Site icon Sanchika

దివ్యాంగ ధీరులు 3 – వైకల్యాన్ని అధిగమిద్దాం – ధనంజయ్

[box type=’note’ fontsize=’16’] దివ్యాంగులైనప్పటికీ, ధీరత్వంతో జీవనపోరాటం సాగిస్తున్న వ్యక్తులను పరిచయం చేస్తున్నారు గురజాడ శోభా పేరిందేవి. ధనంజయ్ అనే యువకుడు తన వైకల్యాన్ని అధిగమించిన తీరుని వివరిస్తున్నారు. [/box]

[dropcap]నీ[/dropcap]లంగా నయనానందకరంగా వుంది ఆకాశం. తెల్లటి పావురాలు కలిసికట్టుగా ఎగురుతున్న దృశ్యం మరింత మనోహరంగా వుంది. జాజి తీగ రెపరెపలాడుతూ ఊగుతోంది తన పూబాలల సుగంధాన్ని సొంపుగా వ్యాపింప చేస్తోంది.

మంచం మీద పడుకుని కిటికీలోంచి చూస్తున్న ధనుంజయకి పావురాన్ని చూసి అసూయకలిగింది. కిసుక్కున దోమ కుట్టింది. కసిగా దాన్నికొట్టే ప్రయత్నం చేసాడు ధనుంజయ. తుర్రున పైకెగిరింది. పావురాలు హాయిగా ఎగుర్తుంటాయి. జాజితీగ ఊగుతూ నాట్యం చేస్తుంది. నేను మాత్రం నడవలేను. ఆఖరికి… ఆఖరికి దోమకూడా నన్ను కుట్టడమే కాక దమ్ముంటే నన్ను పట్టుకో అని కవ్విస్తూ ఎగిరిపోతుంది.

‘ఎందుకు… ఎందుకు నేనంటే ఇంత చిన్న చూపు? ఏమి పాపం చేశానని మంచానికి అంటుకుపోయి బ్రతకాలి? నా ఈడు పిల్లల్లా ఆడుకోలేను. కనీసం నా కాళ్ళ మీద నేను నిలబడలేను’. చాలా చిరాకుగా అనిపించింది ధనుంజయకి.

 కొయ్యలగూడెంలో పుట్టడమే నేను చేసిన తప్పా? సముద్రం వొడ్డున వున్న ఈ వూర్లో భారీ వర్షాలు పడితే ఊర్లోని జనాలంతా ఇంట్లోని అటకలు ఎక్కి కూర్చుని వాన త్వరగా తగ్గాలని దేవుడిని వేడుకుంటారు. విద్యావైద్య సదుపాయాలూ లేని మారుమూల తన ఉద్యోగ రీత్యా వున్న నాన్న మీద కోపం తెచ్చుకోవాలో, ప్రమాదవశాత్తు చెయ్యికి సమస్య వచ్చినందుకు కోపం తెచ్చుకోవాలో అర్థం కావడంలేదు. పోలియో డ్రాప్స్ వేసేవారు రాజమండ్రి నుండి వఛ్చి వేయడం అది నాకు వికటించడానికి వెనక నాన్న కారణం కాదు. కానీ ఇంత చిన్న పల్లెటూర్లో ఆయన ఉండడం వల్లేగా నాకు అన్యాయం జరిగింది కానీ ఈ రెండూ నన్ను బాధించినట్టుగా ఇంకెవరినీ బాధించవు. ఎందుకంటే సమస్యలు రెండూ పీడించింది నన్ను కదా.’ ధనుంజయ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.

”ఒరేయ్ ధనుంజయ్, మేము పెళ్ళికి వెళ్లి వొస్తాము. ఈ లోగా నీకు కాలక్షేపంగా వుండేoదుకు టేప్ రికార్డర్ ఆన్ చేస్తున్నాను. హాయిగా పాటలు వింటూ వుండు. మేము ఇలా వెళ్లి అలా వచ్చేస్తాం. తప్పనిసరై వెళ్తున్నాం కానీ లేకపోతే నిన్ను వదిలి వెళ్లే వాళ్ళం కాదు. నీకేమి కావాలన్నా నాన్నమ్మని అడుగు” అంది తల్లి.

”వాడు గుడ్ బోయ్. ఏమి గొడవ చెయ్యకుండా వుంటాడు కాని పద పద” అమ్మని తొందర పెట్టాడు నాన్న. అన్నయ్యతో సహా ముగ్గురూ వెళ్లిపోయారు.

ధనుంజయకి చాలా చికాకుగా వుంది. పాటలు బాగున్నాయి. కానీ అవొక్కటే కాదు ఇంకా ఏదో కావాలనిపించింది.

”నాన్నమ్మా, నాన్నమ్మా” పిలిచాడు

” ఏరా నాన్నా, ఏవైనా తింటావా? పోనీ తాగడానికేవైనా తేనా”

”వద్దు, వద్దు”

”మరేందుకు పిలిచావురా?”

”కిటికీ తలుపు వెయ్యమని పిలుస్తున్నాను”

” ఏమిటి?”

”నువ్వు సరిగ్గానే విన్నావు నాన్నమ్మా. కిటికీ తలుపు వెయ్యమనే పిలిచాను”

”పట్టపగలు కిటికీ వేయడమేంటిరా? గాలి వెలుతురూ లోపలి రావాలికదా”

‘లైట్ ఫ్యాన్ ఆన్ చేసి కిటికీ వేసెయ్యి.’

మనవడివైపు చిత్రంగా చూసినా ఆతను చెప్పినట్టే చేసింది నాన్నమ్మ. కళ్ళు మూసుకున్నాడు ధనుంజయ. కిటికీ తెరిస్తే ఎగిరే పక్షులను చూసే కాదు. రెపరెపలాడుతూ తోక వూపుకుంటూ ఎగిరే గాలిపటాన్ని చూసినా దుఃఖం వొస్తుంది. ఆ సంగతి ఎవ్వరికి అర్థం కాదు. అందుకే ధనుంజయ ఎవ్వరితోనూ తన భావాలు పంచుకోడు.

”ఒరేయ్ కన్నా” పిలిచింది నాన్నమ్మ.

”పసరు వైద్యమో, మంత్రతంత్రమో చేసైనా నిన్ను నడిపించాలన్నదే మా కోరిక రా. అందుకేగా నిన్ను ఎన్నెన్నో ఊర్లకి తిప్పి వైద్యం చేయిస్తున్నాడు నాన్న” అంది నాన్నమ్మ

నాన్నమ్మ చెప్పినట్టు వైద్యం చేయించి ధనుంజయని నడిపించడానికి అతని ఇంటిల్లిపాది కష్టపడ్డారు. అక్యపంక్చర్, ఆయిల్ థెరపీ, ఆయుర్వేదం, హోమియోపతి ఇలా ఏవేవో ప్రయత్నాలు చేశారు. వైద్యాలకి ఊరూరూ తిరగడం వల్ల ఏడో తరగతి దాకా చదువు ఇంట్లోనే సాగింది. అమ్మ, అన్న చదివించే వారు. నాన్న నాన్నమ్మ వైద్యం కోసం ధనుంజయని తీసుకెళ్ళేవారు. వైద్యం చెయ్యడం అయ్యాక మందులు ఇచ్చే విధానం నాన్నమ్మకి అలవాటు చేసి నాన్న వెళ్లి పోయేవారు. అందుకే పడుకునే స్థాయినుండి కూర్చునే స్థాయి వచ్చింది. తర్వాత మెల్లిగా కాలిపర్ల సాయంతో నిలబడడం నడవడం అలవాటైంది

అయినా సరే ధనుంజయ మనసు స్థిమితపడలేదు. ఎప్పుడూ ఏదో ఒత్తిడి. తనని చూస్తే తనకే చిరాకు. తిండి తినాలని నిద్రపోవాలని ఉండేది కాదు. ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడేవాడే కాదు.

ధనుంజయ పరిస్థితి చూసి ఇంట్లో వాళ్ళు భయపడ్డారు. అతని లాంటి పిల్లలమధ్య ఉంటే నయమనిపించి

మంగళగిరిలోని డాన్ బాస్కో దివ్యాంగుల హాస్టల్లో వేశారు.

అక్కడికి వెళ్ళాక ధనుంజయలో మార్పు వచ్చింది. స్వతహాగా తెలివైనవాడు ఏకసంథాగ్రాహి కావడం హాస్టల్లో అందరూ తనలాంటి పిల్లలే ఉండడంతో చురుకుగా తయారయ్యాడు. అన్ని సబ్జెక్టులలోనూ చాలా మంచి మార్కులు రావడం మొదలైంది. తరగతి గదిలో టీచర్లు అడిగే ప్రశ్నలకి చురుకుగా జవ్వాబు ఇచ్చే స్థాయి వచ్చింది.

బొమ్మలేయడం, పాటలు పాడడంలోనూ తన ప్రతిభనీ కనబరచడం ప్రారంభించాడు. అందమైన చేతివ్రాత ధనుంజయ ప్రతిభ. గ్రీటింగ్ కార్డు మీద అందంగా బొమ్మ గీసి రంగు పెన్సిళ్ళతో శుభాకాంక్షలు రాసి ఇఛ్చి అందరి అభినందనలూ అందుకున్నాడు. తెలుగు టీచర్ అందరిచేతా చూచి వ్రాత రాయించినా ధనుంజయని మాత్రం నువ్వు రాయనవసరం లేదని అందరిముందూ చెప్పడం విశేషం.

ఎందుకో లెక్కల సబ్జెక్టులో మాత్రం బొటాబొటి మార్కులే ప్రతీసారి రావడంతో లెక్కల మాస్టర్ జయారాజు తరగతి గదికి వఛ్చి ‘నీకు ఇంతకంటే ఎక్కువ మార్కులు ఎందుకు రావడం లేద’ని అడిగారు.

ధనుంజయ జవాబివ్వలేదు. ఈ లోగా అతని డెస్క్ మీద వున్న ఇతర సబ్జెక్టుల మార్కుల షీట్లు చూసిన లెక్కల మాస్టర్ పూర్తిగా చదివారు. అన్ని సబ్జెక్టులలోనూ 90 దాటిన మార్కులే వున్నాయి.

”నా ఒక్క సబ్జెక్టులోనే వెనకబడి ఎందుకు వున్నావు?” అని అడిగారు జయరాజు.

‘ఇంట్లోనే చదువుకోడం, అన్న, అమ్మ చదువు చెప్పడం జరిగిందని వాళ్లిద్దరూ చెప్పినా ఎందుకో లెక్కలు అర్థం కావ’ని చెప్పాడు ధనుంజయ.

అమాయకంగా చూస్తూ చెప్పిన చిన్నవాడి మాటలు జయరాజుని కదిలించాయి.

”రోజూ స్కూల్ అయిపోయాక నేను నీకు సెపరేట్‌గా లెక్కలు నేర్పిస్తాను” అన్నారు జయరాజు.

లెక్కల మాస్టర్ జయరాజుగారితో ఆ విధంగా అనుబంధం పెరిగిందతనికి. ఒక్క లెక్కలే కాక మంచి చెడూ, నీతి నియమాలు, నడవడిలో ఉండవలసిన నిజాయితీ వగైరా ఎన్నో చెప్పి ధనుంజయని తీర్చిదిద్దడంలో ముఖ్య భూమిక వహించారు జయరాజు.

ధనుంజయని కళారంగంలోనూ ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సాహంతోనే తన పాఠశాల మీద ఒక చక్కటి కవిత రాసాడు ధనుంజయ.

రవీంద్రనాథ్ టాగోర్ శాంతినికేతనంతో తమ పాఠశాలని పోలుస్తూ రాసిన కవిత చదివి మురిసిపోయి వెన్ను తట్టారు. దాన్ని పాఠశాల నోటీసు బోర్డులో పెట్టించారు.

”ప్రతీ పనిలోనూ ముందడుగేయి. నీకు 100% వైకల్య సమస్య వుంది అనుకోక. వంద శాతం శక్తి సామర్ధ్యాలున్నాయని వాటితో లోపాలున్నవారినీ కాక నార్మల్‌గా వున్నవారిని కూడా ఓడించడం టార్గెట్‌గా పెట్టుకో” అన్నారు జయరాజు.

‘తేనెలా తీయగా వినిపిస్తుంది నీ పాట. పాటల పోటీల్లో పాల్గొని గెలుపును స్వంతం చేసుకో’ అన్నారు.

ధనుంజయకి కావలసిన గోరంత ప్రోత్సాహం దొరికింది. దాంతో అంతర పాఠశాల పోటీల్లో బహుమతులు పొందాడు. నార్మల్స్ మధ్య పాల్గొని గెలవడం అతనికి మహదానందంగా అనిపించింది.

డాన్ బాస్కో పాఠశాల మిషనరీ వాళ్ళది కావడంవల్ల అక్కడ ఆదివారం ప్రార్థనలు జరగడం, అందులో అందరితోపాటు గొంతు కలపడం తద్వారా రకరకాల పాటలు నేర్వడం త్వరితగతిని జరిగిపోయాయి.

అందరి దృష్టి ధనుంజయ గానమాధుర్యం మీద పడింది. ఆతను యేసు క్రీస్తు పాటలు పాడాడు. ట్రాన్సిస్టర్ నుండి భగవత్గీత శ్లోకాలు, అన్నమాచార్యుల కీర్తనలు వగైరా నేర్చుకున్నాడు.

పదవతరగతిలో చాలా మంచి మార్కులు వచ్చాయి ధనుంజయకి. ఇంతకుముందు అన్ని సబ్జెక్టులకంటే లెక్కల్లో చాలా తక్కువ మార్కులు వచ్చేవి. ఇప్పుడు అన్ని సబ్జెక్టులకంటే లెక్కల్లో చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి. ఆ రోజు ధనుంజయ ఆనందానికి అంతులేదు. ఇది అతని తొలి విజయం.

నడవలేడు. కానీ చదువులో ముందుకు నడిచి ఎందరినో ఓడించాడు. శారీరక శక్తి చాలా తక్కువగా వుంది. కానీ మానసికశక్తి దాన్ని జయించింది. ఆత్మవిశ్వాసానికి ఆ విజయం మొదటి మెట్టయ్యింది.

ఆ రోజు ఒక కొత్త పుస్తకం కొనుక్కుని వొఛ్చి అందులో కొన్ని విషయాలను రాసుకున్నాడు ధనుంజయ.

 A word of encouragement from a teacher to a student can change a life.

 Teachers are those who help find strength drive away tears overpower demons and conquer fears.

పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే తండ్రి ఉద్యోగరీత్యా కొయ్యలగూడెంకి రావడంతో అక్కడి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేరాడు (పొగాకు పేరు తలుచుకోగానే గుంటూరు, కొయ్యలగూడం గుర్తొస్తాయి). ఇంటర్ కాగానే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్టియల్ కాలేజీ సీట్ కోసం ఎంట్రన్స్ రాసి సీట్ తెచ్చుకున్నాడు ధనుంజయ.

క్లాసుకి ఒకరికి మాత్రమే వైకల్య కోటా కింద సీ’ట్ ఇస్తారు. మెరిట్ మీద సీట్ తెచ్చుకున్న ధనుంజయకి రిజర్వేషన్ అవసరం రాలేదు. అందువల్ల మరొక అబ్బాయికి మార్గం సుగమమయ్యింది.

బీకామ్‌లో 78% మార్కులు తెచ్చుకుని ఉత్తమ విద్యార్థిగా నిలిచాడు ధనుంజయ. తన విజయానికి వెనక వున్నది గురువుగారేనని మనస్పూర్తిగా నమ్ముతాడు.

‘నా మీద నాకు నమ్మకం ఏర్పడడానికి కారణం నా శక్తి సామర్థ్యాలను నమ్మిన నా లెక్కల మాస్టర్ అని అందరితో గర్వంగా చెప్పడం ధనుంజయ అలవాటు. ఆయన పుణ్యమా అని జీవితంలో ఎదురయ్యే ప్రతీ అపజయాన్ని ఎదుర్కోగల ధైర్యం వొచ్చింది అనుకుంటూ ఉస్మానియా, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో ఎంబిఏకి అప్లై చేసాడు.

ఈలోగా, ఉస్మానియాలో ఎంకాంకి కూడా అప్లై చేసాడు ధనుంజయ్. ఎంకామ్‌లో మెరిట్ క్యాటగిరీలో సీట్ వొచ్చింది. వెంటనే ఉస్మానియాలో చేరిపోయాడు. ఈలోగా అటు ఆంధ్రాలోనూ ఇటు ఉస్మానియాలోనూ ఎంబీఏలో సీట్‌లు రావడం జరిగింది. అప్పటికే ఫీజు కట్టడం జరగడంతో ఎమ్ కామ్ కొనసాగించాడు.

భాగ్యనగరంలో కాలు పెట్టగానే ధనుంజయ దశ తిరిగిపోయింది. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, వగైరా యాసలో మాట్లాడడమూ పాడడమూ కూడా అలవడడంతో వివిధ సాంస్కృతిక సంస్థల్లో పాడే అవకాశాలు మొదలయ్యాయి. హిందీలో కూడా తీయగా పాడగల వరం వుంది కనక అంతర కళాశాల పోటీలలో పాల్గొని లెక్కలేనన్ని బహుమతులు అందుకున్నాడు. ప్రతీరోజూ ఒక పోటీ, ఒక బహుమతి అలవాటైపోయాయి. మూడుసార్లు రాష్ట్రస్థాయిలో ఉత్తమ గాయకుడి అవార్డును అందుకున్నాడు ధనుంజయ.

తమిళ పాటలు కూడా పాడగలిగిన ధనుంజయకి సౌత్ ఇండియన్ అసోసియేషన్స్ లోనూ పేరొచ్చింది. నార్త్ ఇండియన్ సింగర్‌గా చాలా మంచి గుర్తింపు వచ్చింది. వివిధ రాష్ట్రాల అసోసియేషన్స్ వారు ప్రతీ ప్రోగ్రాంకి అతన్ని పిలవడం మామూలుగా మారింది.

ఎమ్‌కామ్ చదివాక ఎల్‌ఎల్‌బీ చేద్దామనుకుని అప్లై చేయబోతే నిరాశ ఎదురయ్యింది. దివ్యాంగులకి అవకాశం లేదన్నారు. “మాకు సీట్ ఇవ్వాలి” అంటూ కోర్టులో ఇతర దివ్యాంగులను కలుపుకున్నాక రిట్ పిటిషన్ వేసారు. దాంతో 3% రిజర్వేషన్ మొదలయ్యి తర్వాతి తరం వారికి ఉపకరించడం ఆరంభమయ్యింది.

తీపి జ్ఞాపకాలమధ్య చేదు జ్ఞాపకాలు కూడా ధనుంజయకి వున్నాయి. డబ్బింగ్ ఆర్టిస్టుగానో, రేడియో జాకీగానో స్థిరపడడం జీవిత లక్ష్యం ధనుంజయకి.

అందుకని ఎన్నో విధాలుగా ఆ లైన్లో స్థిరపడడానికి ప్రయత్నాలు చేసాడు.

ఒక స్టూడియో ప్రొప్రైటర్ ఫోన్‌లో ధనంజయ కంఠమాధుర్యం విని అభినందించాడు. ”మీరు డబ్బింగ్ ఆర్టిస్టుగానూ, సింగర్ గానూ, రేడియో జాకీగానూ కూడా సూట్ అవుతారు. రేపు మా స్టూడియోకి రండి” అని ఆహ్వానించాడు. “మీకు బంగారు భవిష్యత్తు వచ్చేలా చూసే బాధ్యత నాది” అన్నాడు.

ఆ రాత్రి ధనుంజయకి ఎంతకీ నిద్ర పట్టలేదు. రంగురంగుల కలలు వచ్చాయి. ఆ కలల్లో అతనొక రేడియో జాకీ. తన వాక్చాతుర్యంతో గాన మాధుర్యంతో యువతని కట్టిపడేస్తున్న కళాకారుడు. ఆ కల రాత్రంతా వొఛ్చి పగలైనా కళ్ళు విప్పనివ్వలేదు. కళ్ళు విప్పితే కల చెదిరిపోతుందేమో అనే భయం కలిగిందతనికి.

కానీ తను చదివిన ఒక కొటేషన్ గుర్తోచ్చి నిద్రని కష్టపడి ఆపుకుని కళ్ళు విప్పాడు.

The best way to make your dreams come true is to wake up.

త్వరత్వరగా తయారై స్టూడియో వైపుకు వెళ్ళాడు. గాల్లో తేలిపోతున్నంతా హాయిగా వుంది మనసుకు.

అడ్రస్‌ని బట్టి బిల్డింగ్ దగ్గర ఆటో దిగాడు. గేట్ తీసుకుని లోపలి నడిచాడు. స్టూడియో బోర్డు ఎక్కడా కనబడలేదు. ఆ విషయమే ఫోన్ చేసి అడిగాడు.

”కింద బోర్డు లేదు పైన వుంది. తలెత్తి చూడండి కనిపిస్తుంది. మెట్లెక్కి రండి. మీకోసమే చూస్తున్నాను” ” అన్నాడు. అధికారి.

”మీరెవరినైనా మనిషిని పంపిస్తారా, నా వివరాలన్నీ చూపిస్తాను” అన్నాడు ధనుంజయ.

”మీరు రావాలికాని ఎవరినో పంపిస్తానంటారేంటి?”

”నేను మేడ మెట్లెక్కి రాలేనండి” నెమ్మదిగా అన్నాడు ధనుంజయ.

”ఎందుకు రాలేరు?”

”నేను పోలియో వ్యాధి వల్ల నడవలేనివాడినండి”

”అలాగైతే రేడియో జాకీగానూ డబ్బింగ్ ఆర్టిస్టుగానూ ఎలా చేస్తారు?”

”మాట్లాడడం పాడడంలో చాకచక్యం చాలా వుందoడి నాకు. ”

”సారీ అండీ మీకీ అవకాశం ఇవ్వలేను” ఖరాఖండీగా చెప్పాడాయన. ”అయినా మీకీ ప్రాబ్లెమ్ ఉందని తెలిస్తే నేనసలు పిలిచే వాడినే కాదు. ఇంక నువ్వెళ్ళచ్చు. ”

వెనుతిరిగాడు ధనుంజయ. కూర్చుని చేసే ఉద్యోగానికి కూడా తన వైకల్యాన్ని అవరోధంగా చూపించడం ఎంతవరకూ న్యాయం? ఎందుకీ సమాజానికి చిన్నచూపు చూడడం, చులకనగా మాట్లాడడమంటే అంత ఇష్టం? కళాకారుడిగా ఒక వ్యక్తిని గౌరవించినవాళ్ళే ఆ కళాకారుడు వైకల్యం వున్నవాడని తెలిస్తే ఏకవచన సంబోధన చేస్తారా? ఎందుకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు మనుషులు?

నాకు వైకల్యం వుందని చెప్పుకోడం నాకిష్టం లేదు. దాన్ని జయించి నా కళని బట్టే నన్ను గుర్తించాలనే అభిప్రాయం నాకుంది. వైకల్యం కనబడకుండా ఉండేలా కూర్చోడంవల్ల నాకు అసౌకర్యంగా వుంటుంది. కానీ ఆ అసౌకర్యాన్నైనా భరిస్తాను కానీ దివ్యాంగుడిని అని చెప్పుకుని సానుభూతి జాలి పొందడం నాకు ఇష్టం లేదు.

కులాల వివక్ష మతాల వివక్ష స్త్రీపురుషులమధ్య వివక్షలను గురించి అందరూ మాట్లాడతారు కానీ చిన్న లోపమో పెద్ద లోపమో వున్న వ్యక్తిని ఇతర వ్యక్తులని సరిసమానంగా చూడక వివక్ష చూపే విషయం గురించి ఎవ్వరూ ప్రస్తావించరెందుకు ?

మరోసారి డబ్బింగ్ ఆర్టిస్టుగా వుద్యోగంకి రమ్మని ఒకరు పిలవడంతో వెళ్లిన ధనుంజయకి మళ్ళీ అదే పరిస్థితి ఎదురయ్యింది. “మీకు ఈ లోపముందని తెలీదు కనక రమ్మన్నాము” అన్నారు.

”నోటితో చెప్పే డబ్బింగ్‌కి కాలికి ఏమిటి సంబంధం?” అడిగాడు ధనుంజయ.

”స్టూడియోలో ఖరీదయిన ఎక్విప్మెంట్ ఉంటుంది. మీ చేతికఱ్ఱలు వాటికి తగలచ్చు. లేదా మీరు బాలన్స్ తప్పి వాటిమీద పడచ్చు…. ” అని ఆపేసాడు, అర్థం చేసుకుని వెళ్ళు అన్నట్టుగా.

ప్రభుత్వం పింఛను బానే ఇస్తోంది, ఇంక మళ్లీ ప్రోత్సాహపరచనవసరం లేదు అనే భావాన్నే అందఱూ వ్యక్తం చేస్తారు. సహకారం కంటే ముందు కావలసింది ప్రోత్సాహం అని ఎవ్వరూ అనుకోరు.

మిత్రులు కొందరు ‘నీ పాటలు వాట్సాప్‌లో పెట్టు, ఎవరైనా వెన్ను తడతారేమో చూద్దాం’ అన్నారు. వెంటనే ఆ పని చేసాడు ధనుంజయ.

”నీ కంఠంలో అమృతం తొణికిసలాడుతోంది. మా రెస్టరెంట్‌లో పాడ్తావా” అని అడిగాడు వాట్సాప్‌లో పాటలు విన్న ఒకాయన.

అప్పటికే బాగా ఒత్తిడికి లోనవుతూ ఉండడంవల్ల ”నాకు కాళ్ళకి ప్రాబ్లెమ్ వుంది. అందరిలా నడవలేను” అని చెప్పాడు ధనుంజయ.

”ప్రాబ్లెమ్ వున్నది కాళ్ళకి కానీ కంఠానికి కాదుగా వెంటనే జాయిన్ అవ్వు” అని ఆహ్వానించారు.

అలా రెస్టారెంట్లో హిందీ సినీ గీతాలు పాడే అవకాశం ధనుంజయకి వచ్చింది. నెల తిరిగేసరికి కాస్త వెసులుబాటు వచ్చేసింది.

ఎమ్‌కామ్ అయిన వెంటనే మంచి కంపెనీలో ఆడిటర్ దగ్గర కొంత కాలం చేసాడు ధనుంజయ. బాస్ అభిమానంగా చూసారు. అతనిలోని శ్రమని శక్తిని ఇతర ఉద్యోగులకి చెప్పి ”ధనుంజయ పాపం సమస్య వున్నా సమయానికి వొస్తున్నాడు. చీకటి పడినా పని చేసి వెళ్తున్నాడు. మీరు అందుకు భిన్నం అతన్ని చూసి నేర్చుకోండి” అనడం సహోద్యోగులకి నచ్చేది కాదు.

దాంతో వాళ్ళు అతన్ని వేధించసాగారు. నడుస్తుంటే కాళ్ళు అడ్డుపెట్టడం, కింద పడ్డాక ‘సారీ చూసుకోలేదు’ అనడం ‘దివ్యాoగులకి అందరూ సాయపడేవారే, మననే పట్టించుకునేవారు లేరు’ అనడం, ‘జాలి సానుభూతులతో మనకంటే వాళ్లే బాగున్నార’నడం ఇలా వ్యంగ్యాస్త్రాలు వెక్కిరింతలూ విసరసాగారు. వాటి ప్రభావo ధనుంజయ మనసు మీద పడి ఆతను రాజీనామా ఇచ్చేలా చేసింది. మరో వుద్యోగంలోనూ అలాంటి పరిస్థితులే ఎదుర్కున్నాడు.

సుందరవదనగారిలాంటి విశేషవ్యక్తుల ద్వారా కొందరి పరిచయాలయ్యాయి. ఇంకొన్ని అవకాశాలొచ్చాయి. ఆల్ ఇండియా డిసేబుల్డ్ రైట్స్ ఫోరంలో పాడే అవకాశం వచ్చింది. కొల్లి నాగేశ్వరరావు సారధ్యంలో వివిధ కార్యక్రమాలు జరుగుతూ వుండడం అందులో ధనుంజయ పాల్గొనడం అయ్యాక ఆంధ్రమహిళాసభవారి దివ్యాoగుల పాఠశాలలో సంగీత గురువుగా ఉద్యోగం వచ్చింది. ప్రిన్సిపాల్ సురేఖగారి ప్రోత్సాహం అతని శక్తి సామర్ధ్యాలను పెంచింది.

కల్లాకపటం ఎరుగని పిల్లలతో ధనుంజయకి అనుబంధం ఏర్పడింది. వాళ్లకి మాటల్లో స్పష్టత లేదు చూపుల్లో నిలకడ లేదు. కానీ ‘బుర్రలేనివాడు’, ‘మెంటలోడు’, పిచ్చొడు’ ఇలా ఎవరైనా అంటే పిచ్చి కోపం వస్తుంది. అది చూసి ధనుంజయ అనుకున్నాడు వికలాంగుడు అన్న మాట ఎవరికైనా ఎంతో బాధ కలిగిస్తుంది అని.

ధనుంజయ ఎన్నో అవార్డులు అందుకున్నాడు. బహుమతులు కైవసం చేసుకున్నాడు. కానీ అవన్ని ఇఛ్చిన ఆనందం కంటే తోటివారికి కరమందించడమే ఎక్కువ ఆనందం ఇచ్చింది. సురేఖగారి ద్వారా ‘శ్రీవత్స నృసింహ పాలపర్తి మోరంపూడి ఫౌండేషన్’ వారి ఆధునికమైన వీల్ చైర్ అందుకున్న ధనుంజయ ఆ సంస్థ సేవాకార్యక్రమాల్లో భాగం పంచుకోడం మెదలుపెట్టాడు. ఎవరికీ ఏది ఇవ్వాలి నిజంగా నీడ్ ఎవరికుంది అనేది క్షుణ్ణంగా తెలుసుకుని సూచనలు ఇవ్వడం ప్రారంభించి ఇప్పుడు సంస్థలో భూమిక కూడా పొంది తాను కూడా వీలైనంత సాయం చెయ్యడం మొదలుపెట్టాడు.

ఇప్పటికి అతనికి ఎన్నో ఆశలూ ఆశయాలూ వున్నాయి. ఆన్లైన్ రేడియో ఇంట్లోంచే ప్రారంభించాలని, టాక్ అఫ్ ది టౌన్ ప్రోగ్రాంలో ఝాన్సీలాగా రకరకాల యాసల్లో వివిధ ప్రాంతాలవారిని కలుపుకునే ప్రోగ్రామ్లు చెయ్యాలని తన తోటివారిని మరింత మందిని పైకి తీసుకు రావాలని ధనుంజయ నిత్యం ప్లాన్ చేస్తూ పనిచేస్తూనే వున్నాడు.

తనని మొదటగా ప్రోత్సహించిన గురువు జయరాజు గారిప్పుడు ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. ఆయన ఆశీస్సులు సలహాలు ఇంకా ధనుంజయ అందుకుంటూనే వున్నాడు.

అతను సభ్య సమాజానికి సంచిక ఆన్లైన్ పత్రిక ద్వారా ఒక వినతిని పంపిస్తూ తన అనుభవాన్ని జోడిస్తున్నాడు.

ధనుంజయ నాలుగవ తరగతి చదివేటప్పుడు అతని అన్న మిత్రుడు పడవ తరగతి చదివే అబ్బాయి ధనుంజయ నడుస్తుండగా గబుక్కున కాలిపర్స్ లాగాడు. దాంతో కింద పడ్డాడు ధనుంజయ. అప్పుడా అబ్బాయి ‘అదేంటి కింద పడ్డావు అదే సినిమాల్లో ఐతే షాక్‌కి నడక వచ్చేస్తుంది కదా నీకూ అలాగే వొస్తుందనుకున్నాను’ అన్నాడు. ఆ మాట అంటున్నప్పుడు అతని కళ్ళు కొంటెగా నవ్వుతూ కవ్విస్తున్నాయి. అలాంటి మాటలు మనసులను తొలిచేస్తాయి.

దయచేసి మా మీద జాలి సానుభూతి చూపించకండి. చిన్నచూపు కూడా చూడకండి. మేమూ మనుషులమేనని మాకూ మీ అందరిలా కలలూ, కోరికలూ వుంటాయని వాటిని సాధించుకోడానికి మీకంటే వందరెట్లు కష్ట పడవలసి వొస్తుందని గుర్తుంచుకోండి. ఆ కష్టం తాలూకు ఒత్తిడి మమ్మల్ని జీవితాంతం ఎలాగూ వేధిస్తుంది. మీరు కూడా మమ్మల్ని మరింత ఒత్తిడికి లోను చేసి నీరు కార్చకండి.

మిత్రులారా మనని మనమే ప్రోత్సహించుకుందాం. మన కళ్ళు కాళ్ళు ఇతర అంగాల్లో ఏవి సవ్యంగా ఉంటే వాటి సాయంతో అపసవ్యంగా వున్నా వాటిని అధిగమిద్దాం. ప్రతీ వెక్కిరింతనీ ఒక చిగురింతగా తీసుకుందాం.

Sometimes when you are in a dark place you think you’ve been buried but actually you’ve been planted.

           

Exit mobile version