Site icon Sanchika

దివినుంచి భువికి దిగిన దేవతలు 11

[box type=’note’ fontsize=’16’] మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞాన రహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రచన చేశారు డా. ఎం. ప్రభావతీదేవి. [/box]

11. మనువులు-మన్వంతరాలు

11.0 బ్రహ్మకల్పాలు:

[dropcap]కిం[/dropcap]దటి అధ్యాయంలోమనం కాలమాన విజ్ఞాన విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు విశ్వసృష్టి విషయంలో బ్రహ్మదేవునికి సహాయకంగా ఉండే మనువుల గురించి తెలుసుకుందాం. దీనికి ముందు మనం బ్రహ్మకల్పాల గురించి కొంత తెలుసుకుందాం. బ్రహ్మమానంలో గూడా బ్రహ్మనెల అని ఉంది. బ్రహ్మమానంలో గూడా మనకున్నట్టే నెల పొడవునా తిథులుంటాయని మనకు తెలియదు. మనకు అమావాస్య, పూర్ణిమ వెళ్ళాక పాడ్యమి, విదియ లాంటి తిథులు రోజుకోటిగా 15+15= 30 రోజులకు సరిపడా ఎలాగైతే వస్తాయో అలాగే బ్రహ్మమానంలో గూడా 30 కల్పాలు తిథులుగా వస్తాయి. మనకి నెలకి శుక్లపక్షం, కృష్ణపక్షం అని రెండు పక్షాలున్నట్టే బ్రహ్మనెలలో గూడా శుక్లపక్షం, కృష్ణపక్షం అని రెండు పక్షాలున్నాయి. ఈ రెండు పక్షాల్లో యేయే కల్పాలు వస్తాయో చూద్దాం:

శుక్లపక్షంలో వచ్చే కల్పాల పేర్లు: 1. శ్వేతవరాహ, 2. నీలలోహిత, 3. వామదేవ, 4.రథాంతర, 5.రౌరవ, 6.ప్రాణ, 7. బృహత్, 8.కందర్ప, 9.సత్య , 10. ఈశాన, 11.ధ్యాన, 12. సరస్వత, 13. ఉదాన, 14.గరుడ, 15.కూర్మ (ఇది బ్రహ్మకు పౌర్ణమి).

కృష్ణపక్షంలో వచ్చే కల్పాల పేర్లు: 1. నారసింహ, 2. సమాధి,  3. ఆగ్నేయ, 4. విష్ణుజ, 5.సౌర, 6. సోమ, 7.భావన, 8. సప్తమాలి, 9.వైకుంఠ, 10.ఆర్చిష, 11. వాల్మీక, 12. వైరాజ, 13.గౌరీ, 14. మాహేశ్వర, 15. పైతృక (ఇది బ్రహ్మకు అమావాస్య).

11.1 ప్రళయాలు:

కొన్ని కల్పాల గురించి తెలుసుకున్నాం. ఈ కల్పాల్లో ప్రతి కల్పానికి చివర ప్రళయం వస్తుంటుంది. అసలు ప్రళయమంటే ఏమిటి, ప్రళయాలు ఎన్నిరకాలో తెలుసుకుందాం. ప్రళయమంటే నాశనమై పోవడం. ప్రళయాలు 4 రకాలంటారు: 1. యుగ ప్రళయం, 2.మను ప్రళయం, 3.కల్ప ప్రళయం, 4. అవాంతర ప్రళయం.

1.యుగ ప్రళయం:

కాలంగురించి చెప్పుకునేటప్పుడు మనం యుగాలంటుంటాం. మనకు 4 యుగాలు ఉన్నాయి: కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాలు. ప్రతి యుగమూ పూర్తికాగానే ప్రళయం కలుగుతుంటుంది. అక్కడక్కడ భూమ్మీద జీవులు నశిస్తూంటారు.

2.మను ప్రళయం:

ప్రతి మనువుయొక్క ప్రజాపత్యానికి ఇంతకాలమని ఉంటుంది. అది 306720000 మానవ సంవంత్సరాల కాలం. ఆయన పదవీకాలం పూర్తవగానే ఒక ప్రళయం కలుగుతుంది. దాన్ని మను ప్రళయమంటారు. ఈ ప్రళయం1728000 సంవత్సరాల కాలం ఉంటుంది. ఈ ప్రళయంలో భూ, భువర్, సువర్లోకాలు మూడూ, అందులోని జీవకోటి అంతా నశిస్తాయి. అంతా జలమయమైపోతుంది. జీవకోటి అంతా బీజరూపంలో మటుకూ మిగిలిఉంటుంది. గ్రహ, నక్షత్ర, దేవతావర్గాలన్నీ గూడా నశిస్తాయి. తరవాత ఇంకో మనువు వస్తాడు. ఆయన రాగానే మళ్ళీ అన్నీ ఉద్భవిస్తాయి.

3.కల్ప ప్రళయం:

ఈ కల్ప ప్రళయంలో బ్రహ్మాండంలోని 14 లోకాలూ, అందులోని జీవులతోసహా ప్రకృతిలో లీనమవుతాయి. సృష్టి అంతా నశిస్తుంది. ఈ కల్పప్రళయం 432 కోట్ల సంవత్సరాల కోసారి వస్తుంది, అది 432 కోట్ల సంవత్సరాలుంటుంది. బ్రహ్మదేవుడు చేసిన సృష్టంతా ఈ కల్పప్రళయంలో నాశనమైపోతుంది. అది బ్రహ్మదేవునికి రాత్రి. ఆ సమయంలో ఆయన నిద్రపోతాడు.

4. అవాంతర ప్రళయం:

ప్రతి యుగంలోనూ భూకంపాల, ఉప్పెనల, యుద్ధాలవల్ల కొంత నాశనం కలుగుతూ ఉంటుంది. ఈ ఉపద్రవాలన్నీ స్వాభావికంగా కలుగుతుంటాయి.

11.2 శ్వేతవరాహ కల్పం:

ప్రస్తుతం జరుగుతున్నది శ్వేతవరాహకల్పం. ప్రతి కల్పానికి ఉదయకల్పం, క్షయకల్పం అని రెండు భాగాలుంటాయి. బ్రహ్మకు గూడా జాగ్రదవస్థ, నిద్రావస్థ అని ఉంటాయి. ప్రతి ఉదయకల్పంలో బ్రహ్మ తను జాగ్రదవస్థలో ఉండి సృష్టి చేస్తాడు కాబట్టి దాన్ని సృష్టికల్పమంటారు. ప్రతి క్షయకల్పం బ్రహ్మకు రాత్రి కాబట్టి ఆయన ఆ సమయంలో నిద్రావస్థలోకి వెళతాడు కాబట్టి, ఆయన ఉదయకల్పంలో చేసిన సృష్టంతా ఈ క్షయకల్పంలో, కల్పప్రళయం జరిగి అందులో లయించిపోతుంది. కల్పప్రళయమంటే ఏంటో తెలుసుకున్నాం. బ్రహ్మాండంలోని లోకాలన్నీ నీటిలో ముణిగిపోతాయి. మన ముంటున్నఈ భూగోళంగూడా నీటిలో కరిగి తన స్వరూపాన్ని పోగొట్టుకుంటుంది. తిరిగి మరుసటి కల్పం మొదలవగానే మళ్ళీ భూమి అవీ ఏర్పడి సృష్టి జరుగుతుంటుంది. మొత్తం రెండు కల్పాల కాలం కలిపి 864 కోట్ల మానవ సంవత్సరాలు. అది బ్రహ్మకు ఒక రోజు కిందలెక్క – ఒక పగలు+ ఒకరాత్రి.

1. బ్రహ్మధ్యానకాలం:

ప్రస్తుతం జరుగుతున్న ఈ శ్వేతవరాహకల్పానికి ముందు జరిగిన కల్పంలో గల క్షయకల్పం యొక్క అంత్యకాలంలో – క్షయకల్పాంతంలో- రాత్రి చివరికాలంలో, బ్రహ్మ నిద్రనుంచి మేల్కొనడంజరిగి ధ్యానంలోకి వెళ్ళాడు. బ్రహ్మ ధ్యానంలోకి వెళ్ళి గ్రహ, నక్షత్ర, దేవ, దైత్యాది సకల చరాచరాన్ని సృజించాడు. దీనికి 17064000 మానవ సంవత్సరాల కాలం పట్టిందాయనకు. దాన్నే బ్రహ్మధ్యానకాలమంటారు. అదే ఆయనకు ఉష:కాలం. ఈ గ్రహ, నక్షత్రాదుల చలనమారంభమైన క్షణంనుండే ఈ సృష్టి యొక్కకాలగణనం ప్రారంభమైంది. అంటే గడచిన కల్పం మొక్క చివరి కాలంలోనే సర్వం సృజించబడింది. అప్పటినుంచే కాలగణన లెక్కలోకి వచ్చింది.

2. బ్రహ్మ చేసిన మానసికయజ్ఞం:

బ్రహ్మ ధ్యానకాలంలో, ఆయన సృష్టి ప్రారంభించడానికి ముందు, వేదమంత్రాలతో మానసికంగా యజ్ఞం చేసాడు. అందువల్లనే సృష్టి చేయగలిగాడు. ఈ విషయమే పురుషసూక్తంలోఉంది: మొదట బ్రహ్మ తన అండమును భేదించి భూలోక, భువర్లోక, స్వర్గలోకాలను విభజించక పూర్వమే, అంటే ఈ సృష్టికి పూర్వమే వేదసూక్తాలను పఠిస్తూ మానసికయజ్ఞం చేసాడు. అగ్నిష్టోమ యజ్ఞం చేత ఆయన ప్రజాసృష్టి చేసాడు అని ఉపనిషత్తుల్లో గూడా ఉంది. ఋగ్వేదంలో ఇంకా ఇలా ఉంది: ‘మానసికయజ్ఞంలో ఉషాదేవతా రూపకమైన ఇటుకలు పెట్టినట్టు భావింపబడి ఉషస్సులు స్తోత్రం చేయబడినాయి. అప్పటికింకా సూర్యచంద్రాది గ్రహాలుగానీ, వానికధిష్టానాలైన ఉషాదేవతలుగాని సృజింపబడలేదు. అలాంటి భావనా యజ్ఞం తరవాతనే దేవతావర్గాలు సృజింపబడ్డాయి’.

3.నేటి ఈ శ్వేతవరాహకల్పసృష్టికాలగణన ప్రారంభమై గడచిన కాలం:

మనం ప్రస్తుతముంటున్న ఈ శ్వేతవరాహకల్ప సృష్టి ప్రారంభమైనరోజు : ప్రమాది నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి ఆదివారం.

“సౌరమానం ప్రకారం ఆ రోజున సూర్యాది సప్తగ్రహాలన్నీ మీనరాశిని వదిలి, మేషరాశిలో ప్రవేశించాయి. చాంద్రమానం ప్రకారం ఈ సప్తగ్రహాలు రేవతీ నక్షత్రం దాటి అశ్వని నక్షత్రంలో ప్రవేశించాయి. అప్పటినుండి గ్రహ, నక్షత్రాదుల చలనం మొదలైంది. ఆ క్షణం నుండే సృష్టి కాలగణన ప్రారంభమైంది. ఈ లెక్క మనం కల్పాది నుండి వేసుకోవాలి. కల్పాదిఅంటే – ఈ శ్వేతవరాహకల్పాది. ఈ లెక్కన చూస్తే, సృష్టి కాలగణన ప్రారంభమై ఇప్పటికి 197,29,49,120 సంవత్సరాలు. ఇందులో గడచిన క్షయకల్పం చివరలో బ్రహ్మ ధ్యానంలో గడిపి సర్వంసృజించిన కాలాన్ని(1,70,64,000 సంవత్సరాలు) కలపలేదు. అది గడచిన కల్పానికి చెందిన చివరి కాలం కాబట్టి దాన్ని కలపకూడదు. ఈ శ్వేతవరాహ కల్పాదిన జరిగిన గ్రహ, నక్షత్రాదుల చలనంతోనే సృష్టి కాలగణనకు అనువైన సమయం లభిస్తుంది. అందువల్ల సృష్టి ప్రారంభమైన కాలం వేరు, సృష్టి కాలగణన ప్రారంభమైన కాలం వేరని గ్రహించాలి”. కల్పాది నుండి సృష్టి కాలగణన ప్రారంభమై ఇప్పటికి 197,29,49,120 సంవత్సరాలు.

4. సృష్టి ప్రారంభమై ఇప్పటికి గడచినకాలం:

1 గడచిన క్షయకల్పం చివరలోబ్రహ్మ ధ్యానంలో గడిపి సర్వం సృజించిన కాలాన్ని(1,70,64,000 సంవత్సరాలు), కల్పాది నుండి నేటికి గడచిన కాలానికి కలిపితే, సృష్టి ప్రారంభమై నేటికి ఎంతకాలం గడిచిందన్నది తెలుస్తుంది:

కల్పాదినుండి నేటికి గడచినకాలం = 197,29,49,120 +
క్షయకల్పంలో బ్రహ్మ ధ్యానకాలం = 1,70,64,000
సృష్టి ప్రారంభమై నేటికి = 199,00,13,120 సంవత్సరాలు.

11.3 మనువులు లోకపాలకులు:

బ్రహ్మకాలమానం ప్రకారం బ్రహ్మనెలలో 30 కల్పాలు తిథులుగా వస్తాయన్నది చూసాం. ఈ కల్పాల్లో, మనువుల సాయంతో బ్రహ్మ ఈ బ్రహ్మాండంలోని లోకాలను పాలిస్తాడు, గనక ఈ మనువులు బ్రహ్మకు సహాయానికై విష్ణువు నియోగించిన అధికారులు, పరిపాలకులు. వారే లోకనాయకులన్నమాట. వారంతా ప్రజాపతులన్నది మనం మరువ కూడదు. వారికి నిర్ణయించిన కాలాల్లో వారు తమ పరిపాలన సాగిస్తారు. తరవాత వారంతా మళ్ళీ తపస్సుకు వెళ్ళిపోతారు. మొత్తానికి బ్రహ్మ యొక్క ఒక్కక్క సృష్టికల్పంలో 14 మంది మనువులు ఆయనకు సహాయకంగా ఉంటారు. వారికి కేటాయించిన కాలాలనే మన్వంతరాలని అంటాం. ఈ 14 మందికి 14 మన్వంతరాలున్నాయి. ప్రతి మన్వంతరానికి దానికి సంబంధించిన అధికారులు నిర్దేశింపబడి ఉంటారు : ఇంద్రుడు, దేవతలు, ఋషులు, దర్మరక్షణ కోసం విష్ణువు యొక్క అవతారం/అవతారాలు, మనువుల సంతానం. అవి తెలుసుకుందాం.

11.4 ఈ కల్పంలోని మనువుల పేర్లు:

బ్రహ్మ యొక్క ఒక్కో సృష్టి కల్పంలో 14 మంది మనువులాయనకు సాయంగా ఉంటారు అని తెలుసుకున్నాం. ఈ కల్పంలో భూత, భవిష్యత్, వర్తమానాలకు చెందిన వారి పేర్లు:

1. గడచిన 6 మన్వంతరాలకు చెందిన మనువులు:

  1. స్వాయంభువ, 2. స్వారోచిష, 3. ఉత్తమ, 4. తామస, 5. రైవత, 6. చాక్షుష. 2. ప్రస్తుత మన్వంతరానికి చెందిన మనువు: 7వ వాడైన వైవస్వత మనువు. 3. భవిష్యత్తులో వచ్చే మనువులు: 8. సూర్యసావర్ణి, 9. దక్షసావర్ణి, 10. బ్రహ్మసావర్ణి, 11. ధర్మసావర్ణి, 12. భద్రసావర్ణి. 13. దేవసావర్ణి, 14. ఇంద్రసావర్ణి.

11.5 గడచిన 6 మంది మనువులు-మన్వంతరాలు:

1. స్వాయంభువ మనువు – స్వాయంభువ మన్వంతరం (బ్రహ్మ పుత్రుడు) :

స్వాయంభువ మన్వంతరం మొదటి మన్వంతరం. ఈ స్వాయంభువ మనువు గురించి మనం ముందరే తెలుసుకున్నాం. ఈయన స్వయంభువైన బ్రహ్మ పుత్రుడు. ఈయన భార్య శతరూప. వారి పుత్రులు: ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. వారి పుత్రికలు: ఆకూతి, దేవహూతి, ప్రసూతి. వీరి వల్లనే లోకాల్లో జీవరాశులు అభివృద్ధి గాంచాయి. స్వాయంభువ మనువు భోగాలంటే విరక్తి చెంది, రాజ్యాన్ని విడిచిపెట్టి, బార్యతో గూడా అడవులకు వెళ్ళి, వందేళ్ళు తపస్పు సాగించాడు. ఆ సమయంలో కొందరు రాక్షసులు ఆయన్ను చంపి తినబోగా విష్ణువు యొక్క అవతారమైన యజ్ఞుడు తన చక్రంతో ఆ రాక్షసులను సంహరించాడు. ఈ మన్వంతరంలో విష్ణువు యొక్క అవతారాలు రెండు-యజ్ఞుడు, కపిలుడు. ఈయన కాలంలో ఎవరెవరు ఇంద్రుడు, దేవతలు, సప్తఋషులుగా ఉన్నారు. దర్మరక్షణకోసం విష్ణువు యే అవతారాలు ఎత్తాడు? మను సంతానం మొదలగునవి తెలుసుకుందాం.

  1. ఇంద్రుడు: ఉపేంద్ర (జయంత).
  2. దేవతలు: తుషితాదులు (12 వర్గాలు).
  3. సప్తఋషులు: భృగు, మరీచి, అత్రి, క్రతు, అంగిరస, వసిష్ఠ, పులహ.
  4. విష్ణువు అవతారాలు: యజ్ఞ, కపిల.
  5. మను సంతానం (పుత్రులు): ప్రియవ్రత, ఉత్తానపాద.

2. స్వారోచిష మనువు – స్వారోచిష మన్వంతరం (అగ్నిపుత్రుడు):

ఈ స్వారోచిష మనువు స్వరోచి పుత్రుడు. అల్లసాని పెద్దనగారి మనుచరిత్రలో ఈయన గురించే ఉంది. వరూధినీప్రవరాఖ్యుల కథ అందరికీ తెలిసిందే. వరూధునికీ మాయా ప్రవరాఖ్యు(ప్రవరు)నికీ పుట్టినవాడు స్వరోచి. ఈ స్వరోచికి వనదేవత వల్ల కలిగిన పుత్రుడే స్వారోచి. వేదశిరుడనే బ్రాహ్మణుని భార్య అయిన తుషితకు పుత్రుడుగా విష్ణువు, విభు అనే పేరుతో జన్మించాడు. ఇంద్రాదుల వివరాలు:

  1. ఇంద్రుడు : రోచన (విపశ్చిత).
  2. దేవతలు : తుషితాదులు.
  3. సప్తఋషులు : ప్రాణ, వాత, అగ్ని, ఊర్జక, స్తంబక, వృష, నిస్వర.
  4. విష్ణువు అవతారం: విభు.
  5. మను సంతానం (పుత్రులు) : ద్యుమంత,సుశేణ, రోచిష్మంత.

3. ఉత్తమమనువు – ఉత్తమ మన్వంతరం (ప్రియవ్రతుని పుత్రుడు):

ప్రియవ్రతుని పుత్రుడైన ఉత్తముడు 3వ మనువై ఈ భూమండలాన్నంతా పాలించాడు. ఈయన పుత్రులైన పవనాదులు చాలా గుణవంతులు. వషిష్ణుని పుత్రులు సప్తఋషులైరి. విష్ణువు యొక్క అవతారం పేరు సత్యసేన. ఈయన ధర్మునికి, సూనృతకు పుట్టాడు. ఈయన దుష్ట యక్ష, రాక్షసులను దండించాడు. ఇంద్రాదుల వివరాలు:

  1. ఇంద్రుడు : సత్యజిత్తు.
  2. దేవతలు : సత్య, భద్ర, సుధామ, శివ, ప్రతర్ధన, వికర్తాదులు (12 వర్గాలు).
  3. సప్తఋషులు : విరజ,గోత్ర, ఊర్ధ్వబాహు,పవన,ననఘ, సుతప,శక్ర. (వషిష్ణుని పుత్రులు). కొన్ని పుస్తకాల్లో వారి పేర్లు ప్రమథాదులు అని ఉంది.
  4. విష్ణువు అవతారాలు : సత్య సేన
  5. మనుసంతానం (పుత్రులు) : పవన, సృంజయ, యజ్ఞహెూత్రాదులు.

4. తామస మనువు – తామస మన్వంతరం (ఉత్తముని సోదరుడు):

ఉత్తమ మనువు యొక్క సోదరుడు తామస మనువు. ఈయన కుమారులైన కేతు మొదలైనవారు చాలా బలవంతులు. వారంతా రాజులయ్యారు. విష్ణువు అవతారం పేరు హరి. ఈయనే మొసలి బారిన పడ్డ గజేంద్రుని రక్షించినవాడు. ఇంద్రాదుల వివరాలు:

  1. ఇంద్రుడు : త్రిశిఖ(శిబి).
  2. దేవతలు : సత్యక,హరి, వీరాది 28 వర్గాలు.
  3. సప్తఋషులు : కావ్య, చైత్ర,పృథు, అవ్యవర్ణ,అగ్ని ,పీవర,జ్యోతిధామ/ వ్యోమ.
  4. విష్ణువు అవతారం : గజేంద్రుని కాపాడిన హరి (హరిమేధునికి, హరిణికి నారాయణుడు హరి అన్న పేరుతో పుట్టాడు).
  5. మను సంతానం (పుత్రులు) : కేతు, వృష, నర, ఖ్యాత, జాను, జంఘ, రూపాదులు.

5. రైవత మనువు – రైవత మన్వంతరం (తామస మనువు తమ్ముడు):

తామస మనువు తమ్ముడైన రైవతుడు 5వ మనువు. ఈయన పుత్రులు భూలోకంలో రాజులయ్యారు. ఈ మన్వంతరంలో శుభ్రునికి ఆయన భార్య వికుంఠకు విష్ణువు పుత్రుడుగా పుట్టాడు. ఆయన ఈ భూమ్మీదనే వైకుంఠమనే లోకాన్ని సృష్టించాడు. లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు. ఇంద్రాదుల వివరాలు:

  1. ఇంద్రుడు : వేదశీర్ష.
  2. దేవతలు : అమితాభ, వైకుంఠ, కావ్యాది 28వర్గాలు. కొన్ని పుస్తకాల్లో భూతరయుడు మొదలైన వారు దేవతలని ఉంది.
  3. సప్తఋషులు : శ్రీమంత, పరజన్య, ధామక, హిరణ్యరోమ, దేవబాహు, ఊర్ధ్వబాహు, వేదవంత.
  4. విష్ణువు అవతారం: వైకుంఠ.
  5. మను సంతానం (పుత్రులు) : ప్రతివింధ్య, అర్జున, బల, బంధు, ప్రియవ్రత మొదలగువారు.

6. చాక్షుష మనువు -చాక్షుష మన్వంతరం (ధ్రువుని వంశంలోని సర్వతేజుని పుత్రుడు. చక్షుస్సుని పుత్రుడని గూడా అంటారు):

ఈ చాక్షుషుడు, సర్వతేజునికి ఆకూతికి పుట్టినవాడు. ఈయన 6వ మనువుగా ఉన్నాడు. ఈయనకు అడ్వల అనే భార్య యందు 12 మంది పుత్రులు కలిగారు ఈ మన్వంతరంలో విష్ణువు ఈ కింది అవతారాలు తీసుకున్నాడు:

  1. అజితుడన్న పేరుతో సంభూతి, వైరాజులకు పుత్రుడుగా పుట్టాడు.
  2. ఈయనే క్షీరసాగర మథనమప్పుడు కూర్మమై మందర పర్వతాన్ని మోసాడు.
  3. మోహినీ అవతారమెత్తి దేవతలకు అమృతాన్ని పంచాడు.

ఇంద్రాదుల వివరాలు:

  1. ఇంద్రుడు : మంత్రద్యుమ్న (మనోజవ).
  2. దేవతలు : ఆప్యాదిక, ఆర్య, ప్రభూత, భవ్య, రేభాది (అష్టగణాలు).
  3. సప్తఋషులు : సుమేరు, విరజ, హవిష్మంత, ఉత్తమ, మధు, సహిష్ణు, అతినామక.
  4. విష్ణువు అవతారాలు : అజిత, కూర్మ, మోహిని.
  5. మనుసంతానం (పుత్రులు): పురు, కుత్స, త్రిత, సత్యవంత, ప్రద్యుమ్న, సుద్యుమ్న, ఋత, ప్రత, అగ్నిష్టోమ, అతిరాత్ర, శిబి, ఉల్ముఖ.

ఇంతవరకు జరిగిపోయిన మన్వంతరాలని గూర్చి తెలుసుకున్నాం. ఇప్పుడు జరుగుతున్న వైవస్వత మన్వంతరం గరించి తెలుసుకుందాం.

11.6 వైవశ్వత మనువు-7వదైన వైవశ్వత మన్వంతరం (ఇప్పుడు జరుగుతున్నది):

చాక్షుష మన్వంతర చివరి సమయంలో, ద్రవిడదేశాన్ని సత్యవ్రతుడనే రాజు పాలించేవాడు. ఆయన ఒక నదీతీరంలో విష్ణువుని గూర్చి తపస్సు చేయసాగాడు. ఒక రోజున ఆయన దోసిట్లో నీటిని గ్రహించి తర్పణమిద్దామనుకునేసరికి ఆయన చేతిలోకి ఓ చిన్న చేపపిల్ల దూరింది. దాన్ని కింద పారవేయగా అది ఆ రాజుని వేడుకుంది ‘తనకి తక్కిన జలచరాల వల్ల ప్రాణ భయముందని తన్ను రక్షించమ’ని. అంతట ఆయన దాన్నితన కమండలంలో ఉంచి తన నివాసానికి తీసుకుపోయాడు. అది రోజురోజుకీ పెరిగిపోతుండగా దాన్ని ఆయన మహాసముద్రంలో విడిచిపెట్టాడు. అప్పటికీ అది ఆయనతో మాట్లాడుతుండగా, అది మామూలు చేప కాదని విష్ణువు తప్ప ఇంకెవ్వరూ కారని గ్రహించి ఆయన ప్రార్థించాడు. అప్పుడా మత్స్యం ఆయనతో ఏం చేయాలో చెప్పింది: ‘మన్వంతరం ముగియబోతోంది, ప్రళయం రాబోతోంది, ఈ భూ, భువర్, సువర్లోకాలు మునిగిపోతాయి, ఒక పెద్దనావ ఆ రాజు వద్దకు వస్తుంది, అందులో సప్తఋషులుంటారు, ఆ రాజు అన్ని ఓషధులు, బీజాలు రాశులుగా ఆ నావలో పోసి ఉంచాలి, ఆ చేప కొమ్ముకు ఒక పాముని తాడుగా చేసి ఆ నావకు బిగించి కట్టాలి, ప్రళయకాలం ముగిసేవరకు ఆ నావలో ఉండాలి. ఆ రాజు అట్లాగే చేసాడు. ఆ మత్సావతారాన్ని అనేక విధాలుగా స్తుతించాడు ఆ సప్తఋషులతో కలిసి. విష్ణువు యొక్క అనుగ్రహం వల్ల ఆ రాజే సూర్యునికి పుత్రుడుగా పుట్టి వైవస్వత మనువుగా ప్రసిద్దిగాంచాడు. అంటే మరీచి పుత్రుడైన కశ్యప ప్రజాపతికి అదితి వల్ల సూర్యుడు (వివస్వంతుడు) పుట్టాడు. ఆ సూర్యునికి భార్య సంజ్ఞాదేవి వల్ల యముడు, శ్రాద్ధదేవుడు అనే పుత్రులు,యమున అనే పుత్రిక కలిగారు. ఈ శ్రాద్ధదేవుడే 7వ మనువైన వైవస్వంతుడు. ఆయనే కిందటి జన్మలో – చాక్షుష మన్వంతర చివరి కాలంలో ఉన్న సత్యవ్రతుడనే రాజు.

శ్రాద్ధదేవుని భార్య శ్రద్ధ. ఆయన పుత్రుల కోసం యజ్ఞం చేసాడు, కానీ ఆయన భార్య పుత్రిక కావాలనుకుంది. ఆవిడ కోరిక ప్రకారం కూతురు కలిగేట్టుయజ్ఞం జరిగింది. అప్పుడు ఇళ/ఇల అనే కూతురు పుట్టింది. మనువుకు విచారం కలిగి వసిష్ఠులవారిని వేడుకోగా ఆయన విష్ణువుని స్తుతించి ఆయన అనుగ్రహంతో ఆ కన్యను సుద్యుమ్నుడనే పురుషుడుగా మారేట్టు చేసాడు. తరవాత సుద్యుమ్నుడు విధివశాన మళ్ళీ స్త్రీ గా మారి చంద్రుని పుత్రుడైన బుధుని వరించి పురూరవుడనే పుత్రునికి జన్మనిచ్చింది. ఐతే సుద్యుమ్నుడు తన పరిస్థితికి విచారించి గురువైన వసిష్ఠులవారిని వేడుకోగా ఆయన శంకరుడ్ని ఆరాధించాడు. ఆయన అనుగ్రహంతో సుద్యుమ్నుడు ఒకనెల స్త్రీ గాను ఇంకోనెల పురుషుడు గాను ఉండసాగాడు. అతనికి ఇంకా ముగ్గురు కొడుకులు కలిగారు: ఉత్కళుడు, గయుడు, విమలుడు. వారందరికీ తగిన రాజ్యభాగాల్ని పంచిచ్చాడు. చివరికి సుద్యుమ్నుడు వృద్ధుడయ్యాక తన రాజ్యాన్ని బుధుని కొడుకైన పురూరవునకిచ్చి తాను అడవులకు వెళ్ళిపోయాడు. అప్పుడు వైవస్వత మనువు పుత్రుల కోసం చాలాకాలం తపస్సు చేసాడు హరిని గూర్చి. హరి అనుగ్రహంతో మనువుకు 10 మంది కొడుకులు కలిగారు: ఇక్ష్వాకు, నృగ, శర్యాతి, దిష్ట, ధృష్ట, కరూశక, అరిష్యంత, పృషధ్ర, నభగ, కవి. వివస్వంతుడు (సూర్యుడు) వీరికి మూలపురుషుడు కనుక వీరికి సూర్యవంశస్థులు అని పేరొచ్చింది. తరవాత పురూరవుని తండ్రి, చంద్రుని కొడుకైన బుధుడు కనుక, ఆ వంశం వారికి చంద్రవంశస్థులు అని పేరొచ్చింది. వైవస్వత మనువు కాలంలో ఇంద్రాదుల వివరాలు:

  1. ఇంద్రుడు : పురందరుడు.
  2. దేవతలు : ఆదిత్యులు, మరుత్తులు, అశ్వినులు, వస్తువులు,రుద్రులు మొదలగువారు.
  3. సప్తఋషులు : గౌతమ, కశ్యప, అత్రి, విశ్వామిత్ర, జమదగ్ని భరద్వాజ, వసిష్ఠ.
  4. విష్ణువు అవతారం: వామన.
  5. మను సంతానం (పుత్రులు) : ఇక్ష్వాకు మొదలైన వారు.

11.7 రాబోయే ఏడుగురు మనువులు:

మన ఋషుల గొప్పతనమంతా రాబోయే మనువుల గురించి గూడా వివరించిన విధానంలో ఉంది. జరుగుతున్న మన్వంతరమే కాదు, జరగబోయే మన్వంతరాల గురించి గూడా మనకు తెలియచెప్పారు మన ప్రాచీన ఋషులు.

రాబోయే ఏడుగురు మనువులు:

  1. సూర్యసావర్ణి, 2. దక్షసావర్ణి, 3.బ్రహ్మసావర్ణి, 4. ధర్మసావర్ణి, 5. భద్రసావర్ణి, 6. దేవసావర్ణి, 7. ఇంద్రసావర్ణి.

11.8 రాబోయే మనువులు – మన్వంతరాలు :

1. సూర్యసావర్ణి (అష్టమ – 8వ) మనువు – సూర్యసావర్ణి మన్వంతరం:

సూర్యుని పుత్రుడే సూర్యసావర్ణి. సూర్యుని భార్య సంజ్ఞాదేవి ఆయన తేజస్సును భరించలేక, తననుండి ఛాయ అనే స్త్రీని సృష్టించి సూర్యునికి భార్యగా ఉంచి, ఆ సంగతి ఎవరికీ చెప్పద్దని ఆమెకు చెప్పి వెళ్ళిపోతుంది పుట్టింటికి. సూర్యునికి ఛాయ వల్ల ముగ్గురు పిల్లలు పుడతారు: తపతి, సావర్ణి, శనైశ్చరుడు. తపతిని సంవరుణుడు వివాహమాడతాడు. సూర్యునికి చాలా కాలనికి గాని తెలియదు సంజ్ఞాదేవి తనను విడిచి వెళ్ళిపోయిందని. అది తెలిసాక ఆమెను వెతుక్కుంటూ వెళతాడు. ఆమె బడబగా (ఒక ఆడగుర్రం రూపంలో) ఉందని తెలిసి తను గూడా ఒక మగగుర్రం రూపంలో వెళ్ళిఆవిడను కలుస్తాడు. వారికి అశ్వినీదేవతలు పుడతారు. వారు దేవవైద్యులుగా పేరొందారు. సూర్యునికి ఛాయకు పుట్టిన సావర్ణి అష్టమమనువుగా అవుతాడు. ప్రస్తుతం ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. విష్ణువు సార్వభౌమ అన్న పేరుతో వేదగుహికిని సరస్వతికిని పుత్రుడుగా పుడతాడు. ఆయనవల్ల బలి ఇంద్రపదవిని పొందుతాడు. సూర్యసావర్ణి కాలంలో ఇంద్రాదుల వివరాలు:

  1. ఇంద్రుడు : బలి.
  2. దేవతలు : సుతపులు, విరజులు, అమృతులు,ప్రభులు.
  3. సప్తఋషులు : గాలవ, దీప్తిమంత, పరశురామ, అశ్వత్థామ, కృపాచార్య, వ్యాస, ఋష్యశృంగ.
  4. విష్ణువు అవతారం: సార్వభౌమ.
  5. మను సంతానం (పుత్రులు) : నిర్మోహ, విరజస్క మొదలగువారు.

2. దక్షసావర్ణి (నవమ-9వ) మనువు – దక్షసావర్ణి మన్వంతరం:

వరుణుడికి పుట్టినవాడు దక్షసావర్ణి. ఆయనకు ధృతకేతువు, దీప్తకేతువు మొదలగు పుత్రులు పుట్టి రాజులౌతారు. విష్ణువు అంబుధారకు, ఆయుష్మంతునికి ఋషభుడు అనే పేరుతో పుట్టి దేవతలను రక్షిస్తాడు. ఇంద్రాదుల వివరాలు:

  1. ఇంద్రుడు : అద్బుతుడు.
  2. దేవతలు : పర, మరీచి, సుదర్శ, గరాదులు.
  3. సప్తఋషులు : సపన, భవ్య, నాభాగ, ద్యుతిమంతుడు మొదలగువారు.
  4. విష్ణువు అవతారం: ఋషభుడు (అద్భుతుడు అని కొన్ని గ్రంథాల్లో ఉంది).
  5. మను సంతానం (పుత్రులు) : ధృతకేతువు, దీప్తకేతువు మొదలగువారు.

3. బ్రహ్మసావర్ణి (దశమ -10 వ) మనువు – బ్రహ్మసావర్ణి మన్వంతరం:

ఉపశ్లోకుని పుత్రుడు బ్రహ్మసావర్ణి. ఆయన పుత్రులు భూరిషేణుడు మొదలగువారు. ఆయన కాలంలో విష్ణువు విష్వక్సేనుడు అను పేరుతో విశ్వసృజునికి విషూచికి పుట్టి ఇంద్రుడికి సాయంగా ఉంటాడు. ఇంద్రాదుల వివరాలు:

  1. ఇంద్రుడు : శంభుడు.
  2. దేవతలు : విబుద్ద్యాదులు, సుఖ, సుఖాత్మ, సుధర్మ మొదలగువారు.
  3. సప్తఋషులు : సత్య, నాభాగ, సంస్తుతి, సత్యకేత, ప్రతిమ, ఆరిష్మంత, తపోధన.
  4. విష్ణువు అవతారం: విష్వక్సేనుడు.
  5. మను సంతానం (పుత్రులు) : భూరిషేణుడు మొదలగువారు.

4. ధర్మసావర్ణి (ఏకాదశ -11 వ) మనువు – ధర్మసావర్ణి మన్వంతరం:

ఈ కిందిచ్చిన వివరాలు తప్ప ఇంకేవీ లభించలేదు:

  1. ఇంద్రుడు : వైధృతుడు.
  2. దేవతలు : విహంగాలు, కామగమనులు, నిర్వాణులు,రుచులు.
  3. సప్తఋషులు : అరుణుడు… మొదలగువారు.
  4. విష్ణువు అవతారం: ధర్మతేజువు ధర్మకేతువు/(సూర్యపుత్రుడు).
  5. మనుసంతానం (పుత్రులు) : సర్వత్రగ, సుధర్మ, దేవానీక, సత్యధర్ముడు మొదలగువారు.

5. భద్రసావర్ణి (ద్వాదశ -12 వ) మనువు – భద్రసావర్ణి మన్వంతరం:

ఈ కిందిచ్చిన వివరాలు తప్ప ఇంకేవీ లభించలేదు:

  1. ఇంద్రుడు : ఋతుధాముడు.
  2. దేవతలు : హరిత, రోహిత మొదలగువారు.
  3. సప్తఋషులు : తపోమూర్తి, తపస్వి, తపోమయ, తపోరతి, తపోధృతి, తపోధన, ద్యుతిమంత.
  4. విష్ణువు అవతారం: స్వధామ (సత్యతునికి సూనృతకు పుత్రుడు).
  5. మను సంతానం (పుత్రులు) : దేవవంతుడు, ఉపదేవుడు, దేవజ్యేష్ఠుడు మొదలగువారు.

6. దేవసావర్ణి (త్రయోదశ -13వ) మనువు – దేవసావర్ణి మన్వంతరం:

ఈ కిందిచ్చిన వివరాలు తప్ప ఇంకేవీ లభించలేదు:

  1. ఇంద్రుడు : దివస్పతి (సుత్రామ).
  2. దేవతలు : ధర్మ, సుకర్మ,సుధామ మొదలగువారు.
  3. సప్తఋషులు : నిర్మోహక, ప్రధర్య, నిప్రకంప, అవ్యయ,నిత్య, నిరుత్సుక, హితమతి.
  4. విష్ణువు అవతారం: యోగవిభుడు (దేవహోతకు బృహతికి పుత్రుడు).
  5. మనుసంతానం (పుత్రులు) : చిత్రసేన, విచిత్రాదులు.

7. ఇంద్రసావర్ణి (చతుర్దశ -14 వ) మనువు – ఇంద్రసావర్ణి మన్వంతరం:

ఈ కిందిచ్చిన వివరాలు తప్ప ఇంకేవీ లభించలేదు:

  1. ఇంద్రుడు : శుచి.
  2. దేవతలు : సావిత్రక, చాక్షుష, నిష్ణా, వాచావృద్ధాదులు.
  3. సప్తఋషులు : అగ్నిబాహు, శుచి, శుక్ర, మాగధ, అగ్నిరథ,యుక్త, అజిత.
  4. విష్ణువు అవతారం: బృహద్భానుడు (సత్రాయణ, వితానల పుత్రుడు).
  5. మను సంతానం (పుత్రులు) : గంభీర, వసు మొదలగువారు.

ఇంతవరకు ఈకల్పంలో భూత,భవిష్యత్, వర్తమానాలకు చెందిన మనువుల గురించి తెలుసుకున్నాం.

11.9 గొప్పవైన ఈ మనుపదవులు ఎవరివల్ల, ఎందుకు లభిస్తాయి?

మనువులు, సప్తర్షులు, మనువుల యొక్కసంతానము, ఇంద్రులు,దేవతలు అందరూ గూడా విష్ణువు యొక్కఆజ్ఞకు లోబడి ఉంటారు. యజ్ఞుడు మొదలైన వారంతా శ్రీహరి యొక్క అంశలుగా రూపుని దాల్చగా, మనువులు వారి సాయంతో లోకాలను పాలిస్తూ ఉంటారు. అప్పుడు తిరిగి ఋషులు వాళ్ళ తపోబలంతో వేదాలను మళ్ళీ దర్శిస్తారు. పూర్వంలాగ ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. విష్ణువు ఆజ్ఞ మేరకు మనువులు పరిపాలన చేస్తారు. రాజులు ఈ జగత్తును విభజించుకుని తమతమ కాలాల్లో వారు పరిపాలన సాగిస్తారు. శ్రీహరే జీవుల యొక్క పుణ్యార్హతను బట్టి వారికి తగిన పదవులు లభించేట్టు చేస్తాడు. జీవులు ఎక్కువ పుణ్యం చేసుకుంటే ఉన్నత పదవులొస్తాయి. ఇదివరకటి కల్పాల్లో ఈశ్వరుడ్ని అనేక రకాలుగా ఆరాధించినవారికి – తపస్సులో పండిపోయినవారికి పాంచభౌతిక వికారాలు పోతాయి, రాజసిక, తామసిక దోషాలు పోతాయి. శుద్ధ సత్వగుణం మాత్రం మిగిలి, దివ్యత్వం పొందుతారు. వారి పాంచభౌతిక సూక్ష్మాణువులను ఈశ్వరుడు తీసుకుని, సృష్టికాలంలో దివ్యపురుషులుగా సృజిస్తాడు. అలాంటి పుణ్యజీవులనే భగవంతుడు ఎంచుకుని, విశ్వనిర్వహణ కోసం వాడుకుంటాడు. అలాంటివారే ఈ బ్రహ్మాదిదేవతలైనా, మనువులైనా, సూర్యచంద్రాది గ్రహాధిదేవతలైనా. అందుకే మనం వారిని ఆరాధించేది. నిజానికి శాశ్వతుడైన ఈశ్వరడే ఇన్ని రూపాల్లో, అనేక వృత్తుల్లో వెలుగొందుతున్నాడు. ఆయనే యోగీశ్వరుని రూపంలోయోగాన్ని బోధిస్తాడు. మౌనిరూపంలో కర్మానుష్టానాన్ని ప్రబోధిస్తాడు. ప్రజాపతి రూపంలో సృష్టిని చేస్తాడు. ఇంద్రుడై రాక్షసులను సంహరిస్తాడు. సిద్ధునిగా ఙ్ఞానబోధను చేస్తాడు. కాలరూపంగా సర్వాన్ని కబళిస్తాడు.

11.10 మనువుల పదవీకాలం:

మనువులన్నా ప్రజాపతులన్నా ఒకటేనని చెప్పుకున్నాం. మనువుల పదవీకాలాన్ని మన్వంతరమంటారు. ఒక మన్వంతరమంటే 71 మహాయుగాలు + ఒక కృతయుగసంధి. ఒక మహాయుగమంటే 43లక్షల ఇరవైవేల (43,20,000) మానవ సంవత్సరాలు. ఆ లెక్కన ఒక మన్వంతరమంటే 30 కోట్ల, 84 లక్షల, 48 వేల (30,84,48,000) మానవ సంవత్సరాలు. 14 మన్వంతరాల కాలం పూర్తి అయ్యేసరికి బ్రహ్మకు ఒక పగలు – సృష్టికల్పం.. కిందటి అధ్యాయంలో ప్రాజాపత్యమానంలో చెప్పుకున్నాం. మన సౌరకుటుంబమంతా కలిసి ఒక్కసారి సూర్యుడ్ని ఆకర్షిస్తున్న ప్రద్యుమ్న గోళం చుట్టూ తిరగడానికి ఒక మహాయుగం పడుతుందని, అలా వెయ్యి సార్లు తిరిగితే ప్రాజాపత్య ఆయుష పూర్తి అవుతుంది. అంటే 43,20,000 X 1000 = 4320000000 సంవత్సరాలు.

అదే ఈ ప్రద్యుమ్న గోళం తనకు సంబంధించిన ఇతర గోళాలతోను, మన సౌరకుటుంబంతోను కలిసి తనను ఆకర్షిస్తున్న సంకర్షణ గోళం చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే కాలం. అది బ్రహ్మమానం ప్రకారం బ్రహ్మకు ఒక పగలు. ఇది ఇంకా బాగా తెలియాలంటే ఈకింది విధంగా లెక్క కడదాం: 1 మహాయుగం= 43,20,000 మానవ సంవత్సరాలు. మన సౌరకుటుంబమంతా కలిసి ప్రద్యుమ్నగోళం చుట్టూ 1 సారి తిరగడానికి పట్టే కాలం = 1 మహాయుగం =43,20,000 సంవత్సరాలు. అలా 1000 సార్లు తిరిగితే పట్టేకాలం =432,0000000 సంవత్సరాలు. ప్రద్యుమ్న గోళం+ సంబంధిత ఇతర గోళాలు+ మన సౌరకుటుంబం కలిసి సంకర్షణ గోళం చుట్టూ 1 సారి తిరగడానికి పట్టే కాలం= 432,0000000 సంవత్సరాలు. బ్రహ్మకు ఒక పగలు – సృష్టికల్పం = 432,0000000 సంవత్సరాలు. 14 మంది మనువుల కాలం పూర్తి అయ్యేసరికి బ్రహ్మకు ఒక పగలు – సృష్టికల్పం. అంతేకాలం బ్రహ్మకు ఒక రాత్రి – క్షయకల్పం – కల్పప్రళయం.

ఇంతవరకు మనువుల గురించి మన్వంతరాల గురించి చెప్పుకున్నాం. ఆ రోజుల్లో, మహెూన్నతులైన మనువుల పరిపాలనా కాలాల్లో గూడా, అసురశక్తుల వల్ల దేవతలైన ఇంద్రాదులుగూడా కష్టనష్టాలనుభవించారన్నది తెలుస్తోంది. ఆ ఘట్టాల్లో కొన్నింటినైనా చూద్దాం వచ్చే అధ్యాయంలో.

(సశేషం)

Exit mobile version