Site icon Sanchika

దివినుంచి భువికి దిగిన దేవతలు 3

[box type=’note’ fontsize=’16’] మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞాన రహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రచన చేశారు డా. ఎం. ప్రభావతీదేవి. [/box]

జీవులసృష్టి

3.0 ఈశ్వరసృష్టి:

బ్రహ్మాండం గురించి, అందులోని కొన్ని లోకాల గురించి కొంత తెలుసుకున్నాం. ఏ లోకాల్లో ఎవరెవరుంటారో తెలుసుకోవాలంటే జీవులు ఎలా ఏర్పడ్డారో తెలుసుకోవాలి ముందర. జీవులందరూ తయారయ్యాక వారు ఏ ఏ లోకాల్లో ఉంటారోనన్నది తర్వాత తెలుస్తుంది. లోకంబు లుండగానేసరిగాదు. లోకస్థులూ, లోకేశులూ గూడా ఉండాలి. లోకాల్లో నివసించడానికి జీవులెంతో అవసరం. జీవులుండాలంటే వాళ్ళని పుట్టించే నాథుడుండాలి. ఆ నాథుడే ఈశ్వరుడు. ఆయన జీవుల కర్మానుసారంగా సృష్టి చేస్తాడు. జీవులసృష్టిలో మొదటగా దేవతలు పుట్టారు. ఈ క్రమంలో అన్నిరకాల స్త్రీ, పురుష దేవతలూ సృష్టించబడ్డారు – విశ్వనిర్వహణ, విశ్వపరిరక్షణల కోసం. ఈ దేవతల్లో ముఖ్యులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారు తమ స్త్రీశక్తులైన సరస్వతి, లక్ష్మీపార్వతులతోకలిసి సృష్టి, స్థితి, లయ కార్యాలను నిర్వహిస్తారు. విష్ణుభక్తులు విష్ణువే పరమేశ్వరుడు, ఆయనే సృష్టి, స్థితి, లయలకు కారకుడంటారు. శివభక్తులు శివుడే వీటికి కారకుడంటారు. ఆయనే పరమేశ్వరుడంటారు. ఈముగ్గురూ గూడా సర్వజులు, సర్వశక్తిమంతులు, సర్వ వ్యాపకులు. అసలు ఈ ముగ్గురూ లేకుండా విశ్వనిర్వహణ సాగదు. ఈ ముగ్గురిలో బ్రహ్మదేవుడ్ని సృష్టికర్తగా చెప్పుకుంటాం. ఈయన్నిసృష్టికర్తగా చెప్పుకునేముందు అసలు ఈశ్వరుడు దేవతల సృష్టి కొరకు విరాట్టుగాఎలా ఆవిర్భవించాడో తెలుసుకోవాలి. ఐతరేయోపనిషత్తులో ఈశ్వరుడు దేవతలను సృష్టిస్తూ విరాట్టుగా ఎలా వ్యక్తమైనాడో వివరించారు.

3.1 విరాట్పురుషుని ఆవిర్భావం:

ఈశ్వరుడు బ్రహ్మగా సృష్టి చేయడాని కోసం లోకాలను సృష్టించాలనుకున్నాడు. అప్పుడు అంతా జలమయంగానుంది. జలాధిక్యంగా గల పాంచభౌతిక లోకాలను భూమికిపైనా కిందుగాను సృజించాడు. అవి: అంభోలోకం, మరీచిలోకం, భూమి, జలలోకం. ఈ లోకాలను పాలించడానికి పాలకుడు లేకపోతే అవి నశిస్తాయని ఆలోచించి జలప్రధానమైన పంచభూతాలనుండి ఓ పురుషాకారాన్ని – ఓ పిండాన్ని సృజించాడు. దానికి తల, కాళ్ళు, చేతులు మొదలగు అవయవాలను తన సంకల్పంతో సృజించాడు. ఆ అవయవాలనుండి అధిష్టానం, కరణం, దేవతలని మూడు పుట్టుకొచ్చాయి ఈకింది విధంగా:

  1. ఆ పిండం ముఖంలో రంధ్రమేర్పడింది. పక్షి గుడ్డు పగిలినట్టు ఏర్పడిన ముఖం నుండి వాగింద్రియం-వాక్కు రూపొందింది. దాని అధిష్ఠాత అగ్నిదేవత. వాక్కే లోకపాలకుడు.
  2. నాసికల నుండి ప్రాణం, దాన్నుండి వాయుదేవుడు.
  3. కళ్ళ నుండి దృష్టి, దాన్నుండి ఆదిత్యుడు.
  4. చెవులనుండి వినుకలి(వినికిడిశక్తి), దాన్నుండి దిక్కులనే దేవతలు- దిగ్దేవతలు.
  5. చర్మం నుండి రోమాలు, వాటినుండి ఓషధులు, వనస్పతులు.
  6. హృదయం(అంతఃకరణానికి అధిష్టానం) నుండి మనసు, దాన్నుండి చంద్రుడు.
  7. నాభి నుండి అపానం, దాన్నుండి మృత్యువు.
  8. శిశ్నం నుండి వీర్యం ,దాన్నుండి నీరు (జలం).

వీటిని ఇంకోసారి చూద్దాం:

ఈవిధంగా వివిధ అవయవాల నుండి వివిధ దేవతలు లోకపాలకులుగా వచ్చారు. ఆ పురుషాకారానికి, ఆయనతో పాటున్న దేవతలకు ఆకలి దప్పికలు కలిగాయి. అదీకాక వారు తాముండడానికి ఒక అధిష్ఠానం గూడా కావాలనడిగారు ఈశ్వరుడ్ని – బ్రహ్మని. అప్పుడు ఈశ్వరుడు దేవతలకు అధిష్టానం కోసం, వారిఆకలి దప్పికలు తీర్చడం కోసం ఆవులు, గుర్రాలు ఆకారాలుగల పిండాల్ని నీటిలోంచి బయటకుతీసాడు. వారు అవి తమకు చాలవన్నారు. అప్పుడీశ్వరుడు ఆ పురుషుడ్నేఅధిష్ఠానంగా వారికిచ్చాడు. వారు సంతోషించారు. ఆ పురుషునిలో ఆ దేవతలంతా ఎక్కడనుండి పుట్టారో అక్కడనే ప్రవేశించారు. ఆకలి దప్పికలు గూడా తమకు అధిష్టానం కావాలనడిగారు ఈశ్వరుడ్ని. ఆయన వాటితో ఇలా అన్నాడు: అవి మూర్తిమంతాలు కాని భావనారూపాలు, కనుక చైతన్యంగల వారివలె స్వతంత్రంగా వేటినీ భుజించలేవు. అందువల్ల ఏదైనా వస్తువును ఆశ్రయించాలి. ఏ ఏ దేవతలు హవిస్సులు గ్రహిస్తాయో ఆ దేవతల యందు ఆకలిదప్పికల రూపంలో అవుంటాయని ఈశ్వరుడు తెల్పాడు. ఈశ్వరుడింకా ఆలోచించాడు: ఈ దేవతలందరికీ ఆకలిదప్పికలవుతాయి, అందుకు అన్నమవసరమని, నీటిలోకి చూసాడు. ఆ నీటినుండి ఘనరూపమైన అన్నం పుట్టింది. ఆ దేవతలకు ముందుగా అన్నమే అవయవంతో తినాలో తెలియలేదు. అన్ని అవయవాలు వాడిన తర్వాత అపానం ద్వారా గ్రహించడానికి వీలైంది. అంటే నాభి ద్వారా గ్రహించారన్నమాట. ఇప్పుడు దేవతలు పుట్టారు, వారి కాహారమేర్పడింది. ఇంక ఇంతేర్పాటయ్యాక అధిష్ఠాతగా ఒక -ప్రభువుండమవసరమని తానే అలా ఉండడానికి నిశ్చయించుకున్నాడు ఈశ్వరుడు. ఐతే ఈశ్వరుడికి ఆ పురుషునిలో ప్రవేశించడానికి రెండు మార్గాలే కనిపించాయి. అవి పాదాలు, తల. ఈశ్వరుడనుకున్నాడు: తానుసర్వాధికారి కాబట్టి తనకు భృత్యుడైన ప్రాణం యొక్మ ప్రవేశమార్గమైన కాలిబొటనవేలి చివరనుండి ప్రవేశించకూడదు, ఇంక మిగిలింది తల, దాన్నిబద్దలు చేసికుని, రంధ్రముచేసి, ఆ బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించాలి.

ఇలా అనుకున్నఈశ్వరుడా పురుషుని శిరస్సు నడినెత్తి భాగాన్నిపగలకొట్టి ఆ ద్వారం ద్వారా జీవాత్మగా లోపలికి ప్రవేశించాడు. ఆయనకు మూడు నివాసస్థానాలున్నాయి శరీరంలో:

  1. జాగ్రదావస్థలో కుడికన్ను
  2. స్వప్నంలో మనసు
  3. సుషుప్తిలో హృదయాకాశం.

ఈశ్వరుడు ఈ విధంగా తన సంకల్పశక్తితో విరాట్పురుషుని గాను, జీవాత్మగాను వ్యక్తమయ్యాడు. ఇది తెలుసుకుంటుంటే చాలా వింతగా అనిపిస్తుంది మనకు. ఈశ్వరుని కున్నది శుద్ధచైతన్యం గనక ఆయన సంకల్పిస్తే ఏ పనైనా వెంటనే జరిగిపోతుంది. ప్రపంచమంతా ఈశ్వరశక్తితో నిండి ఉన్నదంటే, ప్రతి జీవిలోను ప్రపంచముందన్నమాట. విష్ణువు విరాట్పురుషునిగా ఎలా ఆవిర్భవించాడోనని తెలిపే కథింకోటుంది. అది తెలుసుకుందాం.

3.2 విరాట్పురుషునిగా విష్ణుమూర్తి ఆవిర్భావం:

బ్రహ్మాండాలు పుట్టక ముందుగూడా బ్రహ్మాండ నాయకులున్నారని మన పురాణాల ద్వారా తెలుస్తోంది. బ్రహ్మ పుట్టుకకు కారణమైన విష్ణుమూర్తిని గూడా విరాట్పురుషునిగా అభివర్ణించారు శ్రీదేవీభాగవతంలో. ఈ బ్రహ్మాండాలేవీ ఏర్పడక పూర్వం రాసేశ్వరుడైన శ్రీకృష్ణపరమాత్మ తన్ను తాను రెండుగా విభజించుకున్నాడు. ఆయన వామార్ధం నుండి విడివడింది రాసేశ్వరి రాధ. ఆమెతో ఆయన చాలాకాలం రాసమండలంలో విహరించాక ఒక పుత్రుడు కలిగాడు. కానీ రాధ ఆ బాలుని జలంలో విడిచిపెట్టింది. ఆ బాలుడు చాలా కాలం ఆ జలంలోనే ఉండగా అతని శరీరం బద్దలై అందులోంచి ఇంకో శిశువు ఉదయించి శతకోటి సూర్యుల ప్రకాశానికి మించిన ప్రకాశంతో వెలుగుతూ ఏడ్వసాగాడు. అతడే విరాట్పురుషుడు. అతని రోమకూపాల్లో సర్వజగత్తులూ ఉన్నాయి. అతనికి కృష్ణ జ్ఞానం కలిగి ఆయన్ని ధ్యానించగా కృష్ణుని దర్శనమైంది. ఆ శిశువు ఆనందించాడు. కృష్ణుడు అతనికి తన మంత్రాన్నుపదేశించి జపించమని, ఎన్నో వరాలిచ్చి, అతనే విష్ణువుగా పేరొందుతాడని, అతని నాభికమలం లోంచి బ్రహ్మ ఉద్భవించి సృష్టి చేస్తాడని చెప్పాడు. ఇంక మన  సృష్టికర్తగా బ్రహ్మదేవుని ఆవిర్భావమెలా జరిగిందో తెలుసుకుందాం.

3.3. సృష్టికర్త బ్రహ్మదేవుని ఆవిర్భావం:

బ్రహ్మదేవుడు విష్ణు నాభికమలంలోంచి ఉద్భవించాడని పురాణాల్లో ఉంది. అంటే ఆయన స్వయంభువు. పరమేశ్వరుని శక్తిలోని ఒక స్వల్పాంశం బ్రహ్మదేవునిగా ఏర్పడింది. అనేక జన్మల తపఃఫలంగా ఒక పుణ్యపురుషుడు ప్రపంచసృష్టి కోసం బ్రహ్మగా నియమింపబడ్డాడు. బ్రహ్మదేవుని సృష్టివిధానం- బ్రహ్మ తన తపోబలంతో ఈకింది వాటిని సృష్టించాడు:

  1. పంచభూతాలు
  2. సూర్యచంద్రాదిగ్రహాలు
  3. అనేక తేజోమండలాలు
  4. చరాచరాత్మకమైన ప్రపచం
  5. వేదోక్తసాంప్రదాయప్రకారం గుణకర్మవిభాగాలకనుగుణంగా దేవాసురాది వర్గాలు
  6. సమస్తజీవకోటిని నాలుగు రకాల వర్ణవ్యవస్థలతో

ఇప్పుడు, సృష్టి విషయంలో త్రిగుణాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం.

3.4 సృష్టికి కారణమైన త్రిగుణాలు:

సృష్టి గురించి చెప్పుకునేటప్పుడు దానికి కారణమైన త్రిగుణాలను గురించి చెప్పుకోవాలి. జీవసృష్టిలో పనిచేసేవి ఈ త్రిగుణాలే: సత్వం,రజస్సు, తమస్సు. సత్వగుణమంటే సత్యం, అహింస, శాంతం, ధర్మం, భూతదయ కలిగిఉండడం. రజోగుణమంటే అహంకారంతో విర్రవీగుతూ, డాబు, దర్పం కనబరుస్తూ, కర్తగా, భోక్తగా పనులు నిర్వహించడం. తమోగుణమంటే నిద్ర, అలసత్వం, మందమతిత్వం, మోహం, కామం మొదలగు గుణాలు కలిగి ఉండడం. ప్రతి జీవిలో ఈ గుణాలు పని చేస్తుంటాయి. కొందరిలో సత్వగుణం ప్రధానంగా ఉండి తక్కిన గుణాలు తక్కువగా ఉంటాయి. అలాగే కొందరిలో రజోగుణం ప్రధానంగా ఉండి తక్కిన గుణాలు తక్కువగా ఉంటాయి. ఇంకొందరిలో తమోగుణం ఎక్కువగా ఉండి మిగతా రెండు గుణాలు తక్కువగా ఉంటాయి. ఈ మూడు గుణాలు హెచ్చుతక్కువ మోతాదుల్లో ఉంటేనే సృష్టి సాగుతుంది. బ్రహ్మదేవుని సృష్టి విషయంలో గూడా ఈ 3 గుణాలు ఎలా పని చేసాయో తెలుసుకుందాం.

  1. సత్వగణంవల్ల 10మంది ప్రజాపతులు, దేవ ఋషులు, విబుధులు, దేవ, గంధర్వ, సిద్ద, సాధ్య, యక్ష, కిన్నర, కింపురుషులు.
  2. రజోగుణం వల్ల మానవుల్లో 4 వర్ణాల వారు: సత్వంలో రజస్సువల్ల బ్రాహ్మణులు, రజస్సులో రజస్సు వల్ల క్షత్రియులు, తమస్సులో రజస్సు వల్ల వైశ్యులు, తమోగుణంవల్ల శూద్రులు
  3. తమోగుణంవల్ల : దైత్య, దానవ, అసుర, రాక్షస, యాతుధానులు మొదలగువారు.

3.5 బ్రహ్మదేవుని సృష్టిక్రమం:

బ్రహ్మకు మొదట జీవుల కనువైన శరీరాలు ఎలా సృష్టించాలో తెలియక ఈశ్వరుని గూర్చి తపస్సు చేయగా ఈశ్వరుడు అన్నిశరీరాల్లో తన శక్తిని ప్రవేశింపచేసి జీవుల కర్మలకు తగిన శరీరాలు ఏర్పాటు చేసాడు. బ్రహ్మదేవుడు సృష్టికుపక్రమించగానే ఎలాటి సృష్టిచేయాలో తెలియక అహంకార బుద్ధితో మోహం, మహా మోహం, అందతామిశ్రం, తామిశ్రం. చిత్త భ్రమలను పుట్టించాడు. అవి పాపసృష్టి అని తెలుసుకుని భగవంతుని గూర్చి తపస్సు చేయగా ఆయన మనస్సు పవిత్రత చెంది అందులోనుండి పవిత్రమైన మునులు పుట్టారు: సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతలు. వారిని ప్రజావృద్ధి చేయమని కోరగా, వారు నిరాకరించి తపస్సుకు వెళ్ళిపోయారు. అందువల్ల బ్రహ్మకు కోపం రాగా అందులోంచి రుద్రుడు పుట్టాడు. ఆ రుద్రుని 11 రూపాలు ధరించమని చెప్పి, వారికి 11 పేర్లు పెట్టి, వారందరికి 11మంది భార్యలను గూడా ఇచ్చి అందరికీ స్థానాలు చూపించి ప్రజావృద్ది చేయమన్నాడు. రుద్రుడు రుద్రగణాలను సృజించి విశ్వాన్ని మింగుతూ లోకోపద్రవం గావించసాగాడు. బ్రహ్మ చింతించి వారు సృష్టి చేయనక్కరలేదు, శ్రీహరిని గూర్చి తపస్సు చేయాలని ఆదేశించాడు.

3.6 ప్రజాపతుల సృష్టి:

బ్రహ్మ తానే స్వయంగా తన అవయవాల నుండి 10మంది ప్రజాపతులను సృజించాడు: దక్ష, నారద, పులహ. పులస్త్య,  భృగు, క్రతు, అంగీరస, వసిష్ఠ, మరీచి, అత్రి. వీరే గాక తర్వాత పుట్టినవారు: ధర్మ అధర్మ మృత్యు, మన్మథ, క్రోధ, లోభ, సరస్వతి, సముద్ర, నిరృతి, కర్దమ. తర్వాత రుచి ప్రజాపతి గూడా పుట్టాడు. బ్రహ్మకు సరస్వతి మీద మోహం కలగ్గా, అందుకు మరీచిపుత్రులు బ్రహ్మను నిందించారు. అందుకాయన చింతించి, ఆ శరీరాన్ని విడిచి, ఇంకో శరీరాన్ని ధరించాడు.

3.7 వేదాదిశాస్త్రాల ఆవిర్భావం:

బ్రహ్మ మళ్ళీ సృష్టి చేయాలని ఆలోచిస్తుండగా ఆయన 4 ముఖాల నుండి వేదాలు, యజ్ఞాలు, వివిధ కర్మలు, తంత్రాలు, ఆశ్రమాలు వాటి ధర్మాలు, ఆయుర్వేద, ధనుర్వేద, గాంధర్వ వేదాలనే ఉపవేదాలు, ఇతిహాస పురాణాలు, ఛందస్సులు, అనేక ధర్మశాస్త్రాలు, విద్యలు, మొదలగునవి ఉద్భవించాయి. ఇంకా ఋషిగణం విస్తరించటం లేదని ఆ దేహాన్నిగూడా విడిచి, ఇంకో దేహాన్ని ధరించాడు. ఇంతవరకూ పురుష సృష్టే సాగుతోంది, సృష్టి పెరగటం లేదని ఆయన ఈశ్వరుని గూర్చి మళ్ళీ తపస్సు చేయగా ఈశ్వరుడు తన అర్ధనారీశ్వర రూపం చూపించి స్త్రీ పురుషమైధునం ద్వారా సృష్టి చేయమని సూచించాడు.

3.8 స్వాయంభువ మనువు, శతరూపల జన్మం:

బ్రహ్మదేవుడు తన శరీరాన్ని రెండు భాగాలుగా చేయగా, అందులోంచి స్వాయంభువ మనువు, శతరూపలు ఆవిర్భవించారు. బ్రహ్మదేవుడు స్వయంభువు గనక ఆయన కుమారుడు స్వాయంభువు. ఈ దంపతులకి ఇద్దరు కుమారులు: ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ఇంకా ముగ్గురు కుమార్తెలు: ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని కలిగారు. వీరి వల్ల ప్రజాసంతతి అభివృద్ధి చెందింది. అదెలా జరిగిందో తరువాయి అధ్యాయాల్లో తెలుసుకుందాం. వీరందరూ దేవతలే. ఈ క్రమంలో చాలామంది దేవీదేవతలు పుట్టి మిధునమయ్యారు-దంపతులయ్యారు. అలా పుట్టినవారు విష్ణు-లక్ష్మీదేవుల అంశలు కాబట్టి దోషం కాదు. ప్రధమసృష్టి అలా పుట్టారు కాబట్టి అది నిషిద్ధం కాలేదు. ఎందుకంటే వారు దేవతలు. వారి శరీరాలు సూక్ష్మశరీరాలు, దివ్యశరీరాలు. మానవుల్లాగ మట్టి శరీరాలు, రక్తమాంసాలు గల పాంచభౌతిక శరీరాలు కావు. అందుకని వారికి అలా పుట్టడం దోషం కాదు. ఇంతవరకూ దేవతలే పుట్టారు. ఇంకా మానవులు పుట్టలేదు .ఈ సృష్టంతా స్వర్గంలోనే జరిగింది. జీవుల కన్నా, దేవతల కన్నా ముందే వేదాలు, వేదాంగశాస్త్రాలు, వర్ణాశ్రమ ధర్మాచార ధర్మాలు మొదలగునవి పుట్టాయి. వాటిని మొదటగా బ్రహ్మ పొంది ప్రజాపతులకందించాడు. వారివల్ల మనువులకు, వారి ద్వారా భూలోకంలోని మానవులకూ అందాయి. ఇంతవరకూ సూక్ష్మ సృష్టి మటుకూ జరిగింది. సూక్ష్మ లోకాలేర్పడ్డాయి. ఇంక స్థూలసృష్టి, వారి కోసం స్థూల లోకాలు ఏర్పడాలి. ఈ విషయం గురించి ఇక్కడ సూక్ష్మంగా తెలుసుకుందాం. తర్వాత విపులంగా తెలుసుకోవచ్చు.

3.9 స్వాయంభువుని స్థూలసృష్టి:

స్వాయంభువు స్థూలసృష్టి చేద్దామంటే, నివాస యోగ్యమైన భూమి కన్పించలేదు. ఆ విషయం బ్రహ్మతో చెప్పగా, ఆయన విష్ణువుని గూర్చి తపస్సు చేయగా, ఆయన నాసికనుండి ఆది వరాహంగా విష్ణుదేవుడావిర్భవించి, భూమిని నీటిలోనుండి ఉద్ధరించి పైకి తీసుకొచ్చాడు. ఆయన వరాహం కాదు, ఖడ్గమృగమని కొందరంటారు. స్వాయంభువు తన భార్యాపిల్లలతో భూలోకానికి భౌతిక శరీరంతో వచ్చి, జంబూద్వీపాంతర్గతమైన భారతవర్షంలో గల ఆర్యావర్తమనే ప్రాంతంలో నివసించి ప్రజాభివృద్ధి కోసం యజ్ఞాలు చేసాడు. ఈ దేవతల, మానవుల సృష్టి ఎలా జరిగిందన్నది విపులంగా తెలుసుకుందాం తరువాతి అధ్యాయాల్లో.

(ఇంకా ఉంది)

Exit mobile version