దివ్యకాంతుల సందర్శనం.. దీపావళి

3
2

[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘దివ్యకాంతుల సందర్శనం.. దీపావళి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]వె[/dropcap]లుగుల సమాహారమై
మెరిసే జ్యోతుల సుప్రకాశాల నడుమ
శ్రీలక్ష్మీ దేవి నడిచి వస్తుంటే
ఆనందాల భువిలో
తేజస్సుల సందర్శనం దీపావళి!

భారతావని వెలుగుల మయమై
శోభించే పర్వదినం దీపావళి!
అమావాస్య చీకట్లు మాయమై
వెలుగుపూలతో ఆకాశం విరాజిల్లే శుభసమయం
దీపావళి పండుగ సమయం!

నరకాసురుడనే రాక్షసుడిని
జగన్మాత సత్యభామ సంహరించిన సందర్భంగా..
లోక కంఠకుడైన రావణాసురుడిని శ్రీరాముడు వధించి
అయోధ్య సతీసమేతంగా చేరిన శుభసూచకంగా..
ఆరోగ్యం, ఔషధాలకు అధిపతి అయిన ధన్వంతరి
క్షీరసాగర మథనంలో
లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షం,
ఐరావతంతో పాటుగా జనించిన గుర్తుగా..
మనమంతా సంబరంగా జరుపుకునే
వెలుగుల పండుగ దీపావళి!

కాకరపువ్వొత్తులు, భూచక్రాలు,
మతాబులు, చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు
వెలుగులు దేదీప్యమానంగా పంచుతుండగా..
పెద్దలు పిల్లపాపలంతా ఒక్కచోట చేరి
ఉల్లాసంగా, ఉత్సాహంగా,
ఐకమత్యంగా మసలుకుంటూ ఉంటే..
ఇలలో జరిగే అద్భుతమైన వేడుక దీపావళి!

దీపావళి నాడు సిరుల రాణి శ్రీ లక్ష్మీ దేవిని
పూజించి ప్రసన్నం చేసుకోవాలని
తపిస్తూ ఆరాధించడం ఆనవాయితీ!
దీపావళి అంటే దివ్వెల కాంతి!
దీపావళి అంటే చెడుపై
మంచి సాధించిన విజయానికి ప్రతీక!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here