దివ్యాoగ ధీరులు 1 – ‘నవనాడులనూ నియంత్రించి నాట్యం చేస్తున్న అరుణ్ కుమార్’

0
2

[box type=’note’ fontsize=’16’] దివ్యాంగులైనప్పటికీ, ధీరత్వంతో జీవనపోరాటం సాగిస్తున్న వ్యక్తులను పరిచయం చేస్తున్నారు గురజాడ శోభా పేరిందేవి. ఖమ్మంకి చెందిన అరుణ్ కుమార్ కథ ఇది. [/box]

[dropcap]రై[/dropcap]లాగిoది. హడావిడి పడుతూ ఒక్కొక్కరుగా ప్రయాణికులు రైలు దిగుతున్నారు. కూలీలో పక్కన, రైలు దిగే ప్రయాణికులో పక్కన, ఒకరినొకరు ఇంచుమించుగా తోసేసుకుంటూ పోతున్నారు.

అందరినీ తేరిపారా చూస్తూ ఒక మూల నెల మీద కూర్చున్నాడొక అబ్బాయి. అతని భుజాన ఒక చిన్న సంచి వుంది. అతని వాలకం చూస్తే ఏమాత్రం తొందర ఉన్నట్టులేదు.

”ఏయ్ ఇంక దిగు” అన్నాడు రైలు దిగిపోతూ ఓ కూలి అతను. అతని పేరు రాము.

అబ్బాయి మాట్లాడలేదు.

”నిన్నిక్కడ ఒకటి రెండుసార్లు చూసినట్టుంది, ఎవరు నువ్వు?”

జవాబివ్వలేదు అబ్బాయి.

”నిన్నే”

”……… ”

”బిక్షం ఎత్తుకునేలా లేవు నువ్వు ”

”ఛీ ఛీ ” అన్నాడు అబ్బాయి.

”నిన్ను వెక్కిరించట్లేదు బాబు, రైల్లో నీలాంటి వారంతా డేక్కుంటూ భిక్షం అడుగుతుంటారు కదా అందుకని అలా అన్నాను.”

”నేను నా కాళ్ళ మీద గట్టిగా నిలబడలేని పోలియో వాడినే, అయినా నా బ్రతుకు నేను బ్రతకాలని అనుకుంటాను తప్ప భిక్షం అడిగి బ్రతకను” రోషంగా అన్నాడా అబ్బాయి.

రాము ఇంకో ప్రశ్న వేయకుండా రైలు దిగాడు. అబ్బాయి డేకుతున్నట్టు అడుగులో అడుగేస్తూ రైలు దిగాడు. చుట్టూ చూసుకుంటూ నెమ్మదిగా సాగాడు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. అసలే సత్తువ లేని కాళ్లతో సాగడం, దానికి తోడు పిచ్చ ఆకలి. అడుగులు తడబడుతున్నాయి. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి.

‘నిన్ను నువ్వు నమ్ముకుంటేనే ముందుకు సాగగలవు’ అని బోధిస్తోంది అంతరంగం. ‘ఆగకుండా సాగిపో ‘ అని హెచ్చరిస్తోంది.

‘మనసు మంచిది. దానికి ఆత్మాభిమానం ఆకాశమంత ఉంటుంది. కానీ పాడు శరీరం ఎప్పుడూ ఆకలి దప్పులతో అల్లాడుతుంటుంది’. విసుగ్గా అనుకున్నాడు.

ఎవరో అడ్డంగా నిలబడ్డారు. ”తప్పుకోండి” అంటూ తలెత్తాడు.

ఇందాక పలకరించిన రాము నవ్వుతూ నిలబడ్డాడు. అతని చేతిలో టీ, బిస్కెట్లూ వున్నాయి.

”నేను భిక్షగాడిని కాను” అభిమానంగా చూస్తూ అన్నాడు అబ్బాయి.

”అయ్యో నేనట్లా అనలేదు బాబు. ప్రయాణమేదో చేసి ఆకలితో ఉన్నావని ఇచ్చానంతే” అన్నాడు రాము.

ఆ మాట అతన్ని ఆపింది. కూర్చుని ”థాంక్స్ కాకా” అంటూ అందుకుని తాగి, తిన్నాడు. రాము మాట్లాడకుండా అతని పక్కన కూర్చున్నాడు.

”నన్నిక్కడ ఎన్నిసార్లు చూసుంటావ్ కాకా?”

”రెండు మూడుసార్లు చూసుంటాను. ”

”కానీ నేనిక్కడికి పదిసార్లకి పైగా వచ్చాను ”

”అవునా”?

”ఎందుకో తెలుసా?? ”

” ……. ……. ”

”మెగాస్టార్ చిరంజీవిగారిని కలవడానికి” కూల్ గా చెప్పాడు

”ఏమిటీ?” కూర్చున్న రాము టక్కున లేచి అన్నాడు.

”నేను ఆయన వీరాభిమానిని… ఆయన సినిమాలు చూడడానికి ఎన్నోసార్లు ఎన్నెన్ని కష్టాలు పడ్డానో తెలుసా కాకా ? తిండి తినకపోయినా ఆయన సినిమా చూస్తే కడుపు నిండిపోతుంది. నా వైకల్యం గుర్తోచ్చి ఏడుపు వచ్చినా ఆయన సినిమాల్లోని పాత్రలు గుర్తోచ్చి ధైర్యం వస్తుంది. ఆయన నాట్యం నన్ను నాట్యం చెయ్యమంటుంది.”

”ఏమిటి? ఏమిటి నువ్వంటున్నది”

”నిజమే అంటున్నాను కాకా నాకు నాట్యం అంటే ప్రాణం. అది చెయ్యడమే నా జీవిత లక్ష్యం.”

”కానీ… కానీ ”

”వొద్దు కాకా, నువ్వు నన్ను అడ్డుకోకు. అందరూ ప్రతినిత్యం నన్నీ విషయంలో అడ్డుకుంటూనే ఉన్నారు ”

 ”……. ??????? ….. ”

 ”నా పేరు గొల్లపల్లి అరుణ్‌కుమార్. మాది ఖమ్మం…” ఆగాడు అరుణ్

 “చెప్పు చెప్పు” కుతూహలంగా అన్నాడు రాము.

 ”నా కధ నీకంత నచ్చిందా?”

 ”నీ ఆశావాదం నచ్చింది. నీలో కనబడుతున్న కసి నచ్చింది. నేను చదువుకున్నాను. నా కాళ్ళ మీద నిలబడాలనుకున్నాను. నీలాగే చిన్నప్పుడు కలలు కన్నాను. కానీ అన్నీ కల్లలై నేను అవయవ లోపాలేవీ లేకున్నా సర్దుకుపోయాను. కానీ నీలా భిన్నమైన రంగంలో రాణించాలని సినీస్టార్‌ని స్ఫూర్తిగా తీసుకుని ఎదగాలని ఆశించే అబ్బాయిలు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ వుండరు. అందరూ నాలాగా సర్దుకుపోతారు లేదా నిరాశావాదంతో బ్రతుకులు వెళ్లదీస్తారు. అందుక నువ్వు నన్ను ఆకట్టుకున్నావు. చెప్పు నీ విషయాలన్నీ వినాలనుంది. ”

”మేము పేదవాళ్లo. నాన్న కూలికెళ్తే అమ్మ బాసన్ల పని చేస్తుంది. నేనూ తమ్ముడూ ఇద్దరు పిల్లలం”. ”

”మీ అమ్మానాన్నలది మేనరికమా?”

”కాదు. కానీ బాల్య వివాహం. నేను పుట్టినప్పుడు అమ్మకి 14 ఏళ్ళు. అందుకే అలా అయ్యింది అన్నారట డాక్టర్. అమ్మ నాన్న నాకు ఎక్కువ ప్రేమని పంచారు. కానీ పోలియో వాళ్లకి ఉపయోగపడే బూట్లు కొనే స్థోమత వాళ్లకి లేదు. ఎంతో కష్టపడి చెక్కలతో కర్రలు చేయించారు. వాటితో నడవడం కoటే డేకడం నయం అనిపించేది. చక్కగా బూట్లేసుకుని స్కూళ్ళకు వెళ్లే పిల్లలని చూసి అసూయగా అనిపించేది. ఎవరిమీదా ఆధారపడకూడదు అని కసిగా నడిచెళ్లే వాడిని.. కచ్చా రోడ్లమీద నడిచి పాదేయవాడిని. గిలకలబండి కూడా నాకుండేది కాదు. అయినా నేనెప్పుడూ ఆగలేదు. ఏడేళ్ళకి బళ్ళో చేరాను. దివ్యాంగుల హాస్టల్లో పదోతరగతి వరకు ఉండి చదువుకున్నాను. మా ఖమ్మంలో నేను కింద పడి దెబ్బలు తగిలించుకొని రోడ్డు లేదు. రక్తం కారడం అత్యంత మామూలు. అసలు ఏ గాయం తగలకుండా నా కాళ్ళు ఒక్కరోజు కూడా లేవు. ఇలాంటివి జరిగినప్పుడల్లా ఎంతో కసి. ఏదో చేసి చూపించాలన్నతపన.

అప్పట్లోనే నేను లక్ష్యాలు పెట్టుకున్నాను. బలహీనంగా వున్నా సరే నా కాళ్ల మీదే నేను నిలబడాలి. నడవాలి. నాట్యం చెయ్యాలి. ప్రతీ వెక్కిరింతనీ, జాలిని, చేతకాదన్నమాటని ఛాలెంజ్ లుగా తీసుకుని నా సత్తా చూపాలి. కానీ ఎలా ఏది ప్రారంభించాలో ఎప్పుడు ప్రారంభించాలో అర్థం కాని నాకు నా గురువు దైవం చిరంజీవిగారి సహకారంతోనే నేను ఎదగగలనని అనిపించి వొస్తున్నాను. ఈ వూరు వొస్తూనే వున్నాను. మా ఊర్లోని మనసున్న మారాజులు రైల్వే స్టేషన్లదాకా దింపుతున్నారు. రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేయనిస్తున్నారు టీసి సార్లు. జేబులో పదిరూపాయలతో వఛ్చి బన్ను టీలతో కడుపు నింపుకుని వెళ్ళిపోతున్నాను. ఇన్నిసార్లు ఆయనని కలవలేకపోయినా నిరాశని పొందలేదు. గొప్పవాళ్ళని కలవడం మామూలు వారికీ కష్టం. ఇంకా నాలాంటి అనామక దివ్యాoగుడికి అసాధ్యమే కాదు, ఆ కోరిక కోరడమూ అసంభవం. అది తెలిసినా ప్రయత్నిస్తూనే వున్నాను. నా అదృష్టం కొద్ది మెగాస్టారుగారి బ్లడ్ బ్యాంకులో వుండే శ్రీదేవి అనే ఆమె ఇవాళ ఆయనతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసింది. ఆయన న్యాయం చేస్తారన్న నమ్మకం నాకుంది”  వుత్సాహంగా చూస్తూ ఆశావాదంతో ఆపాడు అరుణ్.

”పద పద బయలుదేరు” ఉత్సాహంగా అన్నాడు రాము. “నీ అడ్రెస్ నాకియ్యి. నా అడ్రెస్ నువ్వు తీసుకో. నా మనసుకు శాంతి కరువై విరక్తిగా అనిపిస్తే నీతో మాట్లాడతాను. అప్పుడు నాకు కొత్త శక్తి వస్తుంది. నీకు ఏదైనా అత్యవసరంగా కావలసి వస్తే సంకోచించకుండా నన్నడుగు. పేదవాడినే అయినా వీలైనంత సాయపడతాను” అన్నాడు. ఇద్దరూ ఒకరి అడ్రస్ మరొకరు రాసుకున్నారు.

”క్షేమంగా వెళ్లి లాభంగా రా. నేను నీకోసం ఎదురు చూస్తూ వుంటాను” అన్నాడు రాము.

చెయ్యి వూపి కాళ్ళీడ్చుకుంటూ నెమ్మదిగా స్టేషన్ బయటవైపుకు నడిచాడు అరుణ్.

***

రాము అరుణ్ కోసం ఎంతో ఉత్సాహంగా ఆ సాయంత్రం ఎదురు చూసాడు.. రోజూ చూస్తున్నాడు. అరుణ్ అతనికి కనిపించలేదు. బస్‌లో తనవూరికి వెళ్ళిపోయుంటాడో లేక వున్న ఊళ్ళోనే సెటిల్ అయ్యాడో తెలీదు.

మూడు సంవత్సరాల తర్వాత అరుణ్ దగ్గరినుండి ఉత్తరం వచ్చింది. తెరిచాడు రాము.

“కాకా గుర్తున్నానా? నేను నిన్ను ఎప్పుడూ మర్చిపోలేదు. నువ్వు పంచిన ప్రేమని మరువలేను. బాగున్నావు కదూ. నువ్వు నా వుత్తరం కోసం చూస్తూ ఉంటావని తెలిసినా ఎందుకు జవాబు ఇవ్వలేదో తెలుసా? నాకు చిన్నప్పటినుండి విజయాన్ని పంచుకోడం ఇష్టం. అపజయం గురించి మాట్లాడాలన్నా అయిష్టం. నిన్ను కలిసిన రోజు నేను అపజయంలో కూరుకు పోయి వున్నాను. ఆ రోజు అమ్మలాగ నా ఆకలిని తీర్చావన్న భావంతో నా విషయాలు చెప్పాను. తర్వాత నేను తిన్న ఎదురు దెబ్బలు, ఒంటికి మనసుకు తగుల్చుకున్న గాయాలు, ఆకలి కడుపుతో నిద్రపోయిన రాత్రులు, అవమానాలు ఎదుర్కున్న ఘడియలూ తప్ప నా గురించి చెప్పడానికి ఏవీ దొరక్క నీకు రాయలేదు.

మెగాస్టార్ అప్పుడు వూర్లో లేకపోడంతో నేను మళ్ళీ ఆకలి దప్పులతో అల్లాడుతున్నా వెనుతిరగలేదు. అలా చేయడం నాకు ఏదోగా అనిపించి చిన్నబడ్డీకొట్ల పనిచేస్తూ ఉండిపోయాను. తరుచూ బ్లడ్ బ్యాంకు వెళ్లి చిరంజీవిగారిని కలిసే ప్రయత్నం చేశాను. చివరికి నా ప్రయత్నం ఫలించి చిరంజీవి గారు కనిపించి నా జన్మని ధన్యం చేశారు. ఆయన నా పట్ల చూపిన కరుణ జాలి దయలకి కదలిపోయి రాముడి కాళ్లదగ్గర వాలిన హనుమగా మారాను. ఆయనే నాకు లారెన్సు గారిని పరిచేయం చేశారు. దాంతో నా జీవితం చక్కటి మలుపు తిరిగింది.

తల్లి, తండ్రి, గురువు దైవం ముందు చిరంజీవి గారైతే తర్వాత లారెన్స్ మాస్టర్ గారు. వాళ్లిద్దరి ఋణం తీర్చుకోలేనిది. ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఇంకా చెప్పేంత గొప్పది. నా ఆత్మన్యూనతని చిరంజీవిగారు తీసేసి కొత్తవ్యక్తిగా నాకు ప్రాణం పోసారు. లారెన్స్ సర్ నాకు జీవితం ఇచ్చి ఆత్మవిశ్వాసం పెంచి బ్రతుకులోని తీపిని రుచి చూపించి కాలు సరిగ్గా నడవలేకున్నా సంభ్రమం కలిగేలా నాట్యం చేయగలదని నిరూపించారు. కళాకారులు కూడా బ్రతకగలరని, వైకల్యం వున్నా కళాకారుడు విజయం సాధించగలడని లారెన్స్ సర్ చాటారు. ఇక నేను వెనక్కి తిరిగిచూసుకోలేదు కాకా.

స్టైల్, ముని, నాగార్జున, డోన్, కాంచన చిత్రాల్లో నేను నాట్యం చేశాను. కన్నడ కాంచనలో ఉపేంద్రగారితో నాట్యం చేశాను. మలయాళం చిత్రంలోనూ చేసాను. కొత్తగా వఛ్చిన కాంచన, రెబెల్ లలోనూ నర్తించాను. ప్రముఖులైన మెగాస్టార్ కుటుంబ సభ్యులముందు, అమితాబ్, కరుణానిధి, విజయ్ గార్ల ముందే కాక రజనీకాంత్ గారిముందు కూడా నాట్యం చేసాను.

  

మనలో ఎన్నికళలున్నా ఒక గొప్ప వ్యక్తి దాన్ని గుర్తించి అవకాశం ఇస్తే తప్ప అవి రాణించవు. వైకల్యo వల్ల అందరు పిల్లల్లా ఆడుకోలేకపోయాను. నలుగురిలో తిరగలేకపోయాను. కలలు కనే ధైర్యం కూడా చెయ్యలేకపోయాను. ఇక పెళ్లిని గూర్చి ఏమి ఆలోచిస్తాను?

ఇంట్లో సంబంధాలు చూసినా ఎవ్వరూ ముందుకు రాలేదు. దాంతో మిత్రుల సలహా మీద నేను హేమాహేమీలతో తిరిగిన ఫోటోలు చూపించాను. అలా శ్రీదేవితో పెళ్లయ్యింది. నాకొక పాప పుట్టింది. నా పెళ్లి లక్షరూపాయలిచ్చి చేసిన లారెన్స్ సర్ పాపకి అన్నప్రాసన కూడా చేశారు. నా బిడ్డ గోమతి నార్మల్ పాప. పది సినిమాలు, నాలుగొందల నాట్య ప్రదర్శనలు చేసాను. ఇప్పుడు నాకు ఫాలోయర్స్ వున్నారు. లారెన్స్ సర్ దయతో దుబాయ్, సింగపూర్, బైరన్ వగైరా ప్రాంతాలకి వెళ్లాను.

నాకు పాసుపోర్టు రావడం కష్టమైంది. నన్ను నృత్య కళాకారుడిగా గుర్తించడం వాళ్లకి ఇబ్బందైంది. లారెన్స్ సర్ దయవల్ల ఆ ఇబ్బంది తొలగింది. నలుగురికి సాయపడడం ఆయనను చూసే నేర్చుకున్నాను. చిరంజీవిగారి బ్లడ్ బ్యాంక్‌లో రక్త దానం చేస్తాను. పిల్లలకి పెన్సిళ్లు పుస్తకాలు పంచుతాను. నా లాంటివారిని ప్రోత్సహిస్తాను. వినాయకచవితికి నాట్యం చేసి ఆ డబ్బుతో అన్నదానం చేసాను. ఇవన్నీ చేస్తున్నానని గొప్పవాడిననుకోకు. పింఛను డబ్బు 1500, ప్రోగ్రామ్స్‌లో వచ్చే  డబ్బు కొద్దిపాటివే అయినా సాయపడే మనసిచ్చాయి.

అమ్మ అవిటివాడివని ఎప్పుడూ విసుక్కోక పెద్దయ్యేదాకా ఎత్తుకు మోసింది. నాన్న నన్ను చాలా ప్రేమగా చూసారు. వాళ్ళిచ్చిన ప్రేమే నన్ను ప్రేమని పంచేలా చేస్తే మహావ్యక్తుల సహకారం నాకు మానవజాతి మీద మమకారం పెంచింది. రమణాచారి సర్, హరికృష్ణ సర్ నన్ను ఆదుకుంటూ వున్నారు.

సరిగ్గా నడవలేని నాకు లిఫ్ట్ ఇఛ్చినవారు ఆకలితో వున్ననాకు తిండి పెట్టిన నీలాంటివాళ్ళు టికెట్ లేకున్నా ప్రయాణం చేయనిచ్చినవాళ్లు ఇలా ఎందరో మహానుభావులున్నారు. నిత్యం వారు బాగుండాలని దేముడిని ప్రార్ధిస్తూ వుంటాను.

సమస్యలున్నాయి. మూడుచక్రాల బండి కూడా లేదు. నికరమైన ఉద్యోగమూ లేదు. అయినా నీరుకారిపోవడంలేదు. నిజమైన ధైర్యంతో నాట్యం చేస్తూ సాగుతున్నాను. సాగుతూనే వుంటాను. ఈసారి నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. వొస్తావు కదూ.

ఆశావాది అరుణ్.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here