Site icon Sanchika

దివినుంచి భువికి దిగిన దేవతలు 17

[box type=’note’ fontsize=’16’] మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞాన రహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రచన చేశారు డా. ఎం. ప్రభావతీదేవి. [/box]

ఉజ్జయిని చరిత్ర

17.0 ఉజ్జయినిని పాలించిన కొందరు బ్రాహ్మణరాజులు :

భారతదేశాన్ని పాలించిన రాజుల్లో చాలామంది దేశరక్షణకు, ధర్మరక్షణకు ఎంతో పాటుపడ్డారు. వారిలో ఉజ్జయినీ రాజులు కూడా ఉన్నారు. మాళవదేశానికి రాజధాని ఉజ్జయిని. మాళవనే మాల్వ అంటారు. పూర్వం దీన్నే అవంతి అనేవారు. ఉజ్జయిని పేరు వినగానే చాలామందికి గుర్తుకు వచ్చేది విక్రమార్క మహారాజు. ఈయన పేరుమీద విక్రమశకమని పేరుకూడా ఉంది. ఈయన్ని గురించి మనం చందమామ కథల్లో చదువుకున్నాం – పట్టువదలని విక్రమార్కుడు, భేతాళుడు అని. భట్టి విక్రమార్కుల సాహగాథలంటే అందరికీ ఇష్టమే. ఉజ్జయినీలోగల మహాకాళ దేవాలయం, విక్రమార్కుడు ఉపాసించిన మహాకాళీ దేవాలయం బాగా ప్రసిద్ధిగాంచి ఇప్పటికీ ఉన్నాయి. ఈ పరాక్రమవంతుడైన విక్రమార్కుడు ఎప్పుడు మాళవదేశాన్ని పాలించాడో తెలుసుకుందాం.

మయుడు తన సూర్యసిద్ధాంతంలో ఉజ్జయినీ పట్టణాన్ని ప్రస్తావించాడు. ఈ పట్టణం ఖగోళశాస్త్రానికి ప్రసిద్ధి. ఈ మయుడు కలిపూర్వం 2161200 సం॥ల నాటివాడు. అంటే అంతకు పూర్వమే ఉజ్జయినీ పట్నం ఉందని తెలుస్తోంది. దీన్ని బట్టి ఆర్యావర్తమెంత ప్రాచీనమైనదో తెలుస్తోంది.

17.1 ధుంజీ వంశం :

ఈ మాల్వా అన్న రాష్ట్రం ప్రత్యేకంగా వుండేది. దీన్ని ఆధారం చేసుకుని ‘ధుంజీ’ అనే బ్రాహ్మణుడు బలిష్టమైన బ్రాహ్మణ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ ధుంజీ వంశంవారు 387 సం॥లు రాజ్యం చేసారు. వారిలో 5వ తరానికి చెందిన రాజుకి సంతానం లేకపోవడంతో ‘అదాత్ పాన్వార్’ వంశంలో ఒకపిల్లవాణ్ని పెంచుకుని రాజుగా చేసాడు. అతడు రాజై పాన్వారువంశమనే రాజ్యం స్థాపించాడు.

17.2. పాన్వారువంశం – ఆంధ్రబ్రాహ్మణ వంశం :

ఈ పాన్వారు బ్రాహ్మణ వంశంవారు 1058 సం॥లు రాజ్యం చేసారు. వీరిలో మొట్టమొదటిగా రాజ్యం చేసిన రాజుల గురించి చరిత్రలో ఎక్కడా చెప్పబడలేదు. బి.సి.ఇ. 1వ శతాబ్దంలో విద్యాకళాపోషకుడైన విక్రమార్క మహారాజు రాజ్యానికి వచ్చాకనే వీరిగురించి తెలిసింది.

1. చంద్రశర్మ – బి.సి.ఇ. 6వ శతాబ్దం :

ఈ వంశంలో బి.సి.ఇ. 6వ శతాబ్దంలో మాల్వారాష్ట్రాన్ని పాలిస్తున్న బ్రాహ్మణ రాజుకు ఒక కూతురుండేది. ఆమెను భరతవంశంలో అఖండపండితుడని పేరుగాంచిన చంద్రశర్మ అన్న బ్రాహ్మణునికి ఇచ్చి పెళ్ళి చేసారు. ఆ దంపతులకు ఒక కుమారుడు కలిగి మాతామహుని రాజ్యాన్ని పాలించాడు. ఈ మహారాజే శకకర్తయైన శ్రీహర్ష విక్రమార్కుడు (శ్రీహర్షుడు). పతంజలి మహర్షే చంద్రశర్మగా పుట్టి, మహాభాష్యాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చాడని ఒక కథ ప్రచారంలో ఉంది. చంద్రశర్మ గురించిన ఆ జానపద కథను గురించి లోగడ తెలుసుకున్నాం (చూడండి అధ్యాయం 15.8). ఇప్పుడు చారిత్రకంగా ఉన్న విషయం తెలుసుకుందాం. చంద్రశర్మ 40 సం॥లు విద్యాభ్యాసం చేసి గొప్ప పండితుడుగా పేరుగాంచాడు. కుమారుడు పుట్టి, రాజయ్యాక గృహస్థాశ్రమం వీడి గౌడపాదాచార్యుల శిష్యుడై సన్యాసాశ్రమం స్వీకరించి బ్రహ్మవిద్యను పొంది శ్రీగోవిందపాదాచార్యులుగా పేరుగాంచాడు. ఈయనే బి.సి.ఇ. 5వ శతాబ్దానికి చెందిన ఆదిశంకరుల గురువుకూడా. ఇప్పుడు మనకు సంక్రమించిన వైదిక వాజ్మయంలో చాలా భాగం చంద్రశర్మనుండి లభించిందే. ఆయన పతంజలి మహాభాష్యాన్ని గౌడపాదాచార్యుల వద్ద చదువుకున్నాడు. ఈ పతంజలి మహర్షి శిష్యుడే మగధను పాలించిన పుష్యమిత్రసుంగుడు. ఈ గౌడపాదులు వ్యాకరణమహాభాష్యాన్ని పతంజలి మహర్షి అనుగ్రహం వల్ల గ్రహించాడు, శ్రీ శుక మహర్షి వల్ల బ్రహ్మవిద్యను పొందాడు.

2. శ్రీహర్షవిక్రమార్కుడు – బి.సి.ఇ. 5వ శతాబ్దం :

ఉజ్జయినీ రాజైన చంద్రశర్మ కుమారుడే శ్రీహర్షుడు. శ్రీహర్షుడు నేపాలు వరకు రాజ్యాన్ని జయించి పాలించాడు. శక, హూణాదులను ఓడించి దేశంనుంచి తరిమేసాడు. ఇతడు బి.సి.ఇ.457లో మరణించాడు. ఈయన పేరున ఒక శకం ప్రారంభమయ్యింది, శ్రీహర్ష శకమని, దీనిని నేపాల్ లోను, ఉత్తర భారతంలోను వాడతారు. కాలక్రమేణా శకులు ఉజ్జయినిలోని బ్రాహ్మణరాజుని సంహరించి వారు పాలించారు.

17.3. విక్రమార్కుడు – విక్రమశకం – ప్రమర వంశం : బి.సి.ఇ. 82-57=25 సం॥లు :

ప్రమర (పరమార) వంశపురాజులు బ్రాహ్మణులు. శ్రీశైలాన్ని రాజధానిగా చేసికొని ఆంధ్రా, మహారాష్ట్ర దేశాలను పాలించారు. వీరిలో 5గురి పేర్లు మాత్రం తెలియవచ్చాయి. వారిలో మొదటివాడు ప్రమర మహారాజు. శ్రీశైల దేవత ‘ప్రమరాంబ’ పేరు ఈయనకు పెట్టారు. 5వ రాజైన గంధర్వసేనుడికి ఇద్దరు కొడుకులు : శంఖ, విక్రములు. వారిలో శంఖమహారాజు శ్రీశైలాన్ని పాలించాడు. రెండవవాడైన విక్రముడు పెద్ద సైన్యంతో ఉజ్జయినిలో ఉన్న శకరాజులను ఓడించి, శకులను తరిమేసి తాను ఉజ్జయినికి బి.సి.ఇ 82సం॥లో రాజయ్యాడు. మాల్వారాష్ట్రం క్రమంగా సౌరాష్ట్రాన్ని వశం చేసుకుంది, ఉత్తరాన రాజపుటానాలో దక్షిణభాగాన్ని కలుపుకుంది. విక్రమార్కుడు ఎంతో సాహవంతుడిగా పేరుగాంచాడు. ఈయనే మన చందమామ కథల్లోని విక్రమార్కుడంటారు. విక్రమశకం బి.సి.ఇ. 57వ సం॥లో ఆయన మరణించాక ప్రారంభమయింది. విక్రమార్కుడు గొప్ప విద్వాంసుడు, కళాపోషకుడు. ఈయన పండితులనేకులను పోషించాడు.

నవరత్నాలు – కాళిదాసు :

విక్రమార్కుని ఆస్థానంలోనే నవరత్నాలు వుండేవారు : ధన్వంతరి, క్షపణక, అమరసింహ, శంకు, వేతాళభట్టు, ఘటకర్పర, కాళిదాసు (1వ కాళిదాసు) వరాహమిహిర, వరరుచి. ఈ నవరత్నాలు విక్రమార్కుని ఆస్థానంలో వున్నారని కాళిదాసు తన జ్యోతిర్విదాభరణంలో ప్రస్తావించాడు. ఈ కాళిదాసే. రఘువంశకర్తయైన కాళిదాసు. ఈయన చాలా కావ్యాలు రచించాడు : రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం, ఋతుసంహారం, శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, శృతబోధ, శృంగారతిలకం, జ్యోతిర్విదాభరణం, ఉత్తరకాలామృతం, శృంగారరసాష్టకం, సేతుబంధం, కర్పూరమంజరి, శ్యామలాదండకం, పుష్పబాణవిలాసం, ప్రశ్నోత్తరమాల, కుంతేశ్వరదౌత్యం, నవరత్నమాల, స్వరశాస్త్రమను శత్రుపరాభవ శాస్త్రంమొ॥వి. ఈ కాళిదాసే విక్రమార్కుని కాలానికి చెందినవాడనటానికి నిదర్శనం ఉంది. కాళిదాసు ఉత్తరకాలామృతం అనే గ్రంథాన్ని విక్రమార్కునికి అంకితమిచ్చినట్లు ఆ గ్రంథం మొదటి శ్లోకంలో ఉంది. ఈయన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుని భోజరాజు ఆస్థానానికి సంబంధించినవాడు అన్నారు. అంటే ఇద్దరు కాళిదాసులున్నారన్నమాట. మొదటి కాళిదాసు విక్రమార్కుని ఆస్థానానికి చెందినవాడు. రెండవ కాళిదాసు భోజరాజు ఆస్థానానికి చెందినవాడు.

ఈ భోజరాజు ప్రమరవంశంలో విక్రమార్కుని నుంచి 14వ రాజు. మొత్తం 2720 సం॥లు మాల్వారాష్ట్రం ప్రత్యేకంగా బ్రాహ్మణ రాజుల పరిపాలనలో వుంది. చివరికి సి.ఇ 119కి సం॥ మహమ్మదీయుల దండయాత్రలో వాళ్ళ క్రూరత్వానికి బలై ఈ వంశం అంతరించింది.

17.4. శాలివాహన శకం – సి.ఇ. 54-138=84 సం॥లు :

విక్రమార్కుని కుమారుడు దేవభక్త అన్నవాడు 10 సం॥రాజ్యమేలాడు. అతని కుమారుడు శాలివాహనుడు. అతను సి.ఇ. (ఎ.డి.) 54లో రాజ్యానికొచ్చాడు. ఇతను సి.ఇ. 78 సంవత్సరంలో శకులను జయించినందువల్ల అప్పటి నుండి శాలివాహన శకమని ప్రారంభించబడి ఇప్పటికీ వాడబడుతోంది. ఇది చాంద్రమానం ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమిరోజున సూర్యచంద్రులు, గురువు మేషంలో ప్రవేశించిన సమయం, ఇది చాంద్ర బార్హస్పత్య మానములు కలిసిన సంవత్సరంగా ఎంచబడింది. శాలివాహనుడు సి.ఇ. 138లో మరణించాడు.

17.5. తోమరవంశం :

విక్రమార్కుని నుండి 14వ వాడు భోజరాజు. భోజరాజు తరువాత తోమర వంశంవారు రాజులయ్యారు. వీరు 142 సం॥ పాలించారు. తరువాత ఆ రాజ్యం చౌహాన్ రాజులకు సంక్రమించింది. వీరు కూడా తోమర వంశీయులే. వీరంతా అగ్నికుల క్షత్రియులు లేక బ్రహ్మక్షత్రియులని పిలబడేవారు. లాంగులు అను ఒక తెగవారు రాజపుత్రులు. నిజానికి వీరు సోలంకి లేక చాళుక్య అనే బ్రహ్మక్షత్రియ వంశానికి చెందిన ఒక అంతశ్శాఖ. రాజపుటానాలోని ఈ బ్రాహ్మణరాజవంశాలు 36 వున్నాయి. ఈ రాజపుత్ర రాజులకు రాణాలు అన్న బిరుదు వుండేది. కాలక్రమేణ ఈ బ్రహ్మక్షత్రియులు తమ మూలాలను మరచి తాము రాజ్య పాలన చేస్తున్నారుగనుక క్షత్రియులని భ్రాంతిపడి తాము సూర్యవంశీయులమని, యవనాశ్వుని సంతానమని సి.ఇ.12వ శతాబ్దంలో వంశవృక్షం రాయించుకున్నారు. వీరికి మూలపురుషుడు నయనపాలు. ఇతను రాథోడ్ రాజు. కనోజీకి రాజైన అజపాలుని చంపి సి.ఇ.470లో తాను రాజయ్యాడు.

17.6. కుమారిలభట్టు – బి.సి.ఇ. 5వ శతాబ్దం :

కుమారిలభట్టు ఆంధ్రుడు. గంజాం జిల్లాలో జయమంగళం అన్న గ్రామంలో పుట్టాడు. తండ్రిపేరు యజ్ఞేశ్వర శర్మ, తల్లి చంద్రగుణ. ఈయన 5వ ఏట ఉపనయన సంస్కారం పొంది, గురుకులంలో నివసించి 18వ ఏడు వచ్చేసరికి సకలవిద్యా పారంగతుడయ్యాడు. ఉజ్జయినికి చెందిన శ్రీహర్షవిక్రముని తండ్రియైన చంద్రశర్మ శ్రీ గౌడపాదాచార్యుల వల్ల సన్యాసం స్వీకరించి గోవిందపాదాచార్యులుగా పేరుగాంచాడు. ఈ గోవిందపాదాచార్యుల శిష్యుడే కుమారిలభట్టు. ఆదిశంకరులకు కూడా ఈయనే గురువు. ఆకాలంలో జైనుల్లో, బౌద్దుల్లో స్త్రీపురుషులు సన్యాసులై ఇంద్రియ నిగ్రహం లేక నీతిబాహ్యులై ప్రవర్తించేవారు. ఎన్నో భ్రూణ, శిశుహత్యలకు కారకులయ్యేవారు. అటువంటి సమయంలో కుమారిలభట్టు ఈ జైన, బౌద్దమతాలను అంతంచేయాలని సంకల్పించాడు. కానీ ఆ మతస్థులు తమ మతం వారికి తప్ప ఇతరులకు తమ మత రహస్యాలని వెల్లడించేవారు కాదు. అందుకని తాను జైనంలో చేరి గురుసేవ చేసి ఆ మత రహస్యాలు తెలుసుకోసాగాడు. ఆ మతగురువులు వేదాలను తెగదూషించేవారు. ఒక రోజు ఆ వేద దూషణ విని భరించలేక కన్నీరు కార్చసాగాడు. అది చూసి ఆ గురువు ఆగ్రహించి అతను ఎవరని అడిగాడు. తాను వైదిక బ్రాహ్మణుడనని చెప్పగా ఆ గురువు అతన్ని పాఠశాల నుంచి వెళ్ళగొట్టాడు. అప్పుడు కుమారిల భట్టు బౌద్దులెక్కువున్న కాశీ చేరి జైన బౌద్దులను మతవాదానికి ఆహ్వానించాడు. ఆ కాలంలో కాశీలో 20వేల మంది బౌద్ధులుండేవారు. వారిలో హెచ్చుమంది బ్రాహ్మణ పండితులే. కాశీనప్పుడు సుధన్వుడన్న రాజు పాలించేవాడు. ఆయన ఆధ్వర్యంలో ఈ వాదం నడిచింది. ఓడినవారు గెలిచినవారి మతాన్ని స్వీకరించాలని నిర్ణయించారు. బౌద్దులు ఓడిపోయారు. వారిలో చాలామంది బౌద్దులు వైదిక ధర్మాన్ని అవలంబించారు. కొందరు మతం వీడలేక చీనా మొదలైన దేశాలకు పోయి మత బోధచేసారు. ఈ విధంగా కుమారిలభట్టు చాలా రాజ్యాలు తిరిగి మరల వైదిక ధర్మాన్ని ప్రతిష్టించాడు. కొంతకాలం ప్రయాగలో నివశించి గృహస్థ వృత్తి నవలంబించి, అనేక యాగాలు చేస్తూ, విద్యార్థులచే వేదశాస్త్రాలను అధ్యయనం చేయిస్తూ, మునుపు గురుద్రోహం చేసినందుకు ప్రాయశ్చిత్తంగా తుషాగ్నిప్రవేశం చేసి ప్రాణత్యాగం చేసాడు తన 48వ ఏట.

17.7. శంకరాచార్యులు :

1. శ్రీ ఆదిశంకరాచార్యులు – బి.సి.ఇ. 509 – 477 :

ఆదిశంకరులు నందననామ సంవత్సరం వైశాఖశుద్ధ పంచమి ఆదివారం పునర్వసునక్షత్రం అభిజిత్ ముహూర్తం, కర్కాటక లగ్నంలో జన్మించారు. వారు కేరళలోని కాలడి అన్న అగ్రహారంలో శివభక్తులైన శివగురు, ఆర్యాంబలకు జన్మించారు. శ్రీ ఆదిశంకరాచార్యులు కుమారిల భట్టుకు సమకాలీకులు. వీరు బి.సి.ఇ 509లో జన్మించారు. వీరు ఆంధ్ర బ్రాహ్మణ వంశజులు. ఒకప్పుడు మళయాళ దేశాన్ని పాలించిన కదంబ వంశానికి చెందిన మయూరవర్మ (మయూరశర్మ) తన జన్మదేశమైన ఆంధ్రదేశంలో గోదావరి మండలంలో గల కొంతమంది ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబాలను మళయాళ దేశానికి తీసుకువెళ్ళాడు. ఆదిశంకరులు దేశయాత్ర చేస్తూ, కాంచీ నగరం ప్రవేశించారు. ఇందులో కామకోటి పీఠం ఉంది, కాబట్టి కంచిని కామకోటిక్షేత్రమని గూడా అంటారు. 18 శక్తిపీఠాల్లో ఈ కామకోటి పీఠం ఒకటని మార్కండేయ పురాణంలో వుంది. దీనికే సర్వజ్ఞపీఠమని పేరుంది. శంకరులు ఈ పీఠాన్నధిష్ఠించి తాము ప్రతిష్టించిన నాలుగు పీఠాలకు దీన్ని కేంద్రంగా చేసారు. ఆ సమయంలో రాజసేనుడనే రాజు కంచిని పాలించాడు. శంకరులు బి.సి.ఇ. 477లోనే కంచిలోనే విదేహముక్తి పొందారు. శంకరులు ప్రయాగలో కుమారిలభట్టును కలుసుకున్నప్పుడు ఆయన వయస్సు 16 సం॥లు.

శంకరుల జనన కాలం గురించి అనేక బేధాభిప్రాయాలున్నాయి. ఈ పైనిచ్చిన జననకాలం గురించి కంచికామకోటి పీఠంలోని గురుపరంపరకు సంబంధించిన ‘పుణ్యశ్లోకమంజరి’ అన్న గ్రంథంలో ఉంది. ఈ గ్రంథంలో ఆదిశంకరుల నుండి నేటి వరకు గల ఆ పరంపరలోని ఆచార్యుల గురించిన విశేషాలు పేర్కొనబడ్డాయి. ఆంగ్లేయులు మన దేశానికి సంబంధించిన అనేకుల ప్రముఖుల విషయంలో తప్పుడు కాల నిర్ణయాల్ని అందజేస్తారు. కానీ మనవారిలో కొందరు పండితులు, విద్వాంసులు, కవులు ఈ ప్రముఖలకు సంబంధించిన విషయాలు జననకాలాలతో సహా మనకు సరైన సమాచారాన్ని సంస్కృత శ్లోకాల రూపంలో అందిచారు. వాటిని ఆధారం చేసుకొని మన విద్వాంసులు పరిశోధనలు చేసి ఇచ్చిన వివరాలున్నాయి.

2. శ్రీఅభినవ శంకర (శంకర 5) – సి.ఇ. 788-849 :

చాలామంది చరిత్రకారులు ఆదిశంకరులు సామాన్యశకం 788 కాలానికి చెందినవారని అంటారు. దానికి కారణం ఉంది. కంచి పీఠాధిపతులైన శంకరుల నుండి ఇప్పటి వరకు 70మంది ఉన్నారు. వారిలో 38వ పీఠాధిపతియైన శ్రీ అభినవ శంకరులను (5వ శంకర సా.శ.-సి.ఇ. 788-840) చాలామంది. ఆదిశంకరులుగా భ్రమపడ్డారు. దానికి కారణం వారుగూడా ఆదిశంకరుల వలె భారతదేశమంతటా పర్యటించి అద్వైతాన్ని ప్రచారం చేసారు. వారు గూడా మహా ప్రజ్ఞా ప్రభావ సంపన్నులు. వారి తండ్రిపేరు విశ్వజిత్తు, తల్లిపేరు విశిష్ట. వారు వైశాఖశుద్ధ దశమి నాడు జన్మించారు. వారు మాతృగర్భంలో ఉండగానే పితృవియోగం జరిగింది. వారు గూడా ఆసేతుహిమాచలం పర్యటన గావించారు. ఆ కాలంలో కాశ్మీరు ప్రభువు ఆస్థానంలోని వాక్పతిభట్టు అన్నకవిని శాస్త్రచర్చల్లో ఓడించారు. అచటగల సర్వజ్ఞ పీఠం అధిరోహించారు. వాక్పతిభట్టు తన ‘శంకరేంద్రవిలాసం’ అన్న గ్రంథంలో వారి మహిమల్ని వర్ణించాడు. వారు హిమాలయ పర్వత పంక్తిలోని ఆత్రేయ పర్వతమందలి దత్తాత్రేయ గుహలో ప్రవేశించి బ్రహ్మీభావం పొందారు.

17.8. బౌద్దమతం ఎందుకు అంతరించింది?

చాలామంది అంటారు వేదధర్మానుయాయుల మూలంగానే బౌద్ధం అంతరించింది అని. కానీ అది నిజం కాదని ఆంగ్లేయులే అన్నారు. ఉదా :

“The furious massacres perpetrated by Musalman invaders were more efficacious than orthodox Hindu persecution, and had a deal to do with the disappearance of Buddhism in several provinces”. (Early History of India by V.A.Smith, p.382).

‘హిందూ శాస్త్ర సమ్మతమైన బహిష్కారాది సాధనముల వలన కలిగింపబడిన యొత్తిడి కంటే క్రూరమైన మహమ్మదీయ దండనాధులవల్ల కావింపబడిన జనసంహారాది క్రూరకర్మాలెక్కువ పటుత్వంగలవై హిందూ దేశమునందలి చాలా రాష్ట్రాల్లో బౌద్దమతం తుడిచిపెట్టుకుని పోవుటకు కారణమైనవి.”

17.9. సైరస్ శకం – బి.సి.ఇ. 550 :

సాధారణంగా మనవాళ్ళు శకయుగం అని అంటూ వుంటారు. అది పారశీక రాజైన సైరస్ (Cyrus the Great) చే స్థాపించబడింది. సైరస్‌కు ఆ కాలపు భారతసామ్రాట్టుకు గల స్నేహసంబంధం మూలాన భారతదేశంలో గూడా వాడబడింది. దాన్నే మనవాళ్ళల్లో కొందరు శాలివాహన శకం, విక్రమశకం అని భ్రాంతి పడ్డారు. తరువాతి అధ్యాయంలో విదేశీదురాక్రమణలవల్ల భారతదేశం ఎలా బలహీనమైందో తెలుసుకుందాం.

(సశేషం)

Exit mobile version