దివినుంచి భువికి దిగిన దేవతలు 5

0
2

[box type=’note’ fontsize=’16’] మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞాన రహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రచన చేశారు డా. ఎం. ప్రభావతీదేవి. [/box]

భూలోకంలో మానవసృష్టి

5.0 భూమ్మీద భౌతిక సృష్టి:

[dropcap]బ్ర[/dropcap]హ్మదేవుని సృష్టిలో ఇంతవరకు దేవాసురాది దేవయోనుల సూక్ష్మసృష్టి మాత్రమే జరిగింది. మానవజాతి లాంటి స్థూలసృష్టి జరగలేదు. మానవజాతిని సృష్టించి దాన్ని వృద్ధి పొందించమని బ్రహ్మదేవుడు స్వాయంభువ మనువుని ఆదేశించాడు. అంతవరకూ స్వర్గంలోనే ఉన్న స్వాయంభువు కూడా స్థూలసృష్టి చేయడానికి పూనుకున్నాడు. కర్మలను అనుభవిస్తూ ప్రకృతిలోలీనమైయుండి సృష్టింపబడటానికి సిద్ధంగానున్న జీవులకు భౌతిక(స్థూల) శరీరాలిచ్చి ప్రజావృద్ది చేయడానికి స్వాయంభువు ఉపక్రమించాడు. స్థూలప్రపంచంలో ప్రతిజీవికి భౌతిక శరీరం కావాలి. ఆ భౌతిక జీవులుండడానికి సరైన నివాసం కావాలి. ఆ  సమయంలో మానవజాతి నివసించడానికి తగిన స్థూలభూమి లేదు. ప్రస్తుత సృష్టికి ముందు జరిగిన కల్పాంత ప్రళయంలో భూగోళం (మనం నివసిస్తున్న భూమి) నీటిలో మునిగిపోయింది. భూమి లేనప్పుడు స్టూలసృష్టి ఎలా సాధ్యమని బ్రహ్మతో స్వాయంభువు మనవి చేయగా, బ్రహ్మదేవుడు విష్ణుమూర్తినుద్దేశించి తపస్సు చేయగా విష్ణువు వరాహ రూపంతోవచ్చి నీట మునిగిన భూమినుద్దరించాడు. ఇంతవరకూ భూమ్మీద సృష్టి జరగలేదు. జరిగినదంతా భూమిపైనున్న ఊర్ధ్వలోకాల్లోనే.

5.1 దివినుండి భువికవతరించిన దేవతలు:

ఇప్పుడు భూమ్మీద భౌతికసృష్టి జరగాలి. స్వర్గలోకం నుండి స్వాయంభువు, ఆయన భార్య, పుత్రులు, కొందరు గృహస్థ ఋషులైన అత్రి, వసిష్ఠ మొదలుగు ప్రజాపతులు, భూమ్మీద నివసించడానికి అనువైన భౌతిక శరీరాలు పొంది అవతరించారు. అంటే దివినుండి భువికి దేవతలు దిగి వచ్చి మానవులను సృష్టించారు. సూక్ష్మశరీరధారులైన దేవతలు, స్థూలదేహాలతో భూమ్మీదకు దిగి వచ్చారు. భూమ్మీద వారు నివసించడానికి ఎన్నుకున్న ప్రదేశం: సరస్వతీ, ధృషద్వతీ నదుల మధ్యభాగం. దాన్నే ‘ బ్రహ్మావర్తం, మనుక్షేత్రం, ఆర్యావర్తం’ అంటారు. అలా వారు స్వర్గం నుండి భూమ్మీదకు దిగి వచ్చారు గనక వారిని ‘ఆర్యులు’ అన్నారు. ఆర్యులనగా ఈశ్వరపుత్రులు. స్వాయంభువమనువుకు ‘భరతు’ డనే పేరుంది. కనక ఆయన సంతానానికి ‘భారతులు’ అని పేరొచ్చింది. వారు నివసించిన ప్రదేశం గనక ‘భారతవర్షమ’ని పేరొచ్చింది. ఈ ప్రదేశంలోనే ప్రథమంగా స్థూలజీవులు జన్మించారు. నీట మునిగిన ఈ భూగోళం పైకి ఉద్ధరింపబడగానే వెంటనే జీవుల సృష్టి జరగలేదు. ఆ భూమి ప్రాణికోటికి నివాసయోగ్యంగా తయారయ్యాకే ప్రథమ మానవుడైన స్వాయంభువు ప్రవేశించాడు తన వారితో. స్వాయంభువు పుత్రులైన ప్రియవ్రత, ఉత్తానపాదులవల్ల భూలోకంలో మానవజాతి అభివృద్ధి గాంచింది. భూలోకమంటే మనం నివసిస్తున్న భూమి (భూగోళం) + మహాభూమి. ఈ మహాభూమి గురించి తరవాత తెలుసుకోవచ్చు, ముందుగా స్వాయంభువుని పుత్రుడు ప్రియవ్రతుడు భూమ్మీద తన పాలన ఎలాసాగించాడో తెలుసుకుందాం.

5.2. ప్రియవ్రతుడు భూమిని 7 ద్వీపాలుగా విభజించుట:

ప్రియవ్రతుడు మహాతపశ్శాలి, యోగశక్తి కలవాడు. ఆయన తన తపోశక్తితో భూమండలాన్ని 7 విభాగాలుగా తన రథచక్రాలతో చేసాడు. ఆ కాలంలో మేరు పర్వతానికి ప్రదక్షణ చేసే సూర్యునికి భూమ్మీద అవతలి భాగంలో అంధకారముండేది. అది పోగొట్టడానికి భూమిని 7 సార్లు తన రథచక్రాలతో దున్నినట్లు చేసి 7 మార్గాలు గావించాడు. ఆ మార్గాలకు మధ్యలో గల భూభాగాలు సప్తద్వీపాలయ్యాయి. అవే ‘జంబూ ప్లక్ష, కుశ, క్రౌంచ, శాక, శాల్మలీ, పుష్కర’ ద్వీపాలు. వానిలో జంబూద్వీపం మొదటిది. అది లక్ష బ్రహాండయోజనాలు గలది. మిగిలిన ద్వీపాలు ఒకదానికంటే ఇంకోటి 2 రెట్లు అధికంగా కలవి. ఆ ద్వీపాలను చుట్టి 7 సముద్రాలేర్పడ్డాయి: లవణ, ఇక్షు, సురా, ఘృత, దధి, క్షీర, శుద్ధజల సముద్రాలు. ఈ సముద్రాలు ఆ ద్వీపాలకు అగడ్తల్లాగా కలిపి భూలోకమంటారు కాబట్టి ఆయన ఈ రెండింట్లోను సృష్టి చేసి ఉండచ్చు. మనకు భూలోకమంటే భూమి అనే తెలుసుగాని, ఈ రెండిటిని కలిపి భూలోకమంటారని తెలియదు. మన పురాణాల్లో స్పష్టత లేకపోవడంవల్ల ఈ సందేహాలు ఉత్పన్నమయ్యాయి.

5.3 భూలోకంలో ప్రియవ్రతుని పుత్రులపాలన:

ప్రియవ్రతుని పుత్రులు: అగ్నీధ్రుడు (యాజీద్రుడు), ఇద్మజిహ్వుడు, యజ్ఞబాహుడు, మహావీరుడు, హిరణ్యరేతుడు, ఘృతపృష్టుడు, సవనుడు, మేధాతిథి, వీతిహెూత్రుడు, కవి, ఉత్తముడు, రైవతుడు, తామసుడు. వీరిలో మహావీర, సవన, కవులు ఙ్ఞానమార్గాన్నెంచుకుని పరమహంసలయ్యారు. ఉత్తముడు, రైవతుడు, తామసుడు కాలక్రమంలో మన్వంతరాధిపతులయ్యారు. మిగతావారు క్షాత్రమవలంబించి, భూలోకమందున్న – మహాభూమి, భూగోళాలయందున్న సప్తద్వీపాలకు అధిపతులయ్యారు. ప్రియవ్రతుని పెద్ద కుమారుడు అగ్నీధ్రుడు (యాజీధ్రుడు) మహాభూమి, భూగోళాలయందున్న జంబూద్వీపాలకు అధిపతి. ఆయనకి 9 మంది కుమారులు: నాభి, కింపురుష, హరి, ఇలావృత, రమ్యక, హిరణ్యక, కురు, భద్రాశ్వ, కేతుమాల. వారు భూగోళం మీద గల జంబూద్వీపాన్ని 9 వర్షాలుగా విభజించి వాటికధిపతులయ్యారు. వారి పేర్లతోనే ఆ ద్వీపాలు పిలవబడుతున్నాయి.

5.4 అగ్నీధ్రుడు (యాజ్జీధ్రుడు):

ప్రియవ్రతుని పెద్దకుమారుడు అగ్నీధ్రుడు (యాజీద్రుడు), తండ్రి ఆఙ్ఞానుసారం ఆయన మహాభూమి, భూగోళాల్లో గల ఉభయ జంబూద్వీపాలకు అధిపతిగా ఉంటూ ధర్మయుక్తంగా పాలించేవాడు. ఆయన పుత్ర సంతానం కోసం బ్రహ్మనుగూర్చి తపస్సు సాగించగా బ్రహ్మ తనలోకంలో తనముందు సంగీతం ప్రదర్శించే పూర్వచిత్తి అనే అప్సరసను పంపాడు. ఆయనామెను వివాహమాడగా 9 మంది పుత్రులుకలిగారు.. వారే నాభి మొదలుగువారు. తర్వాత ఆమె ఆయన్ను విడిచి తన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది.

ఈ 9 మంది భూగోళంలోగల జంబూద్వీపంలోగల 9 వర్షాలనూ పంచుకుని పాలించారు. వారు మేరు పుత్రికలను వివాహమాడారు, వారి పేర్లు: మేరుదేవి, ప్రతిరూప, ఉగ్ర దంష్ట్రలత, రమ్య, శ్యామ, నారి, భద్ర, దేవి.

5.5 భారతదేశానికి ఇంకో పేరు అజనాభం:

హిమాలయాల నుండి వాటికి దక్షిణంగా గల లంకాద్వీపం వరకూ గల భూఖండానికి అనాదిగా భారతవర్షమనే పేరుంది. దాన్ని అగ్నీధ్రుని (యాజీధ్రుని) పెద్దకొడుకైన నాభి పరిపాలించాడు కాబట్టి ‘అజనాభం’’ అన్న పేరువచ్చింది. నాభికి, మేరుదేవికి పుత్రుడుగా విష్ణు అంశతో ఋషభుడనే పుత్రుడు కలిగాడు. తండ్రి అనంతరం ఋషభుడు రాజ్యాన్ని పాలించాడు. ఆయనకు భరతుడు మొదలైన 100 మంది పుత్రులు కలిగారు. వారిలో 9మంది జంబూద్వీపంలోగల 9 వర్షాలకూ అధిపతులయ్యారు. ఈ భరతుడే తన తండ్రి తర్వాత రాజ్యాన్ని పాలించాడు. ఆయన పాలించడం మూలాన అజనాభవర్షానికి భారతవర్షమన్న పేరొచ్చింది. ఈ భరతునికే తర్వాత జడభరతుడనే పేరువచ్చింది. ఆయన మహాతపశ్శాలి, బ్రహ్మజ్ఞాని. ఆయన భార్య పంచజని. ఆమె వల్ల ‘సుమతి’ అన్న పుత్రుడు కలిగాడు. వారి వంశం క్రమంగా వృద్ధి పొందింది. వారంతా దివ్యపురుషులుగా జీవించారు. తపోధనులై, ధర్మపరంగా భూమిని పాలించారు. మానవులైనప్పటికి తపశ్శక్తితో స్వర్గాదిలోకసంచారం చేసేవారు. ఇంక ప్రియవ్రతుని సోదరుడైన ఉత్తానపాదుని గురించి కొంచెం తెలుసుకుందాం.

5.6 ఉత్తానపాదుడు:

ఉత్తానపాదుని గురించి లోగడ కొంచెం తెలుసుకున్నాం. ఆయన స్వాయంభువుని రెండవ కుమారుడు. ఆయన పుత్రుడు ధ్రువుడు. అయనని బాల్యంలో తండ్రి అనాదరణ చేయడంవల్ల అరణ్యానికిపోయి నారదుని ఉపదేశంతో మహావిష్ణువు గురించి తపస్సుచేయగా విష్ణువు ప్రత్యక్షమై ఆయన్ని అనుగ్రహించాడు. ఆయన 26 వేల సం||లు రాజ్యం పాలించి చివరికి తపస్సు చేయగా దివ్యవిమానంలో విష్ణు దూతలు వచ్చారు ఆయన్ని తీసుకువెళ్ళడానికి. ఆయన హిరణ్మయ రూపం ధరించి ఆ విమానమెక్కి వెళ్ళి విష్ణుపదం పొందాడు. ఆ విధంగా ధ్రువతారగా వెలిసాడు. వీరి వంశానుక్రమం: ధ్రువుడు–వత్సరుడు–పుష్పార్ణుడు–వ్యష్ణుడు– సర్వతేజుడు– చాక్షుషుడు(6వమనువు)– ఉల్ముడు – అంగుడు– వేనువు–పృథువు–జితాశ్వుడు–హవిర్ధానుడు– ప్రాచీనబర్హి ప్రచేతసులు… రెండవ దక్షుడు మొదలువారు. ఈ అధ్యాయంలో ఇంతవరకు మనం దేవతలవల్ల భూలోకంలో మానవ సృష్టి ఎలా జరిగిందన్నది తెలుసుకున్నాం. కిందటి అధ్యాయంలో దేవతల సృష్టి గురించి తెలుసుకున్నాం. శ్రీ దేవీ భాగవతంలో గూడా ఆదిపరాశక్తి ద్వారా దేవతా సృష్టి ఎలా జరిగిందన్నది వివరంగా ఉంది. అసలు ఈ దేవతలు ఎందుకు సృష్టించబడ్డారు అన్నవిషయం గూడా ఉంది. అది తెలుసుకుందాం.

5.7 ఆదిపరాశక్తి వల్ల దేవతాసృష్టి:

సృష్టికి ముందే ఆదిపరాశక్తి (పరమేశ్వరి) ఉంది కాబట్టి ఆ దేవికి మూలప్రకృతి అని పేరు. ప్రకృతంటే 3 గుణాలతో కూడి, శక్తి సమన్వితమైన సృష్టికి ప్రధాన కారణమైనది. సృష్టి కోసం ఆ పరమేశ్వరి ముందుగా తన్ను తాను రెండుగా విభజించుకుంది. కుడి భాగం పురుషుడిగా, ఎడమభాగం ప్రకృతిగా. ఆ ప్రకృతే బ్రహ్మ స్వరూపిణి, ఆద్యాశక్తి. ఆ దేవి సృష్టికార్య విభాగం కోసం, అంటే ప్రపంచసృష్టి కోసం ఐదు రూపాలుగా వ్యక్తమౌతోంది ఈ కింది విధంగా: పూర్ణరూపాలు: దుర్గ, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ. ప్రధానాంశలు (అంశావతారాలు): గంగ, తులసి, షష్టీదేవి, మంగళచండిక, కాళి. కళాంశరూపాలు (కళావతారాలు): స్వాహా, దక్షిణ, స్వథ మొదలగునవి. అంశరూపాలు: నగరాల్లో గ్రామాల్లో ఆరాధింపబడే గ్రామదేవతలు. అంశాంశ రూపాలు: ప్రతి స్త్రీ, సువాసినులనబడే స్త్రీలందరూ గూడా.

ఈ ప్రపంచాన్ని సృష్టించి, ఒక క్రమపద్ధతిలో నడపాలంటే, ఆ సృష్టికర్తకు – పరమేశ్వరుడు  గానీ, పరమేశ్వరి గానీ, ఎంత జ్ఞానముండాలో ఎంత ఐశ్వర్యముండాలో ఎవరైనా ఊహించగలరా? ఆ పూర్ణబ్రహ్మ స్వరూపిణి, ప్రకృతి రూపంలో ఉండి, తన అనంతసత్తా నుండి అనేక దేవతాశక్తుల్ని సృష్టించింది, ఈ విశ్వ నిర్వహణ కోసం. ఈ ప్రకృతి శక్తులన్నీ ఆవిడ కళలే, అంశరూపాలే.. దుర్గగా రక్షణ కల్పిస్తుంది, లక్ష్మిగా అనేక రకాల ఐశ్వర్యం ప్రసాదిస్తుంది, సరస్వతిగా జ్ఞానాన్నిస్తుంది, గాయత్రిగా బుద్ధిని తేజోవంతంచేస్తుంది,రాధగా ప్రేమతత్త్వాన్ని పంచుతుంది. గంగ పాపప్రక్షాళనం చేస్తుంది. తులసి కల్పవృక్షంలాంటిది. షష్టీదేవి పసిపిల్లలను సంరక్షిస్తుంది. మంగళచండిక ధర్మరక్షకులను రక్షిస్తుంది. కాళి దుర్మార్గులను శిక్షిస్తుంది. స్వాహాదేవి- అగ్నిపత్ని. ఆమె సహాయంతోనే దేవతలు అగ్నిముఖంగా హవిస్సులు పొందుతారు. అందుకే ఆమె పూజనీయురాలు. దక్షిణ- యజ్ఞపత్ని. యజ్ఞం చేయించే వేదబ్రాహ్మణుల శ్రమకు తగిన దక్షిణ ఇస్తేనే యజ్ఞఫలితం దక్కుతుంది. స్వథ-పితృపత్ని. పితరుల గురించి చేసిన దానఫలితాలు దక్కాలంటే ఆమెను  పూజించాలి. స్వస్తిదేవి- వాయుపత్ని. ఆమె పేరులోనే మేలు కలిగించేది అని అర్థముంది. పుష్టి- గణపతి పత్ని. జీవులకు బలం కలిగించేది. తుష్టి- అనంతుని పత్ని. లోకాలకు తృప్తి కలిగించే దేవత. సంపత్తి – ఈశానపత్ని. సంపదలొసగే దేవత. ధృతి – కపిలపత్ని. ఏ కార్యమైనా సఫలమవ్వాలంటే ఆమెను పూజించాలి. సతి – సత్యపత్ని. లోభ, వ్యసనాల పీడ తొలగాలంటే ఆమెను పూజించాలి. దయ- మోహునిపత్ని, శుభాలనొసగేది.. ప్రతిష్ఠ -పుణ్యుని పత్ని. పుణ్యాన్ని కలిగించే దేవత. కీర్తి -సుకర్మపత్ని. కీర్తి, యశస్సు కలిగించే దేవత.

క్రియ -ఉద్యోగపత్ని. క్రియ (విధి) లేకపోతే జగమంతా జడంగా మిగిలిపోతుంది. మిథ్య -అధర్మపత్ని. ధూర్తులీమెను పూజిస్తారు. కృతయుగంలో కనిపించదు. త్రేతాయుగంలో సూక్ష్మరూపంలో ఉంటుంది. ద్వాపరయుగంలో సగం అవయవాలు కలిగి సంహృతమైనాకారం కలిగినదవుతూ, కలియుగంలో ప్రగల్బాలు పలికేదిగా సర్వత్ర వ్యాపించి ఉంటుంది. బుద్ధి, మేధ, ధృతి జ్ఞానుని భార్యలు. వారు లేకపోతే లోకమంతా మూఢులమయం. కాలాగ్ని- రుద్రపత్ని. నిద్ర కలిగించేది. సంధ్య, రాత్రి, దివం-ఈ ముగ్గురూ కాలానికి పత్నులు. ఇవి లేక బ్రహ్మ సృష్టి చేయలేడు. ప్రభ, దాహిక-ఈ ఇద్దరూ తేజము యొక్క పత్నులు. ఇవి సృష్టికర్తకు పరికరాలు. శ్రద్ధ, భక్తి -వైరాగ్యానికి పత్నులు. ముక్తి కలిగించేవారు. అదితి -దేవమాత. దితి-దైత్యమాత. వీరంతా ప్రకృతి యొక్క కళారూపాలు. లోకాలని ఉజ్జీవింపజేసే దేవతాశక్తులు. వీరి సహకారం లేకపోతే లోకంలో అణువైనా నిలువలేదు. గ్రామదేవతలు గూడా ప్రకృతి కళాంశరూపాలే. వారిని పూజించిన వారికి రక్షణ ఉంటుంది. లోకంలో ప్రతిస్త్రీలో గూడా ప్రకృతిమాత అంశ ఉంటుంది కాబట్టి స్త్రీలనవమానించరాదు. విశ్వంలో ఇలాటి ప్రకృతి శక్తులనేకం ఉన్నాయి. అన్నింటిలోనూ పరమాత్మ చైతన్యం నిండి ఉంది కాబట్టి భారతీయులు ప్రకృతిశక్తులని దేవతలుగా ఆరాధిస్తారు.

5.8 దేవతలకి మానవులకి గల కొన్నిభేదాలు:

భూలోకంలో స్థూలసృష్టి గావించడానికి ప్రథమ మానవుడైన స్వాయంభువ మనువు ప్రవేశించాడు తనవారితో. స్వాయంభువుని పుత్రులైన ప్రియవ్రత, ఉత్తానపాదులవల్ల భూలోకంలో మానవజాతి అభివృద్ధి గాంచింది. ఆ కాలంలో వారంతా దివ్యపురుషులుగా జీవించారు. తపోధనులై, ధర్మపరంగా భూమిని పాలించారు. మానవులైనప్పటికి తపశ్శక్తితో స్వర్గాదిలోక సంచారం చేసేవారు. అదితి పుత్రుడైన అర్యమునికి మాతృక అనే భార్యవల్ల ‘చర్షణులు’ అను దేవతలు పుట్టారు. వారివల్ల మానవజాతి ఈ లోకంలో స్థిరంగా ఉండేట్లు బ్రహ్మదేవుడు కల్పించాడు. అంతవరకు మానవులు స్వర్గలోకానికి రాకపోకలు సాగించేవారు. ఈ చరణుల ఆధిపత్యం వచ్చాక మానవులు భూలోకవాసులయ్యారు. స్వర్గలోకానికి పోయే శక్తి కోల్పోయారు. కశ్యపాద ప్రజాపతులంతా దేవతా వర్గంలోనివారు. వారే మానవులకు మూలపురుషులై భూలోక సంబంధమైన సృష్టిని చేసారు. దేవతలకూ, మానవులకూ మూలపురుషులొక్కరే. దేవతలు స్వర్గంలో ఉంటే మానవులు భూలోకంలో ఉంటారు. దేవతలు సూక్ష్మదేహులు. మానవులు స్థూలదేహులు. స్వర్గంలోనే అనేక అవాంతర లోకాలున్నాయి. స్వర్గంలో 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి. వారికి ఒకరోజైతే మనకు ఒక సంవత్సరం. వారికి ముసలితనంలేదు. ఎప్పుడూ 30 ఏళ్ళ వాళ్ళలాగా ఉంటారు. కనురెప్పపాటు లేదు. కామ రూపులు, ఎటువంటి రూపమైనా ధరించగలరు. కామగమనంగలవారు, ఎక్కడికైనా వెళ్ళగలరు. సంతానాభివృద్ధి లేదు, వారి అనుగ్రహంవల్ల ఇతరులకు సంతతి కలుగుతుంది. దివ్యశక్తులు గలవారు, పూజనీయులు. అందుకే దేవతలను పూజించి మానవులు తమ కోర్కెలు తీర్చుకుంటారు.

5.9 భూలోకంలో ఈ స్థూలసృష్టి ఎంతకాలం క్రితం జరిగుండచ్చు?

ఊర్ధ్వలోకాల్లోనే ముందుగాసృష్టి జరిగింది. తరవాత భూలోకంలోఈ స్థూలసృష్టి జరిగింది. మనవద్ద బ్రహ్మగారు పుట్టినప్పటి నుండి గూడా కాలం గురించిన లెక్కలున్నాయి కాబట్టి దాదాపు 195 కోట్ల సం||ల క్రితమే ఈ భూమ్మీదగూడా స్థూలసృష్టి జరిగిందని చెప్పుకోవచ్చు. అంతేగాని ఆంగ్ల కుహనా మేధావులన్నట్లు ఏ 2000సం||ల లేక 6000సం||ల క్రితమో జరగలేదు. అన్నిటికీ లెక్కలున్నాయి మనశాస్త్రాల్లో. నిజానికి కాలాన్ని గురించి తెలుసుకోవాలంటే బ్రహ్మకల్పం గురించి, మనువుల గురించి కొంతైనా తెలుసుకోవాలి. ఆ విషయాలు తరవాత తెలుసుకుందాం. ఇంతవరకూ ఎన్నిరకాల జీవులు ఈ ప్రపంచంలో సృష్టింపబడ్డారో ఒకసారి సింహావలోకనం చేద్దాం.

5.10 ఇంతవరకూజరిగిన వివిధరకాల జీవసృష్టి :

1.బ్రహ్మదేవుని వల్ల అనే కరకాల సృష్టి జరిగింది. మొదటగా మోహం, తామిస్రం లాంటి తామస సృష్టి జరిగింది.

2.బ్రహ్మదేవుని అవయవాలనుండి ఆయనతో సమానమైన దక్షాదిప్రజాపతులసృష్టి.

3.బ్రహ్మదేవుని 4 ముఖాలనుండి వేదాదిశాస్రాలుద్భవించాయి.

4.స్వాయంభువు, శతరూపల సృష్టి. వారి సంతానం వల్ల ప్రజాసంతతి అభివృద్ధిగాంచి అనేకరకాల జీవజాలం పుట్టుకొచ్చింది.

5.దేవ, దానవ, దైత్య, మానవ, యక్ష, రాక్షస, భూత, ప్రేత, పిశాచ, గంధర్వ, అప్సరస, నాగ, కిన్నెర, కింపురుష, విబుధ, పితృదేవత, సిద్ద, సాధ్య, చారణ, విద్యాధరులు మొదలుగువారు.

6.సర్పాలు; మొసళ్ళు, చేపలు లాంటి జల చరాలు; గోవులు, మహిషాల్లాంటి జంతువులు; గద్ద, డేగల్లాంటి పక్షిజాతులు; పురుగులు, మిడతలు, సాలెపురుగు, ఈగ, నల్లి, దోమల్లాంటి క్రిమికీటకాదులు; వివిధరకాల వృక్షాలు మొ||వి పుట్టాయి. ఇవన్నీగూడా స్వాయంభువు ఆజ్ఞ చేత మొదటి 10మంది ప్రజాపతులు తమ తపస్సు యొక్క ప్రభావంవల్ల శక్తిని పొంది ప్రాణుల కర్మలకు తగినట్లుగా సృష్టి చేసారు. వీరిలో కొందరు మనలో కలిగే కామ క్రోధాదిభావాలను కలిగించేవారు కాబట్టి వారిని ఆ భావాలకు అభిమానదేవతలంటారు. వారిలో రాక్షసులు మొదలగు వారుండవచ్చు, కానీ వారందరినీ దేవయోనుల వర్గాలకి చెందిన వారేనంటారు. ఈ విధంగా ఎక్కువగా ప్రజాసృష్టి గావించినవారు దక్ష్మకశ్యప ప్రజాపతులు. వారి సంతతి వల్ల లోకాలన్నీ నిండిపోయాయి. ఇంతవరకు ఊర్ధ్వలోకాల్లోనూ, భూమ్మీదా ప్రజాసృష్టి ఎలా జరిగిందో తెలుసుకున్నాం. ఇంక మనం లోకాల గురించి అందులోని జీవుల గురించి తెలుసుకోవాలి తరువాతి అధ్యాయంలో.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here