దివిసీమ తుఫాను

0
2

[dropcap]వా[/dropcap]నలో తడవని బాల్యం, నీళ్ళలో ఆడని పిల్లలు ఈ భూ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారా! సన్నని చిరుజల్లులు పడుతుంటే వాటిని ఆస్వాదిస్తూ పలక నెత్తిన పెట్టుకొని స్కూళ్ళ నుంచి ఇంటికొచ్చే రోజులూ, పిచ్చుక పిడకలిల్లు కట్టుకుంది, కాకి కర్రలిల్లు కట్టుకుంది, తుఫానుకు పిచ్చుకిల్లు పడిపోయిందంటూ బామ్మలు చెప్పే కథలు, వర్షం కొద్దిగా ఎక్కువై కాలువల్లా పారితుంటే కాగితం పడవలు వదిలి అవి రయ్యిమని పోతుంటే చప్పట్లు కొడుతూ మురిసిన పసితనం.

అదే కాలేజీలో అయితే పొడవు లంగాలు వాన నీల్లకు తడుస్తాయని ఒక చేత్తో కుచ్చిళ్ళు ఎత్తి పట్టుకొని నడుస్తూ, మరో చేతిలో ఉన్న పుస్తకాలు కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తూ కాలేజీలకు వెళ్ళే రోజులూ, జోరున వాన కురిసేటప్పుడు పుస్తకాలు ప్లాస్టిక్ కవర్‌లో పెట్టుకొని ప్లాస్టిక్ పట్టలు కట్టిన గూడు రిక్షా ఎక్కి మరి క్లాసులు మిస్ చేసుకోకుండా ఉండటం.. అబ్బో ఆ ఆనందం అనుభూతులే వేరు. అదే ఆదివారాలు, సెలవు రోజుల్లోనయితే బయట ఉన్న చల్లని వాతావరణానికి ఇంట్లో వేడి వేడి పకోడీలో పప్పుచెక్కలో తింటూ, పొగలు కక్కే కాఫీ తాగుతూ చేతిలో ఏ సస్పెన్స్ నవలో ఉంటే స్వర్గం అదేననిపిస్తుంది. వర్షాకాలమంటే ప్రతి ఇంట్లోనూ ఇంచుమించుగా అవే సందళ్ళు.

ఎవరైనా అమ్మ ఇష్టం లేదు, బాల్యం ఇష్టం లేదు, వాన ఇష్టం లేదు అంటారా ఎపుడైనా! అందరిలాగే నాక్కూడా వానంటే చాలా ఇష్టం. నేను వాన మీద చాలా కవితలు వ్రాశాను. అసలు వర్షం పేరుతో ఒక పుస్తకమే వేయాలనుకున్నా. కానీ కథలు మాత్రం రాయలేదు. ఆ కోరిక ఈ విధంగా తీరుతున్నందుకు ఆనందంగా ఉన్నది. వసంతలో కొత్త చీపుర్లు తొడిగి శ్రావణానికి పచ్చపచ్చగా కదులుతూ వానకు తలలూపుతూ నాట్యం చేసే చెట్లను చూస్తే మురికి పట్టి మాసిపోయిన తలలతో నున్న పిల్లలకు అమ్మ బలవంతంగా తలంటి నీళ్ళు పోస్తుంటే వద్దువద్దని  మారాం చేస్తూనే నీళ్ళలో ఎగిరే పిల్లలు గుర్తొస్తారు నాకు. రాత్రిపూట కురిసే వాన చినుకులకు చీకట్లో దారి చూపెడుతూ జాబిల్లి టార్చిలైటవుతుంది. ‘టప్’ ‘టప్’ అంటూ ఊపిరాడకుండా వరుణుడు పెట్టె వాన ముద్దులకు నెల పడుచు తడిచి ముద్దయింది. సూర్యుడేమో వర్షపు వేళ జలుబు చేస్తుందని బయటకు రాకుండా ఇంట్లోనే ముసుగుతన్ని పడుకున్నాడు. ఇవన్నీ వానజల్లుల్లో ఆహ్లాదకర సన్నివేశాలు.

ఇంత ఆహ్లాదకరమైన వాన గాలి వానగా మారితే ఎట్లా ఉంటుందో ఎంత ప్రళయాన్ని సృష్టిస్తుందో దాన్ని అనుభవించినప్పుడే తెలుస్తుంది. నాకు ఊహ తెల్సిన తరువాత వచ్చిన మొదటి గాలివాన నేను తొమ్మిదో తరగతి చదివేటపుడు వచ్చింది. ఆ రోజు కూడా రోజులాగానే స్కూలుకెళ్లాం. రెండో పీరియడ్ జరుగుతుండగానే ఇక స్కూలు లేదు వర్షమోస్తోంది ఇళ్లకు పొండి అని మా టీచర్లు చెప్పారు. అప్పటికే తుఫాను హెచ్చరికలు రావడం, అందులోనూ మా వూరు సముద్రానికి అనుకోని ఉండడం వల్ల పిల్లలందర్నీ ఇళ్లకు వెళ్లిపొమ్మని చెప్పారు. అయితే అప్పటికి కుండపోత వర్షమేమీ కురవడం లేదు. మామూలు సన్నపాటి వర్షమే పడుతున్నది. ఇళ్లకు వెళ్ళిపొండని చెప్పీ చెప్పడంతో డెస్క్ మీదున్న పుస్తకాలన్నీ గబగబా సర్దేసుకుని హే అని గంతులేసుకుంటూ అందరూ ఇళ్లదారి పట్టారు. నేను, మరో నలుగురు మాత్రం తరగతి గదిలోనే ఆడుకుంటూ ఉండిపోయాం. చాలసేపటిదాకా మమ్మల్ని ఎవరూ గమనించలేదు.

ఎందుకో రూమ్ లో నుంచి బయటికొచ్చిన హెచ్.ఎం మమ్మల్ని చూసి ‘ఏంటి ఇంకా పోలేదా, తుఫానోస్తుంటే’ అని గద్దించింది. నేను మరో స్నేహితురాలు ఒక వైపు, మిగతా వాళ్ళు మరోవైపు ఇళ్లకు బయల్దేరాం. మా ఇద్దరిల్లు దగ్గరే. ముందుగా మా ఇల్లు వస్తుంది. కాబట్టి పుస్తకాలు ఇంట్లో పడేసి నేను నా ఫ్రెండ్‌తో వాళ్ళింటికెళ్లిపోయాను ఆడుకోవటానికి. వాళ్ళు మేడ మీద ఉంటారు. అక్కడ నుంచి చూస్తే మా ఇల్లు కనిపిస్తుంది. నేను, నా ఫ్రెండు ఆడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, బొమ్మలేసుకుంటూ, టైమే చూసుకోలేదు. బయట వర్షం సంగతి అసలే పట్టించుకోలేదు. ఏదో మామూలు వర్షమే అనుకున్నాం.

ఇంతలో పెద్ద శబ్దం వచ్చింది. ఎంత అని చూస్తే ఇంటి ముందున్న పెద్ద చెట్టొకటి కూలిపోయింది. అప్పుడు గమనిస్తే వర్షం కుంభవృష్టిగా కురుస్తోంది. ఇంతలో పెళపెళా అని శబ్దాలు వస్తే చూద్దుము కదా మా పెరట్లో ఉన్న రెండు పెద్ద బూరుగు చెట్లు నేల కూలుతున్నాయి. ఆ చెట్ల కిందే మా రోలు ఉంటుంది. రోజు పిండి రుబ్బుకున్నా, పచ్చడి నూరుకున్నా ఎండ తగలకుండా ఉంటుందని అలా చెట్టుకింద వేయించింది మా అమ్మ. చెట్లు పడటం చూసి భయమేసి వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను. ఇక మధ్యాహ్నం నుంచి వర్షం, గాలి పెరిగిపోయింది. రాత్రికి తుఫాను తీవ్రరూపం దాల్చింది. ఆ రోజు ఇంట్లో నేను, మా అమ్మ మాత్రమే ఉన్నాం.

ఊరికి దూరంగా ఉన్న మా ఖాళీ స్థలంలో రైసు మిల్లును కట్టిస్తూ అక్కడొక ఇల్లు అద్దెకు తీసుకుని మా నాన్న, నాయనమ్మ ఉన్నారు. అక్కడి నుంచి స్కూలుకు రావడం కష్టమని నేను, అమ్మ, తమ్ముడు స్కూలుకు దగ్గర్లో ఉంటాము. స్కూలు లేదని తెలియగానే తమ్ముడు నాన్న దగ్గరికెళ్ళాడు. కాబట్టి ఇంట్లో మేమిద్దరే మిగిలాం. మేమున్నది రెండు పోర్షన్ల ఇల్లు. పక్కింట్లో ఉండే అంకుల్ కూడా ఊరికెళ్ళారు. వాళ్ళింట్లో కూడా ఆంటీ, పిల్లలే. రాత్రికి వర్షం ఉధృత రూపం దాల్చింది. ప్రచండమైన గాలులుతో, నింగిని నేలను అతలాకుతలం చేస్తూ కురుస్తోంది వాన. ప్రక్కింటికి, మా ఇంటికి మధ్య నున్న తలుపు తీసుకుని అందరం ఒక్క దగ్గర కూర్చున్నాం భయపడుతూ. రేడియోలో తుఫాను చాలా తీవ్రంగా ఉందని, జాలరులు ఎవరూ సముద్రంలోకి వెళ్లరాదని ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వర్షం, గాలీ ఎక్కువయ్యేసరికి కరెంట్ పోయింది. చిన్న దీపం పెట్టుకొని భగవద్గీత, బ్రహ్మంగారి కాలజ్ఞానం చదువుకుంటుండి పోయాం. ఇలా మూడు రోజులు గడిచిపోయాయి. ఆ ఉదయం కొంచెం తెరిపిచ్చింది వాన.

వాకిలి తలుపులు తెరిచి బయటకు వచ్చి చూస్తే జనం మెల్లిగా ఇళ్ళలోంచి బయటకు రావడం కనిపించింది. రోడ్లు రోడ్లులా ఉన్నాయా! భయానక వాతావరణం. రోడ్ల ప్రక్కనున్న పెద్ద పెద్ద చెట్లు రోడ్లకడ్డంగా పడిపోయి ఉన్నాయి. కొన్ని కరెంటు స్తంబాలు తీగలతో సహా పడిపోయి ఉన్నాయి. ఇంకా కొన్ని చోట్ల గేదెలు, మేకలు, కుక్కల మృత కళేబరాలతో చిందర వందరగా రోడ్లని చెత్తా చెదారంతో నిండాయి.కొన్ని ఇళ్లకు పైనున్న కప్పలు ఎగిరిపోయాయి. గోడలు కూలిపోయి ఇంటి వాళ్ళను కంటతడి పెట్టిస్తున్నాయి. ఇక్కడ కేవలం ఆస్తినష్టమే… కానీ ఇంతకీ ఈ తుఫాను ఏమిటనుకున్నారూ. దివిసీమలో వేళ మందిని పొట్టన పెట్టుకొని ఎందరికో కడుపుశోకం మిగిల్చిన 1977 నాటి తుఫాను. తరువాత రేడియోలో వార్తలు వింటుంటే ఇంత నష్టం జరిగిందా అనిపించింది.

మావూరు చీరాల కూడా సముద్ర తీర ప్రాంతమే కాబట్టి తుఫాను తాకిడి ఎక్కువగానే ఉన్నది. తుఫాను సమయంలో న్యూస్ పేపర్లలో చీరాల కూడా మునిగిపోయింది అని వ్రాశారట. చాలామంది హైదరాబాద్‌లో ఉంది ఉద్యోగాలు చేసుకునే కొడుకులు తమ తల్లిదండ్రులెలా ఉన్నారా అని ఆతృతగా వెంటనే వచ్చారు చీరాలకు. వాడరేవులో ఉంటున్న చాలామంది చేపలు పట్టేవాళ్ళు గల్లంతయ్యారట. అక్కడ ఉన్న కుటుంబాలను ఊర్లోకి తరలించాలంటే ఎక్కడ స్థలం సరిపోవటం లేదని ‘సైక్లోన్ షెల్టర్’ అని ఓ పెద్ద బిల్డింగ్ కట్టారు. మారైస్ మిల్లులో కూడా పై కప్పులు లేచిపోయి గోడలు కూలిపోయి, అందులో ఉన్న మిషన్లు తడిచిపోయి చాలా నష్టమే కలగజేసింది తుఫాను. మొత్తానికి ఈ గాలివాన ఒక భయాన్ని కలిగించింది. ఆ తరువాత ఎన్నో తుఫాన్లు, సునామీలు చూసినా మొదటి తుఫాను అనుభవం మాత్రం ఎప్పటికీ మరవలేనిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here