Site icon Sanchika

దివినుంచి భువికి దిగిన దేవతలు 19

[box type=’note’ fontsize=’16’] మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞాన రహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రచన చేశారు డా. ఎం. ప్రభావతీదేవి. [/box]

ప్రాచీన భారతీయ విద్యావిధానం

19.0. మన విద్యావిధానాన్ని మార్చేసి, విదేశీ ఆంగ్ల విద్యావిధానాన్ని ప్రవేశ పెట్టిన మెకాలే పన్నిన పన్నాగం :

“భారతదేశాన్ని ఈ మూలనుంచి ఆమూలవరకూ సమగ్రంగా తిరిగి రాస్తున్న విన్నపం: ఈ దేశంలో ఒక్క ముష్టివాడు లేడు, ఒక్క దొంగతనం లేదు. అపారమైన సంపద, గొప్ప సంస్కృతి, చక్కటి మానవతా విలువలు ఉన్నాయి. గొప్ప ఆధ్యాత్మికత, ధార్మికత గల విద్యావిధానమే వీరికి బలం. అదే వారి వెన్నెముక. దాన్ని విరగొట్టి, వారి పురాతన విద్యావిధానం, సంస్కృతుల కన్నా మన ఆంగ్లభాష, విద్యావిధానాలే వారికి గొప్పగా అనిపించేటట్టు చేస్తే గానీ మనం ఈ దేశాన్ని ఆక్రమించి వారి మీద ఆధిపత్యం చేయలేం.” (మెకాలే 2-2-1853న ఆంగ్ల సామ్రాజ్యానికి రాసిన లేఖ).

ఇదీ విదేశీయుల కుటిలబుద్ధి!

ప్రపంచ దేశాలన్నిటిలో మన భారతదేశానికి ఒక ప్రాముఖ్యత ఉంది! దేనివల్ల?, వేదాలవల్ల! ఋషులవల్ల! ప్రాచీన కాలంలో ఈ ఋషులే వేదవిజ్ఞానాన్ని మన దేశం నలుమూలలా వ్యాపింప జేస్తారు. అలనాటి విద్యావిధానానికి, ఈనాటి విద్యావిధానానికి ఎంత తేడా ఉందో అందరికీ తెలుసు. మన దేశంలో ప్రస్తుత విద్యావిధానం చూస్తుంటే ఎంతో బాధాకరంగా ఉంటుంది. మనకంటూ ఓ అస్తిత్వం లేకుండా విదేశీ విద్యావిధానమే దిక్కన్నట్లు బతుకుతున్నాం. విదేశీయులు మన దేశంలో అడుగుపెట్టకముందు ఉన్న విద్యా విధానం గురించి సమగ్ర అవగాహన చాలామందికి లేదు. విదేశీ దురాక్రమణలు జరిగి, వారు మనని బానిసలుగా చూడ్డం మొదలుపెట్టాక, వాళ్ళకి మనం ఎందుకూ పనికిరాని, విద్యా బుద్ధుల్లేని వింతపశువుల్లాగ కనిపించాం. అందుకని వాళ్ల విద్యలు, వాళ్ల బుద్దులు మనకి నేర్పించి మనను మార్చేస్తారు. అవి సంఘసంస్కరణలు అనుకున్నారు. ఇప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో, విద్యల్లో, బుద్ధుల్లో మనం వాళ్ళని మించిపోతున్నాం! మనకు వాళ్ళభాషలు, విద్యలే గతి అన్నట్లు అయిపోయింది. అవి లేకపోతే మనుగడే లేదన్న భావజాలం నగరాల నుండి పల్లెలక్కూడా పాకిపోయి విద్యార్థులు వాటికోసం ఎగబడుతున్నారు! ఎంతో డబ్బు ఖర్చుచేస్తున్నారు, యంత్రాల్లా మారిపోతున్నారు! భారతదేశంలో ప్రాచీన కాలంలో గురుకుల విద్యావిధానం ఉండేదని అందరికీ తెలిసిన విషయమే. అయితే దాని గురించి సమగ్ర సమాచారం చాలా కొద్దిమందికే తెలుసు. అసలు ప్రాచీన కాలమన్నా, వేదకాలమన్నా ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉండేది? గురుకుల విద్యావిధానం ఎలా ఉండేది? పన్నిరకాల విద్యలు బోధించేవారు? గురుశిష్యుల లక్షణాలు ఎలా ఉండేవి? విశ్వవిద్యాలయాలు ఉండేవా? అవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఇలాంటి విషయాల గురించి చాలామందికి తెలీదు. కంచి మహాస్వామి శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతిగారి ప్రసంగాలు కొన్ని పుస్తక రూపంలో వచ్చాయి – ‘ఆచార్యవాణి-సనాతనధర్మం’ – ఇందులో వేదకాలం నాటి గురుకుల వ్యవస్థ నుండి మధ్యకాలం నాటి ఘటికాస్థానాలు, విశ్వవిద్యాలయాలను గురించిన వివరాలున్నాయి. అవి తెలుసుకుందాం.

19.1. వేదకాల నిర్ణయం :

వేదకాలాన్ని ఎవరైనా ఆధునికులు నిర్ణయించగలరా? వేదకాలమంటే ఆధునికులు అనుకున్నట్లు ఏదో 5,10 వేల సం॥ క్రితంది కాదు. వేదం అనాది అన్నప్పుడు వేదకాలాన్ని ఎలా లెక్కకడతాం? సృష్టి జరిగి ఎన్నో యుగాలు, కల్పాలు, కోటాను కోట్ల సం॥లు గడిచాయి. కానీ మన ప్రాచీన ఋషులు సృష్టి కాలానికి గూడా లెక్కలు కట్టి మనకిచ్చారు. ఆ వివరాలన్నీ ముందే తెలుసుకున్నాం. అనాది నుంచి గురుకుల విద్యావిధానం ఉండేదని పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి.

19.2. మొట్టమొదటి గురుకుల విద్యా వ్యవస్థ :

ప్రాచీనకాలంలో వేదకాలంలో ఋషులు గృహస్థాశ్రమధర్మం ఆచరించేవారు. వారి సంతతికి, వారి స్నేహితుల సంతతికి విద్యలు నేర్పేవారు. వారి పర్ణకుటీరాలలో గురుకులాలను నడిపేవారు. వాటినే ఆశ్రమాలనేవారు. అవి ప్రశాంతంగా ఉండేవి. ప్రకృతి సౌందర్యాలతో భాసించేవి. పశుపక్ష్యాదుల మధ్య, తరు లతా గుల్మాల, పూలచెట్లు గల పచ్చని వాతావరణంలో గుండెల నిండా ప్రాణశక్తిని నింపుకుని విద్యార్థులు విద్యాసాధన చేసేవారు. గురువులు వేదసంబంధమైన విద్యలు, శాస్త్రాలు బోధించేవారు. సాధారణంగా గురుకులవాసాలు వ్యక్తిగతంగా ఉండేవి. వారికి సహాయంగా ఒకరిద్దరు అధ్యాపకులు గూడా ఉండేవారు బహుశ. ఆనాటి గురువులను కులపతులనేవారు. వసిష్ఠ కణ్వ మహాఋషులను కులపతులుగా వర్ణించాడు కాళిదాస మహాకవి. నిజానికి 10వేల విద్యార్థులుంటేనే ఆ గురువులను కులపతులనేవారు. కానీ అరణ్యాలలో అంతమంది లేకపోవచ్చు. ఇంతమందికి దక్షిణ అన్నది అపేక్షించకుండా తమ గురుకులాల్లో ఉంచుకుని కులపతులు విద్యావిధానం చేసేవారు. కులపతులు అంటే అన్నదాన పోషణలతో విద్యనేర్పించేవారని అర్థం. ఆ స్వార్థ రహిత కార్యానికి రాజులు విరాళాలిచ్చేవారు.

19.3. వేదవిద్యలు అంటే ఏమిటి?

వేదాలు అపౌరుషేయాలన్నారు. ఎందుకు? అవి మనుషుల ద్వారా ప్రకటితం కాలేదు. వాటిని దైవవాక్కులుగా భావించారు. ఋషులు తపస్సు చేసుకునేటప్పుడు వారికి వేదమంత్రాలు, సూక్తులు వాటికి సంబంధించిన ఉపాసనా మార్గాలు స్పురించేవి. ఉపాసనల ద్వారా దేవతలను దర్శించి, వారిని ప్రసన్నం చేసుకునేవారు, ఇహపర కోరికలు తీరడం కోసం. ఇలా ఆ కాలంలో ఋషులకు దేవతలతో సంపర్కం ఉండేది. ఈ ఉపాసనా మార్గాలనే విద్యలు అనేవారు. అవే వేదవిద్యలు. వాటిని తమ సంతానానికి ఇతర శిష్యులకూ, ఉపదేశించేవారు. ఎవరైతే ఎంతో శ్రద్ధాభక్తులతో వాటిని అధ్యయనం చేసేవారో వారి పేర్లతో ఆ విద్యలు ఫిలబడేవి. ఉదా! నాచికేత విద్య, మైత్రేయ విద్య మొదలైనవి. ఇలా అనేకమంది ఋషులు వేద మంత్రోపాసనా పద్ధతులను బోధించేవారు. ఒక ఋషి కులానికి చెందిన విద్యార్థులు ఇంకో ఋషి కులానికి చెందిన విద్యలను గూడా నేర్చుకునేవారు. వైదికవిద్యల్లో అన్ని విద్యలూ బ్రహ్మవిద్యలో అంతమవుతాయి. బ్రహ్మవిద్య అంటే ఉపనిషత్తులే. వేదాంతమే బ్రహ్మతత్వాన్ని తెలిపేది, ఈవిద్యల్లో కొన్ని విద్యలు కర్మపరంగా ఉంటే, కొన్ని ధ్యానమార్గంగా ఉండేవి. ఉదా: పంచాగ్ని విద్య, మధువిద్య, వైశ్వానరవిద్య, దహరవిద్య, అంతర్యామి విద్య మొ॥వి.

వేదం-శబ్దం-స్వరం :

వేదాధ్యయనంలో ముఖ్యమైనది స్వరయుక్త శబ్దోచ్చారణ. వేదశబ్దాలు స్వరంతో కూడుకుని ఉంటాయి. ఈ శబ్దశాస్త్రాన్నే శిక్ష/శీక్ష అనేవారు. ఒక్కొక్క అక్షరం ఎలా స్వరంతో పలకాలో జాగ్రత్తగా, శ్రద్ధగా నేర్చుకోవాలి. అపశబ్దాలుంటే మంత్రాలు విపరీత ఫలితాలనిస్తాయి. స్వరంతో కూడిన వేదమంత్రాలను విని నోటితో వల్లెవేయాలి. స్వరాన్ని పుస్తకాల ద్వారా నేర్చుకోలేరు. గ్రంథస్తం చేయబడిన ‘ఋగ్వేదమే’ ఆదిగ్రంథం. అందులో భాషారూపాన్ని నిర్ణయించే వ్యాకరణాన్ని చూసి పాశ్చాత్యులే ఆశ్చర్యపోయారు. పాణిని రాసిన శీక్షా శాస్త్రాన్ని ఆంగ్లేయులు వారి భాషలోకి అనువదించుకుని ఫోనేటిక్స్ అనే భాషాశాస్త్రాన్ని తయారు చేసుకున్నారు. వారి భాషకు గూడా స్వరం ఉందని తెలుసుకుని దాన్ని అభివృద్ధిపరచుకున్నారు. ఈ స్వరాన్ని ఆంగ్లంలో ఇండొనేషన్ అంటారు.

19.4. ఋషులు తపస్సుద్వారా ఏం తెలుసుకున్నారు?

ఋషులెవరు? ఎందుకు తపస్సు చేసేవారు? అనే ప్రశ్నలు కలుగుతాయి మనకు.. ప్రాచీన భారతీయ విజ్ఞానశాస్త్రవేత్తలే ఈ ఋషులు. వారు నగరాల్లో, పల్లెల్లో ఉండక అడవుల్లో, కొండగుహల్లో ఉండి, తిండీ తిప్పలు మానేసి వారి శరీరాలనే ప్రయోగశాలలుగా చేసుకుని తపస్సు అనే పరిశోధన చేసేవారు. వారికి స్థూలప్రపంచానికి సంబంధించిన విషయాల మీద ఆసక్తి లేదు. కంటికి కనపడే స్థూల ప్రకృతే కాదు, కనపడని సూక్ష్మ ప్రకృతి గూడా ఉందని తెలుసుకుని, వారు తపస్సు ద్వారా సూక్ష్మ ప్రపంచపు రహస్యాలను – విశ్వరహస్యాలను తెలుసుకునేవారు. విశ్వంలో ప్రతిదీ పంచభూతాలతో తయారైందే. ప్రతీ దానికీ స్థూలరూపంతోపాటు, కంటికి కనపడని సూక్ష్మరూపం గూడా ఉందని తెలుసుకున్నారు. ఒక స్థూల పదార్థం మనకు కనిపిస్తోందంటే దానికి మూలం పరమాత్మబ్రహ్మం/చైతన్యం అని తెలుసుకున్నారు. ఎంతోమంది ఋషులు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసారు. వారందరూ చెప్పింది ఒక్కటే – ఈ విశ్వం యొక్క సృష్టి, స్థితి, లయలకి మూలకారణం పరమాత్మ. అదే సత్యం, అదే జ్ఞానం. ఈ జ్ఞానం అనంతం. పరమాత్మ సమష్టి రూపమైతే, జీవాత్మజీవుడు వ్యష్టిరూపం. జీవుడు తపస్సాధనల ద్వారా దేవుడితో ఐక్యం చెందాలి. దీంతమంది తపస్సు చేసి చెప్పినా ఇదే వారి సిద్ధాంతం. వారు చెప్పిన వాటికి వారు కర్తలమని చెప్పుకోలేదు. ఎందుకంటే ఏ సిద్ధాంతమూ తమతో మొదలు కాలేదు కనుక.

19.5. వేదరక్షక వర్గం :

ఈ వేద విజ్ఞానాన్ని రక్షించడానికి ఒక వర్గం నిర్దేశింపబడింది. వారే వేదబ్రాహ్మణులు.వారు ఏ వృత్తులూ అవలంబించరాదు. వాళ్ళ వృత్తి వేదాధ్యయనమే. వేదవిద్యార్థులకు ఉండాల్సింది తెలివి ఒకటే కాదు, శీలసంపద గూడా ఎంతో అవసరం. జీవితం శుద్ధంగా ఉంటేనేగానీ జ్ఞానానుభవం కలగదు. అందుకే బ్రహ్మచర్యవ్రతం అవలంబించేవారు. బ్రహ్మచారులకు విద్యాభ్యాసమంటే ఒక వ్రతం లాంటిది. అది బ్రహ్మచర్య దీక్షతోనే ఆరంభమవుతుంది. బ్రాహ్మణుడు పుట్టగానే బ్రాహ్మణుడు కాలేడు. ఎన్ని సంస్కారాలో జరుగుతాయి. ఉపనయనం తరువాత ద్విజుడు, విద్యాభ్యాసంతో విప్రుడు, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు. వైదిక విద్య, వైదికానుష్టానాలు ఆజన్మ విధిగా బ్రాహ్మణులకు విధించారు. ఆదికాలంలో విద్యాశాలలు కుటుంబపరంగా ఉండేవి. క్రమేణా ఋషికులాలమధ్య సంబంధాలేర్పడి విద్యాస్థానాలుగా వ్యాపించాయి. ఇవి పెద్ద గురుకులాలుగా మారాయి. కాలక్రమేణా విద్య అన్న పదం ఒక ఆధ్యాత్మిక విద్యకై కాక, ఇతర కళలకూ, విజ్ఞానానికి కూడా సూచకంగా మారాయి. పూర్వకాలంలో అన్ని విద్యలూ వైదిక పరమైనవే. కళగాని, విజ్ఞానం గానీ అన్నీ వేదసంబంధమైనవే. ఈ విద్య ప్రయోజనం వైదికమార్గపరమైన జీవనమే.

కొన్ని విద్యలు : ఆనాటి కాలంలో 64 కళలూ నేర్పేవారని అనేవారు. అందులో కొన్నీటిని తెలుసుకుందాం. ఇది నారద సనత్కుమార సంభాషణలో నారదుడు తాను నేర్చిన విద్యలను గూర్చి వివరిస్తాడు. అవి : నాలుగు వేదాలు, ఇతిహాసము, పురాణములు (పంచమవేదమని చెప్పబడినవి), పిత్ర్యం అనగా పైతృకర్మలకు చెందిన కల్పము, రాశి లేక గణితము, దైవము (భావిని గురించి చెప్పటం) శకున శాస్త్రము, ఏకాయనం (రాజనీతి), నిధి అనగా ఆర్థిక శాస్త్రము, వాకోవాక్యము (లాజిక్-తర్కము), దేవవిద్య (నిరుక్తము), బ్రహ్మవిద్య అనగా మంత్రనాదములను గూర్చిన శిక్షాశాస్త్రము, భూతవిద్య (బయాలజీ), క్షాత్రవిద్య, (యుద్దమునకు సంబంధించిన విద్య), నక్షత్ర విద్య (ఖగోళశాస్త్రము, జ్యోతిషశాస్త్రము), సర్పవిద్య (విషవైద్యము), దేవజనవిద్య (సంగీతము, నాట్య, నాటక, శిల్ప, చిత్రలేఖనము), దేవజనములనగా గంధర్వులు (దేవతలకు మనుష్యులకు మధ్య ఉన్న ఒక తెగ).

19.6. గురు శిష్యుల లక్షణాలు :

గురువులను మనదేశంలో ఈశ్వర భావంతో చూస్తాం. ఆయన ఆత్మానుభవం కలిగి కుశాగ్రబుద్ధి, శాస్త్ర సంపన్నత, విశేషజ్ఞానం గూడా కలిగి ఉండాలి. బోధనం, శీలసంపద, ఆచరణ అనుషానాలు కలిగి ఉండాలి. అంటే శాస్త్రసిద్దాంతాలను తెలుసుకుని స్వయంగా ఆచరించాలి. అలాంటి వారినే ఆచార్యులంటారు. ఇతరులచేత ఆచరింపచేయాలి. గురువు అంటే ఏ విద్య అయినా చెప్పేవాడుగా ఉండాలి. శిష్యులకు ముఖ్యంగా ఉండాల్సింది గురువంటే అనన్య భక్తి. వారు వినయ విధేయతలు కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కోసం బ్రహ్మచర్యం అవలంబించాలి. దినచర్యలో భాగంగా ఆరోగ్యం కోసం ప్రాతః కాలంలో మేల్కొన్ని, చన్నీళ్ళస్నానం, ప్రాణాయామ సాధనలు, సూర్య నమస్కారాలు మొ॥ చేయాలి. ఇంక గురుసేవ, స్వాధ్యాయనం, భిక్షాటన, యజ్ఞానికి సమిధల సేకరణ, పూజకు పూల సేకరణ చేయాలి విద్యార్థులను నిత్యం చదవమని వేధించేవారు కారు. ఆనాటి విద్యావిధానంలో ప్రతీ మాసంలో కొన్ని రోజులు సెలవులుండేవి. అనధ్యయన దినాలు అనేవారు. అవి అమావాస్య, పౌర్ణమి, చతుర్దశి, పాడ్యమి, అష్టమి మొదలైనవి.

1. అందరికీ విద్య :

రానురాను గురుకులాలు విస్తరించాక వేదవిద్యలే కాక లౌకిక విద్యలు గూడా నేర్పేవారు. మొట్టమొదట బ్రాహ్మణులకే నేర్పబడిన విద్యలు, తర్వాత వారితోపాటు, క్షత్రియులకు, వైశ్యులకు గూడా నేర్పబడ్డాయి. ఎందుకంటే అప్పటికి వృత్తులకు తగిన విద్యలు వచ్చాయి. అన్ని వర్గాలవారికీ వారి వృత్తులకు తగిన విద్యలు వచ్చాయి. నాల్గవ వర్గానికి చెందిన వారు గూడా మధ్యాహ్నం గురుకులానికి వచ్చి వారి వృత్తులకు తగిన విద్యలు నేర్చుకునేవారు. ఆ కాలంలో నిర్బంధవిద్య ఉండేదిట. గురువు వద్దకు పిల్లలను పంపకపోతే, తల్లిదండ్రులను శిక్షించేవారు. జాతి నుండి వెలివేసేవారు. అయితే శ్రద్ధాభక్తులున్న వారికే విద్య నేర్పేవారు. అది లేనివారికి విద్యచెప్పకూడదనేవారు.

2. విద్యకు కాలపరిమితి :

పూర్వకాలంలో విద్యార్థి చురుకుతనాన్ని బట్టి విద్యాకాలాన్ని నిర్ణయించేవారు.  సాధారణంగా 9,12,18, 38 ఏళ్ళుగా గూడా ఉండేవి. చదివే విద్యను బట్టి కొందరు ఆజన్మ పర్యంతం విద్యాభ్యాసం చేసేవారు.

19.7. బ్రాహ్మణులు వృత్తి విద్యలు :

సాధారణంగా ఆధునికులు అనుకనేది : బ్రాహ్మణులు ఇతర జాతుల వారికి విద్యాదానం చేయక వారిని అంధకారంలో ముంచేసారని. ఇది నిజంగాదు. వారు ఇతరులను వేరుగా ఉంచలేదు. వేదాలను వారికి నేరుగా చెప్పలేదు. వైదిక విద్య, వైదికానుష్టానాలు ఆజన్మవిధిగా బ్రాహ్మణుల కోసం విధించారు. మన పూర్వులు బ్రాహ్మణులను అన్ని జాతుల వారికి వారి వృత్తి విద్యలను నేర్పించాలని, ధర్మబోధ, ఆత్మవిద్య విషయాల్గను బోధించాలని ఆదేశించారు. అందుకోసం బ్రాహ్మణులు కొన్ని వృత్తి విద్యల్లో గూడా నైపుణ్యం సంపాదించి ఇతరులకు నేర్పాలి. వారు కష్టాలను, క్లేశాలను లెక్క చేయక లోక క్షేమం కోసం తమ కాలాన్ని వినీయోగించాలి. శిష్యులు దక్షిణ ఇస్తే తృప్తి పడాలి. గురువులు ఏవిద్యనైనా చెప్పేవారు. అధ్యాపకుడు వేతనం తీసికోకుండా విద్యాబోధన చేసేవాడు. ఉపాధ్యాయుడంటే వేతనం తీసుకుని విద్యాబోధనచేసేవాడు. ఇతరులకు వారి వర్ణాశ్రమ ధర్మం ప్రకారం విద్యలు, వృత్తులు నేర్పబడేవి. వారికోసం పురాణాలు, ఇతిహాసాలు ఏర్పడ్డాయి. వారిలో గూడా ధర్మపరాయణులు, ఆత్మవిద్యా ప్రవీణలు ఉండేవారు. వారిలో బ్రాహ్మణులకు గూడా విద్యనేర్పగల విద్వత్తు ఉన్నవారున్నారు. ఏజాతివారైనా మరోజాతి వారి దగ్గరున్న విద్యలను గ్రహించవచ్చు. సామాన్యులుగూడా ఆధ్యాత్మిక, నైతిక, ధార్మిక విషయాలు తెలుసుకునేవారు. సామాన్యులు కొందరు వారి వృత్తి విద్యలను వారి ఇళ్ళళ్ళోనే నేర్చుకునేవారు. ఆ కాలంలో వేదాంతం చెప్పినా, విద్యార్థులకు ఏదో ఒక కళలో అభిరుచి కలిగించడానికి కళలను గూడా నేర్పేవారు. వేదాంతం బోధించడమంటే విద్యార్థులు వెంటనే వేదాంతలక్ష్యానికి పాటుపడతారని కాదు. విద్యార్థి గృహస్థు కాగానే ధార్మికంగా కర్మమార్గంలో జీవిస్తూ, చిత్తశుద్ధి కలిగి పక్వత చెందాక చివరకు ఆత్మాన్వేషకుడుగా మారేవాడు.

19.8. మధ్యకాలంలో విద్యాభ్యాసం :

కలియుగం ఆరంభమైన తరువాత 2000 ఏళ్లకు మనకు మనదేశంలో వైదిక ధర్మం సన్నగిల్లింది. ఆనాటి బ్రాహ్మణుల్లో అనుష్టానశక్తి వేదాంత విజ్ఞానం క్షీణదశకు చేరుకుని వారిని దురహంకారపూరితులుగా చేయసాగాయి. జైన బౌద్ధాలవారు వైదిక మతం అవలంబించిన వారిలో దురహంకారులైన వారిని సరిదిద్దకుండా, వేదాలను నిరసించసాగారు. వేదాల ఉద్దేశం తప్పు, వర్ణ విభాగం ఉండకూడదు, హిందువులేర్పరచిన ఆనాటి వర్ణవ్యవస్థలో పక్షపాతముందని జినుడు, బుధుడు తప్పుగా తలచారు. ఈ బోధనలవల్ల జనాలకు వైదికమతంలో విశ్వాసం సడలి జైన బౌద్దాలను అవలంబించారు. వారి మతంలో వర్ణవ్యవస్థ లేదు. మతగ్రంథాలను వాడుక భాషలోకి రాసి పెద్దపెద్ద విద్యాస్థానాలు స్థాపించారు. ఐతే బ్రాహ్మణుల్లోను, బ్రాహ్మణేతరుల్లోను ఏ కొద్దిమంది మాత్రమే అటు వెళ్ళారు. కానీ వర్ణధర్మం అలానే ఉంది. హిందువుల్లో సన్యాసం స్వీకరించినవారు ఏకాంత సంచారం చేసేవారు. కానీ బౌద్ధ సన్యాసులకు సంఘాలేర్పడ్డాయి. వారు ఒకచోట ఉండి విద్యాలయాలను నడిపేవారు. బౌద్ధ, జైన మతాల ప్రభావం కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది కానీ దేశమంతా కాలేదు. రానురాను ఈ జైన బౌదుల్లో స్వార్థత్యాగులు, మహావిద్వాంసులు, నైష్ఠికులూ ఉన్నా వారు ప్రజలకు ఆదర్శంగా ఉండలేకపోయేవారు. వైదికమతానుయాయులే గృహస్తులైనా, ఆదర్శపురుషులుగా ఉండేవారు. కాలక్రమేణా బౌద్ధ సన్యాసుల్లో ధర్మం, శీలం లోపించి చాలా దిగజారి పోయారు. ఐతే వర్ణవ్యవస్థ చెక్కుచెదరలేదు.

19.9. ఆదిశంకరులు-అద్వైతం :

జైన, బౌద్దాల్లాంటి అవైదికమతాలు ఇంకా కొన్ని ప్రబలి సంప్రదాయం దురాచారంగా మారింది. జ్ఞాన శూన్యమైన కర్మవాదం ప్రబలింది. ఈ సమయంలో శంకరులవారు అవతరించి కాలినడకన దేశసంచారం చేస్తూ అవైదికమతాలను ఖండిస్తూ, తిరిగి వైదిక ధర్మాన్ని సుప్రతిష్ఠించారు. సనాతనమైన అద్వైతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.

19.10. ఘటికాస్థానాలు :

ఇక్కడనుండి మధ్యకాలంలో విద్యావిధానం ఎలా ఉండేదో తెలుసుకుందాం. ‘ఘటిక’ అన్న ప్రయోగాన్ని కుమారిలభట్టు చేస్తాడు. ఆయన ప్రయాగలో ఉండేవాడు. అంటే 2500 సం॥ క్రితం ఘటికలనే విద్యాస్థానాలున్నాయని రుజువవుతోంది. ఈ ఘటికలు భారతదేశం నలుమూలలా ఉండేవి- ఉత్తరాన గంగాతీరం నుండి, దక్షిణాన చోళదేశం వరకూ, పశ్చిమాన వల్లభి నుండే తూర్పున నవద్వీపం వరకూ.

1. ఘటిక అన్న పేరు ఎలా వచ్చింది?

ఈ ఘటిక అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. విద్యార్థుల వేదవిద్యా కౌశలాన్ని పరీక్షించడానికి ఆయా వేద భాగాలను తెలిపే లేఖలు చీటీలు కుండలలో ఉంచి, పరీక్షాకాలంలో ఏదో ఒక చీటీని పైకితీసి, ఈ చీటీలో రాయబడిన వేదభాగాన్ని విద్యార్థిని అధ్యయనం చేయమని నిర్దేశించేవారు. ఈ విధంగా ఘటికలలో పరీక్షలు నిర్వహించేవారు.

2. ఘటికాస్థానాల్లో బోధన :

ఈ ఘటికాస్థానాల్లో వేదాలు, శాస్త్రాలు, కళలూ, ఆకాలనికి చెందిన శాస్త్రాలు, వైద్యం మొ॥ బోధించేవారు. మొట్టమొదట వేదసంబంధమైన విద్యలు, శాస్త్రాలు బోధించినా, తరువాత లౌకిక విద్యలుగూడా నేర్పేవారు. బుద్ధుని కాలానికి పూర్వం ఇవి కొద్దిగా ఉండేవి. బుద్దుని అనంతరం ఇవి ఎక్కువయ్యాయి.

3. కొన్ని ఘటికాస్థానాలు :

తెలుగుదేశం గోదావరీ ప్రాంతంలో సి.ఇ.(సామాన్యశకం) 6వ శతాబ్దంలో ఘటికాస్థానాలుండేవి. తమిళనాట కొన్ని ఘటికా స్థానాలుండేవి. బి.సి.ఇ. 6వ శతాబ్దంలో కర్ణాటకలోని షిమోగా నుండి మయూరవర్మ (కేరళవాడని కొందరంటారు) అన్నరాజు కంచికి విద్యాభ్యాసానికి వెళ్ళాడు. ఆయన గురువైన వీరశర్మ గూడా కంచిలోని ఓ ఘటికాస్థానంలో చదువుకున్నాడని శాసనం ఉంది. ఆరోజుల్లో విద్యాభ్యాసానికి కంచి నుంచి కాశీకి, పాటలీపుత్రానికి కూడా వెళ్ళేవారు. కంచిలో నరసింహవర్మ రాజుగా ఉన్నపుడు కైలాసనాథ ఆలయం నిర్మించటంతోపాటు ఒక ఘటికను గూడా పునర్నిర్మాణం చేసాడు. ఆయన అనంతరం రాజులు క్షీణించారు. తర్వాత చెట్టియార్లు, పిళ్ళేలు మతరక్షణకు పూనుకున్నారు. ఆలయ జీర్ణోద్దరణ, పాఠశాలలు నిర్మాణంలాంటివి ఎన్నో పుణ్యకార్యాలు చేసారు. ఇలా చాల ఘటికలుండేవి ఆరోజుల్లోనని ఆలయశిలాశాసనాలవల్ల, తామ్రశాసనాలవల్ల తెలుస్తోంది.

19.11. ఆలయాల్లో విద్యావ్యాసంగం :

వెయ్యిసంవత్సరాల క్రితం ఆలయాల్లో గూడా విద్యావ్యాసంగం నడిచేది. పాండ్యుల, పల్లవుల, చోళుల కాలాల్లో నిర్మింపబడిన ఆలయాలు విద్య, వాంజయ, నృత్యం, గానకళలకు కేంద్రాలుగా ఉండేవి. ఆ కాలంలో అనేక శివాలయాల్లో ‘వ్యాకరణ దాన మండపాల’ను నిర్మించారు. చిదంబరం, తంజావూరు ఆలయాల్లో రెండంతస్తుల మేడలుండేవి. వాటిలో గ్రంథాలయాలు గూడా ఉండేవి. ఎన్నో గ్రంధాలను సేకరించి విద్యార్థులకు, అధ్యాపకులకూ అందుబాటులో ఉంచేవారు. ఈ ఆలయ విద్యాలయాల్లో  ఒక్క మత సంబంధమైన విద్యలేకాక సామాజిక విద్యలు గూడా బోధించేవారు. ఏ విద్యకైనా దైవసంబంధం ఉన్నదని ప్రజలకు అభిప్రాయం కలగడానికే ఆ ఏర్పాటు. ఆయుర్వేదం గూడా నేర్పేవారు. ఇటువంటి విద్యాలయాలు భారతదేశమంతటా వ్యాపించి ఉండేవి. అలెగ్జాండర్ తర్వాత మన దేశానికి ఇతర దేశాలతో సంపర్కం ఏర్పడి, మనవారు కొత్త విషయాలు – తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. జైన, బౌద్దాలు ఆయా మతాల వ్యాప్తి కోసం తీవ్రంగా ఇతర దేశాలకు వెళ్ళేసరికి మనకి వారితో సంపర్కం అధికమవుతూ వచ్చింది. ఆకారణం వల్ల పెద్ద విద్యాస్థానాల అవసరం కలిగింది. చదివే విషయాలు ఎక్కువయ్యాయి. పాత గురుకులవాస విధానం క్షీణించసాగింది.

19.12. విశ్వవిద్యాలయాలు :

ప్రాచీన భారతదేశంలో విశ్వవిద్యాలయాలంటే రెండు పేర్లు మనకు స్ఫురిస్తాయి. ఒకటి పాకిస్థాన్ లోని తక్షశిల, రెండవది బీహార్లోని నలంద, వీటి తర్వాత ఇంకో పేరు గూడా ఉంది. అది గూడా బీహారులోదే – విక్రమశీల విశ్వవిద్యాలయం.

1. తక్షశిల :

తక్షశిలకి పురాతన ప్రాచుర్యం గూడా ఉంది. శ్రీరాముని తమ్ముడైన భరతుని కుమారుడైన తక్షుని పేర ఈ చోటుకు తక్షశిల అన్న పేరు వచ్చింది. ఈ ప్రాంతం గాంధారదేశానికి చెందింది. జనమేజయుడు సర్పయాగం చేసింది కూడా ఇక్కడే. ఋషులకు మహాభారతం మొదటగా పరిచయం చేయబడింది ఈ స్థలంలోనే అంటే తక్షశిల ప్రాచీనకాలం నుండి ఉందన్నమాట. చైనా యాత్రికుడు పాహియాన్ (5వ శII సి.ఇ.) భారతదేశ పర్యటనకు వచ్చినపుడు ఇక్కడ బౌద్ధవిహారాలు, చైత్యాలు చాలా ఉండేవి. తర్వాత ముస్లిం దండయాత్రల్లో ఇవన్నీ నేలమట్టమయ్యాయి. పాహియాన్ తర్వాత 200 సంIIకు హ్యూన్ సాంగ్ వచ్చినపుడు ఈ నగరం శిథిలావస్థలో ఉంది.

బౌద్దులకు ఈనగరం విద్యాస్థానంగా ఉన్నప్పటికీ, ఇచ్చట కేంద్రీయమైన విశ్వవిద్యాలయం ఉండేది కాదు. ఇక్కడ చిన్నచిన్న పాఠశాలల్లో వేదంతోపాటు 16 శాస్త్రాలు బోధించేవారు. చాణక్యుడు విద్యాభ్యాసం చేసింది ఇక్కడే. తక్షశిలలో శాస్త్ర, సాంకేతిక విద్యలైన ఇంజనీరింగ్, టెక్నాలజీ నేర్పేవారు.

2. నలంద :

నలందా నగరంలో పెద్ద విశ్వవిద్యాలయముండేది. ఈ నగరం బుద్దుని జీవితంతో పెనవేసుకుంది. ఇది పాట్నాకు దగ్గరగా ఉంది. ఆచార్య నాగార్జునుడు ఈ నగరానికి చెందినవాడే. ఈ నగరం, సి.ఇ. 5వ శతాబ్దంలో నరసింహబాలాదిత్య పాలనలో అత్యున్నత స్థితిలో ఉండేది. ఇక్కడ బౌద్ధ గ్రంధాలతోపాటు వేదాలు గూడా అభ్యసించేవారు. దాదాపు 10వేల మంది చదివేవారు. వారిలో ఇతర ఆసియా, యూరోప్ దేశాలనుండి వచ్చినవారు ఉన్నారు. ఇది ఎక్కువగా బౌద్ధభిక్షువుల వ్యాప్తి కోసం ఏర్పడింది. అందుచేత శాస్త్ర సాంకేతిక విద్యలకు ఎక్కువ అంత ప్రాముఖ్యత లేదు. కానీ ఇక్కడ ఖగోళశాస్త్రానికి ప్రాముఖ్య ఉండేది. ఇక్కడ ఓ పెద్ద అబ్జర్వేటరీ, 9 అంతస్తుల గ్రంథాలయం ఉండేవి. మహమ్మద్ గజనీ, గోరీలు వారితర్వాత వారి దాడుల వల్ల ఈ విశ్వవిద్యాలయంపూర్తిగా నాశనమైంది. అంటే దాదాపు 800 సం॥ ఈ నలందా విశ్వవిద్యాలయం బాగా వర్ధిల్లింది.

3. విక్రమశీల :

విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని సి.ఇ. 5వ శతాబ్దంలో ధర్మపాలుడు అన్నరాజు గంగాతీరంలో ఒక పర్వతశిఖరంలో స్థాపించాడు. దానికి అనుబంధంగా ఒక బౌద్దమఠం గూడా నిర్మింపజేసాడు. ఈ నగరానికి టిబెట్ నుండి విద్యార్థులైన బౌద్ధభిక్షువులు వచ్చేవారు. ఇక్కడ నుండి బౌద్దమత వ్యాప్తి కోసం టిబెట్‌కు బౌద్ద సన్యాసులు వెళ్ళేవారు. ఇది గూడా తురుష్కుల దాడులలో నాశనమైంది. ఇక్కడ నుండి చాలామంది ఆచార్యులు, బౌద్ధసన్యాసులు గూడా పారిపోయి నేపాల్లో తలదాచుకున్నారుట. నలందా, విక్రమశిల విశ్వవిద్యాలయాలు అభివృద్ధిలో వున్నపుడు ఇక్కడ నుండి చాలా బౌద్ద తాంత్రికగ్రంథాలు టిబెట్‌కు తీసుకెళ్ళారు. ఇప్పుడు ఆ గ్రంథాలను టిబెట్ నుండి సంగ్రహించాల్సి వస్తోంది మనకు, మనవద్ద అవి లేకపోవడం మూలాన.

4. ఇతర విద్యాస్థానాలు :

పురాతన కాలంతో ఉత్తరంలో కాశీలోను, దక్షిణంలో కంచిలోను వేదశాస్రాభ్యాసం చేసేవారు. అలాగే గుజరాత్‌లో వల్లభి అన్న ప్రాంతం కూడా ఓ గొప్ప విద్యాస్థానం. విక్రమార్కుని ఉజ్జయని ఇంకో ప్రముఖ విద్యాస్థానం. తూర్పున బెంగాల్లో నవద్వీపం (ప్రస్తుతం నాడియా అని పిలుస్తున్నారు) ఓ ప్రఖ్యాతికాంచిన విద్యాస్థానం.

ఇక్కడ తర్కం, దర్శనాలు అభ్యసించేవారు. ఈ ప్రాంతం గూడా ముస్లిం దాడుల్లో నాశనమైంది. 15వ శతాబ్దంలో మళ్ళీ పుంజుకుంది. ఇక్కడ జైన బౌద్దాలకి పూర్వం కూడా పెద్దపెద్ద గురుకులాలుండేవి. వీటిలో శాస్త్ర చర్చ, నూతనశాస్త్ర పర్యవేక్షణ, వేదాంగాల అధ్యయనం, కవిత్వం, నాటక రచన మొదలైనవి చేసేవారు.

19.13. క్షీణదశలో భారతం :

చాలామంది ఇలా అభిప్రాయపడుతుంటారు: భారతదేశంలో ఐక్యత లేకపోవటానికి కారణం వర్ణవ్యవస్థ అని. ఇది నిజంకాదని కె.ఎం.మున్షి లాంటి ప్రఖ్యాత చరిత్రకారులే చెప్పారు. వైదికానుష్టానాలను సక్రమంగా పాటించినంత వరకూ దేశంలో ఐక్యత ఉంది. ఆకాలంలో గొప్పగొప్ప రాజులు పాలించి దేశాన్ని మహోన్నతస్థితికి తెచ్చారు. అవైదిక మతాలు ప్రబలిన తర్వాతనే దేశం క్షీణదశకు చేరుకుంది. ఆ కాలంలో దేశంముక్కలైంది సరైన, బలవంతులైన రాజుల యొక్క నాయకత్వం లేకపోవడం మూలాన. దాంతో పరదేశాలవారు మనపై దండెత్తారు. చంద్రగుప్తమౌర్యుని కాలంలో వేదధర్మాచరణ చక్కగా సాగింది. అతని తర్వాత అశోకుడు బౌద్దమతం అవలంబించాక మౌర్యసామ్రాజ్యం ముక్కలైంది. దేశం విదేశీయుల పాలబడింది. తర్వాత బ్రాహ్మణుడైన పుష్యమిత్ర సుంగ రాజ్యానికి వచ్చాక మళ్ళా వేదధర్మాచరణ సాగింది. చంద్రగుప్త సముద్రగుప్తల కాలాల్లోగూడా వైదిక ధర్మం చక్కగా వర్ధిల్లింది. బౌద్ధాన్ని పాటిస్తున్నరాజులు అహింసావాదాన్ని అవలంబించినా, రాజ్యాలు ఏలడానికి అహింసావాదం పనికిరాదని తెలుసుకుని యుద్ధాలు గూడా చేసారు. బ్రాహ్మణులు ఏర్పరచిన వర్ణాశ్రమ ధర్మం వల్ల దేశం క్షీణించి విదేశీయులపాలైంది అన్నవాదన సరైంది కాదనీ చరిత్రకారులే చెప్పారు. మౌర్యసామ్రాజ్యాన్ని స్థాపించింది ఒక బ్రాహ్మణుడే – చాణక్యుడు. దక్షిణాన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది ఒక్క బ్రాహ్మణుడే -విద్యారణ్యులవారు. మరాఠా వీరుడైన శివాజీకి మొగలాయిలపై తిరుగుబాటు చేయడానికి ఆ కారణమైనవాడు ఒక బ్రాహ్మణుడే – ఆయన గురువైన సమర్థరామదాసు. ఏది ఏమైనప్పటికి, విదేశీ దురాక్రమణలు లేనంత వరకూ మన విద్యావిధానం బాగుండేది. విదేశీదండయాత్రలతో ఇతర దేశాలవారితో సంపర్కమేర్పడింది, పాతకాలపు గురుకులవాస విధానం క్షీణదశకు చేరుకుంది.

19.14. మారిన విద్యావ్యవస్థ :

కోట్ల సం॥రాల చరిత్ర కలిగిన ప్రాచీనవిద్యావిధానం యొక్క అందమైన ముఖచిత్రం, కేవలం 2000 సం॥ల నుండి విదేశీయుల రాకతో, దురాక్రమణలతో మసిబారిపోయింది. రానురాను విదేశీయులు మతవ్యాప్తి కోసం కొత్తవిద్యాస్థానాలు స్థాపించారు. విద్యావ్యవస్థ పూర్తిగా మారిపోయింది. సామాజిక వ్యవస్థ కూడా మసకబారిపోయింది. గురుశిష్యులిద్దరిలోను చిత్తశుద్ధి లోపించింది. ఉపకారవేతనాలతో విద్యార్థులను, జీతబత్తేలతో విద్యనేర్పే గురువులనూ మభ్యపెట్టేసరికి, విద్యావిధానం మారిపోయింది. అసలు మన పురాతన విద్యావిధానం ఎలా ఉండేదో కూడా తెలుసుకోలేని అసమర్థత గూడా మనలో వ్యాపించింది. ప్రస్తుతం విద్య ఒక వ్యాపార సాధనమైపోయింది. విద్యనేర్చుకునేవారికి సామాజిక శ్రేయస్సు కాక వ్యక్తిగత శ్రేయస్సే ప్రధానమైపోయింది నేడు.

19. 15. జీవనవిధానం నాడు – నేడు :

ప్రాచీన భారతంలో జీవన విధానమంతా వేదంలో చెప్పినట్లు ధర్మబద్దంగా ఉండేది. అది ఇప్పుడు కరవైంది. ఐనా కొందరు ధర్మాన్నంటిపెట్టుకుని ఉన్నారు, ఎందుకంటే మనదేశంలో వేదాన్ని నమ్ముకుని మౌఖికంగా అధ్యయనం చేస్తున్న కొందరు వేదపండితులుండబట్టి. ఈ మౌఖిక అధ్యయనం మూలానే శాస్త్రాలు గూడా ఇంకా పూర్తిగా కలుషితం కాకుండా ఉన్నాయి. మనకు కోటానుకోట్ల సంకు సంబంధించిన చరిత్ర, సంస్కృతులున్నాయి. ఆంగ్లేయులకేముంది? ఈమధ్యనే వారి చరిత్ర మొదలైంది ఇతర దేశాలతో వ్యాపార సంబంధాలు పెట్టుకుని ఆ దేశాలను కొల్లగొట్టడం, ఆక్రమించుకోడంతో ఆంగ్లేయ చరిత్రకారులు మన చరిత్రకు సంబంధించిన నిజాలను దాచేసి, వాటిని మార్పులు చేర్పులతో తారుమారు చేసి, మనకే పాఠ్యాంశాలుగా తయారు చేసి, మనచేతనే చదివిస్తున్నారు. ఆ తప్పుల తడికల్నే మనం చదువుకుంటున్నాం. పైగా మనకేం తెలియదని వారు ఎగతాళిగా వ్యాఖ్యానాలు చేస్తూ, అవహేళనకు గురిచేస్తున్నా ఏం చేయలేక ఊరుకుంటున్నాం. ఇవీ మన చరిత్రకందని కొన్ని విషయాలు. వీటిని చదివి పాఠకులు ఏది సత్యం, ఏది అసత్యం అన్నది గ్రహిస్తారని ఆశిద్దాం.

తరువాతి అధ్యాయంలో వేదాల్లోని కొన్ని విజ్ఞాన వీచికల అనుభూతిని పొందుదాం.

Exit mobile version