డాక్టరత్తయ్య

0
2

[ఆడపిల్లలకి ఎదురయ్యే రక్తహీనత సమస్య గురించి ‘డాక్టరత్తయ్య’ అనే రచన ద్వారా వివరిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

[dropcap]ఉ[/dropcap]దయం 9 గంటలు కావస్తూ ఉన్నది. అదొక స్కూలు. పిల్లలందరూ అప్పుడే లోపలకు వస్తూ ఉన్నారు. బ్యాగుల మోతలతో, జారుతున్న కళ్ళ జోళ్ళను సరి చేసుకుంటూ హడావిడిగా వస్తున్నారు.  ప్రేయర్ టైముకు పిల్లలంతా హాజరు కావాలి. తర్వాత వచ్చిన వాళ్ళకి స్కేలుతో రెండు దెబ్బలు కొట్టాకనే లోపలికి పంపుతారు.

ప్రేయర్ బెల్ మోగింది. పిల్లలందరూ లైన్లలో నిలబడుతున్నారు. టీచర్లు కూడా వాళ్ళను సరిగా నిలబెట్టటంలో బిజీగా ఉన్నారు. క్లాసుల వారీగా చక్కగా నిలబడ్డాురు. అది గర్ల్స్ హైస్కూలు కావటంతో అందరూ ఆడపిల్లలే ఉన్నారు. ప్రేయర్ మొదలైంది. ప్రేయర్ చివరి దశలో తొమ్మిదో తరగతి లోని అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది.

“రమ్యా ఏమైంది?” అంటూ పక్కనున్న పిల్లలు పిలిచారు. టీచర్లు వచ్చి ముఖాన కొద్దిగా నీళ్ళు చల్లి రేపారు. స్టాఫ్ రూంలో పడుకోబెట్టి ప్యాన్ వేశారు. కొద్ది సేపటికి కళ్ళు తెరిచింది. ‘ఎలా ఉందని’ టీచర్లు అడిగి రమ్య తల్లిదండ్రులకి ఫోన్ చేశారు. కాసేపటికి రమ్య నాన్న వచ్చి రమ్యను ఇంటికి తీసుకెళ్ళాడు.

“నేను టిఫిన్ చేసిచ్చినా తినకుండా వెళ్ళావు. అందుకే కళ్ళు తిరిగి ఉంటాయి. ఇప్పుడైనా తిని పడుకో” రమ్య తల్లి చెప్పింది.

“నాకు తినాలనే లేదమ్మా” అంటూ నీరసంగా కళ్ళు మూసుకుని పడుకుంది రమ్య.

“ఇలా తినకుండా పడుకుంటే నీరసం రాక ఏం చేస్తుంది అయినా రేపు డాక్టరత్తయ్య వస్తున్నది కదా! నీ గురించి తనకే చెపుతాను” అన్నది రమ్య తల్లి కొద్దిగా బెదిరింపుగా!

రమ్య పడుకున్నదళ్లా లేచి కూర్చుని “అమ్మా నిజంగా అత్తయ్య వస్తున్నదా! బాగా కబుర్లు చెప్పుకోవచ్చు”  అంటూ ఆనందపడింది.

“ఊ ఊ అత్తా కోడళ్ళు ఇద్దరూ ఒకటే కదా!” అని నవ్వుతూ రమ్య తల్లి వంటింట్లోకి వెళ్ళిపోయింది.

డాక్టరత్తయ్య వస్తూనే రమ్యకు తను తెచ్చిన గిఫ్టులన్నీ ఇచ్చింది. రమ్యను ముద్దాడుతూ ముఖాన్నీ తేరిపార చూసింది. “ఏమిటి పిల్ల ఇలా పాలిపోయింది వనజా! సరిగ్గా తిండి పెట్టటం లేదా” అంటూ మరదలితో అన్నది.

“నేనూ ఈ విషయమే మాట్లాడదాం అనుకుంటున్నాను వదినా! రమ్య నిన్న స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోయింది. వాళ్ళ నాన్న వెళ్ళి ఇంటికి తీసుకొచ్చేశాడు. ఏమిటో కాస్త చూడు” అన్నది రమ్మ తల్లి వనజ.

అప్పటికే డాక్టరత్తయ్య రమ్యను నాలుక చూపించమని అడుగుతోంది. కళ్ళు ఎలా ఉన్నాయో చూసింది. కళ్ళ కింద నల్లని మచ్చల్లా కనిపిస్తున్నాయి. మొహంలో కళా, కాంతీ కనిపించడం లేదు. డాక్టరు అత్తయ్యకు దాదాపుగా అర్థమై పోయింది.

“సాయంత్రం అలా బజారుకు వెళ్దాం” అని రమ్యతో అన్నది. రమ్య సంతోషంగా తల ఊపింది. సరదాగా అత్తయ్యతో కబుర్లు చెప్తూనే ఉన్నది. వనజ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆడబిడ్డ కోసం రకరకాల వంటలు చెయ్యడంలో మునిగి పోయింది.

రమ్యను డయాగ్నస్టిక్ ల్యాబ్ వద్దరు తీసుకెళ్ళి రక్తపరీక్ష చేయమని చెప్పింది డాక్టరత్తయ్య. సూది గుచ్చి రక్తం తీసుకుంటారనగానే రమ్య భయపడింది. డాక్టరత్తయ్య ధైర్యం చెప్పింది. రక్త పరీక్ష కోసం రక్తాన్ని తీసుకున్నారు. రమ్యకు ఐస్ క్రిములు, చాక్లెట్లు కొనిచ్చింది డాక్టరత్తయ్య. బజారు నుంచి ఇంటికి తిరిగి వెళ్ళేటపుడు ల్యాబ్ దగ్గర రిపోర్టులు తీసుకున్నారు. డాక్టరత్తయ్య ఊహించిన విధంగానే రిపోర్టులో ఫలితాలున్నాయి.

ఇంటికి వెళ్ళాక రమ్య తల్లిదండ్రులను ఒకచోట కూర్చోబెట్టి విషయం చెప్పసాగింది. “రమ్యకు రక్తం చాలా తక్కుగా ఉన్నది. అందుకే స్కూలులో కళ్ళు తిరిగి పడిపోయింది. రమ్యకు రక్తహీనత ఉండవచ్చని అనుమానించాను ఎందుకంటే భారతదేశంలో బాలికలు, గర్భిణీ స్త్రీలకు సరైన పౌష్టికాహారం లేక రక్తహీనత వస్తుంది. యుక్త వయసు బాలికలకు నెలసరి వలన కూడా రక్తహీనత వస్తుంది. దీని వలన చాలా సమస్యలు వస్తాయి.”

డాక్టరత్తయ్య చెప్తూ ఉండగానే రమ్య తల్లి వనజ ఆదుర్దాగా అడిగింది – “ఎలాంటి సమస్యలు వస్తాయి? రమ్య కొద్దిగా పని చేయగానే అలసిపోతుంది. ఈ కాలపు పిల్లలు ఇలాగే ఉన్నారులే! అనుకున్నాను. నీళ్ళ బకెట్‌ను రూమ్ లోనుంచి అవతలి రూమ్‌లో పెట్టమన్నా పెట్టులేనంటుంది. దీనికి బద్ధకం ఎక్కువ అనుకున్నాను. కానీ రక్తం తక్కువై నీరసంతో అంటున్నదని అనుకోలేదు” అంటుండగానే వనజ గొంతు పూడుకుపోయింది. మాటలు రాలేదు.

పర్వాలేదన్నట్లుగా వనజ భుజం తట్టాడు భర్త రాజారావు. “అక్కా! ఏం చేయాలి. మందులు రాసిస్తావా రోజూ వేస్తాం” అంటూ అక్కతో అన్నాడు.

డాక్టరత్తయ్య “ఏం భయం లేదురా! కానీ సమస్య ఇంకా పెద్దదైతే చాలా అనారోగ్యం కలుగుతుంది. నెలసరిలో ఇబ్బందులు వస్తాయి పెళ్ళయ్యాక కాన్పుల సమయంలో రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి రావచ్చు. పిల్లలకు పాలిచ్చే శక్తి ఉండదు. పిల్లల్ని పెంచే ఓపిక ఉండదు. అన్నిటికీ నీరసంగా పడిపోతూ ఉంటారు. ఇలాంటి సమస్యల్ని దూరం చేయాలంటే మంచి పౌష్టికాహారం తినాలి. రోజూ పాలు ఒక గ్లాసుడైనా తాగించాలి. పండ్లు ఫలాలు బాగా పెట్టాలి” అంది.

“ఏం పెట్టినా వద్దంటుంది. పండ్లయితే అసలు తినదు. ఐస్‌క్రీములు మాత్రం బాగా తింటుంది” అంటూ వనజ కూతురిపై పిర్యాదు చేసింది.

“వనజా! పిల్లలు అలాగే ఉంటారు. మనమే ఎలాగోలా బుజ్జగించి మాయచేసి తినిపించాలి. వాళ్ళకు ఆకర్షణీయంగా ఉండేలా పండ్లను ఫ్రూట్ సలాడ్లు గానో మరో విధంగానో తయారుచేసి పెట్టాలి. పాలను కూడా మిల్క్ షేక్‌లుగా, బాదం పాలుగా మార్చి తాగించాలి. అలాగే పల్లీలు బెల్లం కలిపి పాకం పట్టి ముద్దలు చేసి అప్పుడొకటి అప్పుడొకటి ఇస్తూ ఉండాలి” డాక్టరత్తయ్య చెప్తూ ఉండగా రాజారావు మధ్యలో మాట్లాడాడు.

“ఎంత రక్తం ఉండాలి అక్కా? ఇప్పుడు ఎంత ఉన్నది రమ్యకు?” అన్నాడు.

“ఇప్పుడు రమ్యకు 9% రక్తం మాత్రమే ఉన్నది. మాములుగా 12% హీమోగ్లోబిన్ ఆడపిల్లలకు ఉండాలి. అలాగే మగపిల్లలకయితే 14% హీమోగ్లోబీన్ ఉండాలి. అబ్బాయిలకు కూడా రక్తహీనత వస్తుంది కానీ ఆడపిల్లలతో పోలిస్తే, చాలా తక్కవ మందికి రక్తహీనత వస్తుంది. దీని కారణం ఆడపిల్లల్లో నెలసరి రావడం వల్ల జరుగుతుంది. తర్వాత కూడా గర్భిణిలుగా మారడం, ప్రసవాలు జరగడం, పిల్లలకు పాలిచ్చి పెంచడం వంటి ఎన్నో ఇబ్బందుల వలన ఆడపిల్లల్లో రక్తహీనత ఎక్కువగా వస్తుంది”.

డాక్టరత్తయ్య మాటలకు అడ్డు తగులుతూ రాజారావు అన్నాడు “అసలు ఈ జబ్బు వచ్చిందని ఎలా గుర్తుంచాలి? ఏఏ లక్షణాల కారణంగా అనుమానించవచ్చు అక్కా.”

“ఆయాసంగా ఉంటుంది. ఆకలి మందగిస్తుంది. ఏ పనీ చెయ్యలేక పోతారు, జుట్టు రాలి పోవడం, అలసిపోవడం, ఎప్పుడూ నిద్రపోతూ ఉండడం, మానసికమైన అస్థిరత రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, కొద్ది పాటి శ్రమకే ఊపిరి ఆడనట్లుగా అనిపించడం వంటి లక్షణాలన్నీ ఉంటాయి. స్కూళ్ళలో అప్పుడప్పుడూ క్యాంపులు పెట్టి రక్తహీనతను గుర్తించే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు” అన్నది డాక్టరత్తయ్య.

“చాలా విషయాలు చెప్పావు వదినా! ఇప్పుడు రమ్యకు తగ్గాలంటే ఏం చేయాలి” భయంగా తిరిగింది వనజ.

“నేను మందులు రాసిస్తాను. అలాగే కడుపులో పురుగులు పోవటానిక్కూడా మందులు ఇస్తాను. పరిశుభ్రంగా ఉండటం, తినే ముందు చేతులు బాగా కడుక్కోవడం వలన మరల పురుగులు చేరకుండా ఉంటాయి. వీటన్నిటితో పాటు మంచి ఆహారం పెట్టాలి” చెప్పింది డాక్టరత్తయ్య.

“ఇవేమి మాకు తెలియవు వదినా! ఇక నుంచీ జాగ్రత్తగా ఉంటాం” అని వనజ అనగానే “అవునవును చాలా విషయాలు అర్థమయేలా చెప్పావు” అన్నాడు రాజారావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here