Site icon Sanchika

ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 9 – అందాజ్

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

ఇద్దరు పురుషుల మధ్య నలిగిపోయిన స్త్రీ మనసు – అందాజ్

[dropcap]ఒ[/dropcap]క స్త్రీకి పురుషునికి మధ్య చనువు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది? వీరి మధ్య స్నేహం మాత్రమే ఉండగలదా? ఇద్దరు స్త్రీలు స్నేహంగా ఉన్నట్లు ఒక స్త్రీ, ఒక పురుషుడు ఉండలేరా? అలా ఉండాలని ప్రయత్నిస్తే వారిని సమాజం స్వీకరిస్తుందా? ఒక వేళ ఆ స్నేహం కారణంగా అపోహలు, కలహాలు ఏర్పడితే ఎవరు ఎక్కువ నష్టపోతారు? ఇలాంటి ప్రశ్నలకు చాలా లోతుగా సమాధానం వెతికే ప్రయత్నం జరిగింది 1949లో వచ్చిన అందాజ్ సినిమాలో. దిలీప్ కుమార్, నర్గిస్, రాజ్ కపూర్లు కలిసి నటించిన ఈ సినిమాకు దర్శకత్వం వహించింది మెహబూబ్ ఖాన్. మెహబూబ్ ఖాన్‌కి ఇష్టమైన నటి నర్గిస్, ఆమె అతని వద్దే నటనకు మెరుగులు దిద్దుకుంది అంటారు. అందుకే ఔరత్ సినిమాను మళ్ళీ మధర్ ఇండియాగా తీస్తున్నప్పుడు మెహబూబ్ ఖాన్ మొదటి, ఆఖరి చాయిస్ కూడా నర్గిస్. అలాగే అతనికి దిలీప్ కుమార్‌పై ప్రత్యేకమైన అభిమానం కూడా ఉండేది. కాని మదర్ ఇండియాలో నర్గిస్ కుమారుడిగా నటించడానికి దిలీప్ ఇష్టపడకపోవడం వలన ఆయన సునీల్ దత్‌ను తీసుకోవలసి వచ్చింది. దిలీప్‌పై ఆయనకున్న అభిమానం నమ్మకం ఎంత అంటే, ఎన్నో షేడ్స్‌లో దిలీప్‌ను చూపించే ప్రయత్నం సాహసించి ఆయనే చేసారు. ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కించారు మెహబూబ్ ఖాన్. అత్యధిక వసూళ్ళు చేసిన సినిమా ఇది. రాజ్ కపూర్ నర్గిస్‌లకు ఇది మొదటి హిట్టు. తరువాత వారి జోడి సినీ రంగాన్ని ఏలింది. కాని అందాజ్ తోనే ఈ జోడి ప్రజల మధ్యకు వచ్చింది.

నీనా ఒక ధనవంతుని కూతురు, చాలా కలుపుగోలు మనిషి, మంచితనం మనుషులను నమ్మడం ఆమె బలహీనతలు. అయితే ప్రపంచాన్ని పెద్దగా లెక్క చేయక తాను నమ్మిన దాన్ని ఆచరిస్తూ జీవిస్తుంటుంది. అతి గారాబం వల్ల కూడా తనకు నచ్చింది మాత్రమే చేస్తాననే తత్వం ఆమెది. ఒక సారి గుర్రపు స్వారీ చెస్తున్నప్పుడు ఒక ప్రమాదంలో ఆమె పడుతుంది. దిలీప్ ఆమెను కాపాడతాడు. మొదటి చూపులోనే ఆమె అతన్ని ఆకర్షిస్తుంది. నీనా అతనితో చనువు పెంచుకుంటుంది. తన ఇంటికి అతిథిగా రమ్మని అడుగుతుంది. మంచి గాత్రం ఉన్న అతని సంగీతంపై మనసు పెంచుకుంటుంది. అతని సంగీతాన్ని ఆస్వాదిస్తుంది. అతనితో పరిచయం తగ్గించుకోవడం ఆమెకు ఇష్టం ఉండదు. తన పుట్టిన రోజు అతన్ని అతిథిగా ఇంటికి పిలుస్తుంది. వారిద్దరి మధ్య చనువును అతిథులు ఓర దృష్టితో చూడడం కూడా ఆమెకు కనపడదు. దిలీప్ మాత్రం నీనాకు తన పట్ల ప్రేమ మొదలయ్యిందనే నమ్ముతాడు. నీనా స్నేహితురాలు షీలా దిలీప్‌ని ప్రేమిస్తుంది. నీనాది కేవలం స్నేహం మాత్రమే అని దిలీప్‌కి చెబుతుంది. కాని దిలీప్ ఆమె మాటలు నమ్మడు. ఒక సందర్భంలో నీనాకు తన మనసు విప్పి చెప్పాలని ప్రయత్నిస్తాడు. కాని అప్పుడే నీనా తండ్రి ఆరోగ్యం బాగోలేదని ఫోన్ రావడంతో హడావిడిగా వెళ్ళిపోతుంది.

నీనా తండ్రి తన అనుభవంతో నీనా దిలీప్‌తో చనువు పెంచుకుంటే అది ఆమె భవిష్యత్తుకు ప్రమాదం అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. నీనా తండ్రిపై కోపం తెచ్చుకుంటుంది. తనపై తండ్రికి నమ్మకం లేదా అని ప్రశ్నిస్తుంది. తానెన్నడు తప్పు చేయనని వాదిస్తుంది. పురుషుడితో స్నేహం పేరుతో సానిహిత్యం సమాజం హర్షించదని, సమజానికి ఎదురొడ్డి ప్రవర్తించవద్దని ఆమె తండ్రి ఎన్నో సార్లు చెబుతాడు. కాని నీనా ఆ మాటలు పట్టించుకోదు. ఆరోగ్యం విషమింఛి నీనా తండ్రి హార్ట్ అటాక్‌తో మరణిస్తాడు. అప్పటి దాకా ఆడింది ఆట, పాడింది పాటగా సాగించుకున్న నీనా హఠాత్తుగా వాస్తవ ప్రపంచం లోని బరువు బాధ్యతల మధ్య పడుతుంది. తండ్రి వ్యాపారాన్ని తానొక్కతే చూడలేనని ఆమెకు తెలుసు. ఆ సమయంలో దిలీప్‌ని తమ వ్యాపారాలకు ప్రతినిధిగా నియమిస్తుంది. దిలీప్ ఇది నీనా తనపై ప్రేమతో పెట్టిన బాధ్యత అని నమ్ముతాడు. సంతోషంగా వ్యాపార బాధ్యతలు స్వీకరిస్తాడు. వీరిద్ధరి మధ్య చనువును అందరూ అనుమానంతో చూడడం మొదలెడతారు.

తన మనసు ఆమెకు చెప్పాలనుకునేంతలోనే నీనా ప్రేమించిన రాజన్ లండన్ నుండి తిరిగి వస్తాడు. దిలీప్ ఇది చూసి ఖిన్నుడవుతాడు. రాజన్ నీనాల మధ్య చనువు చూసి రాజన్ సంగతి తనకు ఎందుకు చెప్పలేదని ఆమెని అడుగుతాడు. నీనా తాను చాలా సార్లు చూచాయిగా తన ప్రేమ విషయం చెప్పానని తమ మధ్య నడిచిన కొన్ని సంభాషణలు గుర్తు చేస్తుంది. దిలీప్ మగవాడని అతనితో తన ప్రేమికుని గురించి ఒక స్త్రీకి చెప్పినంత చనువుగా చెప్పలేను కదా అని ప్రశ్నిస్తుంది. తాను రంజన్‌ను ఎలా కలుసుకుంది ఇద్దది మధ్య ప్రేమ ఎలా మొదలయిందో దిలీప్‌కు వివరిస్తుంది. నీనా తనపై చూపిన చనువును ప్రేమ అని భ్రమించినా ఆమెను మర్చిపోవడం దిలీప్‌కి కష్టమవుతుంది. తన మనసులో ఆమెపై ఉన్న ప్రేమ విషయం బయట పెడతాడు అతను. నీనా మొదటిసారి ఇది విని ఆశ్చర్యపోతుంది. తన ప్రవర్తనను దిలీప్ తప్పుగా అర్థం చేసుకున్నాడని అతన్ని తప్పు పడుతుంది. కాని దిలీప్ తాను ఆమె ప్రేమ లోనుండి బైటకు రాలేనని చెప్పినప్పుడు కోపంతో అతనికి దూరం అవుతుంది. వివాహం నిశ్చయమయిన నీనా రాజన్‌ల దగ్గర తాను లేకపోతే లోకం నీనాను అనుమానంగా చూస్తుందని, వారి వివాహం నిశ్చయమయిన వెంటనే తాను ఆమె జీవితం నుండి తప్పుకోవడం వలన ఆమెపై అనుమానం అందరికీ పెరుగుతుందని దిలీప్ అర్థం చేసుకుంటాడు. అందుకని ఆమె వ్యాపారాన్ని చూసుకుంటూ వారి కుటుంబ సన్నిహితుడిగా అందరినీ నమ్మించడానికి వారితో ఉంటాడు.

కాని దిలీప్ తన మనసులోని సంగతి బయట పెట్టిన తరువాత నీనా ఒక అపరాధ భావంతో కుమిలిపోతుంది. దిలీప్ పట్ల తన ఆకర్షణలో వాస్తవం ఉందని ఆమెకు తెలుసు. కాని అది వివాహంలా మారాలని ఆమె కోరుకోకపోవడం కూడా నిజం. తన మనసులో జనియించిన ఆకర్షణ కారణంగానే తాను అతనితో చనువుగా ఉన్నానని ఆమె మనసులో అంగీకరిస్తుంది. దిలీప్ మనసులో ప్రేమ మొలకెత్తడం వెనుక తాను కారణం అన్న అపరాధ భావం ఆమెలో అలజడిని కలిగిస్తుంది. దాంతో ఒక గిల్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. రాజన్‌తో వివాహం తరువాత కొత్త దంపతులు సిమ్లా వెళతారు. అక్కడి నుండి నగరానికి రావడానికి నీనా ఇష్టపడదు. నగరం అంటే ఒక రకమైన భయం చూపించే ఆమె రాజన్‌కు అర్థం కాదు. ఎన్ని సార్లు అడిగినా ఊరికి వెళ్ళడానికి ఆమె ఇష్ట పడదు. అక్కడే నీనా అడపిల్లను ప్రసవిస్తుంది. కూతురంటే రాజన్‌కు ప్రాణం. ఆమె మొదటి పుట్టిన రోజు తన స్నేహితులు బంధువుల మధ్య జరగాలని పట్టుబట్టి తిరిగి నగరానికి భార్యా పిల్లతో వస్తాడు రాజన్. అయితే నీనా స్నేహితురాలు షీలా దిలీప్‌ని ప్రేమిస్తుందని రాజన్‌కి తెలుసు. దిలీప్ ఎందుకు షీలాని పెళ్ళి చేసుకోవట్లేదు అని ప్రశ్నించినప్పుడు నీనా అతను షీలాని ప్రేమించట్లేదని దిలీప్‌ని వెనకేసుకొస్తుంది. అయితే అతను ఎవరిని ప్రేమించాడు అంటూ మొదటి సారి నీనాను అనుమానంగా చూస్తాడు రాజన్. నీనా రాజన్ తనవైపు చూసిన చూపుకు కోపంతో అలుగుతుంది. కాని భార్య భర్తలు మళ్ళీ కలిసిపోతారు.

నీనా కూతురు పుట్టిన రోజుకు వచ్చిన దిలీప్‌ను చూపి నీనా ముఖంలో ఆందోళనను మొదటి సారి చూస్తాడు రాజన్. షీలా అది కవర్ చేయాలని చాలా ప్రయత్నిస్తుంది. అక్కడే కరెంట్ పోయాక చీకట్లో దిలీప్ దగ్గరకు వెళ్ళి అతన్ని వెళ్ళిపొమ్మని ఈ ప్రేమ అనే మాట మళ్ళీ మనసులోకి తీసుకు రావద్దని నీనా చెబుతుంది. కాని చీకట్లో దిలీప్ అనుకుని రాజన్ వద్దకు వెళ్ళి ఈ మాటలు చెప్పడం వలన, రాజన్ మనసులో వీరిద్ధరి మధ్య సంబంధం ఉందని అది కప్పి పుచ్చడానికే తనని సిమ్లా దాటి ఆమె రానివ్వలేదనే విషయం బలపడుతుంది. దిలీప్‌కి కూడా ఈ విషయం తెలిసి భార్యాభర్తలను కలపడానికి నిజం చెప్పడానికి రాజన్ దగ్గరకి వస్తాడు. కాని రాజన్ కోపంతో అనుమానంతో దిలీప్‌ని అవమానిస్తాడు. ఇద్దరి మధ్య దెబ్బలాట జరుగుతుంది. తలపై గట్టి దెబ్బ తగిలి దిలీప్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. అతను చనిపోతే తాను ఎప్పటికీ కులటగా మిగిలిపోతుందని, తన భర్త అనుమానం అబద్ధం అని చెప్పే వారుండరని అందుకోసమయినా దిలీప్ బ్రతకాలని నీనా కోరుకుంటుంది. భర్త తన మాట వినడని తెలిసి తాను మౌనంగా ఉండిపోతుంది. తల పై దెబ్బ తిన్న దిలీప్ మతి స్థిమితం కోల్పోతాడు. నీనా తన ప్రేయసి అని నమ్ముతాడు, ఆమెపై అత్యాచారం చేయబోతాడు. నీనా తప్పని పరిస్థితిలో అతన్ని తుపాకితో కాల్చి చంపుతుంది. జైలు పాలవుతుంది.

జైలులో ముద్దాయిగా నిలబడ్డ నీనా చరిత్రహీనురాలని, దిలీప్ ఆమె ప్రియుడని, భర్తను కూతురిని ఆమె మోసగించిందని, అది బైట పడుతుందని దిలీప్‌ని హత్య చేసిందని రాజన్ సాక్షం ఇస్తాడు. నీనాకు యావజ్జీవ శిక్ష పడుతుంది. రాజన్ నీనాపై కోపంతో తల్లి లేకుండా పెరగవలసిన తన కూతురి దుస్థితికి బాధపడుతూ ఆమె ఆడుకుంటున్న బొమ్మను చించేస్తాడు. అది దిలీప్ పాప పుట్టిన రోజుకు తీసుకువచ్చిన బొమ్మ. దానిలో ఒక ఉత్తరం దొరుకుతుంది రాజన్ కు. నీనా రాజన్ నే ప్రేమించిందని, ఆ సంగతి తనకు మెల్లిగా అర్థం అయిందని అందుకే ఆమె జీవితం నుండి శాశ్వతంగా తప్పుకోవాలనుకుంటున్నానని రాసిన ఆ ఉత్తరం చదివాక గాని రాజన్‌కు తాను భార్యను అనుమానించానన్నది అర్థం కాదు. దుఖంతో జైలులో ఆఖరి సారిగా భార్యను కలవాలని వెళతాడు. తన పరిస్థితికి భర్త లేదా దిలీప్ కారణం కాదని, ఈ పరిస్థితిని తానే సృష్టించుకున్నాని, తండ్రి అనుభవంతో చెప్పిన మాట వినకపోవడమే తమ జీవితాల పతనానికి కారణం అని చెప్పి నీనా వెనుదిరగడం ఆఖరి సీన్.

సినిమాలో స్త్రీ పరంగా ఆలోచిస్తే, ఒక పురుషుని పట్ల అకర్షితురాలవాడం నేరంగా చూసే సమాజాన్ని ఎదిరించి తన రీతిలో జీవించాలనుకునే స్త్రీ పరిస్థితిని ఇలా చిత్రించడం, కొంత మింగుడు పడదు. కాని మరో కోణంలో చూస్తె తనతో చనువుగా ఉన్న స్త్రీ ఖచ్చితంగా తనను ప్రేమిస్తుందనే అపోహను పెంచుకోవడం దిలీప్ వ్యక్తిత్వంలో ఉన్న లోపం కూడా, సాధారణ మగాడు చేసే తప్పే అది. అలాగే ఎంత ఫారిన్ రిటర్న్ అయినా భార్య తనకు పూర్వం మరొకరి పట్ల ఆకర్షితురాయిందనే ఆలోచననే భరించలేని రాజన్ కూడా సగటు భారతీయ పురుషుడికి ప్రతీకే. ఇక్కడ మార్పు రావలసింది పురుషుని భావజాలంలో కాని స్త్రీలో కాదేమో అనిపిస్తుంది కూడా. సమాజం తనకు అనుకూలంగా మసలుకోని యువతులపై ఎంత కర్కశంగా తన కోరలు విసురుతుందో ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. ఆడపిల్లలు ఇలానే ఉండాలని, అలా ఉండకపోతే వారు మంచివారు కారని ఎన్నో వాదాలు మనకు వినిపిస్తూనే ఉంటాయి. నిజంగా అది ఆడవారిపై సమాజం చేస్తున్న పెద్ద అన్యాయం. ఒక స్త్రీ మరొక పురుషుని పట్ల అరోగ్యకరమైన ఆకర్షణ చూపితే అది నేరం ఎలా అవుతుంది. ప్రతి స్త్రీ పురుష సంబంధాలు శారీరికం లోకే దారి తీస్తాయి అన్న ఆలోచనే తప్పు కాదా.. స్త్రీ తమ పై చూపే చనువులో ఆమెను సొంతం చేసుకొమ్మనే ప్రతిపాదనే ఉంటుందా? అసలు స్త్రీ ని ఒకరి సొత్తుగా తప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా చూడలేదా సమాజం. అలాంటి వ్యక్తిత్వం ప్రదర్శించే వ్యక్తి ఇలా నీనాలా బలి కావలసిందేనా? ఇలాంటి ప్రశ్నలను ఆ రోజుల్లోనే ఈ సినిమా లేవదీసింది.

సాంప్రదయవాదులు ఈ సినిమా సాంప్రదాయాన్ని సమర్థిస్తుంది అనుకోవచ్చు. కాని నీనా ఇందులో ఎక్కడా సాంప్రదాయాన్ని అతిక్రమించదు. దిలీప్‌తో చనువుగా ఉంటుంది తప్ప శారీరకమైన వాంఛ ప్రదర్శించదు. ప్రతి నిముషం నేను స్త్రీని నువ్వు పురుషుడీవి అన్న తేడా చూపకుండా మనం మనుషులం అన్నట్లుగానే ఉంటుంది. షీలాతో ఎలా మాట్లాడుతుందో అలాగే దిలీప్‌తో కూడా మాట్లాడుతుంది. అనునిత్యం ముసుగులో ఉండాలని కోరుకోదు. గీత దాటదు. అలాగే గీతను పట్టుకుని వేళ్ళాడదు. తనకొక వ్యక్తిత్వం కావాలని తన మనసు చెప్పిన దారిలో నడుచుకుంటుంది. దానికి జీవితాన్నే పణంగా పెట్టిస్తుంది ఆమె చుట్టూ ఉన్న సమాజం.

ఆనాటి పరిస్థితులలో, నీనా లాంటి స్త్రీల జీవితాలలో వచ్చే సమస్యలను చూపిస్తాడు మెహబూబ్ ఖాన్, ఎక్కడా ఏ వర్గాన్ని విమర్శించడు. ఎవరిది తప్పు అన్నది కూడా చెప్పడు. నీనా వ్యథను చూపిస్తాడు తప్ప ఆమె పాత్రను గీత దాటిన స్త్రీ పాత్రగా మలచలేదు అతను. ఇది గమనించవలసిన విషయం. సినిమాకు సంగీతం అందించింది నౌషాద్. నీనాగా నర్గిస్, దిలీప్‌గా దిలీప్ కుమార్, రాజన్‌గా రాజ్ కపూర్లు నటించారు. దిలీప్ కుమార్‌కు ఇందులో ముఖేష్ పాడారు. దిలీప్‌కి ఆయన పాడిన పాటలన్నీ సూపర్ హిట్లే. నాలుగు పాటలు పియానో పై ఉంటాయి. నాలుగు భిన్న సందర్భాలలో వస్తాయి. పియానో వెనుక కూర్చుని కళ్ళలో ప్రేమను, విషాదాన్ని, మోసపోయిన బాధను దిలీప్ ప్రతి పాటలో గొప్పగా చూపిస్తారు. ఒక పాట మాత్రం రాజ్ కపూర్‌పై ఉంది. ఇది రఫీ పాడారు. ఇక లత పాడిన “ఉఠాయే జా ఉన్కే సితం” వినడమే ఒక అనుభవం. నాకు ఈ పాటతో పాటు “తోడ్ దియా దిల్ మేరా” అన్న లతా పాట చాలా చాలా ఇష్టం. అందులో ఆమె గొంతులో విషాదం మనసును మెలిపెడుతుంది. మజ్రూహ్ సుల్తాపురి రాసిన పాటలను నౌషాద్ చాలా గొప్పగా పలికించారు. ఈ సినిమా తరువాత రాజ్ దిలీప్‌లు కలిసి వేరే ఏ సినిమాలోనూ నటించలేదు. దిలీప్ నటించిన సినిమాలలో మరపురాని చిత్రం ఇది.

Exit mobile version