[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘దివ్యజ్ఞానం’ అనే రచనని అందిస్తున్నాము.]
శ్లో:
అపి చేదసి పాపేభ్య సర్వేభ్యః పాపకృతమః।
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి৷৷
(భగవద్గీత వ అధ్యాయం, 36వ శ్లోకం)
[dropcap]ఓ[/dropcap] అర్జునా, ఒకవేళ నీవు పాపులందరిలోనూ పరమ పాపునిగా భావించినా కూడా దివ్యజ్ఞానం అనే పడవను అధిరోహించినట్లయితే నీ పాపాలన్నీ కడిగివేయబడి నువ్వు అతి దుర్లభమైన దుఖః సముద్రాన్ని అవలీలగా దాటగలవు అని పై శ్లోకం అంతరార్థం.
ఆధ్యాత్మిక దివ్యజ్ఞానం ఈ భౌతిక భవ సాగరాన్ని దాటటానికి ఒక పడవని ఇస్తుంది. అవివేకులు కర్మలు చేసి వాటి బంధములలో చిక్కుకుంటారు. అవే కర్మలను భగవత్ యజ్ఞముగా చేయటం ద్వారా జ్ఞానులు ముక్తి సాధిస్తారు. ఈ విధంగా, జ్ఞానం అనేది భౌతిక బంధాలను త్రుంచివేయటానికి సహకరిస్తుంది అని భగవానుడు స్పష్టం చేస్తున్నాడు.
ఆధ్యాత్మికత అంటే తనను తాను తెలుసుకోవడం, తనను తాను అర్థం చేసుకోవడం మరియు తనను తాను గ్రహించడం. స్థూలంగా భగవాన్ రమణ మహర్షి చెప్పినట్లు తానెవరో అన్న తత్వ విచారణ చేయడం. తన ఎరుకను అర్థం చేసుకోవడం. ఆధ్యాత్మిక మార్గం మాత్రమే శాంతి మరియు సంతృప్తిని ఇస్తుందని మొదట అర్థం చేసుకోవడం ముఖ్యం. మన మనస్సు మనకు శత్రువు అని ముందుగా గ్రహించి దానిని నియంత్రించుకోవాలి. మనస్సు నియంత్రణ తర్వాత మన వేదాలు, ఉపనిషత్తులు ఇచ్చిన దివ్యజ్ఞానాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి, సమర్ధుడైన సద్గురువును ఆశ్రయించడం ద్వారా ఈ ప్రయత్నం సులభ సాధ్యం అవుతుంది.
దివ్యజ్ఞానం లో మొదటిది అసి తత్ త్వం అసి అంటే నువ్వు ఆయనవి. జీవితకాల వ్యవధిలో ఈ మంత్రాన్ని నిరంతరం ధ్యానించడంతో, జ్ఞాని యొక్క మనస్సు ఈ లోతైన విశ్వాసాన్ని పెంపొందించుకుంటుంది. భగవంతునికి మనకు బేధం లేదని మనకు అవగతం అవుతుంది.
రెండవది అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మను లేదా మరో మాటలో చెప్పాలంటే నేను (ఆత్మ) పరమాత్మ నుండి భిన్నం కాదు. వేదాల ప్రకారం “నేను సర్వోన్నత భగవంతునిలో ఒక భాగాన్ని” అని ఈ పదం చెబుతోంది.
ఇక మూదవది ఏకో బ్రహ్మ ద్వితీయో నాస్తి – అంటే ఈ సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మను మించిన అస్తిత్వం లేదు. అనేక జీవితకాల నిరంతర అభ్యాసం ద్వారా జ్ఞాని ద్వంద్వత్వం లేని నమ్మకం సంపాదించుకుంటాడు..
ఈ భావనలో ప్రావీణ్యం పొందిన తర్వాత, అతను సమాధి దశకు చేరుకుంటాడు, దానిలో అతని ధ్యానం చాలా లోతుగా మారుతుంది, తద్వారా అతను తన గురించి మరచిపోతాడు.
అమూల్యమైన, వెలకట్టలేని జ్ఞానాన్ని ఎవరికైనా కేవలం తెలియజేస్తే సరిపోదు, ఆ జ్ఞానాన్ని అందుకున్నవారు దాని విలువని తెలుసుకొని గౌరవిస్తునే ఆ జ్ఞానం యొక్క ప్రామాణికత మీద విశ్వాసం పెంచుకోవాలి. అప్పుడే వారు తమ జీవిత నడవడికలో దానిని ఆచరించటానికి కావలసిన పరిశ్రమ చేస్తారు.