీనురాలిగా కనిపించే ఆమె ఒక యోధురాలిగా ముఘల్ సామ్రాజ్యపు అధికారాన్ని ఎదుర్కొవడానికి సన్నద్దమవుతుంది. అనార్కలి వ్యక్తిత్వంలోని ఈ మార్పును ఆసిఫ్ అంచెలంచలుగా చూపిస్తారు ఈ సినిమాలో.
తన జీవితంపై తండ్రి చూపిస్తున్న అధికారాన్ని ప్రశ్నిస్తున్న సలీం మాటలు ఆ తరువాత ఎన్నో సినిమాలలో రూపం మారి భాష మారి తండ్రి కొడుకుల సంభాషణల మధ్య వచ్చి చేరాయి. కాని ముఘల్-ఏ-ఆజంలోని ఆ సీన్ మాత్రం ఎప్పటికీ మరో సారి స్క్రీన్‌పై రీ-క్రియేట్ కాలేకపోయింది. ఒక చక్రవర్తిలా కాక కేవలం ఒక తండ్రిగా తన వైపు నుండి ఆలోచించమని సలీం తండ్రిని వేడుకోవడం, తన కర్తవ్యానికి తాను కట్టుబడి ఉన్నానని, దాని తరువాతే తాను తండ్రినని అక్బర్ చెప్పడం, ఇద్దరి మధ్య నడిచే ఆ సంభాషణలో పృథ్వీరాజ్ కపూర్ “హమ్ అప్నే బేటే కే ధడక్తే దిల్ కే లియే హిందుస్తాన్ కె తక్దీర్ నహీ బదల్ సక్తే” అన్నప్పుడు అక్బర్ పట్ల కూడా ప్రేక్షకులకు ప్రేమ కలుగుతుంది. ఈ సీన్‌లో తండ్రి పాత్ర విలన్‌గా కనిపించదు. ప్రేమ కన్నా కర్తవ్యం ముఖ్యమని నమ్మే ఒక చక్రవర్తి మాత్రమే కనిపిస్తాడు. చాలా సున్నితమైన ఈ తేడాను స్పష్తంగా స్క్రీన్‌పై చూపాలంటే పరిపక్వత కలిగిన నటన అవసరం. అక్బర్‌గా పృథ్వీరాజ్ కపూర్ ఇక్కడ అంతటి పరిపక్వతని చూపుతారు. అంతటి గొప్ప నటుడు కాబట్టే 1971 లోనే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వీరికి లభించింది. మరణించిన తరువాత ఆ అవార్డుకు ఎంపికయిన మొదటి నటులు పృథ్వీరాజ్ కపూర్.
ఇక తరువాత సలీం అనార్కలిని జైలు నుండి తీసుకుని పారిపోవాలనుకోవడం, సైనికులు తిరిగి బంధించడం, దాని తరువాత వస్తుంది తల్లి కొడుకుల సంభాషణ. 1920 లోనే బీయే పాస్ అయిన దుర్గా ఖోటే ఇరవై ఆరేళ్ళ వయసులో భర్త చనిపోయాక ఇద్దరి పిల్లల తల్లిగా తన కుటుంబం కోసం నటిగా మారింది. థియేటర్ ఆర్టిస్ట్‌గా గొప్ప పేరు సంపాదించుకున్న ఆమెకు నెహ్రూ కుటుంబంతో కూడా బంధుత్వం ఉంది. హిందీ చిత్రసీమలో ఎంతో గౌరవంగా తలచుకునేవారు ఆమెని. 1983లో వీరికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా లభించింది.
ముఘల్-ఏ-ఆజమ్‌లో తల్లి కొడుకుల సంభాషణ, అక్కడ దుర్గా ఖోటే, దిలీప్ కుమార్ల అభినయం మర్చిపోలేం. “హమారా హిందుస్తాన్ తుమ్హారా దిల్ నహీ కి లౌండి జిస్కీ మలికా బనే” అని తన కోడలి స్థానంలో అనార్కలి సరిపోదని తేల్చి చెబుతుంది జోధా. “తో మేరా దిల్ భీ కోయీ ఆప్కా హిందుస్థాన్ నహీ జిసపర్ ఆప్ హుకూమత్ కరే” అని బదులిస్తాడు సలీం. తన బిడ్డపై తనకు అధికారం ఉందని తల్లి చెబుతున్నప్పుడు, ఆ అధికారం చూపెడుతూ తనకు అన్యాయం చేస్తున్నారని, తనను ఒక మనిషిగా కాక ఒక బానిసగా చూస్తున్నారని సలీం చెప్తాడు. నువ్వు నా బిడ్డవి, నా లోనించి వచ్చిన వాడిని కాని రాజకీయం కర్తవ్యం ముందు నేను నీ కోరికలన్నిటినీ స్వీకరించలేను అని చెబుతుంది జోధా. కాని తల్లిగా చివరికి బిడ్డ కోరిక తీర్చడానికి అక్బర్‌ని ఎదిరిస్తుంది, కొడుకు కోసం లొంగిపొమ్మని కోరుకుటుంది. కాని అక్బర్ కొంత కాలం పొరుగు రాజులపై జరుగుతున్న యుద్ధంలోకి సలీంని పంపాలని నిశ్చయించుకుంటాడు. అలా కొడుకుని రాజ్యం నుండి, ప్రేమ నుండి దూరం చేయాలని అనుకుంటాడు. విరిగిన మనసు చేతికి కత్తినివ్వడం అతని ప్రాణాన్ని పణంగా పెట్టడమని మాన్‌సింగ్ చెప్పినప్పుడు ఒక నాట్యగత్తె ప్రేమలో తల కొట్టుకుని చచ్చే కన్నా యుద్ధ భూమిలో తన కొడుకు చావడం తనకు గౌరవం అని చెబుతాడు అక్బర్. కాని సలీంను యుద్దానికి పంపడానికి ఒప్పుకోదు జోధా.
ఇక్కడ ఆ భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణ ఎంత లోతుగా, ఎంతమంది తల్లి తండ్రుల బాధను ప్రతిఫలిస్తుందో. సలీం ఇప్పుడు ఏమీ వినేటట్లు లేడని జోధా చెబుతూ ఈ ఒక్క సమస్య దాటిపోనివ్వండి, ఇక సలీం మీకు ఎంత అనుకూలంగా ఉంటాడో చూడండి అని అంటుంది. ఈ సమస్య దాటిపోవాలంటే అనార్కలి సలీంకు లభించాలి అని ఆమె అక్బర్‌తో చెప్పినప్పుడు, “నా కోడుకు నా వాడవడానికి ఒక నాట్యగత్తె సహాయం, నాకు అవసరమా” అని ఆశ్చర్యంతో పృథ్వీరాజ్ కపూర్ పలకడం ఈ సినిమాలోనే ఒక గొప్ప సన్నివేశం. ఒక తండ్రిగా తాను అనుభవిస్తున్న ఓటమి, ఆవేదనను ఆ ఒక్క మాటలోనే చూపిస్తారు ఆయన. చివరికి నువ్వు కేవలం ఒక తల్లివి మాత్రమే అని అతను చెప్పడం, మీరు కేవలం ఒక చక్రవర్తి మాత్రమే అని ఆమె బదులివ్వడం అతి గొప్ప ముగింపు ఆ సంభాషణకు.
తరువాత అనార్కలిని సభకు పరిచయం చేసిన శిల్పకారుణ్ణి పిలిచి అనార్కలిని వివాహం చేసుకొమ్మని అడుగుతాడు అక్బర్. అతను అంగీకరించక పోవడంతో తండ్రీ కొడుకుల మధ్య యుద్ధం నడుస్తుంది. ఇక్కడ శిల్పకారుడిగా నటించిన కుమార్ అనే నటుడి అసలు పేరు సయ్యద్ అలీ హసన్ జైది. ఇతను 1963లో భారత్ విడిచి పాకిస్తాన్ వెళ్ళిపోయారు. సలీం రాజ్యానికి వస్తున్న సందర్భంలో అతనికి కానుకగా ఇవ్వడానికి ఈ శిల్పకారునితో ఒక అందమైన శిల్పాన్ని తయారు చేయించాలనుకుంటుంది బహార్. అప్పడు తాను తయారు చేసిన బొమ్మలు చూపిస్తాడు అతను. రాజ్యాహంకారానికి వ్యతిరేకంగా అతను తయారు చేసిన శిల్పాలు, ఒక కళాకారుడిగా రాజ్యాధికారాన్ని ప్రశ్నించే ఒక దార్శనికుడిగా అతన్ని వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తాయి. తరువాత శిల్పం స్థానంలోనే అనార్కలిని నిల్చోబెట్టి భగవంతుని సృష్టి ముందు మానవ సృష్టి ఎంత తృణమయినదో చెప్పే ప్రయత్నం చేస్తాడు అతను. అక్కడే అనార్కలిని మొదట చూస్తాడు సలీం. రాజ్యాధికారాన్ని, రాచరికాన్ని ప్రశ్నించే గొంతుకగా కనిపించే ఈ శిల్పకారుడినే అనార్కలిని వివాహం చేసుకొమ్మని అక్బర్ చివర్లో ఆజ్ఞాపిస్తాడు. ప్రశ్నించే గొంతుకకు అందమైన కానుకలను ఎరగా వేసే రాజకీయ నైపుణ్యాని అక్బర్ ఇక్కడ చూపిస్తాడు.
చివరకు ఏ యుక్తీ ఫలించక యుద్దం అనివార్య మవుతుంది. ఈ యుద్ద సన్నివేశాలకు భారీగా ఖర్చు పెట్టించారు ఆసీఫ్. ఒక శీష్ మహల్‌లో పాటకు పెట్టిన ఖర్చుతో ఆ రోజుల్లో ఒక పూర్తి సినిమానే తీసేవారట. ఇక ఈ యుద్ధ సన్నివేశాలలో ఉపయోగించిన వేల కొలది ఒంటెలు, గుర్రాలు, ఏనుగులు చూస్తే దీని భారీ బడ్జెట్ అంచనా వేయవచ్చు. అందుకే భారతీయ సినిమాలో ఎక్కువ ఖర్చుతో తీసిన సినిమాగా కూడా ఇది ప్రసిద్ది కెక్కింది. కొడుకుతో యుద్ధానికి వెళుతున్న భర్తకు తిలకం దిద్ది ఖడ్గం ఇచ్చే స్థితిలో లేని జోధా నుదుటి కుంకుమ చెరిపేసి యుద్ధానికి బయలు దేరుతాడు అక్బర్. యుద్ధం ప్రారంభించే ముందు కూడా ఒక తండ్రిగా సలీంకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. తండ్రి ప్రేమకు చక్రవర్తిగా తన కర్తవ్యానికి మధ్య నలిగిపోయే అక్బర్‌గా పృథ్వీరాజ్ కపూర్‌కి ఇక్కడ ఎక్కువ మార్కులు పడతాయి. బిడ్డ భుజాన్ని ముద్దు పెట్టుకుంటూ “షేకూ ఈ బీద తండ్రి చక్రవర్తిగా తన కర్తవ్యాలకు, ఆదర్శాలకు బందీ రా” అని చెప్పిన తండ్రిని “నేను ప్రేమకు బందీని” అని మొండిగా జవాబిస్తాడు సలీం. “ప్రేమ మనసుల్ని గెలుస్తుందేమో కాని ప్రతిజ్ఞలను కాదు. నీ ఈ భావావేశం ఒక చక్రవర్తి ముందు ఓడిపోవలసిందే” అంటాడు అక్బర్ కొడుకు ఓటమిని చూడలేని తండ్రిగా. కాని సలీం యుద్ధ భూమిలోనే తండ్రితో తలపడాలని నిశ్చయించుకుంటాడు. ఈ యుద్ధాన్ని ఆపడానికి అనార్కలిని జైలు నుండి తీసుకొస్తాడు సలీం మిత్రుడు దుర్జన్ సింగ్. ఈ పాత్రలో అజిత్ ఖాన్ జీవిస్తాడు. కాని అక్బర్‌తో యుద్ధం తప్పదు. యుద్ధంలో సలీం ఓడిపోతాడు. తండ్రిగా అతన్ని చంపలేకపోతాడు అక్బర్. కాని ఖైదు చేసి రాజ్యానికి తీసుకొస్తాడు. అనార్కలిని అప్పగించమని అక్బర్ అడిగినా సలీం ఒప్పుకోడు. చివరకు అతనికి మరణ శిక్ష విధించక తప్పదు అక్బర్‌కి. కాని శిక్ష విధించే సమయానికి అనార్కలికి ఈ విషయం తెలిసి అక్కడికి వస్తుంది. సలీంని రక్షించి తాను లోంగిపోతుంది. ఆమెను జీవ సమాధి చేయమని అక్బర్ ప్రకటిస్తాడు.
మరణించే ముందు ఆఖరి కోరిక అనార్కలి కోరుకోమంటే, ఒక్క రోజు భారత దేశపు రాణిగా సలీం పక్కన ఉండాలని ఆమె కోరుకుంటుంది. ఆ కోరిక మన్నించి అనార్కలిని సలీం వద్దకు పంపిస్తాడు అక్బర్. ఆమె నెత్తి మీద రాణిగా కిరీటాన్ని తానే అలంకరిస్తాడు. దానిలో మత్తుని కలిగించే సువాసన కలిగించే పువ్వును ఉంచుతాడు. తన నెత్తిపై అక్బర్ కిరీటాన్ని అలంకరించిన తరువాత అనార్కలి అతనితో ఇలా అంటుంది “షెహెన్శాహ్ కే ఇన్ బేహిసాబ్ బక్షిషో కె బదలె మే యె కనీజ్ జలాలుద్దీన్ ముహబ్బద్ అక్బర్ కో అప్నా ఖూన్ మాప్ కర్తీ హై” “చక్రవర్తి గారు లెక్కలేనన్ని సార్లు నాపై చూపిన కరుణకు బదులుగా ఈ బానిస జలాలుద్దీన్ అక్బర్‌ని నా ఈ హత్యకు క్షమిస్తుంది” ….ఇది డైలాగంటే. హిందీ సినిమా డైలాగుల్లోనే ఇది ఒక గొప్ప వాక్యం, ఇందులో అనార్కలి చూపే ఓటమిలో ఒక గెలుపు ఉంది. అధికారాన్ని ధిక్కరించిన ఒక సామాన్యమయిన యువతి ఆత్మగౌరవం ఉంది.
చే గువెరా అనే క్యూబన్ విప్లవకారుడు తన ఆఖరి ఘడియల్లో తనను కాల్చడానికి వచ్చిన సీఐఏ ఏజెంట్ వణుకుతున్న చేతులను చూసి “కాల్చరా నువ్వు ఒక్క మనిషిని మాత్రమే కాలుస్తున్నావు అంతే” అన్న తిరుగుబాటు ధోరణి ఈ ముఘల్-ఏ-ఆజం డైలాగులో కనిపిస్తుంది. అయినా చే చనిపోయింది 67లో. కాబట్టి ఏ విధంగా చూసినా ధిక్కార స్వరాన్ని పలికించిన ఒక గొప్ప ఒరిజినల్ వాక్యంగా దీన్ని చూడవచ్చు. ఇది ఎక్కడ నుండి కాపీ చేసిన భావం కాదు. నలుగురు రచయితలు కలిసి మథించి పలికించిన అద్భుతమైన భావం. అనార్కలి పాత్రను ధోరోదాత్తమైన పాత్రగా మలిచిన ఆఖరి వాక్యం.
సలీం తన ప్రేమలో మునిగి ఉన్న వేళ ఆ పువ్వు వాసన చూపించి అతన్ని ఏమార్చి ప్రొద్దుటికి తనకు విధించబోయే మరణ శిక్షకు సిద్ధపడుతుంది అనార్కలి. ఆమె జీవ సమాధి జరిగిపోతుంది. అయితే ఇక్కడే దర్శకుడు ఆసిఫ్ మరొక్క ట్విస్ట్ ఇస్తాడు. పిల్లలు లేని అక్బర్ చెప్పులు లేకుండా మండే ఇసుకలో నడిచి సలీం చిస్టీ దర్గాలో కొడుకు కోసం వేడుకున్న తరువాత పుడతాడు సలీం. అతను పుట్టినప్పుడు ఈ వార్తను అక్బర్‌కు చేరవేసే దాదికి తన రాజ ముద్రికను ఇచ్చి, జీవితంలో ఎప్పుడయినా ఆమె తనను ఏం కోరినా అది నెరవేర్చి తీరతానని ఈ సంతోషకరమైన కబురు తనకు ముందుగా చేరవేసినందుకు ఆమెకు ఒక మాట ఇస్తాడు అక్బర్. ఆ దాదియే అనార్కలి సంరక్షకురాలు. ఆమె చివర్లో వచ్చి అనార్కలి ప్రాణాలు రక్షించమని అక్బర్‌ని వేడుకుని ఆ రాజ ముద్రికను చూపిస్తుంది. అందుకు ప్రతిఫలంగా ధర్మం తప్పని అక్బర్ అనార్కలిని మరణించినట్లు అందరి ముందు ప్రకటించి చివరకు ఆమెను మరో దారి గుండా తప్పిస్తాడు. ఆమెకు తన కుటుంబంతో సహా రాజ్యం వదిలి వెళ్ళే అవకాశాన్ని ఇస్తాడు. సలీం ప్రాణాలు తన ప్రేమతో ముడిపడి ఉన్నాయని తెలుసుకున్న అనార్కలి విరిగిన మనసుతో, ఆ రాజ్యం నుండి నిష్క్రమిస్తుంది. ఇది కే.ఆసీఫ్ ముఘల్-ఏ-ఆజం.
ఈ సినిమాలో కథ వాస్తవం కాదు. ఏ రోమాన్స్ కాని ట్రాజెడీ కాని ఇంత ఫర్ఫెక్ట్‌గా ఉండడం జరగదు. కాని ఈ సినిమాను ఆసీఫ్ గొప్ప టేస్ట్‌తో నిర్మించారు. ఆ సంభాషణలు, సంగీతం, నటన, మరోసారి చూడలేం అన్నంత గొప్పగా నిర్మించిన చిత్రం ఇది. ఇందులో నటించిన వారందరూ కూడా చరిత్రలో మిగిలిపోయిన నటులే. ఈ సినిమాకు సంగీతం అందించిన నౌషాద్‌కు 1981లో దాదా సాహెబ్ అవార్డు లభించింది. ఇందులో పాటలు పాడిన లతా మంగేష్కర్‌కు 1989లో దాదాసాహెబ్ ఫాల్కె లభించింది. వీరి కన్నా ముందుగా పృథ్వీరాజ్ కపూర్, దుర్గా ఖోటే లకు ఈ అవార్డు లభించింది. 1994లో దిలీప్ కుమార్ కు ఫాల్కే వరించింది. అంటే ఐదుగురు ఫాల్కే అవార్డుల అత్యుత్తమైన పనితనం ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. దిలీప్ కుమార్ “దీదార్” సినిమా తరువాత మరో ఐదు ఫాల్కే అవార్డీలు పని చేసిన సినిమా ముఘల్-ఏ-ఆజం. అంటే దిలీప్ సాబ్ నటించిన రెండు సినిమాలలో మనకు ఐదు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డీలను చూస్తాం. దిలీప్ సాబ్‌తో ఎంతటి స్థాయి వ్యక్తులు ఆ రోజుల్లో పని చేసారో ఆయన ఎటువంటి హేమా హేమీలతో కలిసి గొప్ప చిత్రాలను సృష్టించడంలో ముఖ్య పాత్ర వహించారో అర్థం చేసుకుంటే దిలీప్ కుమార్ స్థాయికి మరో నటుడు వెళ్ళడం ఎంత కష్ట సాధ్యమో అర్థం అవుతుంది.
ముఘల్-ఎ-ఆజం ఒక్క దిలీప్ సాబ్ సినిమా మాత్రమే కాదు ఇది పృథ్వీరాజ్ కపూర్ సినిమా, మధుబాల సినిమా, నౌషాద్ సినిమా, షకీల్ బధాయునీ సినిమా ముఖ్యంగా కే.ఆసిఫ్ సినిమా. కే.ఆసిఫ్ తన జీవిత కాలంలో కేవలం రెండు సినిమాలు తీసారు. “ఫూల్” అనే సినిమా 1945లో తీసాక ఇక రెండో సినిమాగా ముఘల్-ఏ-ఆజమ్ 1960లో తీసారు. తరువాత మరో రెండు సినిమాలు అసంపూర్తిగా ఉండగానే ఆయన మరణించారు. అవి “సస్తా ఖూన్ మెహంగా పానీ”, హిందీ సినిమాలో అత్యంత విషాద సినిమాగా నిల్చిన “లవ్ అండ్ గాడ్”. ఈ సినిమా నిర్మాణంలో ఉండగా గురు దత్, తరువాత కే.ఆసీఫ్, ఇందులో నటించిన సంజీవ్ కుమార్‌లు కూడా చిన్న వయసులో హఠాత్తుగా చనిపోయినవారే. ఈ సినిమాను కే.ఆసీఫ్ భార్య దిలీప్ కుమార్ చెల్లెలు అఖ్తర్ చాలా ప్రయత్నించి విడుదల చేయించారు.
మనం ఇంత ఇష్టంగా చెప్పుకునే ముఘల్-ఏ-ఆజం సినిమాలో నటించిన నటులకు ఈ సినిమా తీపి గుర్తులను మిగల్చలేకపోయింది. మధుబాల ఆరోగ్యం ఈ సినిమా కారణంగానే పూర్తిగా విషమించిందని ఆమె తండ్రి వాదించేవారు. దిలీప్ కుమార్ చిన్న చెల్లెలు అఖ్తర్ ఈ సినిమా సమయంలో కే.ఆసీఫ్‌తో ప్రేమలో పడ్డారట. అప్పటికే ఆసీఫ్‌కి రెండు వివాహాలు జరిగాయి. ప్రఖ్యాత కథక్ నాట్యకారిణి సితారా దేవితో, ముఘల్-ఏ-ఆజంలో బహార్‌గా నటించిన నిగర్ సుల్తానాతో అంతకు ముందే వివాహం అయి ఉన్న ఆసిఫ్, తన చెల్లెలు అక్తర్‌తో ప్రేమలో పడడం ఇద్దరు వివాహం చేసుకోవడం దిలీప్ కుమార్ జీర్ణించుకోలేకపోయారు. ఆయన అందుకే ముఘల్-ఎ-ఆజం ప్రీమియర్‌కు కూడా వెళ్ళలేదని అంటారు.
కే.ఆసిఫ్ దర్శకుడిగా ఈ సినిమా కోసం చాలా కష్టాలు పడ్డారట. ఈ సినిమా నిర్మాతగా వ్యవహరించిన షపూర్జి పల్లోన్జికి ఇది మొదటి సినిమా. బడ్జెట్ అనుకున్నదానికన్నా పది రెట్లు పెరిగిపోవడంతో చాలా ఒత్తిడికి గురయ్యారు. కాని ఆసిప్ పైనుంచిన నమ్మకం ఫలించి ఇది మంచి వసూళ్ళూ సాధించడమే కాక ఒక చరిత్ర సృష్టించింది. తరువాత దీన్ని కలర్ చేయడంలో కూడా వీరి కుటుంబం పాత్రే ఉంది. పల్లోన్జి గారి మనవడు షపూర్ మిస్త్రీ ఆ పనికి ఆర్థిక సహాయాన్ని అందించారు. అందుకే ముఘల్-ఏ-ఆజం బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్‌కు మార్చబడిన మొదటి భారతీయ సినిమాగా మళ్ళీ 2004లో రీలీజ్ అయ్యింది. దీన్ని ఆసిఫ్ పూర్తిగా కలర్ చేద్దామని అప్పట్లో అనుకున్నా బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో సాధ్యపడలేదు. అప్పట్లో రెండు పాటలు యుద్ధ సన్నివేశాలు మాత్రం కలర్‌లో తీసారు. తరువాత నలభై సంవత్సరాలకు ఇది పూర్తి కలర్ సినిమాగా మరో తరానికి చేరువయ్యింది.
ఇన్ని విశేషాలు ఉన్న ముఘల్-ఏ-ఆజం మరోసారి తీయలేని కావ్యం. ఈ సినిమా కోసం వేసిన సెట్స్ కోసం దేశం నలు మూలల నుండి కళాకారులను పిలిపించారు, ఇందులో వాడిన దుస్తులు, చెప్పులు, నగలు, కిరీటాలు, ఆయుధాలు అన్నీ ప్రత్యేకంగా తయారు చేయించినవే. ఈ సినిమా కోసం చిత్రించిన కొన్ని పాటలను కట్ చేసారట సినిమా నిడివి తగ్గించడానికి. ఇప్పుడు ఆ భాష, ఆ సంగీతం, ఆ నటన మనకు లభ్యం కావు. ముఖ్యంగా ఉర్దూని అంత శ్రావ్యంగా పలికే వ్యక్తులు చాలా తక్కువయిపోయారు. దిలీప్ కుమార్ అప్పటి తరానికి ఆఖరి వ్యక్తిగా ఆయన మరణం దాకా నిలిచి ఉన్నారు. ఆయన మృతితో ఒక శకం ముగిసిపోయింది. ప్రస్తుతం ఉర్దూ, హిందీ సినీ భాషల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. హిందీ పై ఉర్దూ ప్రభావం పూర్తిగా లేకుండా పోయింది. పాకిస్తాన్‌లో భారతీయ సినిమాలు బాన్ చేయబడ్డాక, ముఘల్-ఏ-ఆజం మాత్రం మరోసారి కలర్ చేసిన తరువాత ఆ దేశంలో విడుదల అయింది, కాని ఉర్దూ మాట్లాడే ఆ దేశంలో కూడా మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా ఆడలేదంటే ఆనాటి తరం భాషా సౌందర్యం ఎలా అంతరించిపోతుందో అర్థం చేసుకోవచ్చు. 1960లో మొదట ఈ సినిమా మన దేశంలో రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా చూడడం కోసం పాకిస్తాన్ నుండి మన దేశం వచ్చినవారు ఉన్నారట. కాని 2004లో ఇది పాకిస్తాన్ లోని యువతను ఆకర్షించలేకపోయింది అంటే అక్కడ కూడా మారిన రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, పరిస్థితుల ప్రభావం అర్థం అవుతుంది.
దీన్ని మొదట తీస్తున్నప్పుడే హిందీ, తమిళం, ఇంగ్లీషులలో ఒకేసారి తీయాలని అనుకున్నారు. అయితే తమిళంలో ఈ సినిమా ఆడలేదు. దానితో ఇంగ్లీషు వర్షన్‌ని కూడా వద్దని అనుకున్నారు. ఇప్పుడు ఆ రెండు భాషలలో కూడా ప్రింట్స్ లేవనే అంటారు. అలా ఈ సినిమా హిందీ భాషకే పరిమితమయి పోయింది.
ముఘల్-ఏ-ఆజం ప్రభావంలో పడిన కళాకారులెందరో ఉన్నారు. 97 ఏళ్ళ వయసులో, తన మరణానికి కొన్ని నెలల ముందు అంటే 2011లో ఎమ్.ఎఫ్.హుసేన్ ఈ సినిమా ప్రభావంతో 50 పేయింటింగ్స్‌ను ముఘల్-ఏ-ఆజం థీమ్‌తో వేసారట. అంతగా చిత్రకారులను సైతం ప్రభావితం చేసిన సినిమాను ఆస్వాదించే నేపథ్యం ఉన్న ప్రేక్షకులు కూడా ఇప్పుడు తగ్గిపోయారు. అయినా భారతీయ సినీ చరిత్రను చదవాలనే ప్రయత్నం చేసే వారెవ్వరూ ఈ సినిమాను వదిలి భారతీయ సినమాను అర్థం చేసుకోలేరన్నది మాత్రం ఎవ్వరూ ఒప్పుకోకపోయినా ఒక నిజం. ఈ సినిమాతో దిలీప్ కుమార్ హిందీ సినీ ప్రపంచంలో ఒక తారగా ఎప్పటికీ మిగిలి ఉంటారు.