రంగుల హేల 18: డిజాస్టరూ మంచిదే!

1
2

[box type=’note’ fontsize=’16’] “ఒకోసారి ఎక్కిన మెట్ల మీదుగా జారిపోయి ఆఖరి మెట్టు దగ్గర పడినప్పుడు జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది” అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల” కాలమ్‌లో. [/box]

[dropcap]అ[/dropcap]నుకోకుండా ఒక ముసీబత్‌లో పడిపోతేనే జీవితం విలువ తెలుస్తుంది. ఒక డిజాస్టర్‌లో మనుషుల్నీ, డబ్బునీ, కీర్తినీ, మర్యాదనీ పోగొట్టుకోవచ్చు గాక. కానీ ఆ విపత్తు మనకి చాలా గుణపాఠాల్ని నేర్పిస్తుంది.

మనం పడవలో ఎంత సుఖంగా కుర్చున్నామో ఒక్కసారి పడవ తూలి ఊగినప్పుడే తెలుస్తుంది. అప్పుడు కలిగిన భయ విభ్రాంతులు మనకి తత్త్వం బోధిస్తాయి. నదికీ, పడవకీ అప్రయత్నంగా మనసులోనే మొక్కుతాం.

ఎప్పుడైనా అలాంటి విపరీత పరిణామాలు ఎదురైనపుడు వద్దనుకుంటూనే, తెలిసీ తెలిసీ ఆ ట్రామాకి గురయిపోతాం. గిలగిల్లాడిపోతాం. ఆరోగ్యం పాడు చేసుకుంటాం. అందులోంచి బైటికొచ్చాక ఊపిరిపీల్చుకుని ఇతరులకు వేదాంతం బోధించడానికి నడుం కడతాం.

ఎంత నరకం పడ్డాం? ఎంత సేపు అక్కడ ఉన్నాం? ఎంత సమయం తీసుకుని ఒడ్డున పడ్డాం? అన్నది అక్కడ ప్రధాన విషయం. ఇలాంటి సందర్భాల్లో పెద్దవాళ్ళు అనుభవంతో చెప్పే బోధలు వినాలి. అవి అనుభవ ఫలాలు. ఇస్తే హాయిగా తినండి. వద్దని త్యజించకండి. రుచించవనకండి. అవి చాలా ఉపయోగం.

ఏ విహార యాత్రకో వెళితే అక్కడ మన పర్సు పోయి నప్పుడు కలిగిన భయాందోళన మనల్ని ఒక్కసారిగా ఎంతో ఎదిగిస్తుంది. జీవితాన్ని విహంగ వీక్షణం చేస్తాం.

మనం రైల్లో హాయిగా సర్దుకుని కూర్చుని కదులుతున్నచెట్లను చూస్తూ మురిసిపోతుంటాం. ఇంతలో మన మెడలో గొలుసు దొంగాడు తెంపేసి కదులుతున్న ట్రైన్ లోంచి దూకేసినప్పుడు గుండె ఆగిపోయినంత పనవుతుంది. మన జీవితాలు బంగారంతో ఎందుకు ఇంత గట్టిగా ముడిపెట్టుకున్నామో అని వైరాగ్యం కలిగేంత వరకూ సాగుతుంది వ్యవహారం.

ఒకోసారి ఎక్కిన మెట్ల మీదుగా జారిపోయి ఆఖరి మెట్టు దగ్గర పడినప్పుడు జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది. అప్పుడక్కడ చుట్టుపక్కల వాళ్ళు కనబడతారు. పనిలో పనిగా బిచ్చగాళ్లు కూడా కనబడతారు. వాళ్ళను గురించిన ఆలోచన మీ బుర్రలో తిరగక తప్పదు.

ఒకోసారి ప్రకృతి విలయతాండవం చేసి పంట పొలాల్ని వరదలతో ముంచెత్తి మనం వేసిన పంట నీటిలో తేలుతున్నప్పుడు ప్రకృతి మాత ఆగ్రహించడం అంటే ఏమిటో తెలుస్తుంది. ఆమె దయ కావాలని పెద్దలెందుకు దండాలు పెడతారో అప్పుడు అవగతమవుతుంది. ఏటా రెండేసి మూడేసి పంటలు వేసుకుని ఫలసాయం తీసుకున్నప్పుడు అదేదో మన హక్కుగా అనుకున్న వాళ్ళం కాస్తా ముంపు దెబ్బకి అవాక్కయి ఆపై నిదానంలో పడతాం. డిసాస్టర్ మానెజ్మెంట్ వాళ్లొచ్చి వెళ్ళాక ప్రభుత్వం చెయ్యబోయే సాయం కోసం ఉద్యోగానికి సెలవు పెట్టి వెళ్లి మరీ ఎదురు చూస్తాం.

మనిషి ప్రకృతిలో భాగం మాత్రమే. ఎంత సైన్స్ అభివృద్ధి చెంది విమానాలెక్కి అక్కడ దూకి ఇతర గ్రహాల మీద పరిశోధనలు చేసినా ఒక చిన్న వర్షం కురిపించడం కాస్త ఎండ కాయించడం మన వల్లకాని పని. ఎండా వానలు మన చేతి కింద ఉండే బంట్రోతులు కావు.

ఓహోహో! ఇంతా అంతా అని మనం మురిసిపోతున్న వాతావరణ పరిశోధనా విభాగాలు ఏం వెలిగిస్తున్నాయి? కాస్త ముందుగా తుఫాన్ తాకిడి ఆచూకీ కట్టి కాస్త ప్రాణ నష్టం తగ్గించడం తప్ప. అల్ప పీడనాలు రాకుండా  ఆపే శక్తి మానవుడి చేతిలో పని కాదు. ఒక్కసారి కొట్టిన గాలివాన దెబ్బ రైతుకు పదేళ్లు గుర్తుంటుంది. తోటి పశువులు, పక్షుల కంటే మనకి కాస్త తెలివి ఓ చుక్క ఎక్కువుంది కదాని సుఖ పడుతున్నాం కానీ గట్టిగా ఈదురు గాలులు వీస్తే వాగులు పొంగి పొరలి నీరొస్తే కొట్టుకుపోయే కోడిపిల్లల లాంటి వాళ్ళమే మనం కూడా.

ఉద్యోగ బాధ్యతా పర్వంలో రూల్ మరిచిపోయి అజాగ్రత్తగా రాసిన ఫైల్స్ ఒకోసారి కొంప ముంచి మన సహోద్యోగిని సస్పెన్షన్‌కి గురి చేసినపుడు, మనం టీ తాగుతూ రాసే ఫైల్ రాతలు ఎంత వళ్ళు దగ్గర పెట్టుకుని రాయాలో అర్ధమవుతుంది. ఇలా పక్క సీట్లో డిజాస్టర్ కూడా మన చేత రూల్స్ పుస్తకాన్ని బట్టీ పట్టిస్తుంది.

“రడ్‌యార్డ్ కిప్లింగ్” అనే కవి ఏమంటాడంటే, ఇప్పటివరకూ మనం సంపాదించుకున్నదంతా పోగొట్టుకుని కట్టుబట్టలతో నిలబడే పరిస్థితి వచ్చినప్పటికీ జరిగిన డిజాస్టర్ గురించి ఒక్క మాట మాట్లాడకుండా తిరిగి మొదటి అడుగునుంచీ నడక మొదలుపెట్టి జీవించాలి. అలా నడిచేవాడే నిజమైన మనిషి అని కూడా అంటాడు.

వినడానికి బానే ఉంటుంది. మన దాకా వస్తేనే తంటా. అటువంటి ప్రకంపనలు చాలు మనం అటెన్షన్ లోకి వచ్చెయ్యడానికి ? ఏవంటారు ?

జీవితం పేద్ద సంగతేమీ కాదు. అలా అని మరీ చిన్న సంగతీ కాదు. రెండు సంగతుల మధ్యా లాగడం మాత్రం గొప్ప సంగతే !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here