Site icon Sanchika

దివ్యాoగ ధీరులు 5 – బాడీ బిల్డర్ – బెస్ట్ డాన్సర్ గంధం సంతోష్-1

[box type=’note’ fontsize=’16’] దివ్యాంగులైనప్పటికీ, ధీరత్వంతో జీవనపోరాటం సాగిస్తున్న వ్యక్తులను పరిచయం చేస్తున్నారు గురజాడ శోభా పేరిందేవి. గంధం సంతోష్ అనే యువకుడు తన వైకల్యాన్ని అధిగమించిన తీరుని వివరిస్తున్నారు. [/box]

[dropcap]రా[/dropcap]త్రి తొమ్మిది దాటింది. అడపాదడపా వెళ్తున్న వాహనాలు తప్ప మనుషులెవ్వరూ అక్కడ తిరగడం లేదు. ఇంచుమించు నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతానికి ఒక లారీ వొఛ్చి కాస్త రోడ్డు పక్కకి ఆగింది. బైపాస్ ఖమ్మం వెళ్లే రోడ్డు దగ్గర ఆగిన లారీలోంచి ఒక మధ్యవయస్కుడు దిగాడు. సింగరేణికి వెళ్లే ప్రయత్నంలో ఉన్న ఆ లారీ లోంచి మధ్యవయస్కుడు ఒక ఏడేళ్ల అబ్బాయిని ఎత్తుకుని కిందకి దింపాడు. ఫుట్‌పాత్ మీద అబ్బాయిని కూర్చోపెట్టి చెయ్యి ఊపి లారీ ఎక్కాడు.

క్షణాల్లో లారీ ముందుకు దూసుకు పోయింది.

బిక్కు బిక్కుమంటూ అబ్బాయి చుట్టూ చూసాడు. కారుచీకటి తప్ప ఏమీ కనబడలేదు. కీచురాళ్ల మోత కూడా ఆ వేళలో వినబడసాగింది. ఒంటరితనం ఎంత భయంకరం. చుట్టూ వున్నచెట్లు జడలమారి దెయ్యాల్లా తనదగ్గరికి వొస్తున్నట్టుంటాయి. నిశ్శబ్దవేళలో కీచురాళ్లమోత, కుక్కల అరుపు గుండెలమీద ధభీ ధభీమని కొడుతున్నట్టుంటుంది. వెన్నులోంచి వొణుకు పుట్టుకురాసాగింది. ఎవరైనా ఒక్క మనిషి కనబడితే చాలు అనిపించసాగింది. అంత అలాంటి పరిస్థితిలో కూడా ‘ఆకలి ఆకలి’ అంటూ కడుపు మారాం చెయ్యసాగింది.

ఎవరైనా మాట్లాడుతుంటే వినాలనిపించింది. పోనీ తనలో తానైనా గట్టిగా మాట్లాడుకోవాలి అనిపించింది. కానీ ఏదీ చెయ్యలేకపోయాడు. ఏడుపొస్తోంది. గుండెలోతుల్లోంచి భయం తన్నుకొస్తోంది. ఆకలి, ఒంటరితనం తాలూకు భయం, ఆ పసివాడిని ఉక్కిరిబిక్కిరి చేయసాగాయి.

“రాత్రి నిద్రపట్టకపోయినా కళ్ళు తెరవకూడదురా, గట్టిగ మూసుకునే పడుకోవాలి. దెయ్యాలు చీకట్లో తిరుగుతూ ఉంటాయి. తమని ఎవరైనా చూసారని తెలిస్తే పట్టుకుని పీకేస్తాయి… పిసికేస్తాయి” అన్నాడు కదా స్నేహితుడు. మరి తాను కళ్ళు తెరిచి చూస్తున్నాడు కదా దయ్యమొస్తుందా. తనని పట్టుకుపోవాలని చూస్తుందా? అది తన వెనకే వచ్చినా తాను పరిగెత్తలేడుకదా….. కళ్ళల్లోంచి నీళ్లు కారసాగాయి. చొక్కాతో వొత్తుకున్నాడు.

ఈలోగా అక్కడ సందడి మొదలయ్యింది. అరడజనుమంది మనుషులు అటుగా నడిచి వచ్చారు. దూరం నుండి వాళ్ళని చూసి చూడగానే అంత చల్లటి వేళలో కూడా ఆ అబ్బాయికి చెమటలు పట్టాయి. కొంపదీసి వాళ్లంతా దెయ్యాలా రాక్షసులా? అనుకుంటూ ఉండగానే వాళ్ళు దగ్గరికొచ్చారు.

“ఇంత రాత్రిల ఈడున్న వేంది పిల్లగా” అడిగాడు మగతను. భయంగా చూసాడు అబ్బాయి.

“నీ పేరేంది?”

”సంతోష్ ”

”పేరైతే సంతోష్ అని పెట్టిండ్రు గాని నువ్వు సంతోషముగా కానోస్తలేవుగా పిల్లగా”

ఆ మాటన్న ఆడామె వైపు అదే భయంతో చూసాడు సంతోష్. వాళ్లు కోతులాడించేవాళ్ళు, పిట్టలు కొట్టేవాళ్లు, గులేరు తయారు చేసేవాళ్ళు, టాటోలు వేసేవాళ్ళు రోజంతా ఎక్కడెక్కడో తిరిగి ఊరిబయట వుండే వారి గుడిసెల దగ్గరికి చేరుకుంటారు.

“చెప్పు పిల్లగా నువ్వెవరివి?”

“బిచ్చగాన్ని” నిజాయితీగా చెప్పాడు సంతోష్.

‘ఆఁ’ ప్రశ్నార్థకంగా చూసాడు కోతులాడించే అతను

“బిచ్చగాన్ని” విడదీసి చెప్పాడు.

“మీవాళ్లేరి?”

“ఎవ్వరూ లేరు.”

ఫుట్‌పాత్ పక్కనే వంటచేసింది స్త్రీ. అందరూ అన్నానికి కూర్చున్నారు. సంతోష్‌కి కూడా కాస్త పెట్టారు. అన్నం తిని వాళ్లకి దగ్గర్లోనే పడుకున్నాడు. ముక్కుముఖం తెలీని వాళ్ళే అయినా తనలాంటి బీదవాళ్లు, ముఖ్యగా తన ఆకలి తీర్చినవారి పక్కన చేరడంతో భయం పోయి కంటిమీదకి నిద్ర కమ్ముకు వచ్చింది. తలకింద చెయ్యి పెట్టుకుని ఫుట్‌పాత్ మీదే వారికి అడుగు దూరంలో పడుకుని నిద్ర పోయాడు సంతోష్.

అతనికి మెలకువ వచ్చేసరికి పక్కనవారు లేరు. కానీ తెల్లగా తెల్లవారిపోడంతో భయమేయలేదు. మెల్లగా డేక్కుంటూ నడక మొదలు పెట్టాడు. ఎటు వెళ్ళాలో తెలీదు. కాళ్లూ, చేతులు నాలుగూ ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళాలి అనుకుంటూ నడక మొదలుపెట్టాడు. ‘ఆకలి ఆకలి’ అంటూ మారాము మొదలు పెట్టింది కడుపు. కాస్త దూరం రెండు చేతులు రెండు కాళ్ళు నేలమీద ఆనించి నడిచేసరికి అలసట కలిగింది. కాస్సేపు అక్కడిపార్కుకు వెళ్లి కూలబడ్డాడు. పార్కులో మొక్కలకి పెట్టిన పైపుదగ్గరికెళ్ళి దోసిలితో నీళ్లు పట్టి తాగాడు. ఆకలి కాస్సేపు ఆగినా మళ్లీ నిముషాల్లో విజృంభించింది.

లాభం లేదని పాక్కుంటూ భిక్షాటనకు బయలుదేరాడు. కొన్ని షాపులు తిరిగాడు, ఎవ్వరూ ఏమి ఇవ్వలేదు. అక్కడికి నాలుగడుగుల దూరంలో చెప్పుల షాప్ కనిపించింది. అందులో చాలా మంది జనం కనిపించారు. అక్కడ ఒక్కరూపాయి చేతికి వచ్చినా చాలనుకుంటూ అటువైపుకు వెళ్ళాడు.

అక్కడ చెయ్యి చాచి ‘ఆకలి ఏదైనా ఇవ్వండి’ అని జాలిగా అడిగాడు. గల్లాపెట్టె దగ్గర కూర్చున్న ఆతను బిజీగా డబ్బు వసూలు చేస్తూ సంతోషుని చూడలేదు. కానీ సంతోష్ అక్కడే కూలబడి చెయ్యి చాచి భిక్షం అడగసాగాడు.

“నీ పేరేంటి?” అని అడిగిన వ్యక్తి వైపు ముఖ ఎత్తి చూసాడు.

తెల్లటి బట్టల్లో వున్నఒక సిస్టర్ అడిగింది

‘సంతోష్’ అని చెప్పి ”ఆకలి” అని అన్నాడు నీరసంగా సంతోష్ .

ఆకలి మనిషిని భిక్షకుడిని చేస్తుంది, దొంగని చేస్తుంది, హంతకుడిని కూడా చేస్తుంది. ఆకలికి తట్టుకోలేక ఎంత చెడ్డ పనిచెయ్యడానికైనా మనిషి ఎప్పుడూ సిధ్ధంగా ఉంటాడు. ఆకలిగొన్నవారి అవసరాలను స్వార్థపరులు తమ పబ్బం గడుపుకోడానికి వాడుకుంటారు. ప్రభుత్వం ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా ఆకలిచావులు, అర్ధాకలితో అనారోగ్యాలకు గురికావడాలూ భారతావనిలో వున్నాయి. మధ్యప్రదేశ్లో 60%మంది పిల్లలు ఆకలి బాధతో అల్లాడుతున్నారని తెలుస్తోంది. కొన్ని మారుమూల గ్రామాల్లో తినడానికి తిండి లేక పిల్లలు ఆవుపేడలోని గింజలను కడుక్కుని తింటున్నారని… ఎంగిలి విస్తళ్ళకోసం కొట్టుకుంటున్నారని సర్వేలు వెల్లడిచేస్తున్నాయి. లేలేత బాల్యంలో పని సామర్ధ్యం తెలీని పిల్లలెందరో బాల్యాన్ని బుగ్గిచేసుకుంటూ చావుకూ బ్రతుకుకూ మధ్య కొట్టుమిట్టాడడo ఆకలి చావులకు గురి కావడం జరుగుతూనే వుంది.

సిస్టర్ చెప్పుల దుకాణంలో పనిచేసే అబ్బాయికి చెప్పి సంతోష్‌కి తినడానికి ఏమైనా తెమ్మని చెప్పింది. పక్కనే వున్న క్యాoటీన్ నుండి నిముషాల్లో ఇడ్లీ తీసుకు వచ్చాడు అబ్బాయి. పోతున్న ప్రాణం లేచివచ్చినట్టయ్యింది సంతోష్‍కి. ఎటూ చూడలేదు. ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడలేదు. ఆవురావురుమని ఇడ్లీలు తిన్నాడు. కడుపు చల్లబడింది. దాన్ని బట్టి మనసు స్థిమితపడింది.

తనకి సాయపడిన సిస్టర్‌కి కృతజ్ఞత ఎలా చెప్పాలో ఆ పసివాడికి అర్థం కాలేదు. అమాంతంగా సిస్టర్ కాళ్ళమీద పడ్డాడు. ఆమె పాదాలమీద పడిన అతని చేతులు నిశ్శబ్దంగా ధన్యవాదాలర్పించాయి.

కొన్ని సందర్భాలలో మాటలతో పని ఉండదు. మనసు మనసుతో మాటాడుతుంది. కళ్ళు కృతజ్ఞతను కన్నీటి పొరలమధ్య వ్యక్తం చేస్తాయి.

“పద బాబు అలా వెళ్లి కూర్చుందాం” అంది సిస్టర్ సంతోష్‌ని రెండు చేతులతో ఆశీర్వదిస్తూ. చెప్పుల షాపులో దూరంగా కస్టమర్లు ఎవ్వరికీ ఇబ్బంది లేని ప్రాంతంలో సిస్టరూ, సంతోష్ కూర్చున్నారు.

“నీ గురించి చెప్పు” అంది సిస్టర్

“మేము బుడిగ జంగంవాళ్ళం. ఊరూరూ తిరగడం బుర్రలాంటిది పట్టుకుని వాయిస్తూ పంచాంగం చెప్పడం నాన్న పని.”

“అవునా?” అంది ఆశ్చర్యంగా సిస్టర్.

భుజానికి గొంగళి వేసుకుని, నెమలి ఈకలు తలకి పెట్టుకుని నాన్న గ్రామాలన్నీ తిరుగుతాడని నాన్నమ్మ చెప్తుంది.

“నాన్నమ్మ చెప్పడమేంటి? నువ్వు నాన్నతో కలిసి వున్నది లేదా?”

“నాకు ఇద్దరన్నలు. నేను పుట్టాక మా అమ్మ పోయింది. నాన్న మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. పిన్నికి ఇద్దరు పిల్లలు పుట్టారు. నన్ను సాకింది నాన్నమ్మ. ఆమె నేను అన్నలం వేరే ఉంటాం.”

“తమ సౌఖ్యం చూసుకుంటూ పిల్లలని పట్టించుకోని తండ్రులు కోకోల్లలు కదా” అంది సిస్టర్.

“మా పిన్ని తప్పేమి లేదు” అన్నాడు సంతోష్.

“అయితే మీ నాన్నదే తప్పు.”

“కాదు నాన్నది కూడా తప్పు కాదు.”

“మరెవరిది తప్పు?”

“నాన్న మందు తాగుతాడు కదా, తప్పంతా ఆ ముందుది.”

అప్రయత్నంగా సిస్టర్ కుర్రవాడి భుజంమీద చెయ్యేసింది తండ్రిని, సవతితల్లిని నిందించని పసి మనసును అభినందిస్తున్నట్టుగా.

“నాకు రెండేళ్లప్పుడు పోలియో వొచ్చిందిట. అందుకని రెండు కాళ్లు ఇలా అయిపోయాయి. చల్లగరియలో కూలి పని, భిక్షాటన రెండూ చేస్తూ మా ముగ్గురిని నాన్నమ్మ సాకేది. పెద్దన్నయ్య కూలికి వెళ్లినా కూడా డబ్బు అందరికి సరిపోయేది కాదు. పదిహేను రూపాయలు ఒక్కొక్కరికి వచ్చే రోజు కూలి ఒక్క పూట తిండికి సరిపోయేది. ప్రతీ ఆదివారం పక్క ఊర్లో సంత పెట్టేవారు. ఆ సంతకి వెళ్ళడానికి పదికిలోమీటర్లు నడవవలసివచ్చేది. నన్ను నాన్నమ్మో అన్నలో ఎత్తుకునేవారు. అక్కడ భిక్షాటన చేసేవాళ్ళం.”

“నువ్వు చదువుకోడంలేదా?”

“ఇంటిదగ్గర గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదివాను” కళ్ళు చక్రాల్లా తిప్పుతూ గర్వంగా చెప్పాడు సంతోష్.

“నీ వయసెంత?”

“పదో పదిహేనో ఉంటాయి. ఇరవై అయినా వుంటాయేమో” అమాయకంగా చూస్తూ అన్నాడు.

“నీకు ఏడెనిమిదేళ్ళుంటాయి నాన్నా” అంది సిస్టర్.

“ఓహో”

“నువ్వు ఇంట్లోంచి ఎందుకు పారిపోయావు?”

”నాన్నమ్మ కష్టం చూస్తే బాధనిపంచింది. ఎక్కడికెళ్లినా వాళ్ళు నన్ను మోయడమో లేదా నేను తాబేలులా ఈడ్చుకుంటూ గంటల తరబడి వాళ్ళ వెనక నడిచి భిక్షాటనకు వెళ్ళడమూ నాకు నచ్చలేదు. ఆంత కష్టపడినా ఒకో రోజు పది రూపాయలు కూడా వచ్చేవి కాదు. నేనెళ్ళిపోతే వాళ్లకి నయం కదా. వాళ్ళ కాళ్లతో వాళ్ళు నడుస్తూ వాళ్ళ పొట్టలు వాళ్లు నింపుకుంటారని హనుమకొండకి సైకిల్ రిక్షాలో సామాన్లు తీసుకెళ్లే అతన్ని దూరంగా ఎటైనా తీసుకెళ్లమని అడిగితే, జాలిపడి ఎక్కించుకుని హనుమకొండ చౌరస్తా దగ్గర దింపి పోయాడు. … అలా నిన్నరాత్రి ఇటోచ్చాను. కోతులుపట్టేవాళ్ళు కొంచెం తిండి పడితే తిన్నాను.”

“పద” అంది సిస్టర్.

“ఎక్కడికి” ఆశ్చర్యంగా అడిగాడు.

“మాతో వొద్దువుగాని.. మాతో వొస్తే నీకు అన్నం దొరుకుతుంది. ఉండడానికి జాగా ఉంటుంది” అంది సిస్టర్.

ఉండడానికి జాగా అనేమాట పక్కకి పెట్టి ‘అన్నం దొరుకుతుంది’ అన్న ఒక్కమాట ఆ చిన్నోడికి కడుపు నిండిపోయినంత సంతోషం కలిగించింది. అమ్మ, అన్నం అనేవి రెండూ ఆ వయసులో అత్యంత ముఖ్యమైనవి. సంతోష్‌ని సిస్టర్లు ఆశా నిలయంకి తీసుకుని వెళ్లారు.

కారులో వెళ్తున్నప్పుడే ధైర్యం చెప్పారు. అక్కడ నీలాంటి పిల్లలు చాలామంది వున్నారు అని భుజం తట్టారు. ఆశా నిలయంలో వందమంది మగ, ఆడ పిల్లలున్నారు. వారు రకరకాల వైకల్య సమస్యలతో వున్నారు. అక్కడికెళ్ళాక ఆకలి బాధ పూర్తిగా తీరిపోయింది. వేడివేడిగా వేళకి ఆహారం దొరుకుతోంది.ఆడి పాడేందుకు తన ఈడు పిల్లలూ దొరికారు. సంతోష్‌ని రెండునెలలు ఎల్‌కేజీలో కూర్చోపెట్టారు. తర్వాత యూకేజీ కూడా చేయించి జూన్ కల్లా వకటవ తరగతికి వెళ్లేలా చూసారు.

ప్రేమ, అభిమానం, ఆకలయిన వెంటనే తినిపించడం అనారోగ్యం రాగానే వైద్యం చేయించడం అన్ని సంతోష్‌కి చాలా ఆనందం కలిగించాయి. ఆ ఆనందం వల్లనో ఏమో మొదటి శ్రేణిలో పరీక్షలు పాసవుతూ డబల్ ప్రమోషన్ పొంది ఓకే వత్సరంలో మూడవక్లాసుకి ప్రమోట్ కాగలిగాడు. డేకే బాధలేకుండా చంకల్లోకి కర్రలు వఛ్చి చేరాయి. అవి ముందు చాలా బాధించి నెప్పి చేశాయి. కానీ కర్రలతో టకటకానడుస్తున్న ఇతర పిల్లలని చూసి తను కూడా నడవాలని నిర్ణయించుకుని కష్టానికి ఓర్చుకున్నాడు సంతోష్.

వేసంగి సెలవులివ్వడంతో పేద తల్లి తండ్రులున్నవారు, కేవలం తల్లో తండ్రో మాత్రమే వున్నవారు ఊళ్ళ కెళ్ళడం చూస్తూ వున్నాడు తప్ప స్పందించలేదు లేదు సంతోష్.

“సంతోష్ నువ్వు కూడా మీ వాళ్ళ దగ్గరికి వెల్దువు కాని పద” అన్నారు సిస్టర్లు.

అనాసక్తంగా చూసాడు సంతోష్.

“నిన్ను పుట్టినప్పటినుంచి చూసుకున్న నాన్నమ్మ అన్నయ్యలని చూడవా?” అడిగారు

తల నిలువూ అడ్డం కాకుండా వూపేడు.

“సంతోష్ మన హాస్టల్లో మీకందరికీ పదవ తరగతి దాకానే ఆశ్రయం ఉంటుంది. తర్వాత నువ్వు బయటికి వెళ్ళిపోవాలి. మీ వాళ్లతో బంధం పటిష్టం చేసుకుంటే నువ్వు ఇక్కడినుండి అటు వెళ్లగలుగుతావు. సరేనా”

‘సరే’ అన్నట్టు తలా ఊపాడు.

జీపులో ఇద్దరు సిస్టర్లు, డ్రైవర్ కలిసి సంతోషుని వాళ్ళ ఊరికి తీసుకెళ్లారు. ఎర్రగా బొద్దుగా తయారైన సంతోషుని చూసి వూరు ఊరంతా ఆశ్చర్య పోయింది. వూళ్ళో అందఱూ సంతోష్ ఎప్పుడో చనిపోయి ఉంటాడని అనుకున్నారు. విషయం అంతా విని సిస్టర్ల కాళ్ళ మీద పడి కన్నీళ్లు పెట్టుకున్నారు సంతోష్ కుటుంబీకులు. పక్క పక్క గ్రామాలవారంతా కూడా సంతోషుని చూడడానికి వచ్చారు .

వైకల్యంతో పుట్టినవారంతా భిక్షాటనతో బ్రతకవలసిందే అన్నది వారందరి స్థిర అభిప్రాయం. దయతలిచి పెడితే పసిప్రాయంలో తిని కాస్త పెద్దవ్వగానే భిక్షాటన చేసి తీరాలన్నది వాళ్ళెరిగిన సత్యం. కానీ అలా కాకుండా దొరలా తయారై వఛ్చిన అబ్బాయి వాళ్ళందరిని ఆశ్చర్యపరిచాడు,.

సిస్టర్లు గ్రామస్తులందరికి చెప్పారు ”భిక్షాటన వొద్దు బడికెళ్ళడం ముద్దు. పిల్లలకి మనం ఇవ్వవలసినది ఒక్క విద్యావకాశం మాత్రమే. అదొక్కటే ఇస్తే వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. ఈ నెల రోజులూ మీతో ఉంటాడు. భిక్షాటన చేయించకండి. తర్వాత జూన్ 12కి హాస్టల్‌కి తెఛ్చి దింపండి” అని. సంతోష్ తండ్రి, పిన్నిలకి కూడా చెప్పి వెళ్లారు సిస్టర్లు.

వాళ్ళు వెళ్తుంటే మనసులో బెంగగా అనిపించింది సంతోష్‌కి. కష్టం అనేది తెలీకుండా చూసుకుంటున్న వాళ్ళల్లో అమ్మ కనిపిస్తుంది సంతోష్‌కి. అందరికి ఓకే అమ్మ ఉంటుంది నాకు ఇందరు అమ్మలు వున్నారు అని సిస్టర్లను చూసి ఎప్పుడూ అనుకుంటాడు సంతోష్. తమని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న సంతోష్‌కి ధైర్యం చెప్పారు సిస్టర్లు. పెదవులు పలకలేని ప్రేమ పదాలను కన్నీళ్లు ప్రదర్శిస్తాయి. కన్నీళ్లు నేరుగా భగవంతుడికి చేర్చే ప్రార్ధనలు.

‘మా సిస్టర్లమీద నాకెంత ప్రేముందో నువ్వయినా చెప్పు దేవా’ అని భగవంతుడికి మోర పెట్టుకునే ముత్యాల సరాలు కన్నీళ్లు.

నెల తర్వాత కాశీబుగ్గ దగ్గరికి సంతోష్ వాళ్ళ నాన్న, పిన్ని, పెద్దనాన్న, నాన్నా దింపి వెళ్లారు. హాస్టల్లో పిల్లలకి వాళ్ళ వాళ్ళు వొఛ్చి ఏదో ఒకటి కొనిఛ్చి వెల్లడం పరిపాటి. సంతోష్ ఒక్కడే అందరిలోకి పేదవాడు. కనక అతని వాళ్ళు రావడం లేదు. దాంతో అవసరం బట్టీ సిస్టర్లే కొనేవాళ్ళు.

ఒకసారి స్కూల్ లో అమ్మమీద కాంపోజిషన్ రాయమంటే సంతోష్ కూడా రాసాడు. ఆ సాయంత్రం హాస్ట‍ల్‌కి సంతోష్ రాసిన కoపోజిషన్ తెఛ్చి చూపించింది అతని టీచర్.

‘ఈ ప్రపంచంలో అందరికంటే నేనే ఎక్కువ చాలా ఎక్కువ అదృష్టవంతుడిని. అందరికి ఓకే అమ్మ ఉంటుంది. నాకు మాత్రం చాలా మంది అమ్మలు వున్నారు. ఒక అమ్మ నాన్నమ్మ, రెండో అమ్మ చెప్పుల దుకాణం దగ్గర బిక్షం ఎత్తుకుంటున్న నన్ను ఆశ్రమానికి తీసుకు వొచ్చిన ప్రీమా అమ్మ.. టెల్ మా అమ్మ, ఏమిల్మేరి అమ్మ, యాగీ అమ్మ. ఆ అమ్మలందరి ప్రేమే కాళ్ళు లేని నన్ను ముందుకునడిపిస్తోంది. చదువులో అందర్నీ ఓడించే ఆత్మవిశ్వాసం పెంచుతోంది. పుట్టగానే అమ్మని పోగొట్టుకున్నందుకు తానే బాధపడి దేముడు ఇందరు అమ్మలని నాకిచ్చాడు.’

అది చూసిన నన్‌ల కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి. అందరిమధ్యా వున్న సంతోషుని వాళ్ళందరూ ప్రత్యేకమైన ప్రేమతో పెంచుకు రావడం అక్షరసత్యం. నాకిది కావాలి అని ఆతను అడగక ముందే వాళ్ళు అన్ని అమర్చడం అభినందనీయం. వాళ్లందరికీ అతనితో వున్నది అనిర్వచనీయమైన అనుబంధం.

సంతోష్ మూడవ తరగతిలో ఉండగా వాళ్ళ స్కూల్లో పెద్ద ఎత్తున స్వతంత్ర దినోత్సవాన్ని జరిపారు. హాస్టల్ దివ్యాoగులదే కానీ స్కూలు మాత్రం నార్మల్ పిల్లలదే. ఆ పెద్ద స్కూల్లో 1500 మంది పిల్లలున్నారు. చాలా బస్సు లు కూడా పక్క గ్రామాలనుండి పిల్లలని ఎక్కించుకుని వొస్తుంటాయి. ఆగస్టు 14వ తేదీ రోజున పిల్లల ప్రాక్టీస్ స్కూల్లో జరుగుతున్నప్పుడు చంకల్లో కర్రలు పెట్టుకుని అటు వెళ్లి కన్నార్పకుండా చూస్తూ కూర్చున్నాడు సంతోష్.

మర్నాడు కార్యక్రమం బాగా జరిగిపోయింది.

ఆ సాయంత్రం హాస్టల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ”సిస్టర్ నేను డాన్స్ చెయ్యనా?” అని అడిగాడు సంతోష్.

అక్కడున్న సిస్టర్ మాత్రమే కాదు ఆ ప్రాంతoలో తిరుగుతున్న ఇతర దివ్యాoగులైన పిల్లలు కూడా ఆ మాటకి వులిక్కిపడ్డారు.

కానీ తనలోని భావాలను కప్పిపుచ్చచుకుంటూ సిస్టర్ టెల్ మా ”నువ్వు డాన్స్ చేస్తావా సంతోష్, చాలా సంతోషం. ఏది త్వరగా చెయ్యి. మేమందరం చూడాలని కుతూహలపడుతున్నాం” అంది.

“సిస్టర్ వాళ్లంతా కాళ్లతో నడుస్తూ చేశారు కదా. నేను కింద కూర్చునే ఆ స్టెప్పులన్నీ చేస్తాను” అన్నాడు సంతోష్.

“గాజువాకపిల్లా మేం గాజులోల్లం కాదా” అంటూ పాటకి సరిగ్గా ముందు రోజు నార్మల్ పిల్లలు చేసినట్టు గానే చేసి శభాష్ అనిపించుకున్నాడు.

“అందరూ చేసేదే మనం చేస్తే గొప్పేముంది సంతోష్? నీలాగా భిన్నంగా చెయ్యడమే గొప్ప” అంది సిస్టర్ టెల్ మా. ప్రిన్సిపల్ ఏమిల్మేరి, సిస్టర్ యాగీ, సిస్టర్ ప్రీమా అభినందనలతో ముంచెత్తారు.

“ఫ్లోర్ డాన్సర్స్ ఉంటారన్నది నిన్ను చూసాక గుర్తొచ్చింది. మన హాస్టల్లో నువ్వే మొదటి ఫ్లోర్ డాన్సర్ వి. ఇంక మన పిల్లలకి నువ్వే డాన్స్ గురువివి. ఇవాల్టినుండి ఫ్రీ టైములో ఇతర పిల్లలకి నేర్పు. సంతోష్ అండ్ పార్టీగా తయారు చేసుకో, నవంబర్ 14న వచ్ఛే బాలల దినోత్సవం రోజున మీరు ప్రదర్శించాలి” అంది ప్రిన్సిపాల్ మామ్.

సంతోష్ భోరున ఏడ్చేసాడు. ఎన్నాళ్ళయ్యిందో కన్నీళ్లు కార్చి కార్చి ఏడ్చి. కడుపు ఆకలికి అల్లాడినప్పుడు ఏడ్చాడు. అడుక్కోడానికి దూరాలు డేక్కుంటూ నడిచినా సరిగా అన్నం దొరకనప్పుడు ఏడ్చాడు. ఇప్పుడు… ఇప్పుడు ఆనందంగా చెప్పలేనంత ఆనందంగా ఏడ్చాడు. నవ్వు ఎరగనివారికి నవ్వడం నేర్పడం ఆకలిగొన్నవాడికి అన్నం పెట్టడంతో సమానం. నడవలేని వాడికి కరమందించడం కంటే నువ్వు ఎన్నో కార్యాలు సాధించగలవని భుజం తట్టడం అత్యంత గొప్ప సహకారం. అసలీ ప్రపంచంలో అభినందన అన్న మాట ఎందరికో ఊపునిస్తుంది. ఉన్నతంగా ఎదిగేందుకు ఊతమవుతుంది. సంతోష్ విషయంలో అదే జరిగింది.

పట్టుదలగా పనిచేశాడు. విభిన్న సమస్యలున్న ఇతర దివ్యాంగులను కలుపుకున్నాడు. నేర్పాడు. వాళ్లకి ఆడియో సౌలభ్యమే వుంది కానీ వీడియో లేదు. టీవీ అక్కడ చూడనివ్వరు.. అందుకని పాట సాహిత్యం బట్టి స్కూల్లోని అన్నల సలహాలూ తోడ్పాటు బట్టి డాన్సు పెర్ఫెక్ట్ గా తయారు చేసాడు.

బాలల దినోత్సవం రోజు సంతోష్ ఉత్సాహానికి అంతు లేదు. స్కూల్ టీచర్లు మంచి బట్టలు కొన్నారు. మేకప్‌మాన్ని పిలిపించి అందరికి మేకప్ చేయించారు. లిప్ స్టిక్ వేశారు. బుగ్గలకి రంగేసి చమ్కీలు అద్దారు. చేతులకి రిబ్బన్స్ తలకి స్కార్ఫ్ లూ కట్టారు.

‘నీకు చేత కాదు… నువ్వు పనికి రావు… నీది ప్రేక్షకపాత్రే. మూల కూర్చో, ఎవ్వరి కాళ్ళకి అడ్డురాకు’ ఇలాంటి మాటలే వింటూ పెరుగుతున్న ఆ పిల్లలు ఎదుర్కున్న మొదటి ఛాలెంజ్ అది. ‘ఆది’ సినిమాలోని పాట ‘చిందులు వేసే వయసేలే’ చేశారు. చప్పట్లు మారుమ్రోగిపోయాయి.

“సంతోష్ మన హాస్టల్ బిడ్డ. ఆతను చదువులోనూ ఆటల్లోనూ ముందుంటాడని మనందరికీ తెలుసు. డాన్సులోకూడా తనది స్పెషల్ మార్క్ అని చూపించాడు. అతన్ని అభినందిద్దాం. ఆశీర్వదిద్దాం. ఎంతో ఎంతెంతో ఎత్తుకు ఎదుగుతాడని ఆశిద్దాం. సంతోష్ అండ్ పార్టీకి చప్పట్లు జోరుగా ఇంకా ఇంకా జోరుగా కొట్టండి” అంది ప్రిన్సిపాల్ మేడం.

స్కూల్ బిల్డింగ్ దద్దరిల్లేలా, పక్క వీధులకి కూడా ఆ శబ్దం వినిపించేలా చప్పట్లు కొట్టారందరూ. స్కూల్లో ఇతర క్లాసులకి చెప్పే టీచర్లు షేక్ హాండ్ ఇచ్చారు. నలభై మంది స్కూల్ టీచర్ల కరచాలనం తాలూకు వెచ్చదనం అతని ఒంటికి మరింత వేడి నిచ్చింది. అగ్ని గుణం రగిల్చడం, వెలిగించడం వ్యాపింపచెయ్యడం కదా.

సంతోష్ విషయంలో అదే జరిగింది. ఇతర దివ్యాoగులకి ఆత్మవిశ్వాసం పెరిగింది. మనం ఏదైనా చెయ్యగలం ఎంతైనా చెయ్యగల, అన్న భావం వారి కళ్ళల్లో వ్యక్తమయింది. సంతోష్ ఒక్కసారిగా వాళ్ళ బళ్ళో ప్రముఖుడయ్యాడు. హాస్టల్లో మరింత గుర్తింపును పొందాడు. దాంతో సబ్ జూనియర్ అయినా సంతోష్ పెద్ద పిల్లలకి కూడా డాన్సులో ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టాడు. ఆడపిల్లలు వైకల్యం తాలూకు న్యూనత వీడి అతని విద్యార్ధినులయ్యారు.

ఆశా నిలయం హాస్టల్ టీంకి రకరకాల అవకాశాలు వచ్చేలా ఎందరో సహకరించారు. దాంతో వాళ్ళు ఎన్నో చోట్ల తమ సత్తాని చాటారు. ప్రొద్దున్న ప్రార్థనా సమయంలో ప్రిన్సిపాల్ మేడం పిల్లలందరికీ స్ఫూర్తి ఇచ్ఛేలా సంతోష్ అండ్ పార్టీ సంగతులు చెప్పసాగింది.

లారెన్స్ మాస్టర్ దివాంగులందరికీ స్ఫూర్తి ఇచ్సిన గురువు. సంతోష్ కూడా ఆయన ఏకలవ్య శిష్యుడు. స్టైల్ సినిమాలోని ప్రతీ డైలాగ్ పిల్లలందరికీ కంఠో పాఠం. రోజూ రాత్రి ఎనిమిది దాకా చదువుకోవాలి. ఆ తర్వాత పదిగంటల దాకా టేప్ రికార్డర్ పెట్టుకుని డాన్స్ ప్రాక్టీస్ చెయ్యడం, రకరకాల ప్రాపర్టీలు చేర్చుకోడం అంటే కుర్చీ లేదా బల్ల సాయంతో నాట్యం చెయ్యడం వగైరా అలవాటుగా మారింది. మిత్రుల సూచనలు కూడా తీసుకునే పద్ధతిని సంతోష్ పాటించడం వల్ల వాళ్లకి ఎన్నోచోట్ల కార్యక్రమాలు చేసే అవకాశం రావడమే కాక వారి ఆత్మా విశ్వాసాన్ని పెంచేలా డబ్బుకూడా చేతికి రాసాగింది. సంతోష్ టీం అంటే తెలియనివాళ్ళు లేనంతగా ఆ పిల్లలు పాపులర్ అయ్యారు.

సంతోష్ తన రోజులో ప్రతీ నిముషాన్ని వృధా చెయ్యకుండా చూసుకోసాగాడు. చదువు, నృత్యమే కాక ఆటల్లోనూ అగ్రగణ్యుడిగా వున్నాడు. షార్ట్ ఫుట్, డిస్క్ త్రో మొదలైన ఎన్నో ఆటల్లో ఆతను అందె వేసిన చెయ్యిగా చెప్పాలి.

సంతోష్ ఆటల్లో రాణించడానికి కారణం పీటీ సర్ అశోక్. స్కూల్ మొత్తంలో 1500 మంది నార్మల్ పిల్లలు వున్నారు. వాళ్లకి అయన కోచింగ్ ఇచ్ఛేవాడు. ఆయన మనసులో దివ్యాoగులపై సాఫ్ట్ కార్నర్ వుంది. అందుకని

హాస్ట‍ల్‌కి వెళ్లి సాయంత్రం నాలుగున్నర నుండి 6 దాకా వాళ్లకి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం ఆయన ప్రత్యేకత. దివ్యాoగుల కోసమని పారాలింపిక్ స్పోర్ట్స్ ఉంటాయి. దివ్యాంగుల వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారితో సంప్రదించి పిల్లలు అన్ని పోటీల్లో పాల్గొనేలా చూసిన ఘనత ఆయనది.

“నీలో స్పార్క్ ఉందిరా, నువ్వు ఆడగలవు” అని బలవంతపెట్టి సంతోషులోని క్రీడ కళని బయటకి తీసాడు అశోక్ సర్. ‘అందరూ నిలబడి చేస్తున్నారు, నేను చెయ్యలేను అనుకోకు. కూర్చుని నీ సత్తా చూపించు’ అని చెప్పడం సంతోషుని ఉత్సాహపరచింది.

ముఖానికి రంగులు వేసుకుని లక్షలు కోట్లల్లో పారితోషికం తీసుకుని నటించేవారు అసలైన హీరోలు కారు. అటు వైకల్యమూ ఇటు దాని తాలూకు వ్యాకులతా వున్న వారిని దివ్యంగా తీర్చి దిద్దిన అశోక్‌ని హీరోగా చెప్పి తీరాలి.

‘మజిల్ పవర్ పెరిగితేనే నువ్వు బాగా ఆడగలవు. నీ కాళ్ళశక్తి చేతుల శక్తి కూడా చేతుల్లోనే ఉందని గుర్తుంచుకో’ అని ఎన్నోసార్లు గట్టిగా చెప్పాడు. హాస్టల్లో కూడా పోషకాహారం క్రీడల్లో వున్న పిల్లలకి సరిగ్గా అందుతుందో లేదో సమీక్షించి ప్రిన్సిపాల్‌తో కూడా ఆ సంగతులు వివరించిన అశోక్ సర్ సంతోష్ మనసులో మిత్ర స్థానం కాదు పితృస్థానం కాదు భగవంతుడి స్థానం పొందాడు.

సిట్టింగ్ త్రో బాల్లో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్ఛే ఆటను కూడా సంతోష్‌కి ఇతర దివ్యాoగులకూ నేర్పించి వారు పర్ఫెక్ట్ అయ్యేదాకా నిద్రపోని అశోక్ సర్ ”నేనింక స్కూల్‌కి రాలేను” అని చెప్పాడు ఒక రోజు.

”అదేంటి సర్ అలా అంటున్నారు?” అందరికంటే కంగారుగా అన్నాడు సంతోష్.

“నాకు గవర్నమెంట్ స్కూల్లో వుద్యోగం వచ్చింది సంతోష్” ‘అన్నాడు అశోక్ సర్.

“కంగ్రాట్స్” అనలేదు సంతోష్. “మీరు లేకపోతె మా గతేంటి సర్?” అన్నాడు.

“నేను స్కూల్ కి రాను అన్నాను కానీ హాస్ట‍ల్‌కి రాను అనలేదు కదా”

“మీరన్నమాట అర్థం కాలేదు సర్” అన్నాడు సంతోష్.

“నార్మల్ పిల్లలకి ఎవరు నేర్పినా ఫర్వాలేదు. మీ విషయం అలాకాదు.. మీకు నా అవసరం చాలా ఉంటుందని నాకు తెలుసు. అందుకని మిమ్మల్ని తీర్చిదిద్దడమే కాదు మీతో ప్రయాణాలకు తోడుగా వుండే బాధ్యతని కూడా వొదిలిపెట్టను” అన్నాడు అశోక్.

థాంక్స్ అని షేక్ హాండ్ ఇవ్వాలో నమస్కారం సంస్కారవంతంగా పెట్టి కృతజ్ఞతని తెలపాలో సంతోష్ లేత బుర్రకి అర్థం కాలేదు. కానీ అతని మనసు ఆలోచించుతున్న విధానాన్ని అర్థం చేసుకుంటున్నట్టుగా నవ్వి సంతోషుని దగ్గరికి తీసుకున్నాడు అశోక్ .

కొన్ని బంధాలకి అర్థం చెప్పడం అసాధ్యం. అనుబంధాలకు దూరం కావడం దుర్లభం. సంతోష్‌కి సర్ తనని వొదిలి వెళ్ళిపోతారు అన్న విషయం ఎంత బాధాకరమో సంతోషుని తీర్చిదిద్దకుండా వెళ్ళిపోవడం అనే వూహ కూడా అశోకకీ అంతే బాధాకరం.

అంతర పాఠశాలల కార్యక్రమాల పోటీల్లో (ఆటలు నృత్యాల్లో) పాల్గొనే అవకాశం పొందడానికి కారణం అశోక్ సర్ మాత్రమే. ఎక్కడెక్కడో తిరిగి ఎవరెవరినుండో విషయాన్ని సేకరించి పిల్లలని పురికొల్పి హాస్టల్ సిబ్బందికి నచ్చచెప్పి తాను తోడుండి మరీ తీసుకు వెళ్లే మంచి ఉపాధ్యాయుడు అశోక్ అని అందరూ అంటుంటారు. కానీ అశోక సర్ లో తల్లి తండ్రి గురువు దైవం అందరూ కనిపిస్తారు.

అశోక్ ప్రభుత్వ పాఠశాలలో చేరిపోయినా సెకండ్ సాటర్డే సండే సంతోష్ వాళ్ళకే కేంద్రీకరించసాగాడు. ఇల్లు పక్కన కాదు.కుటుంబ బాధ్యతలూ లేకపోలేదు. అయినా సరే ఆయన అలాగే చేస్తూ పోయాడు.

ఒకసారి మెరిసే కళ్ళతో చెప్పాడు అశోక్ సర్ ”చెన్నైలో అంతర్జాతీయ దివ్యాoగుల కార్యక్రమం జరగబోతోంది. మనం అందులో పాల్గొంటున్నాము.”

“చెన్నై వెళ్తే సముద్రం చూడచ్చు. ఇంకా ఎన్నెన్నో చూడచ్చు కదా సర్” అన్నాడొక అబ్బాయి.

“మనం చెన్నై వెళ్తున్నది తీరికగా సరదాగా తిరిగి రావడానికి కాదు, తపస్సులా భావించి పోటీలో పాల్గొని బహుమతులతో తిరిగిరావడానికి. అర్థమయ్యిందా?” అన్నాడు అశోక్ సర్.

“నేను పదిరోజులు లీవ్ పెట్టి వోచ్చాను మేడమ్, మీరు వాళ్ళని గురించి ధైర్యంగా వుండండి” అని హాస్టల్ ఇంచార్జి సిస్టర్‌కి చెప్పాడు.

“పదిరోజులు లీవ్ పెట్టారా వీళ్ళ కోసం” ఆశ్చర్యంగా అడిగింది సిస్టర్.

“అవును మేడం. వీళ్ళు ఎదిగేందుకు చేయూత ఇచ్ఛే బాధ్యత నాది. కమాన్ బాయ్స్ అటు ఆటలు, ఇటు డాన్స్ అన్నింటిలోనూ మన హాస్టల్‌కి బహుమతులు రావాలి. కాదు వొస్తాయి. మీరందరూ బహుమతుల కోసం కష్టపడరు. నాకు మీరు గెలిస్తే ఇష్టమని కష్టపడతారు. అవును కదా” నవ్వాడు అశోక్.

“అవును సర్” అన్నారు పిల్లలు.

(ముగింపు వచ్చే వారం)


     

Exit mobile version