Site icon Sanchika

దివినుంచి భువికి దిగిన దేవతలు 7

[box type=’note’ fontsize=’16’] మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞాన రహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రచన చేశారు డా. ఎం. ప్రభావతీదేవి. [/box]

మణిద్వీపంలోని దేవతా వ్యవస్థ

7.0 అనేక రకాల సృష్టులతో కూడిన ప్రపంచం:

[dropcap]వ్యా[/dropcap]సమహర్షి రచించిన శ్రీదేవీభాగవతములో సనాతన వేదధర్మంలో గల దేవతా వ్యవస్థను గురించిన వివరణ మణిద్వీపవర్ణనలో ఉంది. అది తెలుసుకునే ముందు పరమాత్మ నుండి జీవులతో కూడిన ప్రపంచం వ్యక్తమవ్వాలంటే ఎన్ని రకాల సృష్టులు అవసరమో ఒకసారి సింహావలోకనం చేసుకుందాం.

7.1 వివిధ సృష్టులు:

ఈ ప్రపంచ నిర్మాణానికి కారణమైన సృష్టులనే సర్గలు అని గూడా అంటారు. అవి:

  1. మహతత్త్వం: ఆత్మ నుండి సత్వాదిగుణ వైషమ్యాలు కలగడం. అవ్యాకృతమైనది ప్రకృతి. దాని గుణాలైన సత్వరజస్తమస్సుల క్షోభ వల్ల మహతత్వం కలిగింది.
  2. ద్రవ్యజ్ఞాన క్రియాత్మకమైన అహంకారతత్వం.
  3. సూక్ష్మ భూతసృష్టి– పంచతన్మత్రలతో కూడిన పంచభూతాలు.
  4. ఇంద్రియసృష్టి– ఙ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు.
  5. దేవతావర్గం- దేవతాసృష్టి. ఈ దేవతా సృష్టిలో గల భేదాలు: 1.విబుధులు, పితృదేవతలు, సురలు, 2. గంధర్వులు, అప్సరసలు, 3. యక్ష రాక్షసులు 4. భూత, ప్రేత, పిశాచాలు, 5. సిద్ధచారణ విద్యాధరులు, 6. కిన్నెర, కింపురుషులు, 7. కౌమారసృష్టి: సనక, సనందాదులు. వీరిలో దేవత్వం, మానవత్వం గూడా ఉంటాయి.
  6. జీవులకు ఆవరణ, విక్షేపాలనుకలగజేసే తామసం.
  7. స్థావర సృష్టి-6 రకాల వృక్ష సంపద: 1. పూలు లేకుండా కాయగల్గిన రావి, మేడి మొదలగు వనస్పతులు. 2. ఓషధులు- ఇవి పుష్పించి, పండగానే నశించే వరి, యవలు, పెసలు మొదలగునవి. 3. కొన్నిమాలతి, జాజి లాంటి పూలు పూసే లతలు, మరికొన్ని కాయలు మాత్రమే కాసేవి. 4. వెదురు మొదలగునవి. 5. కఠినంగా ఉండి ఎక్కడానికి వీలులేనివి. 6. పూలు పూసి ఫలించే మామిడి మొదలగు ద్రుమాలు. ఈ వృక్షాలు మొదలగునవన్నీ గూడా లోపలి స్పర్శజ్ఞానం మాత్రమే గలవి-అంతస్పర్శములు. బయటకు చైతన్యం వ్యక్తపర్చలేనివి. ఊర్థ్వసంచారం గలవి.
  8. వివిధ పశు, పక్ష్యాదులు:

          చీలిన గిట్టలు గలవి: వృషభాలు, గోవులు, దున్నలు, మేకలు, ఒంటెలు, పందులు మొదలగునవి.

         చీలని గిట్టలు గలవి: గుర్రాలు, గాడిదలు, శరభాలు, చమరీమృగాలు మొదలైనవి.

         ఐదేసి గోళ్ళు కలవి: కుక్క, నక్క, తోడేలు, పులి, సింహం, కోతి, ఏనుగు, కుందేలు మొదలైనవి.

         జలచరాలు: మొసలి, తిమింగలాలు మొదలైనవి.

        పక్షులు: గ్రద్ద, డేగ, నెమలి, హంస, చక్రవాకం, కాకి, గుడ్లగూబ మొదలగునవి. ఇవి తమోగుణం ఎక్కువగా గలవి. రేపటి సంగతి ఎరగనివి.    ఆహారాది జ్జానం మాత్రం గలవి. ముక్కు చేతనే పసిగట్టేవి.

  1. రజోగుణాధిఖ్యంగల మానవులు.

7.2 చరాచర ప్రాణుల సృష్టి:

ఈశ్వరుని వల్ల అనుగ్రహింపబడి బ్రహ్మదేవుడు దక్ష్మమరీచాది ప్రజాపతులను సృష్టించడాన్ని సర్గము అంటారు. ఈ ప్రజాపతుల ద్వారా చరాచర ప్రాణికోటి సృష్టింపబడటాన్ని విసర్గము అంటారు. విసర్గము ప్రజాపతుల సృష్టన్నమాట. వీరి ద్వారా అనేక జీవజాతులుద్భవించాయి. ఈ జీవజాతులను 4 రకాలుగా విభజించారు: 1. ఉద్భిజాలు: భూమి నుండి పుట్టిన లతలూ, వృక్షాలు…! 2. స్వేదజాలు: తేమ, చెమట నుండి పుట్టిన పేలు, నల్లులు మొదలైనవి. 3. అండజాలు: గుడ్డు నుండి పుట్టిన పక్షులు మొదలైనవి. 4. జరాయుజాలు: జరాయువు (మావి)తో తల్లి గర్భం నుండి పుట్టిన మనుష్యులు…!

7.3 జీవుల్లో ఎవరు శ్రేష్ఠులు:

మొత్తానికి జీవరాసులన్నీకలిపి 84 లక్షలుగా లెక్కతేల్చారు. ఇంకా ఎక్కువే ఉండచ్చు. చీమ నుంచి బ్రహ్మ వరకూ గల జీవుల్లో దేవతలు శ్రేష్ఠులు, ఉన్నతులు. మానవులు పృథ్వీతత్వం ప్రధానంగా గలవారు. దేవతలు తేజోతత్వం ప్రధానంగా గలవారు. వారు ఎంతో మహిమాన్వితులు. ఒకేసారి రెండు స్థాయిల్లో పనిచేస్తుంటారు: 1. మానవస్థాయి, 2. దేవతా స్థాయి. దేవాధీశ్వరులైన త్రిమూర్తులు ఒకే సమయంలో 3 స్థాయిల్లో పనిచేస్తుంటారు: 1. మానవ స్థాయి, 2. దేవతాస్థాయి, 3. బ్రహ్మాండస్థాయి. బ్రహ్మాండస్థాయిలో త్రిమూర్తులు ఎలా పనిచేస్తారన్నది తెలుసుకోడానికి మనం శ్రీమహాభాగవతము లోని వామనావతార ఘట్టంలోని అంశాలను పరిశీలించాలిప్పుడు.

7.4 వామనావతారం వల్ల కలిగిన ప్రయోజనం:

ఒకానొకప్పుడు దేవలోకంలోనున్న జీవులకు ఉండాల్సినంత పవిత్రత ఉండేది కాదు. అందువల్లే వారు తరచుగా ఓడిపోయేవారు. ఆ సమయంలో బలిచక్రవర్తి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇది సరిదిద్దాలంటే బలిని దండించాలి. ఇంకా దేవతలను పవిత్రీకరంపజేసే ఒక విశేషశక్తిని ప్రవేశపెట్టాలి. అలా జరగాలంటే బ్రహ్మాండ కటాహానికి తగినంత చిల్లి పెట్టి, దాన్లో నుంచి కొంత పవిత్రీకరణ శక్తిని స్వర్గలోకంలో ప్రవహించేట్లు చేయాలి. ఈ పని చేసేందుకే విష్ణుమూర్తి వామనుడిగా అవతరించి తన విరాడ్రూపాన్ని చూపించాడు. తన పాదాన్ని పెంచి బ్రహ్మాండానికి చిల్లిపెట్టాడు. ఆ సమయాన్ని బ్రహ్మ ఉపయోగించుకున్నాడు. వామనుడి కాలిగోటి వల్ల కటాహంలో చిల్లి ఏర్పడితే అందులోంచి బయటున్న శక్తి అంతా లోపలికి ఒరవడిగా తోసుకువస్తే అది అక్కడున్నజీవులకు క్షేమం కాదనుకుని బ్రహ్మదేవుడు సూక్ష్మరూపంలో కటాహం యొక్క బయటి వైపుకు వెళ్ళి అక్కడున్న అనంతశక్తిలో కొంతభాగాన్ని సూక్ష్మజలరూపంగా మార్చి తన కమండలంలోకి ఆకర్షించుకున్నాడు. వామనుడి కాలివేలు ఆ కటాహాన్ని ఛేదిస్తూ బయటకు వచ్చింది. వెంటనే బ్రహ్మ తన కమండలంలోని సూక్ష్మజలాన్ని విష్ణుపాదాలమీద కొద్దికొద్దిగా పోస్తూ ఆ పవిత్రజలాన్ని స్వర్గంలో ప్రవేశపెట్టాడు. విష్ణుపాదానికి బ్రహ్మజలంతో అభిషేకంచేయడంవల్ల ఆ జలానికి విష్ణుశక్తి, బ్రహ్మశక్తి గూడా సోకి దాని పవిత్రత ఇనుమడించింది. అదే దివ్యగంగగా పేరొందింది. దానివల్లే దేవతలకు విశేషశక్తులు లభించి బలవంతులయ్యారు. అనంతరం భగీరధుని తపస్సు వల్ల స్వర్గం నుండి భువికి దిగింది గంగ. ఈ సందర్భంలో శివుడు ఆ గంగను తన జటాజూటంలో బంధించాడు. దానివల్ల శివుని దివ్యశక్తి గూడా గంగకుసోకి స్వర్గంలో కన్నా ఎక్కువ పవిత్రత సంతరించుకుంది. దీనివల్ల బ్రహ్మాండం యొక్క పటిష్ఠత ఎంతటిదో తెలియడమే కాకుండా, బ్రహ్మాండానికావల చైతన్యశక్తి ఆవరించి ఉంటుందని గూడా తెలుస్తోంది.

7.5 భారతీయ ఋషులు:

ప్రాచీన భారతంలో ఎందరో ఋషులు తపశ్చర్యల్లోనే కాలం గడిపేవారు. తాము తపస్సమాధిలో దర్శించిన సత్యాలను ఉపనిషత్తుల రూపంలో శిష్యుల ద్వారా భావితరాలకు అందించారు. అవన్నీ మనకు తేలిగ్గా అర్థమవడానికి వేదవ్యాసులవారు పురాణాలు గాను, ఇతిహాసాలుగాను అందించారు. ఆధునికులెవరూ కలలో గూడా ఊహించలేని ప్రపంచ సృష్టి, బ్రహ్మాండ సృష్టి, ఆ బ్రహ్మాండానికి సంబంధించిన సూక్ష్మలోకాల్లాంటి అద్భుత విషయాలను గూర్చి ఈ పురాణేతిహాసాలు తెలుపుతాయి. ఇటువంటి గొప్ప సంస్కృతి ఒక్క భారతీయులకే చెందినందుకు మనం ఎంతగానో సంతోషించాలి. మన ఈ పురాణాలను మనం గౌరవించగల్గితే ఎంతో ధన్యులం. నిజానికి వాటిని గౌరవించడం మన ధర్మంగా భావించాలి. అసలు మనకంటికి కనిపించని దివ్యలోకాలను ఎంతో అద్భుతంగా ఎలా వర్ణించారో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది.

శ్రీదేవీభాగవతములో గల మణిద్వీపవర్ణన – అందులోగల దేవతా వ్యవస్థను గూర్చి తెలుసుకుంటుంటే వ్యాసమహర్షి నిజంగా వ్యాసభగవానుడే అనిపిస్తుంది. ఎంతోమంది దేవతల ప్రస్తావన ఉంటుంది అందులో.

7.6 హిందువుల కింతమంది దేవతలెందుకున్నారు?

చాలామందికి అర్థం కాని విషయం హిందువులకింతమంది దేవతలెందుకున్నారని. ఎవరైనా తెలుసుకోవలసిందేంటంటే సనాతన వేద ధర్మంలో ఓ దేవతావ్యవస్థ ఉంది. అది సృష్టి ఆరంభం నుండే ఉంది. అసలు దేవతలతోనే సృష్టి ఆరంభమైంది. వారే ముందు పుట్టారు. వారంతా ఈ భ్రహ్మాండం లోపలనున్న లోకాల్లో ఉన్నారు. వారికి చావు పుట్టుకలు మనలాగ లేవు. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు వారిని సృజించాడు. ఆ బ్రహ్మతోనే కల్పాంతం వరకు వారు ఉంటారు. ప్రళయంలో బ్రహ్మతో పాటు పరమేశ్వరునిలో లయించిపోతారు. కొందరు దేవతలు మనువులతో పాటు వస్తారు, మనుప్రళయంలో లయించిపోతారు. ఇలా ప్రతీ మన్వంతరంలో వారే వస్తారు లేక వారి సంతతివారైనా వస్తారు, పోతారు.

7.7 బ్రహ్మకల్పం:

బ్రహ్మకల్పం అంటే బ్రహ్మకు ఒకరోజు (1 పగలు + 1 రాత్రి). పగటిపూట బ్రహ్మ సృష్టి చేస్తాడు. రాత్రిపూట ఆ సృష్టి ప్రళయంలో లయించి పోతుంది. ప్రతీ కల్పంలోను 14 మంది మనువులు పాలన చేస్తారు. ప్రతీమనువుకు ఒక అధికార వ్యవస్థ ఉంటుంది. ఆయన పాలనలో ఆయనకు సాయంగా ఉండేవారు: ఇంద్రుడు, దేవగణాలు, సప్తఋషులు మొదలగువారు. ఇవి అధికార స్థానాలు. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఈ అధికారస్థానాలు పొందలేరు.

7.8 దేవతలకెంత వయసుంటుంది?

ఇప్పటికి సృష్టి జరిగి 195 కోట్ల సంవత్సరాల పైనే. అంటే దేవతలకి కూడా ఇంచుమించు ఇంత వయసుండచ్చు. మన్వంతర కాలాన్ని లెక్కలోకి తీసుకుంటే మనువులకున్నంత వయసుంటుంది. ఈ బ్రహ్మాండంలో ఎన్నో లోకాలున్నాయి. అవి మన భౌతిక కళ్ళకు కనపడవు. దేవతలంతా సూక్షప్రపంచానికి చెందినవాళ్ళు. మనం ఉంటున్న ఈ స్థూల ప్రపంచానికి చెందినవారుకారు.

7.9 అధికార వ్యవస్థ:

కొన్ని లోకాలగురించి పురణాలలో వివరాలుంటాయి: బ్రహ్మలోకం, విష్ణులోకం, కైలాసం, ఇంద్రలోకం మొదలగునవి. బ్రహ్మలోకమంటే బ్రహ్మగారు ఒక్కరే ఆయనలోకంలో ఉండరు. ఆయన కింద ఓ అధికార వ్యవస్థ ఉందని చెప్పుకున్నాం. ఆయనకు సృష్టి రచనలో సాయంగా మనువులు, దేవతలూ, ఋషులు, యుగపురుషులు (కృత,త్రేతా, ద్వాపర,కలి) ఉంటారు. ఇంతమంది ప్రపంచ సృష్టిలో పాలుపంచుకుంటున్నారన్నమాట.

7.10 మనకు పూజనీయులు ఎవరు?

సృష్టి ఆరంభంనుంచి చాలా మహత్తరకార్యాలు సాధించినవారిని మనం దేవుళ్ళుగా భావించి పూజిస్తాం. సృష్టి ఆరంభంలో బ్రహ్మగారికి భూమి కనపడకపోతే సర్వ వ్యాపకుడైన విష్ణుయొక్క అవతారమైన ఆదివరాహస్వామి నీటిలో మునిగి భూమిని ఉద్ధరించి పైకి తీసుకువచ్చిబ్రహ్మకు సృష్టి విషయంలో సాయం చేసాడు. అందుకే ఆయన్నివిష్ణువుయొక్క అవతారంగా పూజిస్తాం. అలాగే శ్రీరాముడు 24వ మహా యుగంలో (వైవస్వత మన్వంతరంలో) చివర పుట్టి రావణాది రాక్షసులను వధించి ముల్లోకాలకూ వాళ్ల పీడనుంచి విముక్తి కలుగ చేసాడుకాబట్టి శ్రీరాముడి పూజిస్తాం. అలాగే 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు పుట్టి అధర్మపరులై మానవ రూపంలో ఉన్న అసురులను సంహరించి భూభారం తగ్గించాడు కాబట్టి శ్రీకృష్ణుడిని పూజిస్తాం. ఇలా మనకు వేలకొలదీ దేవుళ్ళు ఉన్నారు. వారికి పరివారాలున్నాయి. వారందరికీ తగిన లోకాలున్నాయి. ఇది ఇంకా తేలిగ్గా అర్ధం కావాలంటే మనం శుభకార్యాలప్పుడు శ్రీసత్యనారాయణవ్రతం చేస్తుంటాం అందులో ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

7.11 శ్రీసత్యనారాయణ వ్రతం:

సత్యనారాయణస్వామి వ్రతంలో ఈ క్రింది విధంగా పూజ చేస్తాం:

  1. మెదట గణపతి పూజ, విఘ్నాలు రాకుండా.
  2. పంచలోక పాలకుల పూజ: గణపతి, బ్రహ్మ, విష్ణు, రుద్ర,గౌరి.
  3. నవగ్రహాల పూజ.
  4. అష్టదిక్పాలకుల పూజ. ఈ దేవతలనందరినీ అధిదేవతా ప్రత్యధిదేవతల సహితంగా పూజచేస్తారు.

ఇవన్నీ అయ్యాక సత్యనారాయణస్వామిని పూజిస్తాం. అంటే దేవతలను పరివార సహితంగా పూజిస్తాం. ఇంత దేవతా వ్యవస్థ మనకుందని పండితులకు మాత్రమే తెలుసు. ఇంకెవరికీ తెలీదు. ఇలాంటి దేవతా వ్యవస్థను గూర్చి వ్యాసులవారు శ్రీదేవిభాగవతంలో “మణిద్వీపం” వర్ణనలోతెలిపారు.

7.12 శ్రీ దేవిభాగవతంలోని “మణిద్వీపం” లోని దేవతా వ్యవస్థ:

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆదిపరాశక్తి. ఆవిడనే పరదేవత, శ్రీదేవి, మహాదేవి, దేవి, భునేశ్వరి, లలితాంబిక… ఇలా వేల పేర్లతో పిలుస్తారు. శ్రీదేవి నివాస స్థానమైన మణిద్వీపం, మన బ్రహ్మాండంలో గల 14 లోకాలకు పైన ఉంది. ఈ మణిద్వీపాన్నే సర్వలోకమని అంటారు. ఇది సుధాసముద్ర మధ్యభాగాన ఉంది. ఇది ఎన్నో ప్రాకారాలతో నిర్మించబడి ఉంది. మొత్తానికి 18 ప్రాకారాలున్నాయి. వీటిమధ్య గల చింతామణి గృహంలో ఆ జగజ్జనని మహాదేవి, మహాదేవునితో కలిసి ఉంటుంది.

7.13 ప్రాకారాలవర్ణన:

  1. ఈ మణిద్వీపంలో ఎంతో ఎత్తుగల ప్రాకారాలు అనేక యోజనాల విస్తీర్ణాల్లో నిర్మించబడ్డాయి. అన్నిటికీ నాలుగువేపులా ద్వారాలు ఉన్నాయి. వీటిలో వాపి, కూప, తటాకాలు, సుగంధాలు విరజిమ్మే పుష్పలతలు, వృక్షాలు ఉన్నాయి. మధుర ఫలరసాలతో నిండిపోయిన వృక్షాలు గూడా ఉన్నాయి. శుక, సారిక పక్షులతో,లేళ్ళు, నెమళ్ళు మెదలగు జంతువులతో నిండిపోయి ఉంటాయి ఆ ప్రాంతాలు. కోయిలల కూజితాలతో, భ్రమరనాదాలతో నినదిస్తూ ఉంటాయి అవి. పూదేనియలు కాల్వలై ప్రవహిస్తుంటాయి అక్కడ. అంతా మనోహరమే అక్కడ.
  2. ఈ ప్రాకారాల నిర్మాణాల్లో వాడిన ధాతువులు: ఈ ప్రాకారాలన్నీ మెత్తం 19 రకాల ధాతువులతో నిర్మించబడ్డాయి ఈకింది విధంగా: లోహ, కంచు, తామ్ర, సీస, ఆరకూట(ఇత్తడి), పంచలోహ, వెండి, స్వర్ణ, పుష్పరాగ మణి, పద్మరాగ మణి, గోమేధిక, వజ్ర, వైఢూర్య, ఇంద్ర నీలమణి, ముత్య, మరకత, పగడ, నవరత్నాలు. ఇవన్నీ కలిపి 18 రకాలు, ఇంక చివరిదైన చింతామణి గృహం చింతామణులతో నిర్మితమైంది. చింతామణులంటే కోరిన కోర్కెలు తీర్చే మణులు.
  1. మెదటి ప్రాకారంలో ఆయుధాలు ధరించిన రక్షకగణాలు ఎప్పుడూ కాపలా కాస్తుంటారు. శ్రీదేవి దర్శనార్థం వచ్చేవారి వాహనాలను ఇక్కడే నిలుపుతారు.
  2. మూడవదైన తామ్రప్రాకారంనుండి ఎనిమిదవదైన స్వర్ణ ప్రాకారం వరకూ గల ప్రాంతాల్లో ఆరు ఋతురాజులు వారివారి భార్యలతో విహరిస్తుంటారు.
  3. తొమ్మిదవదైన పుష్పరాగ ప్రాకారంలో అష్టదిక్పాలకులు వారికి సంబంధించిన గణాలతో నివసిస్తుంటారు.
  4. పద్మరాగ ప్రాకారంలో దేవికి సంబంధించిన 64 కళలు వీరశక్తి రూపాలు ధరించి అగ్నిజ్వాలలు గల ముఖాలతో జాగరూకతతో వారి వారి లోకాల్లో ఉంటారు.
  5. గోమేధిక ప్రాకారంలో దేవియొక్క 32 శక్తులు తమకు సంబంధించిన లోకాల్లో ఉంటారు.
  6. వజ్రప్రాకారంలో మహాదేవి యొక్క అష్టపరిచారికలుంటారు. ఒక్కో పరిచారిక లక్షమంది దాసిజనంతో సేవించబడుతుంది. వీరు శృంగారదూతికలు. అమ్మవారి సౌందర్య సామగ్రిని, అలంకార వస్తువులను అందిచేవారు. వీరిని అనంగ దేవతలంటారు: అనంగరూప, అనంగమదన, సుందరి, భువనవేగ, భువనపాలిక, పర్వశిశిర, అనందవేదన, అనంగమేఖల. ఈ ప్రాకారంలో వీరికి 8 దిక్కుల్లో 8 లోకాలున్నాయి.
  7. వైడూర్యప్రాకారంలో అష్టమాత్రుకలుంటారు: బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, మహాలక్ష్మి, వీరి రూపాలు బ్రహ్మ రుద్రాది దేవతా రూపాల్లా ఉంటాయి. వీరు సదా జగత్కల్యాణ కార్యాల్లో పాల్గొంటారు. అక్కడున్న నాలుగు ద్వారాల్లోను శ్రీదేవి కోసం హంస, సింహ, గరుడ, మయూర, వృషభాలతో పూన్చిన వాహనాలు సిద్ధంగా ఉంటాయి. ఇక్కడ ఏనుగులు, గుర్రాలు కోట్ల కొలదీ ఉంటాయి.
  8. ఇంద్రనీలమణి ప్రాకారంలో దేవి యొక్క షోడశ (16) శక్తులుంటారు. వీరంతా దేవికి సేనాధిపతులు : కరాళి, వికరాళి, ఉమ, సరస్వతి, శ్రీదుర్గ, ఉష,లక్ష్మి, శ్రుతి, స్మృతి,ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి.
  9. ముత్యాల ప్రాకారం అష్టదళ పద్మాకారంలో ఉంటుంది. ఇక్కడ దేవితో సమాన ఆకారం కలిగిన ఆయుధాలు ధరించిన అష్ట మంత్రిణులుంటారు: అనంగకుసుమ, అనంగ కుసుమాతుర, అనంగ మదన, అనంగ మదనాతుర, భువన పాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ. వారు నిత్యం సకల బ్రహ్మాండాలకు సంబంధించిన వార్తలను చారుల ద్వారా గ్రహించి దేవికి నివేదిస్తారు. అంతేగాక స్వీయజ్ఞాన శక్తితో బ్రహ్మాండ సమాచారం గ్రహించి దేవికి తెల్పుతారు. అలా విశ్వ సంబంధ వార్తా ప్రసారం జరుగుతుంది.
  10. మరకతమణి ప్రాకారంలో బ్రహ్మాదులుంటారు.ఈ ప్రాకారం షట్కోణాకారం కలిగి ఉంటుంది. ఈ కోణాల్లోనే బ్రహ్మాదులు తమ లోకాలు నిర్మించుకుని ఉంటారు. వారు: గాయత్రి సహిత బ్రహ్మ, సావిత్రి, మహారుద్రుడు, సమస్త రుద్రుల గౌరి సమాఖ్యలతో, కుబేరుడితో పాటు మహాలక్ష్మి, రతీ మన్మధులు, పుష్టితో కూడిన గణపతి.
  11. పగడపు ప్రాకారంలో పంచభూత శక్తులుంటారు.
  12. నవరత్నములతో నిర్మించబడిన ప్రాకారంలో ఆమ్నాయ దేవతలుంటారు. వారు ఆవరణ దేవతలు. ఇక్కడే 7 కోట్ల(సప్తకోటి) మంత్రదేవతలుంటారు. ఈ ప్రాకారం తరువాతనే చింతామణి గృహముంటుంది.

15. చింతామణి గృహం:

చింతామణి గృహమంటే కోరిన కోర్కెలు తీర్చే మణులతో జేసిన భవనం. ఇక్కడ గల ప్రదేశాలు, మందిరాలు, వేయిస్తంభ మండపాలు, గోపురాలు, ద్వారాలు అన్నీ సూర్యకాంతి మణులతో, చంద్రశిలలతో చేసినవి. అందువల్ల అన్నీ ప్రకాశమానంగా ఉంటాయి. ఇందులో మధ్య భాగాన శ్రీదేవి సదనముంది. అందులో వేయి స్తంభాలు గల నాలుగు మండపాలున్నాయి. అవి శృంగార, ముక్తి, జ్ఞాన, ఏకాంత మండపాలు. అన్నీ కోటిసూర్య ప్రకాశమానంగా వెలుగుతుంటాయి. ఆ ప్రాంతాలన్నిటినీ అనేక రకాల పూలవనాలు సుగంధభరితం చేస్తాయి. ఆ మధ్యలో సుగంధభరితమైన మహాపద్మవనముంది. చుట్టూ వాపి కూప తటాకాలున్నాయి. తుమ్మెదల ఝంకారంతో ఆ ప్రాంతమంతా సంగీత భరితమై ఉంటుంది. శృంగార మండపంలో దేవాంగనలు దివ్యగానం చేస్తారు. సభాసదులంతా దివ్యనారీమణులే. మండపం మధ్యలో దేవి సుఖాసీనయై ఉంటుంది. ముక్తి మండపంలో దేవి అందరికీ ముక్తినిస్తుంది. జ్ఞాన మండపంలో జ్ఞాన బోధ చేస్తుంది. ఏకాంత మండపంలో మంత్రులతో జగద్రక్షణ కార్యం విచారిస్తుంది.

7.14 దేవి కూర్చునే పర్యంకాసనం:

చింతామణి గృహంలో దేవి కూర్చునే పర్యంకానికి సోపానాలుగా 10 శక్తి తత్త్వాలున్నారు. ఆ పర్యంకానికి నాలుగు ఆధారాలుగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశానులున్నారు. దానికి మంచఫలకంగా సదాశివుడున్నాడు. దానిమీద మహాదేవి, మహా దేవుని వామాంకాన విరాజిల్లుతుంది. మహాదేవుడంటే మాయను తన ఆధీనంలో అయిన మహాదేవి నవరత్నాభరణాలు ధరించి వేల దాసీజనంతో సేవలందుకుంటూ ఉంటుంది. అక్కడున్నవారంతా యువతీయువకులే. సర్వదేవతలూ కొలుస్తుండగా ఆ మహాదేవి, మహాదేవుని పర్యంకాన విరాజిల్లుతూ అందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది. అక్కడంతా ఆనందమే ఆనందం. అదే బ్రహ్మానందం. ఆనందోబ్రహ్మ.

7.15 ఆనందం ఎన్నిరకాలు?

ఆనందం ఎన్నిరకాలుగానో ఉంటుందన్న విషయం గురించి తైత్తిరీయోపనుషత్తులో ఉంది:

  1. మనుష్యానందం: మొట్టమొదటగా మనుష్యానందమంటే తెలుసుకుంటే తక్కినవి బాగా బోధపడతాయి. ఒక మనిషికి కావలసినవన్నీ ఉండి చాలా తృప్తిగా జీవిస్తుంటే, దాన్ని మనుష్యానందమంటారు. ఉదా: ఒక మనిషికి దేహదారుఢ్యం, సంపద, అందం, బలం, యవ్వనం, విద్య, అధికారం, ఙ్ఞానం, మంచితనం మొదలైనన మంచి లక్షణాలు గనక ఉంటే అతనికి కలిగే ఆనందాన్ని మనుష్యానందం అంటారు. మహాభారతంలో ధర్మరాజుకి ఇలాటి లక్షణాలన్నీఉన్నాయంటారు.
  2. గంధర్వానందం: భూమికి పైన ఉత్తరంగా నున్నగంధర్వలోకంలో వారికి కలిగే ఆనందం మనుష్యానందం కన్న 100 రెట్లు ఎక్కువ. మనుష్య-గంధర్వానందం: కొందరుజీవులు భూలోకంలో సత్కర్మాచరణ వల్ల గంధర్వ లోకానికి చేరుకుంటే వారికి కలిగే ఆనందం గూడా గంధర్వానందంలాగే ఉంటుంది. అంటే మనుష్యానందం కన్న 100రెట్లు ఎక్కువ.
  3. దేవగంధర్వానందం: కొందరు జీవులు కొన్ని కారణాలవల్ల దేవలోకంనుండి కింద నున్న గంధర్వలోకం చేరుకుని జీవిస్తే వారికి కలిగే ఆనందం గంధర్వానందంకన్న 100 రెట్లు ఎక్కువ.
  4. పితృలోకానందం: భూమికి కిందుగా దక్షిణానున్న పితృలోకంలో పితృదేవత లుంటారు. వారి ఆనందం దేవ-గంధర్వానందం కన్న 100 రెట్లు ఎక్కువ.
  5. అజానజదేవానందం: పితృలోకం పైన అజానజ దేవతల లోకముంది. అక్కడి ఆనందం పితరులానందం కన్న100 రెట్లు ఎక్కువ.
  6. కర్మదేవానందం – కర్మదేవతల ఆనందం: భూలోకంలో చేసే యజ్ఞయాగాది క్రతువులకు ఫలితాల్నిచ్చే దేవతలు. వారి ఆనందం, అజానజ దేవతల ఆనందం కన్నా 100 రెట్లు ఎక్కువ. ఈ కర్మదేవతలు గూడా భూలోకంలో అనేకమైన యజ్ఞయాగాదులు చేసి వాటి ఫలితంగా స్వర్గంలో స్థానం పొందినవారే. వారు స్వర్గంలోనే ఉంటారు.
  7. దేవానందం: స్వర్గంలోని దేవతలానందం, కర్మదేవతల ఆనందం కన్న100 రెట్లు ఎక్కువ.
  8. ఇంద్రానందం – ఇంద్రుని ఆనందం: స్వర్గంలోని దేవతల రాజైన ఇంద్రుని ఆనందం, దేవతల ఆనందం కన్న100 రెట్లు ఎక్కువ.
  9. బృహస్పతి ఆనందం: బృహస్పతి యొక్క ఆనందం, ఇంద్రుని ఆనందం కన్న 100 రెట్లు ఎక్కువ.
  10. ప్రజాపతి ఆనందం: ప్రజాపతి ఆనందం, బృహస్పతి యొక్క ఆనందం కన్న 100 రెట్లు ఎక్కువ. ప్రజాపతులంటే స్వయంభువైన బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రజాపతులుగా తీసికోవచ్చు. బ్రహ్మదేవుడ్ని హిరణ్యగర్భుడుగా భావించినపుడు ఆయన గర్భంలోనే సమస్త ప్రపంచమూ ఉంటుంది గనక, అందరికీ సృష్టికర్తగా అవుతాడు కాబట్టి అటువంటప్పుడు ఆయన యొక్కఆనందం ప్రజాపతి ఆనందంకన్నా100 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
  11. బ్రహ్మానందం- పరబ్రహ్మానందం: అంతులేని ఆనందం. దానికి సాటి ఏదీ లేదు. బ్రహ్మదేవుని ఆనందంకన్నా అనేక రెట్లు ఎక్కువ. ఏ కోరికలూలేని వానికి కలిగేది గూడా బ్రహ్మానందమే.

మనుష్యానందం, మనుష్య-గంధర్వానందం అన్నవి ఇంద్రియ భోగాలవల్ల కలిగేవి. దేవగంధర్వానందం నుండి కర్మదేవతల ఆనందం వరకు ఉన్నవి వారు ప్రపంచానికి మేలు చేయడం వల్ల కలిగేవి. దేవతలానందం అన్నది శాంతంగా, సంతృప్తిగా ఉండేవారి ఆనందం. ఇంద్రుని ఆనందం అన్నది ఇతరులను ఆకర్షించి, తనలాంటి జీవితం గడపమని ఉత్సాహపరచేటట్టుగా ఉండేది. పైన చెప్పిన ఆనందాలన్నీ గూడా ఒక శ్రోత్రియుడు, ఙ్ఞాని, కామరహితుడు అయిన వానిలో కనిపిస్తాయి. ఏ కోరికలూ లేకుండా నిష్కామకర్మతో జీవిస్తూ గడిపేవాడికి కలిగేది ఆనందమే ఆనందం. అదే బ్రహ్మానందం- పరబ్రహ్మానందం.

7.16 మహాదేవికున్న స్థాయిలు:

ఈశ్వరశక్తిని స్త్రీ గా అనుకుంటే ఆవిడనే పరాశక్తి, పరమేశ్వరి, మహాదేవి అంటారు, పురుషుడిగా అనుకుంటే ఈశ్వరుడు, పరమేశ్వరుడు, మహాదేవుడు మొదలగు పేర్లుంటాయి. బ్రహ్మానందస్వరూపిణీ, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులన్నీ ఆ దేవే అయినప్పుడు ఆ దేవికి సృష్టి స్థితి, లయకార్యాల నిర్వహణలో 3 స్థాయిలుంటాయి:

  1. అతీతస్థాయి: పరాశక్తి అయిన అంబిక సృష్టి జరగకముందు అతీతస్థాయిలో ఉంటుంది. పరమాత్మలోనున్న అనంతమైన సత్యాలను తనలోనికి ఆకర్షించి, తన చైతన్యంలో ప్రవేశించాక ప్రపంచసృష్టిగా జన్మనిస్తుంది.
  2. విశ్వస్థాయి: ప్రపంచసృష్టి కోసం జీవులందరినీ సృజించి తనలో వహించి వారిలో ప్రవేశించి వారిని బలపరుస్తుంది. ఇది ఆమె విశ్వస్థాయి.
  3. వ్యక్తిస్థాయి: వ్వక్తిస్థాయిగా మానవత్వానికీ దివ్యప్రకృతికీ మధ్య మధ్యవర్తిగా ఉండి తన మూలతత్వం నుంచి కొన్ని అంశాలను అవతరింపజేస్తుంది. ఈ అంశలు నిర్వహించవలసిన పనులు పూర్తి అయినపుడు, వాటిని తిరిగి తన మూలతత్వం లోనికి ఆకర్షిస్తుంది.

7.17 ఇంకా కంచికి పోని మన కథ:

పరమాత్మ యొక్క చైతన్యశక్తి వల్ల ఏర్పడిన బ్రహ్మాండం వల్ల దేశం, కాలం, వస్తువు ఏర్పడ్డాయని తెలుస్తోంది. ఇంతవరకు మనం బ్రహ్మాండంలో గల స్వర్గాదిసూక్ష్మ లోకాలు భూమి లాంటి స్టూలలోకాలు, వాటిలో నివసించే అనేక రకాలుగా గల జీవుల గురించిన విషయాలు కొంత తెలుసుకున్నాం. ఆ క్రమంలో మణిద్వీపంలో గల దేవతావ్యవస్థను గూర్చి గూడా తెలుసుకున్నాం.

ఇన్నిలోకాలున్నాయి, ఏ లోకానికైనా పోవచ్చనుకోవచ్చుమనం. కొంచం ఆలోచించండి! మనం మామూలు మనుష్యులం! ఇంకా చెప్పాలంటే భౌతిక ప్రపంచానికి చెందిన మట్టి మనుష్యులం! మరి సూక్ష్మ భూమికలకు చెందిన పై లోకాలకు పోగలమా?అది మనకు సాధ్యమా? ఏదో చిన్న చిన్న వ్రతాలు, పూజలు, దానధర్మాలు చేసి పై లోకాలకు పోగలమా? ఇలాంటి పూజలకు వ్రతాలకు దేవతలు కరిగిపోయి మన మీద దయ చూపలేరట-పెద్దలన్నారు. అయితే గియితే ఏ గంధర్వాది ఉపలోకాల్లోకో ప్రవేశముంటుందేమో చెప్పలేం! పై లోకాలకి పోవాలంటే ఎంతో సాధన చేయాలిట. గంధంచెక్కలాగ అరిగి పోవాలిట. స్వర్గం గూడా ఊరికే రాదుట. జ్యోతిష్ణోమాది యజ్ఞాలు తప్పకుండా చెయ్యాలిట. అవి చేయగలవాళ్ళు, చేయించగలవారు ఉన్నారా ఇప్పుడు? మరి ఏంచేయాలి? ఆ మణిద్వీపవాసిని పాదాలు పట్టుకోవడమే గతి! ఐతే ఇంక మన కథ కంచికి పోయినట్లేనా? కాదండీ! కాదు! ఇంకా మన కథ కంచికి పోలేదు! మనం లోకాలగురించి, వాటిలోని జీవుల గురించి తెలుసుకున్నాం. ఇంకా మనం నివస్తున్న భూమి గురించి, కాలగమనంలో ఏర్పడ్డ మార్పులు, వివిధ మన్వంతరాలను పాలించిన మనువులు, యుగాల్లోని తేడాలు, వేదకాలంలోని జీవనవిధానం, వేదవిజ్జానం, సత్కర్మాచరణ చేస్తూ ధర్మబద్ధంగా జీవించిన మహెూన్నత చరిత్రలు గలిగిన చక్రవర్తులు మొదలగు విషయాల గురించి తెలుసుకోవలసిందెంతో ఉంది ముందర. అందుకు పదండి పోదాం ముందుకు.

(ఇంకా ఉంది)

Exit mobile version