(ఇటీవల గురుపూర్ణిమ సందర్భంగా కురువపురం సందర్శించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.)
“దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలమ్
ప్రసన్నార్తిహరం వందే, స్మర్తృగామీ సనోవతు”
[dropcap]అ[/dropcap]నసూయాత్రి సంభూతుడు, దిగంబరుడు, భవసంకటముల నుండి ఉద్ధరించేవాడు ఐన శ్రీ దత్తాత్రేయ ప్రభువు అత్యంత మహిమాన్వితుడు. ఆ గురు పరంపరలోని వారే శ్రీపాద శ్రీవల్లభస్వామి, నృసింహ సరస్వతి, మాణిక్యప్రభు మహరాజ్, అక్కల్‍కోట్ మహారాజ్, శిరిడీ సాయిబాబా మొదలగువారు.
3 జూలై 2023న గురుపూర్ణిమ సందర్భంగా, కర్నాటక రాష్ట్రం, రాయచూరు జిల్లాలోని ‘కురువపురం’ అనే దత్తక్షేత్రానికి వెళ్ళి, అక్కడ శ్రీపాదశ్రీవల్లభ పాదుకాదర్శనం చేసుకునే అదృష్టం కలిగింది. మహారాష్ట్ర లోని గాణుగాపూర్, ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం, కర్నాటకలోని ఈ కురువపురం ప్రసిద్ధ దత్తక్షేత్రాలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశతో జన్మించినవారు శ్రీ దత్తాత్రేయ అవధూత. అత్రి మహాముని, అనసూయ దంపతుల కుమారుడు. ఆయన అంశతోనే పైన పేర్కొన్న గురువర్యులు జన్మించి, తమ బోధనలతో ప్రజలను జాగృతం చేశారు.
కురువపురం హైదరాబాదుకు చాలా దగ్గర. జడ్చర్ల, మహబూబ్‌నగర్ మీదుగా రాయచూరు వెళ్ళే టి.ఎస్.; కె.ఎస్.ఆర్.టి.సి. బస్సులు ఎం.జి.బి.ఎస్. బస్టాండులో ప్రతి ఇరవై నిమిషాలకు ఒకటి బయలుదేరుతాయి. మనం రాయచూరుకు 40 కిలోమీటర్ల ఇవతలే ‘మక్తల్’ అన్న ఊరిలో దిగిపోవాలి. హైదరాబాద్ నుండి మక్తల్ ఇంచుమించు 160 కిలోమీటర్లు ఉంటుంది. ఆర్.టి.సి. బస్సు ఛార్జి 230 రూపాయలు.
మక్తల్ నుంచి కురువపురానికి కేవలం ఆటోలు మాత్రమే లభ్యమవుతాయి. అక్కడి నుండి 22 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కృష్ణానది ఒడ్డున మనల్ని డ్రాప్ చేయడానికి మూడు వందలు తీసుకుంటారు ఆటోవాళ్ళు. ఇదంతా దిగువ మధ్యతరగతి వారికి! కారున్న మారాజులకు ఈ అవస్థ అంతా ఉండదు. డైరక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. కృష్ణ ఒడ్డున కార్ పార్కింగ్ ఉంది.
మక్తల్ తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. కురువపురం క్షేత్రం కర్నాటక. రెండింటినీ కృష్ణమ్మ వేరు చేస్తూ పారుతుంది. మక్తల్‍లో, హనుమాన్ సెంటర్ వద్ద లింగయతుల హోటల్ ఒకటుంది. దానిలో ఉగ్గాని, మిర్చి బజ్జీ తిని తీరాల్సిందే. అంత బాగుంటుంది టిఫిన్. తర్వాత పూరీ కూడా అమేజింగ్‍గా ఉంటుంది. మన హైదరాబాద్‍లో లాగా మైదాతో చేయకుండా, ప్యూర్ గోధుమ పిండితో చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఈ తిండి గోల ఏమిట్రా, ఈయనకు అనుకుంటున్నారా? ‘ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు’ కదా! భోజనం మాత్రం కృష్ణకి ఇరువైపులా ఉన్న సంస్థానాలలో, అన్నదాన వితరణ ద్వారా దొరుకుతుంది. అది దత్త ప్రసాదం.
కృష్ణానదికి ఇటువైపున్న క్షేత్రాన్ని ‘వల్లాభాపురం’ అంటారు. జగద్గురు శ్రీ శ్రీ శ్రీ దత్తాత్రేయ స్వామి మహా సంస్థాన పీఠం, శ్రీ క్షేత్ర శ్రీ వల్లభాపురము. కురువపురాన్ని కురుగడ్డ అని కూడా అంటారు.
ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ యతీంద్రులు సజీవంగా నడయాడారు. ‘గురుచరిత్ర’ గ్రంథములో ఈ క్షేత్ర ప్రాశస్త్యము వివరించబడినది. స్వామి వారు ఎన్నో లీలలు, మహిమలు చూపారు ఇక్కడ. శంకర్ భట్ గారు రాసిన ‘శ్రీపాద చరిత్ర’ అను గ్రంథాన్ని శ్రీ మల్లాది దీక్షితులు గారు తెలుగులోనికి అనువదించారు. ‘సంక్షిప్త శ్రీపాద శ్రీవల్లభ చరిత్రామృతం’ అన్న పారాయణ గ్రంథాన్ని శ్రీమతి ప్రసన్నకుమారి గారు తెలుగులో వ్రాశారు. దత్త భక్తులు పారాయణము చేసుకోవడానికి ఎంతో అనువైన పుస్తకమిది. క్షేత్రం వారి వెబ్‍సైట్ www.sripadavallabha.org
దత్తాత్రేయుని సంపూర్ణ అంశ శ్రీపాద శ్రీవల్లభులు. స్వామి సమర్థ కూడా ఈ పరంపరలోని వారే. శ్రీపాదరాజు క్రీ.శ. 1320లో జన్మించారు. 1351లో అదృశ్యమయ్యారు. పిఠాపురం (ఎ.పి.)లో కూడా వారి పీఠం ఉంది. అది వేణుగోపాలస్వామి గుడి వీధిలో ఉంటుంది. పిఠాపురం విజయవాడ – విశాఖ రైల్వే మార్గంలో ఉంది. అన్నవరం క్షేత్రానికి కేవలం నలభై నిమిషాల ప్రయాణం. గోదావరి, సింహాద్రి, రత్నాచల్, జన్మభుమి వంటి రైళ్ళన్నీ పిఠాపురంలో ఆగుతాయి. ఆగని రైళ్ళల్లో వెళ్ళినవారు సామర్లకోటలో దిగితే పిఠాపురానికి కేవలం ఇరవై నిమిషాలలో చేరుకోవచ్చు, రోడ్డు మార్గంలో. అక్కడ తుని రోడ్డులో, ఊరి బయట శ్రీ గణపతి సచ్చిదానందస్వామి వారు ఇంకో దత్త పీఠాన్ని నెలకొల్పారు. అది సువిశాలంగా, సుమనోరంగా ఉంటుంది. కానీ అసలు సంస్థానం ఊరిలోనిదే. శ్రీవల్లభులు జన్మించిన ప్రదేశం పిఠాపురమే. ఆయన పూర్వీకులు గుంటూరు జిల్లా మలయాద్రి గ్రామానికి చెందినవారు. మల్లాది బాపన్న అవధానులు శ్రీపాదుల వారి మాతామహులు. వారిది హరితస గోత్రము. బాపన్న గారి ధర్మపత్ని రాజమాంబ గారు కూడా విదుషీమణి. ఆయన సోదరులు మల్లాది శ్రీధర అవధాన్లు.
ఒకసారి ఈ అన్నదమ్ములు ఇరువురూ గోదావరి మండలంలోని ‘అయినవిల్లి’ అనే గ్రామంలో ఒక యజ్ఞం చేశారు. పూర్ణాహుతి సమయంలో సాక్షాత్తు విఘ్నేశ్వరుల వారు ప్రత్యక్షమై, తన తొండముతో పూర్ణాహుతిని స్వీకరించారని ఐతిహ్యం. తాను గణేశ చతుర్ధి నాడు శ్రీపాద శ్రీవల్లభునిగా జన్మిస్తానని గణపతి చెప్పారట.
శ్రీపాదులవారు తమ 16వ ఏట సన్యాసం స్వీకరించారని తెలుస్తున్నది. వారు భౌతికంగా తమ 30వ సంవత్సరం వరకే ఉన్నారు. తమ జీవితంలో వారు వారణాసి, బదరికాశ్రమం, గోకర్ణం, శ్రీశైలం, కురువపురంలను సందర్శించినారు. కురువపురంలోనే ఎక్కువ కాలము గడిపినారు. ఆయన చిరంజీవి. ఆయన కృష్ణానదిలోనే ‘జలసమాధి’ చెందినారు. కానీ తేజోరూపంలో ఆయన భక్తులను ఇంకా అనుగ్రహిస్తున్నారనడానికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి.
నదికటు వైపు ఉన్న శ్రీపాద శ్రీవల్లభ ఆశ్రమం నుండి, ఇటు వైపున ఉన్న వల్లభాపురానికి స్వామి కృష్ణానదిపై నడుచుకుంటూ వచ్చేవారని ఐతిహ్యం. ఆశ్రమం ఉన్న ప్రాంతం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. దానిని ‘పంచదేవ హపాడ్’ అని అంటారు. ఇంచుమించు కృష్ణానదిలో ఒక ద్వీపం అది అని చెప్పవచ్చు.
శ్రీపాద యొగి అదృశ్యులైన అనంతరం, వల్లభేశుడనే బ్రాహ్మణుడు, తనకు సరైన జీవనోపాధి దొరికి, అధిక ఆదాయం సమకూరితే, వెయ్యి మందికి అన్నదానం చేస్తానని మొక్కుకున్నాడు. కానీ కురువపురం సమీపంలో, బందిపోటు దొంగలు ఆయనపై దాడి చేసి, ఆయనను దోచుకుని, తల నరికితే, శ్రీపాద శ్రీవల్లభ యోగి అకస్మాత్తుగా ప్రత్యక్షమై, తన త్రిశూలంతో దొంగలని వధించి, వల్లభేశుని కాపాడారు. దొంగల్లో ఒకడు, శివుడనే వాడు స్వామిని వేడుకుంటే, వాడిని వదిలేశారట స్వామి. వాడితోనే వల్లభేశుని శిరస్సును మళ్ళీ మొండానికి అతికింపజేసి, అతనిని పునర్జీవితుని చేశారట.
ఈ వల్లభేశుడు ఆర్.ఎస్.ఎస్. స్థాపకుడైన కె.బి.హెగ్డేవార్ వంశానికి మూలపురుషుడని చెబుతారు. హెగ్డేవార్ తొమ్మిదవ తరానికి చెందినవారు.
కురువుపురాన్ని ‘కర్మభూమి’ అని పిలుస్తారు. అక్కడ ప్రశాంత సుందరమైన వాతావరణం నెలకొని ఉంటుంది.
వల్లభాపురం నుంచి కృష్ణను దాటడానికి ఒకప్పుడు పుట్టీలు, తెప్పలు ఉండేవి. ఇప్పుడు పైబర్ మోటారు బొట్లు వచ్చేశాయి. అందులో నదిని దాటించటానికి ఒక్కో మనిషికి రూ.50/- తీసుకుంటారు. చుట్టూ కొండలు, పచ్చని చెట్లు కనువిందు చేస్తాయి. నదిలోని బండరాళ్ళను అవాయిడ్ చేస్తూ, మోటారు బోట్లు లోతుగా ఉన్నచోట ప్రయాణిస్తాయి. తెప్పల కాలం నుంచి ఇప్పటి వరకు నదిలో పడవలు బోల్తా పడిన సంఘటలు జరుగలేదు. అవతలి ఒడ్డుకు చేరడానికి పన్నెండు నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది. ఆ పడవ ప్రయాణం అద్భుతమైన అనుభవం. ప్రకృతితో మనలను మమైక్యం చేస్తుంది.
అవతలి ఒడ్డున దిగింతర్వాత నది గట్టు చాలా ఎత్తుగా ఉంటుంది. అది ఎక్కిన వెంటనే సంస్థానం ముఖద్వారం దర్శనమిస్తుంది. కొన్ని మెట్లు కూడా ఎక్కాలి.
ముఖ ద్వారం పక్కన ఒక సాధువు, చిన్న కొట్టంలో ఉగ్గాని చేసి, అందరికీ ఉచితంగా, ఆకు దొన్నెలో ప్రసాదం ఇస్తూంటాడు. తల అంతా జటలు కట్టి, సాక్షాత్తు శివస్వరూపుడిలా ఉంటాడాయాన. ఏమీ మాట్లాడడు. కేవలం మందహాసం చేస్తూ ఉంటాడు. అలౌకికమైన ఆనందం (bliss) ఆయన సొంతం.
ముఖ ద్వారం నుంచి ఆలయ శిఖరం గోచరమవుతుంది. ద్వారం మీద ‘శ్రీపాద శ్రీవల్లభ శ్రీక్షేత్ర కురువపుర’ అని హిందీలో రాసి ఉంటుంది.
లోపలికి వెళ్తూనే, మహా వృక్షంగా పెరిగి విస్తరించిన ఔదుంబర (మేడి) వృక్షం ఉంతుంది. దాని వెనుక స్వామి వారి మందిరం. పురాతన స్తంభాలు మందిరమునకు ఊతగా ఉంటాయి. చుట్టూ గ్రిల్స్ వేశారు.
అంతరాలయంలోకి భక్తులకు అనుమతి ఉంది. కానీ సంప్రదాయ దుస్తులతో, అంతే ధోతి, కండువాలతో మాత్రమే. విశేషమేమంటే అవి వెంట మనము తెచ్చుకోకపోయినా ఇబ్బంది లేదు. సంస్థానము వారే, గుడి బయట వాటిని మనకు ఇస్తారు. వాటిని ధరించి, స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ వాటిని తిరిగి ఇవ్వవచ్చు.
అంతరాలయంలో ఎదుట దత్తాత్రేయ స్వామి వారు, పక్కన శ్రీపాద యోగి దర్శనమిస్తారు. మూలవిరాట్టు కుడివైపున ఒక చిన్న ఆలయంలో ఉంటారు. అక్కడ ఆయన పాదుకలుంటాయి. అవే అత్యంత ప్రధానమైనవి. వాటిమీద పంచలోహములతో చేసిన శ్రీపాద శ్రీవల్లభుల, ఇంచుమించు, మూడడుగుల విగ్రహం కాంతులీనుతుంటుంది. స్వామి వారి వదనం ప్రశాంతంగా, వైరాగ్య శేముషిని ప్రతిఫలిస్తూ ఉంటుంది.
ఆలయానికి ఎడమ వైపు, పురాతన స్తంభాలతో నిర్మించిన పొడవైన మంటపం ఉంది. అందులో భక్తులు కూర్చుని పారాయణ గ్రంథాలను పఠిస్తూ ఉంటారు. మంటపం చివర సంస్థానం కార్యాలయం ఉంది.
ఔదుంబర మహావృక్షానికి కుడివైపున మరో మేడి చెట్టు చిన్నది ఉంది. దాని చుట్టూ రెయిలింగ్ ఏర్పాటు చేసారు. చెట్టు మొదట్లో స్వామివారి పాదుకలు నల్లరాతితో చేసినవి ప్రతిష్ఠించారు. రెయిలింగ్ బయటి నుంచే పాదుకలకు నమస్కరించుకోవాలి.
స్వామివారికి ఉదయం అభిషేకం, కాకడ హారతి వంటి పూజలు నిర్వహిస్తారు. పల్లకీ సేవ ఉంది. బయటి ఆవరణలో మీడియం సైజు వెండి రథం ఉంది. రథోత్సవం విశేష దినాల్లో నిర్వహిస్తారు.
సంస్థానం ముఖద్వారానికి కుడివైపున, నది గట్టున అన్నదానశాల ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుండి అక్కడ భక్తులకు భోజనం లభిస్తుంది.
ఆ ప్రశాంతతను వదిలి రావాలనిపించదు మనకు. ఒకరోజు స్వామి సన్నిధిలో నిద్ర చేద్దామని, కార్యాలయంలో విచారిస్తే, రూమ్ ఉందన్నారు. ఒక సహాయకుడు నాతో వచ్చి గది చూపాడు. అది చూసి నిరుత్సాహపడ్డాను. కారణం, అందులో మంచం గాని, ఫ్యాన్ గాని లేవు. బాత్‍రూం లేదు. భూశయనమే. ఒక్క చాప మాత్రం ఉంది. కఠినమైన దీక్షలు చేసే భక్తులు అక్కడ ఉండగలరు, నాలాంటి వాడికి సాధ్యం కాదు. సహాయకుడికి సారీ చెప్పాను. ఆయన “మీరు అటువైపు వల్లభాపురంలో బస చేయండి. అక్కడ మంచి రూమ్‍లు ఆధునిక వసతులతో ఉన్నాయి” అని సూచించారు.
ఒక అరగంట ఆలయం బయట అరుగు మీద కూర్చున్నాను. వెళ్ళి, గట్టు దిగి, మళ్ళీ బోటు ఎక్కాను. మరొకసారి కృష్ణమ్మ అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణించి, అవతలి ఒడ్డు చేరుకున్నాను.
వల్లభాపురం సంస్థానానికి వెళ్ళి రూము కావాలని అడిగాను. ‘ముందురోజు గురుపూర్ణిమ కోసం వచ్చిన భక్తులు ఇంకా ఖాళీ చేయలేదనీ, ఒక గంట వెయిట్ చేయమ’నీ అక్కడి మేనేజర్ గారు సలహా ఇచ్చారు. ఈలోపు సంస్థానంలో మందిరాలు అన్నీ చూసి రమ్మని చెప్పారు.
సంస్థానం ఆవరణ, చక్కని స్తంభాలతో కూడిన కళాకృతులతో అలరారుతోంది. ‘జగద్గురు శ్రీ శ్రీ శ్రీ దత్తాత్రేయ స్వామి మహా సంస్థాన పీఠము, శ్రీక్షేత్ర శ్రీవల్లభాపురం’ అన్న అక్షరాలు వరండా అటు నుంచి ఇటు వరకూ వ్యాపించి ఉన్నాయి. ఆఫీసు ప్రక్కన ఆరుబయట శిరీడీ సాయిబాబా విగ్రహం ఒకటి వేదిక మీద ఉంది. దాని ముందు ఒక మెత్తలు పరిచిన ఉయ్యాలలో పీఠాధిపతి, ఇతర యోగుల ఫోటోలున్నాయి. సాయిబాబా వారిని దర్శించుకున్నాను.
ప్రధాన మందిరం మూడు అంతస్తులుగా ఉంది. మొదటి అంతస్తులో అనఘా దేవి అమ్మవారు, రెండవ అంతస్తులో శ్రీపాద శ్రీవల్లభులు, మూడవ అంతస్తులో దత్తాత్రేయ స్వామి వారల మందిరాలున్నాయి. అన్నీ నిరాడంబరంగా, సుందరంగా ఉన్నాయి. మొత్తం మెట్లు ఎక్కి పోవలసిందే. మెల్లగా ఎక్కి అన్ని మందిరాలను దర్శించుకున్నాను. సంస్థానం ప్రధాన ద్వారం (ఆర్చి) చాలా కళాత్మకంగా తీర్చిదిద్దారు. మధ్యలో శ్రీమన్నారాయణుడు, ప్రక్కన జయవిజయులు. బయట నాగప్రతిష్ఠ చేశారు. నాగాలయం చుట్టూ స్తంభాల మీద సర్పాకృతులను చెక్కారు.
మందిరం వెనుక ఒక అతి విశాలమైన హాలు నిర్మించారు. దాని చుట్టూ వినాయకుడు, ఆంజనేయుడు, శివపార్వతులు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి లాంటి వారల నిలువెత్తు విగ్రహాలను సర్వాంగ సుందరంగా నిలబెట్టారు. మా నరసింహుని అక్కడ చూసి మహదానందం కలిగింది. స్వామికి భక్తితో ప్రణమిల్లాను.
హాలులో ఒక ఆలయం ఉంది. అందులో వెనుక వైపు పాలరాతితో చేసిన మనోహర సుందర దత్తాత్రేయ విగ్రహం ఉంది. పక్కన త్రిశూలం. విశేషమేమిటంటే విగ్రహం ముందు ఒక వేదికపై చదునుగా ఉన్న ఒక శిల ప్రతిష్ఠించబడి ఉంది. దాని మీద ‘త్రిశూలపు ముద్ర’ ఉంది. ‘అది కృష్ణానదిలో దొరికిందనీ, అక్కడే శ్రీపాద శ్రీవల్లభ యోగి జలైక్యం పొందార’నీ అక్కడి అర్చకుల వారు చెప్పారు.
అంతా తిరిగి చూడడానికి గంట పట్టింది. వెళ్ళి మేనేజరు గారికి రూమ్ కోసం అడిగితే “ఎవరూ ఖాళీ చేయలేదండీ, సారీ!” అని చెప్పారు. సరే, చేసేదేంముంది? బయట ఆటోలేవీ లేవు. ఉదయం నన్ను డ్రాప్ చేసిన ఆటో డ్రైవర్ నెంబరు తీసుకుని ఉండడం మంచిదైంది. అతనికి ఫోన్ చేస్తే అరగంటలో వస్తానన్నాడు. అప్పుడు 12 గంటలయింది. ఈలోపు స్వామి వారి అన్నప్రసాదం తీసుకున్నాను. ఆటోలో మక్తల్‌కు వెళ్ళి, అక్కడ హైదరాబద్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి, మూడున్నర గంటల్లో ఆరామ్‍ఘర్ దగ్గర దిగి, 300 నంబర్ సిటీ బస్‍లో ఎల్.బి.నగర్ చేరి, అక్కడి నుంది ఊబర్ ఆటోలో వనస్థలిపురం లోని మా యిల్లు చేరాను.
కురువపురం శ్రీ దత్తాత్రేయస్వామి సంస్థానం, వల్లభాపురం సంస్థానాల దర్శనం ఒక పవిత్రమైన, ప్రశాంతమైన, అలౌకికమైన అనుభూతిని యిస్తుంది. కానీ కనీసం ఒక్క రాత్రి స్వామి వారి సన్నిధిలో బస చేస్తే చాలా బాగుంటుంది. చక్కగా కృష్ణానదిలో స్నానం చెయ్యవచ్చు. స్వామివారికి జరిగే పూజలు, సేవలు చూడవచ్చు. అప్పటికప్పుడు రూములు దొరకవు. సంచిక పాఠకుల సౌకర్యార్థం కార్యాలయంలో వివరాలు తీసుకున్నాను. వారికి నాలుగు రోజులు ముందుగా ఫోన్ చేస్తే, రూమ్ రిజర్వ్ చేసి ఉంచుతారు. నాన్ ఏసి రోజులు 600/-; ఏసి రోజుకి 1000 రూపాయలు.
వారి వివరాలు:
శ్రీ కె. రామలింగారెడ్డి గారు
కార్యదర్శి
శ్రీశ్రీశ్రీ జగద్గురు దత్తాత్రేయ స్వామి మహా సంస్థానం,
కురువపురం
ఫోన్:
09440052232
09490959939
Email: ramalingareddy.kota@gmail.com
జయ గురుదత్త!
శ్రీపాద శ్రీవల్లభ మహారాజ్ కీ జై!