దివ్యాంగ ధీరులు 6 – దివ్యాంగులకు ధైర్యం స్థైర్యం ఈ దివ్యాంగుడు

9
2

[box type=’note’ fontsize=’16’] దివ్యాంగులైనప్పటికీ, ధీరత్వంతో జీవనపోరాటం సాగిస్తున్న వ్యక్తులను పరిచయం చేస్తున్నారు గురజాడ శోభా పేరిందేవి. బిల్ల మహేందర్ తన వైకల్యాన్ని అధిగమించిన తీరుని వివరిస్తున్నారు. [/box]

[dropcap]”బా[/dropcap]పమ్మా”

అప్పుడే కూలి పని నుండి వొచ్చి స్నానం చేసి విశ్రాంతిగా కూర్చున్న బాపమ్మని పిలిచాడు మహేందర్.. ఆమె పలకలేదు……

“ఓ బాపమ్మా”

“ఏందిరా?”

“మా దోస్తులంతా అమ్మ, బావులతో ఉంటరు, తింటరు, పంటరు. మా బాపు సాల్కి ఒక్కసారి వొచ్చి జెరాన్ని దినాలుండి పోతాడేందుకు? బాపుకు మేమంటే ఇష్టం లేదా చెప్పు బాపమ్మా?”

“అట్లెందుకనుకుంటున్నవ్ బిడ్డా”

“నా కట్లనే కానొస్తుంది కదా బాపమ్మా”

“మీ బాపు మీకోసం దినానికి 12 గంటలు కష్టపడుతుండు. పొద్దుగూకులు పనితప్ప వానికి బొంబాయి కాడ ఇంకే ముచ్చటా ఉండదు బిడ్డా. బొంబాయి పోయినప్పటిసంది అంతనే.”

“మల్ల మమ్మల్నిభీ ఆడికే తోల్కపోయి సద్విపియచ్చుగా. మా దోస్తులు కొందరట్లనే పోయిన్రుగా బాపమ్మా”

“అట్లా అసుంటి చోట వుండకుంట మంచిగా సదువుకుని మీ ముగ్గురూ గొప్పోళ్ళు కావాలన్నది మీ బాపు కల రా అయ్యా. తాత మగ్గం పని చేస్కుంటా చేస్కుంట పెద్దమనిషయ్యిండు. నేను మీ అమ్మ కూలికోతున్నాం. గా చాకిరి చేయకుంట సదూకుని మంచి కొలువుల మీరుండాలని ఎప్పుడూ యోచిస్తుంటడు” కొడుకు గురించి చెప్పి నిట్టూర్చింది బాపమ్మ.

“బాపమ్మా?”

“ఊ”

“బాపు చాలా గొప్పొడు కదా”

బాపమ్మ మహేందర్నీ దగ్గరికి తీసుకుని “అవుఁరా అయ్యా” అంది.

“బాపుని ఖుషీగా ఉంచాలంటే మీరు ముగ్గురు మస్తుగా సదవాలె. మంచి కొలువులకేక్కాలే.”

“అట్లనే బాపమ్మా” అన్నాడుమహేందర్.

“యాడి కొయినా లీడర్ లెక్కనే పోవాలే.”

“లీడర్ అంటే ఎవ్వరు బాపమ్మా ?”

“మందిలో ఒకనిగా కాకుంట వందలో ఒకనిగా ఉండేటోడే లీడర్”అంది బాపమ్మ.

“ఇంక జర మంచిగ చెప్పు బాపమ్మ సమజైతలేదు”

“మంచి పనులు చేసేటోడు మంచోడంటామా లేదా?”

“అవును”

“లీడర్ మంచి పని చేసేటోడే కాదు మంచి పనులు చేపించేటోడు కూడా”

“అట్లనా?” ఆశ్చర్యంగా అడిగాడు

“తానూ ముంగటికి నడ్సుకుంటా నడ్సుకుంటా పోతూ తన వెంబడి వందమందిని నడిపించుకు పోయేటోడే లీడర్. నువ్వట్లా కావాలె. ఎరుకయ్యిందా?”

“అట్లా నేనెట్లయితా బాపమ్మ??”

“ఎందుకు కాలేవురా?’

“నా కాళ్ళు మంచిగుంటే కదా నేను జల్దీ జల్దీ ముంగటికి నడిచేది. నేను సరిగ్గా నడవలేనప్పుడు మందినెట్లా ముం గటికి తోల్క పోవాలి బాపమ్మ?”

“ముందుకొనికి కావాల్సింద దిల్ కానీ కాలు కాదు బిడ్డా. మంచి యోచన చేస్తా పోతావుండాలెప్పుడు. అప్పుడుకాలు మెల్లనఁగనే మంచి దార్ల తోల్కపోతది.”

బాపమ్మను మరో ప్రశ్న వెయ్యలేదు మహేందర్. ఆలోచిస్తూ వుండిపోయాడు.

సెలవుల్లో వూరికి వొచ్చిన బాపుకి బాపమ్మ అమ్మ రకరకాల వంటలు చేసి తినిపిస్తుంటే పిల్లలు ముగ్గురూ చుట్టూ మూగి తండ్రితో ఎన్నెన్నో మాట్లాడాలని తపనపడసాగారు. వాళ్లందరితో గడిపే కొన్ని గంటలు మళ్లీ వత్సరం దాకా  ఆ తండ్రిని ఉత్సాహపరిచే ఊతాలు.

వరంగల్ జిల్లాలోని వేలేరు గ్రామంలో ఇక్కడో ఇల్లు అక్కడో ఇల్లు కనబడినా ఎక్కువశాతం పొలాలు, చెట్లూ చేమలతో కళకళలాడుతూ ఉంటుంది. పొలాలకు దగ్గరలో ఇల్లు, ఇంటికి మరికాస్త ఎడంగా చెరువు, చెరువుకు కూసింత దూరంలోనే బావి, ఆ వాతావరణం చాలా చిన్నతనంనుండి మహేందర్‌ని ఆహ్లాదపరుస్తూ వొచ్చింది. ప్రకృతి ఒడిలో నేర్చిన విద్య విశేషమైనది. రైతన్నల శ్రమ, కూలీల కష్టం, తోటమాలి మొక్కలూ చెట్లనుకన్నవారిలా చూసుకునే వైనం సహకరించే అంశం మహేందర్ మదినిండా మంచిని పెంచాయి.

రాళ్లదెబ్బలు తింటున్నా ఇవ్వడమే తప్ప తీసుకోడం తెలీని చెట్లు, అతివృష్టి అనావృష్టుల మధ్య అల్లాడుతున్నా పంటపొలాలకు అంకితమైన రైతన్నలు, గ్రామంలో కష్టం నష్టం వొచ్చ్చినా కరమందించే గ్రామస్తులూ మహేందర్‌కి కనబడని గురువులై మార్గ నిర్దేశం చేశారు.

లక్ష్మీనారాయణ ఉపాధ్యాయుడు, సిధ్ధాంతకర్త. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ అసోసియేషన్‌లోముఖ్య భూమిక వహిస్తూ నిత్యం చురుకుగా వుండేవాడు. వరంగల్ పట్టణానికి చెందిన తను వేలేరులో కొంతకాలం పనిచేయడం వల్ల ఆ ఊరు అంటే చాలా మక్కువ. అందుకే రిటైర్డ్ అయ్యాక కూడా ఎండాకాలం దినాలలో ఆ ఊళ్ళో మహేందర్ వాళ్ళ ఇంటి పక్కన కిరాయి తీసుకొని పిల్లలకు గ్రామర్ చెప్పేవాడు.. సంఘహితానికి సంబంధించిన అంశాలంటే ఆయనకీ అమితమైన ఇష్టం ఉండడంవల్ల కొన్ని పుస్తకాలను నిత్యం చదువుతూ ఉండడం మహేందర్‍ని ఆకట్టుకుంది. ఆయన నేర్పిన గ్రామర్ పరీక్షల్లో మంచి మార్కులు తెప్పిస్తే ఆయన ప్రవర్తన, పఠన సమాజంలోని సంగతులను పరిచయం చేసింది. ‘ఈ పుస్తకాలను మీ ఇంట్లో దాచు’ అంటూ ఆయన ఇచ్చిన పుస్తకాలను బాల్యంలోనే చదవడం జరిగింది. అవన్నీ మహేందర్ చదివినట్టు కూడా ఆయనకీ తెలీదు.

అన్ని పుస్తకాలూ ఒక ఎత్తయితే శ్రీశ్రీ మహా ప్రస్థానం ఒక్కటే ఒక ఎత్తు. ఆ పుస్తకం మహేందర్‌కి ప్రాణప్రదం. అందులోని పదం పదం ఆ చిరుప్రాయంలోనే అతనికి కంఠస్తం. లక్ష్మీనారాయణగారి పుస్తకాలు ప్రతినిత్యం వెంటాడడం, ఆలోచించేటట్లు చేయడం, అడుగు ముందుకేసేలా ప్రేరేపించడం జరగసాగింది.

మహేందర్ అన్న యుగంధర్. సెలవులకు వూరొచ్చిన బాపుతో “బాపూ” నెమ్మదిగా పిలిచాడు యుగంధర్.

“ఏంది బిడ్డా?”

“నేను నీ ఎంబడి వొస్తా”

“యాడికి?”

“బొంబాయికి”

“ఎందుకు?’

“దోస్తులు సదువాపి అయ్యల పన్లలోకి పోతుండ్రు. నేను పెద్దగైనకదా. పదవ తరగతి కూడా ఐపోయింది. నీకు జర సాయంగుంటది. ఎన్నాళ్ళు మా కొరకు రెక్కలు ముక్కలు చేస్కుంటవ్?” అంటున్నప్పుడు మహేందర్ కూడా ఆ మాటలు ఇన్నాడు.

బాపు ఆ ఇద్దర్ని దగ్గరకు తీసుకునికన్నీళ్ళు పెట్టుకున్నాడొక క్షణం. తర్వాత కొడుకుని మోచేతి దూరంలో నిలబెట్టి ఇలా చెప్పాడు.

“నా లెక్క నా కొడుకులు కూలీలకోకూడదు, మా జమానాలనుండే వలసపోవుడు కూలి పైసల్తో బతుకుడు ఆగిపోవాల. ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో బతకాలె.. మీరాడికి వొచ్చుడు నాలెక్క బతుకుడు నాకిష్టం లేదు కొడుకా. మీరు దొరల్లెక్క ధీమాగా బతకాలి. ధైర్యంగా బతకాలి. పక్షులకి రెక్కలెట్లనో మనకి చేతులట్లా సాయం. పక్షులు రెక్కలూపుకుంటూ స్వేచ్ఛగా మీదిమీదికి ఎట్లెగురుతాయో మీరట్లా పైకి రావాలె. మెరవాలే. గది సూసి నేను మురవాలే….”

“వొద్దు. వొద్దు. మీరు అసలే రావద్దు. సదువుకుని కొల్వులకి మీరే దినమెక్కుతరో ఆ దినం మీరు నాకు సాయం చేసినట్లే. పది తరగతితోనే సదువాపొద్దు.. కాలేజీ సదువులు సదివా ఉద్యోగాలు తెచ్చుకోవాలి కొడుకుల్లారా..”

తల ఊపారు ఇద్దరు. అక్కడినుండి వచ్చేసాడు మహేందర్.

కానీ అతని మనసునిండా వందలాది ఆలోచనలు. వేలాది ఊహలు. తండ్రి కాళ్ళకి మొక్కాలనిపించింది. అతన్ని మనసారా అభినందించాలనిపించింది.

“అసలైన తండ్రివి నువ్వే బాపు”అని చెప్పాలనిపించింది. కానీ ఏమీ చెయ్యలేదు. దానికి కారణం తాను చేసినవేవీ తండ్రికి అర్థం కావు. అతను అత్యంత సింపుల్‌గా పెరిగిన వ్యక్తి. పని తప్ప లోకం ఎరుగనివాడు. బాల్యం కావొస్తూనే మొదలైన పని ప్రాయం జారిపోతున్నా అంటి పెట్టుకునే వుంది.

కాలేజీ సదువుల పుణ్యమా అని ఇది అది అని కాక ఎన్నో పుస్తకాలు చదవడం వల్ల ప్రపంచంలోని ఎన్నో విషయాలు అర్థమయ్యాయి. కుల, మతాల పేరిట జరుగుతున్న అణచివేత సంగతులు తెలిసాయి. అసమానత, అస్పృశ్యత అన్ని చోట్లా ఈ ఆధునిక కాలంలో ఉండడమూ ఆశ్చర్యపరిచింది. బాలకార్మికుల బాల్యం బుగ్గిలోకి పోతోందని ఆ సంగతిని అటు నిరక్షరాశ్యులైన తల్లితండ్రులూ ఇటు సభ్యసమాజమూ పట్టించుకోకపోవడం శోచనీయమని గ్రహించిన మహేందర్ తన మిత్రులెందరో చదువును మధ్యలోనే ఆపేసి కూలికి వెళ్లడం చూసాడు. పదవ తరగతి దాకా వచ్చిన వారే తక్కువ. కొందరు 3వ తరగతితోనూ, ఇంకొందరు అయిదవతరగతితోనూ, ఇలా పదవ తరగతి దాకా రాకుండానే కూలీలుగా, వలసకార్మికులుగా మిత్రులెందరో సెట్ అయిపోయారు. పదవతరగతి దాకా వచ్చిన వారు తక్కువగా వున్నారు.

తన తండ్రి మాత్రం మిత్రుల తండ్రులకు భిన్నంగా పిల్లల్ని చదివించడమే లక్ష్యంగా పెట్టుకోడం కన్నీటి పర్యంతమయ్యేలా చేసింది. ఏదో పుస్తకంలో చదివిన విషయం మహేందర్‌కి బాగా గుర్తుంది. పదిమిలియన్లకంటే ఎక్కువమంది పిల్లలు మనదేశంలో బాలకార్మికులుగా పనిచేస్తున్నారు. కానీ అందులో తమని చేర్చడానికి ఇష్టపడని తండ్రి ఎంతెంత గొప్పవాడో.

ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ రాసిన ‘ది క్రై అఫ్ చిల్డ్రన్’ పాఠంగా చదువుకున్నాడు మహేందర్. అడుగుపడని పాదాలతో, మూసుకుపోతున్న కనురెప్పలతో పాలుకారుప్రాయంలో వున్న పదేళ్ళపిల్లలు భయంకరమైన పరిశ్రమల్లో లెక్కలేనన్ని గంటలు రోజుకు శ్రమిస్తున్నారని ఆమె ప్రపంచంలోనే మొట్టమొదటి బాలకార్మికుల కవిత్వ పుస్తకంలో కదిలిపోతూ లిఖించింది. వందల వత్సరాల తర్వాత కూడా ఆ కవిత్వం పాఠ్యంశంగా వుంది. పదుగురినీ ఆలోచింప చేస్తోంది. కానీ పరిస్థితులు ఈనాటికీ మారకపోడం బాధాకరం.

పిల్లలు నేడు వెనకబడిన దేశాల్లో కూలీలుగా,అత్యంత కష్టతరమైనవి ప్రమాదకరమైనవి అయిన పనులు ఎన్నెన్నో గంటలపాటు చేస్తున్నారు.

ఆటాడే ప్రాయంలో
ఆటవస్తువులు తయారీలో
నిద్రించే సమయంలో
నిలబడి చేసే పనులతో
నీరుకారిపోతోంది పసితనం
బడికి పోయే కాలంలో
బందూకులు చేస్తూ
అల్లరి చేసే వయసులో
ఆటమ్ బాంబులు చుడుతూ
పారిపోతోంది పాలుగారే కాలం
వల్లెవేయాల్సిన వత్సరాల్లో
వలసపోవలసి రావడం
కథలు వినే కాలంలో
కార్మికులై పనిచెయ్యడం
కూలీలుగా మిగలడమే భవితవ్యం,
కన్నవారు కదలాలీ కథల్ని ముగించడానికి
ప్రభుత్వాలు పట్టించుకోవాలి పేదల కష్టాలని
సమాజం సహకరించాలీ సమస్య పరిష్కారానికి
ప్రపంచంలో పిల్లలెవరూ కూలికి రాకుండా కాపు కాయాలి (శోభాపేరిందేవి)

మహేందర్‌ని “నువ్వు దివ్యాంగుడివి పక్కకి తప్పుకో” అనే ఎవ్వరూ అనలేదు. మరోలా చెప్పాలంటే మరింత శ్రధ్ధగా చూసుకున్నారు. కొన్ని ఆటలు దివ్యాంగుడైన మహేందర్ అందరితో సమానంగా అన్ని ఆటలు ఆడేవాడు. ఆడరాని ఆటలు ఆడే వాళ్లను చూస్తూ కూర్చునేవాడు.

“మీ బాపు మంచోడు. నిన్ను సదువు కొమ్మంటుండు” అని మిత్రులంటుంటే మహేందర్ గర్వంగా తలూపేవాడు. గొప్పతండ్రి అని ఎంచి ప్రతీ సంవత్సరం అవార్డును జూన్ నెలలోని పితృదినోత్సవానికి అందిస్తారట. లక్ష్మీనారాయణగారి పుస్తకాలందించిన విషయాల్లో అదొకటి. కానీ అది అందుకునే వ్యక్తి, అందుకున్న వ్యక్తి కూడా తన బాపు ముందు తక్కువగానే అనిపిస్తున్నారు. పిల్లలకోసం అక్రమార్జనలు చేసి కోట్ల రూపాయలు కూడబెట్టిన తండ్రి తన దృష్టిలో గొప్పవాడు కాదు. చెమటోడ్చి పైసా పైసచేర్చి రోజుకు పన్నెండు గంటలు కష్టించి వలస కార్మికుడుగా రాష్ట్రం కానీ రాష్ట్రంలో శ్రమిస్తున్న తండ్రికి సరైన పోషకాహారం లేదు, విశ్రాంతి లేదు. మనోల్లాసం కలిగించేవేవీ లేవు. అయినా సరే ఏళ్ల తరబడి అలా కష్టపడి ఇలా తమని పోషిస్తూనే వున్నాడు బాపు. ‘బాపూ నువ్వు చేస్తున్న పనికి నీకు కృతజ్ఞతలు, వందనాలు అర్పించుకుంటున్నాను. ఆత్మగౌరవానికి అసలైన అర్థంగా వుండి నా కొడుకులకి నాలాంటి బతుకులొద్దు అన్న నిశ్చయంతో శ్రమించిన ఉత్తమ తండ్రివి బాపు నువ్వు’ అనుకున్నాడు మహేందర్. అప్రయత్నంగా అతని కలం కాగితాలమీద పరుగు తీసింది. దాన్ని కవిత అంటారని తెలీదు. బాధ కలిగినా ప్రకృతి సౌందర్యాన్ని గాంచినా సంతోషం వోచ్చినా అలా రాయడం మాత్రం అలవాటయ్యింది మహేందర్‌కి.

***

ఇంటర్, డిగ్రీ చదువు సజావుగా సాగింది. అన్న ఐటీ చదువు పూర్తి చేసి టివి మెకానిక్ పని నేర్చుకొని సంపాదన మొదలు పెట్టడంతో వేన్నీళ్ళకి చన్నీళ్లుగా తోడ్పాటు లభించింది. డిగ్రీలో తెలుగు సబ్జెక్టు తీసుకున్నాక మహేందర్ బుల్లి కవిగా మారాడు. బీయీడీలో చేరాడు. చదువులో ఎప్పుడూ ముందే ఉండడంవల్ల ఏ నాడూ ఎక్కడా అతనికి ఇబ్బంది కాలేదు. ఒకసారి విద్యార్థులంతా నాగార్జునసాగర్‌కి పిక్నిక్ వెళ్లారు. ‘నువ్వు కూడా రా’ అని మహేందర్‌ని పిలిచారు కానీ వెళ్ళడానికి మనస్కరించలేదు. అందరూ వుత్సాహం ఉరకలు వేస్తుంటే వయసు ఆ ఊపును పెంచుతుంటే పరుగులు తీస్తూ ఎంజాయ్ చేస్తారు. కానీ తన పరిస్థితి అది కాదుగా.

ఆర్థిక పరిస్ధితి అట్టడుగున ఉండడంతో కోరికలంటే ఏమిటో తెలీకుండా పెరిగాడు. కాలికి సమస్య ఉండడంతో కనీసం తన ఈడు పిల్లల్లా ఆరుబయట ఆనందంగా పరుగులు పెట్టినది లేదు. ఆడే వాళ్ళని చూస్తూ కూర్చోడమేనా ఎప్పుడూ తాను చేసేది?

జలజల పారే నాగార్జున సాగరాన్ని సందర్శించడానికి కూడా తన వైకల్యం వల్ల ఆలోచిస్తూ ఉండవలసిందేనా? రాత్రి ఆలోచిస్తూ పడుకున్న మహేందర్‌కి మార్టిన్ లూథర్ కింగ్ సందేశం లక్ష్మీనారాయణగారి పుస్తకాల్లో చదివినది గుర్తొచ్చింది.

ఎగరలేకుంటే పరిగెత్తు
పరిగెత్తలేకుంటే నడు
నడవలేకపోతే డేకు.
కానీ ఆగకు
సాగడం ఆపకు.

మహేందర్ నాగార్జునసాగర్ బయల్దేరాడు. తనమిత్రులు తనకోసం నడక వేగం తగ్గించి నిదానంగా నడుస్తూ సహకరించడం చాలా సంతోషం కలిగించింది.

సహకారం అనేది చెయ్యాలంటే ముందు చెయ్యవలసిన పని సమయాన్ని ఇవ్వడం. నడవలేనివారు, నడకరానివారు, నడుము వంగినవారు చిన్న తోడ్పాటు కోరతారు. అది తమతో నిదానంగా నడవడం, వొళ్ళు తూలితే పడకుండా ఆపడం… అవన్నీ చేయగలగడం అంట తేలిక కాదు. అందులో పరుగులుతీసే వయసు వారికసలే వీలు కాదు. కాని తన మిత్రులు మొత్తం తనతోనే వున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ నెమ్మదిగా సాగారు.

నాగార్జునసాగరం గలగలా నవ్వుతూ ఆహ్వానించింది,
తళతళ మెరిసి మురిసి పోతూ తమ రాకకి సంతసాన్ని వ్యక్తం చేసింది.
హోరు హోరున శబ్దంచేస్తూ తనభాషలో కబుర్లాడింది.

ఆ పిక్నిక్ మహేందర్ కాలానికి బలాన్నిచ్చింది. మనసుకు తృప్తినిచ్చింది. ఇందరు మిత్రులు నాకున్నారన్న నమ్మకాన్ని కలిగించింది. బాపు,అన్న సహాయం వల్ల చదువు పూర్తి కాగానే దేవురుప్పల మండలంలో వుద్యోగం లభించింది. మహేందర్‌తో పాటు ఉద్యోగస్తులయిన మిత్రులు తమ ద్విచక్రవాహనాల మీద మహేందర్ తీసుకునివెళ్ళడం, రావడం చేసేవారు. అతనికి పోలియో వల్ల ఎడమ కాలు చాలా బలహీనంగా ఉంటుంది. కాలు బలహీనమైందని మహేందర్ ఎప్పుడూ నిరుత్సాహ పడలేదు. బలమైన మిగిలిన కాలు చేయూతతో ముందుకు సాగుతూ వచ్చేవాడు. ఒక్క కాలితో సైకిల్ తొక్కడం నేర్చాడు. రెండు చక్రాల బండి‌ని బాలన్స్ చేస్తూ నడిపిస్తాడు. వుద్యోగం రావడంతో ఉత్సాహం మరింత పెరిగి ఆత్మవిశ్వాసం అండ దండగా నిలిచింది.

చెల్లి పెళ్ళికి చాలా డబ్బు అవసరమయ్యింది. అప్పులు చెయ్యక తప్పలేదు.

కాలికి సమస్య ఉండడం వల్ల కలలు కనడం అంటే ఏమిటో తెలీకుండా బాల్యం, తొలి యవ్వనం గడిచాయి. అప్పట్లోనూ కలలు వచ్చేవి. ఆ కలల్లో తాను నడుస్తున్నట్టూ తనతోటి వారిని నడిపిస్తున్నట్టు మాత్రమే నిత్యం కలలు రావడం పగలు తలుచుకుంటే నవ్వొచ్చేవి.. సరిగా నడవలేని తాను పక్కవారికి చెయ్యి అందించి నడిపించడమేమిటి?

ఆర్థిక స్థితి బాగుపడ్డాక కానీ కట్నం తీసుకోకుండా ఒక అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానిద్దామనుకున్నాడు… కానీ అదీ వీలుపడలేదు. లక్షల్లో అప్పుంది. ‘నీ చదువు చెల్లి పెళ్లికయిన ఖర్చులు పంచుకుందాం’ అంటూ అన్న లక్షరూపాయల బాధ్యత మహేందర్ భుజాలమీద పెట్టాడు. అందువల్ల కట్నం తీసుకుని పెళ్లి చేసుకుని అప్పు తీర్చాడు మహేందర్.

దానం చెయ్యాలంటే ధనం ఉండాలి. ఇల్లూ వాకిళ్లు కట్టాలన్నా ధనం ఉండాలి. దాచుకోడానికి తోడ్పడే ధనం దోచుకోడంలోనూ ముందుండమంటుంది. కానీ ఎంత దాచినా ఎంత దోచినా దాహము తీరదు. అందువల్ల అవసరానికి ధనాన్ని వినియోగించి మిగతాది పరోపకారానికి వాడడం ఉత్తమం కదా అనిపించసాగింది పదే పదే మహేందర్‌కి. ఆ విధంగా ముందడుగేయమని మనసు ప్రేరేపించసాగింది. పక్కవాడికి తోడ్పడేంత పెన్నిధి తనకి ఎక్కడ వుంది అనే దిశగా ఆలోచించసాగాడు మహేందర్.

2002లో ఒక ఇంటివాడయిన మహేందర్ ఇద్దరు పిల్లల తండ్రయ్యాడు. 2006 నుండి 2009దాకా అంకుశాపురం వున్నత పాఠశాలలో పనిచేశాడు. అక్కడికి వెళ్ళడానికి ప్రతిరోజూ సగం దూరం స్వంత ద్విచక్రవాహనం మీద, మిగతా సగం బస్సు లమీద ఆధారపడసాగాడు. 2009లో వరంగల్‌కి బదిలీ కావడం జరిగింది. ఇంటికి రెండుమూడు కిలోమీటర్ల దూరంలోనే బడి కూడా ఉండడంతో శ్రమ తగ్గిపోయింది. వెసులుబాటు లభించడంతో వరంగల్‌లో జరిగే సాహిత్య సాంస్కృతిక సభలకు వెళ్లడం ప్రారంభింఛాడు మహేందర్.

తెలంగాణ పోరాటం మహేందర్‌ని ఆలోచింప చేసింది. అక్షరసృష్టిని చేయించింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కవులూ గాయకుల గళాలు ఉద్యమంలోకి ఉరికేలా చేశాయి. వరంగల్ లోని వికలాంగుల పోరాట సంస్థ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఉద్యమం చెయ్యడం ప్రారంభించింది. ఆ కార్యక్రమాలకు హాజరు కావడంతో దివ్యాoగ లీడర్లు పరిచయం అయ్యారు. అధ్యక్షుడు లక్కిరెడ్డి సత్యం, విహెచ్ పిఎస్ టెంట్ వేసుకుని నెలల తరబడి దీక్ష చెయ్యడం మహేందర్ ని ఆకట్టుకుంది. కాళ్ళు రెండింటిలోనూ సత్తువలేకున్నా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొoటున్న ఆయన అంకితభావం ఆరాధ్యనీయమయ్యింది.

వికలాంగుల హక్కుల కోసం పోరాడడం కలసికట్టుగా ఉండడం అవసరమని వారితో చేయి కలిపాడు మహేందర్. దివ్యాoగుల పింఛనులు పెంచాలని, రాజకీయ అవకాశం కల్పించాలని, అత్యాచార,అవమాన నిరోధక చట్టాన్ని తీసుకురావాలని ఆత్మగౌరవం కావాలని, 1% భూమినివ్వాలని ప్రభుత్వానికి వినతిపత్రాన్ని ఇచ్చి కలిసికట్టుగా తామున్నామని తెలియ పరుస్తూ ఒకపక్కన, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం మరొపక్కనా చెయ్యసాగారు దివ్యాoగులు.

మహేందర్ ఉద్యమాల్లో ఉత్సాహంగా పాల్గొనసాగాడు. అటు తెలంగాణ రాష్ట్రం కోసమూ ఇటు దివ్యాగుల హక్కుల కోసమూ పోరాడసాగాడు మహేందర్.

ప్రజలకోసం పనిచెయ్యడం ప్రతీవాడూ నేర్చుకోవాలి. ఆ పని చెయ్యడం అనేది జీవితలక్ష్యం చేసుకోవాలి. మహేందర్ తీరుబడి లేనంతగా బిజీ అయిపోయాడు. ఒక పక్కన వుద్యోగం,మరో పక్కన సంసారం బంధాల్లో బంధించినా బాధ్యతలు సంఘ హితం కోసం కష్టపడడం, తోటి దివ్యాంగుల కోసం ఉద్యమించడం అతని జీవితంలోని ముఖ్య అంశాలయ్యాయి. వొకసారెప్పుడో బంధువు ఒకతను దేవురుప్పల మండల్ బ్యాంకు జనగామలో 60,000 రూపాయలు వేసి ‘అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాను అలాగే ఉండనీ’ అన్నాడు.

హనుమకొండకి వచ్చేసాక డబ్బు తెచ్చివ్వమని అడిగాడు బంధువు.

మహేందర్ బ్యాంకుకి వెళ్లి “ఫలానా బ్యాంక్‌లో డిపాజిట్ అయిన నా డబ్బు ఇటు ట్రాన్స్‌ఫర్ చేస్తే నేను తీసుకుంటాను” అన్నాడు.

“వీలు పడదు” అన్నాడు బ్యాంకు మేనేజర్.

“దయచేసి సహకరించండి. నేను దివ్యాంగుడిని” అన్నాడు మహేందర్.

“దివ్యాంగుడివి అన్నది క్వాలిఫికేషనా?” అడిగాడు మేనేజర్

“అయ్యో లేదు సర్, అది నా లోపం”

“కానీ నువ్వు దాన్ని నీ క్వాలిఫికేషన్‌లా చెప్పుకుంటున్నావు. వికలాంగత్వాన్ని సాకుగా తీసుకోక సాగిపోవాలి. వీలుపడదు, చేతకాదు, అసాధ్యం అనేమాటలను ముందు మీ దివ్యాంగులు మీ మనసుల నుండి తీసెయ్యాలి.

నిన్ను హర్ట్ చెయ్యడానికి ఈ మాటలు చెప్పలేదు. నువ్వు ఆత్మవిశ్వాసంతో వైకల్యాన్ని జయించాలని మాత్రమే చెప్పాను” అంటూ డబ్బును అందించాడు బ్యాంక్ మేనేజర్.

ఎర్రటి సూర్యులం అని కదూ తాను కవిత రాసాడు. అందులోని ప్రతీ వాక్యమూ గుర్తొచ్చింది మహేందర్‌కి.

అవును నిజమే
మేము కనుచూపు లేనివాళ్ళమే
అంధకారంలో ఈ లోకపు వెలుగులను చూడలేకపోయినా
మా మనోనేత్రంతో
ఈ విశ్వసౌందర్యాన్నంతా బంధించే సాహస యాత్రికులం

అవును నిజమే
మేము కదలలేనివాళ్ళమే.
మా పాదాలు అడుగులు భారంగా కదులుతున్నా
విధిని సైతం ధిక్కరిస్తూ మేము వేసే ప్రతి అడుగూ
ఈ భావితర నడవడికలకు మార్గదర్శులం

అవును నిజమే
మేము మూగవాళ్ళమే
మాట రాక మా గొంతుకలు మూగబోయినా
మా హక్కుల సాధనకై బిగిసిన పిడికిళ్లతో
నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించే ఎర్రటి సూర్యులం

అవును నిజమే
మేము చెవిటివాళ్ళమే
చిటికెలతో సైగలతో మమ్మల్ని అవహేళన చేస్తున్నా
మా పెదాలమీద చిరునవ్వుల్ని
ఏ మాత్రం కరగనివ్వని శాంతి కాముకులం

మా కనులు చూడకపోయినా
మా గొంతుకలు హక్కులకై ప్రశ్నిస్తూనే ఉంటాయి
మా గొంతుకలు మాగబోయినా
మా బిగిసిన పిడికిళ్ళు ఆత్మగౌరవనినాదాలు చేస్తూనే ఉంటాయి.
మా కాళ్ళు కదలలేకపోయినా
ఆత్మవిశ్వాసంతో మేము వేసే ప్రతి అడుగు ముందు
ఎవెరెస్టయినా తలదించుకోక తప్పదు

దయచేసి ఇక మాపై
జాలిచూపులు చూడకండి
జాలిమాటలు మాట్లాడకండి
చేతనయితే మా హక్కుల సాధనలో
మీ చేయూతనందివ్వండి
మా అడుగులో అడుగై నిలబడి
మా గొంతుకలో గొంతుకై నినదించి
మా ఆత్మస్థైర్య విజయాలకు
మరింత పునాదిగా నిలవండి.

ఆత్మవిశ్వాసాన్ని అక్షరాలకు మాత్రమే పరిమితం చెయ్యకుండా ఆచరణకు కూడా తేవాలని గుర్తుచేసిన బ్యాంకు మేనేజర్ మహేందర్‌కి ఎప్పుడూ గుర్తొస్తుంటారు. ఆయన ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ మీద ఎక్కడో ఉండి వుండవచ్చూ కానీ ఆ మాటల ప్రభావం మహేందర్‌కి ఎప్పుడూ గుర్తుంటుంది.

***

2011లో ‘పోరుగానం’ అనే పుస్తకాన్ని సంకలనంగా తెచ్చాడు మహేందర్. ‘వికలాంగులు కదిలి రావాలి’ అనే పాట రాసాడు. 2012లో ‘పిడికిలి’ పేరిట తెలంగాణ కవితా సంకలనాన్నితెచ్చాడు. ముఖ్య అతిధిగా విచ్ఛేసిన సిద్ధారెడ్డి సర్ అభినందించారు. తెలంగాణ రాష్ట్ర సముపార్జనకు తనవంతు శ్రమని సంతోషంగా అందించాడు మహేందర్. అర్ధరాత్రి తెల్లవారుజాము అనేది లేడకుండా కార్యక్రమాలన్నింటిలోనూ చురుకుగా వున్నాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోడం రాష్ట్రాన్ని ప్రజలనూ కుదిపేసింది.

‘బలిదానాలు మరుద్దాం, తరతరాల ధిక్కార పోరాటం కొనసాగిద్దాం…’ అంటూ రాసుకుపోయాడు. నడవలేనివారు, చూడలేనివారు, వినలేనివారు, పలుకలేనివారు కలసికట్టుగా రాష్ట్రావతరణ కోసం పోరాడారు. అటు టీచర్లతోనూ, ఇటు దివ్యాంగులతోనూ, అటు సాహతీవేత్తలతోనూ ఇటు యువకోశోరాలతోనూ రాష్ట్ర అవతరణ కోసం పోరాడాడు మహేందర్.

దివ్యాంగ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు రాములుగారయితే మహేందర్ కార్యదర్శి. చుట్టుపక్కల గ్రామాల్లోని దివ్యాంగులను కూడగట్టి వెయ్యిమందికి తిరుగుబాటులో పాలుపంచుకునేలా చేసిన ఘనత సత్యంతో పాటు, అధ్యక్షుడు కార్యదర్శులకు దక్కింది. అటు దివ్యాంగులు కలసికట్టుగా తమ సమస్యల గూర్చి పోరాడడం, ఇటు రాష్ట్రం కోసం కలుపుకు పోవడం జరుగుతూవచ్చింది. దివ్యాంగులకు టీటీసి, బీఈడీ వరకు ఉచిత శిక్షణ ఉండాలి

పాఠశాలల్లో రాంపులు, స్పెషల్ టాయిలెట్ సౌకర్యాలు వుండాలని లిఫ్ట్ సౌలభ్యం లభించాలని ప్రభుత్వం ముందు డిమాండ్లు పెట్టారు వీరి నాయకత్వంలో దివ్యాంగులు.

కవితలు, పాటలు, మాటలు, పోరుబాటలో సాగుతూ వల్లించడం రోడ్లమీద వంటావార్పులు చేసుకోడం, ఛింలాగా ఏర్పడి ధిక్కార స్వరాలూ వినిపించడం, ఇలా అన్నివేళల్లో దివ్యాంగులు వీరోచిత పోరాటం చెయ్యడానికి వెనక వికలాంగుల హక్కుల పోరాట సమితి వుంది.

2014లో ‘కాలాన్ని గెలుస్తూ’ కవితా సంకలనాన్ని దివ్యాంగ కవితలను కూర్చి ప్రచురించారు. అందులో గురజాడ శోభాపేరిందేవి రాసిన ధిక్కార నానీలు కూడా వున్నాయి. “ప్రత్యేక ప్రతిభకు ప్రత్యేక వందనాలు అంటూ ప్రారంభించి ప్రత్యేక ప్రతిభావంతులను ఆకాశానికి ఎగరేసి, వాళ్లకు రెక్కలు మొలిపించి, చూపు ప్రసాదించి, వాళ్ళ తరుపున గల గల మాట్లాడి, నడిపించి, ఉరికించింది. సహానుభూతి,ఈ జీవితాలు శూన్యమైనవి కావని తలెత్తుకుని అనేక మహానుభావుల ఉదాహరణలు వాడివోకసందర్భా అవసర కవిత్వంగా వుంది” అని ముందుమాట రాసిన అల్లం నారాయణ అభినందనలు మహేందర్‌ని అభినందించారు

సాహిత్యంలో దివ్యాంగుల స్థానం మీద అధ్యయనం చేస్తున్నారు మహేందర్.

‘పోరుగానం’ సంకలనం ప్రజలను, విమర్శకులనూ సైతం ఆకట్టుకుంది. వైకల్య సమస్యమీద వొచ్చిన మొదటి కవితా సంకలనం ‘కాలాన్ని గెలుస్తూ’ అన్నది అభినందనీయమయిన అంశం. పుస్తకంలో మొట్టమొదటి దివ్యాంగ కవితల నానీల పుస్తకం రాసిన గురజాడ శోభాపేరిందేవి ధిక్కార నానీలు, మొట్టమొదటి దీర్ఘకవిత దివ్యాంగులమీద రాసిన కేరే జగదీష్, దివ్యాంగులకోసం శ్రమిస్తున్న దివ్యాంగ స్త్రీమూర్తి శివాలెంక ఉదయలక్ష్మి, దివ్యాంగ సాహిత్యం మీద పీహెచ్‌డి చేస్తున్నదివ్యాంగుడు చిక్కా హరీష్‌కుమార్ మొదలైన తెలుగు భాషలో దివ్యాంగులమీద రచనలుచేస్తున్న వారందరిని సంప్రదించి అందరి రచనలను పుస్తకంలో ప్రచురించిన మహేందర్ ధన్యుడు.

2014 ఏప్రిల్ 14న విద్యా ఫౌండషన్ హెల్పింగ్ ఫర్ డిసేబుల్డ్ అండ్ ఆర్ఫన్ చైల్డ్ ఎడ్యుకేషన్ అనే సంస్థని ప్రారంభించాడు మహేందర్.

మామూలు పిల్లలకంటే దివ్యాంగులైన పిల్లల విద్య ఎప్పుడూ వెనకపడి వుంటుంది. ఆరోగ్యస్థితి వారిది సమస్యాత్మకం కావడం ఒక కారణమైతే, తల్లితండ్రులు నిర్లక్ష్యం చెయ్యడమో,ఆర్థిక సమస్య అడ్డం రావడమో,ఆ రెండూ కాక పోతే వారిని హమేషా ఒకరెప్పుడూ అంటిపెట్టుకుని ఉంటే తప్ప వాళ్ళు బయటకి రాలేరు కనక అది వీలు పడక ఆలస్యం చెయ్యడమో ఇలా ఎదో ఒకటి అడ్డు వొచ్చి దివ్యాంగ బాలబాలికల విద్య చాలా ఆలస్యం కావడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల వారి విద్యమీద దృష్టిని పెట్టాడు మహేందర్. వారికి ఆర్థికసాయం, ప్రతిభా పురస్కారాలు ప్రదానం చెయ్యడం, వారి కళాకౌశలానికి వేదికనివ్వడం లాంటివి పెద్ద ఎత్తున ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతోనూ ఇతర దాతల సహకారంతోనూ దూరదూరప్రాంతాలు పల్లెలనుండి వారిని రప్పించి భోజన సౌకర్యం కల్పించి మళ్లీ వారిని వారి ప్రాంతాలకు వెళ్లేవిషయంలో బాధ్యత వహించి ప్రోత్సాహ పరుస్తున్న మహేందర్ అనాథ బాలబాలికల మీద కూడా దృష్టిని సారించాడు.

దివ్యాంగ యువతీ యువకులకీ బాలబాలికలకీ కౌన్సిలింగ్ ఇచ్చి వారు ముందడుగేసేలా చూస్తూ ఉంటాడు. అలా వాళ్లకి కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు ఒక కథ చెప్పాడు మహేందర్

వొక చోట ఒక బాక్సింగ్ పోటీ జరుగుతూ ఉంటుంది. ఒకే చెయ్యి పనిచేసే దివ్యాంగుడు నార్మల్ వ్యక్తితో పోటీలో పాల్గొంటాడు. ఎదుటి నార్మల్ వ్యక్తి శక్తి లేని చేతి మీద పిడిగుద్దులు కురిపిస్తూ ఉంటాడు. స్పర్శ జ్ఞానం ఉండదు కనక ఆ దెబ్బలు దివ్యాంగుడిని బాధించవు. రెండో చేత్తో అతను విజృంభించి గెలుస్తాడు. ఈ కథకి నీతి ఏమిటి అంటే ముందు వ్యక్తి నేను దివ్యాంగుడిని ఎందుకూ పనికి రాని వాడిని అనే ఆలోచనను పక్కన పెట్టాలి. నార్మల్స్ తో కూడా అన్ని అంశాల్లోనూ పోటీ చెయ్యాలి. భగవంతుడు ఒక లోపాన్నిస్తే మరో శక్తిని తప్పక ఇస్తాడు. అదేంటో తెలుసుకుని ఆ శక్తిని మరింత శక్తిమంతం చేసుకోవాలి.

2014లో ‘గెలుపు చిరునామా’ అనే కవితా సంకలనాన్ని వెలువరించాడు. 2016లో ‘కొన్ని ప్రశ్నలు కొన్ని జ్ఞాపకాలు’ అనే పుస్తకాన్ని ప్రచురించాడు.

దివ్యాంగులము అని దొంగ సర్టిఫికెట్లు కొందరు నార్మల్ వ్యక్తులు సర్టిఫికెట్ తెచ్చుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుని సుఖంగావుండి అసలైన దివ్యాంగుల అవకాశాన్ని అడ్డుకోవడం జరుగుతోంది అని గమనించి రంగంలోకి దిగారు దివ్యాంగ ఉపాధ్యాయ సంఘం సభ్యులు. వినగలిగి చెవుడని, కాలు వొంకరని, చెయ్యి వొంకరని దొంగ సర్టిఫికెట్లు డాక్టర్లనుండి తెచ్చుకుని ఎవరు అడ్డొచ్చినా లంచాలిచ్చి వాళ్ళ నోళ్లు మూయిస్తున్న వారిని సీరియస్‌గా తీసుకున్నారు. తెలంగాణా జిల్లాల్లోని ఆ మోసకారుల వివరాలను చాలా కష్టపడి సంపాదించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చ్చారు. జనగామ దగ్గర చేరియాలలో ప్రెస్ మీట్ పెట్టారు. హ్యూమన్ రైట్స్, లోక్ అదాలత్, సి.బి.ఐ వాళ్లకి కూడా కంప్లైంట్ ఇచ్చారు.. ధర్నాలు చేశారు. ఆ విధంగా చేసి మొత్తానికి 31మందిని సస్పెండ్ చేయించారు. కోర్టుకి సరిగ్గా హాజరుకాక కొందరు తప్పించుకున్నారు. నలుగురు డియీవోలు జైలుకెళ్లారు. దీంతో దివ్యాంగుల సంస్థ అంటేనే అలాంటి వారందరికీ వెన్నులోంచి వొణుకు పుట్టడం మొదలయ్యింది.

ధర్మం దారిలో నడుస్తూ న్యాయదేవతను నమ్ముతూ చట్టానికి లోబడి వుండే నిజాయితీపరులకి అవినీతిని కడిగేసి హక్కుంది. అవినీతిదారుల ఆటకట్టించే బాధ్యత ఉంది.

ఒకరోజు అనుకోకుండా స్నానాల గదిలో కాలు జారి పడ్డాడు మహేందర్. అసలే వొంకర కాలు. దానికి తోడు కింద పడడమూ జరిగింది. తొడ ఎముక విరిగింది

“ఇంక నువ్వు నడవలేవు” అన్నారందరూ. అసలే వైకల్యం తాలూకు టెన్షన్, ఆపైన అందరూ అన్నతీరు మహేందర్నీ బాధ పెట్టింది. భయపెట్టింది కూడా. ఎందరికో ఎన్నో విధాలుగా సాయపడదాము అనుకుంటే తన పరిస్థితే ఇలా అయ్యిందే అనే వ్యథ కలగసాగింది.

ఆపరేషన్ జరిగినప్పుడు పైకి ధైర్యంగా వున్నా లోలోపల భయం వెయ్యసాగింది. తను ఇంక నిజంగా నడవగలుగుతాడా? అనుకున్నవన్నీ సాధించగలుగుతాడా? లేక మంచానికి అంటుకుపోతాడా? నిద్ర పట్టడం లేదు. ఆకలి వెయ్యడంలేదు. అలా నాలుగు రోజులు గడిచాయి. ఐదో రోజు ఆకలి బాగా వేసింది. కడుపునిండా తినగానే కంటిమీదకి నిద్ర కమ్ముకు వచ్చింది. హాయిగా నిద్రపోయి లేవగానే కొత్త శక్తి వచ్చినట్లన్పించింది.

ఇది కష్టించే కాలం… కసిగా కృషి చేసే కాలం.
అంతే కానీ చెడు కాలం కాదు.
తిరుగుబాటు నరనరాల్లో వున్నా తన మీద తానూ ఎందుకు తిరగబడలేకపోతున్నాడు?
తన లోపాల మెట్ల మీద సాగుతూ విజయసౌధాన్ని ఎందుకు నిర్మించుకోలేక పోతున్నాడు?
కాలినొప్పి బాధిస్తోంది, నిజమే. కలలు కల్లలైపోతే కలిగే బాధ ఇంకా ఎక్కువ కదా.

‘అందువల్ల ఆ బాధను పోగొట్టుకోడానికి కష్టించాలి. ఇంకా ఇంకా కష్టించి కాలికి పనిచెప్పి తనలాంటి వారి కలలకి, కళలకి రూపం ఇవ్వాలి’ అనుకున్నాడు దృఢంగా. కర్ర పట్టుకుని నిదానంగా ముందడుగేసే అలవాటును అలవరచుకున్నాడు. మిగతావాళ్ళను ముందడుగేసే దిశగా కార్యక్రమాలు మొదలుపెట్టాడు. సహకారం సేవలమీద దృష్టిని సారించాడు మహేందర్.

ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనంలో ‘రైతన్నా చావొద్దు’ అన్న వార్తా చూసి చలించిపోయాడు. ఆత్మహత్య చేసుక్కున్న రైతు పిల్లలు మమతా, రవిలకు సంస్థ తరుఫున చేయూత ఇచ్చాడు. 2015, 2016లలో రెండు పుస్తకాలకు వెలుగు నిచ్చాడు.”గెలుపు చిరునామా”కొన్నిప్రశ్నలు కొన్ని జ్ఞాపకాలు.”

 

2020లో ‘కరోనా’ పై వరంగల్ కవులు రాసిన కవితలతో ‘కోవిడ్-19’ పేరుతో పుస్తకాన్ని తెచ్చాడు. త్వరలో వలస కార్మికుల కవితల సంపుటి, మరికొన్ని పుస్తకాలను ప్రచురించనున్న బిల్ల మహేందర్ ఎన్నో సత్కారాలను పొందాడు. అవార్డులను అందుకున్నారు. 201 9లో కరీంనగర్‌లో లభించిన కాళోజి పురస్కారం, 2020లో డా.రాధేయ గారి కవితా పురస్కారమతనికి అత్యంత తృప్తినిచ్చి మరింత ముందుకు నడిపించేలా చేస్తున్నవి.. ‘కాలంతో నడిచే వ్యక్తి’ అనే పేరుతో నమస్తే తెలంగాణా మహేందర్ మీద వ్యాసాన్ని రాసింది.

2019తో 300 మంది దివ్యాంగులతో కలిసి దివ్యమైన కార్యక్రమాన్ని చేసిన విద్యా సంస్థ విభిన్న కళాకారులకు మరిన్ని కార్యక్రమాలను చేస్తోంది.

తెలంగాణ రచయితల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా, దివ్యాంగుల ఉద్యోగులసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, విద్యాఫౌండేషన్ వ్యవస్థాప అధ్యక్షులుగా ఉంటూ అహర్నిశలూ శ్రమిస్తున్న మహేందర్ “వైకల్యాన్ని విసిరేయ్, నువ్వొక వ్యక్తిగా కాదు శక్తిగా నిలబడతావ్” అనే సందేశాన్నిస్తూ ముందుకు సాగుతున్నాడు.

మహేందర్ వ్యక్తి కాదు. దివ్యాంగుల మానసిక శక్తి. వైకల్యాన్ని అధిగమించిన అద్వితీయమూర్తి.

బిల్ల మహేందర్ మరిన్ని మంచి కార్యక్రమాలు తన ‘విద్యాసంస్థ’ ద్వారా చెయ్యాలని మనసారా కోరుకుంటూ ఆయన్ని అభినందిద్దాం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here