Site icon Sanchika

దివినుంచి భువికి దిగిన దేవతలు 8

[box type=’note’ fontsize=’16’] మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞాన రహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రచన చేశారు డా. ఎం. ప్రభావతీదేవి. [/box]

8. వేదభారతం

8.0 భారతదేశం వేదభూమి:

[dropcap]ఇం[/dropcap]తవరకూ గడచిన అధ్యాయాల్లో మనం నివసిస్తున్న బ్రహ్మాండంలోని లోకాల్లోని జీవుల సృష్టి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం నివసిస్తున్న భూమ్మీద అనేక దేశాలున్నా ఒక్క భారతదేశానికి మాత్రమే వేదభూమి అని పేరెందుకు వచ్చిందో తెలుసుకుందాం.

భూమ్మీద భౌతిక సృష్టి ఎలా జరిగిందో లోగడ తెలుసుకున్నాం. ఇంకో సారి గుర్తు చేసుకుందాం. స్వర్గలోకం నుండి స్వాయంభువు, ఆయన భార్య, పుత్రులు, కొందరు గృహస్థ ఋషులైన అత్రి, వసిష్ఠ మొIIవారు, ప్రజాపతులు భూమ్మీద నివసించడానికి అనువైన భౌతిక శరీరాలు పొంది అవతరించారు. భూమ్మీద వారు నివసించడానికి ఎన్నుకున్న ప్రదేశం: సరస్వతీ, ధృషద్వతీ నదుల మధ్య భాగం. దాన్నే ‘బ్రహ్మావర్తం, మనుక్షేత్రం, ఆర్యావర్తం’ అంటారు. అలా వారు స్వర్గం నుండి భూమ్మీదకు దిగి వచ్చారు గాన వారిని ‘ఆర్యులు’ అన్నారు. ఆర్యులనగా ఈశ్వర పుత్రులు.

స్వాయంభువ మనువుకు ‘భరతుడనే పేరుంది. కనక ఆయన సంతానానికి ‘భారతులు’ అని పేరొచ్చింది. వారు నివసించిన ప్రదేశం గనక భారతవర్షమని పేరొచ్చింది. వారి సంతతి వల్లే భూమంతా ప్రాణులతో నిండిపోయింది. వారు యజ్ఞయాగాదులతో భూమ్మీద వేదధర్మాన్ని ప్రతిష్ఠించి వ్యాప్తిలోకి తెచ్చారు. ఒకానొకప్పుడు ఈ భూమంతా వేదసంసృతితో నిండిపోయుండేదని చరిత్ర చెప్తోంది. వేదమంటే విఙ్ఞాన సంపద. ఈ వేదమే పరమాత్మ తత్త్వాన్ని తెలియజేసేది. అనంతమైన ప్రకృతిలో అనంతమైన వేదవిజ్ఞానముంది. అందులో కొంతమాత్రమే మన ప్రాచీన ఋషుల ద్వారా మనకందింది. ఇప్పుడు వేదధర్మం లుప్తమైపోయినా, భారత దేశానికి వేదభూమి అన్న పేరు స్థిరపడిపోయింది.

8.1 వేదాల లక్షణాలు:

వేదాల లక్షణాలు: 1. వేదాలు అనాది 2. అవి అపౌరుషేయాలు 3. అవి సృష్టికి మూలం. ఉపనిషత్తులలో వేదాలు ఈశ్వరుని నిశ్వాసితం అని ఉంది. నిశ్వాసితమంటే ఊపిరి విడవడమని అర్థం. మనం వదిలే ఊపిరే మాటగా వెలువడుతుంది మనం మాట్లాడుతుంటే. ఆద్యంతాలు లేని, అనాది అయిన ఈశ్వరుని యొక్క ఊపిరే వేదాలు, కాబట్టి అవి ఈశ్వరుని వాక్కులుగా ఆనాది. ఈశ్వరుడూ, వేదాలూ ఎప్పుడూ కలిసే ఉంటాయి. వేదాలను అపౌరుషేయాలన్నారు. అంటే పురుష ప్రయత్నం లేనివి. అవి మానవ కల్పితాలు కావు. వేదాలు మంత్రరూపంలో ఉంటాయి. ఏ ఋషీ వాటిని రచించలేదు కాబట్టి వారు వేద మంత్రకర్తలు కాదు. వారు మంత్రాలను దర్శించారు కాబట్టి వారిని మంత్రద్రష్టలన్నారు. వారు మంత్రాలను తమ తపస్సమాధిలో గ్రహించారు. వారు దర్శించిన మంత్రాలకు వారి పేర్లను జోడించారు. అంతవరకూ అజ్ఞాతంగా ఉన్న వేదమంత్రాలను మానవలోకానికి ఎరుకపరచిన ఘనత ఋషులకు దక్కుతుంది. వేదాలను నక్షత్రమండలాల్లాగ వారు దర్శించారని అంటారు. సామాన్య మానవులకు వినబడని శబ్దాలను వారు ఆలకించి యథాతథంగా శిష్యులకు నేర్పారు. బహ్మదేవుడు ఈశ్వరుని అనుగ్రహంతో సృష్టి చేస్తున్నప్పుడు, ఆయన నాలుగుముఖాల నుండి వేదాదిశాస్త్రాలు ఆవిర్భవించాయని గతంలో చెప్పుకున్నాం. మొట్టమొదటగా పుట్టింది బ్రహ్మ కాబట్టి ఆయనే ఆది ఋషి. ఈ వేదాలను మొదటగా గ్రహించింది బ్రహ్మదేవుడే. ఆయన సృష్టి ఎలా చేయాలా అని తపస్సు చేస్తున్నప్పుడు ఈశ్వరుని కృపవల్ల ఆయనకు హృదయంలో వేదమంత్రాల ఎరుక కలిగింది. ఈశ్వరునిలో శ్వాసగా ఉన్న వేదాలు ఈశ్వరుని సంకల్పం వల్లనే బ్రహ్మకు వాటి గురించిన ఎరుక కలిగింది. ఈశ్వరుని హృదయ ప్రకంపనల మార్గదర్శకత్వంలో బ్రహ్మ తన సృష్టిని కొనసాగించాడు. అంటేవేదాలు ఈశ్వరుని హృదయ ప్రకంపనలన్నమాట. అవే స్పందనలన్నమాట. వేదం ప్రకారం పరమాత్ముని శ్వాసమూలంగా విశ్వసృష్టి జరిగిందన్నమాట.

8.2 శబ్ద ప్రకంపనలు:

ఆధునిక విజ్ఞానం ప్రకారం శబ్దమంటే ప్రకంపనం. ప్రకంపనం శబ్దాన్ని కలిగిస్తుంది. అణురూపంలో పదార్థమంతా ఒకటే అయినప్పటికీ వస్తువులన్నీ కళ్ళకి వేరువేరుగా ఎందుకు కనబడతాయంటే ప్రాథమికశక్తి వివిధ ప్రదేశాల్లో వేరువేరు వేగాలతో ప్రకంపించడం. దీనివల్లే విశ్వసృష్టి జరిగిందని ఆధునిక శాస్త్రవేత్తలంటారు. మానవుల్లోగాని, జంతువుల్లోగాని ఆరోగ్యానికి, అనుభూతులకు మూలం ఊపిరి. అంటే ఉచ్చ్వాసనిశ్వాసాలు. ఊపిరి శరీరంలో వివిధ నాడుల్లో ప్రసరిస్తూ కంపనలను కలిగిస్తుంది. ఇదే ఆరోగ్యానికి, అనారోగ్యానికి కారణం. యోగాభ్యాసంవల్ల నాడుల ద్వారా ఊపిరిని క్రమబద్దంచేస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఊపిరి శరీరాన్ని సజీవంగా ఉంచడమే కాకుండా మనస్సునూ, మానసికారోగ్యాన్ని గూడా నియంత్రిస్తుంది. భావాలకు మూలమైనది మనసు. మన జీవశక్తికి మూలం ప్రాణం. రెండూ ఒకచోటే పుడతాయి. ఈ స్థూల జగత్తుకు కారణం ఆ సూక్ష్మశబ్దప్రకంపనలే. శబ్దం వల్లనే పదార్థం కలుగుతోంది అంటాయి మన శాస్త్రాలు. ఎలా? ప్రకంపనంటేనే శబ్దం కాబట్టి, అంతరిక్షమంతా ఈ శబ్ద ప్రకంపనలతో నిండిపోయుంది మొదట. అదే నాదం-శబ్దబ్రహ్మం-ఓంకారం. దాన్నివేద ఋషులు ‘ఆదిత్యవర్ణం’ అన్నారు. ‘ఆదిత్య’ అంటే అఖండమని అర్థం. అంటే ముక్కలు కానిదని అర్థం. ‘వర్ణం’ అంటే ‘ అక్షరం’ అని అర్థం. శబ్దమంటే అఖండమైందన్నమాట. అంతరిక్షమంతా ముక్కలు కాకుండా అఖండంగా ఉన్నశబ్ద ప్రకంపనలతో నిండిపోయుంది. అంటే ఆకాశమంతా ఈ అఖండ శబ్దతరంగాలతో నిండిపోయుంది. ఈ శబ్దప్రకంపనల వల్లే సృష్టంతా వ్యక్తమైంది. అంటే శబ్దం నుండే పదార్థం తయారైందన్న మాట. పదార్థం అంటే పదం+అర్థం (శబ్దం+అర్థం). జగత్సృష్టికి కారణమైన ప్రకంపనలను (విశ్వనిశ్వాసాన్ని) గురించిన ఎరుక కలిగి ఉండేవారు ఋషులు. విద్యుత్తరంగాలు శబ్దతరంగాలుగా మారినట్లుగానే అంతరిక్షంలోని శబ్దతరంగాలు వేదశబ్దాలుగా ఋషుల చెవికి సోకేవి. వాటినే వారు గ్రహించి లోకానికి వేదమంత్రాలుగా అనుగ్రహించారు. అందుకే వాటిని శృతులన్నారు. వాటిని ఋషులు తమ శిష్యుల ద్వారా భావితరాలవారికి అందించారు. గురుకులాల్లో విద్యాభ్యాసం చేసేటప్పుడు వేదమంత్రాలను స్వరయుక్తంగా ఉచ్చరించేవారు. వేదోచ్చారణలో స్వరం ముఖ్యం గనక వేదాలను గ్రంథస్థం చేయడం కుదరలేదు మొదట. తర్వాత లిపి ద్వారా భూర్జ, తాళపత్రాల పైన లిఖించి భద్రపరచసాగారు. వేదమంత్రాలను లయబద్ధంగా ఉచ్చరించాలి. అలా చేస్తేనే సరైన ప్రకంపనలుత్పన్నమౌతాయి. వేదాలు వాటిని పఠించేవారి శరీరాల్లోని నాడుల్లో శబ్దప్రకంపనలు కలిగించి ప్రభావితం చేయడమేగాక వాతావరణమంతటినీ గూడా ప్రభావితం చేస్తాయి. అవి అందరి క్షేమాన్ని కోరుకుంటాయి. అంటే సృష్టికంతటకీ మేలు జరగాలని కోరుకుంటాయి. వేదమంత్రాల్లోని పదాలకు అర్థగాంభీర్యముండటమేగాక శబ్దాలకు గూడా అనంతమైన విలువ ఉంది. జగత్సృష్టికి మూలం వేదమంత్రాలే గనక ఆ మంత్రాల పఠనం వల్ల ఉద్భవించే తరంగాలకి దేవతలు ప్రత్యక్షమౌతారని శాస్త్రాలు చెప్తున్నాయి. సృష్టి, సృష్టికి పూర్వమూ, సృష్టికి అతీతమూ అంతా కేవలం ప్రకంపనలమయమైతే అవి ఎంతగా వ్యాప్తి చెందాయో ఎవరూహించగలరు? విశ్వంలోని వ్యాపకాలన్నీ వేద మంత్రాల్లో ఎలా నిక్షిప్తమయ్యాయి? ఎవరికి తెలుసు? అన్నీప్రశ్నలే.

8.3 వేదాలు అనంతం:

వేదాలు అనంతమనడానికి ఒక కథ ఉంది. పూర్వం భరధ్వాజ ఋషి మూడు జన్మల్లో వేదాలను అధ్యయనం చేసాడు. ఇంకా ఆయనకు తృప్తి తీరక తపస్సు చేస్తే ఈశ్వరుడు (ఇంద్రుడని కొందరంటారు) ప్రత్యక్షమై వరం కోరుకోమంటే వేదాధ్యయనం చేయడానికే ఇంకో జన్మ కావాలంటాడు. ఈశ్వరుడు అది కష్టసాధ్యమని చెప్పి మూడు కొండల్ని చూపించి, వేదాలు ఆ కొండలకు సమానం అని చెప్పి, వాటి నుండి మూడు గుప్పెళ్ళ మట్టి తీసి చూపించి ఆ ఋషి చేసిన తపస్సుకు సమానం అవి అని చెప్పాడు. ‘అనంతావై వేదా?’ అని వేదాల్లోనే ఉంది. అనంతమైన వేదాలు పరిపూర్ణంగా నేర్చుకోడానికి ఏ ఋషికీ సాధ్యంకాని పని. అందుకే వాటిలోని కొద్దిభాగాలనే ఏఋషి అయినా అధ్యయనం చేయగలడు. తర్వాత ఎప్పుడో వేదాలను నాలుగు భాగాలుగా విభజించి చూపడం జరిగింది వేదవ్యాసుని వల్ల, కలియుగ మానవుల కోసం. అవి గూడా అవసరమైనంతవరకే. ఈ వేదాలను ఉపయోగించే బ్రహ్మ విశ్వాన్ని సృష్టించాడు. ప్రతిబ్రహ్మా గూడా ఈ ఆదిమ శబ్దతరంగాలైన వేదమంత్రాల సాయం తోనే సృష్టి రచనంతా చేస్తాడు. ఈ వేదమంత్రాల గొప్పతనం తెలుసుకునే ఈ కాలంలో విదేశీయులు గూడా వాటి ద్వారా రోగాలను నయంచేసుకుంటున్నారు.

8.4 సనాతన వేదధర్మం:

ప్రాచీన కాలంలో ఈ భూమ్మీద మానవ సృష్టి మొదలైనప్పుడు అందరూ వేదంలో చెప్పినట్టుగా సనాతన ధర్మాన్నాచరిస్తూ ఋషులుగా, ధర్మపరులుగా జీవించేవారు. అందుకు వారాచరించిన ధర్మానికి సనాతన వేదధర్మమని పేరొచ్చింది. కాలక్రమేణా భారతదేశం విదేశీయుల దాడులకు గురవడంవల్ల సనాతన వేదధర్మం గూడా క్షీణదశకు చేరుకుంది. భారతదేశమ్మీద దాడులు చేసిన విదేశీ మతస్థులు భారతదేశాన్ని హిందుస్థానమని మార్చి వేసారు. దానివల్ల మనకి హిందువులని పేరొచ్చింది. దాన్ని బట్టి మన ధర్మాన్ని హిందూ మతం అన్న పేరుతో పిలవసాగారు. మతమన్నది ఒకవ్యక్తితో మొదలౌతుంది. విదేశీ మతాలు అలానేమొదలయ్యాయి. అవన్నీ అవైదిక ధర్మాన్నాచరించేవి. మన వేదంలో చెప్పినట్టు ధర్మాన్నాచరించేది. అది ఎవరో ఒక వ్యక్తితో మొదలవలేదు. అది అందరూ ఆచరించ గలిగే ఒక ధర్మవ్యవస్థ. అందుకని హిందూమతమన్న పేరుకన్న హిందూ ధర్మమంటేనే బాగుంటుంది. వేదధర్మంలో ప్రతిపనికీ ఒక అర్థముండేది. మనిషి పుట్టాడంటే వానికో లక్ష్యసాధనుండేది. ఆ కాలంవారి కోసం వేదం రెండు మార్గాలను నిర్దేశించింది: 1. కర్మమార్గం: యజ్ఞాదివైదికర్మల ద్వారా స్వర్గాది ఊర్థ్వలోకాలకువెళ్ళడం. 2. జ్ఞానమార్గం: ఉపాసన ద్వారా జ్ఞానమార్గంలో వెళ్ళి ముక్తి పొందడం.

8.5 కర్మమార్గం:

కర్మకాండను నమ్మే కొందరు యజ్ఞకర్మల ద్వారానే ఏ కోరికైనా సాధ్యమై తీరుతుందనుకునేవారు. వారి దృష్టిలో మోక్షం గూడా సాధ్యవస్తువే, దాన్ని యజ్ఞం ద్వారా సాధించవచ్చనుకునేవారు. మోక్షమంటే స్వర్గంలో దొరికే అమృతత్వమే కాబట్టి దాన్ని జ్యోతిష్టోమమనే యజ్ఞం ద్వారా సాధించవచ్చనుకునేవారు. అంటే యజ్ఞం ద్వారా స్వర్గాన్నిగూడా సాధించవచ్చు. సంతానం కావాలంటే పుత్రకామేష్టి యజ్ఞంతో సాధించచ్చు. శత్రువులను జయించడానికి కూడా ఇటువంటి క్రతువులనేకమున్నాయి. ఇలా అనేక కోరికలు తీరడాని కనేక యజ్ఞక్రతువులున్నాయని వారి నమ్మకం.

8.6 ఙ్ఞానమార్గం:

మోక్షకాములైన కొందరు మటుకూ వేరే విధంగా ఆలోచించారు. సత్యమంటే ఏమిటి? ఈ బ్రహ్మాండ సృష్టికి కారణమేంటి? దీని భవిష్యత్తేమిటి?జన్మరాహిత్యానికేం చేయాలి? అలాటి వారు ఉపాసనా మార్గాన్ని ఎంచుకున్నారు. జ్ఞానమార్గం (జ్ఞానకాండ) సిద్ధవస్తువైన బ్రహ్మం – ఆత్మతత్వం గురించి చెప్తుంది. ఈ బ్రహ్మం అంతటా నిండి ఉంది. అందులోనే ఈ విశ్వమంతా కనిపిస్తోంది. అదే ప్రతి జీవిలోనూ ‘నేను’ అన్న చైతన్యంగా భాసిస్తోంది. అదే ‘ఆత్మ’. దాన్ని తెలుసుకోవాలంటే శాస్త్రాధ్యయనం గురుముఖంగా చేయాలి, శ్రవణ మనన నిధి ధ్యాసలు చేయాలి. కొందరు ఈ ఆత్మతత్వం తెలుసుకోడానికి అరణ్యాల్లోకి వెళ్ళి నిద్రాహారాలు మాని, శరీర సుఖాల్ని త్యజించి దేవతలను ఉపాసించారు తపస్సుద్వారా. తపస్సులో వారు దర్శించిన అనేక సృష్టి విఙ్ఞాన రహస్యాలను ఉపనిషత్తుల ద్వారా ఇతరులకు అందించారు. వారు సత్యమంటే ఏమిటో తెలుసుకుని భావితరాలవారికి అందించి పూజనీయులయ్యారు. ఇంతవరకు వేదమార్గాలు తెలుసుకున్నాం. ఇప్పుడు వేదాలకు గల అంగాలు, ఉపాంగాల గురించి తెలుసుకుందాం.

8.7 వేదాలు- అంగాలు:

వేదాల్లో లేని విషయాలంటూ ఈ సృష్టిలో ఏవీ ఉండవు. పరమాణువు నుంచి బ్రహ్మాండ నిర్మాణం వరకూ చెప్పేవే వేదాలంటే. అందుకే సృష్ట్యాదిలో ఆ పరమాత్మ, చతుర్ముఖ బ్రహ్మను సృజించి, ఆయనకు బ్రహ్మాండ నిర్మాణ విధులను తెలుపు వేదాలనిచ్చాడు. వేదవిద్య అనంతమైన విద్యాసముద్రం. పూర్వయుగాల్లో తపోనిధులైన ఋషులు వారి మేధాశక్తిననుసరించి వేదాలు నేర్చుకుని వేదనిధులుగా ఉండేవారు. ద్వాపర యుగాంతమందు వ్యాసులవారు ఆ కాలంలో నున్న మనుషుల బుద్ధిబలం చూసి, రాబోవు కలియుగంలో అల్పాయుష్కుల అల్పమేధస్సును గ్రహించి, ఒకే యజుర్వేద రూపంగా నున్నదాన్ని 4 వేదాలుగా వాటి వాటి లక్షణాలననుసరించి విభజించారు. దాని కోసం ఆయన పరమేశ్వరుడ్ని ఆరాధించి, ప్రత్యక్షం చేసుకుని, స్తుతించి, ఆ మహాదేవుని అనుగ్రహంతో వేదాల ననేకశాఖలుగా విభజించి తన శిష్యుల కనుగ్రహించారు. వేదాధ్యయనమంటే ఏదో ఆడుతూ పాడుతూ నేర్చుకునే విద్య కాదు. అనేక శాస్త్రాలను నేర్చుకోవాలి. శాస్త్రాలన్నవి మన ధర్మాల గురించిన సూత్రాలను కలిగి ఉండే ప్రమాణ గ్రంథాలు. అందుకే వాటిని ధర్మప్రమాణాలన్నారు. అవి పవిత్ర గ్రంథాలు. ధర్మమంటే దేని నాచరిస్తే మనకు తృప్తి, సంతోషం కలుగుతాయో, అది ధర్మం. ప్రమాణమంటే సత్యాన్ని చూపించేది. ధర్మప్రమాణమంటే ధర్మం గురించి నిజమైన జ్జానం ప్రసాదించేది. వేద ధర్మానికి ప్రాతిపదికగా ఈ శాస్త్రాలు/విద్యలు ఒకటీ, రెండూ కావు, చాలా ఉన్నాయి, అవి: 1.వేదాలు – 4 = ఋగ్వేదం,యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం. 2. వేదాంగాలు – 6 = శీక్ష (శిక్ష), వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. 3. ఉపాంగాలు- 4 = మీమాంస, న్యాయం, పురాణం, ధర్మశాస్త్రం. అన్నీకలిపి 14 విద్యలు. అంటే చతుర్దశ విద్యలు. వేదాంగాలకి అనుబంధాలుగా ఇంకో 4 ఉపాంగాలున్నాయి. వాటిని గూడా కలిపితే 18 విద్యలు-అష్టాదశ విద్యలు. అవి: 4.అనుబంధ ఉపాంగాలు-4 = ఆయుర్వేదం, అర్థశాస్త్రం, ధనుర్వేదం, గాంధర్వవేదం. వీటిని గురించి సూక్ష్మంగా తెలుసుకుందాం.

8.8 వేదాలు 4:

అనంతమైన వేదాలనుండి కొన్నిమంత్రాలనే వేదఋషులు గ్రహించారు. అవే ఇహ పరసౌఖ్యానికి, ముక్తికి, లోకకళ్యాణానికి చాలనుకున్నారు. చతుర్వేదాలకీ వేరువేరు పాఠాలు, వేరువేరు పఠనా పద్దతులు ఉన్నాయి. ఒక్కో పఠనా పద్దతినీ, పరిష్కృత పాఠాన్ని శాఖ’ అంటారు. వేదం శాఖోపశాఖలు గల మహా వటవృక్షం లాంటిది. ఎన్నోశాఖలున్నా వాటి నుంచి కొన్నిటిని మాత్రం కలిపి 4 శాఖలుగా వర్గీకరించారు. అవే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలుగా పేరుగాంచాయి. వీటికి గూడా అనేక శాఖలు న్నాయి. ప్రతిశాఖకి మూడు భాగాలుంటాయి: సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం. సంహితంటే సంకలింపబడి ఒక క్రమంలో ఏర్పడింది. ఏ సంహితైనా ఆ వేదం యొక్క అంతరార్థాన్ని తెలుపుతుంది. బ్రాహ్మణాలు వైదిక కర్మలను, వాటిని ఆచరించాల్సిన పద్ధతులను చెప్తాయి. ఆరణ్యకమన్నపదం ‘అరణ్య’ అన్న పదం నుండి వచ్చింది. యజ్ఞాది వైదికకర్మలు కేవలం భౌతికమైన సంపదే కాకుండా, దీక్షాదుల వల్ల చిత్తశుద్ది గూడా కలిగిస్తాయి. ఈ చిత్తశుద్ది కలిగాక ఏకాగ్రతకీ, ధ్యానానికీ దోహదకారైన ఏకాంతాన్ని అరణ్యాల్లో కల్పించుకోవాలి. ఉపనిషత్తులు ఆరణ్యకాల చివరుంటాయి. పరమాత్మకీ, జీవాత్మకీ భేదం లేదన్నసత్యాన్ని జ్ఞానమార్గం ద్వారా తెలుసుకోడమెలాగో ఉపనిషత్తులు తెలుపుతాయి. అవి తాత్త్విక భావాలను మంత్రాల్లో ఇమిడ్చాయి. మంత్రపఠనంవల్ల ఏర్పడే ప్రకంపనలు తాత్త్విక భావాలను అనుభవనీయం చేస్తాయి. అవి పండిన ఫలాల్లాంటివి.

1.ఋగ్వేదం:

ఋగ్వేద సంహితంతా పద్యరూపంగా ఉంటుంది. వీటినే మొదట ఋక్కులనేవారు. ఒక్కో ఋక్కును మంత్రమంటారు. కొన్ని ఋక్కుల సమూహాన్నిసూక్తమంటారు. ‘ఋక్’ అంటే స్తోత్రమని అర్థం. సకలదేవతాస్తోత్రాలు ఋగ్వేదంలో ఉంటాయి. అగ్నిసూక్తం, ఐతరేయోపనిషత్తు ఋగ్వేదం లోనివే. పూజకీ, ఆరాధనకీ అనుకూలం ఈ స్తోత్రాలు.

2.యజుర్వేదం:

‘యజుస్’ అన్న పదం ‘యజ్’ అన్నధాతువు నుండి వచ్చింది. ‘యజ్’ అంటే పూజించుట లేక ఆరాధించుట అని అర్థం. యజ్ఞమన్న పదం కూడాఈ ధాతువు నుండే వచ్చింది. ‘యజుస్’ అన్న పదం యద్ధానికి కావలసిన కర్మకాండని సూచిస్తుంది. ఋగ్వేదంలో స్తోత్రరూపంలో ఉన్న మంత్రాలకి యజ్ఞం చేయడానికి వీలైన రూపాన్ని యజుర్వేదం కల్పిస్తుంది. రకరకాల యజ్ఞాలని కొనసాగించే పద్దతులను కూడా వచన రూపంలో యజుర్వేదం సూచిస్తుంది. స్తోత్రంతో ఆరాధించడం నేర్పుతుంది ఋగ్వేదం. ఈ మంత్రాలనే, ఈ స్తోత్రాలనే యజ్ఞం చేయడానికి ఎలా ఉపయోగించుకోవాలో నేర్పుతుంది యజుర్వేదం. యజుర్వేదంలోని ఎన్నోశాఖల్లో ముఖ్యమైనవి రెండు: కృష్ణ, శుక్ల యజుర్వేదశాఖలు. శుక్ల యజుర్వేదాన్ని ‘వాజసనేయ సంహిత’ అని అంటారు. ‘వాజసని’ అంటే సూర్యుడు. సూర్యభగవానుని వద్ద యాజ్ఞవల్క్యుడు అన్న ముని నేర్చుకున్నాడు దీన్ని. యజుర్వేదమంతా వైదిక కర్మలను, కర్మకాండను విశదీకరిస్తుంది, ఉదా: సోమయాగం, రాజసూయయాగం, అశ్వమేధం. అద్వైత సిద్ధాంతాన్న వలంబించేవారికి యజుర్వేదం ప్రధానమైంది. సిద్ధాంతమంటూ ఉంటే ఒకసూత్రం ఉండాలి. దానికో భాష్యముండాలి. దానికో వార్తికముండాలి. వార్తికమంటే విపుల వ్యాఖ్యానం. సిద్ధాంతాన్ని క్లుప్తంగా చెప్పేది సూత్రం. ఆ సూత్రానికి వివరణనిచ్చేది భాష్యం. భాష్యానికి ఇంకా విపులంగా వివరణనిచ్చేది వార్తికం.

3.సామవేదం:

సామ అంటే మనసుకు శాంతినివ్వడం. దానివల్ల మనసుకు సౌఖ్యం కలుగుతుంది. ఋగ్వేదంలోని ఋక్కులకు సామవేదంలో మనోహరమైన సంగీతం సమకూర్చబడింది. దేవతలను తృప్తిపరచడానికి సామగానం పఠిస్తారు. ఋగ్వేద మంత్రాలను ఉదాత్త అనుదాత్త స్వరాలతో పఠిస్తారు. కానీ సామవేదంలో దీర్ఘస్వరాలతో గానం చేస్తారు. యజ్ఞాలను నిర్వహించేటప్పుడు ఉపహారాలను సమర్పించడమే గాక ఉద్దాత అన్న ఋత్విక్కు చేత సామగానపఠనం చేయిస్తారు దేవతల అనుగ్రహం కోసం.

4. అధర్వణవేదం:

అధర్వణుడంటే పురోహితుడు, ఆచార్యుడు అని అర్థం. యజ్ఞాల నిర్వహణను, శత్రువుల నుండి మనుష్యుల రక్షణకు నేర్పే మంత్రాలుంటాయి అధర్వణవేదంలో. కష్టాలను పారద్రోలడానికి, శత్రువులను సంహరించడాని కుపయోగిస్తారు ఇందులోని కొన్ని మంత్రాలను. అవి వచన, పద్యరూపాల్లోనుంటాయి. ప్రశ్న, ముండక, మాండూక్యోపనిషత్తులు ఇందులోనివే. సృష్టి ఎంత అద్భుతమైందోనని వర్ణించే ‘పృథ్వీసూక్తం’ ఇందులోదే.

8.9 వేదాంగాలు 6:

వేదాన్ని పురుషునితో పోలిస్తే ఆ వేదపురుషునికి ముఖ్యమైన అంగాలు ఆరున్నాయి, అవి: శీక్ష (శిక్ష), వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. శరీరానికి జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు ఎంత ముఖ్యమైనవో, ఆ వేదపురుషునికి ఈ 6 అంగాలలాంటివి. వేదపురుషునికి శీక్ష నాసిక వంటిది, వ్యాకరణం ముఖం లాంటిది, ఛందస్సు పాదం లాంటిది, నిరుక్తం చెవి లాంటిది, జ్యోతిషం నేత్రం లాంటిది, కల్పం హస్తం లాంటిది. వేదాధ్యయనానికి ఈ 6 వేదాంగాలని నేర్చుకోడం చాలాముఖ్యం.

1. శీక్ష/శిక్ష:

మంత్రాలు దేవతల శబ్ద రూపాలు గాన వేద మంత్రాల నుచ్చరించేటప్పుడు అక్షరశుద్ధి, స్వరశుద్ది బాగా ఉండాలి. మంత్రంలోని ప్రతి అక్షరాన్ని కాలపరిమాణం ప్రకారం, స్థాయీబద్ధంగాను పలకాలి. వేదంలో 3 స్వరస్థాయిలున్నాయి: ఉదాత్త, అనుదాత్త, స్వరిత. వాటినే హెచ్చు, తగ్గు, సమస్థాయిలంటారు. మంత్రాల నుచ్చరించేటప్పుడు ఆ స్వరం పైకి, కిందికి, సమంగాను సాగుతూంటుంది. అక్షరం పలకాలంటే కాలపరిమితన్నది ఉంటుంది. వాటిని మాత్రలు అంటారు. హ్రస్వాచ్చును పలికితే ఒక మాత్ర అంటారు. దీర్ఘాచ్చు పలికితే రెండు మాత్రల కాలమంటారు. మంత్రాల నుచ్చరించేటప్పుడు స్వరం తప్పు పోకూడదు. స్వరభేదం కలిగితే అర్థం మారిపోయి ఫలితాలు తారుమవుతాయి.

అర్థం తెలియకపోయినా మంత్రాలను సరిగా ఉచ్చరిస్తే సత్ఫలితాలు కలుగుతాయి. అక్షరశుద్ధి, స్వరశుద్ధి ఉండి మంత్రాలను లయబద్ధంగా ఉచ్చరిస్తే దేవతలు ప్రసన్నులవుతారు. వేదానికి ఆయువుపట్టు శబ్దమే. అందుకు ఆ శబ్దోచ్చారణ బాగుండాలి. దీన్నే శబ్దశాస్త్రమంటారు. ఒకమాట నుచ్చరించేటప్పుడు మన ఊపిరే గొంతు, నాలుక, పెదవులు, నోరు మొదలగువాటి ద్వారా ప్రసరించి శబ్దంగా వ్యక్తమౌతుంది. ఆ దారిలో గల నరాల కూడళ్ళు కంపిస్తాయి. దానివల్లే శబ్దోచ్చారణ  జరుగుతుంది. వేదమంత్రాలను ఉచ్చరించేటప్పుడు ఏ చిన్న పొరపాటూ రాకుండా ఉండడానికి ఇలాంటి పద్దతులు అవలంబించారు. ఒక్కోమంత్రాన్ని వివిధ రీతుల్లో, గతుల్లో వల్లించే పధ్ధతులున్నాయి. వాటకి పేర్లున్నాయి: వాక్య, పద్యక్రమ, జట, ఘన మొదలగునవి. మంత్రాలను ముందుకూ, వెనక్కూ మారుస్తూ పఠిస్తారు. ఇదంతా శిక్షణ కోసం. దానివల్ల మంత్రోచ్చారణగానీ, అర్థంగానీ మారదు. వేదాధ్యయనంలో ఇంత కఠోర శ్రముంటుందన్నమాట.

2. వ్యాకరణం:

వ్యాకరణంలో సూత్రాల కంటే భాష్యమే ముఖ్యం. శివునికి వ్యాకరణానికి సంబంధముంది. నటరాజ డమరుక దరువులనుండి ఉద్భవించిన 14 మహేశ్వర సూత్రాలను పాణిని మహర్షి విని, వాటిని కంఠస్తం చేసి ‘అష్టాధ్యాయి’ అనే గ్రంథాన్ని రచించాడు. పాణిని సూత్రబద్ధం చేస్తే, ఆయన సహాధ్యాయి వరరుచి, తర్వాత పతంజలి వార్తికాలు రాసారు. వాక్యాలు పలికేటప్పుడు గానీ, రాసేటప్పుడు గానీ అర్థభేదం రాకుండా పదాలను కూర్చడమే వ్యాకరణ ముఖ్యోద్దేశం. దీన్నే భాషాశాస్త్రమంటారు. భాషను ఎలా పలకాలో తెలిపే శాస్త్రం వ్యాకరణం.

3.ఛందస్సు:

పద్యరూపంలో నున్నవేదాలు ఛందోమయంగా ఉండటాన వేదాలను ఛందస్సులన్నారు. పద్యాలను పఠిస్తుంటే వాటి పదాల గమనం లయబద్దంగా చెవులకు వినిపిస్తుంది. ఆ పదాల గమకమే ఛందస్సంటే. ఉత్పలమాల, చంపకమాల లాంటి పద్యవృత్తాలు ఛందోబద్ధంగా మన తెలుగులో ఉన్నాయన్నసంగతి మనకు తెలుసు. పద్యపాదాలను గణవిభజన చేసి చూపుతారు. దాన్నిబట్టి ఆ పద్యవృత్తం పేరు నిర్ణయిస్తారు. ఉదా: చంపకమాలకు ‘నజభజజజర’ అని గణవిభజనుంటుంది. పదాలలో రెండు మాత్రలుంటే గురువు అంటారు, ఒక మాత్ర ఉంటే లఘువు అంటారు. ఈ గురులఘువుల కలయికలతో గణాలేర్పడతాయి. ఈ గణాల కూర్పుల వల్ల పద్యవృత్తాలేర్పడతాయి. అవి పఠిస్తుంటే వినసొంపుగా ఉంటాయి. వేదమంత్రాల్లో గానీ, వేదంలోలేని శ్లోకాల్లోగానీ నాలుగేసి పాదాలుంటాయి. ఒక్కొక్క పాదానికి నిర్ణీతమైన అక్షరాలు గానీ, మాత్రలు గానీ ఉంటాయి. వాటిని బట్టి ఛందస్సులకు గూడా పేర్లుంటాయి. ఉదా: ఒక శ్లోకానికి 4 పాదాలుండి, ఒక్కో పాదానికి 8 అక్షరాలుంటే “అనుష్టుప్ ఛందస్సు’ అంటారు, 9 ఉంటే ‘బృహతీ’ అవుతుంది, 10 ఉంటే ‘పంక్తీ’, 11 ఉంటే ‘త్రిష్టుప్’, 12 ఉంటే “జగతీ’ అంటారు. ఇలారకరకాల ఛందస్సులుంటాయి. మనందరకూ తెలిసిన ప్రార్థనాశ్లోకం ‘శుక్లాంబర ధరం విష్ణుం’ అనుష్టుప్ ఛందస్సులో ఉంటుంది. ప్రతి మంత్రానికి ఒక అధిష్టానదేవత, ఒక ఛందస్సు, దానిని లోకానికందించిన ఋషీ ఉంటారు. ఋషి పేరు తలచుకుని శిరస్సును తాకడమంటే ఆయన పాదాలను గౌరవంతో తలమీద పెట్టుకోడమన్నమాట.

4.నిరుక్తం:

నిరుక్తమంటే వేదాలకు నిఘంటువు. నిఘంటువుని కోశమంటారు. ఇందులో ప్రతి పదం/మాట యొక్క వ్యుత్పత్తీ, అర్థమూ వివరించబడి ఉంటాయి. వేదాల్లో వాడబడిన అరుదైన, అసాధారణమైన మాటలకు అర్థాలు చెప్తుంది నిరుక్తం. అదేగాక ఏ పదం ఎందుకు ప్రయోగింపబడుతుందో గూడా వివరిస్తుంది. వేదపదాల వ్యుత్పత్తిని ఈ వేద నిఘంటువు వివరిస్తుంది. సంస్కృతభాషలో ప్రతిపదానికీ ధాతువు/మూలం ఉంటుంది. సంస్కృత భాషకి ‘అమరకోశం’ అన్నది నిఘంటువు.

5.జ్యోతిషం:

దూరంగా ఉన్నదైనా దగ్గరగా ఉన్నదైనా ఏదైనా చూసి గుర్తు పట్టాలంటే కళ్ళు ఎంతో అవసరం. ఏదైనా దారిలో వెళ్ళాలంటే కళ్ళేదారిచూపుతాయి. దూరంగా గానీ దగ్గరగా గానీ ఉన్న గ్రహాల స్థితిగతులు తెలుసుకోవాలంటే చూపే ముఖ్యం. అలాగే వేదానికి నేత్రం వంటిదైన జ్యోతిషశాస్త్రం దూరంగా ఉన్నగ్రహాలను, నక్షత్రాలను వాటి పూర్వపు గతులను, భావిగతులను చూడటానికి ఉపయోగపడుతుంది. కనబడే గ్రహం యొక్క ప్రభావమేంటో తెలుసుకోవాలంటే జ్యోతిషశాస్త్రమే చెపుతుంది. ఇప్పుడు గ్రహాలెలా ఉన్నాయో తెలుసుకోవాలంటే చూపుతోనే సాధ్యం. కానీ ఎప్పుడో గ్రహాలస్థితి ఎలాగ ఉండేదో తెలుసుకోవాలంటే జ్యోతిషశాస్త్రమవసరమే. వైదికకర్మల నిర్వహణకు గ్రహాలస్థితి తెలుసుకోవాలి. వివాహాది కార్యాలకు ముహూర్తాలు నిర్ణయించేటప్పుడు గ్రహాల సానుకూలత చూస్తారు. ఏయే కర్మలు చేయడానికి ఏయే సమయాలు సాను కూలమో తెల్పడమే జ్యోతిషశాస్త్ర ప్రయోజనం. గ్రహాల గతులను సూచించడానికి ఎన్నోలెక్కలవసరం గనక గణితశాస్త్రం గూడా దీనిలో భాగమైంది. గణితశాస్త్రంలో అంకగణితం(arithmetic), త్రికోణగణితం (trigonometry), క్షేత్రగణితం(geometry), బీజ గణితం(algebra) వివరింపబడ్డాయి. పాశ్చాత్యులకు కొన్ని శతాబ్దాల కృషి వల్ల గానీ, దొరకని గణిత సంబంధ విషయాలు మన పురాతన జ్యోతిషంలోనున్నాయి. యజ్ఞవేదిక నిర్మాణానికి ఈ గణితశాస్త్రమెంతో అవసరం. భూమ్మీద మనిషి జీవితం గ్రహాల గతుల వల్లే మారుతుంటుందని జ్యోతిషశాస్త్రం సూచిస్తుంది.

6.కల్పం:

వైదికకర్మలను ఎలాచేయాలో కల్పం తెలియజేస్తుంది. ఏ కర్మను ఏ విధంగా చేయాలి? ఎవరెవరు చేయాలి? ఏ కర్మకి ఏ మంత్రమవసరం? ఏ సామగ్రి అవసరం? ఏ అధిష్టాన దేవత? ఎందరు ఋత్విక్కులుండాలి? ఎలాంటి పాత్రలు వాడాలి? ఇవన్నీ కల్పం చెపుతుంది. కల్పంలో గృహ్యసూత్రాలు, శ్రాతసూత్రాలు అని ఉంటాయి. ఇవి గర్భంలో శిశువు ఉదయించింది మొదలు, దేహానికి దహనం జరిగే వరకు చేయవలసిన కర్మలను వివరిస్తాయి.

(తరువాయి వచ్చే వారం)

Exit mobile version