Site icon Sanchika

దివ్యాంగ్ నికేతన్

[శ్రీ అంబల్ల జనార్దన్ రచించిన ‘దివ్యాంగ్ నికేతన్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“ని[/dropcap]న్న ఎంత మంది కొత్తోళ్ళని తీసుకొచ్చిన్రు?” బాస్ కంఠం ఖంగుమంది.

“నలుగురిని బాస్! ఇద్దరిని హైదరాబాద్ నుంచి, ఒకరిని గుల్బర్గా నుంచి, మరొకరిని అకోలా నుంచి.” జవాబిచ్చాడు అనుచరుడు.

“ఠీక్ హై. వారి కాలో, చెయ్యో, కండ్లో, తీసేసి ఇలాజ్ చేపిచ్చి, ఆల్లు కోలుకున్నంక పనిలో పెట్టుండ్రి.” బాస్ హుకుం జారీ చేశాడు.

“నిన్నటి కలెక్షన్ ఎంత?” కర్కశంగా మళ్లీ బాసు గొంతు.

“తొంబైఏడు వేల చిల్లర బాస్.” ఇంకో అనుచరుడు జవాబిచ్చాడు.

“అది మొన్నటి కంటే కం హై నా? ఎందుకట్ల?”

“ముగ్గురు పిల్లలకు జ్వరం. ఇద్దరు నిన్నటి కంటే తక్కువ తెచ్చారు.”

“ఎవరు వాళ్ళు? తీసుకరండ్రి”

ఇద్దరు పిల్లలు బిక్కుబిక్కుమంటూ బాస్ ఎదుట నిలబడ్డారు

“ఏరా కోవ్వెక్కిందా? లేక కర్సు పెట్టిండ్రా? మేము చెప్పిన పని చెయ్యకపోతే ఏం జరుగుతదో తెలిసి కూడా మీ పని బరాబర్ ఎందుకు చేయలేదు?” బాస్ హుంకరింపు.

“లేదు బాస్, మాకు ఇచ్చిన ఏరియాలో నిన్న వ్యాపారస్థుల సమ్మె ఉండింది. అందుకని జనాలు ఎక్కువగా రాలేదు”

“అదంతా నాకు తెలువది. మీ కిచ్చిన కోట పూరా కర్నే కాచ్ మంగ్త. చలో సేతులు ఉల్టా సాపుండ్రి.”

 పిల్లల తిరిగేసిన మట్టలపై రూలర్తో బాధ సాగాడు బాస్.

 పిల్లల ఆర్తనాదాలు మిన్నంటాయి. అయినా బాస్ కనికరం చూపలేదు. అలా ఐదు నిమిషాలు ఏకధాటిగా కొట్టి అలిసిపోయిన బాస్, తన సింహాసనంపై కూలబడ్డాడు.

“మల్లెప్పుడన్న ఇట్లా సేసినారో మీ తోడ్కలు తీస్తా బేటా! చలో అభీ జావ్.” అని తన హుక్కా పీల్చడంలో మునిగిపోయాడు బాస్ .

అది నగరంలోని ఓ పాడుబడిన భవనం. అదే బాస్ అడ్డా. అతని అనుచరులు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పదేళ్లలోపు పిల్లలను ఎత్తుకు వచ్చి, వారికి అంగవైకల్యం కల్పించి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో యాచక వృత్తికి పురమాయిస్తారు. ఉదయం కొన్ని వ్యాన్లలో పిల్లలను తీసుకెళ్లి ఆయా ప్రాంతాల్లో వదులుతారు. సాయంత్రం ఏడు గంటలకు మళ్లీ వాళ్లని తీసుకొని తమ అడ్డాకి తిరిగి వస్తారు. పిల్లలు మధ్యాహ్నం, తమ అడ్డా వాళ్ళు ఇచ్చిన డబ్బా నుంచి భోజనం చేస్తారు. కలెక్షన్ నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు చేయకూడదు. బాస్ అనుచరులు, పిల్లల ‘సంపాదన’ లెక్క పెట్టి ఒక రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఆ క్రితం రోజు వచ్చిన కలెక్షన్‌తో పోలుస్తారు. ఎక్కువైతే పరవాలేదు కానీ తక్కువ అయితే మాత్రం బాసుకు రిపోర్ట్ చేసి, శిక్ష పడేలా చూస్తారు.

అలాంటి ముష్టి మాఫియా దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో వుంటుంది. ఆ విషయం పోలీసులకు తెలిసినా, చూసీ చూడనట్టు ఉంటారు. అందులో రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉంటుంది. ఇంకా పోలీసులు మామూలు కూడా వసూలు చేస్తారు. అందులో పై వాళ్లకు కూడా వాటా ఉంటుంది.

పిల్లల నెత్తురు కూడుతో బాస్ మరియు అతని అనుచరులు జల్సా చేస్తారు. తాగి తందనాలు ఆడుతూ ఆడపిల్లలతో కులుకుతారు. అంతేకాదు ఆ పాపపు సొమ్ము, డ్రగ్స్, స్మగ్లింగ్, బెల్ట్ షాప్ లకు సారా సరఫరా, నకిలీ నోట్ల చలామణి, సినిమా పరిశ్రమలో పెట్టుబడి, మొదలగు చీకటి వ్యాపారాలకు మళ్లించి తమ నేర సామ్రాజ్య విస్తరణకు పాటు పడతారు.

ఆ చీకటి సామ్రాజ్యంలో బాస్ ఒక పావు మాత్రమే. అతనిపైన రాజకీయ నాయకుల అండదండలున్న మాఫియా ముఠా ఉంటుంది. ఆ ముఠా, మన దేశం నుంచి పొరుగుదేశం పారిపోయిన ఓ డాన్, కనుసన్నల్లో పనిచేస్తుంటుంది.

ఓరోజు ఐదేళ్ల అబ్బాయిని, ఏడేళ్ల అమ్మాయిని బాస్ ముందు నిలబెట్టారు. అబ్బాయికి కళ్లులేవు అమ్మాయికి ఒక కాలు లేదు. వారు అక్కా తమ్ముళ్లు. వారిపై కలెక్షన్ తక్కువని అభియోగం. వాళ్ళని చూడగానే బాస్ భృకుటి ముడిపడింది. వారిలో ఏవో పరిచితుల పోలికలు కనబడ్డాయి. ఎవరి పోలికలా? అని బాస్ కాసేపు నుదురు కొట్టుకున్నాడు. ఆ తర్వాత ఉలిక్కిపడ్డాడు. లేదు. అలా జరిగే అవకాశం లేదు. తనలో తనే గొణుక్కున్నాడు. రెండు నిముషాలు మౌనంగా ఉన్నాడతను. ఆ తర్వాత మనసును దృఢపరచు కొని..

“ఏ ఊరు మీది?” ఎంత కఠినంగా అందామన్నా, మాటలు మృదువుగా వచ్చాయి.

“హైదరాబాద్” భయపడుతూ చెప్పాడు అబ్బాయి.

“హైదరాబాదులో ఎక్కడ ఉండేవారు? మీ తల్లిదండ్రులెవరు?”

అమ్మాయి చెప్పింది. అది వినగానే బాస్ అవాక్కయ్యాడు. ‘వారు తన తమ్ముని పిల్లలు!’ ఎంత ఘోరం జరిగింది? తెలియకుండానే అతని కళ్ళు చిప్పిళ్లాయి. పిల్లలను తీసుకెళ్ళమని తన అనుచరులకు సైగ చేశాడతను. బాస్ ఆజ్ఞను పాటించారు కానీ వారికి అయోమయంగా ఉంది. ఎన్నడూ లేనిది బాస్ కళ్ళలో నీళ్ళు! కఠినత్వం కురిపించే దృక్కుల్లో కారుణ్యపు ఛాయలు! అనుచరులు ఆశ్చర్యంగా చూస్తుండగా, బారెడు అడుగులు వేస్తూ బాస్ తన గదిలోకి వెళ్లి, తలుపులు మూసేసాడు.

తన గదిలో పడకపై పడ్డ బాస్‌లో అంతర్మథనం. 10 సంవత్సరాల క్రితం ఓ హత్య చేసి ఈ నగరానికి వచ్చిన తను, ఇక్కడి మాఫియా ముఠాలో చేరి, తన నేర సామ్రాజ్యం విస్తరించాడు. పొరుగు దేశానికి పారిపోయిన ఓ డాన్ కనుసన్నల్లో పని చేస్తూ, ఆ అక్రమ సంపాదనలో కొంత భాగం, దుబాయ్ మార్గంలో పొరుగు దేశంలో ఉన్న డాన్‌కు పంపిస్తూ వచ్చాడు. ఈ నగరపు ముష్టి మాఫియాకు కిరీటం లేని రాజయ్యాడు. ముగ్గురు పెళ్ళాలున్నా, తను మనసు పడ్డ యువతులతో రాసకేళిలో మునిగి తేలుతున్నాడు. తన పేరు వినగానే హడలిపోయే అనుచరులను చూసి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. కానీ ఇవ్వాళ? ఆ పిల్లలని చూడగానే హైదరాబాద్ లోని తన కుటుంబం, అతని కళ్ళముందు నిలిచింది. తన తమ్ముని దీనవదనం గుర్తుకు వచ్చింది. పిల్లలు తప్పిపోయినప్పుడు తన మరదలు ఎంత వేదన పడ్డదో, ఊహించడానికే కష్టంగా ఉంది. తన తల్లిదండ్రులు ఉన్నారో లేదో తెలీదు. తన వారు పడ్డ ఆరాటం, ఆవేదన, మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా పడి ఉంటారు కదా? అంటే? తను వందల కుటుంబాల్లో చిచ్చు పెట్టాడు. తనకు తెలియకుండానే, తన కుటుంబ సభ్యులు తన కిరాతకానికి బలైనప్పుడు ఎంత బాధ పడ్డారో అవగాహనకు వచ్చింది. ‘ఇదంతా చేసి, నేనేం మూట గట్టుకుంటున్నాను?’ తనకు తానే ప్రశ్నించుకున్నాడు బాస్. దినదినగండంగా గడిచే ఈ జీవితంలో, మృత్యువు ఎప్పుడు, ఎక్కడ పొంచి ఉందో తెలీదు. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి తను తాగి తందనాలాడుతూ ఆడవాళ్ళతో ఆడుకుంటున్నాడు. ‘ఛీ! నీది ఒక బతుకేనా’ అంది తన అంతరాత్మ. కానీ ఈ ఊబిలో నుంచి బయటపడటం ఎలా? తన పైనున్న వారి కబంధహస్తాల్లోంచి బయటపడడం అనుకున్నంత సులభం కాదు. రెండు మూడు రోజులు తన గదిలోంచి బయటికి రాకుండా మథన పడ్డాడు బాస్. అప్పుడు తన కుటుంబం, భార్యలు పిల్లలు జ్ఞప్తికి వచ్చారు.

ముష్టి మాఫియా కార్యకలాపాలు ఓ నమ్మకమైన అనుచరుడికి అప్పగించి, కొన్ని వందల కోట్ల మొత్తం తన ఖాతాలోకి మళ్లించి, కొన్ని లక్షల రొక్కంతో తన తావుకి ప్రయాణమయ్యాడు బాస్. బాసును చూసిన అతని భార్యల, పిల్లల ఆనందం వర్ణనాతీతం. ఆ నగరంలో బాస్ చాలా మర్యాదస్తుడు. పేరుపొందిన మోటర్ గ్యారేజ్ యజమాని. అతనికి ఐదు పడక గదుల బంగ్లా, ఓ పోష్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. అతని పిల్లలు కార్పొరేట్ స్కూల్లో, కాలేజీలో చదువుతారు. వారందరినీ కలిసి ఎన్నడూ లేనంత సంతోషపడ్డాడతను. అక్కడ తన తమ్ముడి పిల్లల గతి జ్ఞాపకం వచ్చింది. రేపు తన కంటే పవర్ఫుల్ గ్యాంగ్, తన విరోధులు తన సొంత పిల్లలను కిడ్నాప్ చేస్తే? ఆ ఆలోచనే దుర్భరంగా ఉంది. తన ఆవేదనని పెద్ద భార్యతో పంచుకున్నాడు బాస్. ఆమెకు మాత్రమే అతని చీకటి సామ్రాజ్యం గురించి తెలుసు. మిగతా ఇద్దరు భార్యలు తమ భర్త చాలా మర్యాదస్థుడు అనుకుంటారు. దేశ విదేశాల్లో వ్యాపార నిమిత్తం పర్యటిస్తారనేది, వారికి తెలిసిన సత్యం. ఏ రెండు మూడు నెలలకో తమ దగ్గరికి వచ్చినా, అతను తెచ్చిన కానుకలు, అతనిచ్చే శయ్యాసుఖం, ఆస్వాదించి మురిసిపోతారు. ఈసారి మాత్రం, అతనిలో మునుపటి చురుకుదనం లేదు. చిత్రంగా అతను తమ పెద్ద సవతితోనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు. మునుపు అయితే పగలు నడిపి భార్యను, రాత్రి చిన్న భార్యను, రస రాజ్యంలో ఓలలాడించేవాడు. భోజనం మాత్రం తన పెద్ద భార్యతో చేసేవాడు. ఎప్పుడో తప్ప రాత్రిళ్లు పెద్ద భార్యతో ఉండేవాడు కాదు. అయితే ఈసారి మాత్రం తమ పెద్ద సవతితోనే ఎక్కువ కాలం ఉంటున్నాడు, వారికి ఏదోలా ఉన్నా, తమ సౌఖ్యాలకు లోటు ఉండకపోవడంతో గమ్మున ఉన్నారు. తన కుటుంబంతో కొన్ని రోజులులుండి, అక్కడి నుండి బయలు దేరాడు బాస్. అయితే అతను తిరిగి తన చీకటి సామ్రాజ్యానికి వెళ్లలేదు. బాస్ తన కుటుంబంతో ఉన్నాడని ముష్టి ముఠా, తమ భర్త వ్యాపార పర్యటనలో ఉన్నాడని, అతని భార్యలు అనుకున్నారు. కొత్త సిమ్, కొత్త మొబైల్ తీసుకున్నాడు. పాత మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు. తాను మాట్లాడాలను కున్నప్పుడు మాత్రమే పాత మొబైల్ వాడే వాడు. ఆ తర్వాత స్విచాఫ్. పాత మాఫియా ముఠా సభ్యులతో సంబంధాలు, విదేశంలో ఉన్న డాన్‌తో అనుబంధం తెంచేశాడు. వారు బాస్ కొరకు దేశం నలుమూలలా గాలించారు. కాని బాస్ ఆచూకీ తెలియలేదు.

బాస్ తమను తప్పించుకుని తిరుగుతున్నాడు అని తెలియగానే పొరుగు దేశంలో ఉన్న డాన్, అతనిపై పై’ షూట్ ఎట్ సైట్’ ఉత్తర్వులు జారీ చేశాడు. వారు అలా ఉండగా ఇక్కడ బాస్, భారతదేశంలో మునిగి టిబెట్‌లో తేలాడు. అక్కడ దలైలామా అనుచరుల్లో కలిసిపోయాడు. అతని ముఖకవళికలు పూర్తిగా మారిపోయాయి. గడ్డం మీసం తీసేసి గుండు కొట్టించుకున్నాడు. కాషాయ వస్త్రాలు ధరించి బౌద్ధ భిక్షువుల జీవనశైలిని అలవరచుకున్నాడు. బౌద్ధ మత ప్రచారకుల ప్రసంగాలు వింటూ అంతర్ముఖుడు అయ్యాడు. ఓ బౌద్ధ బిక్షువు సత్యం, అహింస పై ప్రసంగిస్తూ ఇలా అన్నాడు. “బౌద్ధం, హిందూ మతం నుండి వేరు కాదు. ఒక విధంగా అది హిందూ మతం నుండి విస్తరించిన శాఖ మాత్రమే. గౌతమ బుద్ధుడు తన సూత్రాలు, హిందూ మతం నుండే స్వీకరించాడు. భగవద్గీత లోని సారాంశాన్ని బుద్ధుడు అవలంబించి, తన శిష్యులకు బోధించాడు.”

ఆ ప్రసంగం విన్న తర్వాత బాస్‌కు తన గత జీవితంపై రోత పుట్టింది. బాహ్యాడంబరం లేని బౌద్ధుల జీవనశైలిపై మక్కువ కలిగింది. ఆ బౌద్ధ మత ప్రచారకున్ని ఏకాంతంగా కలిసి తన గత జీవితం గురించి టూకీగా వివరించాడు. ఇక ముందు తాను చేయవలసిన పనుల గురించి మార్గదర్శనం చేయమని ప్రార్థించాడు. బాస్ బాధ విన్న ఆ బౌద్ధ మత గురువు, అతన్ని తన ఏకాంత మందిరానికి ఆహ్వానించాడు.

అక్కడ తన బోధన మొదలు పెట్టాడు.

“భగవద్గీత నాలుగో అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు. ‘అపి చేదసి పాపేభ్యాః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్రవవేనైన వృజినం సంతరిష్యసి’ అంటే నీవు పాపాత్ములందరిలో పాపిష్టుడవు అయినప్పటికీ దివ్య జ్ఞానం అనెడి పడవతో దుఃఖ సముద్రం పూర్తిగా తరించగలవు. మనుషులు గతంలో ఎన్ని పాపాలు చేసినా ఈ దివ్య జ్ఞానంతో పునీతులవుతారు. దానికి ఇంకో వైపు, గీతలోని తొమ్మిదవ అధ్యాయంలో మహాత్ముల గురించి ఇలా అంటాడు గీతాకారుడు ‘మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః భజ స్తనన్యమనసో జ్ఞాత్వా భూతాని మన్యయం’ అంటే భ్రాంత చిత్తులు కాని మహాత్ములు, నన్ను ఆద్యుడు, అనంతుడు, అయిన దేవదేవునిగా ఎరుగుదురు. అందుకని వారు భక్తియుక్త సేవలో నిమగ్నులై ఉందురు. నువ్వు కూడా ఆ భగవంతుని నమ్మినచో మానవ సేవలో తరించుము.

అలాగే నిత్యము భక్తితో కొలిచే మహాత్ముల గురించి శ్రీ కృష్ణ పరమాత్మ ఏమన్నాడో గమనించుము.

‘సతతం కీర్తయంతో మాం యతస్తశ్చ దృఢవ్రతాః సమస్యన్తస్య మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే’ అంటే ఎల్లప్పుడును నా వైభవంబులను కీర్తిస్తూ దృఢనిశ్చయంతో ప్రయత్నించుచు నా ముందు నమస్కరించుచు, ఆ మహాత్ములు నన్ను అనునిత్యమూ భక్తితో పూజింతురు. నువ్వు కూడా ఇప్పుడు, ఈ బుద్ధ దేవుని సన్నిధికి వచ్చావంటే నీలో రాక్షస ప్రవృత్తి అంత మైనట్టే. ఇలాగే సాధన చేస్తే నువ్వు కూడా మహాత్ముల కోవలోకి చేరే అవకాశం ఉంది.

ఇక బౌద్ధమతానికి వస్తే మహాయానంలో బుద్ధుడు అంటే ఒక వ్యక్తి కాడు. అది అనంతమైన ధర్మ రూపం. మహాయాన సూత్రాలలో బుద్ధుడు, ధర్మము, సంఘము అనే మూడు భావాలూ అవినాభావమైన శాశ్వతత్వానికి ప్రతీకలుగా చెప్పబడతాయి. శ్రవణం, మననం వంటి సాధనల ద్వారా కర్మ బంధాలనుండి విముక్తి కలుగ వచ్చునని మహాయానంలో ఉంది. నువ్వు శ్రవణంలో అడుగిడావు. ఇక్కడ విన్నవన్నీ మననం చేయడం ద్వారా నీకు కర్మబంధాల విముక్తి మార్గం అవగతమవుతుంది. ఆ తర్వాత నువ్వు బౌద్ధమతం లోని నాలుగు పరమ సత్యాలూ తెలుసుకుంటావు. ఆ సత్యాలు దుఃఖము, దుఃఖానికి కారణం, దుఃఖం నుండి విముక్తి, ఆ తర్వాత జీవన ముక్తి పొందే మార్గం కనుక్కుంటావు. నీలో, నీ గత జీవితంపై పశ్చాత్తాపం చెందుతున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. అది శుభ సూచకం. ఇలాగే ఇంకో ఆరు నెలలు ఇక్కడ సాధన చెయ్యి. అప్పుడు నీకు భవిష్యత్ కార్యాచరణ స్పష్టమవుతుంది. ఏ సందేహాలున్నా, నన్ను సంప్రదించుము. నాకు తోచిన బోధనలు, సూచనలు చేయగలను. నేటి నుండి నీ పేరు ‘పావనం’. నీకు శుభం కలుగుగాక.” అని దీవించాడు ఆ బౌద్ధ మత గురువు.

తన గదిలోకి వచ్చిన పావనంలో మళ్ళీ అంతర్మథనం మొదలైంది. తమ మత ప్రచారకుల్లోని, బౌద్ధ మత ప్రచారకుల్లోని భేదాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. తమ మత పెద్దలు ఇతర మతస్థుల పై ద్వేషం రగిలిస్తే, బౌద్ధ మత ప్రచారకులు అందరిపై తమ ప్రేమను పంచుతారు. తనలాంటి పాపులను కూడా అక్కున చేర్చుకుని వారిని సన్మార్గంలో నడిపిస్తారు. తాను మహాత్మునిగా మారకపోయినా పర్వాలేదు కానీ, కనీసం ఒక మనిషిగా మారాలి, అని గట్టిగా అనుకున్నాడు పావనం.

అలాగే తన గత పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు అతని మనసులో మెదిలిన పేరు ‘దివ్యాంగ్ నికేతన్’ అవును. తన వల్ల వికలాంగులైన పిల్లలకు పునరావాసం కల్పించాలి. అంగవైకల్యం ఉన్న పిల్లలను చేరదీసి, వారికి చదువు సంధ్యలు నేర్పించాలి. వివిధ వృత్తుల్లో శిక్షణ ఇచ్చి, వారు తమ కాళ్ళపై తాము నిలబడేలా చేయాలి. తన ప్రాయశ్చిత్తానికి ప్రాతిపదిక ఏర్పడగానే, ఆ దిశగా పావులు కలిపాడు పావనం.

అతను బీహార్ రాష్ట్రంలోని బోధ గయ ప్రాంతం చేరి అక్కడ ఇరవై ఐదు ఎకరాల భూమి కొన్నాడు.

మహాబోధి మందిరం స్థావరమైన ఆ ప్రాంతంలో అతనికి సాంత్వన లభించింది. తానున్న మునుపటి ప్రాంతాలకు దూరంగా బోధ గయలో అయితే, తన పథకాలు విజయవంతం అవుతాయి అని భావించాడతను. తనకు నమ్మకస్తుడైన అనుచరులను, పాత ఫోన్లో సంప్రదించి, వారిని బోధ గయకు రప్పించుకున్నాడు. వారికి బౌద్ధ మత ప్రచారకుల ప్రసంగాలు వినిపించి వారిని కూడా బౌద్ధమతానికి అనుకూలంగా మార్చాడు. ఆ తర్వాత స్థానిక సేవకులను, బౌద్ధ మతస్తులు కూడగట్టి తన కలల ‘దివ్యాంగ్ నికేతన్’ కు భూమి పూజ చేశాడు.

రెండేళ్లలో అక్కడ ఐదు వందల మంది దివ్యాంగులు ఉండేలా, విద్యాలయాలు, కాలేజీలు, వృత్తి విద్యా బోధనాలయాలు, అధ్యాపకులకు, విద్యార్థులకు వసతి గృహాలు ఏర్పడ్డాయి. అలాగే పార్కులు ఆరామాలు కూడా ఏర్పాటు చేశాడు పావనం. క్రమక్రమంగా తన వల్ల యాచకులైన పిల్లలకు అక్కడ ఆశ్రయం కల్పించాడు. అంతేకాదు దేశంలోని వివిధ నగరాల్లో ముష్టి మాఫియా బారినపడ్డ దివ్యాంగులకు విడతలవారీగా చేర్చుకోవడానికి ఏర్పాట్లు జరిగాయి. అలా ఆ పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది రాయి పడింది.

పూర్వాశ్రమంలోని కొందరు ‘ముఠామేస్త్రి’లు అతని దారికి అడ్డం వచ్చారు. వారిలో కొందరిని పావనం, తనదైన శైలిలో తొలగించి, కొందరిని తన మార్గంలోకి మళ్ళించి తన ప్రయాణం సుగమం చేసుకున్నాడు. సన్మార్గం పట్టిన అతన్ని ఆ దేవదేవుడే కాపాడాడు.

బోధగయ లోని పనులు ఓ కొలిక్కి రాగానే, తన కుటుంబాన్ని కలవడానికి వెళ్లాడు పావనం. అతని ఆకారం, ఆహార్యం చూసి, వారంతా ముక్కున వేలేసుకున్నారు. కొందరు హర్షిస్తే, కొందరు దూషించారు. అతని పెద్ద భార్య మాత్రం తన భర్త మార్గాన్ని ఆమోదించి, బోధగయ వెళ్లడానికి ఒప్పుకుంది. మిగతా ఇద్దరు భార్యలు, వారి పిల్లలు తమ సౌకర్యవంతమైన జీవన శైలిని వదిలి రావడానికి ఒప్పుకోలేదు. తన పెద్ద భార్య పిల్లల్ని కార్పొరేట్ రెసిడెన్షియల్ కాలేజీలో చేర్పించి, పావనం, అతని పెద్ద భార్య, బుద్ధ గయకు ప్రయాణమయ్యారు.

పావనం ఆశయం విజయవంతం కావడానికి ఆ సర్వేశ్వరుడు తోడ్పడ్డాడు. ‘దివ్యాంగ్ నికేతన్’ తలెత్తుకుని నిలబడింది. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్చామి, శబ్దాలు ఆ ప్రాంగణంలోని ప్రార్థనాలయం నుండి వినబడసాగాయి.

Exit mobile version