డాక్టర్ శ్రావణి

0
2

[శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి రచించిన ‘డాక్టర్ శ్రావణి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]శ్రీ[/dropcap]నివాస సుభాష్ సూర్యుడికి ముందే లేచి కొబ్బరి మొక్కలకి, అరటి మొక్కలకి నీరు పెట్టేవాడు. వాళ్ళది వెయ్యి గజాల పెద్ద ఇల్లు. మధ్యలో డాబా. గాలి నీరు బాగుంటుంది. అందుకే ఇంట్లో కూరగాయలు పండించేవారు.

అతని పైన ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద సంతానం అంటారు ఈ రోజుల్లో కానీ అప్పుడు పిల్లలు ఎంత మంది ఉంటే అంత గొప్ప వ్యక్తి. ఆడపిల్లల్ని టెన్త్‌తో ఆపేసీ మేనత్త కొడుకులకిచ్చి పెళ్ళి చేశారు. అల్లుళ్ళు ఇద్దరు పంచాయితీరాజ్ ఇంజినీర్స్. డబ్బుకు లోటు లేదు. “అక్కల జీవితానికి మేనకోడళ్ళు చాకిరీ చేస్తారు, మన అమ్మకి కూడా కోడలు చేసేది. అలాగే నీకు నా పిల్లలు చేస్తారు” అంటూ కట్నం లేకుండా పెళ్లి చేసి పంపాడు మావయ్య కూతురుని. అందుకు వారికి కంచంలో కంచం మంచంలో మంచం అని చెప్పుకుని సంతోషపడేవారు. అలాగే వాళ్ళకి ఆనందంగా గడిచిపోతుంది కూడా. అంతా కలిసి మెలసి ఉంటారు.

శ్రీనివాస సుభాష్ నలుగురు పిల్లల్లో చిన్నవాడు, మగపిల్లలలో రెండవ వాడు. మంచి తెలివైనవాడు. అంతేనా లెక్కల్లో మహా దిట్ట. అకౌంట్స్ బాగా చూసేవాడు. కాలేజీలో గోల్డ్ మెడల్ సాధించాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నో టెస్ట్‌లు రాశాడు పోస్టల్, టెలిఫోన్ లలో ఉద్యోగ ప్రయత్నము చేశాడు. “హాయిగా బ్యాంక్ లో చెయ్యరా పెద్దాడు ఎంతో సుఖంగా ఉన్నాడు, డబ్బున్న పిల్ల వరించింది” అని అక్కలు అనేవారు. వాళ్ల పిల్లలు వయసులో చిన్న వాళ్ళు. అమ్మతో వియ్యమొందాలంటే మహా కష్టం అనుకున్నారు.

మన శ్రీనివాస్‌కి ఉద్యోగం చేసే పిల్ల అయితే మంచిదనే భావాలు ఉన్నాయి. అందుకని తమ్ముడు తమకు అందడు అనే విషయం బాగా అనుకుని వదిలేసారు అక్కలు.

***

ఒకప్పుడు సూర్యోదయానే పిల్లలతో పాటు గోశాలలో దూడల సేవ చేసేవారు. అమ్మ పిల్లలకి, నాన్న దూడలకు సేవ. బామ్మ తాత సలహాలు ఇచ్చేవారు. పాలేరు వచ్చి గోశాల తుడిచి శుభ్రం చేసి పాలు పితికి ఇచ్చేవాడు.

అవన్నీ మారిపోయాయి. ప్యాకెట్ పాలు వచ్చాయి. ఆనాటి కాలంలో పెరడులో పెరటి మొక్కలతో పాటు గోవులు, ఇతర జంతువులు, కుక్కల్లు, కోళ్ళు, పావురాలు, కుందేళ్ళు పెంచేవారు. భూత దయ ఉండేది.

ఇప్పటి రోజుల్లో మనుష్యులకు ఆవాసం అనేది మహా కష్టమే. ఎక్కడో ఊరు అవతల ఇల్లు లేదా విసిరేసినట్లు ఉంటున్నాయి లేదా బహుళ అంతస్తుల సౌధాలు ఉంటున్నాయి.

మనిషి జీవితమే పావురాల పెట్టెలో ఉన్నట్లు ఉన్నది, ఇంకా జంతు పక్షి పెంపకము మొక్కల పెంపకం లేదు.

ఫల సాయం అంటూ కొబ్బరి, మామిడి, అరటి, బొప్పాయి, జామ, కరివేప ఇలా పెంచితే కొంత ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. బోన్సాయ్ జీవితాలు. చిన్న చిన్న గదుల ఇల్లు ఉంటుంది. చాలా మంది పల్లెలు వదిలి పట్నాలకి ఉద్యోగాలకి పరుగు. రూకలు ఎక్కడ అయితే అక్కడే నూకలు అక్కడే. కుటుంబం, జీవితం పిల్లల వెంట పెద్దలు. తప్పదు ఇది జీవిత చక్రం.

బంధువులు, బంధుత్వాలు వదిలి వెళ్ళిపోయి స్నేహితుల వెంట పరుగు తప్పదు. ‘ఫలానా వరుసా, ఆహా’ అంటారు.

శ్రావణి చిన్నప్పటి నుంచి మొక్కలు జంతువుల మధ్య చాలా ఆనందంగా పెరిగింది. శ్రావణికి పెళ్లి చెయ్యాలి అంటే కొంచెం ఆస్తిపరుణ్ణి చేస్తే బాగుంటుంది అనుకున్నారు తల్లిదండ్రులు.

కానీ విచిత్రం – శ్రావణికి పెళ్లి జరగడంలో ముఖ్య పాత్ర పెళ్లి కొడుకుదే. శ్రావణి డిగ్రీ చదవడం కోసం పినతల్లి ఇంట్లో ఉన్నది. బాబయ్య గారు కాలేజ్ అధ్యాపకులు. అయన ఒక డాబా చుట్టూ పెరడు ఉన్న ఇంట్లో అద్దెకు ఉండేవాడు. పెరట్లోలో గోంగూర, కొత్తిమీర చల్లేవారు. పినతల్లికి బాగా సాయం చేసేది. వంటలు ఇతర పనుల్లో సహాయం చేసేది. “దీన్ని ఎవరూ చేసుకుంటారో అదృష్ట వంతులు” అనేవారావిడ. పిన్నికి ఇద్దరు కొడుకులు. చిన్న పిల్లలు. ‘ఏమిటో ఈడు వచ్చిన పిల్ల ఇంట్లో ఉంటే ఇల్లు ఎంతో సుందరంగా ఉంటుంది’ అనుకునేది పిన్ని.

ఒక ప్రక్క బియస్‌సి బోటనీ చదువుతూ చక్కగా ఉండేది. బాబయిగారు కెమిస్ట్రీ లెక్చరర్. మంచి పేరు ఉన్నది. అందుకే ఇక్కడ చదివిస్తున్నారు.

***

పినతల్లి ఇంటివాళ్ళకి కోడలి రెండవ తమ్ముడు శ్రీనివాస సుభాష్ బాగా చదువుకున్నాడు. పాలిటెక్నిక్‌లో గోల్డ్ మెడలిస్ట్. అయితే టెలిఫోన్, పోస్టల్ ఉద్యోగాలకి రిటెన్ టెస్ట్ రాశాడు. ఉద్యోగం టెలిఫోన్ ఆఫీస్‌లో వచ్చింది. అక్క కూతుర్ని పెళ్లి చేసుకోమంటే, అది చాలా చిన్నది వద్దు అంటు శ్రావణిని చేసుకోవాలని ఇష్టత చూపాడు. అదే విషయం శ్రావణి పెద్దలతో చెప్పాడు. వాళ్ళు ఆలోచించారు.

శ్రావణిని పీజీ చదివించి ఉద్యోగం చేయించాలని ఆశ వాళ్ళకి. కానీ సంబంధం వచ్చి అడిగారు. ఆలోచనలో పడ్డారు.

అయినా పీజీ చేయించాలనే శ్రావణి తండ్రి పట్టుదల వల్ల పిల్లని ఇండోర్‌లో పీజీలో చేర్పించాడు. కారణం ఇప్పుడు విమెన్స్ కాలేజీలు కొత్తగా పెడుతున్నారు. అందువల్ల బాబయ్య లెక్చరర్ కావడంతో ఆయన సలహాతో బోటని పీజీ లో ఎంఎస్‌సి ఇండోర్ యూనివర్సిటీలో చేరింది.

చదువు హాయిగా సాగిపోతోంది. అయినా ఆడపిల్లకి పెళ్లి ఎప్పటికైన తప్పదు కదా. శ్రీనివాస సుభాష్ ఇవన్నీ చూసి పెళ్లి చేసుకుంటే శ్రావణి నే చేసుకోవాలి అని పట్టు పట్టాడు. చదువుకున్న భార్య అయితే అవగాహన ఉంటుంది, అవసరం అయితే ఉద్యోగం చేస్తుంది అనే ఆశ అతనికి ఉండేది.

పూజ కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అనే సామెత ప్రకారం ఆలోచించి పెళ్లికి ఒప్పుకున్నారు పెద్దలు. పెళ్లి చేసేసారు పీజీని కొన్నాళ్ళు పక్కన పెట్టారు. కట్నం లేదు. అంతా ఆనందంగా సింపుల్‌గా చేశారు. శ్రావణిని అత్తింటికి పంపారు. అక్కడ ఇమిడిపోవాలి.

శ్రీనివాస్‌ది టెలిఫోన్ ఆఫీస్ ఉద్యోగం. అది కూడా వేరే ఊళ్ళో. అక్కడే కొత్త కాపురం పెట్టించారు. అయితే అత్తవారు ఇంటిలో అన్ని విషయాలు పెద్దరికంగా చెప్పి చెయ్యాలి.

***

శ్రావణి అత్త ఇంట్లో వేరే పద్ధతి. ఇంట్లో కుక్కల్ని పెంచితే పెద్ద వాళ్ళకి మడి సాగదు. చంటి పిల్లల్లా చూడాలి అంటూ పెద్దల అసంతృప్తి. వాళ్ళు మనకి ముఖ్యము. అందుకే జంతు సేవ, పక్షి సేవ, మొక్కల సేవ, బంధువుల సేవ శ్రావణికి కల గానే మిగిలింది. ఇంట్లో అత్త, మామ, అడబడుచు, మరిది ఉంటారు. రోజు పది కంచాలు లేస్తాయి. ఎవరో ఒకరు వచ్చి వెడుతూ ఉంటారు. పూర్వ కాలం పద్ధతి. సిటీలో ఉన్నా సరే అన్ని పెద్దరికం వల్ల అంతా అక్కడే దిగుతారు. వారికి మర్యాదలు చెయ్యాలి. ఇవన్నీ కొందరికి మామూలే.

ఈ మధ్య ఎన్ని రకాలో యూ ట్యూబ్‌లో వస్తున్నాయి. రకరకాల సిడిలు వస్తున్నాయి. అవి పెట్టుకుని చూసి సంతృప్తి పడటమే మంచిది. ఇంట్లో పెద్ద వాళ్ళకే సేవ చేస్తుందా లేక ఈ పక్షి జంతు సేవ చేస్తుందా? ఏదో పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయ్యారు కనుక ఇంట్లో పెద్ద వాళ్ళకి సదుపాయంగా చెయ్యాలి. అది అయినా వాళ్ళు వినేవారు కనుక. అదే పెద్ద అత్తగారు అయితే వినదు. కోడలు అంటేనే కోపం. అలాంటి వారికి చెయ్యడం మహా కష్టము కూడా అంటుంది. మారే కాలంతో పాటు మారాలి.

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ శుక వనంలో ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. అవి చూసి తృప్తి పడాలి. సరే భర్త శ్రీనివాస్‌కి చెప్పి వేరే పద్ధతి ఆలోచించి – గోశాలలో గడ్డి పరకలకి కొంత డబ్బు ఇచ్చి పుణ్యం కొనుక్కునే పరిస్థితి. అలా తృప్తి పడింది.

***

రెండేళ్ళకి ఒక కూతురుకి తల్లి అయ్యింది శ్రావణి. శ్రీనివాస్ కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. భార్యను ఇప్పుడు పీజీ పూర్తి చెయ్యి అన్నాడు. పెళ్లికి ముందు ఇండోర్‌లో పీజీ బొటనీలో చేరింది. మొదటి సంవత్సరం రెండు సెమిస్టర్‌లు అయ్యాయి. పెద్దలను పట్టుకుని పెళ్లికి ఒప్పించే చేసుకున్నాడు. అయినా సరే ఆడపిల్ల పుట్టగానే మార్పు వచ్చింది. శ్రావణి మళ్ళి వెళ్ళి పీజీ పూర్తి చెయ్యమని చెప్పాడు.

ఇంకా తప్పుతుందా ఆరునెలల పిల్లని అత్తగారి దగ్గర వదిలి వెళ్ళింది ప్రతి రోజూ ఫోన్లో మాట్లాడేది. అప్పుడు ఇంకా వీడియో ఫోన్‍‍లు లేవు. కొనాలి అంటే అన్ని నాన్నకే చెప్పాలి.

శ్రీనివాస్ సుభాష్ తెలివైన వాడు. పీజీ ఖర్చు మామగారినే పెట్టుకోమన్నాడు. తప్పేది లేదు సరే అంటూ తోడల్లుడితో చెప్పి మళ్ళీ డబ్బు కట్టాడాయన. మగ పిల్లలు మంచి వాళ్ళు. ఇద్దరూ అక్కకి పెళ్లి అయినా చదువు చెప్పిస్తుంటే ఊరుకున్న మంచివాళ్ళు.

సరే పీజీ పూర్తి అయింది. మనవరాలు అక్కడ ఇక్కడ ఎక్కడో అక్కడ అన్నట్లు పెరిగింది. అది మంచి పిల్ల. అడ్జస్ట్ అయ్యింది. పిల్లకి రెండు ఏళ్ళు వచ్చాయి. శ్రావణి పీజీ అయ్యింది కానీ ఉద్యోగం రాలేదు. మళ్ళీ బియిడి చెయ్యమన్నాడు శ్రీనివాస్. వంట వండి క్యారేజ్ సర్దుకుని పిల్లని బేబీ సెట్టింగ్‌లో పెట్టి తొమ్మిది కల్లా బస్సు ఎక్కేది. సాయంత్రం అరుకి ఇంటికి వచ్చేది. ఈలోగా శ్రీనివాస్ డ్యూటీ అయి వచ్చి పిల్లని ముస్తాబు చేసి ఆడుతూ ఉండేవాడు. అతనికి పిల్లలంటే గారం. రాగం కూడా. ఇంకో పిల్లాడు ఉంటే బాగుండును అన్నాడు. వంశోద్ధారకుడు అని అంటూ ఉండేవాడు.

కానీ శ్రావణి “ఒక్క పిల్ల అయితే మంచిది. పిల్లాడిని పెంచాలి, పెద్ద చదువు చదివించాలి, డబ్బు చాలదు. దీనికి కట్నం ఇవ్వాలి. ఏదో మీరు ఆదర్శంగా చేసుకున్నారని అంతా చేసుకోరు” అన్నది వెటకారం ధ్వనిస్తూ.

ఉద్యోగం వస్తే నెలవారీ కట్నం అనే వ్యంగము కనిపించింది ఆ మాటల్లో.

సరే బియిడి అయినా మంచి ఉద్యోగం రాలేదు. ప్రైవేట్ స్కూల్‌లో ఐదు వేలకి చేరింది. పిల్లని కూడా జాయిన్ చేసింది.

బాబయ్యకి ఈ విషయం చెప్పింది శ్రావణి. అయన ఆలోచించాడు – ‘దీనికి ఉద్యోగం చెయ్యడం ఎప్పటికీ తప్పదు. అల్లుడు ఎంతో తెలివైన వాడు’ అనుకుంటూ ‘ఇప్పుడు సర్వీస్ కమిషన్ ఆఖరు బ్యాచ్. దీనికి వయసు దాటిపోతే ఇంకా ప్రైవేట్ జాబ్ మాత్రమే చెయ్యాలి’ అని ఆలోచించి “కొంత డబ్బిచ్చి అయినా వేయిద్దాం అన్నయ్యా” అంటు శ్రావణి తండ్రితో మాట్లాడాడు.

“సరే నీకు అన్ని బాగా తెలుసు కదా, అలాగే చెయ్యి. ఎంత కావాలో చెప్పు” అన్నాడాయన. “సరే నేను మాట్లాడి చెపుతాను” అన్నాడు బాబయ్య.

అలా శ్రావణికి ఉద్యోగం.. జూనియర్ కాలేజ్ లెక్చరర్ పోస్ట్ వచ్చింది. ‘హమ్మయ్య అల్లుడు గొడవ తీరింది’ అనుకున్నాడు బాబయ్య. శ్రావణి కాలేజీకి వెడుతూ పిల్లని కాన్వెంట్‌లో దింపేది.

‘కొంచెం దండిగా కట్నం ఇస్తే మంచి సంబంధం వచ్చేది’ అనుకున్నారు శ్రావణి తల్లిదండ్రులు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి అని ఆశ పడ్డారు. పెద్ద కుటుంబం, మంచి వాళ్ళు ఇదే వారి ఆలోచన. కానీ పిల్ల చదువు ఉద్యోగం అంటూ నలిగిపోతుంది అని తల్లి తండ్రి బాధపడేవారు.

అంతలో ఊరుకున్నాడా శ్రీనివాస్, వైజాగ్‌లో యూనివర్సిటీ ఉన్నది కదా పీహెచ్‌డి చెయ్యి అన్నాడు. సరేనంటూ శ్రావణి బోటనీలో టెస్ట్ రాసింది. సెలెక్ట్ అయ్యింది. జాబ్ చేస్తూ పరిశోధన చేసింది. పొగాకు వల్ల కలిగే ఉపయోగాలు, పంట పెరుగుదల అంశంపై చేసింది. పార్ట్ టైమ్ పీహెచ్‌డి కనుక ఐదేళ్ళు పట్టింది. పిల్ల ఇంటర్‌కి వచ్చింది. ఇంటర్‌లో మంచి మార్కులు వచ్చాయి. డాక్టర్ చదివిస్తాను అన్నది. ఆ పిల్ల “వద్దు అమ్మా, నేను పేషంట్లని చూడలేను” అంటూ డిగ్రీ చేసి, ఎం.సి.ఏ. చదివింది. విదేశాలు వెళ్ళవచ్చును అన్నది.

పిల్లని ఒక్కర్తిని పంపనన్నాడు శ్రీనివాస్.

కానీ “అప్పటి సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు మంచి సంబంధం చేద్దాము. కట్నం నేనే ఇచ్చి పిల్ల పెళ్లి చేస్తాను” అన్నది శ్రావణి. “నేను ఇవ్వకనా” అన్నాడు శ్రీనివాస్.

“అబ్బే అది కాదు మీరు పుచ్చుకోలేదు కదా?” అంది శ్రావణి.

విధి రాత తప్పదు. కూతురు రూపకి డబ్బున్న సంబంధం – ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు ఉన్న ఇంట్లో ఇచ్చి చేశారు.

పిల్ల పురిటికి వారి అత్తవారి ఇంటికి వెళ్ళింది శ్రావణి. పుట్టింటికి పంపం అన్నారు వాళ్ళు. ఏది అన్నా తప్పదు.

శ్రీనివాస్‌కి ఆహారం బాగా వండాలి. వంటకి మనిషి దొరకలేదు. హోటల్‌లో తినడం కుదరదు. ఇంటికి క్యారేజ్ తెప్పించి తిన్నాడు. ఎలాగో 21 రోజులు అయ్యాక శ్రావణిని వచ్చెయ్యమన్నాడు.

సరే అని ఖర్చులు అన్ని ఇచ్చి వచ్చింది. పిల్లకి అత్తగారే అన్ని చూస్తుంది. కూతుళ్లు తల్లి ఇండియాలో బాధలు పడుతోంది కనుక వాళ్ల ఇంటికి రమ్మన్నారు. ‘నా కొడుకుని వదిలి రాను’ అన్నది ఆవిడ.

అలాగే అంటు తమ్ముడిని ఎగవేసి మరదలికి అన్ని చెప్పి విదేశీ కాగితాలు పంపారు. మొత్తానికి రూప వాళ్ళు విదేశాలకి వెళ్ళారు. అక్కడ రూపకి కొడుకు పుట్టాడు.

***

అప్పుడే శ్రావణి మనుమడికి ఆరేళ్ళు వచ్చాయి. అయినా అమ్మమ్మ ఆవకాయ కావాలి అంటాడు. మంచి కాయలు తెచ్చి పెడుతుంది. అంతా తాత పోలిక. అన్నీ అమ్మమ్మ చేసినవే కావాలి వాడికి. సరే, ఆవకాయ పెట్టి కొరియర్‌లో పంపుతుంది. పదివేల దాకా ఖర్చు అవుతుంది. అయినా తప్పదు.

ఒక రోజు ఫోన్లో “అమ్మా, నువ్వు వచ్చెయ్యకూడదు? నా కొడుక్కి నీ వంట ఇష్టం” అన్నది రూప. రోజూ మాటల్లో తను ఉద్యోగంలో చేరుతుంది అని చెపుతోంది. “నీ మనవడు నీ ఆవకాయ బ్యాగ్ దాచుకుని ఒక్కడే తింటాను అంటాడు. ఎంత ఇష్టమో వాడికి” అంటుంది రూప. “అవును, నా బుజ్జి తండ్రి, బంగారు తండ్రి” అంటూ వీడియో కాల్ లో చూసింది శ్రావణి.

డాక్టర్ శ్రావణి విదేశాలకు వెళ్ళాలని ఉబలాట పడింది.

“ఏమిటి ఇక్కడ ఎంత పెద్ద ఉద్యోగం చేసావ్, పెన్షన్ ఇద్దరికీ వస్తోంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి చేసేది ఏముంది? నాకా ఆరోగ్యం బాగుండదు. దాని అత్తగారు పెద్దది అయ్యింది. మరి నిన్ను తీసుకెళ్లేది వంట కోసమే. డాక్టర్ శ్రావణి కేటరింగ్” అని నవ్వాడు శ్రీనివాస్.

“మీకు ఎప్పుడూ వేళాకోళమే. నా కూతురికి మొగుడు కలిసి వచ్చాడు. విదేశాలకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా నాకు యోగం లేదు” అంటూ ముక్కు చీదింది .

“మనకి విదేశాలు అనవసరం. స్వదేశంలో కడుపు నిండా తిని హాయిగా జీవిద్దాం” అన్నాడు శ్రీనివాస్.

“మరి అంతేగా. మీరు ఏమిటంటే అది ఒకే అనాలి. పెళ్లి ముందు నుంచి అంతా మీ ఇష్టమే కదా” అంది.

“అవును విన్నావు కనుకే సుఖపడుతున్నాను. సరే వడ్డన నేను చేస్తాను” అంటూ టేబుల్ పై కంచాలు పెట్టి – “విదేశీ పద్ధతి – నీకు హెల్ప్ చేస్తాను. సరా మేడమ్” అన్నాడు శ్రీనివాస్. నవ్వింది డాక్టర్ శ్రావణి.

***

ఇప్పుడు ప్రతి ఇంటిలో కూడా మనుమలు అంతా రెక్కలు వచ్చి రైలు, బస్సు, కార్ వద్దు విమానం ఎక్కాలి అంటున్నారు. సరే మీ ఇష్టం అనాలి కదా.

శ్రావణి జీవితంలో మార్పులు ఎన్నో వచ్చాయి. ఇప్పుడు ఆ వైభవం మారింది. కొంచెం భర్తకి అనారోగ్యం వల్ల దూర ప్రయాణాలు ఇష్టత లేదు. ఇల్లు పెద్దగా ఉన్న కుదరదు.

అందుకని ఆ బహుళ అంతస్తుల సౌధంలో ఒక మూల ఇల్లు – గాలి వెలుతురు బాగుండాలి అని ఎత్తుగా కొన్నారు. ఆ స్థలంలో కొబ్బరి చెట్లు, కాడ మల్లెపూల చెట్టు ఉన్నాయి. వాటిపైకి కోకిల, పావురాలు వస్తాయి. వాటి కూతలు వింటూ ఆనందిస్తారు. గాలి వేస్తే బాగా వస్తుంది. దానితో పాటు పూల సువాసన కూడా వస్తుంది. మాలతి పాదు, గిన్నె మాలతి పాదు, నైట్ క్వీన్, జాజి పందిరి వేసుకున్నది శ్రావణి. మిద్దె మొక్కల పెంపకం కుదరదు కానీ బాల్కనీలో వేరే ప్రత్యేకంగా చక్కని తొట్టెలలో ధనియాలు చల్లి, చిన్న కరివేపాకు మొక్క పెంచుకున్నది. మందార, నిత్య మల్లి, పచ్చ పూలు, బిళ్ళ గన్నేరు మొక్కలు, పూజ పువ్వులు పెంచింది. ఇలా ఏదో చిన్న సంతృప్తి.

కుక్కలు, కుందేళ్ళు, పిల్లులు, కోళ్లు ఇలాంటి ఏవీ పెంచకూడదు. అసలు కింద సెల్లార్‌లో కూడా ఉండకూడదు.

అద్దెకు ఉన్న ఇంట్లో పక్షులకు గింజలు వేస్తే పావురాలు ముక్కుతో కాలి గోళ్ళతో గెంతడము వల్ల ప్లాస్టిక్ రేకు చిల్లులు పడుతుంది అంటూ ఇంటావిడ భయం వ్యక్తం చేసింది. ఎవరి భయం వారిది.

ఉద్యోగం ధర్మమా అని అద్దె ఇల్లు జీవితాలు. పల్లెలో సొంత ఇల్లు తాళం వేసి వచ్చారు. అవి అద్దెకు ఇచ్చేలా ఉండవు. అన్ని పెద్ద గదులు. ఇక్కడ చిన్న గదులు. అక్కడ ఒక్క గది అంత ఇల్లు ఈ అద్దె ఇల్లు. ఆ ఇల్లు పట్నంలో ఉంటే ఎంతో అద్దె మిగిలేది, కానీ తప్పదు. ఈ ఇరుకు ఇల్లు జీవితాలు ఇరుకు మనో భావాలు కూడా.

శ్రీనివాస్ రిటైర్ అయ్యాక ఈ ఇల్లు కొన్నాడు. అది పెద్ద బహుళ అంతస్తుల భవనంలో ఉంటున్నారు. కొత్త ఇంట్లో కూడా పక్షులు, జంతువులను పెంచుకోడం కుదరలేదు. అందుకే పక్షుల కోసం ఒక పాత్ర, అందులో నీరు పోసి పెట్టి వేరే పళ్ళెంలో గింజలు, ఇతర ఆహార పదార్థాలు వేసి ఉంచుతుంది. మూడు పూటలా పరిశీలన. ‘ఇదే నా జంతు పక్షి సేవ. ఇంతకన్నా ఓపిక లేదు’ అనుకుంటుంది శ్రావణి.

మనుష్యుల అవాసాలే కష్టం అయిన రోజులివి. అయినా సరే టెర్రస్ పై పావురాల పక్షుల పెంపకం కోసం ఒక గదుల పెట్టె పెట్టారు.

పుట్టుట గిట్టుట నిజము నట్ట నడుమ పని నాటకము అని మనకి శ్రీ అన్నమయ్య రచనలు శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనల్లో ఎన్నియో జీవిత సత్యాలు ఉన్నాయి. వాటి అర్థమే జీవితము.

పెళ్లి, పిల్లలు, చదువులు, ఉద్యోగాలు, వారి పెళ్ళిళ్ళు, పెద్దల సేవ – అలా జీవిత చక్రంలో- సంప్రదాయ కుటుంబ స్త్రీలు ఒదిగి పోయి జీవితంలో అన్ని వదులుకుని గడుపుతారు. కొన్ని ఆలోచనలు, ఆశయాలు కలలు గానే మిగులుతాయి. నేడు సీడీలలో అన్ని చూస్తూ పిల్లలు మాటల్లోనే అన్ని విషయాలు, విశేషాలు తెలుసుకుంటూ జీవితంలో ఆనందం పొండమే జీవిత సత్యం అనీ, అందులోనే ఆనందం పొందితేనే జీవితం గడుస్తుందనీ, ఆ సంతృప్తి భారతీయ స్త్రీలకి మన పురాణాల నుంచి సంస్కృతి సంప్రదాయాల విలువలు నుంచి వస్తున్నాయి.

శ్రావణి ఎప్పటి లాగానే కూతురుకి కావాల్సిన వస్తువులు తిండి పదార్థాలు అన్ని పంపుతూ కొరియర్ బిల్లు పెంచుతోంది. కూతురు మాత్రం టికెట్ పంపుతాను రండి అంటుంది. నువ్వే రా అంటారు తల్లి తండ్రి.

ఇది ప్రతి ఇంట్లో నేడు మామూలే అంటుంది డాక్టర్ శ్రావణి శ్రీనివాస్. మీరేమంటారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here