Site icon Sanchika

దివ్యాంగ సాహిత్య సభ

[box type=’note’ fontsize=’16’] సాహిత్యంలో దివ్యాంగులు చేస్తున్న కృషిని వివరిస్తూ ఇటీవల జరిగిన దివ్యాంగుల సాహిత్య సభ గురించి తెలియజేస్తున్నారు గురజాడ శోభా పేరిందేవి. [/box]

దళిత సాహిత్యం, స్త్రీవాద సాహిత్యం మీద దేశవ్యాప్తంగా రచనలు వెలువడుతున్నాయి. అటు స్త్రీలు ఇటు దళితులూ తమ సమస్యలను ఆగ్రహంగానో ఆవేదనతోనో అక్షరరూపంలో వెలిబుచ్చచుతున్నారు. కవిత్వంలో ఈ రెండు అంశాలకి సముచిత స్థానం లభించింది. నిరాశా నిస్పృహలతో వెనకబడి అందరిచేతా వెలివేయబడినట్టుగా ఉంటున్న దివ్యాoగులు కూడా తమ వేదనాశ్రువులకు అక్షర రూపం ఇస్తే అది దేశవ్యాప్తంగావున్న దళితులను ఏకంచేసి ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని అందించగలదన్న సదుద్దేశంతో దివ్యాంగ సాహిత్యం అనే ఒక ఉప సంస్థని ప్రారంభించింది అంతర్నేత్ర ఫౌండేషన్.

రవీంద్రభారతిలో భాషాసాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణగారి చేతుల మీద కీర్తిశేషులు డా.నారాయణరెడ్డిగారి జన్మదిన వేడుకల ముగింపు కార్యక్రమ సభలో ఆ వేడుకను విశేషంగా నిర్వహించారు. శ్రీమతి ఝాన్సీ కెవి కుమారి ఇటీవల జీవీఆర్ ఆరాధన సంస్థ ద్వారా నారాయణరెడ్డి జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమెను అంతర్నేత్ర ఆహ్వానించి సత్కరించింది.

విశిష్ట అతిధిగా శ్రీమతి హైమావతీ భీమన్నను ఆహ్వానించి ఆమెకి భీమన్నగారికి నారాయణరెడ్డి గారితోగల బంధాన్ని సభికులకు తెలియచేసింది అంతర్నేత్ర ఫౌండేషన్. డా సి.నారాయణరెడ్డి కావ్యగానం సీడీని వేదికమీది విశేషజ్ఞులకు పంచింది. సినారె శిష్యులుగా వారి దగ్గర ఉస్మానియాలో తెలుగు ఏం ఏ చేసిన శ్రీ ఎం.గంగారాం, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫర్ డిస్ఏబుల్డ్ అధ్యక్షులు శ్రీ యెన్.వెంకట్ రాములు. ప్రధానోపాధ్యులు ప్రభుత్వఅంధుల పాఠశాల దారుషఫా, శ్రీ వాసం మురళీధర్ రిటైర్డ్ చీఫ్ ఎడిటర్ ప్రభుత్వ బ్రెయిలీ ముద్రణాలయం, గురువుగారు తమను ఏవిధంగా తీర్చిదిద్ది ,ప్రోత్సహించినదీ ఉత్సాహంగా సభికులతో పంచుకున్నారు. అలాంటి పెద్దల ఆశీర్వాదాలే అంధత్వాన్ని జయించేలాగ తమ వెన్ను తడతాయని వారు వివరించారు.

‘తాను ఎప్పుడూ దివ్యాoగుల వెoటే ఉండి రవీంద్రభారతి వారికి ఉచితంగా అందేలా తోడ్పడతాన’ని చెప్పారు మామిడి హరికృష్ణ. ‘తాను నారాయణరెడ్డిగారు బస్సు మేట్స్ అని తను పాఠశాల తెలుగు ఉపాధ్యాయిని అయితే నారాయణరెడ్డిగారు ఉస్మానియాలో అధ్యాపకులనీ ఇద్దరమూ ఉదయం ఒకే బస్ ఎక్కేవారమని, తాను ఆయనని పెద్దన్న అని పిలిచేదాన్నని చెప్పారు హైమావతీ భీమన్న. ఎందరిలో వున్నా తన దగ్గరికొచ్చి గౌరవంగా నారాయణరెడ్డిగారు మాట్లాడేవారని’ హైమా నువ్వు మాట్లాడు నీ తర్వాతే ఎవరైనా’ అనేవారని అన్నారు రచయిత్రి, గాయని బోయి హైమావతీ భీమన్న.

‘దళితుల సమస్యలను గురించి ఆలోచించేవారు కానీ రాసే వారు కానీ ప్రజల్లో లేకపోవడం బాధాకరమని’ సంస్థ అధ్యక్షుడు ఎల్ గోపాల్రావు, కార్యదర్శి టీంగిరికారి వెంకటేష్ విచారం వ్యక్తం చేశారు. వేలల్లో ఒక్కరు ఇద్దరు మాత్రమే తమను చూసి స్పందిస్తారని వారన్నారు.

ఎన్నో సంవత్సరాలనుండి దివ్యాంగులతో అనుబంధం కలిగివుండి వారికి విద్య వైద్య ఆర్థిక సేవలందిస్తూ వారి సమస్యలమీద కధలూ కవితలూ వ్యాసాలూ రాసి, విశేషంగా ‘ధిక్కార నానీలు’ అనే దివ్యాoగుల నానీల పుస్తకం వెలువరించి దివ్యాoగ సాహిత్యంలో పరిశోధనలు చేస్తూ సిధ్ధాంత గ్రంధాన్ని సమర్పించేందుకు శ్రమిస్తున్న వారికి విషయవివరణ ఇస్తూ అటు నార్మల్స్ చేత ఇటు దివ్యాంగుల చేతా వారికి సంబంధించిన నాటకాలు రాసి దర్శకత్వం వహించి నటింపచేస్తూ వారి విషయంలో పూర్తిగా స్పందిస్తూ వున్న గైడింగ్ లైట్ ఫౌండేషన్ కార్యదర్శి డా.గురజాడ శోభా పేరిందేవిని సత్కరించి ఆమె నుండి మరిన్ని సేవాకార్యక్రమాలు ఆశిస్తున్నామని వివరించారు.

పాతికేళ్ళక్రితం’ మనోనేత్రం’ పేరిట మొట్టమొదటి కవితల పుస్తకాన్ని రాసి ప్రజల్లోకి తెచ్చిన ఘనత రిటైర్డ్ కోప్రేటివ్ జాయింట్ రిజిస్త్రార్ శ్రీ వేముల ప్రభాకర్ గారికి దక్కుతుందని వివరించారు. బ్రెయిలీ ప్రింటింగ్ వ్యవహారాలను నిర్వహిస్తూ ఎందరో చూడలేని వారిని చూసి స్పందించడం వల్ల ఇంట్లోని తల్లితండ్రులు దివ్యాంగులు కావడంవల్ల ఆ పుస్తకాన్ని రాసిన ప్రభాకర్‌ని సత్కరించారు

వరంగల్ పట్టణంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ విద్యాఫౌండషన్, దివ్యాoగుల ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగాను, తెలంగాణ రచయితల సంఘం కార్యదర్శిగానూ పనిచేస్తూ చక్కటి కవిత్వాన్ని అందిస్తూ అటు వెనకబడ్డ కులాలవారిని ఇటు కృంగిపోతున్న దివ్యాoగులను ముందుకు నడిపిస్తున్న యువ కవి శ్రీ బిల్లా మహేందర్ సేవలను గుర్తించి గౌరవంగా సత్కరించింది అంతర్నేత్ర ఫౌండేషన్.

మరొక ప్రొఫెసర్ని సైతం సత్కరించి అందరూ దివ్యాoగ సాహిత్యాన్ని చదవాలని రాయాలని చదివించాలని సహకరించాలని కోరింది. కార్యదర్శి వెంకటేష్ నివేదిక కదిలించి కరమందించేలా అతని వ్యాఖ్యానాన్ని అభినందించేలా చేసింది. అధ్యక్షుడు గోపాల్రావు సభాధ్యక్షత శభాష్ అనిపించింది. మొత్తంగా కార్యక్రమం అందరిని ఆకట్టుకుని ఆశావాదాన్ని అందించింది.

Exit mobile version