దివినుంచి భువికి దిగిన దేవతలు 18

0
2

[box type=’note’ fontsize=’16’] మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞాన రహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రచన చేశారు డా. ఎం. ప్రభావతీదేవి. [/box]

భారతదేశం – విదేశీయులతో సంబంధాలు – వారి దురాక్రమణలు

18.0. సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం :

[dropcap]భా[/dropcap]రతదేశ సరిహద్దు ప్రాంతాల్లో విదేశీయుల యుద్ధతాకిడి ఎప్పుడూ ఉన్నదే, కానీ మనవారు వారిని తరిమివేస్తూ ఉండేవారు. రానురాను మన రాజ్యాలు ఈ బలహీనమైపోయి, బలమైన విదేశీయుల దాడులను తట్టుకోలేకపోయాయి. ఈ పరిస్థితుల్లో ముందుగా మహమ్మదీయులు దాడులు చేసి మన దేశంలో చొరబడి చాలా ప్రాంతాల్ల నాక్రమించారు. తరువాత ఐరోపా వాస్తులు వర్తకం నెపంతో వచ్చి దాడులు చేసి దేశాన్నంతా ఆక్రమించారు. ఈ నేపథ్యంలో విదేశీయులతో సంబంధాలు కూడా ఏర్పడ్డాయి.

18.1. మన ప్రాచీన శాస్త్రజ్ఞుల్లో కొందరు – వారి శాస్త్రాల అనువాదాలు :

సామాన్య శకం (సి.ఇ) మొదలయ్యాక మన భారతదేశానికి విదేశాలతో సంబంధాలేర్పడసాగాయి. సి.ఇ. 8వ శతాబ్దం నుండి మన శాస్త్రాలు అరబిక్ భాషలో అనువదించబడ్డాయి. అరబ్బుల నుండి ఐరోపావారు 15వ శతాబ్దం నుండి తమ భాషల్లోకి అనువదించుకున్నారు. మన ఖగోళ, గణిత శాస్త్రజ్ఞుల రచనలు (అంకగణితం, రేఖాగణితం, క్షేత్రగణితం, త్రికోణగణితం, బీజగణితం) విదేశీ భాషల్లోకి అనువదింపబడ్డాయి క్రమేణా. మనదేశానికి చెందిన ఖగోళ గణిత శాస్త్రవేత్తల్లో బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్యులు మొదలైన ప్రముఖులున్నారు. వారి వివరాలు కొన్ని తెలుసుకుందాం.

18.2. బ్రహ్మగుప్తుడు – సి.ఇ. 3వ శతాబ్దం :

బ్రహ్మగుప్తుడు సి.ఇ. 3వ శతాబ్దానికి చెందినవాడు. ఉజ్జయినిలో నక్షత్రగణితశాలకు అధ్యక్షుడిగా ఉండేవాడు. ఈయన అంకగణితం, రేఖాగణితం, క్షేత్రగణితం, త్రికోణగణితం, బీజగణితం మొదలైనవన్నీ తను రచించిన బ్రహ్మసిద్ధాంతం అన్న గ్రంథంలో వివరించాడు. అవన్నీ విదేశీ భాషల్లోకి అనువదించబడ్డాయి.

18.3 భాస్కరాచార్య – సి.ఇ. 5వ శతాబ్దం :

ఈయన సి.ఇ. 486 సం॥లో జన్మించాడు. ఈయన ఖగోళ గణితశాస్త్రాల్లో గొప్ప పండితుడు. ఈయన అంకగణితం, రేఖాగణితం, క్షేత్రగణితం, త్రికోణగణితం, బీజగణితం గురించి వివరించాడు. ఉజ్జయినిలో నక్షత్రగణితశాలకు అధ్యక్షుడిగా ఉండేవాడు. ఈయన ఖగోళ, గణిత శాస్త్ర విషయాలను తన సిద్ధాంతశిరోమణి అనే గ్రంథంలో నిక్షిప్తం చేసాడు. విదేశీయ శాస్త్రవేత్తలు మన శాస్త్రవేత్తల గ్రంథాల అనువాదాలను చదివే ప్రభావితులయ్యారు. వాటిని ఉపయోగించుకునే పేరు ప్రఖ్యాతులు గాంచారు.

18.4. వైశ్యరాజులు – శ్రీహర్షవర్ధనుడు :

ఆర్యావర్తాన్ని కొంతకాలం 7గురు వైశ్యరాజులు కూడా పాలించారు. వారిలో మొదటివాడు పుష్పభూతి, 5వ వాడు ప్రభాకర వర్థన, మహారాజాధిరాజ అన్న బిరుదు కలిగినవాడు. 6వ వాడు రాజ్యవర్ధనుడు. ఇతనికి సంతానం లేనందున, ఇతని తమ్ముడైన హర్షవర్ధనుడు రాజ్యానికొచ్చాడు. ఇతను 7వ వాడు.

శ్రీహర్షవర్ధనుడు – సి.ఇ. 7వ శతాబ్దం :

హర్షవర్ధనుడికే శ్రీహర్షశిలాదిత్యుడు అన్న పేరుంది. ఇతను సా.శ.-సి.ఇ 7వ శతాబ్దంలో థానేశ్వరాన్ని రాజధానిగా చేసికుని పాలించి ప్రసిద్ధికాంచాడు. హర్షవర్ధనడు బంగాళాదేశాన్ని జయించి ఆర్యావర్తమంతటికి ప్రభువయ్యాడు. ఇతను ఆసేతుహిమాచలం జయించి చక్రవర్తి కావాలని ప్రయత్నించాడు. కానీ ఆంధ్రరాజైన 2వ పులకేశి చేతిలో ఓడిపోయాడు. ఈతని ఆస్థాన కవి ‘బాణకవి’. ఈయన హర్షవర్ధనుని పరిపాలనాన్ని గుణగణాలను, జయాలను చక్కగా వర్ణిస్తూ ‘శ్రీహర్ష చరిత్ర’ అన్న ఒక కావ్యం రాసాడు. హర్షవర్ధనుడు రాజధానిని థానేశ్వరం నుంచి కనోజ్ (కన్యాకుబ్జం)కి మార్చాడు. ఈతని కాలంలోనే హ్యూన్ త్సాంగ్ అన్న చైనాయాత్రికుడు భారతదేశానికి వచ్చి దేశమంతా పర్యటించి చారిత్రక విషయాలను రచించాడు, హర్షవర్ధనుని రాజ్యంలో కొంతకాలమున్నాడు. హర్షవర్ధనుడు చివరికి బౌద్ధం స్వీకరించి శాంతికాముకుడయ్యాడు. ఆంగ్లేయ చరిత్రకారులు ఈ శ్రీహర్షుడినే శకకర్త అయిన శ్రీహర్షుడు అనుకుని చరిత్రను తారుమారు చేసారు. ఇది నిజం కాదు. ఎందుకంటే ఇద్దరు శ్రీహర్షులున్నారు. ఒకరు ఉజ్జయినికి రాజైన శ్రీహర్ష విక్రమార్కుడు (బి.సి.ఇ. 457 సం॥), అంటే బి.సి.ఇ. 5వ శతాబ్దానికి చెందినవాడు. ఈయనే శకకర్త. ఇంకోరు సిఇ 7వ శతాబ్దానికి చెందిన థానేశ్వరం, కనోజ్లను పాలించిన శ్రీహర్షవర్థనుడు. ఈయన శకకర్త కాడు. అల్బెరూనీ అన్న మహమ్మదీయ చరిత్రకారుడు సి.ఇ.1031లో గజనీ మహమ్మద్‌తో వచ్చి భారతదేశంలో పర్యటించి, ఆ కాలం వరకు వాడబడుతున్న శకములన్నిటి గురించిన జాబితాను తయారుచేసి తను రచించిన ఇండియా అన్న పుస్తకంలో ప్రస్తావించాడు. అందులో శ్రీహర్షుడు అన్న ఒక శకకర్త బి.సి.ఇ. 5వ శతాబ్దానికి చెందినవాడని ప్రస్తావించాడు. అందువల్ల 7వ శతాబ్దానికి చెందిన శ్రీహర్షుడు కేవలం రాజేగాని శకకర్త కాడు. ఇదంతా ఆంగ్లేయ చరిత్రకారులు భ్రమపడి చరిత్రను తారుమారు చేసిన విషయం. చంద్రగుప్త మౌర్యుని అలెగ్జాండర్‌కు సమకాలికుడిగా గుర్తింపబడిన పొరపాటు వల్ల కలిగిన తేడా 1200 సం॥ల పొడుగునా అడ్డువచ్చినందువల్ల రాజవంశావళి తారుమారైంది.

18.5. పృథ్వీరాజు – జయచంద్రుడు – మహమ్మదీయ దాడులు :

భారతదేశంలోని సరిహద్దు ప్రాంతాల్లో గల రాజ్యాలను ఆక్రమించడానికి శకులు, హూణులు మొ॥వారు ఎప్పటి నుంచో దాడులు చేసి చొరబడి కొన్ని రాజ్యాలను ఆక్రమించి పాలించి మళ్ళీ తరిమివేయబడ్డారు. కానీ 11,12 శతాబ్దాల్లో మహమ్మదీయులు గొప్ప సైన్యాలతో వచ్చి దాడులు చేసి మన దేశంలో పలు ప్రాంతాలను ఆక్రమించి మనవారిని తరిమివేసి ఇంక మన దేశంలోనే పాతుకుపోయి చాలా ఘోరకృత్యాలను కావించారు. అసలు ఈ మహమ్మదీయులు ఎలా మనదేశంలోకి వచ్చారో తెలుసుకుందాం. 11వ శతాబ్దంలో (1017లో) గజనిమహమ్మదు కనోజ్ మొ॥ ప్రాంతాల మీద దాడులు చేసాడు. కనోజ్ యొక్క ప్రాభవాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇతను 12సార్లు దండెత్తి దేశసంపదను దోచుకుపోయాడు. సోమనాథ దేవాలయాన్ని పాడుచేసి లింగాన్ని బద్దలుకొట్టి అందులోని రత్నరాసులను దోచుకుపోయాడు. తరువాత 12వ శతాబ్దంలో గోరీ వచ్చి దాడులు చేసాడు.

ఢిల్లీకి రాజు అనంగపాలుడు. ఆయన పెద్దకూతురి కొడుకు పృథ్వీరాజు, చిన్న కూతురి కొడుకు జయచంద్రుడు కనోజ్ రాజు. పృథ్వీరాజుకు తండ్రి వల్ల అజ్మీర్ రాజ్యం సంక్రమించింది. అనంగపాలుడు రాజ్యం త్యజించి ఢిల్లీని పృథ్వీరాజు కిచ్చాడు. దానివల్ల జయచంద్రుడు పృథ్వీరాజుతో వైరం పెంచుకొని గోరి సాయంతో పృథ్వీరాజును ఓడించాడు. పృథ్వీరాజు మీదకి గోరీ చాలాసార్లు దండెత్తాడు. అన్నిసార్లూ పృథ్వీరాజు గోరీని ఓడించాడు. కాని గోరీ ప్రాణభిక్ష కోరగా పృథ్వీరాజు అతన్ని వదలి పెట్టాడు. చివరికి పృథ్వీరాజు ఓడిపోయినపుడు గోరి అతని కళ్ళు పీకించి చాలా హింసించి చంపాడు. తరువాత జయచద్రుణ్ణి కూడా గోరీ ఓడించాడు. జయచంద్రుడు పశ్చాత్తాపంతో నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గోరీ ఆవిధంగా ఢిల్లీని, కనోజ్‌ను వశం చేసుకున్నాడు. అవి ఇంక మహమ్మదీయులకు బలమైన స్థావరాలయ్యాయి. దాంతో నెమ్మదిగా చుట్టుప్రక్కల ప్రాంతాలను, ఇతర ప్రాంతాలను దాడులతో వశంచేసుకుని భారతదేశాన్ని కొన్ని సంవత్సరాలు యుద్ధభూమిగా మార్చేసారు. వారి హయాంలో హిందువుల తలలు చెట్లకొమ్మలకు వేలాడేవి. అంత దారుణంగా వారు మనవారిని చంపారు.

18.6. ఐరోపా దేశస్తుల దాడులు :

సి.ఇ. 15వ శతాబ్దం ఐరోపావాసుల వలసలు మొదలయ్యాయి మనదేశంలోకి సముద్ర దారులద్వారా వ్యాపారం నెపంతో. మొదట పోర్చుగీసువారు అడుగుపెట్టారు దక్షిణభారతంలో వాస్కోడగామా రూపంలో, ఆ తరువాత 16వ శతాబ్దంలో గోవాలో స్పానిష్ క్రైస్తవ మతప్రచారకులు అడుగుపెట్టారు. ఇంక 16,17,18 శతాబ్దాల్లో డచ్, ఫ్రెంచ్, ఆంగ్లేయులు ఒకరి తరువాత ఇంకొకరు వచ్చి సముద్ర తీరాల్లో కోటలు కట్టారు. వ్యాపారం చేస్తూ, మనవారి శాంతి కాముకత, ధర్మపరాయణత్వాలను చూసి, దండనీతి, కుటిలనీతి, తుపాకి మందు ఉపయోగించి దాడులు, దోపిడీలు చేసి దేశమంతా ఆక్రమించుకున్నారు. మన సంపదలను దోచి, భూముల్నిలాక్కుని మనల్ని బికారుల్ని, బానిసలను చేసారు. ఆడవారి మీద అత్యాచారాలు చేస్తారు. చాలామందిని అడవుల్లోకి తరిమేసారు. మతమార్పిడిలు చేసి మన సంస్కృతి సంప్రదాయాలు, కట్టూ, బొట్టూ గూడా మార్చేసారు. మన విద్యా వైద్యవిధానాలను మార్చివేసి, వారి విధానాలను ప్రవేశపెట్టారు. పాఠశాలల్లో మన భాషలను మార్చి, వారి భాషలను ప్రవేశపెట్టారు. మనల్ని పీడించి, పాలించారు. వారి పీడను భరించలేక మనవారు స్వతంత్ర సమరం మొదలు పెట్టారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, గాంధీలాంటి నేతల నేతృత్వంలో, చివరికి 1947లో స్వతంత్రం సంపాదించారు. ఈ విషయాల్లో కొన్ని మన చరిత్ర పుస్తకాల్లో మనకు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. వాటిని చదువుకున్నాం కాబట్టి అందరికీ తెలిసిన విషయాలే. అందుకని వాటి అవసరం ఇక్కడ లేదు. అయితే ఆంగ్లేయులపాలనలో భారతదేశ చరిత్రను ఎలావక్రీకరించరో తెలుసుకోవాలి.

18.7. ఆంగ్లేయులపాలనలో భారతదేశ చరిత్ర వక్రీకరణ :

1. భారతీయశాస్త్రాల అనువాదం :

ప్రాచీన భారతంలో వాజ్మయమంతా మొట్టమొదట మౌఖికంగా సాగింది, గురుశిష్య పరంపరలో. రానురాను తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేయబడింది. విదేశీయుల దాడులతో, వారి పాలనల్లో కాగితం తయారీ జరిగి అందులో రాయడం మొదలు పెట్టారు. అచ్చుయంత్రం కనుగొన్నాక మన శాస్త్రాలన్నీ చాలా మటుకు అచ్చువేయబడ్డాయి. సంస్కృతం నుండి ఇతర భాషల్లోకి అనువదించబడ్డాయి. మన శాస్త్రాలు మొదటగా ముస్లింల పాలనలో అరబిక్, పర్షియన్ భాషల్లోకి అనువదింపబడి వాటి ద్వారా యూరప్‌లో అనేక భాషల్లోకి అనువదింపబడ్డాయి. తర్వాత ఆంగ్లేయుల పాలనలో మన శాస్త్రాలన్నీ చాలా మటుకూ ఆంగ్లంలోకి అనువదింబడ్డాయి. ఈ అనువాదాలు ఎలా జరిగాయో తెలుసుకొంటే ఆంగ్లేయుల కుటిల బుద్ధులెలాంటివో గూడా తెలుస్తాయి.

2. క్రైస్తవుల కుటిలనీతి :

క్రైస్తవుల్లో అనేక శాఖలున్నాయి. అవన్నీ ఒకదానితో ఇంకోటి కలహించి మతయుద్దాలకు కారణమయ్యేవి. ఈ పాశ్చాత్య దేశాలవారు రానురాను ప్రపంచంలో ఇతర దేశాలతో వర్తకం నెపంతో మొదటగా సంబంధాలు పెట్టుకుని తర్వాత దాడులు చేసి అక్కడి వారిని ఊచకోతలు కోసి, తమ రాజ్యాల్ని, మతాల్ని స్థాపించసాగారు. ఈ వరుసలో ఆంగ్లేయులు అనేక దేశాలను వలస దేశాలుగా చేసుకున్నారు. మన భారతదేశంగూడా చిన్నచిన్న రాజ్యాలుగా ఉండటాన వారి కుతంత్రాలకు, దురాగతాలకు బలై, వారి పాలనలో అఖండ భారతమై వలస దేశంగానూ, బానిసదేశంగాను మారింది.

3. భారతదేశ చరిత్ర యొక్క కాలగణనాల్లో మార్పులు, చేర్పులు :

ఆంగ్లేయులు ప్రపంచంలోని వివిధ దేశాల చరిత్రలను రాసే నెపంతో ఆ దేశాల వాఙ్మయాలన్నిటినీ పరిశీలించసాగారు. భారతీయుల వాఙ్మయాన్ని తరచి చూడగా ఆశ్చర్యం కలిగే విషయాలు చాలా తెలిసాయి. భారతీయుల ప్రాచీనత యుగాలు, మన్వంతరాలు, కల్పాలు దాటిపోతున్నాయి. ఇది వారి బుద్ధికి అందకుండా పోయింది. సృష్టి మొదలై దాదాపు 199 కోట్ల సం॥ పైన గడిచాయి అన్న విషయం వారి మందబుద్ధికి అందలేదు. వారి మతగ్రంథమైన బైబిల్‌లో సృష్టి ఎప్పుడు మొదలైందన్న కాల నిర్ణయం గురించి చెప్పలేదు. వారు ఆరాధిస్తున్న క్రీస్తు ఎప్పుడు పుట్టాడో, ఎప్పుడు పోయాడో అన్నవారికి సరైన లెక్కల్లేవు. ఉన్నవన్నీ తప్పుడు లెక్కలే. అందుకని పాశ్చాత్య చరిత్రకారులు 1847లో రోమ్‌లో సమావేశమయ్యారు. ‘అషర్’ అన్న మతాధికారి ఆధ్వర్యంలో, ఇంక సృష్టికాలం నిర్ణయించడానికి చాలా పాటు పడ్డారు. వారి బుద్ది పనిచెయ్యకపోవడంతో వారి జాతికి కారణమైన ఆడమ్, ఈవ్ అన్న వారు సృష్టించబడిన కాలాన్ని గూర్చి తర్జన భర్జనలు చేసి ఒక నిర్ణయానికి వచ్చి బి.సి.40049 మొదటి సృష్టి కాలంగా నిర్ణయించారు. అంటే సృష్టి ప్రారంభమై ఇప్పటికి దాదాపు 6వేల సం॥రాలుగా నిర్ణయించారు. ఇక్కడ వారి బుద్ధిలేనితనాన్ని బయట పెట్టకుండా మన భారతీయ వాఙ్మయానికి సంబంధించిన కాలనిర్ణయాన్ని కూడా 6 వేల సంవత్సరాల కాలంలో ఇమడ్చడానికి ప్రయత్నించారు. అంటే దాదాపు 199 కోట్ల సం॥ల పైనున్న కాలాన్ని 6వేల సంవత్సరాలకాలంలోకి కుదించి వేస్తారు. దాని వల్ల మన చారిత్రిక పుస్తకాల్లోని లెక్కలకూ, కావ్యాలూ, పురాణేతి హాసాల్లోని లెక్కలకూ చాలా తేడాలు కనపడుతున్నాయి. ఈ భారతీయ ప్రాచీనతను అతి తక్కువ కాలంలో చూపడానికి క్రీ.శ. 5వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకూ చాలా పాట్లు పడ్డారు.

4. ఆంగ్లేయులవల్ల అగ్నికి ఆహుతైన మన పవిత్ర గ్రంథాలు :

మనం పవిత్రం అనుకున్న మన గ్రంథాలను చాలా మటుకూ తగలబెట్టారు, తగల బెట్టించారు, కుసంస్కారులైన క్రైస్తవ మతాధికారులు ఈర్ష్యతోనూ, అసూయతోనూ. ఈ విషయాన్ని లూయీ జకొలియట్ (Louise Jaccoliot) అన్న ఓ ఫ్రెంచ్ విద్వాంసుడు తన పుస్తకమైన ‘బైబిల్ ల ఇండి’ ( Bible Le Indi) లో ఇలా వివరించాడు :

“The Rev.Fathers, Jesuits, Fransiscans, Srangar Missions and other Corporations unite with touching harmony in India to accomplish a work of vandalism, which it is right to denounce as well as to the learned world as to orientalists. Every Manuscript, every Sanskrit work that falls into their hands is immediately condemned and consigned to flames…..

Every new arrival receives a formal order so to impose of all that may fall into his hands. Happily the Brahmins do not open to them the secret stores of their literary wealth, philosophic and religious.”

“క్రైస్తవ మతాధికారులు, జెస్యూట్స్, ఫ్రాన్సిస్కస్ట్, షాంగర్ మిషన్డ్ మొదలైనవారు (పరస్పరము మత ద్వేషులైనప్పటికి) అందరూ కలసికట్టుగా భారతదేశానికి సంబంధించిన కాలం యొక్క ప్రాచీనతను తెలిపే గ్రంథాలను నాశనం చేయాలన్న దుష్టకార్యానికి ఏకీభవించారు. ఈ దురాగతాన్ని కొందరు ఆసియా ఖండంలోని ప్రాచీన వాఙ్మయ పరిశోధకులైన పాశ్చాత్య పండితులే గాక, ఇతర దేశాల్లోని పండితులు గూడా గర్హించతగ్గ విషయమని భావించారు. ఈ క్రైస్తవుల చేతిలో పడిన ప్రతి ప్రాచీన గ్రంథాన్ని వారు నిషేధించి తగల బెట్టారు. భారతదేశానికి కొత్తగా వచ్చిన ప్రతి పాశ్చాత్యుడూ గూడా ఈ ప్రాచీన గ్రంథప్రతులను తగలబెట్టాలని ఆదేశించారు. అయితే కొందరు భారత బ్రాహ్మణులు తమ గ్రంథాలను వారికందకుండా జాగ్రత్తపడ్డారు.”

18.8. మన గ్రంథాల్లో జరిగిన మార్పులు చేర్పులు :

కొందరు పాశ్చాత్యులు సంస్కృతం నేర్చుకుని మన గ్రంథాలు చదవసాగారు, అనువదించసాగారు. మన పురాణేతిహాసాల్లో చెప్పబడిన ధర్మాలు, ఆధ్యాత్మిక విషయాలు, సంఘ మర్యాదలు, సాంప్రదాయాలు తెలుసుకుని పాశ్చాత్యులు ఆశ్చర్యపోయారు. మిడిమిడి జ్ఞానం గల కొందరు అవి కవుల కల్పితాలని ప్రచారం చేసారు. దేశం నలుమూలలా వెతికించి మన గ్రంథాల రాతప్రతులనేకం పోగుచేయించి మార్పులు చేర్పులు చేసారు ఈ కింది విధంగా :

  1. గ్రంథ ప్రతుల్లో కొన్ని పొరపాట్లు జరిగాయని కొన్ని భాగాలను తొలగించారు.
  2. కొన్నిటిలో అక్షరాల్లో పొల్లులు మొ॥వాటిని మార్పించి గ్రంథ ప్రతుల్లో భేదాలుండేట్లు చేసి చెడగొట్టారు.
  3. ఒక ప్రతిలో ఉన్నట్లు ఇంకోదానిలో లేనందున ఎవరివల్లో ఇటీవల చేర్పించబడ్డాయని వాదించసాగారు.
  4. గ్రంథాల ప్రతుల్లో ప్రక్షిప్తాలున్నాయని బోధిస్తూ కువిమర్శలతో గ్రంథాలు రాసారు.
  5. మన చారిత్రక విషయాలకు సంబంధించిన కాలాల్ని గూడా మార్చేసారు.

మనవాళ్ళలో కొందరు వారి మెప్పు సంపాదించడానికా అన్నట్లు వారికి అనుకూలంగా మన గ్రంథాల్లో మార్పులు చేర్పులు చేసారు.

18.9. హిందువుల గురించి వక్ర భాష్యం :

ఆంగ్లేయులు ‘హిందూజాతి చరిత్రలు’ అన్న పేరుతో అనేక గ్రంథాలను రాసి ఇలా చెప్పారు :

  1. హిందూ జాతి చరిత్ర 2 వేల సంవత్సరాల లోపు కాలానికి చెందింది.
  2. హిందూ నాగరికత ఈజిప్ట్, బాబిలోనియా, గ్రీకుల నుండి వచ్చింది.
  3. వేదాలు 3 వేల సంవత్సరాల కిందట రాయబడ్డాయి.
  4. హిందూ జాతి అంతా శక, హూణ, గూర్జరాది మ్లేచ్చ జాతుల సంకరం వల్ల కలిగింది.

ఈ విధంగా కూటనీతి ఉపయోగించి ఈర్ష్యాసూయలతో కువిమర్శలు చేసి మన వాఙ్మయాన్ని కలుషితం చేసారు. ఆంగ్లం నేర్చిన మనవారు కొందరు ఆంగ్లంలో ఆంగ్లేయులచే రాయబడిన గ్రంథాలను చదివి మన వాఙ్మయాన్ని నిరసించసాగారు. వారు చెప్పిందే నిజమని నమ్మి మనవాళ్ళు తమని తాము హీనపరచుకునే స్థితికి చేరుకున్నారు. మనవారి మనసులు గూడా మారిపోయాయి. ఈవిధంగా మన చరిత్ర అంతా మారిపోయింది.

18.10. కులమత చిచ్చులకు కారకులు :

విదేశీయులకు ఏమైనా అర్థంకాక పోయినా, వారి సిద్ధాంతాలకు అడ్డుతగిలిన విషయాలున్నా అవి ప్రక్షిప్తాలని, అంటే ఆ తర్వాత మార్చి చేర్చబడినవని చెప్పసాగారు. దీని వల్ల మన శాస్త్ర విషయాలను పారమార్థిక చింతనతో అధ్యయనం చేసే వారికి క్రమేపి అది తగ్గసాగింది. అదేగాక భారతీయుల్లో ఉత్తరాది వారిని ఆర్యులని, దక్షిణాదివారిని దస్యులని, ద్రవిడులని విడదీసారు. ఆర్యులు విదేశాలనుండి వచ్చిన జాతులని, భారతదేశం మీద దండెత్తి అక్కడి వారిని కొల్లగొట్టి తరిమేసి భారతదేశాన్ని ఆక్రమించుకున్నారని ప్రచారం చేసారు. మతచిచ్చులు పెట్టారు. కులచిచ్చులకు గూడా వీరే కారణం. ఇతర దేశాల్లో కులచిచ్చులు లేవు. మన దేశంలోనే ఆంగ్లేయుల పుణ్యమా అని కుల, మత వైషమ్యాలు చోటుచేసుకున్నాయి. మనకు వర్ణవ్యవస్థ ఎప్పటి నుండో సృష్టి ప్రారంభం నుండి ఉంది. కానీ ఒక వర్గంవారు ఇంకోవర్గం వారితో పోటీపడలేదు. వారిని చూసి అసూయ పడలేదు ఆ కాలంలో. విదేశీయులు మన శాస్త్రాలను ఎలా ఉపయోగించుకున్నారో చూద్దాం.

18.11. విదేశీయులు మన శాస్త్రాలను ఎలా ఉపయోగించుకున్నారు ?

మన ప్రాచీన ఋషులు మనకందించిన విజ్ఞానశాస్త్రాలను అర్థం చేసుకునే తెలివితేటలు లేకపోయినా విదేశీయులు వాటిని తీసుకుపోయి వాటితోపాటు కొందరు వేదపండితులను కూడా తీసుకొనిపోయి, వారి భాషల్లోకి అనువదించుకుని వాటిని ఉపయోగించుకున్నారు. ఎలా? ఇలా :

  1. మన ఋషులు అందించిన అస్త్రవిద్యలను వాళ్ళు ఉపయోగించుకుని అణ్వాయుధాలను తయారు చేసుకున్నారు. అది ఎలాగన్నది ఇక్కడిచ్చిన ఉదాహరణ ద్వారా తెలుస్తుంది. జర్మనీలో విదేశాంగ కార్యాలయంలో ఒక చిత్రపటం ఉంది. అది దండిభట్ల విశ్వనాథ శాస్త్రి గారిది. ఆయన యజుర్వేద పండితుడు, యజుర్వేదానికి నాలుగు విధాల అర్థం చెప్పగలిగేవాడు: కర్మకాండ పరంగా, తాంత్రిక విద్యాపరంగా, ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా. 1938 లో జర్మనీ గూఢచారులు కోస్తాతీరంలో సంచరిస్తూ ఈ పండితుని ప్రవచనాలకు ఆకర్షితులై ఆయన్ను ఆశ్రయించారు. జర్మన్ భాషకు, సంస్కృతభాషకు దగ్గర పోలికలున్నాయి కాబట్టి నెమ్మదిగా వారు ఆయన్ను తమదేశానికి తరలించుకు పోయారు. వేదశాస్త్రాల్లో ఉన్న విజ్ఞానాన్ని యుద్ధనిర్మాణంలో ఉపయోగించుకున్నారు. ఆ పండితుని విద్యకు జోహార్లు అర్పిస్తూ ఆయనకు కృతజ్ఞతతో ఆయన చిత్రపటాన్ని తమ కార్యాలయంలో పెట్టుకుని గౌరవిస్తున్నారు.
  2. యంత్రాలసాయం లేకుండా గ్రహనక్షత్ర గతులను బట్టి, కాలమానాల్ని లెక్కగట్టిన ఖగోళశాస్త్రజ్ఞులు మనకున్నారు. ఉదా: ఆర్యభట్ట, వారాహమిహిర. వీరి అనువాదాలు చదివిన విదేశీయులు వారి ఖగోళ గణితశాస్త్రాల పరిజ్ఞానానికి ఆశ్చర్యపోయారు.
  3. పాణిని మహర్షి రాసిన అష్టాధ్యాయి విదేశీయులకు (English, Germans, Russians, etc) భాషాశాస్త్రాలను అభివృద్ధి పరచుకోవడానికి దోహదపడింది. ఆంగ్లభాషలో భాషాశాస్త్ర పండితులు మన పాణిని రాసిన శీక్ష/శిక్ష (phonetics) – శబ్దోత్పత్తిశాస్త్రం చదివి ప్రభావితులై వారి భాషకు కూడా phonetics అన్న శాస్త్రాన్ని తయారు చేసుకున్నారు.
  4. పాణిని రాసిన అష్టాధ్యాయికి, దానిపై కాత్యాయనుడు రాసిన వార్తికాలకు పతంజలి మహర్షి మహాభాష్యం రాస్తే, అది ఆంగ్లేయుల వ్యాకరణం యొక్క అభివృద్ధికి ఉపయోగపడింది. ఈ విషయాలన్నీ ఆంగ్లపుస్తకాల్లోనే ఉన్నాయి. అసలు వాళ్ళకి వ్యాకరణం మీద సరియైన అవగాహనేలేదు. ఏదో లాటిన్ భాషను ఆలంబనం చేసుకుని వ్యాకరణం తయారు చేసుకున్నారు. తరువాత మనవాళ్ళందించిన సూత్రాల పద్ధతి, వాళ్ళ భాషను అర్థం చేసుకుని అభివృద్ధి చేసుకోవడానికి సాయపడింది. అప్పుడొచ్చింది వాళ్ళకి Generative Grammar. ఈ విషయాలన్నీ ఆంగ్లభాషపై పరిశోధన చేసినవారికి బాగా తెలుస్తుంది.
  5. పతంజలి అందించిన అష్టాంగ యోగంలోని యోగసూత్రాల ద్వారా ఆరోగ్యం బాగుచేసుకోవడం నేర్చుకున్నారు. ఇప్పుడు పతంజలి యోగసూత్రాలను బట్టీపట్టి పఠిస్తున్నారు పడమటి దేశాల్లో. ఎందుకంటే ఆ శబ్దాలు రోగాలని – ప్రత్యేకంగా మెదడుకు సంబంధించిన రోగాలని నయం చేస్తాయట.
  6. విమాన విజ్ఞానం మనది. అది వాళ్ళు వాడుకున్నారు. మొట్టమొదటి విమానం తయారు చేసింది ముంబయికి చెందిన భారతీయుడు. ఆయన పేరు శివకర్ బాపూజీ తాల్పడే (1895). ఎప్పుడో లోగడ ఒక పత్రికలో ఆయన్ని గురించి వ్యాసం ప్రచురించారు. అది ఆంగ్లేయుల పాలన, పైగా డబ్బవసరమై ఆంగ్లేయులకు ఆ టెక్నాలజి అమ్మేసాడట. (అంతర్జాలంలో ఈయన్ని గురించిన సమాచారముంది).
  7. చెట్లకు, లోహాలకు ప్రాణం ఉంటుందని, స్పందించే శక్తి ఉంటుందని నిరూపించినవాడు మన జగదీష్ చంద్రబోస్. మొట్టమొదట రేడియో కనిపెట్టింది ఆయనే కానీ విదేశీయుల పక్షపాత బుద్ధివల్ల ఆ ఘనత ఇంచుమించు అదే సమయంలో రేడియోను కనిపెట్టిన ఇటలీదేశస్థుడైన మార్కోనికి దక్కింది.
  8. వైద్యశాస్త్రాన్ని భారతీయులు గ్రీకుల నుండి నేర్చుకున్నారంటారు. అది నిజంకాదు. భారతీయ బ్రాహ్మణుల నుండే గ్రీకులు ఈ వైద్యశాస్త్రాన్ని నేర్చుకున్నారని ఆంగ్లచరిత్రకారులే అన్నారు. 8వ శతాబ్దంలో అరబ్బులు అనువాదాలు చేసుకొని, ఈ వైద్యశాస్త్రాన్ని నేర్చుకున్నారు. 15వ శతాబ్దంలో ఐరోపావారు ఈ అరబ్బుల ఆ శాస్త్రాన్ని నే ఎన్నారు.
  9. మన విద్యావిధానాన్ని ఆంగ్లేయులు తమ దేశంలో ప్రవేశపెట్టుకొన్నారనడానికి సాక్ష్యాధారాలు ఈ మధ్య కొన్ని Channels ద్వారా తెలుస్తున్నాయి. ఇంతా చేసి మన విద్యావిధానాన్ని ఎంతో అవహేళన చేసారు! దాన్ని సమూలంగా మార్చేసారు! ఆంగ్లేయులు మన చరిత్ర పుస్తకాల్లో దొంగలను దొరలుగా ఎలా చిత్రీకరించారన్నది అందరూ తెలుసుకోవలసింది.

18.12. చరిత్ర పుస్తకాల్లో దొంగలను దొరలుగా ఎలా చిత్రీకరించారు?

మన చరిత్ర పుస్తకాల్లో మనకు పాఠ్యాంశాల్లో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు వాస్కోడగామ భారతదేశానికి దారి కనుగొన్నాడు, కొలంబస్ అమెరికాకు దారికనుగొన్నాడు అని. కనుక్కొని ఏం చేసారో చెప్పలేదు. నిజానికి వారు కనుగొన్నవి దారులు కావు, దాడులకు మార్గాలు. ఆ నిజాలిక్కడున్నాయి.

18.13. వాస్కోడాగామ :

1498లో దక్షిణ భారతంలో కాలికట్ వచ్చి అక్కడ రాజాశ్రయం పొంది, ఆ రాజును సపరివార సమేతంగా చంపేసి, అక్కడి సంపదలన్నీ చాలా ఓడల్లో తరలించుకుపోయాడు తన దేశానికి. ఇలా రెండు, మూడుసార్లు చేసాడు. ఈ విషయాలు బయటికి రానీయలేదు విదేశీయులు. నిజానికి ఇతను ఒక సముద్రపు దొంగ, దోపిడీదారు. ఈ విషయాలు మనవారిలో ఎంతమందికి తెలుసు?

18.14. కొలంబస్ :

అమెరికాసంయుక్త రాష్ట్రాలు అన్న పేరు రాకముందు ఆ ప్రాంతాలను ఏ పేర్లతో పిలిచేవారో ఎంతమందికి తెలుసు? ఆ ప్రాంతాల్లో నివసించే స్థానికులు ఇప్పుడు ఉన్నారా? ఏ స్థితిలో ఉన్నారు? ఈ విషయాలు ఎంతమందికి తెలుసు? హిస్టరీ ఆఫ్ అమేరికా చదవండి, తెలుస్తుంది. చాలామందికి తెలియని విషయం కొలంబస్ అన్నవాడు ఒక సముద్రపు దొంగ, దోపిడీదారు అన్న విషయం.

కొలంబస్ గురించి నిజం తెలుసుకోవాలంటే, 500 ఏళ్ళ క్రితం యూరప్ లోని పరిస్థితుల గురించి తెలుసుకోవాలి ముందు. మధ్యయుగంలో యూరప్‌లో దక్షిణాన గల గ్రీకుల, రోమనుల నాగరికతల ప్రభావం ఇతరప్రాంతాల వారి మీద ఉండేది. రానురాను జర్మన్ తెగలవారి యుద్ధతాకిడికి రోమనుల రాజ్యం ఛిన్నాభిన్నం కావొచ్చింది. అప్పుడు ఇటలీ లోని ‘రోమన్ కాథలిక్ చర్చ్’ యూరప్ లోని కొన్ని దేశాలను కలుపుకొని “హెూలీ రోమన్ ఎంపైర్’ ను స్థాపించింది. ఇటలీలోని కొంతభాగం, ఫ్రాన్స్, జర్మనీ కలిసి ‘రోమన్ ఎంపైర్’ గా పిలవబడేది. ఇక్కడ పోప్ వేరు, చక్రవర్తి వేరు. ఆ కాలంలో షాలమేన్ (Charleviagre) అన్నవాడిని చక్రవర్తి గా, 3వ పోప్ లియో నియమించాడు. అందరిమీదా పోప్ యొక్క పెద్దరికం, పెత్తనం చాలా ఉండేది. ఐనా ఇతర రాజ్యాలవారు రాజకీయపరంగా తమ అధికారాలు చేజారిపోకుండా జాగ్రత్తపడేవారు, చక్రవర్తిని ఖాతరు చేసేవారు కారు. ప్రతీరాజ్యంలోనూ రాజకీయ, సాంఘిక అస్థిరతల నెలకొని ఉండేవి. భూస్వాములెప్పుడూ యుద్ధవాతావరణంలోను, వేట, విందు వినోదాల్లోనూ గడిపేవారు. వ్యాపారస్తులకు, కళాకారులకు ప్రోత్సాహం ఉండేదికాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉత్తర యూరప్ నుండి దెన్మార్క్ నార్వే, స్వీడన్ దేశాలవారు ఇతర దేశాల మీద దాడులు సాగిస్తూ ‘ఉత్తర అమెరిక’ యొక్క కోస్తా ప్రాంతాలవరకూ వెళ్ళారు. అంటే 1000 సం॥ల క్రితమే మొదటగా యూరప్ నుండి అమెరికాకు ప్రయాణాలు సాగాయి. కానీ వారు అక్కడ స్థావరాలు ఏర్పరచు కోలేదు. ఇది కొలంబస్‌కు ఓ కొత్తఖండం కనుక్కోడానికి దారిని సుగమం చేసింది. యూరప్లోకెల్లా ఇటలీవారు తూర్పుదేశాలవారితో వ్యాపారసంబంధాలు పెట్టుకుని వస్తువుల రవాణా విషయంలో గుత్తాధిపత్యం వహిస్తూ డబ్బు బాగా గడించేవారు. ఇది కొన్ని ఇతర దేశాలవారికి నచ్చలేదు. ఇటలీవారి ప్రమేయం లేకుండా చేద్దామనుకున్నారు వారు. ఇటలీవారికి నౌకారంగంలో మంచి నైపుణ్యముంది. పోర్చుగీసు వారు కూడా నౌకారంగాన్ని అభివృద్ధి చేసుకున్నారు. కొలంబస్ (1451-1506) జెనీవాలో పుట్టి పెరిగినవాడు. పోర్చుగీసువారి వద్ద నౌకారంగంలో నైపుణ్యం సంపాదించాడు. అప్పుడు పడమటిదేశాలవారికి తూర్పున హిందూదేశమంటే సంపదలమయమన్న అభిప్రాయం ఉండేది. కొలంబస్‌కి గూడా హిందూదేశంలోని సంపదల మీద కన్నుపడింది. స్పెయిన్ దేశపు రాణి ‘ఇసబెల్లా’ ను కలిసి తనకు కొంతధనం, మనుషులను, ఓడలను ఇమ్మని కోరాడు. హిందూదేశం వెళ్ళి అక్కడ క్రైస్తవమతం ప్రచారం చేసి, మతమార్పిడులు చేసి, అక్కడి సంపదలు తీసుకురావడం తన ముఖ్యోద్దేశమని గూడా చెప్పాడు. ఆవిడ ముందర ఒప్పుకోకపోయినా తర్వాత సాయం చేసింది. కొన్ని ఓడల్లో కొందరు జనాల్ని తీసుకుని బయలుదేరాడు వాడు. ఆ కాలంలో పడమటిదేశాలవారు ఇతరదేశాలమీద దాడుల కోసం,ఆత్మరక్షణ కోసం తుపాకిమందు ఎక్కువగా వాడేవారు. వారు పడమటి వైపుగా సముద్ర ప్రయాణం చేసి ఒక కొత్త ప్రదేశాన్ని 1492 అక్టోబర్ 12న కనుగొన్నారు.

అది హిందూదేశమనుకున్నాడు కొలంబస్. ఈ విధంగా చాలాసార్లు స్పెయిన్ నుండి కొత్తఖండంలో చాలా ప్రదేశాలకు వెళ్ళాడు. ఆ విధంగా అక్కడ వలసలు ఏర్పరచుకున్నారు కొలంబస్, అతని తోటివారు. వారు అక్కడి స్థానికులను హింసించి చాలామందిని మట్టుబెట్టారు. కొందరిని బెదిరించి, బానిసలుగా చేసి వెట్టిచాకిరీ చేయించుకున్నారు.

కొలంబస్ అక్కడివారిని బలవంతంగా క్రైస్తవమతంలోకి దించి, వారి సంస్కృతి, ఆచారాలను నామరూపాల్లేకుండా పోవడానికి కారణమై నరరూప రాక్షసుడనిపించుకున్నాడు. చచ్చేవరకూ తను హిందూదేశాన్నే కనుగొన్నాననుకున్నాడు. ఐతే అతనిపట్ల ఎవరూ ఆదరాభిమానాలుగాని, గౌరవాన్నిగాని చూపలేదు. దక్షిణ అమెరికాలో కొలంబియాకు మాత్రమే వీడి పేరు పెట్టారు. ఇదే అదనుగా భావించి పోర్చుగీసువారు ఆ కొత్త ప్రదేశానికి 1501లో కొన్ని ఓడల్లో వెళ్ళారు. తర్వాత యూరప్ లోని మిగతా దేశాల వారంతా ఒకరితర్వాత ఒకరు – ఆంగ్లేయులు, ఫ్రెంచ్, మొ॥వారు వెళ్ళి తమ స్థావరాల్ని ఏర్పరచుకుని, ఆ కొత్త ఖండాన్ని ముక్కలు చేసి పంచుకుని, కొల్లగొట్టి, అక్కడి ప్రజలను ఊచకోతలుకోసి నరరూప రాక్షసులనిపించుకున్నారు. అసలైన స్థానికులుగా ఉన్న కోట్ల మందిని ఈ యూరోపియన్లు కిరాతకంగా పొట్టనపెట్టుకున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే వారు బానిసలుగా బతుకుతున్నారు. వీళ్ళా దేవుడ్ని గురించి, భారతీయులకు మతసహనం లేదంటూ మాట్లాడేది! అసలైన స్థానికులంటే ఇన్కాస్ (ఇనుడు – సూర్యుని ఆరాధించేవారు), ఆజ్టెక్స్ (ఆస్తికులు) మొ॥వారని కంచి మహాస్వామి అన్నారు.

ఈ వలసలు సాగుతున్నప్పుడు ఒక ఓడలో ‘అమేరిక వెసూచి’ అనే ఇటలీ వ్యాపారి ప్రయాణం చేస్తాడు. తర్వాత అతను కొన్ని ఉత్తరాలు రాసాడు – తాను చాలాసార్లు ఆ కొత్త ప్రదేశానికి వెళ్ళానని దాన్ని వర్ణిస్తూ తప్పుడు సమాచారమిచ్చాడు. వాటిలో ఓ ఉత్తరాన్నిఒక జర్మన్ భూగోళశాస్త్రజ్ఞుడు ప్రచురించి ఆ కొత్తఖండానికి అతని పేరు పెట్టమని సూచించాడు. అంతే! ఆ కొత్త ఖండానికి ‘అమేరిక/అమేరికా/ అమెరికా’ అన్న పేరు వచ్చింది. అతనే గొప్పవ్యక్తి కాదు ఓ ఖండానికి అతని పేరు పెట్టడానికి. ఈ పేరును గూర్చి ఓ ప్రఖ్యాత అమెరికన్ రచయిత, కవి ‘ రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ‘ చాలా బాధను వ్యక్తం చేసి అన్నాడు, ‘అమేరిక అన్నది ఓ దోపిడీదొంగ పేరు, దాన్ని ఓ ప్రదేశానికి పెట్టారు. అలా అని ఆయన చాలా వాపోయాడు.

18. 15. అమెరికన్ మేధావుల విమర్శ :

అమేరికను కొలంబస్ కనుక్కుని 1992కి 500 సం॥లైందని అక్కడి వాళ్ళు సంబరాలు జరుపుకున్నారు. వారంతా ఐరోపావారే. దీన్ని కొందరు అమెరికన్ మేధావులు తీవ్రంగా విమర్శించారు. వారిలో ముఖ్యుడు నోమ్ చామ్స్కీ (Noam Chomsky – Polish born American). ఈయన ప్రస్తుతం ఉన్నవారిలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన భాషాశాస్త్రవేత్త (linguist), అదేగాక తత్వవేత్త, రాజకీయ విశ్లేషకుడు. ఈయన్ను 1999లో హైన్డ్ డీట్‌రీచ్ (Ileins Dieterichi) అన్నాయన ఇంటర్వూ చేసాడు. అది Latin America from Colonization to Globalization అన్న పుస్తకరూపంలో వచ్చింది. ఆ ఇంటర్వూలో చామ్స్కీ అన్నారు: Columbus discovered America అనేకన్నా Columbus invaded America అంటే బాగా సరిపోతుంది… దాన్ని కనుగొనడం అనేకన్నా దురాక్రమణ అంటే బాగుంటుంది. ఆయన ఇంకా అన్నారు: “an invasion by a very alien culture. One can discover an uninhabited area, but not one in which people live” ఈ దాడులు జరిగిన 150 సం॥లలో దాదాపు 10 కోట్ల మంది స్థానికులు అంతమయ్యారు.

ఈ సందర్భంగా ఆయనన్నమాటలు : …consider the island of Hispaniola, containing Haiti and the Dominican Republic, its population of 7-8 millions … had been virtually exterminated by mass murder, and oppressive labour within a generation by Christopher Columbus, the genocidal monster whose exploits we celebrate each October.

‘ఇస్పాన్యోలా ద్వీపంలోని హైటి, డొమినికన్ రిపబ్లిక్ ప్రాంతాలకు చెందిన 70 నుంచి 80 లక్షల మంది ప్రజలు ఈ నరరూపరాక్షసుడు కొలంబస్ మూలంగా, బలవంతపు బానిసత్వం వల్ల గానీ, నరమేధానికి గానీ గురై అంతరించిపోయారు. అటువంటివాడి (అ)కృత్యాలను మనం పండగలా ప్రతి అక్టోబర్ లోను జరుపుకుంటున్నాం’

18.16. యూరోపియన్ల దురాక్రమణలు :

అమేరికను స్పానిష్ వాళ్ళు కొల్లగొట్టి హస్తగతం చేసుకున్నాక వారిని ఆంగ్లేయులు ఎలా ఊచకోతలు కోసి ఆ ప్రదేశాల్ని కబళించారు అన్న విషయాల మీద గూడా చాలా పుస్తకాలొచ్చాయి. అవి చదువుతుంటే నిజంగా రాక్షసులే వీళ్ళుగా పుట్టారేమో అనిపిస్తుంది! ఇప్పటికైనా మనం గ్రహించాల్సింది – విదేశీయులను దగ్గరకు రానీయకూడదని. ఈ యూరోపియన్లు ఎన్ని జాతుల్ని ఇలా నాశనంచేసారో! అలాంటి కిరాతకులకు మన వాళ్ళు జేజేలు పలుకుతున్నారు! ఎంత శోచనీయం! ఇంకా కొన్ని వింతలు తెలుసుకుందాం ఈ సముద్రపు దొంగల గురించి. ఈ సముద్రపు దొంగలందరూ తాము కొల్లగొట్టిన దాంట్లో వారి రాజులకు, రాణులకు కానుకలుగా వాటాలిస్తారు. ఆ విషయాలు ఆంగ్ల కథలు చదివినవారికి బాగా తెలుస్తాయి. ఇంగ్లండ్లో 16వ శతాబ్దంలో ఫ్రాన్సిస్ డ్రేక్ అని ఓ సముద్రపుదొంగ ఉండేవాడు. అతను బానిసల వ్యాపారం చేస్తూ, ఇతర దేశాలకు చెందిన ఓడలను కొల్లగొట్టి తెచ్చిన సొమ్ములో ఆంగ్ల రాణి ఎలిజబెత్‌కు కానుకగా వాటాలిచ్చేవాడు. అతనికి యోధ అన్న బిరుదిచ్చి సత్కరించారు. అతని పేరు సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ అయ్యింది. He was knighted అన్నమాట. అంటే ఓ సముద్రపుదొంగకు knighthood ఇచ్చి సత్కరించారు. ఈ రాజకుటుంబాల్లో చిత్రమైన సంఘటనలు జరుగుతూండేవి. రాజకుమారులు, వారి బంధువులు, స్నేహితులు లాంటివారంతా కలిసి డబ్బుకోసం రాత్రిపూట దారిదోపిడీలు గూడా చేసేవారుట.

18.17. విదేశాల అభివృద్ధి ఎలా జరిగింది?

ఇప్పుడు విదేశాలు ఎంతో అభివృద్ది చెందాయని ఆ దేశాలకు మనవారంతా వలసలు పోతున్నారు. ఆదేశాలన్నీ ఇతర దేశాలను కొల్లగొట్టిన సంపదలతో తమ దేశాలను అభివృద్ధి చేసుకున్నాయి. ఆంగ్లేయుల్లో ఎవరెవరు ఎలా అమేరిక వెళ్ళారు?  చదువుకున్నవాళ్ళంతా మేసచూసట్స్ లాంటి ప్రదేశాలకు వెళ్ళి ఆంగ్లాన్ని ప్రవేశపెట్టి కళాశాలలను, విశ్వవిద్యాలయాలను స్థాపించారు. చదువుకోని వారు, జైళ్ళల్లో మగ్గిపోతున్న ఖైదీలు- దొంగలు, దోపిడీదార్లు లాంటివారు (ప్రభుత్వం వదిలేసింది కొత్త ప్రాంతాలకు పొండని) వర్జీనియా లాంటి ప్రదేశాలకు పోయి అక్కడివారిని చంపి, తరిమేసి వ్యాపారాలు చేసుకున్నారు. మనందరికి తెలిసిన విషయమే తెల్లజాతీయులు ఆఫ్రికా లోని నల్లజాతివారిని, కాళ్ళుచేతులు గొలుసులతో కట్టేసి, తమ ప్రాంతాలకు తీసుకుపోయి, బానిసలుగా చేసి, వారి పొలాల్లో వెట్టిచాకిరీ ఎలా చేయించుకునేవారో! ఈ బానిస వ్యాపారులా మనకు కులమత భేదాలున్నాయని విమర్శిస్తారు!

ఇంక ఈ ఘోష చాలు. ప్రాచీనకాలంలో మన విద్యావిధానం ఎలా ఉండేదో తెలుసుకోవడం ఎంతో అవసరం, అది తరువాతి అధ్యాయంలో తెలుస్తుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here