[box type=’note’ fontsize=’16’] “జిహ్వచాపల్యం అనేది ఒకటి ఉంది. అది ఎంతటిది అంటే – తరవాత చూసుకుందాం, ముందు తినేద్దాం అని తొందర పెడుతుంది” అంటున్నారు అనంతలక్ష్మి ఈ వారం ‘దిశ‘ కాలమ్‌లో. [/box]
[dropcap]ఏ[/dropcap]ది తింటే దానిగా తయారవుతారని ఉపనిషత్తు చెప్పిన మాట.
తినే ఆహారాన్ననుసరించి మానసిక, శారీరక స్థితులు ఉంటాయని పెద్దలు చెప్పిన మాట. తిన్న ఆహారంలో 6వ వంతు మనస్సుగా మారుతుందని ఆయుర్వేదం చెపుతుంది. తీపి తిని తియ్యని మాటలు మాట్లాడు అని పండగ పూట తీపి పెడుతూ అనటం మహారాష్ట్రుల సంప్రదాయం. అంటే తినే పదార్ధానికి మనోభావాలకి అవినాభావ సంబంధం ఉన్నదని తెలుస్తోంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఆహారం మీదనే ఆధార పడి ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు.
ప్రాచీన ఆయుర్వేద పద్ధతిలో మందుతో పాటు పథ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. పథ్యం అంటే తీసుకున్న ఔషధం బాగా పని చేయటానికి సహకరించే ఆహారం. అల్లోపతీ వైద్యంలో కూడా కొన్ని రకాలైన వ్యాధులకి ప్రత్యేక ఆహారనియమాలని చెప్పటం అందరికి తెలిసిన విషయమే. బీపీ ఉంటే ఉప్పు తగ్గించండి! ఎసిడిటీ ఉంటే కారం పులుపు అసలే వద్దు. అన్నం తినకండి, గోధుమ తినండి మధుమేహం తగ్గుతుంది అని డాక్టర్లు నెత్తి నోరు కొట్టుకుని చెపుతున్నారు. అంటే తీసుకున్న ఔషధం బాగా పని చేయటంలో మనం తీసుకునే ఆహారం పాత్ర తగినంత ఉన్నదని అర్థమవుతోంది కదా!
మనుషుల విషయం మాత్రమే కాదు, జంతువుల విషయంలో కూడా ఇది వాస్తవం. పశువులని పెంచే వారికి తెలుసు వాటికి ఎటువంటి దాణా ఇవ్వాలో. పైగా పాల వాసన, రుచి బట్టి అవి క్రితంరోజు ఏం తిన్నాయో చెప్పేస్తారు. మాంసాహారులు కూడా శాకాహార జంతువులనే తింటారు కాని, మాంసాహార జంతువులని తినరు. ఇంట్లో పెంచే వాటికి కూడా తాము చంపి తినబోయే ముందు రుచిగా ఉండాలని ప్రత్యేకమైన ఆహారాన్ని పెడతారు. ఇవన్నీ కంటితో చూస్తూ కూడా మనం ఏం తింటున్నాం? పైగా ఈ మధ్యకాలంలో ప్రతివాళ్ళు చెప్పేవాళ్ళే. “ఇది తినద్దు, అది తినద్దు.” “ఈ పండు తింటే ……., !” “ఇవి కలిపి తినండి – కీళ్ల నెప్పులు మటుమాయం” అంటు వాట్సప్ మెసేజ్‌లు.
నిజానికి ఎవరికీ ఏం తినాలో, ఏం తినకూడదో తెలియదా? జాగ్రత్తగా గమనిస్తే తనకి ఏ ఆహారం సరిపడుతుందో, ఏది సరిపడదో శరీరం చెపుతూనే ఉంటుంది. అయినా జిహ్వచాపల్యం అనేది ఒకటి ఉంది. అది ఎంతటిది అంటే – తరవాత చూసుకుందాం, ముందు తినేద్దాం అని తొందర పెడుతుంది. తోచుకోనీయదు.
ఆహారన్నే ఔషధంగా మలచిన సంస్కృతి మనది. ఆయుర్వేదం చెప్పే మాట ఏమంటే ఏ కాలంలో వచ్చే కూరలు, పళ్ళు ఆ కాలంలో తింటే ఆరోగ్యం. అంతే కాని, కానికాలంలో పండినవి మంచివి కాదుట. ఋతువే కాదు దేశం కూడా అంతే. ఏ దేశంలో అంటే ఏ ప్రాంతంలో పండేవి ఆ ప్రాంతం వారికి తగినట్టుగా ఉంటాయి. కొత్త రుచి అని పరాయి ప్రాంతానికి చెందిన వాటిని సరదాకి ఒకటో రెండో తినవచ్చు. కాని, ఎప్పుడూ ఎక్కడో పండినవి, ఏ దేశానికో చెందినవి తింటానంటే ఆరోగ్యానికి ముప్పే! ప్రకృతిమాతకి ఎప్పుడు ఎవరికి ఏవి ఇవ్వాలో తెలుసు. తల్లిమాట వింటే బాగుపడతాం.
నూడుల్స్ అని పిల్లలు ఎగబడి తినే ఆహారం ఎంత ప్రమాదకరమైనదో తెలుసా? దాన్ని మైదాతో చేస్తారు. అరగదు. అనేకమైన అనారోగ్యాలకి మూల కారణం. శారీరక అనారోగ్యం కన్న భయంకరమైనది మానసిక అనారోగ్యం. దాన్ని తయారు చేసే విధానం చూస్తే ఎవరు తినరు. నిజానికి నూడుల్స్‌కి ఏ రుచీ ఉండదు. ఆ రుచి దానిలో వేసే మసాలాది. ఆ మసాలాలో ఉండే ముఖ్యమైన పదార్థం వాటికి ఆ ఘుమఘుమని ఇచ్చే “అజినమాటో” అనే పదార్థం. అది మెదడు చురుకుతనాన్ని తగ్గిస్తుందని పరిశోధనలు నిరూపించాయి. పిల్లలకి అసలు ఇవ్వకూడదని అది వారి మెదడు ఎదుగుదలని తగ్గించి మందబుద్ధులని చేస్తుందని ఆరోగ్యసంస్థలు చెప్పాయి. అయినా మనం మన పిల్లలకి ఇంకా అవే తినటానికి ఇస్తున్నామే!
పిజ్జాలు, బర్గర్లు కూడా మైదాతో చేసేవే. అరగటం ఎంత కష్టమో అందరికి తెలుసు. వాటిలో ఉండే పోషక విలువలూ తెలుసు. అయినా పిల్లలు తినటానికి వాటినే ఇస్తున్నాం. ఎంత దౌర్భాగ్యం. నిజానికి వాటికేమీ పెద్ద రుచి ఉండదు. వాటి మీద అలంకరించే సాస్, కెచప్‌లకి ఉంటుంది ఆ రుచి. అవి నిలవ ఉండటానికి ఉపయోగించే రసాయనిక పదార్థాలు హానికరమైనవని తెలియదనటం అబద్ధం? మన ఊరగాయలు కారం ఉండటం వల్ల అసిడిటీ కలిగించ వచ్చేమో కానీ వాటిలో హానికరమైన రసాయనిక పదార్థాలు ఉండవు.
ఎదిగే పిల్లలకి కావలసిన పోషకాలనిచ్చే పేలపిండిని, అటుకులని వదిలి కార్న్ ఫ్లేక్స్, రైస్ ఫ్లేక్స్ మోజు నుండి ఎప్పుడు బయట పడతాము? చద్దన్నం, పెరుగన్నం ఎంత మంచివో విదేశీ వైద్యపరిశోధకులు నిర్ధారించి చెప్పినా కానీ మన మనస్సు వాటి పైకి పోవటం లేదు. ఈ పనుల ఫలితం ఏమిటో తెలుసా? ప్రస్తుతపు యువతరం, రాబోయే తరం మందబుద్ధులుగా తయారవుతారు. అంటే ఇది ఈ దేశపు భవిష్యత్తు మీద, మేథ మీద జరుగుతున్న దాడి. శారీరకంగా బలహీనమైన ప్రజలు, మానసికంగా చురుకుతనం లేని వారు తయారౌతారు. తెలిసి, తెలిసి దీన్ని సహించి ఊరుకోటం ధర్మమా?