దివినుంచి భువికి దిగిన దేవతలు 16

0
2

[box type=’note’ fontsize=’16’] మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞాన రహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రచన చేశారు డా. ఎం. ప్రభావతీదేవి. [/box]

ఆంధ్రమహాసామ్రాజ్యం

16.0. ఆంధ్రులెవరు?

[dropcap]ఆం[/dropcap]ధ్రజాతి గురించి రకరకాల వ్యాఖ్యానాలున్నాయి :

(1) విశ్వామిత్రునిచే శపింపబడిన ఆయన కొడుకుల్లో ఒకడి వంశానికి చెందినవాళ్ళు ఆంధ్రులు అని. కాని ‘అంధ్ర’ అన్న పేరు పొందిన విశ్వామిత్రుని కొడుకులు శాపహతులై, వేదబాహ్యులై, మ్లేచ్చ జాతులుగా మారిపోయారు. కాబట్టి ఆంధ్రులు విశ్వామిత్ర సంతతికి చెందినవారు కారు. ఆంధ్రదేశంలోని ఆంధ్రులు 4వర్ణాలతో గూడి వేదోక్తకర్మలను ఆచరించే స్వచ్ఛమైన ఆర్యజాతివారు.

(2) చంద్రవంశంలో యదువు కుమారుడైన క్రోష్టువు అన్నవాడి వంశంలో వృష్టి, అంధ, భోజాదుల్లో ఒకడు, ‘అంధ’అన్న వాని సంతానం ‘అంధలు’, ‘అంధకులు” అని పిలువబడ్డారు. కానీ ఆంధ్రులు వీరికి కూడా సంబంధించిన వాళ్ళు కారు.

(3) ఆంధ్రజాతి సృష్ట్యాది నుండి వున్న ఆర్యజాతి కిందకే వస్తుంది. యయాతి నుండి 16వ వంశంలోని రాజులు ఈ ఆంధ్రులు అన్నవాళ్ళు. 3కోట్ల 10లక్షల, 31వేల, 34 సంవత్సరాల కిందట పాలించిన యయాతి రాజు కొడుకైన ‘అనువు” అన్నవాడి వంశంలో జన్మించిన ‘బలి’ (యయాతి నుండి 15వ తరంవాడు) అన్నరాజు యొక్క కుమారులు 6 గురు: అంగ, వంగ, కళింగ, సుంహ్మ, పుండ్ర, ఆంధ్రులు. వీరిని బట్టి వారు పాలించిన ప్రదేశాలకు ఆయా పేర్లు వచ్చాయి. వీరంతా తూర్పు ప్రాంతాలను పాలించారు.

16.1. మగధసామ్రాజ్యం – ఆంధ్రరాజులు -బ్రాహ్మణ సామ్రాజ్యం – శాతవాహన వంశపు రాజులు – బి.సి.ఇ. 833-327=506 సం॥లు :

మగధను కొంతకాలం ఆంధ్రబ్రాహ్మణ రాజులు పాలించారు. వారిని శాతవాహనులంటారు. వారిలో ముఖ్యులను గురించి కొంచెం తెలుసుకుందాం.

16.2. శ్రీముఖశాతకర్ణి – బి.సి.ఇ. 833-810 = 23 సం॥లు :

మగధను పాలించిన ఆంధ్రరాజులు బ్రాహ్మణ సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరిలో మొదటివాడి పేరు శ్రీముఖుడు. వీరంతా కలిసి 32మంది. వీరిలో రెండవ వాడు శ్రీకృష్ణ శాతకర్ణి. 18వ వాడు అరిష్టశాతకర్ణి (బి.సి.ఇ. 519-494). ఇతని కాలంలోనే 509లో ఆదిశంకరులు జన్మించారు. 25వ వాడు గౌతమీపుత్ర శాతకర్ణి (బి.సి.ఇ. 433-408). ఆఖరివాడు 3వ పులోమాయి (పులుమావి). ఈ రాజులకు శాతవాహన, శాతకర్ణులన్న బిరుదులున్నాయి. ఈ వంశాన్ని శాతవాహన వంశం అంటారు. ‘శాత’ మంటే సింహం అని అర్థం. దాన్ని వాహనంగా గలవాడు శాతవాహనుడంటే. శాతవాహనులను శాలివాహనులని గూడా అంటారు. వీరి జాతీయ జండాపై సింహాన్ని ఎక్కిన యోధుని చిత్రం ఉంటుంది. శాతవాహనులు మగధను 506 సంవత్సరాలు పాలించారు. ఆంధ్ర బ్రాహ్మణ రాజుల కాలంలో దేశం ఐశ్వర్యమై ప్రజలు శాంతంగా సుఖించారు. ఆ కాలంలో బౌద్ధ ధర్మం బాగా ప్రబలి వుండేది. ఆ కాలంలో అనేక బౌద్ధవిహారాలు, దేవాలయాలు, మఠాల మొదలైన కట్టడాల నిర్మాణాలు బాగా జరిగాయి.

16.3. ఆంధ్ర సామ్రాజ్యం – వివిధ శాఖలు :

ఆంధ్ర శాతవాహనుల యొక్క కుమారుల్లో పెద్దవారు రాజ్యార్హులై ఉండడంతో మిగతా రాజ కుమారులకు, చక్రవర్తుల కుమార్తెల కుమారులకు (దౌహిత్రులు) రాజపుటానాలో చిన్న రాజ్యాలను ఇచ్చి వారిని సామ్రాజ్యానికి లోబడి వుండేట్లు చేయబడింది. రాజపుత్రులనగా రాజులయొక్క కుమారులు అని అర్థం. శాతవాహన సామ్రాజ్యం చిన్నచిన్న రాజ్యాలుగా విడిపోయి బి.సి.ఇ. 327 సం॥ వరకూ 500 సం॥లలో రాబడిన రాజకుమారులందరికీ రాజపుటానాలో వసతులు కల్పింపబడినందు వల్ల ఆ రాష్ట్రానికి రాజపుత్రస్థానమని పేరు వచ్చింది. వీరంతా తగిన సైన్యం కలిగి చక్రవర్తులకు తోడ్పడేవారు. వీరి సైన్యంలో ఎక్కువగా బ్రాహ్మణులే ఉండేవారు. వీరిలో 36 కుటుంబాలవారు వివిధ పేర్లతో పిలవబడేవారు. బి.సి.ఇ. 4వ శతాబ్దంలో శాతవాహన సామ్రాజ్యం బలహీనపడ సాగింది. ఆ కాలంలో ధర్మ సంరక్షణార్థం వీరిలో 4 కుటుంబాల వారిని ఎన్నుకుని శంకరాచార్యులు స్థాపించిన పీఠాధీశులు రాజపుటానాలో గల ‘అబూ’ పర్వతం మీద అగ్నియందు హోమాదులు చేయించి వారియందు బ్రహ్మాణతేజంతోపాటు క్షాత్రతేజం గూడా నిలిచేట్లు వేదమంత్రాలచే సంస్కరించారు. వీరిని అగ్నికుల క్షత్రియులని, క్షత్రోపేత బ్రాహ్మణులని పిలవసాగారు. క్రమంగా వీరినే ఉత్తర భారతంలో బ్రహ్మక్షత్రలని, ఆంధ్రదేశంలో నియోగబ్రాహ్మణులని పిలిచేవారు. దేశాన్ని 4 భాగాలుగా విభజించి, ఈ 4 మందిని 4 భాగాలనకి అధిపులుగా చేసి వారికి చిన్న రాజ్యాలవారు సామంతులుగా ఉండేట్లు చేసారు. ఈ నలుగురు రాజులు వారి సామంతులతో కూడి దేశరక్షణకు వినియోగింపబడ్డారు. ఆ కాలంలో శకులు, హూణులు మొ॥ దోపిడీ దొంగలు గుంపులుగా పశ్చిమ దేశాల నుంచి వచ్చి చిన్నరాజ్యాలను దోచుకుంటూ, స్త్రీ, బాలాదులను చంపేవారు. ఆ సమయంలో ఈ 4 రాజ్యాలు స్థాపించబడ్డాయి. వీరంతా ఆంధ్రబ్రాహ్మణులే. ఐనా వారే దేశంలో ఉన్నారో అక్కడి వేష భాషలను అలవాటు చేసికుని ప్రజారంజకంగా పాలించారు. అలాగే రాజపుత్రులందరూ భాషాభేదం కలిగిన వారైనా ఆంధ్ర శాతవాహన వంశం నుండి వచ్చిన వారే.

16.4 వివిధ రాజపుత్రుల వంశాలు :

ఆ కాలానికున్న 36 రాజపుత్ర కుటుంబాల్లో 22 మాత్రం మిగిలాయి, అవి :1. రవి, 2.శశి, 3.యదు, 4.కాకుస్థ, 5.పరమార, 6.సదావర (తోమర), 7.చౌహాన్, 8.చాళుక్య, 9.భిండక, 18. సిలార, 11.అభీర, 12.దోయమట (మక్వానా), 13.చపోట్కట, 14. పరిహార, 15. ధాన్యపాలక, 16.రాజ్యపాలక, 17. నికుంప, 18.హూణ, 19.గుహిల (గుహిలపుట్ట), 20.రాధోడు, 21.కారట్టపాల, 22.అనిగ. వీరిలో ప్రమర, చాళుక్య వంశాలు ఆంధ్రదేశంలో రాజ్యపాలన చేసి వారి అధికారాన్ని దక్షిణదేశమంతా విస్తరింపచేసారు. సి.ఇ. 1వ శ. లో ఉజ్జయినిని రాజధానిగా చేసుకుని పాలించిన విక్రమార్కుడు, శాలివాహనుడు, భోజరాజు మొదలైనవారంతా ప్రమరవంశానికి చెందిన ఆంధ్ర బ్రాహ్మణ రాజులే. ‘తోమర, రాథోరు’ లన్న బ్రహ్మక్షత్రియ వంశం వారు పంజాబ్ నుండి పాటలీపుత్రం వరకూ, ఉత్తరాన హిమాలయాల వరకూ గల ప్రదేశాల్లో అధికారం చెలాయించారు. పృథ్వీరాజు గూడా ఈ వంశంలోని వాడే. ‘పరిహార’ (ప్రతిహార) వంశంవారు బెంగాలులో స్థిపపడ్డారు. ‘సేన’ వంశంవారు ఈ పరిహార వంశానికి చెందినవారే. ఆంధ్ర శాతవాహన వంశం వారు మొదట 5 శాఖలుగా, తర్వాత 7 శాఖలుగా దేశమంతా రాజ్యాలు స్థాపించారు. వారిలో ఇంకా అంతశాఖలేర్పడ్డాయి. అవి : 1. పల్లవ, 2. సేన 3.చేతి (చేది), 4.కదంబ, 5. రాష్ట్రకూట, 6. విష్ణుకుండిన, 7.శాలంకాయన, 8.బృహత్పలాయన, 9.వాకటక, 10.బాణ, 11.వల్లభ, 12.గాంగు, 13. వైదుంబ, 14.హోయసల, 15.నోలంబ, 16.రాజపుత్ర. వీరంతా పంజాబు నుండి దక్షిణాన కన్యాకుమారి వరకూ, తూర్పున అస్సాం వరకూ, చాలా చిన్న రాజ్యాలు స్థాపించి పాలించారు. వీరిలో పల్లవులు, చోళులు, కదంబులు దక్షిణాన కేరళ వరకూ పాలించారు. ఈ విధంగా ఆంధ్రశాతవాహనులు భారత వరమంతటా రాజ్యస్థాపనలు చేసి పాలించారు. దూర ప్రాంతాలకు పాలకులుగా పంపబడిన చక్రవర్తుల బంధువులు క్రమంగా స్వతంత్రులయ్యారు. వీరికే రాష్ట్రకూటులని పేరు.

16.5. బ్రాహ్మణ శాఖలు :

ఈ బ్రహక్షత్ర వంశంవారు మొదట వేదవేదాంగాలను అధ్యయనం చేస్తూ, వైదిక ధర్మనిష్ఠ కలిగి ఉండేవారు. క్రమేణా లౌకిక కర్మలయందు నిరంతరం నిమగ్నులై పోయి వైదిక కర్మను వదిలిపెట్టి వైదిక కర్మయందు నిష్ఠగల వారితో చేయించుకునేవారు నిత్యాగ్నిహోత్రాది కర్మలు. తమ పేర్లకు క్షత్రియుల్లాగ ‘వర్మ’ అన్న పదాన్ని తగిలించుకునే క్రమంగా తాము క్షత్రియులమని భ్రాంతిలో పడ్డారు. క్రమంగా బ్రాహ్మణ ప్రభుత్వా లంతరించి విజాతీయ, ప్రభుత్వాలేర్పడ్డాక బ్రాహ్మణ వంశాలు వైదీకి, నియోగిశాఖలుగా మిగిలాయి. బి.సి.ఇ. 5వ శ. నుండి ఈ ఆంధ్రబ్రాహ్మణుల్లో 2 శాఖలేర్పడ్డాయి. వైదీకులు, నియోగులని. ఆంధ్రబ్రాహ్మణులు మగధలో రాజ్యం చేసి చక్రవర్తులైనందున రాజకార్యాల్లో నియోగించబడ్డారు. వారిని నియోగులన్నారు. బ్రాహ్మణ ధర్మాన్ని అంటిపెట్టుకున్నవారు వైదికులుగా పేరు గాంచారు. ఆంధ్రబ్రాహ్మణుల్లోనే ఈ భేదాలు. ఇతర రాష్ట్రాల్లో బ్రాహ్మణులు రాజ్యాలు చేయలేదు. కాబట్టి శాఖా భేదాలు రాజులైన వారు ‘శర్మ’ అన్న శబ్దానికి బదులు క్షత్రియలాంఛనమైన ‘వర్మ శబ్దాన్ని వాడుకున్నారు. వారే కాలక్రమేణా కరణాలుగా చెప్పుకునేవారు, కరణీకం మూలాన కొందరి ఇంటిపేర్లలో ‘రాజు’ అన్న శబ్దం ఉంటుంది. ఎందుకంటే వారిపూర్వీకులు క్షాత్రమవలంబించి రాజ్యపాలన చేసిన వారై ఉన్నందున.

16.6. దక్షిణాదికి చెందిన బ్రహ్మక్షత్ర వంశాల వారిలో కొందరు రాజులు :

బ్రహ్మక్షత్ర వంశాల వారిలో కొందరు దక్షిణభారతంలో కొన్ని ప్రాంతాలను పాలించారు ఈ కింది విధంగా :

1. కదంబవంశం – మయూరవర్మ బి.సి.ఇ. 6వ.శ. :

కదంబవంశానికి మూలపురుషుడైన వాడు మయూరశర్మ. ఇతన్నే మయూరవర్మ అని గూడా అంటారు. ఇతను వేదాధ్యయనం కోసం తన ఉపాధ్యాయుడైన వీరశర్మతో కలిసి పల్లవ రాజధానైన కంచికి వెళ్లాడు. తర్వాత కొద్దికాలానికే యుద్ధసన్నిద్దుడై చాలా ధైర్యసాహసాలు ప్రదర్శించి పల్లవరాజు యొక్క సరిహద్దు కాపలా సైన్యాలను ఓడించి కంచి నుండి శ్రీపర్వతం (నాగార్జునకొండ) వరకూ గల అరణ్యప్రాంతాన్ని స్వాధీనపరచుకొని బాణులు మొ॥రాజుల వద్ద కప్పాలు పుచ్చుకున్నాడు.

2. పల్లవ వంశం :

పల్లవులు కౌరవ సేనానిధిపతియైన ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ నుండి తమ వంశాన్ని చెప్పుకుంటారు. వీరిది భారద్వాజస గోత్రం. కొందరు ‘పరమార, చాహుమాన’ మొ॥వారు అగ్నికులులమని చెప్పుకుంటారు.

3. ఆంధ్రచాళుక్యులెక్కడివారు?

శుక్లవంశానికి చాళుక్య, సోలంకి అన్న పేర్లున్నాయి. వారు సాలంకాయన శాఖనుండి వచ్చినవారు. వారు ద్వారకను రాజధానిగా చేసికొని చుట్టూగల ప్రాంతాలను పాలించారు. గుజరాత్ లోని ‘అన్హిలపురాన్ని’ రాజధానిగా చేసికుని భీమదేవుడన్న సోలంకిరాజు పాలించాడు. అతడు చాలా పరాక్రమవంతుడు. కానీ మహమ్మదీయుల దాడుల వల్ల ఆ రాజ్యం గూడా వారిపాలైంది. తర్వాత చాళుక్యులు ద్వారకను వీడి దక్షిణ భారతానికి చేరుకున్నారు. అక్కడి ఆంధ్ర మొ॥రాజ్యాలను జయించి రాజ్యం చేసారు. రాజరాజ నరేంద్రుడు ఈ చాళుక్య వంశం వాడే, బ్రాహ్మణుడే. కళింగను పాలించిన ఖారవేలుడు ‘చేత’ వంశంవాడు.

16.7. ఆంధ్రసామ్రాజ్య పతనం :

ఆంధ్రమహాసామ్రాజ్యం యొక్క చివరి శతాబ్దాల్లో సామంతరాజులు ప్రబలి భారతవర్షంలో అనేక చిన్న రాజ్యాలు ఏర్పడ్డంవల్ల మహాసామ్రాజ్యం కాస్తా బలహీనమైంది. సామంతరాజులను అదుపులోనుంచ గల శక్తి శాతవాహన రాజులకు లోపించింది. అక్కడక్కడ కొన్ని చిన్నరాజ్యాలు తప్ప మిగతా ఆసేతుహిమాచలంగా గల దేశమంతా శాతవాహనుల బంధుకోటిలోని బ్రాహ్మణరాజుల చేతను వారివల్ల రాష్ట్ర పరిపాలకులుగా నియమించబడ్డ నాయకుల చేతను పరిపాలింపబడేది. క్రమంగా వారంతా స్వతంత్రులయ్యారు. వంగదేశం ‘సేన’ వంశస్తులచేత, కళింగ దేశం ‘చేత’ వంశస్తులచేత, పల్లవ, చోళ, కేరళ, రాష్ట్రకూట, ప్రమర, చాళుక్య, కదంబ, తోమర, పరిహార, వల్లభి, రాజపుటానాలోని రాజపుత్రులు మొదలైన బ్రాహ్మణరాజులచేత, స్వతంత్రులైన రెడ్డి, యాదవ మొన ఇతర నాయకులచేత పరిపాలింపబడుతూ సామ్రాజ్యమంతా చిన్నరాజ్యాలుగా విడిపోయి చివరికి అంతరించింది. ఆంధ్రులు అనేక చిన్నరాజ్యాలను పాలించడంవల్ల, ఎవరికి వారు స్వతంత్రంగా వుండాలనుకోవడం వల్ల, ఏకరాజ్యం, ఏకనాయకత్వం కరువైంది. ఐకమత్యం లేకపోవడంవల్లనే దేశమంతా ముక్కలై పరాయివాళ్ళ పాలైంది. మగధకు ఆఖరి ఆంధ్రరాజైన 3వ పులోమాయి (పులుమావి) కుమారుడు 12 సం॥ల చంద్రశ్రీ. ఆంధ్ర మహా సామ్రాజ్యంలో ఆఖరిరాజులిద్దరి వద్ద కొలువు చేసిన నేపాల్ క్షత్రియవంశంవారైన ఘటోత్కచ గుప్త, అతని కొడుకైన చంద్రగుప్తులు బలవంతులై, 3వ పులోమాయి కొడుకైన చంద్రశ్రీ అన్నవానిని సంరక్షిస్తామని చెప్పి, చంపేస్తారు. దాంతో ఆంధ్రులు మగధను వీడి దూరాన వున్న తమ స్వదేశమైన ఆంధ్రదేశాన్ని చేరి ఆ ప్రదేశాన్నే గాక, చుట్టుప్రక్కల గల మహారాష్ట్ర మొదలైన ప్రదేశాలను గూడా వశపరచుకొని ఆంధ్రభృత్యులను పేర రాజ్యాలు చేసారు. ఆంధ్ర దేశాన్ని పాలించినవారు కృష్ణాతీరంలోని శ్రీకాకుళాన్ని రాజధానిగా చేసుకున్నారు.

16.8. మగధసామ్రాజ్యం – గుప్త వంశం – బి.సి.ఇ.327-82 :

మగధను గుప్తవంశపు రాజులు కొంతకాలం పాలించారు. వారిలో కొందరి గురించి తెలుసుకుందాం :

1. చంద్రగుప్త-1 – బి.సి.ఇ. 327-320 = 7 సం॥లు :

మొదటి చంద్రగుప్తుడితో గుప్తసామ్రాజ్యం స్థాపించబడింది. ఇతను బి.సి.ఇ. 327లో మగధసింహాసనాన్ని ఆక్రమించాడు. ఆంగ్లేయులు ఇతన్ని మౌర్యచంద్రగుప్తునిగా చిత్రీకరించారు. మొత్తానికి మగధను పాలించినవాళ్ళలో ప్రముఖులైన ఇద్దరు చంద్రుగుపులున్నారు. 1.మౌర్యచంద్రగుప్త (బి.సి.ఇ. 1534-1500), 2వ వాడు గుప్తచంద్రగుప్త (బి.సి.ఇ.327-320). ఇతనే అలెగ్జాండర్‌తో పోరాడి తరిమేసాడు. ఇతనికి గ్రీకులు సాండ్రకొట్టస్ అని పేరు పెట్టారు. చంద్రగుప్తుని తండ్రిపేరు ఘటోత్కచ గుప్త. తాత పేరు శ్రీగుప్త. పెద్దభార్య నేపాల్ దేశ రాజు కుమార్తె. పెద్దభార్య కుమారుని పేరు సముద్రగుప్తుడు. రెండవభార్య లిచ్ఛవీయ రాజుల ఆడపడుచు. ఆమె కుమారుడు ఘటోత్కచ. చంద్రగుప్తుడు తన తరువాత తన రెండవ భార్య కుమారుడైన ఘటోత్కచుని రాజుగా నియమించాలని తలచాడు. కానీ పెద్ద భార్య కుమారుడైన సముద్రగుప్తుడు దీనికి ఆగ్రహించి నేపాల్ రాజుయొక్క సైన్యసహకారాలతో తండ్రిని, సవతి తమ్ముని సంహరించి మగధకు రాజయ్యాడు.

2. సముద్రగుప్త – బి.సి.ఇ. 320-269 = 51 సం॥లు :

ఇతనికి అశోకాదిత్య అనిగూడా పేరుంది. ఇతడు చాలా యుద్ధాల్లో విజయం సాధించాడు. ఇతని ఆస్థానకవి హరిసేనుడన్నవాడు ఇతని పరాక్రమాలను వర్ణించాడు. ఈ విజయాలను ఆంగ్లేయులు చంద్రగుప్త మౌర్యునివని భ్రమించి అతనికి అంటగట్టారు. సముద్రగుప్తుడు అశ్వమేథయాగం చేశాడు. వేద ధర్మాన్ని ఆచరించి, వేద బ్రాహ్మణులను ఆదరించాడు. ఇతడు స్వయంగా కవి, గాయకుడు అందుచేత కవులను, గాయకులను, చిత్రకారులను పోషించాడు. బి.సి.ఇ. 326లో అలెగ్జాండరుతో వచ్చిన గ్రీకు చరిత్రకారులు ఇతన్ని సాండ్రోసిప్టస్ అన్నారు. అలెగ్జాండర్ ఇతన్ని చంపాలని చూస్తే తప్పించుకుని పెద్దసైన్యంతో వచ్చి గ్రీకులను తరిమేసాడు. సముద్రగుప్తుని కాలంలో అలెగ్జాండరుకు పిమ్మట రాజైన అతని సేనానియైన సెల్యూకస్ తన రాయబారియైన మెగస్తనీసను ఇతని ఆస్థానానికి పంపాడు. సముద్రగుప్తుడు గొప్పరాజు. భారతదేశాన్నంతా తన పాలన కిందకు తీసుకువచ్చాడు. ఆక్సస్ నది నుండి సింహళం వరకు సత్సంబంధాలు పెట్టుకున్నాడు. ఆంగ్లేయులితన్ని తప్పుగా అర్థం చేసుకొని, ఇతన్ని మరిచి ఇతని గొప్పతనాన్ని చంద్రగుప్త మౌర్యునికి అంటగట్టారు. ఇతని గొప్పతనం చాలాకాలం మరుగునపడిపోయింది. తరువాత కొన్ని తవ్వకాల్లో దొరికిన శాసనాల, నాణేల వల్ల ఇతని గొప్పతనం వెలుగులోకి వచ్చింది.

సముద్రగుప్తుని దిగ్విజయాలు :

ఇతను భారతదేశపు సరిహద్దు ప్రాంతాల్లోగల జాతులన్నింటినీ (శకులు, పార్టియన్లు, యవనులు, ఇండోసిధియన్లు మొ॥జాతులను) ఓడించాడు. నేపాల్ తప్ప మిగతా యావత్ భారతదేశాన్ని శ్రీలంక మొదలుగా గల సముద్ర తీరప్రాంత లంకలను వశపరుచుకున్నాడు. ఇతని తరువాత 2వ చంద్రగుప్తుడు రాజయ్యాడు. ఇతనికి విక్రమాదిత్యుడు అన్న పేరు కూడా ఉంది. గుప్తరాజులలో ఆఖరివాడైన 2వ కుమార గుప్తుని (బి.సి.ఇ. 126-82=44 సం॥లు) కాలంలో గుప్తరాజ్యం అంతరించింది. ఈ 2వ కుమార గుప్తునితో కలిపి మొత్తం 7గురు రాజులు పాలించారు.

16.9. అలెగ్జాండర్ :

అలెగ్జాండర్ బి.సి.ఇ. 326లో భారతీమీదకు దండెత్తి వచ్చి పంజాబ్ ప్రాంతాన గల చిన్నరాజ్యాలను జయించసాగాడు. ఆసమయంలో రాజులకు చేదోడుగా బ్రాహ్మణులు వుండేవారు. వారు దేశాన్ని పరరాజుల నుండి కాపాడడానికి రాజులకు సాయం చేస్తూ తాము కూడా యుద్ధంలో పాల్గొనేవారు. వారు ఆగ్నేయవారుణాస్త్రాలను సంధించి గ్రీకు సైన్యాలను చిందర వందర కావించారు. గ్రీకు చరిత్రకారులే ఈ విషయాన్ని రాసుకున్నారు, బ్రాహ్మణులు దూరం నుండి పిడుగులను, మెరుపులు మాపై వెదజల్లుతూ యుద్ధం చేసారు అని. అలెగ్జాండర్ తన గురువు అరిస్టాటిల్‌కు ఇలా ఉత్తరం రాసాడు, ‘నా సైన్యం హిందూ దేశంలో దావాగ్ని సన్నిభంబులగు అస్త్రాలతో ముంచివేయబడింది’ అని. తన పరాజయానికి కారణం బ్రాహ్మణులే అని తెలుసుకుని అలెగ్జాండర్ బ్రాహ్మణులను ఊచకోత కోయించాడు. బ్రాహ్మణ ఋషీశ్వరుల ఆశ్రమాలను ముట్టడించి, నాశనం చేసి, బ్రాహ్మణ స్త్రీ, బాల వృద్ధులనందరినీ సంహరించాడు. వారి శవాలను గెద్దలు, రాబందులు తినడానికి దారిపొడుగునా చెట్లకు వేలాడదీసాడు. ఇంకా ఎన్నో దారుణాలు చేసాడని గ్రీకు చరిత్రకారులే రాసుకున్నారు. ఈ సమయంలోనే గుప్త చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు ఈ గ్రీకులను ఎదిరించి తరిమేసారు. అసలు అలెగ్జాండర్ లాంటి నీచాగ్రేసరుడినా మనం జగజ్జేత అని అంటున్నాం! సిగ్గుపడాల్సిన విషయం! నిజానికి వాడు గంగ దాటి ఇవతలకి రాలేదుట. అలాంటప్పుడు జగజ్జేత ఎలా అవుతాడు? ఆంగ్లేయులవన్నీ తప్పుడు రాతలేనన్నమాట! వచ్చే అధ్యాయంలో మన చందమామ కథల్లోని వీరుడు – భేతాళ ప్రశ్నలకు సంబంధించిన కథానాయకుడైన విక్రమార్కుని నగరం ఉజ్జయిని గురించి తెలుసుకుందాం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here